ఆపద్బాంధవులు - జీడిగుంట నరసింహ మూర్తి

Aapadbandhavulu

ఎంతోమంది నా స్మృతిపధంలోంచి తొలగిపోయినా నేనెందుకో కిరాణా కొట్టు బసవయ్యను ఎప్పటికీ మర్చిపోలేను. బసవయ్య ఆ వూళ్ళో అంటే మా కాలనీలో ఎందరికో తలలో నాలుకలా ఉండేవాడు. పేరుకు చిన్న దుకాణం. అందులోనే సామాన్యులకు రోజు వారీ తమ జీవితాలను తృప్తిగా గడపడానికి అవసరమయ్యే సామానులన్నీ దొరికేవి.

ఇక కాలక్షేపం లేని వాళ్ళకు బసవయ్య కొట్టు ఎంతో గొప్ప వేదికగా ఉపయోగపడేది. కొట్టుముందు రెండు మూడు చెక్క పెట్టెలు వేసి ఉండేవి. ఆ కొట్టుకు చివరలో ఒక రైస్ మిల్లు ఉండేది. అందులో పనిచేసే హమాలీలు పనిలేని వేళలలోనో, మిల్లులో కరెంట్ పోయిన సమయంలోనో బసవయ్య కొట్టు దగ్గర వచ్చి కూర్చుని ఆ కొట్టులో దొరికే జీడీలో, నువ్వులుండలో ఏవో కొనుక్కుని తింటూ చుట్టలు, బీడీలు కాల్చుకుంటూ కాలక్షేపానికి ఏవేవో కబుర్లు, కాకరకాయలు చెప్పుకునే వాళ్ళు . . వాళ్ళతో పాటు బసవయ్య కూడా నోరు పటపటలాడించే వాడు. .

మా ఇంటికి ఎదురుగా ఒక సన్నటి సందు ఉండేది. ఆ సందు చివర ఒక పది పదిహేను దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఉండేవి. మగవాళ్ళు బయట ఏవో కూలిపనులు చేసుకుంటూ ఇంటికి రోజుకు ఇరవయ్యో , ముప్పాయ్యో తెచ్చి ఆడవాళ్ళ చేతుల్లో పెట్టె వాళ్ళు. దానితోనే వాళ్ళు ఇళ్ళు సునాయాసంగా నడిపేసే తెలివితేటలు ఉండేవి. . ఆ రోజుల్లో పెద్ద ఉద్యోగస్తులకు నెలకు వెయ్యి రూపాయలు జీతం వస్తోంది అంటే వాళ్ళు బాగా స్తితిమంతులు కింద లెక్క. ఇప్పుడు కిలో నూట ఏభై ఉండే నూనె రేటు అప్పట్లో పదిహేను ఇరవై రూపాయల లోపే దొరికేదీ. వంద రూపాయలతో నెలకు సరిపడా ఇంటికి కావలసిన సరుకులు తెచ్చుకుని సంతృప్తిగా జీవించే వాళ్ళం. బసవయ్య కొట్టు ఆ కాలనీ మొత్తానికి ఒక కామధేనువులా ఉండి వచ్చిన వాళ్లందరినీ సంతృప్తిగా పంపించేది. . ఇప్పటికీ నాకు బాగా గుర్తు. మా ఇంటి చివరలో ఉన్న లేబర్ కాలనీ లో నుండి ఎంతోమంది ఒక పావలాతో బంగాళా దుంపలు, ఉల్లిపాయలు కొనుక్కుని ఆ రోజుకు కూర కానిచ్చేసే వాళ్ళు. ఒక చిన్న సీసాకు తాడు కట్టి దాంట్లో పదిపైసలు నూనె పోయించుకుని ఆ రోజుకు పొద్దున్న , రాత్రికి వంట చేసేసుకునే వాళ్ళు. ఆ సీసాలో నూనె పోస్తున్నప్పుడు బసవయ్య మొహం ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూనే కనపడేది.

ఏ బేరాలు లేనప్పుడు బసవయ్య కొట్టు దగ్గర రాజకీయాలు, సినిమాల గురించి చర్చలు జరుగుతూ ఉండేవి. అప్పుడే కాలేజీలో చేరిన విద్యార్ధులు, కూడా అక్కడ చేరి వాళ్ళ అభిమాన నటుల సినిమాల గురించి పందాలు కూడా కట్టుకునే వాళ్ళు. ఇంకొంతమంది పది మందిని పోగేసి చీటీలు కూడా పాడే వాళ్ళు. వాళ్ళల్లో ఎవరేనా ఒక నెల కట్టలేకపోతే బసవయ్య తనకొచ్చిన ఆదాయంలోనే ఆర్ధిక సహాయం చేసేవాడు. ఇక తోచీ తోచని వాళ్ళు ఏమీ కొనకుండా ఊరుకునే కొట్టు దగ్గర కూర్చున్నా బసవయ్య ఏమీ అనే వాడు కాదు . ఆ రోజుకు ఇరవై ముప్పై రూపాయలు వచ్చిందంటే అతనికి అదో పెద్ద ఆదాయం కింద లెక్క. రాత్రి పదిగంటల వరకు ఆ చిన్న కాలనీలో ఉన్న అందరి అవసరాలు తీర్చాక తన డొక్కు సైకిల్ తొక్కుకుంటూ టౌన్లో ఎక్కడో రెండు మైళ్ళు ఉన్న ఇంటికి వెళ్ళి పోయే వాడు. మళ్ళీ పొద్దున్నే మామూలే. రాగానే తనే స్వయంగా షాపు చుట్టూ చీపురుతో ఊడ్చి, లోపల కొబ్బరి పీచుతో షాపులో రాత్రి దూరి ఎలుకలు చిందరవందర చేసిన వస్తువులను శుభ్రం చేసుకుని ఒక మూల తగిలించి ఉన్న దేవుడి పటానికి రెండు అగరవత్తులు వెలిగించి ఇక తన వ్యాపారాన్ని మొదలుపెట్టే వాడు. నాకు తెలిసి బసవయ్య కొట్టు ఏ రోజూ మూసి ఉన్నట్టు చూడలేదు. ఏ జ్వరం వచ్చినా, ముక్కుతూ మూలుగుతూ యధాప్రకారంగా చిరునవ్వుతూనే అందరికీ సరుకులు అందించే వాడు. అన్నట్టు బసవయ్య కొట్టులో చిన్న చిన్న రోగాలకు సారిడన్, అనాసిన్ లాంటి తలనొప్పి మాత్రలు కూడా దొరికేవి. దానితో మరీ ముంచుకొస్తే తప్ప ఆ మాత్రలతోనే సరిపెట్టుకునే వాళ్ళు తప్ప చీటికీ మాటికీ డాక్టర్ల దగ్గరకి ఎవరూ వెళ్ళే వాళ్ళు కారు.

సమయానికి చిల్లర లేకపోతే ఏ ఆసుపత్రికి వెళ్లడానికో, సినిమాకి వెళ్లడానికో రూపాయి, రెండు రూపాయలు అప్పు కూడా మాకు ఇచ్చిన రోజులున్నాయి. . స్కూల్ టీచర్లకు వేసవి కాలం జీతాలు రాక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో అంత చిన్న కొట్టు నడిపే బసవయ్య లేదనకుండా సరుకులు ఇచ్చి ఖాతాలో వ్రాసుకునే వాడు. నెలకు బసవయ్య దగ్గర ముప్పై , నలభై వరకు అయితే అందులో పది రూపాయలు తీర్చినా వాళ్ళ ఖాతాలో జమచేసుకునే వాడు తప్ప పల్లెత్తు మాట ఎవరినీ అనే వాడు కాదు.

అనుకోకుండా మా అన్నయ్య పెళ్లి కుదరడం, ముహూర్తాలు వెంటనే ఉండటంతో సరైన ప్లాన్ లేకుండా పొలోమని అందరమూ వేరే ఊరికి వెళ్ళి పెళ్లికి హాజరవ్వాల్సి వచ్చింది. ఇంట్లో పెళ్లికి కావలసిన సరుకులు ఉన్నాయో లేదో కూడా చూసే పరిస్తితి లేదు. ఎలా వున్నది అలా వదిలేసి అందరమూ పెళ్ళికి బయలుదేరాము. అప్పటికి మా ఇంట్లో ఎనభై ఏళ్ల పూర్తిగా నడుము వంగిపోయిన ముసలావిడ వంట మనిషిగా చేస్తూ ఉండేది. ఆవిడకు మేము ప్రత్యేకంగా జీతం, భత్యం ఇచ్చే వాళ్ళం కాదు. మాతో పాటు తిని రాత్రి ఒక మూల పడుకునేది. ఆవిడకు నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. రోగమొచ్చినా ఏమొచ్చినా మేమే దిక్కు. ఆ కాలంలో ఆ ఏరియా లో దొంగలు ఎక్కువ పడుతూ ఉండేవాళ్లు. ఎక్కడో దూరపు వూళ్ళో పెళ్లి చేసి ఇంటికి రావాలంటే కనీసం రెండు రోజులైనా పడుతుంది. ఇంటికి తాళం వేసి వెళ్తే దొంగలు పడటం ఖాయం. ఇంట్లో పెద్ద విలువైన వస్తువులు లేకపోయినా ఏది పోయినా కొనుక్కునే పరిస్తితి అప్పట్లో ఉండేది కాదు. అందుకే మా వంటమనిషి వెంకట లక్ష్మమ్మను కాపలా ఉంచి పెళ్ళికి బయలు దేరాము. .

ముందే చెప్పాను కదా అనుకోకుండా వచ్చిన పెళ్లి సంబంధం. ముహూర్తం కూడా ముంచుకు రావడం వల్ల సరైన ప్లాన్ లేకుండా పెళ్ళికి వెళ్లాల్సి వచ్చిందని . పెళ్లి కార్య క్రమం ముగించుకుని ఇంటికి వచ్చే సరికి రాత్రి తొమ్మిదయ్యింది. అనుకోకుండా మాతో పాటు పది మంది చుట్టాలు పైగా వచ్చేశారు. పెళ్లి పందిట్లో ఎంతో కొంత అల్పాహారం తిన్నా దాదాపు అందరూ రైల్లో ఏదైనా తినడానికి అమ్మొస్తుందా అని చూస్తున్నారు. చూస్తూంటే రైల్ ఆలస్యంగా నడుస్తోంది. రాత్రి ఏ ఎనిమిది గంటలకో చేరితే గబగబా పొయ్యిమీద అన్నం పడేసి కాస్త బంగాళా దుంప వేపుడు , ఊరగాయ పెట్టేస్తే అయిపోతుందని మా ఇంట్లో వాళ్ళు అనుకున్నారు. కానీ అప్పటికే తొమ్మిది దాటిపోయింది. అందరమూ ఉసూరుమని ఇంటికి చేరుకున్నాం రిక్షాలు కట్టించుకుని.

తలుపు తట్టగానే వంటావిడ వెంకట లక్ష్మమ్మ నవ్వుతూ " పెళ్లి బాగా జరిగిందా అయ్యగారూ ! అందరినీ కాళ్ళు కడుక్కోమనండి. ఇప్పటికే బాగా ఆలస్యం అయ్యింది. భోజనాలు వడ్డిస్తాను" అని మా నాన్నతో అంటూంటే నేనూ మా అమ్మా ఆశ్చర్య పోయాం. అదేమిటి ? భోజనాలకు కూర్చోమంటోంది ఈ ముసలావిడకు మతి భ్రమించలేదు కదా ? అని అనుమానం వచ్చింది.

లోపలకెళ్లి మా అమ్మగారు వంటావిడతో మాట్లాడుతోంది .

" అవును అమ్మ గారు . మీరు పెళ్లి పనులు అన్నీ ముగించుకుని ఏ తొమ్మిదికో నకనకలాడుతూ వస్తారని తెలుసు.మీతో పాటు పెళ్లి వాళ్ళను కూడా ఒకరిద్దరిని తీసుకొస్తారని ఊహించాను. అందుకే ముందాలోచనతో బసవయ్య కొట్టులో కూరలు, అవీ కొనుక్కొచ్చీ, శేరు బియ్యం పొయ్యమీద పడేసి పక్కన వంకాయ కూర కూడా వండేశాను. ఉదయాన్నే పాలు కూడా పోయించుకుని ఉంచి పెరుగు కూడా తోడెట్టాను. ఇక ఇంట్లో ఆవకాయ ఊరగాయ ఎలాగూ ఉంది . సమయానికి బసవయ్య డబ్బులు ఇవ్వకపోయినా కూరలు, నూనె, బియ్యం లాంటివి ఇవ్వడంతో పని సులువయ్యింది. వాళ్లందరినీ కాళ్ళూ, చేతులు కడుక్కుని భోజనానికి కూర్చోమని చెప్పండి " అంటూ నడుమ్మీద చెయ్యివేసి వంగుని వంటింట్లోకి నడిచింది వెంకట లక్ష్మమ్మ.

విషయం విని నేను ఎంతో ఆశ్చర్యపోయాను. మాతో పాటు ఆడపెళ్లివారిలో కొంతమంది వచ్చారు. చెప్పకపోయినా, ఆవిడను పెళ్ళికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే నిర్లక్ష్యంగా వదిలేసినా ఈ రోజు ఆడపెళ్ళి వారి దగ్గర ఊహించని రీతిలో పరువు కాపాడింది. దాంతో పాటు వంటకు కావలసిన సరుకులు వెంటనే డబ్బులు ఇవ్వకపోయినా ఇచ్చి తన మంచితనాన్ని కాపాడుకున్న కిరాణా కొట్టు బసవయ్య , మా దృష్టిలో అత్యంత ఆత్మీయులుగా , ఆపద్బాంధవులుగా ఎప్పటికీ గుర్తుండిపోయారు. *******

సమాప్తం

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి