ప్రేమలు - పెళ్ళిళ్ళు - మణి

Premalu-Pellillu

వినోద్ , డ్రై వ్ చేస్తున్నాడు. మేనకోడలు శాంతి, ఎంత సేపటికీ ఏమీ మాట్లాడకపోవడం తో. " ఊ ! చెప్పు . ఎక్కడకి వెళ్ళాలి ? షాపింగ్ అంటూ, తీసుకు వచ్చావు , కానీ, ఎక్కడకి వెళ్ళాలి ?... ఏమీ చెప్పకుండా, నీ అంతట, నువ్వు, మౌనం గా వుంటే , నాకు ఏం తెలుస్తుంది ? "

" నాకు, బుర్ర అసలు , పని చేయటం లేదు మావయ్యా ! కాస్త , బయటకి వస్తే అయినా , కాస్త, మెరుగవుతుందేమో అని .."

"వారం రోజుల్లో పెళ్ళి పెట్టుకుని , నువ్వు అనాల్సిన మాటలేనా ఇవి ?.."

" నా మాటలు , ఎవరు పట్టినుకుంటున్నారు ,కనుక ??...... ."

" అదేమిటే ,అలాగ అంటావ్ ? ..."

" నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పాను .అయినా సరే , చెసుకోకపోతే, మేము చచ్చిపోతాం , అంటూ బెదిరిస్తే , నేనేం చేయ్యాలి చెప్పు ? "నాకు కుమార్ అంటే ఇష్టం. అతనినే చేసుకుంటాను ! " అని చెప్పాను . అమ్మ, నాన్న " మాకు ఇష్టం లేదు" అన్నారు . " నేను పెళ్ళి చేసుకోను " అన్నాను. నన్ను వదిలేయొచ్చు గా ! ....ఇలా , ఇష్టం లేని పెళ్ళి , ఎందుకు చేయాలను కోవడం ? .. ఈ బాధ , తప్పించుకోవడానికే , నేను మూడు సంవత్శరాల నుంచి, అమెరికా లో , వుంటున్నా . చూసి వెళ్దామని , పది రోజులకి వచ్చాను. అంతే దొరికి పోయాను. అసలు , ఇష్టం లేని పెళ్ళి , చేయాలను కోవడం ఏమిటి మావయ్యా ? నేను ఏమయినా చిన్న పిల్లనా ? .."

వినోద్ అడగడమే, తడవుగా , శాంతి మనసు లో వున్నదంతా గబ గబా చెప్పేసింది.

" ఊ ! ... " అంటూ తల పంకించాడు వినోద్. వినోద్ కి , శాంతి ప్రేమ వ్య వహారం తెలుసు . అక్క , బావ మూర్ఖత్వమూ తెలుసు. ఏదయినా చెప్పబోతే , " చాల్లే చెప్పొచ్చావు ! నీకూ , ఇటువంటి పరిస్థితి వస్తే, నీకు తెలుస్తుంది. ..నీ పిల్లలకి చేసుకుందువు లే , అటువంటి కులం తక్కువ పెళ్ళీళ్ళు !!! " అంటుంది అక్క .

అలా అక్క అన్నప్పుడల్లా ,

" నా పిల్లలు ఈ విధం గా ప్రేమిస్తున్నామని, చెప్పితే , వారి , మంచి చెడులు విచారించి పెళ్ళి చేస్తాను . ఈ విధం గా పిల్లలని, బాధ పెట్టను." అంటూ , తనూ అంటాడు .

అయినా వినాలనుకున్నవాళ్ళకి , చెప్పొచ్చు, కానీ , విన వద్దు , అనుకునే వాళ్ళకి , ఎవరు ఏం చెప్పినా లాభం ఏముంటుంది? అదే జరుగుతోంది , అక్క బావ విషయం లో . తనకి ముందుగా, ఒక్క మాట చెప్పకుండా , పెళ్ళి ఏర్పాటులు , చెస్తుంటే నే , అనుకున్నాడు , ఇలాంటిది , ఏదో వుంటుంది అని . ఆలోచిస్తూ, చిన్న గా నిట్టూర్చి అన్నాడు,

"అవుతే, ఈ పెళ్ళి ఏర్పాటులు , నీకు , ఇష్టం లేకుండా, చేస్తున్నారా ? .. "

" అసలు నేను అబ్బాయిని కూడా , చూడలేదు. ఒక ఫొటొ, నా మొహం మీద పడేసి, ' అతనే, నీకు కాబోయే మొగుడు ! ' అన్నారు . నేను , ' ఒక వ్యక్తి ని, ప్రేమించాను ' , అని చెప్పగానే, నేను వాళ్ళకి, శత్రువు అయి పోయాను. పోనీ , నా మానాన, నన్ను వదిలేయొచ్చు కదా! అదీ చెయ్యరు !!"

" అక్క , బావ , అదే , నీ , అమ్మా నాన్న , నాకు , ఇవేవీ చెప్ప లేదు . .అమ్మమ్మకి, తాతయ్యకి , కూడా తెలియదు లా వుంది "

" తెలిస్తే , వాళ్ళు ఏం చేస్తారు. వాళ్ళ , కూతురు అల్లుడు , సరి అయిన పనే , చేస్తున్నారు, అనుకుంటారు. "

" నువ్వూ , ఇష్టం లేదని గట్టిగా చెప్పాలి !..."

" అమ్మ , ఒకటే, ఏడుపులు మొత్తుకోవడాలు . నేను , మీనాన్న , చచ్చి పోతామంటూ , చాకు తీసుకుని భయపెట్టడం ... నా, పాస్పోర్ట్ బేగ్ , కూడా , రాగానే , ' నేను జాగ్రత్త పెడతాను ' అంటె నిజమే అనుకున్నా ! కానీ, దాని వెనుక , ఇంత ప్లాన్ వుందని, తెలియదు . వెళ్ళిపోదామంటే, నా పాస్పోర్ట్ కూడా, ఇప్పుడు నా దగ్గర లేదు .... నాకు, అసలు ఏమీ పాలు పోవటం , లేదు. "

" నేను మాట్లాడు తాను, కంగారు పడకు ! " డ్రైవ్ చేస్తూ , శాంతి కేసి, ఒకసారి చూసి , అన్నాడు.

" వాళ్ళు నీ మాట కూడా వింటారు అని అనుకోను మావయ్యా! .. అందుకే....కష్టమైనా పెళ్ళి చేసుకుంటాను .పెళ్ళి అయిన వెంటనే, నా తిరుగుప్రయాణం . పెళ్ళి అవుతే , నన్ను ఏమీ ఆపరు . అక్కడకి వెళ్ళాక, నేను , అతనికి డైవర్స్ ఇచ్చేస్తాను. "

వినోద్ కాలు , అనుకోకుండానే బ్రేక్ మీద పడి , కార్ , ఒక్క క్షణం ఆగింది. " ఏమంటున్నావే ? నీకు స్పృహ వుండే మాట్లాడుతున్నావా " అన్నాడు ఆశ్చర్యం గా .

ఇంతలో , వెనక నుంచి హారన్స్ ! వినోద్ , బ్రేక్ మీద కాలు తీసి, నెమ్మదిగా కారు ముందుకు, పోనిచ్చాడు.

" పెళ్ళి అంటే అంత తెలికగా మాట్లాడుతావు ఏమిటే ?.."

" ఇష్టం లేని పెళ్ళి మీద , ఏమి. గౌరవం వుంటుంది మావయ్యా? .."

"పెళ్ళి అంటే , ఇద్దరు , వ్యక్తులేకాదు , రెండు కుటుంబాల మధ్య బంధం . నువ్వు అనుకునే విధం గా , రేపు నువ్వు డైవర్స్ ఇస్తే , ఆ అబ్బాయి, అతని తల్లి తండ్రులు ఎంత బాధ పడతారో తెలుసా ? అందరూ నిన్ను ఎంత తిట్టుకుంటారు ? అదంతా అవసరమా? అదేదో, గట్టిగా , నీకు ఇష్టం లేదని , చెప్తే పోతుందిగా ."

అతని మాటలు వింటూ ,

" మావయ్యా ! అదిగో అక్కడ ! ....కాఫీ షాప్ ! . అక్కడ ఆపు ! ఆపు !...కాస్త కాఫీ తాగుదాం! .." శాంతీ మాటలకి , కారు , కాఫీ షాప్ దగ్గర ఆపి , పార్క్ చేసాడు.

ఇద్దరూ లోపలకి వెళ్లీ , కాఫీ ఆర్డర్ ఇచ్చారు.

" శాంతీ నీ ఆలోచన , నాకు అస్సలు నచ్చలేదు. పెళ్ళి ఇష్టం లేదని ధైర్యం గా చెప్పాలి .. మనం ఇంట్లో వున్నప్పుడు , ఈ మాట చెపితే, నేను మాట్లాడేవాడిని కదా "

" హ ! హ ! హ ! నువ్వు చెపితే ఎంత వినేస్తారో నాకు తెలుసు ..."

" ఒక పని చెయ్యి . బయటకి వెళ్ళి కుమార్ ని ఏదో గుడి లో పెళ్ళి చేసుకో . నేను దగ్గరుంటాను ." .

" అమ్మ నాన్న , ఎలా రియక్ట్ అవుతారో , అని భయం మావయ్యా ! లేకపోతే ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకుంటాను. "

" భయపడే వాళ్ళకి, ప్రేమిస్తున్నామని చెప్పే , అర్హత లేదు , శాంతీ ! ఇంతకీ కుమార్ కి ఈ విషయం చెప్పావా ? ..."

" చెప్పాను . ఇద్దరికీ ఏమీ చేయాలో తెలియటం లేదు. అందుకే చాల స్ట్రెస్ గా వుంది . "

" ఏమిటి , నీ ప్లాన్ కూడా చెప్పావా ?.." ఆశ్చర్యం గా అడిగాడు.

" ఏం చెప్తాను ? ఇంకా అయిదు రోజులుందిగా. ఏదో ఒక దారి దొరక్క బోదు. పరిస్థితి బట్టీ , అప్పుడే చెప్తాను. "

ఇద్దరూ, కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు.

కాఫీ తాగుతున్న శాంతి వున్నట్లుండి , " మావయ్యా ! చూడు అటు . అక్కడ అతను !....అతను , ప్రదీప్ ! అదే అమ్మా నాన్న నాకు, పెళ్ళికి, కుదిర్చిన అబ్బాయి!...చూడు !...చూడు !... , అతని పక్కన ఒక అమ్మాయి ! . ". అంటూ గుసగుసలాడింది. .

వినోద్ , శాంతి చూపించిన వైపు, చూసాడు. అతను, శాంతి, పెళ్ళి చేసు కో బోయే అబ్బాయి ! ..శాంతి తల్లి తండ్రులు , కుదిర్చిన పెళ్ళి సంబంధం ! ... వినోద్ ఫొటొ, మాత్రమే చూసాడు. అయినా, అతను , ఫొటో లో వున్నట్లే , వుండడం తో, గుర్తు పట్టడం, తేలిక , అయింది.

" ప్రదీప్ !.... కదా ! ... అతనే కదా ! పక్కన అమ్మాయి ! ఎవరో ??? ". వారినే చూస్తూ , అన్నాడు వినోద్.

ఆశక్తి గా చూస్తోంది శాంతి .

అతను ఆ అమ్మాయి చేయి తీసుకుని ముద్దు పెట్టు కోవడం చూసారు ఇద్దరూ .

" కొంపదీసి , ఆమె , అతని గర్ల్ ఫ్రెండ్ , కాదు కదా ! " అన్నాడు వినోద్ , ఆశ్చర్య పోతూ .

" ఏమో !....". అంటూన్న , శాంతి , మొహం మీద , దాచినా దాగని , చిన్న నవ్వు . ఆమెకి, ఆ దృశ్యం , చాలా వినోద భరితం గా , వుంది . అంతవరకూ , ఆమె మొహాన్ని , అలుముకున్న , దిగులు , చిరాకు , మాయ మయ్యాయి.

" రా !... అడుగుదాం ..! " అన్నాడు వినోద్

" ఏం, బాగుంటుంది ? వద్దు !! " వారికేసే , వినోదం గా చూస్తూ, అంది .

" ఇది , నీ జీవితానికి , సంబంధించినది ! వద్దంటావేమిటి? ... రా! ...." అంటూ , వాళ్ళ దగ్గరకి నడిచాడు , వినోద్ . వినోద్ ని , వెంబడించక, తప్పింది కాదు , శాంతికి . వినోద్, శాంతి , ప్రదీప్ కూర్చున్న , టేబుల్ దగ్గరకి , వెళ్ళగానే , శాంతి ని చూసి , గుర్తు పట్టాడులా వుంది .

అతని మొహం లో , రంగులు మారడం చూస్తూ , " మీరు ప్రదీప్ కదా ! నాపేరు వినోద్ . నేను శాంతి కి మేన మావ ని. ఈ అమ్మాయి ?..." అంటూ, ప్రశ్నార్ధకంగా చూస్తున్న, వినోద్ , శాంతిలకి , ఆమెని పరిచయం చేసాడు " ఈమె , రాణి " అంటూ . ప్రదీప్ ఆశ్చర్యం గా చూస్తున్నాడు,

" కూర్చో ! .." అంటూ శాంతికి , ఒక కుర్చీ చూపించి , తనూ ఒక కుర్చీలో కూర్చున్నాడు వినోద్ .

" హలో ! .." అంటూ రాణి ని పలకరించి

" నా పేరు వినోద్ . ఈమె శాంతి , నా మేనకోడలు. ప్రదీప్ కి కాబోయే భార్య ! ..." అంటూ తనని శాంతిని పరిచయం చేసుకున్నాడు.

రాణి , ఆశ్చర్యం గా వారి కేసి , ప్రదీప్ కేసి ఒకసారి చూసింది.

" ఏమిటి ప్రదీప్ ! ... మీ పెళ్ళి విషయం , మీ ఫ్రెండ్ కి, ఏమీ చెప్పినట్లు లేదు ? ఆమె కి , ... ఆశ్చర్యం గా వున్నట్లుంది . "

" ............"

ప్రదీప్, ఏమీ మాట్లాడక పోవడం , చూసి , శాంతి ని, చూపిస్తూ , " వీళ్ళిద్దరికీ , అదే ప్రదీప్ కి శాంతికి , వచ్చే వారం లో పెళ్ళి , మీకు తెలిసినట్లు లేదు ?! .." అన్నాడు , వినోద్ , రాణి తో .

రాణి , ప్రదీప్ కేసి , ప్రశ్నార్ధకం గా , చూసింది. అనుకోని , ఈ పరిణామానికి , అవాక్కయిన ప్రదీప్ , నెమ్మదిగా తనని తను తమాయించుకుంటూ , ఏదో చెప్పడానికి , తల ఎత్తాడు.

ఈలోపు, వినోద్ అన్నాడు " కొంపదీసి, ఈమె నీ గర్ల్ ఫ్రెండ్ కాదు కదా ! అదే మీ మధ్య ప్రేమ అదీ ... అలాంటిది ఏదయినా వుంటే ..."

రాణి, ప్రదీప్ నే చూస్తోంది. ప్రదీప్ , ఏమి మాట్లాడక పోవడం తో రాణి అంది " నీకు పెళ్ళా?? ..."

ప్రదీప్ , అయోమయం గా చూస్తున్నాడు, వినోద్ ని , శాంతి ని .

" ఏం, ప్రదీప్ మాట్లాడవేం ?? .." అంది, కోపంగా .. ఆమె , మొహం లో బాధ , కోపం ..

" రాణీ. . నేను చెప్దామనే ..." ప్రదీప్ ని , మాట్లాడనివ్వలేదు , రాణి. ఆవేశం గా అంది.

" ఏమిటి చెప్పేది ? నిన్ను ప్రేమించాను ! .... ఇంకొకరిని పెళ్ళి చేసు కుంటున్నాను !... . అయినా పర్వాలేదు !! నిన్ను కూడా వుంచుకుంటాను ! ..... లేకపోతే , ఆమె ని వదిలేసి. నిన్ను , పెళ్ళి చేసుకుంటాను ! ... ఇవేగా ! నువ్వు చెప్పాలనుకున్నది ? ... ఇంత కన్న ఏముంటాయి ? ... ఇన్నిసంవత్శరాల మన ప్రేమకి, అర్ధం లేకుండా చేసావుగా " రాణి కళ్ళల్లో కోపం , బాధ.. కళ్ళు , ఎరుపెక్కి , నీళ్ళు నిండాయి

" నేను చెప్పేది విను , రాణీ.." అంటూ, ప్రాధేయ పూర్వకం గా , చూసాడు ప్రదీప్ , ఆమెకేసి.

" ఇంకా ఏమి వినాలి .....సిగ్గు లేదూ ? ఒక మూల పెళ్ళి కుదుర్చుకుని , నాతో ఏం మాట్లాడుతావు ? నేను ఏం వినాలి ? "

అంటూ , కోపంగా , లేచింది రాణి.

ఆమె , చెయ్యి పట్టుకున్నాడు , ప్రదీప్ . అతని చెయ్యి. వదిలించుకుంటూన్న రాణి తో. , " అమ్మా! కూర్చో!! ఒక్క క్షణం ! ..." అన్నాడు వినోద్ చాలా గంభీరంగా .

అతని గొంతులో, గంభీరత్వానికి , తెలియకుండానే , కూర్చుంది. ఆమె కళ్ళనుంచి, నీళ్ళు , చెంపల మీదకి , వస్తుంటే రుమాలు తో, తుడుచుకుంది.

ప్రదీప్. " రాణీ! , ప్లీజ్ ఏడవకు ! ఇప్పుడు ఏమయింది ? "

" ఏమిటి, ప్రదీప్ ! ప్రేమా ??? " వినోద్ అడిగాడు .

".....,"

" ఏమిటి, మాట్లాడవ్ ? "

" ఊ !.... మేము ప్రేమించుకున్నాం .." అన్నాడు వినోద్ కేసి ఒక సారి చూసి , రాణి కేసి తిరిగి అన్నాడు.

" మరి పెళ్ళి కి , అంటే, శాంతి తో , పెళ్ళికి , ఎలా సిద్ధమయ్యావు ? "

" శాంతితో , నాకు పెళ్ళి అని , నాకు , ఇక్కడకి వచ్చేవరకూ తెలియదు . నేను వచ్చి రెండు రోజులయింది .."

" తెలిసాక , మరి నీకు ఇష్టం లేదని చెప్పలేదా ?...

" చెప్పాను, కానీ ఏం ఉపయోగం లేదు . వాళ్ళు చెప్పేదే వాళ్ళు చెపుతారు ! నేను చెప్పేది వినరు ! ....."

' పెద్దవాళ్ళు , అంతా ఒకలాగే వున్నారు ' అనుకుంటూ సందీప్ చిన్నగా నిట్టూరుస్తూ అన్నాడు,

" మరి రాణి సంగతి ?? .....రాణి చెప్పినట్లు, ...శాంతి ని , పెళ్ళి చేసుకుని, రాణి ని వుంచుకుంటావా ? ....ఈ గొడవ తప్పించుకోవడానికి , పెళ్ళి చేసుకుని, శాంతికి డైవర్స్ ఇస్తావా ? " అంటూ , 'శాంతి లాగ , అని మనసులో అనుకున్నాడు.

ప్రదీప్ , వినోద్ కేసి కోపం గా , చూసాడు

" ఏం లేదు !... .. మనం ఇవేగా ...రోజూ వార్తల్లో చూసేది ?! అందుకే అడిగా ! ..... ప్రేమించడం చాలా తేలిక ....మరి తర్వాతే , కష్టం ! . పెద్ద వాళ్ళని ఒప్పించడం , ఒప్పుకునేవరకూ ధైర్యం గా నిలబడడం ..."

రాణి కళ్ళనుంచి , నీళ్ళు ధారలా, కారుతూనె వున్నాయి. ఆమె తుడుచుకుంటూనే , వుంది , తల వంచుకుని.

" రాణీ ! నువ్వు ఏడవకు ." అంటూ ఆమె చెయి తన చేతి లోకి తీసుకున్నాడు.

" మీరిద్దరూ, నిజం గానే , ఒకరినినొకరు ప్రేమిస్తే , మీ ఇంటికి, నేను వచ్చి , నచ్చ చెపతాను . ...."

" వాళ్ళు వినరు . ఈ వ్యవహారం , ఆరు ఏళ్ళనుంచి , నడుస్తూనే వుంది. నేను ఎన్నో విధాలుగ చెప్పాను! అయినా , ఒప్పుకోలేదు. అందుకే, ఈ రోజు, రాణి , ఒప్పుకుంటే గుడిలో, పెళ్ళి చెసుకుందామనే అనుకున్నాను. .." ఇవిగో , మంగళ సూత్రాలు ! " అంటూ , జేబు లోంచి , మంగళ సూత్రాలు తీసి చూపించాడు. .."

అందరూ , విస్తు పోతూ, అతనికేసి , చూసారు.

" రాణీ , అతనికేసి, చూసి " నిజమా ? .." అంది.

" నిజం , రాణీ! ..... నాకు , శాంతి ని ....ఈ అమ్మాయిని , ఈ పెళ్ళి , చేసుకునే ఆలోచన, అసలు లేదు. నువ్వు ఒప్పుకుంటే , ఈ రోజే మనం పెళ్ళి చేసుకుందాం . ఈ విషయం చెప్దామనే , నిన్ను , ఇక్కడకి పిలిచా . ఇంట్లో గొడవలతో , నీకు ముందే , చెప్పేటంత సావకాశం కూడా , లేకపోయింది. ..ఈ లోపే వీళ్ళు రావడం ....... ఇదంతా జరిగింది..... " అంటూ , వినోద్ కేసి , శాంతి కేసి , కాస్త అసహనం గా చూసాడు, ప్రదీప్ .

" మనం పెళ్ళి చేసుకుందాం ! ...ఈ రోజవుతే , ...నీకు అభ్యంతరం లేదుగా ?...." అన్నాడు ప్రదీప్ .ఆమె చేతిని తన చేతి లోకి , తీసుకుని .

" ఊహూ ! ..." అంటూ తల ఊపింది రాణి , మొహం తుడుచు కుంటూ

" మరి రాణి తల్లి తండ్రులు ??..." అడిగాడు వినోద్ .

"వాళ్ళకీ ఇష్టం లేదు . .. వాళ్ళూ , ఎంత చెప్పినా ఒప్పుకోవటం లేదు , ఎంత , తల్లి తండ్రులు అయినా, నాకు కూడా తెలియ కుండా , పెళ్ళి కుదిర్చినప్పుడు , నేను మాత్రం వాళ్ళకి ఎందుకు చెప్పడం , వాళ్ళని ఎందుకు ఒప్పించాలను కోవడం .. అనిపించింది .... అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను " అన్నాడు, ప్రదీప్ .

అలసటగా , కుర్చీ లో వెనక్కి వాలాడు , వినోద్. " పిల్లలు , ఎంత పెద్దయినా , వాళ్ళకి సంబంధించిన ' పెళ్ళి లాంటి ' విషయాలలో కూడా , నిర్ణయాలు, తల్లి తండ్రులు, ఎలా తీసుకుంటారు ? పిల్లలని ,పిల్లలులా కాకుండా , వ్యక్తులుగా ఎప్పుడు గుర్తిస్తారు?? " అనుకుంటూ.

అంతలో , ప్రదీప్ స్నేహితుడు లా, వుంది , హడావిడిగా వచ్చాడు , " ఏరా ! ఇంకా ఇక్కడే వున్నారు ఏమిటి ? సందీప్, సురేష్ , గుడిలో , వున్నారు. అన్ని ఏర్పాటులు అయిపోయాయి ! " , అంటూ .

అందరినీ , ఒకసారిచూసి , " ఏమిటిరా , ఏదయినా సమస్యా ?... రాణి కేసి చూస్తూ , రాణి కి, ఒకె నా ?" అన్నాడు అతను.

"అంతా ఒకెనే రా ! ... వస్తున్నాం , రమేష్ ! .." ఆంటూ రాణి కేసి చూసి " వెళ్దామా ?.." అంటూ.

రాణి, అతని కేసి , ప్రేమగా చూస్తూ "ఊ !..." అంటూ తల ఆడించి, చిన్నగా , నవ్వింది కళ్ళు తుడుచుకుని.

ఆమె మొహం లో, నవ్వు చూసి , అంత వరకూ ఆందోళన తో , కనిపించిన ప్రదీప్ , కాస్త సేదదీరడం గమనించాడు వినోద్ .

వినోద్ , శాంతి ల కేసి చూస్తూ "మీరు కూడా రావచ్చు ....రండి .! మా పెళ్ళికి .. ." చిరునవ్వుతో అన్నాడు , ప్రదీప్ .

వినోద్ , శాంతి , మొహా మొహాలు చూసుకున్నారు . " అలాగే. !..." అంటూ వారిని వెంబడించారు. పెళ్ళి అంతా అయ్యేవరకూ వుండి, ఇంటి మొహం పట్టారు వినోద్ , శాంతి. శాంతి మొహం లో ఎంత దాచుకున్నా దాగని సంతోషం .

మనసులో నే నవ్వుకున్నాడు. " కాగల కార్యం, గంధర్వులు నెరవేరుస్తారు అంటారు ఇదే !..." అన్నాడు వినోద్, శాంతి మొహంలో, సంతోషాన్ని చూస్తూ.

*****

ఇంటికి వచ్చాక, జరిగినది అంతా, శాంతి తల్లి తండ్రులకి , చెప్పాడు వినోద్. అందరూ చాలా సేపు నిశ్శబ్దం గా వుండి పోయారు.

" పిల్లలు ప్రేమించామని , చెపితే , కొంచెం కూడా ఆలో చించ కుండా, వ్యతిరేకిస్తారు. దాని, పరిణామాలు , కాస్త కూడా ఆలోచించరు. మీరు పెట్టిన ఒత్తిడికి , పెళ్ళికీ, ఒప్పుకుంది . కానీ , పెళ్ళి అయిన తర్వాత అతనికి డైవర్స్ ఇస్తే , అతను అడ్డు తొలగించు కోడానికి, చంపేస్తే , ...?." అన్నాడు , అక్క బావల కేసి ,చూస్తూ .

" ఏం మాట లు అవి ? ....అయినా, నువ్వు , మొదటనుంచి , దాని కే , వత్తాసు పలుకుతున్నావు ?!"

" ఏం, అక్కా , అలా జరగదని ఎలా అనుకుంటావు ? రోజూ , మనం అటువంటి వార్తలు , చదువుతున్నాం . చూస్తున్నాం . అయినా , 'అది ఎందుకు జరుగు తోంది ? ' , అని ఒక్క సారి ప్రశ్నించుకోము . పెద్దవాళ్ళ మూర్ఖత్వాలకి , పిల్లలని , నేరస్తులని చేస్తున్నారు . ప్రదీప్, రాణి , తల్లి తండ్రులని , ఒప్పించలేక , బయటకి వెళ్ళి, పెళ్ళి చేసేసు కున్నారు, దానివల్ల ఇతరులకి ఇబ్బంది ఉండదు. ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకుంటేనే , అందరికీ ఇబ్బంది .....అది ఎందుకు గ్రహించరో ?

ప్రదీప్ ఒక మాట అన్నాడు " నాతో మాట కూడా , చెప్పకుండా , నా పెళ్ళి నిశ్చయించినప్పుడు , నేను మాత్రం , వాళ్ళకి తల్లి తండ్రులే అయినా , ఎందుకు చెప్పాలనుకోవడం ? ఎందుకు ఒప్పించాలను కోవడం ?? . " అని . అతనే కాదు , అతని పరిస్థితి లో. ఎవరున్నా , ఆ విధం గా నే , అనుకుంటారు . శాంతి కి కూడా , ఆ విధం గానే, అనిపిస్తుంది. ఆమె కూడా , మీకు చెప్పకుండా పెళ్ళి చేసుకుని వుండొచ్చు . కానీ , శాంతి ఆపని చెయ్య లేదు.

మళ్ళీ అన్నాడు , " శాంతి, పాస్పోర్ట్ తీసి , దాచావుట . ఇది పెద్దవాళ్ళు చెయ్యాల్సిన పనేనా , అక్కా ?? ! అయినా , నువ్వూ చదువుకున్నావుగా ? " అంటూ బావ కేసి తిరిగి ,

" ఏం బావా ! నీ మాట ఏమిటి ? నువ్వూ అక్కకి , వత్తాసు పలుకుతున్నావు ?!. అక్క అవుతే , ఇంట్లో నే ,వుంది . నువ్వు ఉద్యోగం చేసావు . పది , ఊర్లు తిరిగావు ..బయట , రక రకాల, వ్యక్తులని , చూసావు. అక్క కి , నచ్చ చెప్పడం పోయి నువ్వూ , అక్కలానే , ప్రవర్తిస్తున్నావు ?!

పూర్వం రోజుల్లో లా , ఏదో ఒక లాగా, శాంతి కి , పెళ్ళి చేసి , ఇంట్లోనుంచి , పంపేద్దామను కోవడానికి , అదేమీ, మీ తో , వుండటం లేదు .మీ మీద ఆధార పడి లేదు.

శాంతి కి కుమార్ తో , పెళ్ళి చేయడం , ఇష్టం లేకపోతే , దానిమానాన , దాన్ని , వదిలెయ్యలి కానీ , ఈ బలవంతం పెళ్ళి ళ్ళు , ఏమిటి బావా ? అయినా , ఆ అబ్బాయికి , ....అదే ప్రదీప్ కి, ...ఇప్పుడు పెళ్ళయి పోయింది . ...కాబట్టీ , ఈ పెళ్ళి జరిగే , ప్రసక్తి , ఇంక లేదు. ఇప్పుడయినా , శాంతి వున్న , నాలుగు రోజులు, ప్రశాంతం గా వుండనివ్వండి. కాస్త పెద్ద మనసు చేసుకుని , శాంతి ని , అర్ధం చేసుకోండి . మనసు మార్చుకుని, కుమార్ తో , ఆమెకి , ఇదే ముహూర్తానికి , పెళ్ళి చేయండి.

వినోద్ మాటలు వింటూ, మౌనం గా వుండిపోయారు. అక్క , బావ , ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం తో , మళ్ళి అన్నాడు.

" మీరు ఇంక మారే లా లేరు . ... కానీ శాంతికి , ఇంకా మీరేదో ఒప్పుకుంటారు , దగ్గర ఉండి , పెళ్ళి చేస్తారు , అనే ఆశ , తల్లి తండ్రులు అనే గౌరవం . అందుకే , ఆమె వూరుకుంటొంది. లేకపోతే పెళ్ళి చేసుకో లేక కాదు. ... అది, మీకు ఇచ్చే గౌరవం . మీరు ఆ గౌరవం అట్టే పెట్టుకుంటే బాగుంటుంది "

" శాంతీ , నేను వెళ్తున్నా ! ..... నువ్వేమీ వర్రీ అవకు ! నీ పెళ్ళి నేను దగ్గర ఉండి జరిపిస్తా !.. కుమార్ కి చెప్పు! ..

కుమార్ ని , పెళ్ళి చేసుకుని ఇద్దరూ కలిసే వెళ్దురు గాని " అంటూ అక్క కేసి బావ కేసి ఒకసారి చూసి ,వెళ్ళిపోయాడు.

****

మర్నాడు , పొద్దున్నే శాంతి , ఫోన్ చేసింది . " ధాంక్స్ మావయ్యా ! .. అమ్మ నాన్న , కుమార్ తో , నా పెళ్ళి కి ఒప్పుకున్నారు . కుమార్ ని, అతని తల్లి తండ్రులని , ఈ రోజు రమ్మనమని , చెప్ప మన్నారు . నువ్వు వస్తావుగా ! " అంటూ.

" ఊ ! ..మీ అత్తయ్య ని, కూడా, తీసుకు వస్తాను . కంగారు పడకు, అంతా, బాగానే జరుగుతుంది. మొత్తానికి , మీ అమ్మ నాన్న , ..వాళ్ళ పట్టు , సడలించుకున్నారు . గుడ్ . అయినా థాంక్స్, ప్రదీప్ కి చెప్పాలి . అతను , రాణి ని పెళ్ళి చేసు కోవడం వల్ల కదా , నీ పెళ్ళి కాన్సిల్ అయింది. ....... ఆ విషయం, అక్కని బావని, కాస్త ఆలోచించేలా , చేసిందేమో ! ఏది ఏమయినా , కధ, సుఖాంతమయింది " అన్నాడు వినోద్ సంతోషం గా ..

****

మరిన్ని కథలు

KARMA VADALADU
కర్మ వదలదు
- తాత మోహనకృష్ణ
mabbuteralu
మబ్బుతెరలు
- ప్రభావతి పూసపాటి
Rangulu leni lokam
రంగులు లేని లోకం
- హేమావతి బొబ్బు
Dondoo donde
దొందూదొందే
- సూర్యదేవర వేణుగోపాల్
Katha cheppavoo...
కథ చెప్పవూ...
- చిట్టత్తూరు మునిగోపాల్
paridhi
పరిధి
- ప్రభావతి పూసపాటి
AI teerpu - TV pitalatakam
Ai తీర్పు - TV పితలాటకం
- హేమావతి బొబ్బు