దయ్యం - ఆపాసా

Dayyam

పిల్లల కాలేజీలకి దగ్గరవుతుందని, మేము రాయపూర్ నుండి దుర్గ్ రైల్వే స్టేషన్­కి దగ్గరగా (భిలాయి స్టీల్ ప్లాంట్­ క్వార్టర్స్­కి ఆనుకునివున్న పెద్ద రైల్వే స్టేషన్ పేరు ‘దుర్గ్. ‘భిలాయి కాదు.) మకాం మార్చడానికే చివరకి నిశ్చయించాం.

రాబోయే సెమిస్టర్­కల్లా మార్చేద్దాం అని, కొంచెం ముందరే, ఇళ్ళ వేటలో పడ్డాం.

వెతకగా వెతకగా, అన్ని విధాలా సదుపాయంగా, సౌకర్యంగావున్న ప్రదేశంలో ఒక మంచి విశాలమైన ఇల్లు, అనూహ్యంగా అతి చౌకలో అద్దెకి దొరికింది.

అది ఒక డబుల్ స్టోరీ బిల్డింగ్­లో క్రింద వాటా. కార్నర్ ఇల్లు. ఇంటికి మూడు వైపులా ఎక్కువ ఖాళీ జాగావే ఉంది. అది చప్టా చేసివుంది. మొదట్లో పెద్ద గేటు. అది దాటగానే చాలా వాహనాలు నిలుపుకోడానికి సరిపడా స్థలం. అది దాటాక పడమటిముఖంగా ఇంటి ముఖద్వారం. కుడివైపు దక్షిణంవైపు మేడపై పోర్షన్­కి వెళ్ళడానికి మెట్లు.

ఇంటిగలావిడ మాకా ఇల్లు చూపిస్తూ, “ఈ క్రింది పోర్షనేనండి అద్దెకి ఉన్నది. పై పోర్షన్­లో మేము ఏడుగురం ఉంటాం. నేను, మావారు, మా అత్తగారు, మా అమ్మాయి చాలా చిన్నది. ఎలిమెంటరీ స్కూల్. ముగ్గురు ఆడపడచులు. వారిలో పెద్దాడపడుచు విడో, రెండో ఆమె పెళ్ళి చేసుకోలేదు. ప్రభుత్వోద్యోగి. మావారి ఆఫీసులోనే. చిన్నాడపడచు డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ అయిపోగానే ఆమెకి పెళ్ళి చేసేద్దాం అనుకుంటున్నాం. ఆమె పి.జి. చేసేవరకూ ఆగమంటోంది.

మాయింట్లో అందరికీ వాళ్ళవాళ్ళ బళ్ళున్నాయి. టూవీలర్స్. నాకూ స్కూటీవుంది. చూశారుగా ఇంత ఖాళీ స్థలంవుంది! అందరి బళ్ళూ ఇక్కడే పెడతాం. మీవి, మీవారివి, మీ పిల్లల బళ్ళు నాలుగూ కూడా, ఇక్కడే ఇలా ఇక్కడ ఈ మెయిన్ గేటు లోపల ఆరుబయటే పెట్టేసుకోవచ్చు. ఏమీ ప్రోబ్లం లేదు! దొంగ భయం లేదు!”

అప్పుడంది మా ఆవిడ, “అంటే, మీయింట్లో అందరూ ఆడవాళ్ళేనన్నమాట!”

ఆమె సింపుల్­గా, “అవునండీ!” అంది.

“రండి, ఇంటి లోపల కూడా ఎలావుందో చూద్దురుగాని” అని తూర్పువైపు సాగి, మొదట సిటింగ్ రూమ్ కుడి మూలగావున్న డోర్­ తాళం తీసింది. సిటింగ్ రూమ్ లోకి అడుగుపెట్టాక, ఎదురుగా తూర్పువైపు డ్రాయింగ్ హాల్­ తలుపుకీ, ఇటు కుడివైపు దక్షిణం గదికీ, రెండు గదులకీ వేసిన తాళాలు కూడా తీసింది. అన్ని తాళంకప్పలూ, తాళంచెవులూ సిటింగ్ రూంలోని, సెంటర్ టేబుల్­పై పెట్టింది. ఇటు డ్రాయింగ్ హాలు, అటు దక్షిణం గది తలుపులకి, రెండింటికీవున్న గడియలు తీసింది.

డ్రాయింగ్ హాల్లో చివరవరకు నడచి కుడివైపు మూలకి చేరింది. ఆమె వెనకే మేము. డ్రాయింగ్ హాల్లోంచి నడచి చివరికొస్తే, అక్కడ కుడివైపు దక్షిణ దిక్కున ద్వారం ఉంది. ఆ తలుపు గడియ తీసేసరికి ఆశ్చర్యపోయాను నేను! ఎదురుగా నాలుగు అడుగుల వెడల్పు వరండా, ఆ వరండాలోంచి ఎదురుగా దక్షిణ దిక్కున మరో గది తలుపు కనిపిస్తోంది. ఆమె ఒకడుగు అటువేసి చప్పుడయేలా ఆగది తలుపే కాక, ఆమెకి కుడివైపు పడమటి వైపు గది తలుపు గడియ కూడా తీసి, అందులోకి అడుగుపెట్టింది. రూంలోకి వెళ్లాం. పెద్ద గది అది. డ్రాయింగ్ హాలంతవుంది. నేరుగా ఆగదిలో చివరకి కుడివైపు వెళ్లి ఆ చివర్న కుడివైపు గోడకున్న తలుపు లోపలి గడియ తీసేసరికి, ధారాళంగా సిటింగ్ రూంలోంచి వచ్చే వెలుతురొచ్చింది. అప్పుడర్థమయింది నాకు. సిటింగ్ రూంలోంచి ముందు ఆమె తాళం తీసిన కుడివైపు దక్షిణ గదే ఇదనీ! ఇది డ్రాయింగ్ హాలుకి ప్రక్క రూమే కాని, డ్రాయింగ్ రూంతో సంబంధం లేకుండా విడిగావున్న రూమ్ అని.

అలా ఆవిడ ఇల్లంతా చూపిస్తుంటే, నేను శ్రద్ధగా ఏమైనా కొద్దిరోజుల తరవాత, ఈయింట్లోనే కదా నేను తిరిగేదని, ఆ ఇంటి టోపోగ్రఫీని ఆకళింపు చేసుకుంటున్నాను. (అవన్నీ ముందు ముందు జరగబోయే కథలో అవసరం పడతాయి. అందుకే, సవివరంగా వర్ణించబడ్డాయి.)

వెంటనే మా ఆవిడ, “ఏమండీ ఈ గది చూడండి ఎంత విశాలంగావుందో, గాలి వెలుతురూ కూడా ధారాళంగా వస్తున్నాయి! ఇందులో ఈజీగా మనిద్దరి అబ్బాయిల స్టడీ టేబుల్స్, రెండు బెడ్స్ పట్టేస్తాయి. ఇంకో పెద్ద టేబులు, డ్రెస్సింగ్ టేబుల్ కూడా వచ్చేస్తుంది. ఇద్దరి బుక్స్­కి, బట్టలకీ సరిపడా వార్డ్­రోబ్స్ కూడా ఉన్నాయి.” అంది ఆనందంగా!

నేను “ఊఁ” అనేలోగా,

ఇంటావిడ జవాబిచ్చింది.

“అవును! మీ పిల్లలకి ఈ గదే బెస్ట్! వాళ్ళ కాలేజీ ఫ్రెండ్స్ ఎవరన్నా చదువుకోడానికి వచ్చినా, ఇంట్లోవాళ్లకి డిస్టర్­బెన్స్ ఉండదు. వాళ్ళమానాన వాళ్ళొచ్చి వెళిపోతారు.”

తిరిగి మేము వెనక్కి వరండాలోకి నడచి, డ్రాయింగ్ హాల్­కి ఎదురుగావున్న రూంలోకి వెళ్ళేసరికి మా ఆవిడ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయాయి. గబుక్కున, “ఏమండీ ఇదేంటిది! ఇంత పెద్ద గది! ఒక పెద్ద హాలంత ఉంది!” అంది.

ఇంటావిడ సిగ్గు పడింది. “అవునండీ, మాయింట్లో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే ఈ గదీ, డ్రాయింగ్ హాల్లోనే భోజనాలు. నిజానికి, ఇది మావారి చోయిస్! మా బెడ్­రూం!” అని వెనుతిరిగి, వరండా చేరింది.

అప్పుడు ఈగదికి ఎదురుగావున్న డ్రాయింగ్ హాల్లోకి వెళ్ళలేదు. దానికి కుడి ప్రక్క గది తలుపు గడియ తీసింది, వరండాలోంచి. అదీ పెద్దదే! అందులోకి అడుగుపెట్టి మేము చూసేసరికి ఈ చివరనుంచి ఆ చివరవరకు తూర్పు గోడకి ఆనుకుని కిచెన్ ప్లాట్­ఫార్మ్, దాని క్రిందా పైనా, ఆ మూలన, సింక్ వగైరా వగైరా అన్ని అధునాతన సదుపాయాలతో కనిపించింది. మోడ్యులార్ కిచెన్ అది.

“సాధారణంగా డిన్నర్ మేమంతా కలిసే చేస్తాం. ఇక్కడే కూర్చుని తింటాం.” అని చెప్పింది.

తిరిగి మేము వరండాలోకొచ్చాం.

అలా వరండాలోకి వచ్చేసరికి వంటింటికి ఆనుకుని మాకు మరో గది కనిపించింది. అది చిన్నదే!

అప్పుడు ఆమె, “ఈ చిన్నగది దేముడి గది.” అని చెప్పి, అలా వరండాలోనే తూర్పుగా చివరివైపు నడక సాగించింది.

మళ్ళీ చెప్పసాగింది. “ముందు మేము, ఈ పోర్షన్­లోనే ఉండేవాళ్ళం. రేపుదయం మా ఆఖరి ఆడపడచుకి పెళ్లయినా, మాయింటిల్లిపాదికీ, వచ్చేపోయేవాళ్లకి ఇబ్బంది కలగకుండా ఉండాలని, పై పోర్షన్ కట్టించాం.

ఈమధ్యనే పై పోర్షన్­కి మారాం. ఇంకా చిన్నచిన్న మార్పులు అవుతున్నాయి.” అని దేముడి గది ప్రక్క గది దగ్గర ఆగిపోయింది.

“మీకు ఉన్నమాట చెబుతున్నాను. కొందరు ఈయింటి ‘వాస్తు’ బాగులేదన్నారు. ఈ దేవుడి గది ప్రక్కనున్న చిన్న గది స్నానాల గది. దానికానుకునున్న ఆ చివర గది వాష్­రూం. చూశారుగా, ఈ వరండావే ఈయింట్లోవుండే ఏ గదిలోనివారినైనా, వేరే గదిలోని వారితో కలుపుతుంది.

అయితే, అలా ఈ శ్లాబ్ క్రింద ఉన్న ఈ దీర్ఘచతురస్రపు ఇంట్లో ఇక్కడ స్నానాలగది కాని, కమోడ్ కాని ఉండకూడదన్నారు. అప్పుడు మాకు ఒక ‘వాస్తు ఎక్స్­పర్ట్’, అన్నిటికంటే ముందు ఈ వాష్­రూంని తీసేయమని సలహా ఇచ్చాడు. తీయించేశాం. ఈరెండు చిన్నచిన్న రూములు కలిపేస్తే మీరు, స్టోర్ రూంగా ఉపయోగించుకోవచ్చు.

అదిగో వరండాకి ఆ చివర, పెరటి తలుపు కనిపిస్తోందిగా అందులోంచి పెరట్లోకి వెళ్ళి ఎడమవైపు చూస్తే ఆ మూలాన కనిపిస్తుంది మరో బాత్­రూం. అది ముందునుంచేవుంది. దానికి ఆనుకుని వున్న ప్రదేశంలో వాష్ రూమ్ పనులవుతున్నాయి. అక్కడ వెస్టరన్ కమోడ్­ మాత్రమే పెట్టించబోతున్నాం. అని అటువైపు తీసుకెళ్ళింది.

మీకు అర్థమయిపోయింది కదా మా ఇంటి డిజైను! వీధి గేటు తీసుకుని మీరెవరైనా తిన్నగా ఇంట్లోకి దూరిపోకుండా, బండి పెట్టేసి, ఎడమవైపు నడచి, అలా హాలు, వంటిల్లు ప్రక్కలగానున్న ఓపెన్ ప్లేస్­లోంచి కొంచెం దూరంగా విడిగా ఉన్న, ఈ ప్లేస్­కి నేరుగా వచ్చేయవచ్చు. ఇక్కడే కాళ్ళు కడుక్కుని, పెరటి ద్వారం గుండానైనా ఇంట్లోకి చేరవచ్చు. మా ఆడపడచులువాళ్ళు అలాగే చేసేవాళ్ళు. మీయిష్టం!

ఇక్కడే కమోడ్ అవీ సెపరేట్­గా పెట్టించాలి. అప్పుడు ఈయింటికి దోషాలుండవు. మీకేం భయం లేదు! పూచీ నాది!

మేము కూడా ఈ మధ్యనే, పై పోర్షన్ ఫినిషింగ్స్ చేసుకుని, గృహప్రవేశం చేశాం.

ఈ పోర్షన్ కూడా చక్కగా పెయింటింగ్స్ అవీ వేయించి, కొత్త ఇల్లులా చేసి, మీకు అద్దెకిస్తాం.

మీరొచ్చి అడిగినప్పుడు, మీ పిల్లల చదువులని చెప్పినప్పుడు, మీ మాట తీరు, వ్యవహార శైలి చూసి, మంచివాళ్ళనిపించింది.

అందుకే, వెంటనే, అద్దెకిస్తాం అని ఒప్పేసుకున్నాం. ఇంతవరకు మాయిల్లు అద్దెకివ్వలేదు. మాకా ఆలోచనే రాలేదు. మీరే ఓం ప్రథమం!

మీరెన్నాళ్ళు, ఎన్నేళ్ళు ఉండాలనుకుంటే అన్నాళ్ళు, నిరభ్యంతరంగా ఉండండి!”

అని నిజాయితీగా చెప్పిందావిడ.

–-: oo(O)oo :--

ఆ తరవాత కొన్నాళ్ళకి అన్నివిధాలా అద్దిల్లు సిద్ధం అయిపోవడంతో, మంచిరోజు చూసుకుని దిగిపోయాం.

దిగిన తరవాత కానీ, మాకాయింట్లో దెయ్యాలున్నాయని అనుమానం రాలేదు!

ఉన్నట్టుండి, ఏ అర్ధరాత్రో, లక్షాధికారి సినిమాలోలాగా, గుడ్లగూబలు కనిపించేవి కావు, నక్కల ఊళలు వినిపించేవి కావు, కానీ ‘టక్ టక్’ మని చప్పుడు చేస్తూ, ఎవరో చెక్క కాలుతో పై పోర్షన్­లో నడచిన శబ్దం నా చెవులకి స్పష్టంగా వినిపించేది.

పిల్లలిద్దరూ వారి ముందు గదిలో పడుకునేవాళ్ళు. వాళ్ళని, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి కుమ్మించినట్టు, ఏనుగులతో కుమ్మించేసినా, తెలివి రాదు. అంత మొద్దు నిద్ర వాళ్ళది.

మేమిద్దరం మాష్టర్ బెడ్­రూంలో పడుకునేవాళ్ళం.

ఈవిడదీ, అంతే! పాపం! బండెడు చాకిరీ నిర్విరామంగా చేసి, అలసిపోయి, ఎప్పటికో పడుకుంటుందేమో, మధ్యలో లేవదు.

నాదే సున్నితమైన నిద్ర! ఏమాత్రం చీమ చిటుక్కుమన్నా తెలివొచ్చేస్తుంది.

ఒకరోజు, ఆ లక్షాధికారి ‘టక్ టక్’లు మరీ ఎక్కువయాయి. మాటిమాటికీ వినిపించడం మొదలయ్యాయి.

ఇక భరించలేక మా ఆవిణ్ణి లేపాను. విషయం చెప్పాను.

“పొండి! ఏ ఎలకలో, పందికొక్కులో అయుంటాయి. ఎక్కువ ఆలోచించక కళ్ళుమూసుకుని పడుకోండి.” అని కసిరేసింది.

అంతే! మళ్ళీ ‘టక్ టక్’ మని లక్షాధికారి చెక్క కాలు శబ్దం వినిపించడంతో, ఆమె కూడా, “నిజమేనండి! ఇది పందికొక్కులది కాదు. ఉండండి. రేపు వదినగార్ని, అడుగుతాను, ఏవో చప్పుళ్ళొస్తున్నాయి. ఏమిటవని?” అని చెప్పేసి, ముసుగుతన్నేసింది.

నాకు చాలాసేపు నిద్ర పట్టలేదు. “కొంపదీసి దయ్యమా! దయ్యాలున్నాయా ఈయింట్లో! అందుకే ఇంత చవగ్గా ఇచ్చేశారా!” అని అనుమానం వేసింది.

“ఆఁ! దయ్యాలుంటే మాత్రం, మనకేం! అవి ఉన్నది పై పోర్షన్­లో కదా! వాళ్ళే దయ్యాలతో సహజీవనం చేస్తారు, మనకేల!” అని దులిపేసుకున్నాను.

–-: oo(O)oo :--

మర్నాడు సాయంత్రం నేనాఫీసునుంచి వచ్చేసరికి మా ఆవిడ దయ్యం సంగతి తేల్చేసింది.

“ఏఁవండీ! ఇంటిగలావిడ, ‘అయ్యో! మీ నిద్ర పాడయిందా! సారీ అండీ! మా అత్తగారికి నిన్నరాత్రి కడుపు పాడయింది. అందుచేత అన్నిసార్లు మీకు శబ్దాలు వచ్చివుంటాయి. ఆమెకు ఒక కాలు అవుకు. ఒక పెద్ద కఱ్ఱ ఊతతో నడుస్తారు. అదే మీకు ‘టక్ టక్’ మని లక్షాధికారి సినిమాలోలా వినిపించివుంటుంది.’ అని చెప్పిందండీ. నేను చెప్పలా, దెయ్యాల్లేవు! భూతాల్లేవని! ఏమున్నా, ఇక్కడే ఉందాం! ఇంత చౌకగా అద్దెకి ఈ చుట్టుపక్కల మరో ఇల్లు దొరకదు.” అని తేల్చి పారేసింది.

“సరేలే! లక్షాధికారేనని తేలిందిగా, మనిషేగా! ఫరవాలేదు!” అని ఊపిరి తీసుకున్నాను.

అయితే ఆ ఆనందం ఎన్నో రోజులు మిగలలేదు! ఊపిరి సలపకుండా చేసింది.

--: oo(O)oo :--

ఒకరోజు ఉదయం కూడా స్పష్టంగా ‘టక్ టక్’మని కఱ్ఱ చప్పుడు వినిపించడంతో, మా ఆవిడ నాతో, “ఏఁవండీ, మీ లక్షాధికారి దెయ్యం!” అంది నన్ను ఆటపట్టిస్తూ.

అప్పుడు మా అబ్బాయిలిద్దరూ, “దెయ్యం ఏంటమ్మా?” అనడిగారు.

“కుంభకర్ణుల్లారా! అలా నిద్రపోతూవుంటే, మీకేం తెలుస్తుంది, ఆ దెయ్యం మజా ఏంటో! నేనయితే ఒక్కసారే అనుభవించాను. భలే అనిపించింది. మీ నాన్నగారయితే రాత్రంతా ఆ దెయ్యం మ్యూజిక్­ని ఆస్వాదిస్తూనేవున్నారు. అతన్నే అడగండి, బాగా వర్ణించి చెప్తారు, అతను పడిన టెన్షన్!” అంది, నావైపు నవ్వుతూ చూస్తూ.

నాకొళ్ళుమండింది. అణచుకున్నాను.

“నేను పడిన ఆందోళనని కూడా ఎంజాయ్ చేశావుగా, మరిన్ని కలిపించి, నువ్వే బాగా చెప్పగలవు. నువ్వే చెప్పు, మీ అబ్బాయిలకి.” అన్నాను ఉడుక్కుంటూ.

ఆమె జరిగిందంతా వివరంగా ఒక్కొక్క దృశ్యం కళ్ళకి కట్టినట్టు చెప్తుంటే, ముగ్గురూ అది విని తెగ నవ్వుకున్నారు.

అప్పట్నుంచి, పై పోర్షన్నుంచి ఏమాత్రం సౌండ్ వచ్చినా, “నాన్నగారూ, లక్షాధికారి!” అనడం మొదలెట్టారు.

మరికోద్దిరోజుల్లోనే మరో దయ్యం కథ మొదలయింది.

ఒకరోజు మా ఆవిడ, “ఏఁవండీ! నేను వంటలో నిమగ్నమయివుంటే, మన వంటింటి పక్కనుంచి ఎవరో తెల్ల డ్రెస్­లో అటువైపు ఆమూలనున్న బాత్రూం వైపు వెళ్ళినట్టయింది. నాదృష్టి ఇటు ప్లాట్­ఫార్మ్ వైపుండడం వల్ల ఎడమవైపు ఉత్తరం వైపు కిటికీవైపు క్రీగంట చూశానేమో, ఎవరో సరిగా తెలియలేదు. సరే! మీరే అయివుంటారు. మీకే కదా, నేరుగా అక్కడికెళ్ళి కాళ్ళు కడుక్కునే అలవాటు. ఇంక ఇంట్లోకి వస్తారని చూస్తే, ఎంతకీ రాలేదు. అప్పుడు గుర్తొచ్చింది, మీరివాళ్ళ వైట్ షర్ట్ కాదు కదా, వేసుకున్నది! అని. నాకొక్కసారి ఒళ్ళు జలదరించింది.” అని గుండెలమీద చెయ్యి వేసుకుంది.

“నీ మొహం! ఏ ఆరవేసిన చీర ఎగిరిందో, ఏ తెల్ల కుక్క వీధి గేటు తీసివుంటే లోపలకి దూరిందో, ఇంకేదో అయివుంటుందిలే. అలా కంగారుపడిపోకు!” అని కొట్టిపారేశాను.

మరో రోజు, “మీరేంటండీ, ఇలా! ఆడవాళ్ళు ఇంట్లోకి అడుగుపెడుతూనే కట్టుకున్న బట్టలు గబగబా విప్పిపారేసి, బూబుల్లా మాక్సీల్లోకి దూరిపోయినట్టు; అంత వేగం డ్రెస్ మార్చేసి ఇలా తెల్ల పైజామా కుర్తా ధరించేస్తారు. హడలి చస్తున్నాను! మీరో, ఇంకెవరో తెలీక!” అంది.

నేను విచిత్రంగా ఆమెవైపు చూశాను. “ఇదేంటిది, ఇవాళ్ళ కొత్తగా మాట్లాడుతున్నావు. ఎన్ని దశాబ్దాలనుంచో నా అలవాటు అదేకదా! నీకు తెలియందేముంది! కొత్తగా ఇప్పుడు జడుసుకుంటున్నానంటావేంటి?” అనడిగాను.

అప్పుడు చెప్పింది. “అది కాదండీ! ఈమధ్య మనింటి చుట్టూరా ఆవరణలోనే కాదు, పిల్లల రూంలోంచో, డ్రాయింగ్ హాల్లోంచో మీలాగే తెల్లని పైజామా కుర్తాలో ఒక వ్యక్తి ఈ వరండాలోకి వచ్చి, ఇదేదో వాడి బాబుగారిల్లులా, నడుస్తున్నట్టు; ఒక్కొక్కసారి నేను వంట చేసుకుంటుంటే, చొరవగా గుమ్మం దగ్గర నిలబడి నన్ను చూసినట్టు అనిపిస్తోంది. ధైర్యం చేసి నేనటు చూస్తే, ఎవరూ కనబడరు!”

“వాడెవడో మన బెడ్­రూంలోకి కూడా వస్తున్నాడా! నిన్ను పిలుస్తున్నాడా!” అన్నాను, పరాచికాలాడుతూ.

“నేనిక్కడ భయంతో వణకిపోతుంటే, మీకేమో జోకులావుందేం!” అంది చిరుకోపం ప్రదర్శిస్తూ.

అప్పుడు అనునయంగా, “నీకు ‘అనిపించింది’ అన్నావే కాని, ‘కనిపించింది’ అనలేదు. ‘తీరా చూస్తే ఎవరూ లేరు!’ అని నువ్వే చెప్పావుగా. అది నీ భ్రమ! భ్రమే అయివుంటుంది. భయపడకు! ఇంటిగలవాళ్ళకిగాని, వేరెవరితోగాని చెప్పకు. ఈయింట్లో దయ్యాలున్నాయని మనం ఏదో దురాలోచనతో ప్రచారం చేస్తున్నాం అని అపోహపడతారు. అలాగే ఏ విషయం నిర్ధారణ అయేంతవరకు, పిల్లలకి కూడా చెప్పకు. అనవసరంగా జడుసుకుంటారు. లేకపోతే, లక్షాధికారి కాలులా నిన్నూ నన్నూ ఆటపట్టిస్తారు. ఈసారి మళ్ళీ అలాటి అనుభవం ఏదయినా జరిగితే, వెంటనే నాకు చెప్పు. మనిద్దరం కలిసి అదేదో తేల్చుకుందాం. ఆతరవాత అవసరమయితే, ఇతరులతో పంచుకుందాం. లేకపోతే లేదు. మనలోనే సమాధి అయిపోతుంది.” అన్నాను.

ఆవిడ గుండె దిటవు చేసుకుని. సరేనన్నట్టు తలూపింది.

మరొకరోజు ఆఫీసునుంచొచ్చి, యథాప్రకారం బట్టలు మార్చుకుని, డ్రాయింగ్ హాల్లో పడమటి దిక్కుకి అభిముఖంగా కూర్చుని సిటింగ్ రూం గోడవైపున్న టి.వి. చూస్తున్నాను. ఈలోగా ఎవరో తెల్ల పైజామా కుర్తాలో వరండాలోంచి మా పిల్లల రూంలోకి వెళ్ళినట్టయింది, నాకు. వెంటనే నేను లేచి, వాళ్ళ రూంలోకి వెళ్ళబోయాను.

ఈలోగా మా ఆవిడ వంటింట్లోంచి ఎవరో తరుముతున్నట్టు హాల్లోకి వచ్చింది. నన్ను చూసింది.

“ఓ మీరేనా! పైజామా కుర్తాలో ఎవరో అటొచ్చి తొంగి చూసినట్టయింది. ఇంకా ఎవరో అని హడలి చచ్చాను! ఎప్పుడొచ్చారు ఆఫీసునుంచి? నేను చూడనే లేదు! అప్పుడే, రావడం, బట్టలు మార్చుకోవడం కూడా అయిపోయిందా! అయినా అలా తొంగి చూడ్డం ఏంటి, ఎప్పుడూ లేనిదీ, కొత్తగా!” అంది.

‘నేను కాదు!’ కానీ ఆమాట ఆమెకి చెప్పలేదు. ఆమెకేం సమాధానం చెప్పకుండా, చిన్నగా ఒక వెఱ్ఱి నవ్వు నవ్వాను.

ఆమె అక్కణ్ణుంచి తిరిగి వంటింట్లోకి వెళిపోయింది.

‘ఎవరయి ఉంటారు?

తేల్చుకోడానికి పిల్లల రూంలోకి వెళ్ళాను. ఆశ్చర్యం! పిల్లల గది వీధివైపు తలుపు, వేసేవుంది. లోపల్నుంచి గడియపెట్టేవుంది. గదిలో ఎవరూ లేరు.

ఈలోగా ఎవరో కాలింగ్ బెల్ కొడితే, పిల్లల రూంలోంచి సిటింగ్ రూంలోకి వెళ్ళి, వీధి తలుపు తీశాను. ఎవరో దంపతులు. అతన్ని ఇక్కడే ఎక్కడో చూసినట్టుంది, కాని ఆవిణ్ణి చూసినట్టు లేదు.

మర్యాదగా, “రండి! కూర్చోండి.” అని లోపలకి ఆహ్వానించాను. “మా ఆవిణ్ణి పిలుస్తాను.” అని పిల్లల రూంలోంచి వంటింట్లోకి వెళ్ళాను. అప్పటికే ఆమె డ్రాయింగ్ హాల్లోంచి వెళ్ళి తలుపు తీసుకుని సిటింగ్ రూంకి చేరిపోయింది. “ఏఁవండీ ఇలా రండి. వదినగారూ, అన్నయ్యగారూ వచ్చారు.” అని అక్కడ్నుంచే కేక వేసింది.

నేనక్కడకి చేరి వాళ్ళతోపాటు కూర్చోగానే, మా ఆవిడ, “మనవాళ్ళే! ఈ ప్రక్క వీధిలోనేవుంటారు.” అని పరిచయాలు చేసింది.

అప్పుడు అతను, “మేమో ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాం! మా చెల్లాయివాళ్ళ ఇల్లు అద్దెకుంది. ఈ మధ్యనే ఖాళీ అయింది. పెయింటిగ్స్ అవీ చేయించి, కొత్త ఇల్లులా ముస్తాబు చేయించాం. మనవాళ్ళెవరైనా, మంచివాళ్ళకి, అద్దెకివ్వాలని మా చెల్లాయి ఉద్దేశం. వాళ్ళీవూళ్ళోవుండరు. ఆయిల్లు నా ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఈయిల్లంత పెద్దది కాదు. కానీ, అదీ టూ బి.హెచ్.కే.వే.” అని ఇక మిగిలింది నువ్వు చెప్పన్నట్టు, అతని భార్యవైపు చూశాడా వచ్చిన అతను.

ఆమె, “అవునండీ. మిమ్మల్ని మా వీధిలో పేరంటానికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి పరిచయమయినప్పటినుంచే మీమీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడిపోయింది. దానికి తోడు, మావీధిలో ఎప్పుడు ఎవరింట్లో లలితాసహస్రం పెట్టినా, మీరు మాత్రం నాలాగే ఠంచనుగా హాజరవుతుంటారు. మీరు మాయింటి ప్రక్కకే వచ్చేస్తే, నాకూ బాగుంటుందని అనిపించింది. ఈయిల్లంత విశాలంగా లేకపోయినా, మీరు చూశారుగా, చుట్టూ పూలమొక్కలతో, జామి, నిమ్మ, దానిమ్మలాటి ఫలవృక్షాలతో, ఇండివిడ్యువల్ హౌస్, మీరొకసారి చూసి “అబ్బా! ఎంత బాగుందో! ఈయిల్లు.” అని మెచ్చుకున్న మాయింటి ప్రక్క ఇల్లే! అద్దె మీరిప్పుడెంత ఇస్తున్నారో అంతే! ఎక్కువేం కాదు! ఆలోచించుకోండి. మీరెప్పుడొచ్చి దిగుతామన్నా ఫరవాలేదు! ఆలోచించుకుని రేపు చెప్పండి. మీరు ఓ.కే. అంటే, మీరిక్కడ ఖాళీ చేసి వచ్చేంతవరకు ఆగుతాం. మరొకరికి చెప్పం. అలాక్కాదు. మీకక్కర్లేదు. ఇక్కడే ఈయింట్లోనేవుంటాం అంటే, అప్పుడే మరొకర్ని చూస్తాం! మా పొరుగున మీరుంటే బాగుంటుందని నా ఆశ! ఏ విషయం రేపు చెప్పండి ఫరవాలేదు!” అని చెప్పింది.

మా ఆవిడ నావంక ‘ఏఁవంటారు?’ అన్నట్టు, చూసింది.

“చాలా సంతోషం! మీరే స్వయంగా వచ్చి చెప్తుంటే, ఇంకేం కావాలి! మా ఆవిడకి ఆల్­రెడీ నచ్చేసిందని చెప్తుంటే, ఇంకేముంది. అలాగే తప్పకుండా ఈయిల్లు ఖాళీ చేసేసి, ఈవారంలోనే మీయింట్లో దిగిపోతాం. ఇవాళే మాయింటివాళ్ళకా సంగతి చెప్పేస్తాం.” అని మరొక్క క్షణం ఆలోచించకుండా చెప్పేశాను.

వాళ్ళ ముగ్గురి మొహాలు వెలిగిపోయాయి.

నేను మనసులోనే, ఈ దయ్యాల గోల ఇంతవేగం వదిలిపోతోందని, దేముడికి థాంక్స్ చెప్పుకున్నాను.

--: oo(O)oo :--

ఆరోజు రాత్రి, ప్రతిరోజులాగే, వీధి తలుపు తాళం, లోపల్నుంచి సిటింగ్ రూంలోంచి వేసేశాను. డ్రాయింగ్ హాల్లోకి వచ్చి సిటింగ్ రూమ్ వైపు తలుపులు మూసి గడియ పెట్టేశాను. వంటిల్లు, వరండాలలోని అన్ని లైట్లు, ఫ్యాన్లు ఆర్పేశాను. పెరటి తలుపు గడియ వేసేశాను. వరండాని కలిపే మిగిలిన గదుల తలుపులన్నీ తీసేవుంచాను. పిల్లల రూంలోకి తొంగి చూశాను. వాళ్ళిద్దరూ ఇంకా పడుకునే కబుర్లు చెప్పుకుంటూ నిద్రకుపక్రమిస్తున్నారు. వారి గదిలో లైట్లు నన్నార్పేయమన్నారు. అలాగే చేశాను. చివరికి మా బెడ్­రూంలో లైటు సహితం ఆర్పేసి పడుకున్నాను.

ఒక అర్ధరాత్రి, టి.వి. సౌండ్­కి తెలివొచ్చింది, నాకు. ఈ గాడిదలిద్దరూ నిద్రపట్టక హాల్లోకి వచ్చి, ఏ ఇంగీషు క్రైం థ్రిల్లరో చూస్తున్నారేమో! అనుకున్నాను. వాళ్ళతో, ‘మాకు డిస్టర్­బెన్స్ అవకుండా, మీరు కొంచెం ఆ టి.వి. వాల్యూం తగ్గించండిరా. డ్రాయింగ్ హాల్ తలుపు వేసుకుని, ఆ సినిమా ఏదో చూసుకోండ్రా!’ అని చెప్దామని తలచి అటు వెళ్ళాను.

అక్కడ టి.వి. మ్రోగుతోంది. హాల్లో లైటు వేసేవుంది. హాల్లో నేలమీద పడుకుని నిద్రలోనో, దీర్ఘనిద్రలోనో పడివున్న ఒక యువకుడు తెల్లని పైజామా కుర్తాలో కనిపించి గుండె గుభేలుమంది! బిక్కచచ్చిపోయాను!

క్షణం చలనం లేకుండా, అక్కడ పడివున్న శాల్తీలాగే అయిపోయాను.

ఎప్పుడు తేరుకున్నానో, ఎలా మా రూంలోకి వచ్చానో, మంచంమీద వాలానో, నాకు స్పృహలేదు!

తెలతెలవారుతుండగా తెలివి వచ్చింది.

ఎలాగో ధైర్యం చేసుకుని మంచంమీంచి లేచాను. మా గదిలో లైటు వేశాను. మా ఆవిణ్ణి లేపాను.

ఆమె, టైము చూసుకుని, “ఏంటండీ ఇప్పుడే లేపేశారు? మరో అరగంట పడుకోవచ్చుగా!” అంది, అయిష్టంగా లేస్తూ.

“ఏం లేదు. నిద్ర తేలిపోయింది. కొంచెం కాఫీ వేగం తాగాలనిపించింది.” అని చెప్పాను. అంతేగాని, రాత్రి నేను చూసిన దృశ్యం, హడలి చచ్చిన సత్యం, చెప్పలేదు.

ఆమె లేచి వెళ్తుంటే, ఆమె వెనకే నేను బెరుకు బెరుకుగా కదిలాను. వరండాలోకి చేరాక, ఎక్కడలేని ధైర్యం తెచ్చుకుని అటువైపు, ఆ హాలువైపు చూశాను. టి.వి. కట్టేసేవుంది. లైటు ఆర్పేసేవుంది. పైజామా కుర్తా శాల్తీ లేడు! మాయం!!

అయితే, అదంతా నా ‘భ్రమా!’ అనిపించింది. 'కాదు!' నమ్మశక్యం కాలేదు! నేను చూసింది కళ్ళారా నిజం! అని నా మనసు చెప్తోంది.

మా ఆవిడతో పాటే మొహం కడుక్కుని, ఆమెతోపాటే వంటింట్లో కాఫీ తాగుతూ అడిగాను. “ఈ అడ్డగాడిదలిద్దరూ నిన్నరాత్రి కాని, మనం నిద్రపోయాక, టి.వి. చూశారా?” అని.

“ఏమో! నాకేం తెలుసు! వాళ్ళనే అడగండి.” అంది.

తరవాత, వాళ్ళు లేస్తూనే అడిగాను. “లేదు! మీరొచ్చి చూశారుగా! అప్పుడే అలా మాట్లాడుకుంటూ నిద్రలోకి జారిపోయాం.” అన్నారు వాళ్ళిద్దరూ.

“సరే! ఇవాళ మీరిద్దరూ కాలేజీకి వెళ్ళకండి. మనం ఈరోజే, ఇప్పుడే ఈయిల్లు ఖాళీ చేసేస్తున్నాం. ప్రక్కవీధిలో ఇంటికి మారిపోతున్నాం. గబగబ అన్నీ ఎరేంజ్ చెయ్యండి.” అని చెప్పి పైజామా-కుర్తాలోనే ఆవిషయం చెప్పడానికి ప్రక్కవీధికి వెళ్ళాను.

మా ఆవిడ వెనక నుంచి, “అలాగే ఇవాళే ఖాళీ చేసేద్దాం కానీ, అంత తొందరేమొచ్చిందండీ! అలా పరుగులు పెడుతున్నారు?” అని అరుస్తున్నా, వినిపించుకోకుండా మలుపు తిరిగాను.

--: oo(O)oo :--

అలా మేము వెంటనే, కొత్తింటికి మారిపోయాం.

ఆ తరవాత మా కొత్త పక్కింటావిడ ఒకసారి మాయింటికొచ్చినప్పుడు, మాటల్లో, మా ఆవిడతో, “మీరింతకుముందు అద్దెకుండే ఇంట్లో కంప్యూటర్ ఇన్­స్టిట్యూట్ ఉండేది తెలుసా?” అనడిగింది.

“ఇక్కడేం నడుస్తుంది నా మొహం! ఇంకా, ఏ భిలాయి సెక్టర్­­లోనో అయితే నడుస్తుంది గాని!” అని సాగదీసింది మా ఆవిడ.

నేను ప్రక్క రూంలోనుండి, కుతూహలంగా వీరి మాటలు వినసాగాను.

“మరేం! అందుకే దివాలా తీసింది కాబోలు! మీరన్నంత వరకు, నాకీ ముక్క తట్టలేదు సుమీ! అప్పటికీ మొదట్లో బానే నడిచింది.

మొదట్లో డ్రాయింగ్ హాల్లోనే ఉండేది. అప్పుడు లోన్ తీసుకుని రెండే కంప్యూటర్లతో మొదలెట్టాడు, ఆ అబ్బాయి. క్లాసులు కూడా తీసుకునేవాడు. అప్పటికే మీ పాతింటిగలవాళ్ళు, పై పోర్షన్ కట్టడం ఆరంభించారు. పై పోర్షన్ పూర్తవగానే, మొత్తం కుటుంబం అంతా ఆ పోర్షన్­లోకి మారిపోయారు. అప్పుడు, ఈ కుర్రాడు, మీ అబ్బాయిలు పడుకుండే వారుగా, ఆ గది కూడా కంప్యూటర్ ­­ఇన్­స్టిట్యూట్­కోసం ఉపయోగించడం మొదలెట్టాడు. ఇతడి అభివృద్ది చూసి, బ్యాంకు వాళ్ళు కూడా మొదట్లో కంటే, భారీగా లోన్ ఇచ్చారు.”

“అదేంటి? వీళ్ళకే ఇల్లు సరిపోదని పై పోర్షన్ కట్టించుకుంటుంటే, ­­ఇన్­స్టిట్యూట్­కి అద్దెకివ్వడమేంటి నా మొహం! అయినా, ఆవిడ, ఆ పోర్షన్ మొదటిసారిగా అద్దెకి, మాకే ఇస్తున్నామన్నారే! అంటే అబద్ధం చెప్పిందా! అలాటావిడ అనిపించదే ఆవిడ!” అంది, అయోమయంగా.

“ఆవిడేం అబద్దం ఆడలేదు. అతడికి అద్దెకేం ఇవ్వలేదు. ఊరికినే ఇచ్చింది. స్వంత మరిది కదా ఆమాత్రం చెయ్యొద్డా?”

ఆమాటకి నేను తుళ్ళుపడ్డాను. అక్కడ హాల్లో మా ఆవిడ కూడా పడుంటుంది.

“ఆఁ! ఆవిడకి మరిది కూడా ఉన్నాడా? ఆడపడచుల సంగతీ, అవే, చెప్పింది కానీ, ఎప్పుడూ మాట వరసకైనా మరిది సంగతి చెప్పలేదే! అయితే, ఇంట్లో మగాళ్ళు మీవారొక్కరేనా? అన్నప్పుడు కూడా, ‘ఆఁ’ అందీ!” అంది అనుమానంగా.

“అదేమో పాపం! ఎందుకు చెప్పలేదో! తీరా చెప్తే, మళ్ళీ మీరు ఆమెని ప్రశ్నల మీద ప్రశ్నలు వెయ్యడం, వాటన్నిటికీ ఆమె సమాధానాలు చెప్పలేక, బాధపడ్డం! అవన్నీ ఎందుకులే! అని, మీకు చెప్పలేదేమో! ఎవరికి తెలుసూ!” అంది, జాలిగా.

“ఏమైంది?” అనడిగింది మా ఆవిడ.

కొత్త పక్కింటావిడ, మా ఆవిడ గుచ్చి గుచ్చి అడుగుతుందనీ, అన్నీ బాగా ఎక్కపీకుతుందనీ భలే గ్రహించేసింది! అయినా పాపం! అన్నీ చెప్పేస్తోంది. నాక్కూడా అసలేం జరిగిందో తెలుసుకోవాలని ఉంది. అందుకే, నా చెవులు రిక్కించాను.

“మరేమైందో, ఎలా దివాలా తీసిందో? తీసింది!”

“అయ్యో పాపం!” అని మా ఆవిడ జాలి పడింది.

“మరేం! బ్యాంకు అప్పు తీర్చలేకపోయాడు. ఇన్­స్టిట్యూట్ సామాన్లనీ, కంప్యూటర్లనీ, ఫర్నీచర్నీ అన్నిటినీ బ్యాంకు వాళ్ళు వేలం వేస్తారేమోనని భయం పట్టుకుంది. అయినవాళ్ళకి చెప్పుకోడానికి, ఆత్మాభిమానం అడ్డొచ్చింది కాబోలు. అవమానం భరించలేనని తలచాడు!”

“ఏం చేశాడు!” అని ఉద్విగ్నతతో అడిగింది.

“ఏం చేస్తాడు! పాపం పోయాడు! పోయి, అట్టే రోజులవలేదు! ఇంకా సంవత్సరికాలు కూడా కాలేదు. చెట్టంత మనిషి, రేపో మాపో పెళ్ళి కావలసిన వాడు! పాపం! అర్థాంతరంగా పోయాడు.” అన్నారు.

“ఎలా పోయాడు?” అని మా ఆవిడ అడిగితే,

“ఆత్మహత్య చేసుకున్నాడు!” అని చెప్పిందావిడ సింపుల్­గా.

ఆవిడలా సింపుల్­గా చెప్పేయడంతో అసంతృప్తిగా అనిపించింది, నాకు. అతడెలా పోయాడో వివరంగా చెప్తే బావుణ్ణనుకున్నాను.

ఇంతలో, మా ఆవిడే మళ్ళీ ప్రశ్నించింది.

“ఎలా పోయాడు? శివ్­నాథ్ నదిలో దూకేశాడా? లేక రైలు పట్టాలు దగ్గరలోనే ఉన్నాయికదా అని, ఏ రైలు క్రిందో పడిపోయాడా? భయంకరంగా ఉరి పోసేసుకున్నాడా?” అని ఎన్ని రకాల ఆత్మహత్య చేసుకోవచ్చో రీసెర్చి చేసినదానిలా, ఆవిడని చెప్పనీయకుండా, అనర్గళంగా చెప్పుకుపోతుంటే ఇక్కడ నాకు ఒళ్ళుమండిపోతోంది. ‘నువ్వు నోరు మూయవే తల్లీ! అప్పుడు ఆమె చెప్తుంది.’ అని నేను తల్లడిల్లిపోతున్నాను.

ఈవిడ ప్రవాహం ఆపదని గ్రహించిందో ఏమో మరి, పక్కింటావిడ, మా ఆవిడ ప్రశ్నల ప్రవాహంలోనే, గబుక్కున “విషం తాగి!” అని చెప్పేసి, టక్కున మా ఆవిడ నోరు మూయించింది.

‘ఎప్పుడు? ఎక్కడ? ...’ అనే ప్రశ్నలు నా మెదడులోనే కోకొల్లలు ఉదయించసాగాయి. ఇంక మా ఆవిడ బుఱ్ఱలో ఎన్నొచ్చివుంటాయో!

ఆవిషయం పక్కింటావిడకీ తట్టింది కాబోలు, మా ఆవిడకి మరో ప్రశ్నకి తావు ఇవ్వకుండా, ఆమే,

“ఒకరోజు రాత్రి విషం తాగి, మీరున్న పోర్షన్­లోని హాల్లోనే టి.వి. ఆన్ చేసివుంచి, లైటు వేసుకునేవుంచీ పోయాడు. పొద్దున్నవరకు ఎవరికీ అనుమానం రాలేదు. పొద్దున్నయిన చాలాసేపటి వరకూ, ఇతడు పై పోర్షన్­కి రాకపోయేసరికి, క్రిందకి వచ్చి చూశారు. ఇంకేముంది పాపం! ప్రాణాలే పోయాయి!” అనేసరికి నాక్కూడా నా పై ప్రాణాలు పైనే పోయాయి.

మా ఆవిడకి వచ్చిందో లేదో గాని, నాకు మాత్రం ఒక పక్కనుంచి వణుకొస్తున్నా, మరో పక్కనుంచి పైజామా కుర్తా సంగతి తెలుసుకోవాలనే జిజ్ఞాసతో చచ్చిపోతున్నాను, నేను. మా ఆవిడ ప్రశ్నించడం లేదు.

ఇంతలో, పక్కింటావిడే, నా మనసు గ్రహించినట్టు,

“ఎప్పుడూ 24 గంటలూ తెల్లటి పైజామా-కుర్తాల్లోనే ఉండేవాడు, మీవారిలాగే. బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే ప్యాంటు షర్టు వేసుకునేవాడు. ...” ఇంకా ఏమేమో చెప్తోంది.

అవతల మా ఆవిడ నోట మాట రావటం లేదు. బిక్కచచ్చిపోయివుంటుంది.

నాకసలు కాళ్ళూచేతులూ ఆగటంలేదు. కరెక్టే. ఆడటం లేదు కాదు! ఆగటంలేదు. వణుకుతూనేవున్నాయి. నా పైజామా-కుర్తా తడిసిపోతున్నాయి, చెమటతో.

అంటే ... అంటే ... నేను చూసింది దయ్యాన్నా! మా ఆవిడదీ, నాదీ భ్రమ కాదా!

ఇప్పుడేం చెయ్యాలి?

అలా స్తబ్దుగా చాలాసేపు కూలబడ్డాక, సర్దుకున్నాను. నేను చూసినది ఎవరికీ ఎప్పటికీ చెప్పకూడదనుకున్నాను. ఇప్పటివరకూ చెప్పలేదు.

ఇప్పుడుకూడా చెప్పలేదు.

రాస్తున్నాను.

మెల్లిగా లేచి హాల్లోకి వెళ్ళాను. పక్కింటావిడ ఎప్పుడు వెళిపోయిందో తెలీదు.

మా ఆవిడ గుడ్లు పెద్దవి చేసుకుని కళ్ళార్పకుండా దిగ్భ్రమలో అచేతనంగా, అలాగే సోఫాలో కూర్చునివుంది. నేనామె దగ్గర నింపాదిగా కూర్చొని, దగ్గరకి తీసుకున్నాను. ఆమె వీపుపై సాంత్వనగా నా అరచేయిని దొప్పలా చేసి కొడుతూ ఊరడించాను.

ఆమె, నా భుజం మీద అలా తన తలనాన్చి భయకంపిత స్వరంలో, అపనమ్మకంతో, “ఏఁవండీ మనమిన్నాళ్ళూ ఒక దెయ్యంతో ఉన్నామండీ! మన పిల్లలకేమైనా అయివుంటే! తలచుకుంటేనే భయమేస్తోందండీ!” అంది.

నేను దృఢంగా, “అవును! ఇన్నాళ్ళూ మనం ఒక దయ్యంతో సహజీవనం చేశాం! కానీ ఏ హానీ జరగలేదు!

దయ్యానికి మన మంచితనం చూసి, మనల్ని వేధించ బుద్ధి కాలేదు.

తన మానాన తనుంది.

తన జాగాలో, మన మానాన మనల్ని, ఉండనిచ్చింది.

ఎంత మంచి విశాల హృదయమో చూశావా, ఆ దయ్యానిది!

మనం భయపడాల్సింది నిజంగా గాలిలో కలిసిపోయిన దయ్యాలతో కాదు.

గాలిలో కలవకుండా, మనతోనే, మన జాగాలోనే ఉంటూ, మనతోనే సహజీవనం చేస్తూ, మనల్నే ఎప్పుడు ఎక్కడ ఎలా మట్టుబెట్టేద్దామా, ఎలా కొరుక్కుతినేద్దామా, ఇంకా ఎలా హింసిద్దామా అని చూసే మనలాటి రక్తమాంసాలతో, ప్రాణాలతో మనతోనే తిరుగుతూ, అదనుకోసం పొంచివున్న అసలుసిసలైన దయ్యాలతో, పిశాచాలతో, పాషాణ హృదయాలతో.” అన్నాను.

అప్పుడామె, విడివడి, “ఏఁవండీ, నేనోమాట చెప్పనా!” అనడిగింది, మెల్లగా, సౌమ్యంగా.

“చెప్పు!” అన్నాను, చల్లగా.

“మనం ఇంటావిడ మరిది ఆత్మని చూశామని ఎవరికీ చెప్పొద్దండీ! ముఖ్యంగా మన పిల్లలకి! వాళ్లకి కూడా అప్పుడప్పుడు అలా అనిపించినా, మీరే అయుంటారని, వాళ్లకి వాళ్ళే సర్దిచెప్పుకున్నారు. అది అలాగే ఉణ్ణీండి.

అలాగే, ఆయింట్లో చూశామని అస్సలు చెప్పొద్దండీ!

అంత మంచివాళ్ళు! మన మాటల వల్ల, వాళ్ళింట్లో దయ్యాలున్నాయనే మాట ప్రచారమవడం నాకిష్టం లేదండీ.

ఆ అబ్బాయి ఎంత మంచివాడు కాకపోతే, అతడి ఇన్­స్టిట్యూట్ మీద, ఎంత ప్రీతి లేకపోతే, ఇంకా ఆ జాగాని పట్టుకువేళ్ళాడుతున్నాడో చూడండి, పాపం!

తన కుటుంబం కోసం అన్నకీ, వదినకీ చేదోడుగా ఉండాలని తను పట్టుదలతో కృషి చేస్తే, అది ఫలించక వారిని మరింత ఆర్థికంగా దిగజార్చాల్సిన పరిస్థితి వస్తుందేమోనని భయపడి, తన అసమర్థత వలన కుటుంబ పరువు పోతుందేమోనని విలపించి, వాటికంటే తన ప్రాణం ఏమీ విలువైనదికాదని తృణప్రాయమైనా కాదని, తన మరణంతో ఋజువు చేశాడండీ!

అతడి ఆత్మకి శాంతి కలగాలని, వేగం ముక్తి కలగాలని మనసారా ప్రార్థిద్దాం!" అంది.

‘అలాగే’ అన్నాను, ఆమెతో ఏకీభవిస్తూ.

అందుకే ఇంతవరకూ ఎవరికీ చెప్పలేదు.

ఇప్పుడు రాసినా, ఏ వ్యక్తుల పేర్లు ఉటంకించలేదు. కానీ ఇందులో పేర్కొన్న ప్రతి సంఘటన, సత్యం! ఇప్పటివరకు మళ్ళీ ఆ ప్రదేశంలో, మేము సహజీవనం చేసిన ఆత్మతో ఎవరికీ, ఎటువంటి అనుభవం జరిగిన గాలి కబుర్లు గాని, అక్కడ దయ్యాలు, భూతాలూ ఉన్నాయనే పుకార్లు గాని, రాలేదు. ఏ నోటా మేం వినలేదు.

ఆ ఆత్మ, బహుశః మేమే స్పెషల్ అని, ఆ భాగ్యం మాకే కల్పించిందేమో మరి!

--: oo(O)oo :--

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి