కులం కాదు గుణం గొప్పది - కందర్ప మూర్తి

Kulam kaadu gunam goppadi
అగ్రహారం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో
కమల, విమల , అమల ఐదవ తరగతి చదువుతున్నారు.
అందరూ ఒకే వయసున్నా విభిన్న మనస్తత్వాలు వారివి.
కమల సన్నకారు రైతు వీరయ్య కుమార్తె . గ్రామంలో
వ్యవసాయదారులు, కులవృత్తుల వారు పిల్లల్ని తమ
వెంట పొలం పనులకు, వృత్తి పనులకు తీసుకువెళ్లినా
రైతు వీరయ్య ఆడపిల్లకు చదువు ఉండాలని కూతుర్ని
పాఠశాలకు పంపి చదివిస్తున్నాడు. కమల వినయ
విధేయతలు గలపిల్ల. రైతు కుటుంబంలో పుట్టినా
చదువంటే శ్రద్ధ ఎక్కువ.
పాఠశాల అవగానే ఇంటికి వచ్చి తల్లికి ఇంటి పనులలో
సహాయపడుతు తర్వాత చదువుకుంటుంది. శలవు
దినాలలో పొలం పనులలో తండ్రికి సహాయ పడటమే
కాదు పాడి పశువుల్ని మేతకు తోలుకెల్తుంది. చదువులో
చురుకుదనం కనబరుస్తు తరగతిలో అందరి కన్న ముందుగా
నిలుస్తోంది.
విమల గ్రామ పురోహితులు అవధాన్ల గారి ఏకైక కుమార్తె.
ఊరిలో ఏ శుభకార్యం జరగాలన్నా, పూజా కార్యక్రమాలు
జరపాలన్నా పంతులు గార్ని సంప్రదించాల్సిందే. పక్క గ్రామాల
నుంచి ఎందరో జనం తండ్రి దగ్గరకు రావడం, దండాలు పెట్టి
ఆయన పిలిచే వరకు ఎదురు చూడటం విమల చూసేది.
తమ కులం అందరికంటె గొప్ప అనే అహంభావనతో క్లాసులో
అందరి ముందు దర్పం కనబర్చేది. పొగరుగా మాట్లాడుతుంది.
చదువులో మాత్రం వెనుకే.
అమల ఊరి షావుకారు ముద్దుల పట్టి. ఇంట్లో గారాబం
ఎక్కువైనందున తలబిరుసుగా మాట్లాడుతుంది. షాపుకి
వెచ్చాల కోసం వచ్చే కొనుగోలుదారులతో పెడసరంగా
మసులుతుంది. కొంతమంది రైతులు షావుకారు దగ్గర
ఎరువులు , విత్తనాలు అప్పు మీద తీసుకున్నందున అమల
ఎలా ప్రవర్తించినా ఏమనకుండ తమ సరుకులు తీసుకుపోయేవారు.
క్లాసులో అందరికంటె తమవి పెద్ద కులాలన్న గర్వంతో
ఇద్దరూ ఒకరికొకరు గొప్పలు చెప్పుకునేవారు. మా నాన్న దగ్గరకు
రోజూ ఎందరో మనుషులు పూజల కోసం వచ్చి గుమ్మం ముందు
ఎదురు చూస్తారని, ఇళ్లు కట్టాలన్నా శంకుస్థాపనలు చెయ్యాలన్నా
మానాన్న లేకపోతే ఏవీ జరగవని దర్పంగా విమల చెబితే,
మా నాన్న ఎరువులు , విత్తనాలు అందచెయ్యకపోతే ఊళ్లో
పంటలే పండవని, రైతులు ఆకలితో చచ్చిపోతారని అమల
డాంబికాలు చెప్పేది. చదువులో మాత్రం ఇద్దరూ వెనుకబడి
ఉండేవారు.
కమల ఉన్నంతలో సాంప్రదాయ బద్దంగా బట్టలు కట్టుకుని
తరగతిలో అందరితో అణకువగా ఉండటం వల్ల ఉపాద్యాయుల
మన్ననలు పొందుతోంది. చదువులో చురుకుదనం కారణంగా
తరగతిలో ప్రథమశ్రేణి విద్యార్ధినిగా అందరి మెప్పు సంపాదించడం
విమల, అమలలకు ఈర్ష్యగా మారింది. కమలది చిన్న కులమని
పూరి గుడిసెలో ఉంటారని , చోళ్లు గంట్లు కొర్రలు ఊదలు చిరుధాన్యాలు
తింటారని, మా ఇంట్లో ఈరోజు పాయసం చేసారంటె, మా ఇంట్లో బూరెలు
వండేరని ఇద్దరూ కమలకు వినబడేలా అవహేళన చేసేవారు. కమల క్లాసు
నుంచి పైకి వెళ్లినప్పుడు ఆమె టెక్ట్స్ బుక్స్ నుంచి కాగితాలు చింపేసేవారు.
ఐనా కమల టీచర్స్ కి ఫిర్యాదు చెయ్యకుండా తన పని తను చేసుకుపోయేది.
ఒకరోజు అమల - విమల కలిసి క్లాసులో కమలను అందరి ముందు
నవ్వుల పాలు చెయ్యాలనుకుని ఒక పన్నాగం చేసారు. మైదానంలో ఆటల
సమయంలో అమల తన దగ్గరున్న పది రూపాయల నోటు ఎవరు చూడటం
లేదనుకుని కమల బేగులో పుస్తకాల మద్య పెట్టింది.
పాఠశాల వదిలే ముందు తన బేగులోంచి ఎవరో పది రూపాయల నోటు
దొంగిలించారని అమల క్లాసు టీచర్కి ఫిర్యాదు చేసింది. టీచర్ ఎవరు
అమల బేగులోంచి పది రూపాయల నోటు దొంగగిలించారని నిలదీసింది.
నేను కాదంటె నేను కాదని అందరు చెప్పారు. మరొకసారి తమ పుస్తకాల
బేగులు చూసుకోమని టీచర్ చెప్పగా అన్ని పుస్తకాలు పైకి తీసి వెతికినా
పోయిన పదిరూపాయల నోటు దొరకలేదు.
చివరకు క్లాసు టీచర్ మిగతా విద్యార్థులందరి బేగులు పుస్తకాలు
వెతకడం ప్రారంభించింది. ఆఖరికి కమల బేగులో పుస్తకాల మద్య నోటు
కనబడింది. అది చూసి కమల నిశ్చేష్టురాలైంది. తను ఆ నోటు
తియ్యలేదని తన బేగులోకి ఎలా వచ్చిందో తెలియదని ఏడవడం
మొదలెట్టింది.
కమల ప్రవర్తన తెలిసిన టీచర్లు ఆ అమ్మాయి అటువంటి పని
చేసి ఉండదని నిర్దారణ కొచ్చినా సాక్ష్యం కనబడుతోంది. కమల
తను దొంగతనం చెయ్యలేదని వెక్కి వెక్కి ఏడుస్తోంది.
ఇంతలో కింది తరగతి విద్యార్థి వచ్చి తను అమల, పదిరూపాయల
నోటు కమల పుస్తకాల బేగులో పెట్టడం చూసానని నిజం చెప్పాడు.
విషయం తెలిసి క్లాసు టీచర్ ఇంట్లో చెబుతానని నిలదీయగా తను, విమల
కమల చిన్న కులస్తురాలని, ఆమెను నవ్వుల పాలు చెయ్యడానికి
ఈ పని చేసామని తప్పు ఒప్పుకుని ఇద్దరూ క్షమాపణ అడిగారు.
కులాలు కాదు గుణాలు మంచిగా ఉండాలని క్లాసు టీచర్
మందలించింది. అప్పటి నుంచి అమల -విమల , కమలతో స్నేహంగా
ఉంటున్నారు.
* * *

మరిన్ని కథలు

Kudi Edamaithe
కుడి ఎడమైతే
- మద్దూరి నరసింహమూర్తి
Complaint
కంప్లైంట్
- Kodali sitarama rao
Aakali
ఆకలి
- అరవ విస్సు
Alludigari alaka panpu
అల్లుడుగారి అలక పాన్పు
- మోహనరావు మంత్రిప్రగడ
Nruga maharaju
నృగ మహరాజు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Maa nava bandhalu
మా నవ బంధాలు
- బామా శ్రీ (బాలాజీ మామిడిశెట్టి)
Cycle nerchukovadam
సైకిల్ నేర్చుకోవడం
- మద్దూరి నరసింహమూర్తి