కళ్ళు నెత్తి కెక్కాయి - కాశీవిశ్వనాధం పట్రాయుడు

Kallu nettikekkayi

చంద్రంపేట గ్రామానికి చెందిన రాజు, శ్రీను బాల్య మిత్రులు. వీరిద్దరూ కలిసి చదువుకున్నారు. కష్ట సుఖాల్లో పాలు పంచుకునేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీను దళారి వ్యాపారం చేసి కోట్లకు పడగలెత్తాడు. పట్నంలో అన్ని హంగులతో కూడిన ఇంటిని కట్టుకున్నాడు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. పండగలకు, పబ్బాలకూ స్వగ్రామం వచ్చి పోతూంటాడు. రాజు వ్యవసాయం చేసుకుంటూ గ్రామంలో స్థిరపడిపోయాడు. ఓసారి సంక్రాంతి పండగకు ఖరీదైన కారులో, చలువ కళ్లద్దాలు పెట్టుకుని స్వగ్రామానికి వచ్చాడు శ్రీను. అదే సమయంలో కళ్లం నుంచి వస్తూ మిత్రుడు శ్రీనును చూసి “బాగున్నావా శ్రీనూ?” అని అడిగాడు రాజు. పరిచయం లేని వ్యక్తిలా తల తిప్పుకుని వెళ్ళిపోయాడు శ్రీను. మిత్రుని ప్రవర్తనకు చిన్నబోయాడు రాజు. రాజునే కాదు పూర్వ పరిచయం ఉన్న సాధారణ రైతులు, సామాన్య ప్రజల వైపు కన్నెత్తి చూసేవాడు కాదు. డబ్బు, పదవి, హోదా ఉన్నవారిని మాత్రమే పలకరించేవాడు. మరికొంత దూరం వెళ్ళేసరికి రాజు, శ్రీనులకు చదువు చెప్పిన మాష్టారు ఎదురు పడ్డారు. శ్రీను మాష్టారుకి నమస్కారం చెయ్యలేదు సరికదా పలకరించలేదు. మాష్టారు మరికొంచెం దూరం వెళ్ళేసరికి రాజు ఎదురుపడి నమస్కారం చేసి క్షేమ సమాచారాలు కనుక్కున్నాడు. “నువ్వే నయం చక్కగా పలకరించావు. ఆ శ్రీనుగాడికి కళ్ళు నెత్తికెక్కాయి. నడమంత్రపు సిరి మహిమ” అంటూ ముందుకు వెళ్ళిపోయారు మాష్టారు. మాష్టారు మాత్రమే కాకుండా, అలా చాలామంది 'శ్రీనుకు కన్నులు నెత్తి మీదకు వచ్చాయి’ గర్వం పెరిగింది అని అనడం మొదలు పెట్టారు. ఇవన్నీ విన్న శ్రీను కళ్ళకి సందేహం కలిగింది. “మేము ఎప్పుడూ ఉన్నచోటనే ఉన్నాము కదా! మరి ‘శ్రీను కళ్ళు నెత్తికెక్కాయి’ అని అందరూ తిడుతున్నారు ఎందుకో కాస్త చెప్పండి” అని మిగతా అవయవాలను అడిగాయి కళ్ళు. అది విన్న నోరు “నువ్వు విన్న మాట నిజమే కానీ కళ్ళు నెత్తికెక్కడం అంటే మీరు నెత్తి మీదకు వెళ్లడం కాదు. మనిషికి గర్వం పెరగడం అని అర్థం. సిరి సంపదలు కలిగేసరికి గర్వం, నా అంతటి వాడు లేదనే భావన మనుషుల్లో పెరిగి, కన్ను మిన్ను గానకుండా ప్రవర్తిస్తారు. అలాంటి సందర్భంలో 'కళ్ళు నెత్తికెక్కాయి, కన్నులు నెత్తి మీదకు వచ్చాయి’ అని అంటారు. ఇది మానవుల పలుకుబడి. అని చెప్పింది నోరు. “హమ్మయ్య ఇప్పుడు అర్థమయ్యింది” అన్నాయి కళ్ళు.

మరిన్ని కథలు

Vuppena
ఉప్పెన
- కందర్ప మూర్తి
అహల్య
అహల్య
- సుమ సావి3
Viswasa pareeksha
విశ్వాస పరీక్ష!
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Katha addam tirigindi
కథ అడ్డం తిరిగింది
- టి. వి. యెల్. గాయత్రి
Naalugu taraala katha
నాలుగు తరాల కథ
- హేమావతి బొబ్బు
Marina manishi
మారిన మనిషి
- శ్రీమతి లతా మూర్తి
Baamma cheppina bhale kathalu
బామ్మ చెప్పిన భలే కథలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు