మనసెరిగిన… - ప్రసూన రవీంద్రన్

manaserigina

"ఫ్ ఐ డోంట్ టాక్ టు యూ నౌ, మై మైండ్ వుడ్ బ్లాస్ట్." అంతవరకు, ఆఫీసు పని మీద దృష్టి పెట్టలేక తల పట్టుకుని కూచున్న నితిన్, కుర్చీని వెనక్కి తోసి, విసురుగా లేచాడు.

కేఫిటేరియా లాంజ్ లోకి వెళ్ళి మొబైల్ లోంచి స్నిగ్ధ కి ఫోన్ చేసాడు.

"హలో ..." ఎప్పటిలాగే నిరాశక్తంగా వినబడిందామె గొంతు.

"స్నిగ్ధా. నేను వెంటనే నిన్ను కలవాలి. ఒక్కసారి కేంటిన్ కి రా ప్లీజ్."

"ప్రోజెక్ట్ లో పని చాలా ఎక్కువుంది నితిన్. పని వదిలేసి కేంటిన్ లో కూచోవడం మా మేనేజర్ చూస్తే బావుండదు." అంతే, ఆ పైన తన మాటలేవీ వినకుండా ఫోన్ కట్ చేసేసింది. మూగబోయిన మొబైల్ వైపు చూస్తున్న నితిన్ కళ్ళలో సన్నగా నీళ్ళు తిరిగాయి.

అద్దంలోంచి బయట కనిపిస్తున్న చెట్ల వైపు చూశాడు.

గత ఆరు నెలలుగా ఎందుకిలా తనను దూరం చేస్తోంది స్నిగ్ధ? ఎనిమిదేళ్ళ స్నేహం, ప్రేమ. ఇంటర్ నుంచీ తామిద్దరూ క్లాస్ మేట్స్. ఇళ్ళు కూడా దగ్గరే. అప్పటినుంచీ తామిద్దరికీ మంచి స్నేహం కుదిరింది. ఇంటర్ లో ఎంసెట్ ప్రాక్టీస్ అనీ, డౌట్స్ అనీ ఇద్దరూ ఒకళ్ళింట్లో ఒకళ్ళు కలుసుకుని చదువుకునేవారు. ఆ తరువాత అదృష్టం కొద్దీ ఒకే కాలేజీలో కంప్యూటర్స్ లో బి.టెక్ చెయ్యడం, ఇద్దరికీ కాంపస్ ఇంటర్వ్యూ లో ఒకే కంపెనీలో ఉద్యోగం రావడం అన్నీ తమ మధ్య స్నేహాన్ని మరింత బలపరిచాయి. ఉద్యోగం లో చేరాక కొత్త అలోచనలు మొగ్గ తొడిగాయి. ఒకరికొకరు చెప్పుకోకుండానే పరస్పరమైన ఇష్టం అవగతమైంది. మంచి ముహూర్తం చూసి తను స్నిగ్ధ కి ప్రేమ గురించి వ్యక్తపరచడం, తను ఒప్పుకోవడం, ఇద్దరి ఇళ్ళలోనూ ఎవరికీ ఏ అభ్యంతరాలూ లేకపోవడం, అన్నీ అలా సంతోషంగా జరిగిపోయాయి.

వచ్చే ఏడాది పెళ్ళిచేద్దామని పెద్దవాళ్ళు నిర్ణయించిన కొన్ని నెలలకే స్నిగ్ధలో కొత్త మార్పు చోటుచేసుకుంది. ఎందుకో తెలీదు, మాటలు తగ్గించింది. క్రమంగా కలవడం తగ్గించింది. కారణం చెప్పదు. ఈ మధ్య తను ఎన్ని ఫోన్లు చేసినా ముభావంగా మాట్లాడి వెంటనే ఫోను పెట్టేస్తోంది.

నిన్న రాత్రి తను స్నిగ్ధ తల్లితో చాలా సేపు మాట్లాడి ఎలాగయినా విషయం తెలుసుకోమన్నాడు. ఇవాళ ఉందయం ఆగలేక అవిడకి ఫోన్ చేస్తే ' స్నిగ్ధ కి నువ్వంటే కోపం లేదు బాబూ. అసలు పెళ్ళే వద్దంటోంది. చాలా నచ్చజెప్పి చూశాం. కొన్నాళ్ళాగితే అదే దార్లో పడుతుందిలే' అన్న మాటలే తనను ప్రశాంతంగా ఆఫీసులో కూడా కూచోనివ్వలేదు.

నితిన్ ఒక నిర్ణయానికొచ్చినవాడిలా వెంటనే ఇంటికి వెళ్ళి వచ్చాడు. ఆ రోజు సాయంత్రం ఆఫీసు బయటే నిలబడి స్నిగ్ధ బయటికి వచ్చేదాకా ఎదురుచూసి ఆమె రాగానే ముందుకెళ్ళి నించున్నాడు. నితిన్ ని చూడగానే నవ్వీ నవ్వనట్టుగా చూసి చూపులు బస్ వైపు తిప్పేసింది స్నిగ్ధ.

"స్నిగ్ధా. నిన్ను ఇబ్బంది పెట్టాలని రాలేదు. ఈ పుస్తకం చూడు. ఇది నువ్వు ఇవాళే చదివి తీరాలి. ఇన్నేళ్ళ మన స్నేహానికైనా విలువిచ్చి ఈ పుస్తకాన్ని చదువుతావని ఆశిస్తున్నాను." అంటూ ఆమె చేతిలో ఒక అందమైన డైరీ పెట్టి స్నిగ్ధ సమాధానం కోసం కూడా ఎదురుచూడాకుండా వెనుతిరిగి వెళ్ళిపోయాడు నితిన్.

ఆ రాత్రి స్నిగ్ధ భోజనాలయ్యాక తన గదిలోకి వెళ్ళి నిర్లిప్తంగా ఆ డైరీ పేజీలు తిప్పింది.

నితిన్ అందమైన చేతివ్రాతలో రాసుంది.

"ఇవాళ జనవరి ఒకటి. కొత్త సంవత్సరం రోజైనా మళ్ళీ నా పాత స్నిగ్ధలా మనస్ఫూర్తిగా నాతో మాట్లాడుతుందనుకున్నాను...

స్నిగ్ధా... గత కొన్ని రోజులుగా నువ్వెందుకో నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. కారణం తెలిస్తే కదా. నేను చేసిన ఏ చర్య వల్ల నీ మనసు గాయపడిందో అది మళ్ళీ చెయ్యకుండా ఉండగలను?"

జనవరి 2 : "స్నిగ్ధా ... కొత్త పండగలు, పుట్టిన రోజులే కాదు, ఎప్పుడైనా సరే, ఆఫీసు లేని సమయాల్లో నాకు నీ చెంత గడపటమే ఇష్టం."

జనవరి 16 : "స్నిగ్ధా ... ఎప్పుడైనా సరే నీకు మీ అమ్మా, నాన్న మీద బెంగ కలిగి వాళ్ళని చూడాలనిపిస్తే , నువ్వు నిరభ్యంతరంగా మీ ఇంటికి వెళ్ళొచ్చు. నా నుంచి కానీ, మా అమ్మ నుంచి కానీ నీకు ఏ విధమైన ఆంక్షలూ ఉండవు. పుట్టింటికి వెళ్ళేందుకు ఒకరి అనుమతి కోసం నువ్వు ఎదురుచూడాల్సిన పని లేదు."

ఫిబ్రవరి 10 : " స్నిగ్ధా... పెళ్ళయ్యాక ఈ ఇల్లు నీది. అది మాటల్లోనే ఉండిపోతుందనుకోకు. నీ ఇంటిని నీకు నచ్చినట్టు అలంకరించుకునే హక్కు నీకుంది. నేనో, అమ్మో నీ అభిరుచికి అడ్డు చెప్పము. అలాగే వాటికి మెరుగులు దిద్దడం కోసం మేమేమైనా సలహాలిస్తే అవి నువ్వు కూడా నీ ఇష్టాన్ని బట్టి స్వీకరించు. నచ్చకపోతే మానెయ్. అంతే కానీ నీ అలోచనలు మాకిష్టం లేదనుకుని నీ మనసులో బాధ విత్తనాన్ని నాటుకోకు."

ఫిబ్రవరి 23 : "స్నిగ్ధా ... ఏ ఇద్దరి మనుషుల జీవన విధానమూ పూర్తిగా ఒకేలా ఉండదు. ఎవరికెవరూ తీసిపోరన్న నిజాన్ని గుర్తుంచుకుని ఒకరినొకరు గౌరవించుకునే చోట విమర్శలకు తావుండదు. అనవసరంగా పక్క వారిని విమర్శించడంలో నేను కూడా పూర్తి వ్యతిరేకిని."

మార్చి 4 : "స్నిగ్ధా ... పెళ్ళయ్యాక నువ్వు, నేను మన ఇద్దరి తల్లి తండ్రులకీ సమానమైన గౌరవాన్నివ్వాలి. ఆడపిల్లని కన్నంతమాత్రాన మీ అమ్మ, నాన్న ఏ రకంగానూ తక్కువ కాదు. ఎప్పుడూ వాళ్ళని కించపరిచే మాటలు మీ పరోక్షంలో అయినా మేము అనము అని నేను హామీ ఇస్తాను."

అలా అక్కడక్కడ పేజీల్లో అందమైన వ్రాతలో ఇంకా ఇలాంటివే చాలా ఉన్నాయి. నోరెళ్ళబెట్టి ఆ డైరీ మళ్ళీ మళ్ళీ చదివింది స్నిగ్ధ. తన మనసునేదో స్కాన్ చేసి చదివేసినట్టు ఎలా కనిపెట్టాగలిగాడు? అంతలోనే ఏదో చటుక్కున స్ఫురించింది. మొబైల్ తీసుకుని అక్క పల్లవి కి ఫోన్ చేసి విషయం చెప్పింది.

"స్నిగ్ధా. నువ్వూహించింది నిజమే. కొన్ని నెలల క్రితం ఓ రోజు నితిన్ నాకు ఫోన్ చేశాడు. చాలా సేపు మాట్లాడాడు. మా ఇంటికి వచ్చి ఒక పది రోజులుండి వెళ్ళినప్పటినుంచీ నువ్వు కొంచం మూడీగా ఉండటం గమనించానని చెప్పాడు. తన గురించి ఎన్నో ఏళ్ళుగా తెలిసిన దాన్ని కాబట్టి, నేను మా అత్తగారింట్లో ఎప్పుడు బాధ కలిగినా నీతోనే పంచుకుంటానని తన దగ్గర ఒప్పుకున్నాను. అప్పటి నుంచీ నేను నా సమస్యలేమైనా నీతో పంచుకున్న రోజున మాత్రం, చిత్రంగా నితిన్ కూడా నాకు ఫోన్ చేసేవాడు. 'ఇవాళ మీరేమైనా బాధపడ్డారా స్నిగ్ధ దగ్గర?' అని ఆడిగేవాడు. అసలు నా సమస్యలు నీకు చెప్పి తప్పు చేస్తున్నానేమో అనిపించింది. కానీ, తనేమన్నాడో తెలుసా. 'ఏ విషయాల వల్లనైతే స్నిగ్ధ పెళ్ళికి భయపడుతోందో, వీలైనంతవరకూ ఆ విషయాలు నాకు తెలిస్తే, పెళ్ళయ్యాక గొడవలు రాకుండా ముందే జాగ్రత్త పడొచ్చు. అమ్మాయిల ఆశలెలా ఉంటాయో కూడా తెలిస్తే భార్యని కన్నీరు కార్చకుండా చూసుకోవచ్చు. స్నిగ్ధ మూడీగా అయిపోయినప్పుడల్లా, తన ఫోను చూస్తే ఆఖరి ఫోన్ మీకే వచ్చి ఉండటం వల్ల, మీ సమస్యల్ని చూసే తను పెళ్ళికి భయపడుతోందేమో అని అనుమానిస్తున్నాను' అన్నాడు. నీ భయాలేమిటో తెలుసుకోవాలనే నాకు ఫోన్ చేసేవాడు. నితిన్ ఎలాంటివాడో నాకు తెలుసు కాబట్టి, ఎన్నో ఏళ్ళ పరిచయం కాబట్టి, నీకు చెప్పుకున్న విషయమే టూకీగా తనకీ చెప్పేదాన్ని. ఇంతలా నీ సంతోషం కోసం తపించేవాడు ఇంకెవడూ నీకు దొరకడు. నితిన్ నిన్ను ప్రేమించడమే కాదు, జీవితాంతం నిన్ను కష్టపెట్టకుండా చూసుకోవాలని తపిస్తున్నాడు. జీవితానికో తోడు కావాలి. ఆ సరయిన తోడు నీకు నితినే."

అక్క మాటలు పదే పదే చెవిలో మోగుతుంటే డైరీ తీసుకుని ఆనందంగా నితిన్ ఇంటివైపు పరుగెత్తింది స్నిగ్ధ. తనెంత పొరబడింది? నితిన్ కూడా అందరిలాంటివాడే అనుకుంది. అక్క అమెరికాలో ఎం.ఎస్ చేసి వచ్చింది. తనని కోరి పెళ్ళిచేసుకున్నారు. అయినా అత్తారింట్లో ఎన్ని విషయాల్లోనో తన ఇష్టాల్ని వదులుకుని, బలవంతంగా సర్దుకుపోవాల్సిరావటం చూసి తనసలు పెళ్ళే వద్దనుకుంది. ఎన్నేళ్ళు ప్రేమించుకున్నా పెళ్ళయ్యాక నితిన్ కూడా మారిపోతాడని అనుమానించింది.

బహుశా, స్నిగ్ధ స్థితి అర్థమైందేమో. నితిన్ మనసెందుకో హటాత్తుగా సంతోషంలో గెంతులేసింది. గుమ్మంలో విరబూసిన రాధామనోహరాల్ని పలకరించడానికి బయటికి వచ్చిన నితిన్ కి వెన్నెల్లో తడుస్తూ తన వైపు పరుగెట్టుకొస్తున్న స్నిగ్ధ కనపడింది.

***

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి