ఎవరు అదృష్టవంతులు? - పి.కె. జయలక్ష్మి

evaru adrushtavanthulu

సాయంత్రం 5 గంటలయింది. ప్రభుత్వ పాఠశాల గంట గణగణ మోగిందే తడవు... తరగతి గదుల్లోంచి విద్యార్ధులు వింటి నుంచి దూసుకువచ్చిన బాణాల్లా రివ్వున ఇంటి దారి పట్టారు. తొమ్మిదో తరగతి చదువుతున్న రమణ, రాఘవ కబుర్లాడుకుంటూ నడవసాగారు. రమణ ఏదో ఆలోచిస్తూండటంతో భుజమ్మీద చెయ్యేస్తూ. “ఏరా రమణా! అలా ఉన్నావ్? మధ్యాన్నం లెక్కల పరీక్ష సరిగ్గా వ్రాయలేదా ఏంటి?” అనడిగాడు రాఘవ. ఉలిక్కిపడి రాఘవ వైపు చూస్తూ” ఆ పరీక్షా? బాగానే వ్రాసాలే!'' అంటూ ఎదురుగా కన్పిస్తున్న ఇంగ్లీష్ మీడియం స్కూల్ వైపు దృష్టి నిలిపాడు. మిత్రుడి మనసు గ్రహించినట్లుగా “బాగా చదువుకొని పెద్దయ్యాక అక్కడే టీచర్ అవుదువు లేరా!” అన్నాడు రాఘవ నవ్వుతూ.

రమణ, రాఘవ పక్క పక్క ఇళ్ళల్లో ఉంటున్నారు. తండ్రులు ఆటో వేస్తుంటే తల్లులు నాలుగిళ్ళల్లో పనిపాటలు చేసుకుంటూ సంసారాన్ని గుట్టుగా నెట్టుకొస్తున్నారు. రమణ అన్న పాలిటెక్నిక్ చదువుతుంటే రాఘవ తమ్ముడు నాలుగోతరగతి లో ఉన్నాడు. తాము చదువుకోలేకపోయినందుకు పిల్లల్నయినా బాగా చదివించి ప్రయోజకుల్ని చేయాలని వాళ్ళ తల్లితండ్రుల తాపత్రయం. పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదువుకుంటూ తల్లిదండ్రుల కలల్ని సాకారం చేసే ప్రయత్నంలో ఉన్నారు.

రమణ కి తమ పాఠశాల ఎదురుగా ఉన్న కాన్వెంట్ అంటే విపరీతమైన ఇష్టం. అక్కడకి కార్లల్లో వచ్చే ఖరీదైన విద్యార్ధుల్ని, వాళ్ళు వేసుకునే ముచ్చటైన యూనిఫాం ని చూస్తూ తను వాళ్ళల్లా లేనందుకు న్యూనతకి లోనవుతూ, వాళ్ళ స్థాయికి ఎప్పుడు చేరగలనా అని మధనపడసాగేడు.

ఆరోజు ఆదివారం కావడంతో రమణ క్రికెట్ ఆడుకోవడానికి స్కూల్ గ్రౌండ్ కి వెళ్ళేసరికి అక్కడ అప్పటికే కాన్వెంట్ పిల్లలు ఆడుతూ కన్పించారు. తన ఫ్రెండ్స్ ఎవరూ లేకపోవడంతో వెనక్కి తిరుగుతోంటే ఒకబ్బాయి పరుగెత్తుకుంటూ దగ్గరకి వచ్చి “ఏయ్ బాబూ! మాతో ఆడతావా? మా టీమ్ లో ఒకరు రాలేదు" అంటూ చనువుగా చేయి పట్టుకొని తీసుకువెళ్ళాడు. రమణ ఊహించని ఈ ఆహ్వానానికి అబ్బురపడుతూ అద్భుతంగా బ్యాటింగ్ చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. తర్వాత ఆ కుర్రాడు తన పేరు “కిరణ్” అని చెప్పి “ఇక్కడే మా ఇల్లు రా వెళ్దాం!” అంటూ ఇంటికి తీసుకువెళ్ళాడు.

ఇల్లు అనేకన్నా ఇంద్రలోకం అంటే బాగుంటుందేమో? కిరణ్ వాళ్ళమ్మ గారు ప్రేమగా పలకరించి హల్వా పెట్టి జ్యూస్ ఇచ్చారు రమణ కి. కిరణ్ గది చూసి మతి పోయినంత పనయ్యింది. వచ్చేస్తోంటే మంచి పెన్ బహుమతిగా ఇచ్చాడు కిరణ్ రమణకి. ఇంటికి వచ్చాక కూడా కళ్ళల్లోనూ, కలల్లోనూ కిరణ్, కిరణ్ వాళ్ళ ఇల్లే కన్పిస్తూ ఉండటంతో మనసు మరీ భారమైపోయింది రమణకి. తన దరిద్రానికి, దురదృష్టానికి దుఖపడుతూ దేవుడు తనకి అన్యాయం చేశాడని వాపోసాగాడు. ఎప్పుడైనా సిన్మా కి వెళ్దామన్న అప్పుల లిస్టు, ఖర్చుల లిస్టు ముందు పెడుతుంది అమ్మ. ఏదైనా కొనమంటే చాలు ఎంత నోరు, పొట్ట కట్టుకొని తమని చదివిస్తున్నారో ఏకరువు పెట్టి తర్వాత చూద్దాంలే ముందు కష్టపడి చదువు అంటాడు నాన్న. ఎప్పటికీ ఈ బతుకింతే! తను ఎప్పటికీ కిరణ్ స్థాయి కి చేరలేడు... విరక్తిగా అన్పించసాగింది రమణకి.

రాఘవతో స్కూల్ కి వెళ్ళేటప్పుడు తన మనసు లోని వేదనని వెళ్లగక్కితే “మనం బాగా చదువుకొని త్వరగా పెద్దయిపోయి మంచి ఉద్యోగం తెచ్చేస్కొని కావాల్సినవన్నీ కొనేస్కుందాం రా ఎంచక్కా! మా అమ్మ ఎప్పుడూ ఇదే చెప్తుంది.” అన్నాడు కళ్ళు, చేతులు తిప్పుతూ. ఏడవలేక నవ్వుతూ “సరేలే” అన్నాడు రమణ.

ఎప్పటిలాగే స్కూల్ నించి ఇంటికి వస్తున్నారు రమణ,రాఘవ. "ఏయ్ రమణా! అటు చూడు" రాఘవ అరిచిన అరుపుకి ఒక్కసారి ఉలిక్కిపడి చూశాడు. పెద్ద గుంపు రోడ్డు వారగా! ఏంటో చూద్దామని ఇద్దరూ సందు చేసుకొని గుంపులో జొరబడ్డారు. ఒక నడివయసు వ్యక్తి పాములనాడిస్తున్నాడు. నాగస్వరం ఊదుతుంటే రెండు పాములు తలలు తిప్పుతూ నాట్యం చేస్తున్నాయి. మూగిన జనాల్లో కొందరు చప్పట్లు కొడుతోంటే, కొందరు ఈలలేస్తున్నారు. స్నేహితులిద్దరికీ ఆశ్చర్యం గా ఉంది. సిన్మాల్లో చూడ్డమే తప్ప, ప్రత్యక్షంగా వాళ్లెప్పుడూ పాముల్ని చూడలేదు. అందుకే చాలా ఉత్కంఠ గా చూడసాగారు ఈ దృశ్యాన్ని. ఇంతలో పదేళ్ళ పిల్ల, ఆరేళ్ళ పిల్లాడు చేతిలో సత్తుగిన్నెలు పట్టుకొని అందరి దగ్గరకొచ్చి "మా అమ్మకి జరం, రెండు రోజుల నించి అన్నం తినలేదన్నా! ఇంటి కాడ సిన్న తమ్ముడికి పాల్లేవన్నా! మా పాములక్కూడా తిండి లేదు. శానా ఆకలేస్తంది, డబ్బులియ్యండన్న" అంటూ యాచించ సాగారు. చూస్తున్న రమణ మనసు ద్రవించిపోయింది. ఏం చేద్దామన్నట్టు రాఘవ వైపు చూశాడు. వాడు రహస్యంగా “సాయంత్రం ఏమైనా కొనుక్కోడానికి అమ్మా వాళ్ళిచ్చిన డబ్బులున్నాయిగా! ఇవాళేమీ తినద్దులే! ఒక్క రోజు తినకపోతే ఏం కాదులే" అన్నాడు. రమణ సంతోషంగా జేబులోంచి పది రూపాయల నోటు తీసి బొచ్చెలో వేశాడు. అంతవరకు చిల్లర నాణేలు తప్ప నోటు ఎవరూ వేయలేదు. పది నోటు చూడగానే పిల్ల కళ్ళు ఆనందంతో మెరిసాయి. "ఇయ్యాల కూడు తినొచ్చు నాన్నోయ్" అంటూ తండ్రి దగ్గరకి పరిగెత్తింది. పిల్లలు తెచ్చిన డబ్బులు లెక్కపెట్టుకుని, పాముల్ని బుట్టలో పెట్టి మూత పెట్టే పన్లో ఉన్నాడు పాములతను.

రాఘవ అతని దగ్గరకొచ్చి ఆశ్చర్యంగా "అమ్మో, ఇలా పాముల్ని నెత్తిన పెట్టుకొని తిరుగుతూ ఉంటావు కదా! అవి కరిస్తేనో? భయం లేదా?” అని అడిగాడు."లేదు బాబూ! ఇవి శానా మంచివి. కావాలంటే సూడు" అంటూ వాటిని ముద్దు చేయసాగాడు పాములతను. "అంటే ఇవి నిజమైన తాచుపాములు కావా?" కుతూహలంగా అడిగేడు రమణ “కావు బాబూ! నిజమైన తాచు మా పేదరికం బాబూ, పతిరోజూ అది మమ్మల్ని కాటు యాత్తానే ఉంటాది. రోజూ చస్తూ బతుకుతూ ఉంటాం. ఆ పాము మమ్మల్ని కాటేసి చంపేత్తే ఈ పాములు పేనం పోసి బతికిత్తన్నాయి. ఇవి మా పాలిటి దేవుళ్ళు బాబూ అందుకే ఈటిని నెత్తినెట్టుకొని తిరగతన్నా, ఒత్తా బాబూ!" అంటూ పిల్లల్ని తీసుకొని అక్కడనుంచి వెళ్లిపోయాడు.

అంతే, ఒక్కసారిగా వీపుమీద ఎవరో చెళ్లుమని చరిచినట్లయింది రమణకి. ఇంతకాలం తానెంత మూర్ఖంగా ఆలోచిస్తూ అనవసర వేదనకి గురయ్యాడో తెలిసి వచ్చింది. తనకంటే బీదవాళ్లు, అభాగ్యులు ఈ లోకంలో చాలా మందే ఉన్నారు. భగవంతుడు తనకి కావలిసినవన్నీ ఏదోకాస్త అటూఇటూగా అందించే తల్లితండ్రులని, ఎవరి దయాధర్మం మీదా ఆధారపడకుండా కూడు, గుడ్డ, నీడ తో తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు అవసరమైన, చదువు కి కావలసిన తెలివితేటల్ని అన్నీ ఇచ్చాడు. ఇంతకంటే ఏం కావాలి? ఆ పాములతని కంటే తానెంతో అదృష్టవంతుడు. అదే మాట రాఘవ తో అన్నాడు. “అవున్రా రమణా! మా అమ్మ ఎప్పుడూ చెప్పేది ఈ మాటే రా! మన కంటే గొప్పవాళ్లతో కాకుండా మన కంటే బీదవాళ్లతో పోల్చుకొని మనం చాలా అదృష్టవంతులం అనుకోవాలట. ఈపాటి ఆధారం, ఆరోగ్యం మనకిచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలటరా!” చెప్పాడు రాఘవ.

"నిజమేరా రాఘవా! మన కంటే బీదవాళ్ల పట్ల జాలి చూపించాలి. మీ అమ్మ చెప్పినట్లు కష్టపడి పట్టుదలగా చదివి మనం కూడా గొప్పవాళ్ళమవ్వాలి." అన్నాడు మెరిసే కళ్ళతో రమణ. "అప్పుడు బీదవాళ్ళకి సాయం చేయచ్చు కూడా" అంటూ శృతి కలిపాడు రాఘవ.

***

మరిన్ని కథలు

Markatapuram-Story picture
మర్కటపురం
- యు.విజయశేఖర రెడ్డి
Daridrudu
దరిద్రుడు
- mahesh amaraneni
Giligadi vachche puligadu chachche
గిలిగాడు వచ్చె-పులిగాడు చచ్చె.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Kotta jeevitam
కొత్త జీవితం
- చచెన్నూరి సుదర్శన్
Yachakulu kaanidi evaru
యాచకులు కానిది ఎవరు?
- యాచకులు కానిది ఎవరు?.
Vimukti eppudo
విముక్తి ఎప్పుడో!
- రాము కోలా.దెందుకూరు.
Manninchumaa
మన్నించుమా!
- రాము కోలా.దెందుకూరు.