సహజాతం - పి.కె. జయలక్ష్మి

sahajaatam

"నో వే, నేనేదైనా స్టార్ట్ చేస్తే అంతుచూడాల్సిందే. ఆరంభింతురు ఉత్తముల్" అంటూ మొదలుపెడితే "బాబోయ్ ఆంటీ! క్లాసు పీకకండి. వస్తా బాయ్!" అంటూ నిష్క్రమించిన అరుణ్ ని చూస్తూ ఉండిపోయాను.

నేను సైకాలజీ లెక్చరర్ గా ప్రైవేట్ కాలేజ్ లో పనిచేస్తున్నాను. మా శ్రీవారికి పబ్లిక్ సెక్టార్ లో ఉద్యోగం. పిల్లలు చిన్నక్లాసులు దాటి హైస్కూల్ కి వచ్చారు. సాయంత్రం కంప్యూటర్ క్లాసులు చెప్తూ ఉంటా. మధ్యాహ్నం రెండుకల్లా కాలేజ్ నుంచి రాగానే ఫ్రీ టైం సద్వినియోగం చేస్తూ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను. ఇంకా రేడియో ప్రొగ్రామ్ లు, సాహితీ సమావేశాలు, అడపాదడపా సృజనాత్మక వ్యాసంగం మొదలైన వాటితో బిజీగా ఉంటాను. మధ్యలో యోగా అని, రేకీ అని చేస్తూ ఉంటా. సాయంత్రం బ్యాచ్ కంప్యూటర్ స్టూడెంట్ అరుణ్. మూడు నెలల కోర్సులో చేరాడు. నెల వరకు బానే వచ్చాడు. ఇదిగో ఈమధ్య సరిగ్గా రావట్లేదు. ఆ కుర్రవాడికి నేనంటే ఏదో అడ్మిరేషన్. "ఇన్ని పన్లు ఎలా చేస్తారాంటీ? డోంట్ యూ ఫీల్ టయార్డ్?" అంటాడు. ఎప్పుడైనా క్లాస్ అయిపోయాక నేను ఫ్రీగా ఉంటే తన ఫ్రెండ్స్ గురించి, ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఒక రోజు తన ప్రాక్టీస్ అయ్యాక లోపలికి వచ్చేసరికి నేనెవరికో కౌన్సిలింగ్ చేస్తూ ఉండడంతో పక్కరూంలోంచి వింటూ కూర్చున్నాడు. వాళ్ళు వెళ్ళగానే నారూంలోకి వచ్చి "వావ్ ఆంటీ ఎంత బాగా చెప్పారో. నిజంగా ఎలాంటి వాళ్ళయినా మీ మాటలు విని మారి తీరాల్సిందే. మీకింత పేషన్స్ ఎలా వచ్చింది? యూ ఆర్ రియల్లీ గ్రేట్!" అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. "నేను చదువుకున్న చదువే ఇది మరి" అని నవ్వేసాను.

ఆరు నెలలు గడిచిపోయాయి. అడపాదడపా రెండు నెలలు వచ్చిన అరుణ్ తర్వాత నుంచి అస్సలు రావడం మానేసాడు. ఆ మధ్య రెండు, మూడు సార్లు ఫోన్ చేస్తే ఫాదర్ కి బాలేదని, బోంబేలో ట్రీట్ మెంట్ అని చెప్పాడు. నేను కూడా ధైర్యం చెప్తూ జాగ్రత్తలు చెప్పాను. ఒకరోజు న్యూస్ పేపర్ లో ఆయన పోయినట్లు చూసి చాలా షాకయ్యాను. ఫోన్ చేసినా అరుణ్ నుంచి రెస్పాన్స్ లేదు. తర్వాత దాదాపు రెండునెల్లకి అరుణ్ కలిసాడు, చిక్కిపోయాడు... డిప్రెస్ట్ గా కూడా ఉన్నాడు. ఆరోజు ఆదివారం కావడంతో నేను ఇంట్లోనే ఉన్నాను, శ్రీవారు పిల్లల్ని తీసుకుని బైటకి వెళ్ళారు. ఎలా పలకరించాలో తెలియలేదు. "సారీ అరుణ్, డాడీ విషయం తెల్సి చాలా బాధపడ్డాను. మమ్మీ ఎలా ఉన్నారు? ధైర్యం చెప్పాల్సిన బాధ్యత నీదే, యూహావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్" అన్నాను లాలనగా. తల దించుకొని వుండడంతో ముఖంలోని ఫీలింగ్స్ కన్పించలేదు. "డాడీ పోయిన దానికంటే అమ్మకి అన్యాయం చేసారని నాకు బాధగా వుందాంటీ" అన్నాడు శూన్యంలోకి చూస్తూ "ఏం మాట్లాడుతున్నావు అరుణ్?" అన్నా ఆశ్చర్యంగా. "అవునాంటీ! డాడీలో మాకు తెలియని రహస్యాలుంటాయని అనుకోలేదు. ఆయన పోయాక కొన్ని విషయాలు బైటపడ్డాయి. ఎవరినో ఈమధ్యకాలంలోనే ప్రేమించారంట చూడండీ ఈడైరీ. అంతా ఆమె గురించే "దనూ"ట! అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకుని...? ఎలా సాధ్యం ఆంటీ... ఇంకొకళ్ళని ప్రేమించడం? నాకెందుకో ఆయన నచ్చడం లేదాంటీ... మీరే చెప్పండి! సరే నేను మళ్ళీ కలుస్తాను. ఈ డైరీ మీ దగ్గరే ఉంచండి". అంటూ సీరియస్ గా లేచి వెళ్ళిపోయాడు.

"దనూ?!" ఆసక్తిగా, ఆశ్చర్యంగా డైరీ తెరిచాను.
2 జనవరి - యోగా క్లాసుకి చాలా కాలం తర్వాత వెళ్ళాను. ఇంకా స్టార్ట్ అవ్వలేదు పాత మిత్రులతో మాట్లాడుతూ ఉండగా తటిల్లతలా వచ్చిన ఆమెను చూస్తూ ఉండిపోయాను. అందరిని "హలో గుడ్మాణింగ్" అంటూ నవ్వుతూ పలకరిస్తూ నావైపు ఆశ్చర్యంగా చూసింది. ఎందుకో తనని చూస్తే ఎప్పట్నించో తెలిసిన అమ్మాయిలా అన్పించింది. నాలుగు, ఐదు రోజుల డైరీలో ఆమె వర్ణనే!

10 జనవరి - ధైర్యం చేసి నేను పలకరించాను తనూ మాట్లాడింది. ఎప్పుడైనా క్లాసుకి ముందు వస్తే జనరల్ విషయాలు, పిల్లలు చదువులు ఏవో మాట్లాడుకునే వాళ్ళం ఆరోగ్యరీత్యా యోగాలో చేరినా ఎందుకో రెగ్యులర్ గా వెళ్ళలేకపోతున్నాను. చాలా ఆలస్యంగా పడుకోవడం వర్క్ టెన్షన్స్, క్యాంపులు, నాజీవిత విధానం, అలవాట్లు కారణంగా! కాని తనని కలిసాక తనని చూడడానికి, మాట్లాడ్డం కోసమైనా రోజూ వెళ్ళాలన్పించేది. కాని మనసు మాట శరీరం వినాలి కదా!

ఇంకో పేజీలో... తనకి ప్రేమతో "దనూ" అని పెట్టుకున్నాను. వెన్నెల పారిజాతంలా ఉంటుందామె. దేవుడి ఫోటో దగ్గర పారిజాతాలు ఉంచి అగరుబత్తి వెలిగిస్తున్న ఆమె ముఖంలో ప్రశాంతత నాకు ఎంతో అద్భుతంగా అన్పించింది. ఇంకో చోట... ఇవాళ మా ఆఫీస్ కి వచ్చింది. తనేదో ప్రాజెక్ట్ చేస్తోందట. నేను సర్టిఫై చేయాలట. చాలాసేపు మాట్లాడకుండా ఉండిపోయాం. వెళ్ళిపోతుంటే తెలియని బాధ ఆవరించింది. నాబలాలు, బలహీనతలు, బాల్యం, అలవాట్లు అన్నీ తనకి చెప్పుకున్నాను. నా జీవితంలో తనో అందమైన పార్శ్వం. మాటల్లో సౌమ్యత, ముఖంలో చిరునవ్వు, కళ్ళల్లో ప్రశాంతత... ఆమె నాకు ఎంతో ఆకర్షణీయంగా అన్పిస్తుంది. తను ఎప్పుడైనా ఫోన్ చేస్తే నాకెంతో ఉత్సాహంగా అన్పిస్తుంది. మా ఇద్దరి మధ్య ఎప్పట్నించో ఏదో బంధం ఉన్న ఫీలింగ్. అతిగా మాట్లాడదు, ఏం చెప్తున్నా ఇష్టంగా వింటుంది. మనసు వెలితిగా ఫీలయినా, టెన్షన్ గా అన్పించినా తనతో మాట్లాడాలని పదేపదే అన్పిస్తుంది. ఎందుకనో?

జూన్ 12 ఈ మధ్య చాలా కాలంగా యోగాకి వెళ్ళడం కుదరడం లేదు మధ్యలో ఫోన్ చేస్తూ దనూతో మాట్లాడ్డం మాత్రం మానలేదు. ఒకసారి తను ఏదో పనిమీద ఆఫీస్ కి వచ్చిందట. కాని నేను లేను. తెలిసాక బాధపడ్డాను. ఎందుకిలా అవుతోంది? నాకు తనంటే ఎందుకంత ఇష్టం? ఫోన్ చేసినప్పుడల్లా ఏదో విధంగా తన పట్ల నా ఫీలింగ్స్ వ్యక్తం చేసేస్తూ ఉంటాను. ఏమన్పిస్తుందో కూడా మొహమాటం లేకుండా చెప్పేసినా తన నుంచి ఏ స్పందనా ఉండదు. టాపిక్ తెలివిగా మార్చేస్తుంది. ఆమె చమత్కారపు మాటలు, భావుకత, ప్రశాంతత, చైతన్యం, అందరితో మాట్లాడే తీరు నాకు ఎంతో ముచ్చటగా అన్పిస్తుంది. ప్రశంసించినా నవ్వేసి ఊరుకుంటుంది. ఒకసారి మాటల్లో తన టాలెంట్స్ కి, ఎదుగుదలకి భర్తే కారణమని చెప్పింది. కొంచెం ఈర్ష్యనిపించినా సంతోషం వ్యక్తం చేశాను. ఎందుకంటే నేనెన్ని సార్లు నా  మగతనం నిరూపించుకున్నా నా భార్య ఎప్పుడు నన్ను ప్రశంసించలేదు. కాని ఇంకా ఏవో అమర్చి పెట్టలేదని నన్ను నిరుత్సాహ పరుస్తుంది. ఎప్పుడూ అసంతృప్తే..! ఆ కోణంలో ఆమె భర్త ఎంత అదృష్టవంతుడు అనుకున్నా.

1. ఆగష్టు - ధనూని చూడాలని వుంది కాని ఆరోగ్యం సహకరించడం లేదు డాక్టర్లు టెస్ట్ లు అంటున్నారు. తను ఈమధ్య ఫోన్ చేసినా నేను రెస్పాండ్ కాలేకపోతున్నాను. ఏమనుకుంటుందో? దనూ చాలాసార్లు చెప్పింది. "శ్రీకర్! సిగరెట్స్, ఆల్కహాల్ మానేయండి" అని! ఏంటో ఎడిక్ట్ అయిపోయాను. దనూ నా జీవితంలో ఇంకొంచెం ముందు ప్రవేశించి ఉంటే తనమాట వినేవాన్నా...? ఏమో? తను ఏం చెప్పినా "నో" అనాలన్పించదు. ఒకసారి తనేమందో తెల్సా "శ్రీకర్ సిగరెట్ కాల్చాలన్పించినపుడల్లా మీకు ప్రియమైన వారితో మాట్లాడండి" అని. నాకు ప్రియమైన వాళ్ళెవరో తనకి తెలియదా..? ఆశ్చర్యం! మా ఇద్దరికీ ఏరకమైన వారధులు లేవు. ఎవరి నుంచి ఎవరికీ ఏ ఆబ్లిగేషన్స్ లేవు. కాని తనంటే నాకు చెప్పలేని 'ఇది'... ఇలా సాగిపోయింది డైరీ అంతా!

భారంగా నిట్టూర్చాను. ఒక నిర్ణయానికి వచ్చి అరుణ్ కి వీలయినపుడు రమ్మని ఫోన్ చేసాను. నాలుగు రోజుల తర్వాత మధ్యాహ్నం మూడు అవుతుంటే వచ్చాడు. అరుణ్. "దా అరుణ్, భోజనం చేసావా? లైమ్ జ్యూస్ తీసుకో" అంటూ రెండు గ్లాసులతో పట్టుకొచ్చి డ్రాయింగ్ రూంలో కూచున్నాము. "డైరీ చదివారా రాధాంటీ! ఇప్పుడు మీరే చెప్పండి మా డాడీ అలా చేయచ్చా?" సూటిగా అడిగాడు. "అరుణ్ మీ డాడీ విషయం పక్కన పెట్టు. నీకో విషయం తెలుసా? ఆకర్షణ, అభిమానం, ప్రేమ, కన్ సర్న్, జాలి, దయ ఇవన్నీ మనిషిలో ఉండే సహజాతాలు. కారణం తెలియకుండానే కొందరి మీద అభిమానం, మరికొందరి మీద ద్వేషం, చికాకు కల్గుతాయి. ఎందుకంటే చప్పలేం. కొందరు తమలో లేని వైఖరి ఇతరుల్లో కన్పిస్తే ఆకర్షింపబడతారు. నా ఉద్దేశ్యం మీ డాడీ ది రిజర్వ్ డే నేచర్. బహుశా ఆయనకి కలివిడి తనంగా ఉంటే నచ్చుతుందేమో!" సాలోచనగా ప్రశించాను.

"అవునాంటీ, డాడీ చాలా తక్కువగా మాట్లాడతారు. అలాగే నవ్వడం కూడా తక్కువే. అందుకే నాకు ఆశ్చర్యమన్పించింది ఇది చదువుతుంటే! అయినా ఆంటీ ఆయనేమైనా  టీనేజరా నాఅంత కొడుకుని పెట్టుకుని? మా అమ్మకి తెలిస్తే ఎంత బాధపడుతుంది? అమ్మలో కూడా ఇంచుమించు ఆ ధనూ గుణాలన్నీ వున్నాయి కదా" అన్నాడు కించిత్ కినుకగా. అరుణ్ మాటలకి నాకు నవ్వొచ్చింది. "చూడు నాన్నా. తల్లి ఎలావున్నా పిల్లలకి ఆమె చాలా నచ్చుతుంది. కాని భర్తకి అన్ని యాస్పెక్ట్స్ లో భార్య నచ్చాలని లేదు. అలాగే భార్యకి కూడా భర్త! ఇకపోతే టీనేజరా అన్నావు? మనిషి మనసు ఎప్పుడు ఎవరి పట్ల ఎలా స్పందిస్తుందో ఎవరం చెప్పలేం! కొంతమంది బైటకి వ్యక్తం చేయకుండా మనసులో ఊహించుకుంటూ ఉంటారు. సమాజం, పరువు, ప్రతిష్ట ఎన్నో కారణాల వల్ల! మీ అమ్మగారి కంటే ధనూ బాగుండకపోవచ్చు. కాని కేవలం అందమే ఇక్కడ ప్రాధాన్యం కాదు. కొంతమంది నవ్వు, నడత, అవతలి వారిపట్ల కనపరిచే గౌరవం, కన్ సర్న్, సరదాగా నవ్విస్తూ మాట్లాడే విధానం, కలుపుగోరుతనం, హావభావాలు ఏదైనా మనసుకి నచ్చవచ్చు. దాని గురించి అవతలి వాళ్ళు వివాహితులా అవివాహితులా, వయసులో ఉన్నారా, ముసలి వాళ్ళా అని ఆలోచించే పనిలేదు. కొంతమంది ఏమాత్రం అందంగా లేకపోయినా కేవలం మాట తీరుతో అందర్నీ ఆకర్షించుకుంటారు...

బహుశా మీనాన్నగారికి ఫ్రెండ్స్ పరిమితమై వుండచ్చు. ఇంట్లో మీ మమ్మీతో ఆయన వేవ్ లెంగ్త్ కుదరకపోయి వుండవచ్చు. ఆయన కోరుకున్న అంశాలు, లక్షణాలు ధనూలో కన్పించడంతో స్నేహం చేసి వుండవచ్చు. అదే ధనూ మగవాడయితే నీకు బాధన్పించేది కాదేమో. ఇదే మన సమాజం చేసుకున్న దౌర్భాగ్యం. అపోజిట్ సెక్స్ తో స్నేహంగా ఉంటే, వాళ్ళు పరిధుల్లోనే ఉన్నా అనుమానంగా చూసి అభాండాలు వేస్తారు. మీ డాడీ ఏమీ లిమిట్స్ దాటలేదు కదా! కేవలం తన భావాల్ని, ఆలోచనల్ని అపురూపంగా డైరీలో వ్రాసుకున్నాడు. ప్రతి మనిషికి హృదయంలో సీక్రెట్ కార్నర్స్ ఉంటాయి. ఇది సైకాలజీ చెప్పే నిజం. అన్నిటినీ అందరితో పంచుకోలేరు! వాళ్ళ మనసే వాళ్ళకి అంతరంగిక నేస్తం. స్వంతవాళ్ళకి చెప్పినా కొన్నిటిని ఎవరూ ఆమోదించలేరు. ఆమోదించకూడదు కూడా!...

... ఫీలింగ్స్ అనేవి నేచురల్ ఇన్ స్టింక్ట్స్. ఎవ్వరం నియంత్రించుకోలేనివి. అయినా నీకో విషయం చెప్పనా ఆశ్చర్యపడనంటే?" నా మాటల ప్రభావం తన మీద చాలా బాగా కన్పిస్తోంటే అడిగాను సడన్ గా. "ఏంటాంటీ?" ఉత్సుకతగా అడిగాడు అరుణ్. "ధనూ అంటే ధనశ్రీ. తను నాకు బాగా దగ్గర బంధువు. హార్ట్ లో డిజార్టర్ వల్ల తను యోగాలో చేరింది. కాని తన గొప్పతనమేంటంటే తన బాధల్ని ఎవరికీ చెప్పదు. అందరి బాధలు వింటుంది. మాటసాయం చేస్తుంది. మీ డాడీకి అన్పించినవన్నీ అందరికీ తనని చూస్తే అన్పిస్తాయి. కాని అందరూ వ్యక్తం చేయరు. నాకూ తనంటే ఇష్టం. చాలామంచిది ధనూ. ఒక్కమాటలో చెప్పాలంటే తను ఎక్కడుంటే అక్కడ చైతన్యం ఉంటుంది. తనలా ఉండాలని ఎంతమంది అనుకుంటారో కాని తనే ఉండకుండా వెళ్ళిపోయింది". చివరి మాటలకి ఉలిక్కిపడ్డాడు అరుణ్. "ఏంటాంటీ మీరనేది?" అవును అరుణ్, షీ ఈజ్ నో మోర్. మీ డాడీ కంటే నెల రోజుల ముందు కార్టియాక్ అరెస్ట్ వల్ల చనిపోయింది. మంచి వాళ్ళని, వాళ్ళని ఆరాధించే మంచి వాళ్ళని దేవుడు ఎక్కువ కాలం ఉంచడు కదా! ఇప్పటికైనా మీ డాడీని అర్ధం చేసుకుంటే ఆయన ఆత్మ శాంతిస్తుంది." అన్నాను ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ. "ఓ... నో..! నిజమా? రియల్లీ ఐయామ్ వెరీ సారీ ఆంటీ, నేను చాలా ఇడియట్ లా ప్రవర్తించాను. మీవల్ల చాలా విషయాలు అర్ధం చేసుకున్నాను. సంస్కారవంతంగా ఆలోచించడానికి మీ హెల్ఫ్ ఎప్పుడూ నాకుంటుంది. ఐ లై క్యూ సోమచ్ ఆంటీ, మళ్ళీ కలుస్తాను బై!" అని వెళ్ళిపోయాడు.

అరుణ్ వెళ్ళిన చాలా సేపటి వరకు అలాగే కూచుండిపోయాను. నెమ్మదిగా లేచి టేబుల్ మీద వున్న నానోట్స్ అందుకున్నాను. దాని మీద రాసున్న డా. అనూరాధ పేరుని ఆప్యాయంగా తడిమాను. ఆ రోజు శ్రీకర్ మాటలు గుర్తొచ్చాయి. "మీ వారు 'అనూ' అంటారు, ఫ్రెండ్స్ 'రాధ' అంటారు. మరి నేను? అందరూ పిలిచిన పేర్లతో పిలిస్తే నా ప్రత్యేకత ఏముంది? నిన్ను ధనూ అని పిలవనా? నీపేరులోని అక్షరాలే" దుఃఖం కట్టలు తెంచుకుంది శ్రీకర్ ని తలచుకోగానే. "నన్ను ఇంతగా ఆరాధించావా శ్రీకర్?" అరుణ్ మనసులో తండ్రి పట్ల గౌరవం చెక్కుచెదరకుండా ఉండడం కోసం శ్రీకర్ తో పాటు ధనూని కూడా సజీవ సమాధి చేసేసాను. ఇంక ఆపేరు అవసరం ఎప్పటికీ ఎవరికీ రాదు. 'ధనూ' శ్రీకర్ తో శాశ్వతంగా వెళ్ళిపోయింది. 'ధనూశ్రీ' నా మరో రూపమని అరుణ్ కి ఎప్పటికీ తెలియదు. ఎంత సైకాలజిస్ట్ నైనా నేనూ సహజాతాలకి అతీతురాల్ని కానుగా!

***

మరిన్ని కథలు

thief
దొంగ
- బొందల నాగేశ్వరరావు
changed veeranna
మారిన వీరన్న (బాలల కథ)
- డి వి డి ప్రసాద్
Culture
సంస్కారం
- మల్లవరపు సీతాలక్ష్మి
Enough to pass tonight
ఈ రాత్రి గడిస్తే చాలు
- బుద్ధవరపు కామేశ్వరరావు
day star
వేగుచుక్క
- గొర్తి.వాణిశ్రీనివాస్
mallamamba
మల్లమాంబ
- నాగమణి తాళ్ళూరి
Millions ... letters
లక్షలు... అక్షరాలు
- మీగడ.వీరభద్రస్వామి
new life
నవజీవనం
- బుద్ధవరవు కామేశ్వరరావు