శానిటోరియం - ఆకేపాటి కృష్ణ మోహన్

Sanitorium

ప్రేమ ఎప్పుడు ఎలా ఉద్భవిస్తుందో ఎవరు చెప్పగలరు? అప్పటి వరకు ఎలాంటి స్పందనకు నోచుకోని హృదయం ఒక్కసారిగా త్రుళ్ళి పడొచ్చు. నిస్సహాయత, నిరాశతో అణిగిపోయిన వ్యక్తిని ప్రేమ స్వరూపం అనునయించవచ్చు. అప్పటివరకూ రవి ఎవ్వరినీ అలా ప్రేమించి ఎరుగడు. జీవితం మీద ఆశను వదులుకొని ఆ శానిటోరియంలో చేరినపుడు రవికి ఇలాంటి స్పందనలు కాదు కదా కనీసం మరొక నెల జీవిస్తాడో లేదో తెలియని పరిస్థితి. ఊపిరితిత్తుల సామర్ద్యం తగ్గిపోవడంతో T.B బారిన పడి, చిన్న వయస్సులోనే అనారోగ్యం పాలైనాడు.

ఆధునిక ఖరీదైన వైద్యం భరించే స్తోమత లేక రవి వాళ్ళ అన్నయ్య, రవికి నచ్చజెప్పి, శానిటోరియం లో చేర్పించాడు. కుటుంబం నుంచి దూరంగా, అనారోగ్య పీడితుడిగా T.B నుంచి కోలుకునేందుకు రవి అక్కడ అడుగు పెట్టాడు.

“కాలుష్యానికి దూరంగా, స్వచ్చమైన ప్రదేశంలో కొన్నినెలలు ఉంటే ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో” అన్న స్పెషలిస్ట్ మాటలు ఇంకా వినపడుతున్నాయి. శానిటోరియం అంటే మరణానికి దగ్గిరగా వచ్చామన్న బలమైన అభిప్రాయం రవిలో సహజంగానే కలిగింది.

కొన్ని బట్టలు, వస్తువులు సర్దుకుని శానిటోరియంలో చేరడానికి బయలుదేరాడు రవి. ఆలోచనలకు అడ్డు కట్ట వేస్తూ “శానిటోరియం స్టాప్” అన్న కండక్టర్ మాటలకు లేచి త్వరగా బాగ్ తీసుకుని బస్సు దిగాడు. నగరం నాలుగు గోడల మధ్య, యిరుకు ఆఫీసులో, ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసే రవికి, శానిటోరియం ఎంతో మార్పుగా అనిపించింది. ప్రకృతి తన స్వచ్చతను, రమణీయతను ఆ పరిసరాల్లో మెండుగా ప్రసాధించిందా అన్నట్లు ఉన్నది ఆ శానిటోరియం. మూడు దిక్కులా చిన్న కొండలు, మధ్య చిన్నపాటి లోయలో, Eucalyptus, అశోక, ఫిర్ చెట్ల మధ్య విసిరేసినట్లు నిర్మించిన Barracks శానిటోరియంలో ప్రధానమైన నిర్మాణంగా ఉంది.

ఆవరణలోకి వెళ్ళిన తర్వాత అతనికి గది కేటాయించబడినది. ఆ రోజు తనతో బాటు మరికొంతమంది patients ని చేర్చుకున్నారని చెప్పి, “ఒక గంటలో మీరు Central Hall కి వెళ్ళాలి. అక్కడ మీకు డాక్టర్ గారు యిక్కడ treatment విధానం, యితర వివరాలు తెలియజేస్తారు” అని Receptionist తెలియజేసింది. రూములో వస్తువులు సర్దుకుని రెడి అయ్యాక ఆ Central Hall ని

- 2 -

వెతుక్కుంటూ వెళ్ళాడు రవి. అప్పటికే అక్కడ కొంత మంది ఉన్నారు, కాని వారందరూ వయస్సులో పెద్దవాళ్ళు లేదా మధ్య వయస్కులో అయి ఉన్నారు. ఆ గదిలో ఒక వరుసలో రవి కూర్చున్నాడు.

శానిటోరియంలో ఉన్నప్పుడు షెడ్యూల్ ఎలా ఉంటుందో వివరిస్తూ అందరికీ ఒక బుక్లెట్ లాంటిది అందిస్తున్నారు. డాక్టర్ గారు ఈ రోజు లీవ్ లో ఉండడం చేత సిస్టర్ లలిత కుమారి మనతో మాట్లాడుతారు. అని ప్రక్క వారు అనుకుంటూ ఉండగానే సిస్టర్ లలిత కుమారి ఆ రూములోకి వచ్చింది.

ఆమెతోనే ఆ గదిలోకి చల్లగా గాలి వీచింది. Barracks మధ్యలో చేమంతి, బంతి, రోజాపూల తోటలోంచి పరిమళం గుమ్మగా ఆ గాలితో కూడా ప్రవేశించింది. ఆ తర్వాత రవికి ఎందుకో బంతి పూల వాసన తోనే లలిత కుమారి గుర్తుకు వచ్చేది, లేదా ఆమెతోనే ఆ సుగంధం పరుచుకునేదేమో. లలిత శానిటోరియంలో క్రొత్తగా జాయిన్ అయిన నర్స్. ఆమె వయస్సులో చిన్నదైనా, విషయ పరిజ్ఞానం ఎక్కువ. ఆమె అందమైనది కాదు. ఆకర్షణ లాంటిదేదైన ఉన్నదంటే ఆమె దాన్ని పట్టించుకునేదే కాదు. నిష్కల్మష మనసుతో ప్రేమించడం, సేవ చేయడం లలిత కుమారి నుంచే నేర్చుకోవాలనిపించేది. సేవాభావం, కారుణ్యం, దయ, కలిసి ఆమెకు ఆ చిన్న వయస్సులో ఇచ్చిన దివ్య సౌందర్యం కనపడే అందాన్ని మించి ఎంతో సౌదర్యాన్ని ఇచ్చినట్లు ఉండేది.

“దయచేసి అందరూ శ్రద్దగా వినండి. శానిటోరియం డాక్టర్ గారు ఈ రోజు లేరు. అందుకని డాక్టర్ గారి తరపున నేను మీకు కొన్ని విషయాలు చెబుతున్నాను. ఇక్కడి నియమాలు, నిబంధనలు అన్నీ మీరు ఆరోగ్యవంతులు కావడానికి నిర్దేశించబడినవి. మీరు యిక్కడ గడిపే సమయం ఆనందంగా గడపడానికి మీరు తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులు కావడానికి ఇక్కడి ప్రకృతి పరిసరాలు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి.

ఇక్కడి చెట్లు చూడండి ఎంత ఎత్తుగా, ఠీవిగా, అందంగా ఉన్నాయో! ఇక్కడి పక్షులు చూడండి. ఎంత ఉల్లాసంగా అలా గాలిలో తేలిపోతున్నాయో! యిదిగో అక్కడి పూలవనం చూడండి, ఎంత అందంగా మురిసిపోతోందో! ఆ ప్రక్కన పచ్చిక బయలు చూడండి, అక్కడ ఆడుకుంటున్న ఆ లేగ దూడలను చూడండి. చుట్టూ ఉన్న కొండలను చూడండి. ఆ పచ్చికలో మెరుస్తున్న ఆ యవ్వన మొక్కలను చూడండి. వాటిపైన ప్రసరిస్తున్న ఆ సూర్యుడిని చూడండి. యిది నిజంగా ప్రకృతి ప్రసాదించిన వర ప్రదేశం కాదంటారా? ఆ రోజు లలిత మాట్లాడిన మాటలు, మాట్లాడిన విధానం ఆమె కళ్ళల్లోని ఆనంద వీచికలు,

- 3 -

అక్కడున్న వారందరికీ ఆమె ఇచ్చిన అనునయింపు ఆ తర్వాత చాల రోజుల వరకూ రవి గుర్తుంచు కున్నాడు.

చిరునవ్వుతో, లలిత పలుకుతున్న ఈ మాటలు రవి ఎంతో ఆశ్చర్యంతో అలకిస్తున్నాడు. స్వాంతన అంటే యిదే కదా? మృత్యువునైనా మాటలతో మైమరపించగల ఆ అనునయం నిజమేనా? లేక పై పై పూతే, బూటకమా అనే సందేహం కూడా అతనికి కల్గుతూ ఉంది.

ఆ రోజు మొదలు శానిటోరియంలో రవి తన జీవితాన్ని అక్కడి పరిసరాలతో కలిసి పోవడం, ఆ స్వచ్చమైన వాతావరణంలో సేదదీరడం గా మార్చుకున్నాడు. ఎంతో మంది నర్స్ లు ఉన్నా రవి కళ్ళు లలిత కోసం వెతికేవి. ఆమె కనపడగానే తనలో సందేహాలు ఎగిరిపోయినట్లు నమ్మకం పెరిగిపోయినట్లు అనుకునేవాడు.

ఎక్కడో చెట్టు క్రింద కూర్చుని పుస్తకం చదువుతున్నపుడు లలిత గుర్తుకు రాగానే రవి మనస్సు పులకించేది. అతని పెదాలు నవ్వుతో విచ్చుకునేవి. ఆరాధన, అభిమానం, ప్రేమ అనే పదాలలో పిలువడం కన్నా ఆశతో గడుపుతున్న ఈ క్రొత్త జీవితానికి ప్రతినిధిగా లలితను రవి భావించుకున్నాడు.

శానిటోరియంలో అప్పుడప్పుడు ఒంటరిగా నడుస్తున్నపుడు రవికి, ఒక పూల మొక్క చాటునుంచో లేక ఎవరో ఒక పేషంట్ కి మందులు ఇచ్చేసి వెనక్కు వస్తూనో లలిత కనపడేది. ఉదయం నుంచి అలుపెరుగకుండా పనిచేసి కూడా అంత ఉత్సాహంగా లలిత ఎలా ఉండగాలిగేదో అని అనుకునేవాడు. ఆ సమయంలో లలితతో పాటు అతను Main hospital వరకూ నడిచేవాడు. “రవి చలి ఎక్కువ అవుతోంది – ఈ సమయంలో ఒంటరిగా తిరగొద్దు, లోపల ఏదైనా పుస్తకాలు లేదా పేపేర్స్ చదువుతూ గడుపు” అనేది.

“మేడమ్ మాకేమో అన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. మరి మీ ఆరోగ్యం గురించి మీరు శ్రద్ద తీసుకోరా? ఉదయం లేచింది మొదలు చక్కర్లు కొడుతూనే ఉంటారు. మమ్మల్ని అందరిని పలకరించడం, treatment అమలు చేయడం. డాక్టర్కి సహకరించడం ఇంతగా మీరు శ్రమ పడితే మీరు మాలాగా అవుతారేమో ఆలోచించండి.” అని రవి అనేవాడు.

- 4 -

ఆ సందర్భాలలో రవికి లలితపైన చెప్పుకోలేని ప్రేమ పొంగి పోర్లేది. ఆమెను ఒక పక్షి లాగ పొదివి పట్టుకోవాలని లేదా చిగురిస్తున్న మొక్కలాగా సంరక్షించాలనీ అన్ని అపాయాల నుంచి ఆమెను కాపాడాలని, అలా నడుస్తూ మాట్లాడుకుంటూ ఉండగా కాలం అలాగే ఆగిపోవాలని.

కాలం గడుస్తూ ఉంది. ప్రకృతి ఇస్తున్న స్వాంతనతో రవి మెల్లగా తన వ్యాధి నుంచి కోలుకుంటున్నాడు. మొదట్లో చూడడానికి వచ్చిన అన్నయ్య రావడం మానేసాడు. కుటుంబ పరిస్థితులు బాగాలేక పోవడం వలన తగినంత సహాయం చేయలేనని, ఎదో విధంగా నయమయ్యిన తర్వాత ఎదో ఒక ఉద్యోగం చూసుకోవాలనీ అన్నయ్య ఉత్తరం వ్రాసాడు. కాని అది రవిని బాధించలేదు. జీవించడం సాద్యమవుతుందో లేదో అన్న మానసిక స్థితి నుంచి ఇప్పుడతను ఎలాగైనా జీవించగలను అన్న మానసిక స్థితి కి చేరుకుంటున్నాడు.

అందుకు లలితే కారణమేమో. “ చూడు రవి నీకు T.B వచ్చిందని క్రుంగిపోతే అది ఓడిపోవడానికి సిద్దపడినట్లు. నువ్వు ప్రకృతిలో భాగమని భావించు. ఇక్కడున్న పరిసరాలు నీలో కలిసిపోయాయని అనుకో. వాటి నుంచి శక్తిని, స్వచ్చతను తీసుకో – నువ్వు భాగమయ్యేందుకు ఎంతో కాలం పట్టదు. అది పూర్తైన తర్వాత నువ్వు ఎలా ఉంటావో తెలుసా, చలికాలం రాత్రి తర్వాత మంచు తెరలు చీల్చుకుని వచ్చే సూర్యుడు ఎలా ఉంటాడో ఊహించుకో, చెక్కుచెదరని ఆ కొండ చూడు, వంద సంవత్సరాలకు పైగా నిలుచుని నీడ నిస్తున్న ఆ అశోక చెట్టు చూడు – నీలో నమ్మకం, విశ్వాసం ఉండాలే గాని – అది సాధ్యమే.”

అలా మాట్లాడుతుంటే రవి కేవలం వినడమే చేసేవాడు. లలిత అలా మాట్లడగలగడానికి ఎం చదువుకున్నది? ఎన్ని విలువైన గ్రంధాలు చదివితే అంత జ్ఞానం వస్తుంది? లేదా ప్రకృతి ఆమెకు పాఠాలు నేర్పిందా? రోగులకు భాధా తప్త హృదయులకు స్వస్థత ఇవ్వడానికి ప్రకృతే ఆమె రూపంలో అవతరించిందా?

రవి ఆలోచనలో లలిత తప్పు చేయలేదు. అప్పుడప్పుడూ డాక్టరో, మేనేజరో ఎదో ఒక కారణం చేత లలితనో లేక అందరు నర్సులను పరుషంగా మాట్లాడితే లలిత ముభావంగా ఉండేది. అప్పుడు రవికి వాళ్ళందరి మీద చెప్పలేనంత కోపం వచ్చేది.

- 5 -

వారి శాస్త్ర పరిజ్ఞానంతో, వైద్య శాస్త్ర పరిభాషలో ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ట్రీట్ మెంట్లు చేసినా అవన్నీ లలిత కుమారి చూపే శ్రద్ద ముందు దిగదుడుపే అనిపించేది. అలా తనలో స్వస్థత చేకూరడానికి ఏకైక కారణం లలితేనని అతను ప్రగాఢ౦గా విశ్వసించ సాగాడు. ఒక వ్యక్తిని అంతగా ఆరాధించినపుడు ఏమవుతుంది? జీవితం మీద ప్రేమ ఏర్పడుతుంది.భవిష్యత్తుపై ఊహలు కల్గుతాయి.

రవి మనస్సులో ఇలాంటి భావనలు సహజంగానే ఏర్పడ్డాయి. కాని లలిత కుమారి ఆలోచనల్లో రవికి ఎలాంటి ప్రత్యేక స్థానం లేదు. ఆమె అందరూ పేషంట్లను చూసినట్లుగానే రవిని చూసేది. యుక్త వయస్సులోనే ఈ వ్యాధి బారిన పడ్డాడని రవి పట్ల కొంత సానుభూతిగా ఉండేది. తన తమ్ముడైతే ఎలా చూసుకునేదో అలాగే అతన్ని భావించేది.

మేడం ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎప్పుడూ శానిటోరియం లోనే కనబడుతూ ఉంటారే? ఇంట్లో మేడం కోసం ఎదురు చూసే వాళ్ళెవరూ లేరా? అనే సందేహాలు అతన్ని తొలుస్తూ ఉండేవి. ఆమెనే నేరుగా అడుగుదామని అంటే ఏమంటుందోనని భయం. అవకాశం వచ్చినపుడు కనుక్కోవచ్చులే అని రవి అనుకునేవాడు.

రవి అక్కడ చేరి ఒక సంవత్సరం గడిచింది. మరి కొద్ది నెలలలో అతను పూర్తిగా వ్యాధిని జయించి తిరిగి తన జీవితాన్ని కొనసాగించవచ్చు అని డాక్టరు కూడా తెలియజేసాడు. ఒక రోజు సాయంత్రం డ్యూటీ పూర్తైన తర్వాత లలిత కుమారి ఇంటికి వెళుతున్న సమయంలో రవి ఆమె వెంట నడిచాడు. “రవి డాక్టరు గారు నీ రిపోర్ట్స్ అన్ని చూసారు. త్వరలోనే నువ్వు discharge కావచ్చు. తిరిగి మీ ఇంటికి వెళ్లిపోవచ్చు.”

“ఇంటికి వేళ్ళడమంటేనే భయంగా ఉంది మేడమ్. ఇంటికి వెళ్లి ఎం చేయాలి? జీవితాన్ని ఎక్కడ ప్రారంభించాలి” “యిక్కడ లాగా బయటి ప్రపంచం ఉంటుందా? మీ అంతటి మంచి వాళ్ళు అక్కడ ఉన్నారా? నేను వదిలేసిన ముక్కలను మళ్ళి అతికించుకోవాలి. “

“రవి నువ్వు మాకేక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు. మేము ఇక్కడి వసతులు, సౌకర్యాలు, ఔషధాలు అందించడం, పలకరించడమే చేస్తున్నది. నేను మొదట చెప్పినట్లు నీలో బలమైన నమ్మకం,

- 6 -

విశ్వాసం ఉండడం తోనే త్వరగా కోలుకున్నావు. స్వస్థత ప్రకృతి లోనే ఉన్నది. ఇదే నమ్మకాన్ని కొనసాగించు. నీ శక్తి మీద నువ్వు దృష్టి పెట్టు తప్పక నీకు ఎదో ఒక మంచి మార్గం ఏర్పడుతుంది.

ఎప్పటిలాగే లలిత మాటలు రవిలో ఆనందాన్ని నింపాయి. ఇంతటి ఆశావహ దృక్పధం, సానుకూల స్వభావం, కరుణ చూపించే స్నేహితురాలు లభించడం ఎంత అదృష్టం అని అతని ఆలోచనలు సాగుతున్నాయి. ప్రేమ, ఆకర్షణ అనే భావాల వలెనే, రవికి ఆమెతో ఒక ఆత్మీయ అనుబంధం కలిగిన భావనలు ఏర్పడ్డాయి.

ఆ పరిసరాల్లో తిరుగుతున్నప్పుడు రవి అప్పుడప్పుడూ దూరంగా నడుచుకుంటూ వెళ్ళేవాడు. చిత్తడవి మొదలవుతున్న దగ్గిర, చిన్న సెలయేరు ఉండేది. అడవుల్లోంచి వచ్చే నీళ్ళతో ఆ సెలయేరు ఎప్పుడు ఎంతో స్వచ్చంగా, నిర్మలంగా ఉండేది. సాయంత్రం సూర్యాస్తమయం సమయములోనో, లేక సుప్రభాత వేళల్లోనో, రవి ఆ సెలయేరు దగ్గిర కూర్చుని జీవితం గురించి ఊహించుకునేవాడు. ఆ సెలయేటి నీళ్ళు, చల్లగా, గమ్మత్తుగా అడవి పూల సువాసనలు మోస్తూ ఉండేవి. స్వేచ్చగా. నిశ్శబ్ధంగా పయనించడానికి పక్షులు అప్పుడే గాలిలోకి ఎగిరేవి. ఆప్పుడే పుష్పించిన అడవి మొగ్గలు, గాలికి ఊగే లతలు, పొదలను చూస్తూ రవి మనస్సు స్వేచ్చగా ఉరకలేసేది.

తిరిగి ఆరోగ్యవంతుడవుతున్న రవికి, జీవితం మీద ఆశలు చిగురిస్తున్నాయి. భవిష్యత్తులో ఉద్యోగం సంపాదించుకున్నాక, తోడుగా తన జీవిత భాగస్వామిగా ఉండడానికి సిస్టర్ లలిత కుమారి అంగీకరిస్తుందా. ఎలాగైనా ఆమెను ఒప్పించాలి. ముందు ఆమెకు తన మనస్సులో మాట తెలియజేయాలి. ఎన్నో ప్రయత్నాలు చేసాడు.

శానిటోరియం లోని రోగులు, patients అందరికీ ఆమె చేసే సేవను చూస్తూ ఆమె ముందుకు వెళ్లి, లలిత నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్ళి చేసుకోవా? అని చెప్పడానికి అతనికి సిగ్గు వేసేది. ఒక మానవతా మూర్తిని, ఈ రకంగా అవమానిస్తున్నావా అని అతనికి ఎక్కడో guilty గా ఉండేది.

నేరుగా ఎదురుపడి చెప్పలేక, ఆమెతో ఇచ్చిపుచ్చుకునే పుస్తకాలు మధ్య చిన్న ‘Notes’ పెట్టి పంపేవాడు. అవి ఎంతో నిజాయితీగా రాసినా, ఆ లేఖలు లలిత కుమారి చదివేది కాదని అతను తెలుసుకోలేక పోయాడు. నిజానికి మొదటి లేఖ ఒకసారి చదివిన తర్వాత, ఆ తర్వాత లేఖలన్నీ లలిత

- 7 -

కుమారి అసలు చదివేదే కాదు. మడత అయినా తిప్పక, ఆ లేఖలు ఆమె ట్రంక్ పెట్టెలో అడుగున పడవేసేది.

చాల కాలానికి రవికి ఈ విషయం తెలిసింది. అతను ఆమె పట్ల ఎందుకు ఆకర్షితుడయ్యాడంటే ఆమె అందగత్తె కానేకాదు. ఆ విషయం అతనికి తెలుసు. మొత్తంగా లలిత కుమారి సమున్నత వ్యక్తిత్వం, ఆమె ఆత్మ ప్రకాశం రవి ఆరాధించేవాడు. అదే ఆమె పట్ల తను చెప్పదలుచుకుంటే ఆమె దానిని కూడా సునాయాసంగా దాట వేసేది. మొదట దానిని ఆమెలోని గర్వంగా అతను భావించినా కొంత కాలానికి తన ప్రవర్తన పట్ల సిగ్గు పడ్డాడు. సమున్నతమైన శిఖరాన్ని ఉద్రేకంలో తను పొందాలని అనుకున్నాడు. అలాంటి వ్యక్తితో పరిచయమే తనకు దక్కిన భాగ్య మేమో అన్న ఆలోచన అతనిని తేలిక పరచింది.

“అన్నట్లు రవి నేను రేపు మా ఊరు వెళుతున్నాను. నేను తిరిగి రావడానికి రెండు నెలలు పట్టవచ్చు. ఆ లోపు నువ్వు discharge అయితే ఉత్తరం వ్రాయడం మరచిపోవద్దు.”

తరువాత రోజు లలిత కుమారి రెండు నెలలు సెలవు పట్టి వెళ్ళిందని ఆమె సహోద్యోగులు చెప్పారు. లలితకు పెళ్ళి చేసుకునే ఆలోచన ఉన్నదని, బహుశా అందుకే వెళ్లి ఉంటుందని వాళ్ళు చెప్పగా తెలుసుకున్నాడు. లలిత కుమారి వెళ్ళిపోయినప్పటి నుంచి రవికి నిరుత్సాహం గా ఉన్నది. మరొక పది రోజుల్లో discharge చేస్తారని తెలుసుకుని త్వరగా అక్కడి నుంచి బయటపడితే బాగుండు అని అనుకున్నాడు.

రవి మనస్సు ఏర్పరుచుకున్న ఆ అనుబంధం అతనిని అప్పటి వరకు ఉత్హేజితుడిని చేసింది., అక్కడ అందరి పైన ప్రసరించిన ఆ అనునయ వాక్యాలు తనకు కొంత ఓదార్పు యిచ్చాయి. అదంతే తనకే కావాలను కోవడం స్వార్ధం అవుతుంది కదా అని అనుకుంటూ క్రొత్త జీవితం ప్రారంభించే ఆలోచనలో పడ్డాడు. బయటి ప్రపంచంలో మేడమ్ లలిత చెప్పిన మాటలనే అమలు చేయాలని అనుకుంటూ రవి శానిటోరియం నుంచి discharge అయ్యాడు.

- 8 -

3 సంవత్సరాలు గడిచింది. ప్రింటింగ్ అనుభవంతో రవి ఇప్పుడు ఒక చిన్న ప్రింటింగ్ ప్రెస్ యజమాని అయ్యాడు. తన శక్తీ మీద నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళమని లలిత కుమారి చెప్పిన మాటలే తనకి ప్రేరణగా రవి ఎప్పుడూ భావిస్తూ ఉంటాడు.

దూరమైనా లలిత కుమారి పైన రవికి ప్రేమ, గౌరవం ఏ మాత్రం తగ్గ లేదు. కరుణ వాత్సల్యం తో patients ని లలిత ఏ విధంగా చూసేదో అదే విధంగా రవి ఆమెను ఓక మానవతా మూర్తిగా ఆరాధించ సాగాడు. ఎందరికో స్ఫూర్తి, స్వస్థతను చేకూరుస్తున్న ఆమెకు ఇంకా మంచి జరగాలని, ఆమెకు ప్రకృతి సహకరించాలని కోరుకుంటున్నాడు. తన జీవితంలోకి ప్రకృతి పంపిన ఓక అద్భుతమైన ప్రేరణగా ఆమెను భావించాడు. ఇప్పుడు ప్రేమ, ఆకర్షణను మించి, లలిత కుమారి స్మృతి నుంచి ఆరాధన, ఆత్మీయత, అలౌకికమైన అనుభూతి రవిని ఆవహించింది.

శానిటోరియం మూతపడిన తర్వాత తన భర్తతో కలిసి ఆశ్రమం నిర్వహిస్తున్న లలిత కుమారి గురించి తెలుసుకుని త్వరలో ఆమెను కలుసుకోవాలని రవి నిశ్చయించు కున్నాడు. ప్రేమను పంచే వ్యక్తి ప్రపంచానికి ఎంతటి అపురూపమైన కానుక ఇవ్వగలదో అని అనుకుంటూ ఆమెకు మనస్సులోనే నమస్కరించుకున్నాడు రవి.

&&&&

మరిన్ని కథలు

Kudi Edamaithe
కుడి ఎడమైతే
- మద్దూరి నరసింహమూర్తి
Complaint
కంప్లైంట్
- Kodali sitarama rao
Aakali
ఆకలి
- అరవ విస్సు
Alludigari alaka panpu
అల్లుడుగారి అలక పాన్పు
- మోహనరావు మంత్రిప్రగడ
Nruga maharaju
నృగ మహరాజు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Maa nava bandhalu
మా నవ బంధాలు
- బామా శ్రీ (బాలాజీ మామిడిశెట్టి)
Cycle nerchukovadam
సైకిల్ నేర్చుకోవడం
- మద్దూరి నరసింహమూర్తి