మాణిక్యరావు-మారుతీకారు - ఆదూరి హైమవతి

manikyaraavu - maarutheekaaru

"మాణిక్య రావు మారుతీ కారుకొన్నాట్ట!"

"ఇదెలా సంభవం?!" " ఏమో నేను విన్నమాట మాత్రం నిజం!" “వెళ్ళి చూద్దాం పదండి" కాలనీ కాలనీ అంతా బిలబిల మంటూ బయల్దేరి మాణిక్యరావు ఇంటి ముందు గుమికూడారు. పైవాళ్ళకు ‘ఏం జరిగిందో ఏమో! పాపం జరగరానిదేమై నానా! ఇలా గుంపులు గుంపులుగా వెళూతున్నారు!' అనే అనుమానం రావచ్చుగాక, నిజానికి వీళ్ళంతా తరలి రావటం మాత్రం యదార్ధం. మాణిక్యరావు మారుతీ కారు కొన్నాడా? లేక ఉత్తి పుకారా? అని తెల్సుకోనే! నిజం. మాణిక్యరావు మారుతీ కారు కొన్న మాట ముమ్మాటికీ నిజం. తళతళామెర్సిపోయే టమోటా రంగు మారుతీ కారు మాణిక్యరావు ఇంటిముందు నిల్చి ఉంది, మహారాణిలా! అంతా వచ్చి షేక్ హ్యాండ్స్ తో మాణిక్యరావు చేతిని ఊపి ఊపి వదిలారు. (పాపం ఆరాత్రి మాణిక్యరావు సతీమణీ  సరస్వతి అమృతాంజనం రాసి కాపడం పెట్టెందిలేండి.) మాణిక్య రావు వచ్చిన వారిని ఊరికే  పంపుతాడా! అదివాడి 'శబ్దమంజరి'లో లేనే లేదు (డిక్ష్ణరీకి తెలుగుపదం లెండి). పాపం సరస్వతి అందరికీ నాల్గు లీటర్ల పాలతో టీ, మూడు కేజిల ఉప్మా, జీడిపప్పు మరికాస్త వేసి నిమ్మకాయ పిండి మరీ అందించింది. మధ్యాహ్నం దాకానూ.

మా మాణిక్యరావు ఉత్త బోళా మనిషి. ఎవరైనా కానీండి "మీరెంత మంచివారండీ! చేతికి ఎముకే లేదుట కదండీ! అబ్బో చాలా గొప్పవారుట కదండీ విన్నాను.!" అనిపొగిడితే చాలు  మేరుపర్వతమెక్కి పోతాడు. శంకరునిలా పొంగిపోతాడు, భస్మా సురునికి వరాలిచ్చినట్లు ఇట్టే ఇచ్చేస్తాడు! ఏదో ఒకపాటి కాస్త పెద్ద ఉద్యోగమే గవర్నమెంటు ఆఫీసులో వెలగబెట్టాడులేండి! ఐతే కానీ ముట్టిన పాపాన పోకపోగా ఎవరైనా వచ్చిపొగిడితే చాలు జేబులు ఖాళీ చేసేసుకుని వారిపని చక్కబెట్టి సకల మర్యాదలూ చేసి పంపేవాడు. అంతా ముఖాన పొగిడి, పనులు చేయించుకుని చాటుకెళ్ళి జోకు లేసుకుని నవ్వుకునేవారు. పాపం ఇవేవీ మా మాణిక్యరావుకు పట్టవు, తెలీవుకూడా.

వాడి సతీమణి సరస్వతి మహాఇల్లాలు.  కొన్నేళ్ళు చూసి చూసి  వీడిహ మారడని నిక్కచ్చి చేసుకుని, బీ.ఏ. చదివింది కనుక, లెక్కలు బోధించడంలో దిట్ట కూడా కనుక ఇంటి పక్కనుండే ఖాళీ జాగాలో ఓపాక వేయించి అక్కడ గోడకు ఒక బోర్డూనూ వేయించుకుని గణిత ట్యూషన్స్ చెప్పసాగింది.

"అన్నయ్యా! నేనిలా చేయదలచాను, తప్పేం లేదుగా, ఈయనిహ మారరు. పిల్లలకు కాస్తంత చదువు చెప్పించుకోవాలనే ధ్యాసైనా లేదాయె! జీతంలో సగం ఇలా అర్హత లేని వారిమాటలు నమ్మి అపాత్రదానం చేస్తున్నా రాయె! ఇంటికి తెచ్చే సొమ్ము ఇంటిఖర్చులకే చాలకుండాఉంది. ఏంచేయను చెప్పండీ!" అంటూ నాముందు తన బాధ వెళ్ళబోసుకుని, ఝాన్సీ రాణిలా రంగంలోకి దిగింది. క్రమంగా అదో బడిలా పెరిగి, పేరూ పెరిగి ఆమెవద్ద లెక్కల ట్యూషన్ ఒక  వరంలా భావించి తల్లి దండ్రులు లైన్ కట్టే సేవారు. ఐతే సరస్వతి పేదవారైన తెలివైన పిల్లలకు ఉచితంగానే గణితబోధన చేసేది. తాను కష్టపడి అలా సంపాదించిన ఆ సొమ్మంతా జాగ్రత్త చేసి కొడుకులిద్దర్నీ చదివించింది. వారి చదువులకంతా ఆమె సొమ్మే ఖర్చుపెట్టింది. కొడుకులిద్దరూ తల్లిపడే అవస్థ చూసి, జాగ్రత్తగా చదివి స్కాలర్ షిప్పులతో ఒకడు డాక్టర్ కాగా మరొకడు ఇంజనీరై మంచి ఉద్యోగాల్లో కుదురుకుని, బుధ్ధిగా తల్లి విచారించి చేసిన సంబంధాలు చేసుకుని అమెరికా వెళ్ళిపోయారు. మాణిక్యరావు రిటైర్మెంట్ కాగానే తమతో ఉండేందుకు అమెరికా రమ్మని కోరగా, భార్యతోపాటుగా ఒక్కమారు వెళ్ళి ఆరునెల్లకు బదులుగా లక్షా నలభై వేలు ఖర్చుచేయించి ఆరువారాల్లో తిరిగి వచ్చేసాడు!. అక్కడ తాను సాయం చేయను ఎవ్వరూ లేరుట! ఊరికే కూర్చోలేడుట! ఇతరులకు సాయం చేయకుండా తాను ఉండలేడుట! ఎవరైనా వింటే నవ్విపోతారు! ఐనా ఏమీ చేయలేక సరస్వతి కూడా భర్తతో తిగిరి వచ్చింది, ఆవయస్సులో ఆయన్ని వంటరిగా వదలి ఉండలేక.

బాగా కాళ్ళునెప్పులతో బాధ పడుతున్న తల్లిని చూసిన పిల్లలిద్దరూ వచ్చేఫ్ఫుడు తల్లి అకౌంట్ లోకి ఐదు లక్షలు ఆన్ లైన్లో జమచేసి "అమ్మా! కష్ట పడ్డన్ని నాళ్ళూ పడ్డావు, ఇహ హాయిగా విశ్రాంతి గాఉండు . ఒక కొత్త కారు కొనుక్కుని నడవ కుండా తిరుగు, ఎటూ మీ ఇద్దరికీ కారు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా!" అనిచెప్పారు.

స్వదేశానికి రాగానే జట్ ల్యాక్ పోయాక భార్యను వెంటేసుకుని మాణిక్యరావు బయల్దేరుతుండగా ఎదురైన ఏకాంబరం, "ఏమండోయ్! మాణిక్యరావుగారూ! ఎక్కడికో బయల్దేరారే!" అంటూ పలకరించాడు. ‘శుభమాని కారు చూడను వెళుతుంటే ఈయన ఎదురై ఎక్కడి కని అడుగుతున్నాడేంటా!' అని అనుకుంది సరస్వతి. మన మాణిక్య రావు దాపరికం లేనివాడు కదా! “ఔనండీ! మాపిల్లలు కారు కొనుక్కోమని డబ్బిచ్చారు, అందుకే కార్లు చూడను వెళుతున్నాం." అని చెప్పనే చెప్పేశాడు. ఏకాంబరం మేం తక్కువ వాడు కాదుగా! అందర్నీబుట్టలో వేసుకుని సొమ్ము చేసుకోడమే ఆయన దళారీపని.

"ఓరినీ! చెప్పకనే పోతివి! కొత్త కార్లెందుకోయ్! సెకండ్ హేండ్ కొను!, డబ్బుకు డబ్బూ సేవవుతుంది. మిగిలిన సొమ్ముతో నీవు అనేక మందికి సహాయమూ చేయొచ్చు. ఏమంటావ్? నాఎరికలో ఇటీవలే మారుతీ కారు కొనుక్కుని, కొడుకు దగ్గరికి బెంగుళూరు వెళ్ళిపోతూ, తనకారు అమ్మేస్తాననీ ఎరుగున్నవారి కెవరికైనా చెప్పమనీ పోరు తున్నాడయ్యా మాస్నేహితుడు ఒకడు.! ఏమంటావ్? ఎలాగూ బయల్దేరారుగా! రండివెళదాం" అంటూ మరుమాట్లాడ నివ్వకుండా, ఆటోఎక్కించి తీసుకెళ్ళి కారు చూపాడు. బయటికి 'టమోటా' రంగులో మెర్సిపోతూ ఉంది. రంగు చూసి మురిసిన మాణిక్యరావు, కనీసం పక్క నే ఉన్న భార్యతో ఒక్క మాటైనా అనకుండానే "బావుందండీ రంగు! వెలచెప్తారా?" అనేశాడు.

బార్య "ఏమండీ! పిల్లలు కొత్తకారు కొనుక్కోమన్నారు కదా! పాత దెందుకండీ! పైగా ట్రయల్ డ్రైవ్ చూడకుండానే నా!" అంటూనే ఉంది ఉండబట్టలేక.

"ఉండు సరసూ! ఏకాంబరం గారు చెప్తున్నారుగా? ఇటీవలే కొన్నారని, సొమ్ము మిగిలితే అవసరాలకు ఉంటుందిగా!" అంటూ "వెలకుదర్చండి మరి" అననే అన్నాడు. ఏకాంబరం ఓనర్ని చాటుగా తీసుకెళ్ళి మాట్లాడి "మాణిక్యం గారూ ! మీరు గనుక కొత్త కారు కొంటే అనవసరంగా షుమారుగా ఐదులక్షలు ఖర్చుచేయాల్సు ఉంటుంది, అదే ఈ కారైతే మీకు మూడు లక్షలకే వస్తుంది, రెండులక్షలు మీ బ్యాంక్ అకౌంట్లో ఉంటాయి, వడ్డీతో పిల్లలు పెడుతూనే ఉంటుంది. ఏమంటారు?" అని ఆలోచించుకునే వ్యవధానం కూడా ఇవ్వకుండా తొందరచేశాడు. "పిల్లలతో ఒకమాట చెప్పికొందామండీ!" అంటున్న సరస్వతిని, "మీరు మీపిల్లలతో మాట్లాడాలంటే ఇప్పుడు, వారికి అర్ధరాత్రపుడు ఫోన్ చేస్తే ఏమైందో, ఏమో అని వారు కంగారుపడతారు, రేపటివరకూ ఈకారు ఉండదు. అదుగో ఎవరో వస్తున్నట్లు ఫోన్ కూడా వచ్చిందిట! అందుకే కారు బయటే ఉంఛాట్ట! ఏదో నేను రెకమెండ్ చేస్తున్నానని మీకివ్వను అంగీకరించాడు ఈ ఆనందరావ్, ఆపైన మీ ఇష్టం" అనేశాడు ఏకాంబరం.

ఇహ ఒక్క నిముషంకూడా ఆలస్యంచేయక, కనీసం కారుట్రయల్ డ్రైవ్ చేసి కూడా చూడక జేబులోంచి  చెక్ బుక్ తీసి చెక్కురాసి ఇచ్చేశాడు మూడులక్షలకూ! తనమాట ఎటూ చెల్లదని సరస్వతి మౌనంగా ఉండిపోయింది. కారు తాళాలు చేతికిచ్చి "ఇదుగోనోయ్! ఇప్పట్లుంచీ ఇది మాణిక్యరావుగారికారు." అంటూ ఏదీ నన్ను అలా మార్కెట్ వరకూ దింపి ట్రైల్ వేసుకో, ఆపైన ఆలయాని కెళ్ళి పూజచేయించి ఇంటికి తీసుకెళ్ళు అంటూ కారెక్కి కూర్చున్నాడు ఏకాంబరం. కారెక్కి డ్రైవ్ చేస్తూ మహా ఆనందపడిపోయాడు మాణిక్యరావు. అదోండి అలా మాణిక్య రావు సెకండ్ హ్యాండ్ మారుతీకారు ఓనరైపోయి కాలనీ అంతా కాఫీ పలహారాలు పందేరం చేశాడు.

ఆ మర్నాటినుంచే అసలుకధ మొదలైంది. ఉదయాన్నే ఇంకా మాణిక్యరావు బ్రేక్ ఫాస్టైనా కానివ్వందే "ఏమండీ! మాణీక్య రావుగారూ! మావాడి కీరోజు ఎంసెట్ ఎగ్జాం! మీలాంటి మంచిమనిషి, సహృదయులూ డ్రాప్ చేస్తే వాడికితప్పక సీట్ వచ్చితీరుతుంది. కాస్తంత డ్రాప్ చేయరూ!" అంటూ వచ్చాడు పక్కింటి పరంధామయ్య!. భార్య ఇడ్లీ తినమంటున్నా వినిపించుకోక "ఉండవే పాపం! మన పిల్లల్లా అందరూ పైకి రావద్దూ! పాపం పెద్దమనిషి అంతలా అడుగుతుంటే, ఇప్పుడే వస్తాగా!" అంటూ కారుతాళాలు తీసుకు వెళ్ళాడు. అలా పరంధామయ్య గారి అబ్బాయిని పరీక్ష సెంటర్లో డ్రాప్ చేసి, పరం ధామయ్యను అతగాడి ఆఫీసులో డ్రాప్ చేసి, పదకొండయ్యాక వస్తుంటే అదే కాలనీకి చెందిన కామేశ్వర్రావ్ కనిపించి, ఆర్టీసి ఎర్ర బస్ కోసం ఎత్తినట్లు చేయిఎత్తి కారాపి ,"మాణిక్యరావుగారూ! దేవుళ్ళా ఎదురయ్యారు! ఒక్క ఆటో కనిపించి చావదే! నన్నుకాస్తంత రైల్వేస్టేషన్లో దింపుదురూ! మా తాతకు ప్రమాదంగా ఉందని ఫోన్ వచ్చింది, రైల్ మిస్సైతే రేపటి వరకూ లేదు, ఈలోగా ఆయన హరీమంటే ఇబ్బందే!" అంటూ ఆయన అంగీకారంలేకుండానే డోర్ తెరిచి కారెక్కి కూర్చున్నాడు, యాడాది క్రితంపోయిన తాతను మళ్ళీ చంపుతూ…

ఆరోజు అలా అలా అందర్నీ డ్రాప్ చేస్తూ అద్దెకారు తోలుకునే డ్రైవర్లా, అద్దె లేకుండానే, తానే పెట్రోల్ కొట్టించుకుంటూ మధ్యాహ్నం రెండింటికి ఇల్లుచేరి సోఫాలో కూర్చుని సోషపోయాడు. సరస్వతి గబగబా ఇంత అన్నం మజ్జిగ కలిపి మిక్సీలో వేసి ద్రవంలా చేసి రెండు గ్లాసులు పట్టించాక పదినిముషాలకు లేచాడు మాణిక్య రావు. అలా కారుకొన్న రెండో రోజు ముగిసింది. అలా కాలనీ వాసులంతా కారు కొనుక్కోనక్కర్లేకుండా మన మాణిక్యరావు ఫ్రీగా అద్దెఖర్చు లేకుండా టౌన్ బస్సు లెక్కకుండా, ఆటో చార్జీలు మిగిలిస్తూ, కేవలం ఒక్క పొగడ్తతో రోజులు వెళ్ళదీసుకుంటూ తానేదో అందరికీ దేవుళ్ళా సాయం చేస్తూ, పరోపకారం చేస్తున్నట్లు భావిస్తుండగా, మాణిక్యరావుకు పెట్రోలు ఖర్చు రోజురోజుకూ పెరిగిపోయి బ్యాంక్ అకౌంట్ తరిగి పోసాగింది. సరస్వతిమాట చెల్లుబాటే లేదు గనుక, ఆమె ఒక చూపరిగా మిగిలిపోయింది ఏదైతే అదికానీ అని. ఒకరోజున పెట్రోలు చార్జీలు మరింతపెంచారని బస్ ఓనర్ల స్ట్రైక్ కావటంతో స్కూల్ బస్ రాలేదని కాలనీవాసుల పొగడ్తలతో పిలల్లందరినీ ఓవర్ లోడ్చేసుకుని పెద్దవారి ఒళ్ళో చిన్నవారు, ఇంకా చిన్నవారు వెనుక కారుడిక్కీలో నిల్చోబెట్టుకుని షుమారుగా పదిహేను మందిని వారివారి బళ్ళవద్ద దింపేసి వస్తుండగా, కాలనీ లోపలికి రాకుండానే మారుతీకారును గేటుముందే అటకాయించి ఆఫీసులకెళ్ళేవారంతా ట్రిప్పు లేయించుకున్నారు. చివరిట్రిప్లో మగవారు ఎక్కగా కారు ట్రబులిచ్చింది. "ఒకమారు అంతా దిగి కాస్తంత నెట్టండి, కదులుతుంది." అని మాణిక్యరావు చెప్పగానే అంతా దిగి "భలేవారే మాణిక్యరావుగారూ ! ఆఫీసులకెళ్ళేవాళ్ళం మీకారు నెడుతున్నపుడు మమ్మల్ని ఎవరైనా చూస్తే మాకు తలవంపులుగా ఉంటుంది. ఎలాగో షెడ్ కు ఫోన్ చేసి మెకానిక్ ను పిలిపించుకుని వెళ్ళండి! ఏమనుకోకండి దగ్గరేగా ఈకాస్త ఎలాగో తంటాలుపడి నడిచిపోతాంలెండి ఫరవాలేదు."  అంటూ ఒక్కొక్కరూ చెక్కేశారు. ఏంచేయాలో తోచక అలా కాస్తంత సేపు కూర్చుని, చివరకు వారిసలహా పాటించి మెకానిక్ ను పిలిపించుకున్నాడు మాణిక్యరావు. ‘ఇంతసేపూ ఏమయ్యాడా ఇంటికి రాలేదని’ ఎదురుచూస్తున్న సరస్వతి భర్త రాగానే అడిగి విషయం తెల్సుకుని "రోజూ అంత సాయం పొందుతూ కాస్తంత కారునెట్టలేకపోయారా! వారు?" అనగానే "భలేదానివే సరస్వతీ! వారన్నట్లు పాపం వారి డ్రెస్ పాడైపోవచ్చు, లేదా ఎవరైనా కారు నెట్టడం చూస్తే వారికి చిన్నతనంగా ఉండదూ!" అనేశాడు వారితరఫునే!

కనీసం ఒక్క మారన్నా భార్యనెక్కించుకుని సినిమాకో, ఆలయానికో, షాపింగ్ కో వెళ్ళిన పాపానపోలేదు మాణిక్యరావు. అంతా ఉచిత సేవే, సహాయమే! అదేమంటే "పోన్లేవే! పాపం అంతామనలా కారుకొనే స్థాయి ఉండద్దూ! ఏదో మనకుంది గదాని మనం గర్వపడవచ్చా! తప్పుకాదూ!" అనేశాడు ఇలా కొంతకాలం, సాగగా ఒకరోజున కారులో పిల్లల్ని వారిస్కూళ్ళ కు తరలిస్తుండగా కారు ట్రబులుచ్చింది. ఏమెకానిక్కూ మధ్యాహ్నంవరకూ దొరకలేదు. ఆవిషయం కాలనీ వాసులకు ఫోన్ చేయగా, అంతావచ్చి "ఇదేమిటండీ! ఇలా! పిల్లలకు ఈరోజు స్కూల్ పోగొట్టారూ! ఈదేం బావులేదు.! ఐనా ఇలాంటి సెకండ్ హ్యండ్ కారుకొనుక్కోడమేంటండీ! మాణిక్యరావుగారూ! కొత్తకారుకొనుక్కోరూ ఎవరైనా! చూడండీ మాకెంత ఇబ్బందై పోయిందో!" అంటూ దెబ్బలాడి, పిల్లల్ని ఆటోల్లో స్కూళ్ళకు తీసుకెళ్ళారు. అలా పదేపదే కారు ట్రబులివ్వటం, కాలనీ వాసులంతా ఇబ్బందిపడుతున్నామని బాధ వెళ్ళబోసుకోడం, వినలేక సరస్వతి "ఎందుకొచ్చిన గొడవండీ! కారుమనది షోకు వారిదా! పైగా మనవల్ల వాళ్ళేదో బాధపడుతున్నట్లు దెప్పడమేంటండీ!" అంటే, "సరసూ! మరి మధ్యలో అలా కారు ఆగిపోతే వాళ్ళ కెంత ఇబ్బందీ! అదేమనకూ  అలాంటి పరిస్థితి ఎదురైతే ఏంచేస్తాం చెప్పూ!" అనేశాడు. ఒకమారు కారుషెడ్ కెళ్ళి పదిహేను రోజులు తిరిగి రాలేదు. అంతా మాణిక్యరావు ఇంటిముందు కారుందో లేదో చూసి వెళ్ళి పోసాగారు. అలా అంతా ఒక ఆదివారం వచ్చి "అదేంటండీ! మాణిక్య రావుగారూ! ఇంకా మీకారు రాలేదా! మాకెంత ఇబ్బందిగా ఉంటున్నదో చూస్తున్నారుగా! ఐనా కొత్త కారుకొనుక్కోక ఇలా సెకండ్ హ్యాండ్ కారుకొన్నారెందుకూ! కారుకొనేప్పుడు కక్కుర్తి పడకూడదండీ! దర్జాగా కొత్తదే కొనుక్కోవాలి. త్వరగా కారు తెచ్చెయ్యండి." అని ఉచిత సలహా ఇచ్చిపోయారు. మొహం గంటేసుకుని కూర్చున్న మాణిక్యరావును చూసి సరస్వతికి వచ్చేనవ్వును ఆపుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఏకాంబరం కనిపించకుండా ముఖం చాటేసి తిరగటమూ ఆమె గమనించింది. ఆతర్వాత ఇహ ఇలాకాదని మార్కెట్ కు కూరలకెళూతూ ఆకారు షెడ్ కెళ్ళి "చూడబ్బాయ్!" అనగానే ఆమెకానిక్ తిరిగి చూసి,"ఓ మేండం మీరా! ఇలావచ్చారేంటండీ! రండికూర్చోండి!" అని కుర్చీ తుడిచి కూర్చోబెట్టి "మీదయవల్ల మావాడు లెక్కల్లో ఫస్ట్ వచ్చి ఇంజనీరింగ్ చదివి ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ గా జాబ్ చేస్తూ, నాకీ షెడ్ కొనిచ్చాడమ్మా! నాకొచ్చిన వృత్తి కదాఇది ఓపికున్నన్నినాళ్ళూ చేసుకుని ఆతర్వాత నాలాంటి వారికి ఉపాధిగా ఉంటుందనీ, సూపర్ వైజ్ చేసుకుంటూ బ్రతుకుదామని నడుపుతున్నానమ్మా! అంతా మీదయ. ఆరోజుల్లో నేను కారుషెడ్ లో కూలిపనీ చేస్తుండేవాడిని, మీకు ట్యూషన్ జీతంకూడా ఇచ్చుకోలేకపోతే మీరు ఉచితంగా చెప్పారు, గొప్పమనసమ్మా మీది!" అంటూ చేతులు జోడించాడు.

"చాలా సంతోషం, నాకోసాయం చేయాలయ్యా! మా మారుతీకారు మీషెడ్ కొచ్చింది. ఆ టమోటా రంగుకారు. అది బాగవుతుందా!! మా వారు సెకండ్ హ్యాండ్ కారు కొన్నారు" అంది కారు చూపిస్తూ సరస్వతి. "అమ్మా! మీకిది ఎవరోబాగానే అంటగట్టారు, చాలా పాతది. దీని ఒరిజనల్ స్పేర్ పార్ట్స్ దొరక్కే దీన్ని ఇరవై రోజులుగా షెడ్ లోనే ఉంచేశాను. దీన్ని మీరు వచ్చినకాడికి అమ్మేయటం ఉత్తమం, ఒరిజనల్ పార్ట్స్ అన్నీ వేసి బాగుచేయను షుమారుగా ఒక లక్ష అవుతుంది, ఐనా ఈ ఇంజన్ మళ్ళా ట్రబులివ్వకమానదు." అని అన్నాడా మెకానిక్ నొచ్చుకుంటూనూ...

"మంచిది. దీన్నలాగే మరో నెలపాటు నీషెడ్ లోనే ఉంచు," ఈవిషయం మావారికి మాత్రం చెప్పకు. ఎందుకోనేను తర్వాత చెప్తాను. ఆతర్వాత ఏంచెయ్యాలో చెప్తాను." అని కూరల బుట్టతో ఇంటికేసి నడిచింది. ఈలోగా వారి కాలనీలో రోజూ మాణిక్య రావును లిఫ్ట్ అడిగే ఆనందరావు కొత్తకారు కొన్నాడు. ఐతే మాణిక్యరావులా ఎవరికీ లిఫ్టు లూ గట్రా ఇవ్వటం లేదు. పెట్రోలు పెరిగింది, నేనేం మాణిక్యరావులా పనీపాటాలేనివాడ్నికాను. నా ఆఫీసూ నాపనీ నాకున్నాయ్!" అనేశాడు. అంతా "నిజమేగా మరీ!" అనుకుని వారివారి ప్రయత్నాల్లో వారు బళ్ళకూ గుళ్ళకూ కార్యాలయాలకూ, ఊర్లకూ వెళ్ళసాగారు.

ఒకరోజున మాణిక్యరావు బాత్ రూంలో పడి కాలు ఫ్రాక్చరైతే, సరస్వతి  "ఆఫీసుకెళ్తూ, దార్లో ఉన్న హస్పటల్ వద్ద మమ్మల్ని దింపుతారా అన్నయ్యగారూ! మావారు బాత్ రూంలో పడ్డారు కాలు మెలితిరిగిపోయింది, బాధతో విల విల్లాడుతున్నారు." అని అడిగింది ఇంటికెళ్ళి ఆనందరావును. "అయ్యో! ఏమీ అనుకోకు ఈరోజు నేను అర్జంట్గా మరో ఆఫీసు కెళ్ళాలి. ఇన్స్ పెక్షన్, సమయం లేదమ్మా! మరోమారు తప్పక దింపుతాగా!" అంటూ వెళ్ళిపోయాడు. 'ఇతగాడు దింపను మరోమారు పడాలన్నమాట!' అని మనస్సులో అనుకుంటూ, ఇంటికెళ్ళి విషయం మాణిక్య రావుకు చెప్పింది. అప్పుడే మాణిక్యరావు మనోనేత్రం తెరుచుకుంది. తననింతకాలం పొగిడి పనులు చక్కబెట్టుకున్నవారంతా ఎవరో తెల్సివచ్చి ఙ్ఞానోదయమైంది.

***

మరిన్ని కథలు

this is not a story
ఇది కథ కాదు
- సుస్మితా రమణమూర్తి
bee in the ear
చెవిలో జోరీగ
- మల్లవరపు సీతారాం కుమార్
thief
దొంగ
- బొందల నాగేశ్వరరావు
changed veeranna
మారిన వీరన్న (బాలల కథ)
- డి వి డి ప్రసాద్
Culture
సంస్కారం
- మల్లవరపు సీతాలక్ష్మి
Enough to pass tonight
ఈ రాత్రి గడిస్తే చాలు
- బుద్ధవరపు కామేశ్వరరావు
day star
వేగుచుక్క
- గొర్తి.వాణిశ్రీనివాస్
mallamamba
మల్లమాంబ
- నాగమణి తాళ్ళూరి