భాగవతకథలు-29 - కందుల నాగేశ్వరరావు

భాగవతకథలు-29

భాగవతకథలు-29

శ్రీకృష్ణ బలరాముల అవతార సమాప్తి

దుష్టజనులను శిక్షించడానికి, శిష్టజనులను రక్షించడానికి బ్రహ్మ మొదలైన దేవతలు ప్రార్థించగా శ్రీహరి భూమిపై యాదవ వంశంలో వసుదేవుని కుమారుడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణుడు పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, వత్సాసురుడు, ధేనుకాసురుడు, ప్రలంబాసురుడు మొదలైన రాక్షసులనూ; చాణూర ముష్టికులనూ; కంస, సాల్వ, పౌండ్రక, శిశుపాల, దంతవక్త్రులనూ సంహరించాడు. తరువాత కురుబలాన్ని అణచివేసి, ధర్మరాజును చక్రవర్తిగా అభిషేకించాడు.

అప్పుడు హరిభక్తులైన యాదవులు యుద్ధంలో నశింపక మిక్కిల వృద్ధిచెందుతుండడం చూసి అందరూ సంతోషం పొందారు. భూబారాన్ని తగ్గించి శ్రీకృష్ణుడు సంతోషంతో ఉండగా యదు సైన్యాలు విజృంభించి మరల భూమి మోయలేనంతగా భారం పెరిగిపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు “నా భక్తులైన యాదవులను మూడు లోకాల్లో నేను తప్ప వేరెవరూ సంహరించ లేరు. అందు వలన నేనే ఉపాయం ఆలోచించి ఈ సమస్యను పరిష్కరించాలి” అని భావించాడు.

శ్రీకృష్ణుడు యాదవులను అణచాలని ఆలోచిస్తున్న సమయంలో విశ్వామిత్రుడు, దుర్వాసుడు, భృగువు, అంగీరసుడు, కశ్యపుడు, అత్రి, వసిష్ఠుడు, నారదుడు మొదలైన మునీశ్వరులు స్వేక్షావిహారం చేస్తూ ద్వారకానగరం వచ్చారు. వారు ద్వారకలో కోటి మన్మథుల సౌందర్యంతో విలసిల్లే శరీరంకలవాడూ, ఆశ్రితజనరక్షకుడూ అయిన శ్రీకృష్ణుని దర్శించారు. అలా విచ్చేసిన మునులకు శ్రీకృష్ణుడు అర్ఘ్య పాద్యాది అన్నిరకాల మర్యాదలు చేసి బంగారు ఆసనాలపై కూర్చొండబెట్టాడు. వారు శ్రీకృష్ణుని భక్తితో పలువిధాల స్తుతించారు. శ్రీకృష్ణుడు వారి రాకకు కారణమేమిటని అడిగాడు. వారు “స్వామీ! మీ పాదపద్మాలను దర్శించడం కంటే కారణమేముంటుంది” అని వినయంగా సమాధానమిచ్చారు. కొద్ది సమయం గడిపిన తరువాత వారు వాసుదేవుని శలవు తీసుకొని ‘పిండారకం’ అనే పుణ్యతీర్థానికి బయలుదేరి వెళ్లారు.

పిండారకంలో కొందరు యాదవ బాలురు సాంబునకు ఆడవేషం వేసి గొప్ప నేర్పుతో అందంగా అలంకరించారు. వారు గుంపులు గుంపులుగా చేరి త్రుళ్ళుతూ, కేరింతలు కొడుతూ ఆడుతూ ఉన్నారు. ఆ సమయంలో మునీశ్వరులను చూసిన బాలురు పొగరుగా ఆడవేషంలో ఉన్న సాంబుని ముందు ఉంచుకొని వెళ్లారు. మునిపుంగవులకు సాగిలపడి మ్రొక్కారు. “ఎత్తుగా కనపడుతున్న బరువైన గర్భంగల ఈ అమ్మాయి కడుపులో మగపిల్లవాడున్నాడా? ఆడపిల్ల ఉందా? చెప్పండి” అని ఆ మునులను అడిగారు. ఆ మాటలకు మునులకు కోపం వచ్చింది.

యాదవబాలురను చూసి వీళ్ళు మదంతో మైమరచి వచ్చారని మనస్సులో తలంచిన మునులు కోపంతో “మమ్మల్నే అపహాస్యం చేస్తారా! నిశ్చయంగా యదువంశాన్ని నాశనం చేసే రోకలి ఒకటి ఈ బాలికకు పుడుతుంది. ఆలస్యం లేదు. ఇక పొండి!” అన్నారు. అంతవరకూ కృష్ణుడి మాయవల్ల తెలియని మత్తులో ఉన్న ఆ బాలురు మునుల శాపం విని భయపడి గజగజ వణుకుతూ సాంబుని పొట్ట చుట్టూ కట్టిన చీరను విప్పసాగారు. అప్పుడు అందులో నుండి ఇనుప రోకలి ఒకటి నేల మీద పడింది.

వారు ఆశ్చర్యంతో ఆ రోకలి తీసుకొని కృష్ణుని దగ్గరకు వెళ్ళి జరిగింది అంతా చెప్పారు. కృష్ణుడు తనకు ఏమీ తెలియ నట్లుగా వారు చెప్పింది అంతా సావధానంగా విన్నాడు. వాసుదేవుడు వారికి ఇలా చెప్పాడు. “మీ బుద్ధి చెడిపోయింది. పొగరెక్కి మీ చర్యల వల్ల మహాత్ములకు కోపం తెప్పించారు. ఇటు వంటి తెలివి తక్కువ పని చేసి వంశ నాశనానికి కారణమైన శాపాన్ని పొందేవారు ఎక్కడైనా ఉంటారా?

మహర్షుల కోపాన్ని బ్రహ్మ రుద్రులు కూడా అడ్డుకోలేరు. అటువంటప్పుడు మానవమాత్రులమైన మనమెంత? పూర్వజన్మ కర్మఫలాన్ని తొలగించడం ఎవరికీ సాధ్యం కాదు గదా! యతులను నిందించడం వలన యదువంశం నాశనం కాక తప్పదు”.

వాసుదేవుడు భయకంపితులైన వారి మొహాలు చూసి మరల ఇలా చెప్పాడు. “ఏది ఏమైనా మనం తప్పక మానవ ప్రయత్నం చెయ్యాలి. సముద్రం ఒడ్డున ఒక పెద్ద కొండ ఉంది. మీరు అక్కడకు వెళ్ళి అక్కడ ఎత్తుగా ఉన్న పెద్ద బండ మీద మీ భుజబలం అంతా ఉపయోగించి ఈ ఇనుప రోకలిని రాచి పొడిచేసి, ఆ పొడిని సముద్రపు నీళ్ళలో కలపండి. పొండి!” అన్నాడు. కృష్ణుని సలహా ప్రకారం ఆ యాదవ బాలురు ఇనుప రోకలిని తీసుకొని సముద్రపు ఒడ్డున ఉన్న కొండ దగ్గరకు వెళ్ళారు. వారు బలాన్ని అంతా ఉపయోగించి కొండ రాతికి రాసి పొడిని సముద్రంలో కలిపారు. చివరకు ఆ రోకలి చేతికి దొరకనంత చిన్న సూదిలా తయారయ్యింది. దానిని వారు సముద్రంలో విసిరి ఇళ్ళకు వెళ్ళిపోయారు.

ఆ చిన్న లోహం ముక్కను ఒక చేప మ్రింగింది. ఆ చేపను ఒక బోయవాడు వల వేసి పట్టుకొన్నాడు. చేపను కోసినప్పుడు ఇనుప ముక్క దాని కడుపు లోనుండి బయటపడింది. సంతోషంగా వాడు ఆ ఇనుప ముక్కను తన బాణం చివర ములికిగా చేసుకున్నాడు.

తర్వాత ఒకనాడు సురలు, గరుడులు, విద్యాధరులు, బ్రహ్మ, రుద్రుడు, మిగిలిన దేవతలూ పద్మాక్షుని చూడడానికి సంతోషంతో ద్వారకకు వచ్చారు. యాదవ వంశం అనే ఉద్యానవనంలో ప్రకాశించే పారిజాతం వంటి వాడూ, పరమేశ్వరుడు అయిన వాసుదేవుని వేదసూక్తాలతో స్తుతించారు. “సర్వలోకాధినాథా! సర్వేశ్వరా! పుట్టుక లేనివాడవై కూడా భూభారం తగ్గించడంతో కోసం నీవు పుట్టావు. నీవు జన్మించి ఇప్పటికి నూట ఇరవై అయిదు సంవత్సరాలు గడిచాయి. ఇకనైనా వైకుంఠానికి వేంచెయ్యి ప్రభూ” అని ప్రార్థించారు.

బ్రహ్మరుద్రాదుల ప్రార్థన అంగీకరించిన జగన్నాథుడు వాళ్ళతో “యాదవులకు పరస్పరం శత్రుత్వాన్ని కల్పించి వారిని రూపుమాపి భూభారం తగ్గించి వేసి వస్తాను” అని చెప్పి వారిని సాగనంపాడు. వారు తమ తమ స్థానాలకు వెళ్లారు. అనంతరం శ్రీకృష్ణుడు యాదవులతో “ఓ యాదవులారా! ఎన్నో విధాలైన చెడు శకునాలు కనపడుతున్నాయి. కనుక ఇక్కడ ఉండవద్దు. మీరంతా ఆలస్యం చేయకుండా ప్రభాస తీర్థానికి వెళ్లండి” అని హెచ్చరించాడు. నారాయణుడి మాటలు ఆలకించి యాదవు లందరూ భార్యా బిడ్డలతో కలిసి ఏనుగులనూ, గుర్రాలనూ, సైన్యాలనూ తీసుకొని వేగంగా ప్రభాస తీర్థానికి వెళ్లారు.

శ్రీకృష్ణుని సలహా ప్రకారం యాదవులు ప్రభాస తీర్థం చేరారు. అక్కడ నదుల్లో స్నానాలు చేశారు. ఉదారంగా దేవతలకూ, పితృదేవతలకూ తర్పణాలు విడిచారు. బ్రహ్మణోత్తములకు దక్షిణలు ఇచ్చారు. పంట భూములను, గోవులను దానం చేశారు. తర్వాత సంతుష్టిగా కడుపునిండా భుజించి, మద్యపానంతో మత్తెక్కి మైమరచి ఒకరినొకరు పరిహసించుకోసాగారు.

ఆ మత్తులో సరదాగా పోట్లాడుకోవడం మొదలు పెట్టారు. కాస్సేపటికి అది నిజమైన పోరాటంగా మారింది. ఏనుగులు, గుర్రాలు, రథాలు, బటులు అన్నిటితో యుద్ధం చేయడం మొదలు పెట్టారు. తుంగబెత్తాలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆయుధాలతో ఒకరినొకరు పొడుచుకుంటూ భయంకరమైన యుద్ధం చేశారు. రణరంగమంతా ముక్కలైన మొండేలతో, విరిగిన రథాలతో, కూలిన గుర్రాలతో, వాలిన ఏనుగులతో నిండిపోయింది. యాదవు లు అందరూ యుద్ధంలో చనిపోయారు.

బలరామకృష్ణులు ఈ యాదవుల విద్వంసమంతా చూసారు. జలజల పారే సరస్వతీ నదిలో చనిపోయిన వారందరికీ యథావిధిగా ఉత్తర క్రియలు జరిపారు. నవ్వుకుంటూ అలా దూరంగా వెళ్ళిపోయారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత బలరాముడు ఒక్కడు ఒక మార్గాన పోయి యోగమార్గంలో అవతారం చాలించి అనంతునిలో కలిసిపోయాడు. శ్రీకృష్ణుడు ఒక చెట్టు మొదట్లో కూర్చున్నాడు.

అప్పుడు జ్ఞానవంతుడైన ఉద్ధవుడు తన మనస్సులో విషయమంతా తెలుసుకొని శ్రీకృష్ణుని వెతుకుతూ వచ్చాడు. అలా అన్వేషిస్తూ వెళ్ళిన ఉద్ధవుడు ఒక చెట్టుని ఆనుకొని కూర్చొని ఉన్న గోవిందుని చూసాడు. నువ్వే మాకు దిక్కని స్తుతించాడు. “దేవా! నీవు యాదవజాతిని నాశనం చేసి వెళ్ళిపోతే మేము నీ సహచరులమై నీతో కలిసి జీవించిన రోజులను ఎలా మరిచిపోగలము?“ అన్నాడు. ఆ మాటలకు వాసుదేవుడు “బ్రహ్మ మొదలైన దేవతల ప్రార్థన ప్రకారం భూభాగాన్ని తొలగిస్తున్నాను. నేటికి ఏడవ రోజు సముద్రుడు ద్వారకా నగరాన్ని ముంచివేస్తాడు. యాదవజాతి నాశనం అవుతుంది. అంతట కలియుగం వస్తుంది”.

యాదవులందరినీ అంతం చేసిన శ్రీకృష్ణుడు తన తర్వాత విజ్ఞాన తత్త్వాన్ని లోకంలో జిజ్ఞాసగల ప్రజలకు తెలియజేయగల ప్రజ్ఞాశాలి, జితేంద్రియుడూ ఉద్ధవుడు ఒక్కడే అని నిశ్చయించు కొన్నాడు. ఉద్ధవునికి భక్తియోగాన్నీ, మోక్షసాధన విధానాన్ని బోధించాడు. “ఉద్ధవా! కర్మయోగమందూ, భక్తిభావమందూ ఆసక్తుడై, దయారసము కలిగి, మితభాషణుడై, సమస్త కర్మలూ నాకర్పించేవాడు భాగవతుడు అవుతాడు. నా కథలు, నా లీలా విలాసాలు వింటూ భాగవతులను ఇంటికి తీసుకువెళ్ళి అతిథిమర్యాదలతో సంతృప్తి పరిచేవాడు కూడా భాగవతుడనబడతాడు. ఇలా ఈలోకంలో ఎంతకాలం జీవిస్తాడో అంతకాలం ఇదే విధంగా ఉండేవాడు చివరకు వైకుంఠంలో నన్ను చేరుకుంటాడు.”

“ఉద్ధవా! నీవు తీవ్రమైన యోగనిష్ఠతో బదరికాశ్రమం చేరి నేను చెప్పిన సాంఖ్యయోగాన్ని మనస్సులో నిలుపుకొని కలియుగం చివరిదాకా ఉండు” అని శ్రీకృష్ణుడు ఉద్ధవుని ఆదేశించాడు. అదే సమయంలో మునులలో అగ్రగణ్యుడైన మైత్రేయ మహర్షి తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి వచ్చి శ్రీకృష్ణుణ్ణి అవలోకించాడు.

పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు వారిని వీడ్కొలిపి, వేరొక దారిలో వెళ్ళి గుబురుగా ఉన్న ఒక పొద చాటున పడుకొని విశ్రాంతి తీసుకొంటూ ఒక కాలు మీద కాలు పెట్టి ఆడిస్తూ ఉన్నాడు. ఒక బోయవాడు వేటకు వచ్చి దిక్కులన్నీ చూస్తూ ఉంటే, కదులుతున్న కృష్ణుని కాలు లేడి చెలిలాగ అనిపించింది. వాడు వెంటనే అమ్ములపొది నుండి బాణం తీసి కాలుకి గురిచూచి కొట్టాడు. ఆ బాణం తగిలిన శ్రీకృష్ణుడు ‘హాహా’ అని అరిచాడు. ఆ బోయవాడు దగ్గరకు వచ్చి జగదీశ్వరుడైన శ్రీకృష్ణుని చూసి భయంతో అపరాధం చేసానని ఏడుస్తూ పవిత్రమైన మనస్సుతో నిరాహార దీక్ష చేసాడు. కారణ జన్ముడైన ఆ బోయవాడు ప్రాణత్యాగం చేసి వైకుంఠానికి వెళ్లాడు.

ఆ సమయంలో కృష్ణుడి రథసారథి దారుకుడు అక్కడకు వచ్చి కృష్ణుడు ఒంటరిగా ఉండటం చూసాడు. శ్రీకృష్ణుడి దివ్యమైన ఆయుధాలు మాయమవటం కూడా చూసాడు. నారాయణుడు దారుకునితో “అక్రూరునికీ, విదురునికీ జరిగినదంతా చెప్పు. స్త్రీలనూ, పిల్లలను, ముసలివారినీ, పెద్దవారినీ హస్తినాపురానికి తీసుకు వెళ్ళమని అర్జునుడికి చెప్పు” అన్నాడు.

అప్పుడు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు నూరుకోట్ల సూర్యుల దివ్యతేజస్సు వెడలి నారదుడు మొదలైన మునుల సముదాయమూ, బ్రహ్మ, రుద్రుడు మొదలైన దేవతలూ, జయజయ నినాదాలతో తోడురాగా వైకుంఠానికి తరలి వెళ్ళాడు.

దారుకుడు తిరిగి వెళ్ళే సమయానికి ద్వారక పూర్తిగా సముద్రగర్భంలో కలిసిపోయింది. కృష్ణుని మరణవార్త తెలిసిన అర్జునుడు విలపిస్తూ వచ్చి శ్రీకృష్ణుని పార్థివ శరీరానికి అంత్యక్రియలు చేశాడు. ప్రాణాలతో మిగిలిన అంతఃపురకాంతలు పదహారు వేలమందిని వెంటపెట్టుకొని హస్తినాపురం వస్తుండగా అరణ్యమధ్యంలో మదోన్మత్తులైన కిరాతకుల బారి నుండి వారిని రక్షించలేకపోయాడు. అర్జునుని ఆయుధాలు ఏమీ పని చేయలేదు.అంతా ఆ సర్వేశ్వరుడి సంకల్పం ప్రకారమే జరిగింది.

హస్తినాపురానికి తిరిగి వచ్చి కృష్ణుణ్ణి తలచి దుఃఖిస్తూ ద్వారకలో జరిగిన విషయాలన్నీ తన సోదరులకు తెలియజేసాడు. యాదవుల మరణమూ, మాధవుని నిర్యాణమూ ఆలకించిన కుంతీదేవి నిర్మలమైన భక్తితో ప్రశాంతంగా శరీరాన్ని పరిత్యజించింది. ధర్మరాజు తన మనుమడైన పరీక్షిత్తుకు పట్టము గట్టి హస్తినాపుర సింహాసనంపై కూర్చొండబెట్టాడు. అనిరుద్ధుని కుమారుడైన వజ్రుని మథురా రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. పాండవులు విరక్తులై దాన దర్మాలు చేసి, సంసార బంధాలను త్రెంపుకొని పరబ్రహ్మాన్ని మననం చేసుకుంటూ ప్రస్థానం సాగించి విష్ణుపథం పొందారు.

ఉద్ధవుని ద్వారా శ్రీకృష్ణుని మరణవార్త విన్నవిదురుడు మైత్రేయ మహర్షిని దర్శించాడు. పవిత్ర ప్రభాస తీర్థంలో భగవంతునియందు మనస్సు లగ్నంచేసి తన శరీరాన్ని త్యజించి, పూర్వజన్మలో యమధర్మరాజు అయినందువల్ల పిత్రుదేవతలతో కలిసి తన అధికార పీఠాన్ని అధిష్టించాడు.

ఈ విధంగా జరిగిన పాండవుల మహాప్రస్థానమూ, శ్రీకృష్ణుడి పరమపదయానమూ, స్వచ్ఛమైన మనస్సుతో చదివినవారూ, విన్నవారూ, భవబంధవిముక్తులై కైవల్య పథాన్ని పొందుతారు.

*శుభం*

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి