వేట - జీడిగుంట నరసింహ మూర్తి

Veta

ఏ ఉద్యోగంలోనూ స్తిరత్వం లేని సుధాకర్ గురించి నాకు తెలిసి ఉద్యోగంలో కనీసం పది కంపినీలైనా మారి ఉంటాడు. పని విషయంలో పూర్తి బద్దకస్తుడు. పైగా చేసే వాళ్ళతో అనవసర కబుర్లు, పనిమాలిన రాజకీయాల గురించి కబుర్లేసుకుంటూ "కూసే గాడిద మేసే గాడిదను చెడగొట్టినట్టు" వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టేవాడు. అతని వ్యవహారం ప్రతి కంపినీ కొంతమంది గూఢచారులను పెట్టి ఎవరెవరు పని చేయకుండా తిరుగుతున్నారో అటువంటి వారిని కంపినీ మేనేజ్మెంట్ కు పట్టించడం లాంటి చర్యలతో ఎన్నో చోట్ల ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలో సుధాకర్ మాత్రం ఏ మాత్రం అవమాన పడకుండా ఉద్యోగాల పేరిట ఊళ్ళు మారడం సరదాగా పెట్టుకున్నాడు.

చాలా కాలం తర్వాత సుధాకర్ని మళ్ళీ నేను పని చేస్తున్న ఒక పెద్ద కంపినీలో చూశాను. అతను దానికి ఇంటర్వ్యూకి వచ్చాడు గతంలో అతనూ, నేనూ కలిసి ఒక చోట పనిచేయడం వల్ల అతని మొహం నాకు బాగా గుర్తుంది.

వస్తూనే నన్ను గుర్తు పట్టి నా చుట్టూనే తిరుగుతూ మా కంపినీ వివరాలు అన్నీ రాబట్టాడు. .

"ఇంటర్వ్యూ బాగా చేయండి సుధాకర్ గారు. ఈ కంపినీలో సామాన్యంగా ఉద్యోగం దొరకడం కష్టం. మొదటినుండి వాళ్ళ వాళ్ళే వారసత్వంగా పనిచేసుకుంటూ వస్తున్నారు. ఎంతో నాలెడ్జ్ , చురుకుదనం ఉంటే కానీ వాళ్ళు అంత తేలిగ్గా ఎంట్రీ ఇవ్వరు. అంతే కాకుండా మనం ఇంతకు ముందు పని చేసిన కంపినీ నుండి కూడా సమాచారం తెప్పించుకుంటారు. అసలు అక్కడ ఎందుకు వదిలేశామో, లేదా వాళ్ళు మనల్ని ఏదైనా కారణం చేత తొలగించారా లాంటి విషయాలను కూపీ లాగుతారు. . ఇవన్నీ పరిగణలోకి తీసుకుని కానీ ఒక నిర్ణయానికి రారు. ఏది ఏమైనా మీకు బెస్ట్ ఆఫ్ లక్ " అని చెప్పాను సుధాకర్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు.

" భలే వారండీ మీరు. . అటువంటి సమస్య నాకు రాదని అనుకుంటున్నాను. . నాకు దాదాపు పది కంపినీలలో అనుభవం ఉంది . ఏదో బెట్టర్మెంట్ కోసం కంపినీలు మారుతున్నాను తప్ప ఇన్ని చోట్ల తిరగడం నాకేమీ ఆనందమా చెప్పండి ?" అన్నాడు సుధాకర్ చిన్నబుచ్చుకుంటూ.

నేను ఆ కంపినీలో పనిచేస్తున్నాను అని తెలిసి పూర్వాశ్రమంలో నాతో కలిసి పనిచేసిన కొంతమంది "మీ కంపినీలో జాబ్ కోసం అప్లై చేద్దామని అనుకుంటున్నాను. ఇంటర్వ్యూ టైంలో కొద్దిగా రికమండ్ చెయ్యగలరా ? . జస్ట్ నాకు బాగా తెలిసిన వాడు, పని వంతుడు అని ఒక్క ముక్క చెపితే చాలు " అని అడపా దడపా నాకు ఫోన్లు చేసే వాళ్ళు లేకపోలేదు. అదృష్టవశాత్తు వాళ్ళకు ఇంటర్వ్యూ వచ్చినా తల తిక్క సమాధానాలు చెప్పడమో, ఇంతకు ముందు చేసిన చోట మీరు ఆఫర్ చేస్తున్న దానికన్నా ఎక్కువ జీతం ఇచ్చేవాళ్లు అంటూనో బేషిజాలు పోయి వచ్చిన అవకాశాన్ని కూడా జారవిడుచుకున్న వాళ్ళే ఎక్కువ.

సుధాకర్ వస్తూనే నాతో సంచరిస్తూ ఉండటం చూసి మేమిద్దరమూ ఎక్కడో ఏదో కంపినీలో కలిసి పని చేసి ఉంటాము అని గ్రహించి మా పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతని గురించి నన్ను వాకబు చేశారు. అతని గత చరిత్ర నాకు తెలిసినా అతనికి రాబోయే అవకాశాన్ని ఎందుకు చెడగొట్టడం అని అతని గురించి మంచి రిపోర్టే ఇచ్చాను. ఆ తర్వాత సుధాకర్కు మా కంపినీలో ఉద్యోగం ఖాయం అయ్యింది. అప్పటివరకు నా రికమెండేషన్ కూడా పనిచేస్తుందని నాకు తెలియదు.

ఎంత చెడ్డా సుధాకర్ని మరీ తక్కువగా అంచనా వెయ్యలేము. . ఇంటర్వ్యూ టైంలో మెంబర్లను తన మాటల గారడీతో బుట్టలో వేసుకునే వాడు. తీరా పనిలో చేరాక కాపురం చేసే కళ కాలు తొక్కినప్పుడే తెలిసింది అన్నట్టు ముచ్చటగా మూడు నెలలు కూడా పట్టుమని పని చెయ్యలేకపోయే వాడు.

సుధాకర్కు తన బలహీనతలేమిటో తనకు తెలుసు. పనిలో సోమరితనంగా ఉండటం, ఇతర విషయాల మీద ఎక్కువ దృష్టిపెట్టడం , పని వాళ్ళకు వడ్డీకి అప్పులు ఇవ్వడం, అవి వసూలు చేసుకునేటప్పుడు గొడవలు పడటం లాంటివన్న మాట. అతను ఇన్ని ఉద్యోగాలు మారడం ఏమో కానీ, ఇంట్లో వాళ్ళు మటుకు అతనితో ఎన్నో ఊళ్ళు తిరగడం ఇబ్బందిగా భావిస్తున్నారు. పైగా పిల్లల చదువులు కూడా ఘోరంగా దెబ్బతింటున్నాయి.

ఎన్నో చోట్ల ఉద్యోగాలు చేశానని చెప్పుకోవడం కూడా మైనస్ పాయింట్ అవుతుందని అతని సహ ఉద్యోగస్తులు చెప్పడంతో ఇక ఇదే తనుపనిచెయ్యబోయే చివరి కంపినీ కావాలి అని సుధాకర్లో పట్టుదల పెరిగింది. అయితే ఇంతకు ముందు లేని పనితనం కొత్తగా ఎక్కడనుండి వస్తుంది ? అంత తేలిగ్గా ఒళ్ళు వొంచే రకం కాదు. వేరే రకంగా ఆ మేనేజ్మెంట్లోని పెద్ద వాళ్ళను ఆకర్షించాలి అన్న పట్టుదల అతనిలో మొదలయ్యింది. కనీసం ఇంకో రెండు మూడేళ్లు నిలకడగా పని చెయ్యగలిగితే చాలు అన్నది అతని ఆలోచన .

తనతో పాటు పనిచేస్తున్న వాళ్ళని తను తేలిగ్గా మేనేజ్ చెయ్యగలడు కానీ టాప్ మేనేజ్మెంట్ దృష్టిలో పడటమే ముఖ్యం. అయితే వాళ్ళను అప్రోచ్ అవ్వడమే చాలా పెద్ద పని. అంతలోనే అతని మస్తిష్కంలో చటుక్కున ఒక మెరుపులా ఒక వజ్రాయుధంలాంటి ఆలోచన మెరిసింది. ఆ ఆయుధాన్ని తను ఇంతకు వరకు ఎక్కడా ఉపయోగించలేదు. ఇప్పుడు దానికి సరైన సమయం వచ్చింది.

సుధాకర్ అన్నగారు ఒకతను తిరుపతిలో కొండమీద ఏదో పెద్ద పొజిషన్లో పనిచేస్తున్నాడు. ఉచిత దర్శనాలు ఏర్పాటు చెయ్యడం అతని వల్ల కాదు కానీ ఇతర ఆన్ని వసతి సౌకర్యాలు చూడటం, శీఘ్ర దర్శనం ఏర్పాటు చెయ్యడం , తన కారులో పైకి తీసుకెళ్ళడం మళ్ళీ తిరుగు ప్రయాణంలో కిందకు దించి స్టేషన్లోనో, ,బస్టాండ్ లోనో దించి రావడం వరకు బాగా తెలిసిన వాళ్ళకు దగ్గరుండి చూసుకునే వాడు.

తను పనిచేస్తున్న కంపినీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారికి తన అన్నగారి సిఫార్స్ తో తిరుపతిలో కొండమీద కనుక చక్కటి దర్శనాన్ని చేయించగలిగితే తనపట్ల వాళ్ళకు విశ్వాసం పెరగడమే కాకుండా తన విలువేమిటో తెలిసి వస్తుందని , తన పని విషయంలో చూసీ చూడనట్టుగా ఉంటారని, ఆ విధంగా తన ఉద్యోగానికి ముందు ముందు ఎటువంటి డోకా ఉండదని అప్పటికప్పుడు ఒక పథకాన్ని రచించి ఈ విషయం ఈడీ గారికి తెలిసేలా ఆయన పియ్యేతో మంతనాలు మొదలెట్టాడు.

చాలా రోజులుగా ఈడీ గారికి , ఆయన కుటుంబానికి ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించాలన్న కోరిక బలీయంగా ఉంది. అయితే తను ఈ ప్రాంతం వాడు కాకపోవడం, భాషా సమస్యల వల్ల ముఖ్యంగా తిరుపతి లాంటి ప్రదేశంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని , అనేక మోసాలకు గురి కావాల్సి వస్తుందన్న ఆలోచనతో ఆయన కోరికను బలవంతంగా తొక్కిపెట్టేవాడు. ఎవరో ఒకరు కంపినీలోతిరుపతికి వెళ్ళి వస్తూ ఉండటం వచ్చేటప్పుడు తిరుపతి లడ్డూలు ఆయన కోసం తీసుకు వచ్చి ఇస్తూ ఉండటంతో దానితోనే సంతృప్తి చెండాల్సి వచ్చింది. ఇప్పుడు తన పియ్యే ద్వారా సుధాకర్ విషయం తెలుసుకుని వెంటనే అతన్ని పిలిపించాడు.

"సార్ మీలాంటి వారికి దర్శనం ఏర్పాటు చెయ్యడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తాను. అక్కడ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి , తిరిగి క్షేమంగా మీరు ఇక్కడకు చేరుకునే అంతవరకు నేను బాధ్యత తీసుకుంటాను. దయచేసి నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి " అన్నాడు సుధాకర్ రెండు చేతులు జోడించి .

సుధాకర్ ఆ కంపినీలో చేరి ఒక నెలరోజులు పైగా అవుతోంది. అతను అక్కడ చేరినప్పటినుండి అతని మొహం చూడటం ఈడీ గారికి ఇదే మొదటి సారి. సుధాకర్ లడ్డూ లాంటి వార్త చెప్పగానే ఈడీ గారి మొహం చేట అంత అయ్యింది. సుధాకర్ తీపి వార్త చెప్పి వెళ్లిపోతూ ఉంటే తను కూడా లేచి అతని చేతులు కలిపాడు. దానితో సుధాకర్కు హిమాలయాలను అధిరోహించినంత గర్వం కలిగింది.

తన తమ్ముడి ఉద్యోగాన్ని ఎలాగైనా నిలబెట్టాలన్న తాపత్రయంతో సుధాకర్ అన్నగారు ఒక ప్లాన్ ప్రకారం సుధాకర్ పనిచేస్తున్న ఈడీ గారిని వారి కుటుంబ సభ్యులను అడుగులకు మడుగులొత్తుతూ భూతల స్వర్గాన్ని చూపించాడు. ఇరవై నాలుగు గంటలూ కంపినీ శ్రేయస్సు కోసం తల్లడిల్లిపోయే ఈడీ వజ్రదేవ్ ఆ రెండు రోజులూ హాయిగా అన్నీ మర్చిపోయి ఆహా ఇదే కదా జీవితంలోని అసలైన మధుర క్షణాలు అని అనుకోకుండా ఉండలేకపోయాడు. సుధాకర్ చేసిన తెలివిగల పని ఏమిటంటే పూర్తి బాధ్యతను అన్నగారిమీద వదిలెయ్యక తను కూడా తిరుపతికు ఈడీగారి కారులోనే వెళ్ళి అక్కడ అన్నగారిని పరిచయం చెయ్యడం , ఆ తదుపరి దర్శనానికి సంబంధించి ఏర్పాట్ల గురించి తను కూడా ఈడీని అంటిపెట్టుకుని ఉండటం. ఇది ఈడీగారి మనసులో బలంగా నాటుకుపోయింది.

అటువైపు పనున్నా , లేకపోయినా ఈడీ వజ్రదేవ్ గారు సుధాకర్ పని చేస్తున్న యూనిట్ వైపు వెళ్తూ ఉండటం, అతన్ని నవ్వుతూ పలకరిస్తూ కనపడటం అక్కడ పని చేస్తున్న వారికందరికీ అసూయ కలిగించక మానలేదు. "పని చేసేది మనమూ , ఈడీగారి కరచాలనాలు, పలకరింపులూ కొత్తగా వచ్చిన సుధాకరికీనా ? " అంటూ మొహం మాడ్చుకోని వాళ్ళు లేరు. ఇప్పుడు ఈడీ గారి పియ్యే కూడా సుధాకర్ తో స్నేహం మొదలెట్టాడు. భవిష్యత్తులో తను కూడా సుధాకర్ని పట్టుకుని తిరుపతి యాత్ర చేయాలని అతని ఆలోచన.

సుధాకర్ అన్నగారు అనబడే ఒకాయన తిరుపతిలో కొండమీద ఉన్నాడని , అతని ద్వారా కంపినీలో పెద్ద వాళ్ళను ఆకట్టుకునే ప్రయత్నంలో సుధాకర్ ఒళ్ళు కదల్చకుండా హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడని, మధ్యలో ఒకటి రెండు ఇంక్రిమెంట్లు కూడా కొట్టేశాడని ఆ కంపినీ మొత్తం అంతా తెలిసి పోయింది. పని చేస్తే చేస్తే చేశాడు లేకపోతే లేదు కానీ ఇటువంటి వాళ్ళ వల్ల తమకు మంచి ప్రయోజనం కలుగుతోందని పై వాళ్ళు సుధాకర్ ని ఒక్క మాట అనకుండా అతని ప్రయోజనాలను కాపాడుకుంటూ అతన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

ఒళ్ళు అలవకుండా , తన స్వప్రయోజనాలను అనుభవిస్తూ సుధాకర్ ఆ కంపినీలో ఒక సంవత్సర కాలం హాయిగా గడిపేశాడు. ఇప్పుడు తను ఎక్కువ కాలం ఇదే కంపినీలో పనిచెయ్యగలనన్న నమ్మకం అతనిలో అనువణువునా కలిగింది.

ఆ రోజు ఈడీ వజ్రదేవ్ గారినుండి సుధాకర్కు పిలుపు వచ్చింది.

" మిష్టర్ సుధాకర్ గుడ్ మార్నింగ్. మీరు మళ్ళీ ఇంకో సహాయం చెయ్యాలి. మరో రెండు రోజుల్లో మన మేనేజింగ్ డైరెక్టర్ గారు డిల్లీ నుండి కుటుంబతో సహా వస్తున్నారు. నేను మీ గురించి ఆయనకు చెప్పాను. మీకు రెండు రోజులు పని పడింది. ఆయన్ని కూడా తిరుపతిలో మీ బ్రదర్ తో చెప్పి కొండమీద అన్ని ఏర్పాట్లు చేయించి , మాకు జరిగినట్టుగా వారికి కూడా మంచి దర్శనాన్ని దగ్గరుండి ఏర్పాటు చెయ్యాల్సిన బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. ఇక్కడినుండే మీ బ్రదర్ కి ఫోన్ చేయండి" అంటూ లాండ్ లైన్ ఫోన్ ముందుకు జరిపాడు ఈడీ గారు.

ఈడీగారు చెప్పిన విషయం విని సుధాకర్ మొహం నల్లగా అయిపోయింది. క్షణకాలం కొయ్యబారి పోయాడు. వెన్నులో సన్నటి జలదరింపు ప్రారంభమయ్యి మొహం చెమటతో ముద్దయ్యయ్యింది. ఫోను దగ్గరగా జరిపినా అతను రిసీవర్ తీసుకోలేదు.

"సార్ . మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాల్సి వచ్చినందుకు చాలా ఇబ్బంది పడుతున్నాను. ఒక రెండు నెలల క్రితం మా బ్రదర్ తిరుపతిలో రిటైరయ్యి మా స్వగ్రామం వెళ్ళిపోయారు. పని హడావిడిలో ఆ విషయం మీకు చెప్పాలనుకుని అశ్రద్ద చేశాను. దయచేసి ఏమీ అనుకోకండి సార్. ఇప్పుడు తిరుపతి కొండమీద దర్శనం చేయించడానికి నాకు తెలిసిన వారు కూడా ఎవరూ లేరు . " అంటూ బిక్కమొహం పెట్టుకుని చెప్పాడు సుధాకర్ .

సుధాకర్ చెప్పిన మాటలకు ఈడీ గారి మొహంలో రంగులు మారాయి క్రమంగా. ఆయన ముఖం అవమానంతో జేవురించింది.

"వాట్. ఇప్పుడు మీ అన్నయ్య తిరుపతిలో లేరా ? నాకు ఈ విషయం ముందే చెప్పకుండా ఎందుకు దాచావ్? నువ్వు ఏదో పొడిచేస్తావని ఎండీ గారికి ప్రోగ్రామ్ గురించి చెప్పేశాను. ఇప్పుడు నేను ఆయనకు మొహం ఎలా చూపించాలి ? వెరీ బాడ్. నన్ను చాలా నిరాశలో ముంచేసావు. సరే. వెళ్ళి నీ పని చేసుకో. అసలు నీ మీద ఆధార పడటం మా తప్పు .." అంటూ మొహం తిప్పేసుకున్నాడు ఈడీ. అంతకు ముందు దగ్గరుండి తనని, తన కుటుంబాన్ని తిరుపతి తీసుకెళ్లి సకల సౌకర్యాలు సమకూర్చాడన్న విషయాన్ని ఆ క్షణంలో ఆయన మర్చిపోయినట్టు ప్రవర్తించాడు.

ఈడీ గారి మాటలు ములుకుల్లా, శూలాల్లా గుచ్చుకున్నాయి. నేరస్తుడిలా తలదించుకున్నాడు. ఏదో ఘోరమైన విపత్తు జరగబోతోందని అతని మనసు సూచిస్తోంది.

"సారీ సార్ . ఇలా జరుగుతుందని నేనూ ఊహించలేదు. ఈ విషయంలో నేను అశక్తుడిని. " అంటూ మ్లానమైన ముఖాన్ని కిందకు దించుకున్నాడు సుధాకర్. భరించలేని ఉద్విగ్నతతో బయటకు వచ్చాడు. కొన్ని సంస్థలలో వారికి కావలసింది పని చేసే వాళ్ళు కాదు. వారి సొంత పనులు చేసే వాళ్ళు కావాలి. పాపం సుధాకర్ ఈ విషయంలో ఓడిపోయాడు.

ఈడీ గారు సుధాకర్ మధ్య జరిగిన సంభాషణకు ప్రత్యక్ష సాక్షి ఆయన పియ్యెనే. అతను చెపితేనే విషయం నాకూ తెలిసింది.

మరో రెండు నెలల తర్వాత పనిలో ఏదో అలసత్వం చూపించాడన్న కారణంతో సుధాకర్ పైన వేటు పడింది. మళ్ళీ సుధాకర్కు ఉద్యోగాల వేట తప్పలేదు . . ******

మరిన్ని కథలు

Pandaga maamoolu
పండగ మామూలు
- Madhunapantula chitti venkata subba Rao
Maanavatwam
మానవత్వం!
- - బోగా పురుషోత్తం
Prema pareeksha
ప్రేమ పరీక్ష
- శరత్ చంద్ర
Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ