సౌగంధి - మూల వీరేశ్వర రావు

Sougandhi

సౌగంధి అది ఆంధ్రా లో రాయవరం ఒక పల్లెటూరు.ఆ పల్లెటూరు లో వేణుగోపాల స్వామి ఆలయానికి పూజారి గా రంగాచార్య పనిచేస్తున్నాడు.వంశపారపర్యం గా వచ్చిన అర్చక వృత్తి ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు,రాబడి పెద్దగా లేకపోయినా. ప్రభుత్వం ఇచ్చే అరకొర జీతం అవసరాలకు సరిపోవడం లేదు.రంగాచార్య కి ఒక కూతురు.పేరు సౌగంధి .యుక్త వయసు లో ఉంది.పెళ్ళి చెయ్య వలిసిన బాధ్యత గురించి దిగులు పడుతున్నాడు. ఇంటికి వచ్చి భార్య కాత్యాయనిని అడిగాడు. "అమ్మాయి ఎక్కడ ? " "కంప్యూటర్ పుచ్చుకొని ఆఫీస్ కి వెళ్ళిందని చెప్పాలా ? రాయుడి గారి ఇంట్లో పెళ్ళి .వంట వాడికి సహయం చెయ్యడానికి వెళ్ళింది." జవాబిచ్చింది వెటకారం గా కలం పుచ్చుకొని ఆఫీస్ లో కూర్చోవలిసిన కూతురు గరిట పుచ్చుకొని ఎండ లో తిరుగుతోందా ? బాధ గా అనుకున్నాడు రంగాచార్య " ఆ నరసింహం ఏమన్నాడు సంబంధం గురించి ? " "ఏది మళ్ళీ అడగ లేదు " " అడక్క పోతే ఏలా ? ఏం వేణు గోపాల స్వామి మీ అమ్మాయి కి కలెక్టర్ సంబంధం తీసుకువస్తాడా ? " " ఏమో ఆయన లీల లు మన కేం తెలుసు ? ఆ గిరిధారి ఓ దారి చూపడా ?" " చూపుతాడు గోదారి " అని విసుక్కుని వంటింట్లోకి వెళ్ళింది ********* స్ధలం :హైదరాబాద్ "ఏ అమ్మా, ఇప్పుడు మీరు పెళ్ళి కి వెళ్ళి తీరాలా " అడిగాడు చైతన్య.చైతన్య సివిల్స్ మెయిన్ పరీక్షల కి సిద్దమవుతున్నాడు. "అదేరా ,వాళ్ళు మా చిన్నప్పటి స్నేహితులు .వాళ్ళమ్మాయి పెళ్ళికి వెళ్ళక పోతే బాగుండదు.నీకు పరీక్షలు .నీకు హొటల్ తిండి పడదు. ఏం చెయ్యాలి ? " అంది చైతన్య తల్లి పార్వతి. " ఎవరైనా వంట మనిషి ని చూడు " అన్నాడు తండ్రి " వంటమనిషి అంటే గుర్తుకు వచ్చింది ,మొన్న ఒక నెంబర్ వాట్సప్ లో వచ్చింది." ఆ నెంబర్ కి ఫోన్ చేసింది పార్వతి. కాత్యాయని ఫోన్ తీసింది. " అదేనమ్మా,నేను రావడానికి కుదరదు.వేణు గోపాల స్వామి ఉత్సవాలు " "వేరే వాళ్ళు ఎవరైనా " "మా అమ్మాయి ఉంది.కాని..." నసిగింది కాత్యాయని. "ఫర్వాలేదు పంపండి.మా ఇంట్లో ఏలాంటి ఇబ్బంది ఉండదు.అమ్మాయి తో పాటు హెల్పర్ ని పంపండి." "వంట రుచి గా ఉండాలి " "ఆ విషయం లో మీరు నిశ్చింత గా ఉండచ్చు " ********* "నేను వెళ్ళనమ్మా " అంది సౌగంధి "అదేమిటే మంచి బేరం.పది మంది కి వండి వార్చక్కర్లేదు.నీకు తోడు గా శీను వస్తాడు.వంట నువ్వు చూసుకో.వడ్డన వాడు చూసుకుంటాడు ." "సర్లే " ****** చైతన్య కి మొదటి సారి సౌగంధి ని చూడగానే ఎన్నో శతాబ్దాల నిరీక్షణ ఫలించి దేవలోకం నుండి అప్సర దిగివచ్చినట్లు అనిపించింది.మంచు లో తడిసిన ముగ్ద మందారం లా భాసించింది. చైతన్య కి ఏ రోజు ఏం కావాలో మెనూ తయారు చేసి ఆ సమయానికి అది సిద్దం చేసింది.తన పనయ్యాక తన గది లోకి వెళ్ళి పోయేది. చైతన్య ఏదైనా కూర బాగుంటే "ఈ రోజు బీరకాయ పప్పు బాగుంది" అని చీటి లో రాసేవాడు.అది చూసి సౌగంధి మురిసిపోయేది. ఒక రోజు శీను కి ఆరోగ్యం బాగు లేదు.సౌగంధి అన్ని పనులు చకాచకా చేసి చైతన్య తో మాట్లాడకుండా మెరుపు లా మాయమయ్యేది. ఆ రోజు హిమానీ లు నాట్యమాడే ప్రాతః సమయాన్న ,ఉదయమే స్నానం చేసి కురులూ సవరించుకుంటూ," ఈ రోజు గుడి కీ వెళ్ళి వస్తాను" అని చెప్పి వెళ్ళి పోయింది.సౌగంధి మనస్సు లో చైతన్య అందగాడే అనుకుంది.మనస్సు ను అటు పోనికుండా తన ఆశయం గురించి ఆలోచిస్తోంది. ******** వారం తర్వాత పార్వతి వచ్చింది.ఇల్లు చూసి సంతృప్తి పడింది.సౌగంధి పని కి కొంచెం ఎక్కువే ముట్ట చెప్పింది. "ఏం పెట్టావు మా వాడు లావెక్కాడు " సౌగంధి సిగ్గు తో నవ్వింది.అప్పుడు చూసింది చైతన్య ని. చూపులు కలిసాయి.కలల భారం కనురెప్పల పై పడింది. చైతన్య చూపులు గిలిగింతలు పెట్టాయి.సౌగంధి వెళ్ళి పోయింది. ******** రెండేళ్ళ తర్వాత " అమ్మాయి ! ఈ రోజు కలెక్టర్ గారు మన స్కూలు ఇన్సెపక్షన్ కి వస్తున్నారు .అన్నీ సరిగా ఉండాలి.లేకపోతే రిమార్క్ వస్తుంది.ముఖ్యం గా పిల్లల కి మధ్యహ్న భోజన పధకం లో భోజనం గురించి ప్రత్యేకం గా పరీశీలిస్తారట!ఏమిటి సౌగంధి ఏమి సమస్యలు లేవు కదా " అడిగాడు హెడ్ మాస్టర్ హర నాధ రావు . "లేవండి" సరిగ్గా 11 గంటలకి కలెక్టర్ చైతన్య గారి కి ఘన స్వాగతం ఇచ్చాడు హరనాధ రావు. స్కూల్లో అన్ని విభాగాలు చెక్ చేసి వస్తుండగా సౌగంధి ఎదురయ్యింది. చైతన్య ఆశ్చర్య పోయాడు. " ఎవరు ?" అని అడిగాడు. "ఆ అమ్మాయి మెస్ లో పని చేస్తుంది.వంట లో ఎక్సపర్ట్ " మెస్ ఇన్ చార్జ్ చెప్పాడు. "ఆ విషయం తెలుసు " అని మనసు లో అనుకున్నాడు. తరువాత కలెక్టర్ గారు స్కూలు పిల్లల తో కలిసి భోజనం చేసారు.సౌగంధి వడ్డించింది. "నువ్వు చేసిన ములగ కాయ కూర అదుర్స్ " అన్నాడు చైతన్య సౌగంధి కి వినబడేలా ! భోజనాల కార్యక్రమం అయ్యాక కలెక్టర్ గారు తన బంగళా కి వెళ్ళి పోయారు.వెడుతూ సౌగంధీ కి మాత్రమే వినబడేలా "ఐ లవ్ యూ " అన్నాడు. "ఏమిటి సార్ " అడిగాడు హరనాధ్ "ఏం లేదు మెస్ నిర్వహణ బాగుందని ప్రత్యేకం గా అభినందిస్తున్నా" "అంతా మా సౌగంధి పనితనం,మా అదృష్టం' "సాయంత్రం మా ఊరి వేణు గోపాల స్వామి గుడి కి వెళ్ళండి " "తప్ప కుండా " ******** సాయంత్రం ఇంటి కి వచ్చాక రంగాచార్య కలెక్టర్ ని పొగుడుతున్నాడు.గుడి అభివృద్ది కి ప్రత్యేక నిధులు వచ్చేలా చేస్తానని చెప్పారు. తండ్రి ముఖం లో అంత ఆనందాన్ని సౌగంధి ఎప్పుడూ చూడలేదు. ********* మర్నాడు ఉదయం కారు వచ్చి ఆగింది.కారు నుండి కలెక్టర్ చైతన్య,తల్లి పార్వతి ,తండ్రి నారాయణ రావు దిగారు. కలెక్టర్ మన ఇంటి కి రావడమేమిటీ అని ఆశ్చర్యం లో మునిగి పోయారు కాత్యాయని,రంగాచార్య. "మీరు మా ఇంటికి " "అవును, మీ సౌగంధి ని కోడల్ని చేసు కోవడానికి " అని పార్వతి సౌగంధి ని కౌగలించుకుంది. " అంతా ఆ వేణు గోపాల స్వామి దయ " అన్నాడు రంగాచార్య పట్టు చీర,గాజులు ఉన్న పళ్ళాన్ని కాత్యాయని కి అందించింది పార్వతి. "మా అబ్బాయి ని చేసుకోవడం నీకు ఇష్టమేనా ?" అడిగాడు నారాయణ రావు. "ఒక షరతు " అంది సౌగంధి స్ధిరంగా "అదృష్టం కాళ్ళ దగ్గరకి వస్తే షరతులు ఏమిటే " అని విసుక్కుంది కాత్యాయని. "అమ్మాయిని చెప్ప నివ్వండి " అన్నాడు చైతన్య " ఏ అమ్మాయి ఐనా కలెక్టర్ సంబంధం అనగానే నా అదృష్టం అనుకుంటుంది.నేను కలెక్టర్ గారి భార్య కన్నా పది మంది కి విద్యను పంచే ఉపాధ్యాయురాలిని అవ్వాలనుకుంటున్నా.ముందు నాకు ఒక టీచర్ గా గుర్తింపు కావాలి.అది నా ఆశయం. ముందు టీచర్ తరువాతే కలెక్టర్ గారి భార్య.నా ఆశయానికి తోడ్పడితేనే నేను ఆయన భార్యనవుతాను" "బాగుంది వరస,నా కొడుకు కోసం అమ్మాయిలు క్యూ లో ఉన్నారు " అసహనం వ్యక్తపరిచింది పార్వతి. సరిగ్గా అదే సమయానికి ఫోన్ రావడంతో హడావిడి గా వెళ్ళిపోయాడు చైతన్య ************" స్కూలు కి వెళ్ళాక సౌగంధి కి తెలిసిందా వార్త ! కలెక్టర్ గారి కారు కి యాక్సిడెంటయ్యిందని.సౌగంధి ఆందోళన గా హాస్పిటల్ కి వెళ్ళింది. చైతన్య నవ్వుతూ పలకరించాడు సౌగంధిని. "మా ఉరికి రావడం వల్లే మీకు ఈ..." " అదేం లేదు ! ఈ ఉరికి రావడం వల్లే ,అందం,ఆత్మాభిమానం,వ్యక్తిత్వం కలబోసిన అమ్మాయి దొరికింది" "నీ ఆశయానికి నా తోడ్పాటు ఉంటుంది." సౌగంధి చేతి లో చెయ్యి వేసాడు.వారి మధ్య పాణి గ్రహణం జరిగింది. హాస్పిటల్ బయట ఉన్న ఎర్ర పూల చెట్టు ఆనందం గా ప్రాంగణం లో ఎర్ర పూలను రాల్చింది

మరిన్ని కథలు

Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం