నా బెడ్ రూమ్ లో చాలా ఏకాగ్రతగా రెండు కళ్ళూ మూసుకుని, పాట ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇంతలో నన్నెవరో గట్టిగా కుదిపి నట్లయింది.
కళ్ళు తెరచి, అయోమయంగా చూస్తున్న నన్ను మరోసారి బలంగా కుదిపి, “మెలకువ వచ్చిందా ? మొబైల్ లో పాట పెట్టుకొని, కూర్చుని నిద్ర పోతున్నారా? ఘ...ట్టిగా… ఏమిటా గుర్రు… కాదు… ఓండ్ర పెడుతున్నారు. మీరు, మీ మొబైల్ ఇద్దరూ సైలెంట్ గా ఉంటే మంచిది.” అంటూ గది బయటకు వెళ్ళి , గొళ్ళెం పెట్టేసింది కుసుమ.
“కుసుమా ...బెడ్ రూమ్ మ్యూజిక్ మీ శ్రీవారేనా? ఏమా రిధిమ్.. ఏమా సౌండ్... ” గట్టి గట్టిగా నవ్వులూ… అరుపులూ...కేకలూ ...అన్నీ కలిసిపోయి, గోలగోలగా ఉంది నాకు.
పసిడి పడతులు… హాల్లో కిట్టీ పార్టీ చేసుకుంటున్నారు.
“కుసుమా! ఇది అన్యాయం. అక్రమం... నా ఇంట్లో స్వతంత్రంగా గుర్రు పెట్టే హక్కు నాకుంది. గుర్రు నా జన్మ హక్కు.” నాక్కోపం నసాళానికి అంటింది. బోనులో కోరలు పీకేసిన సింహంలా గాండ్రించాను.
“బొత్తిగా మొగుడంటే గౌరవం లేదు. అందులో రిటైర్ అయిన దగ్గర నుండి అసలు లక్ష్యపెట్టడం లేదు.”
కోపంతో పళ్ళు పట పట లాడించాను. ‘అబ్బా!’ కసుక్కున బుగ్గ కొరికేసుకున్నా… కొంచెం ఉప్పగా నాలిక్కి తగిలింది. కండ ఊడొచ్చిందేమోనన్న అనుమానంతో నోరు గబుక్కున మూసుకున్నా…
‘మా ఆయన తన మొదటి భార్యని వదిలేసి వచ్చారు. ఇక నా దగ్గరే జీవితాంతం ఉంటానని, ఊ... అంటావా... భామా! ఉహూ అంటావా... భామా! అని తెగ పాటలు పాడేస్తున్నారు. పాటలతో నా బుర్ర ని, ఇంట్లో ఉన్న వేరుశనగ పప్పు, పుట్నాల పప్పు, జీడిపప్పు అన్నిటినీ తినేస్తున్నారు. ముందీ తినడాలు ఆపాలి. మీ సలహా ఏవిటి?” వాళ్ళ గ్రూప్ లో పోస్ట్ చేసింది. దానికి రకరకాల కామెంట్లు… ఎమోజీలు… ఛ...ఛ ...నా పరువు తీసేసింది.
వెయిట్ పెరుగుతున్నానని, షర్ట్ లోంచి పొట్ట బయటకి పొడుచుకొస్తోందని, సలాడ్ అంటూ పచ్చి కూరలు, పచ్చి గింజలు, మూడంటే మూడు పలచటి రోటీలు … జైల్లో ఖైదీలా తిండికి రేషన్ …తిన్న రోటీలు సరిపోక, అర్ధరాత్రి ఆకలేసి, లేవాల్సి వస్తోంది. ఇలా నన్ను ఆకలితో చంపేస్తావా అంటే ...
“డైట్ అండీ ...డైట్... నా మొగుడు స్మార్ట్ గా ఉండాలని ట్రై చేస్తుంటే… ఈ ఆకలి అరుపులేవిటి? అర్థం చేసుకోరూ ...”అంటూ స్వర్ణకమలం లో భానుప్రియ ఎక్స్ప్రెషన్ ఒకటి పారేసింది.
మొన్నటికి మొన్న, నా మటుకు నేను హేపీగా ‘నన్ను వదిలి నీవు పోలేవులే… అదీ నిజములే’ అన్న పాట సంగతులేసి పాడుకుంటూ ఉండగా… కుసుమ ధడేల్...మంటూ వీధి తలుపు తీసుకుని, సునామీ లా వచ్చి, విరుచుకుపడింది.
సునామీ ఆగిన తర్వాత అర్ధం అయినదేమిటంటే నా సంగీత సాధన వల్ల మా సొసైటీ లో చిన్న పిల్లలకు విడవని దడుపు జ్వరాలు, ఏడుపులూ, పెద్దవాళ్ళకి బీపీలుట. నా అర్థ భాగం చాలా సీరియస్ గా, స్ట్రాంగ్ గా ఆర్డర్ ఇచ్చింది. ‘నో సంగీత సాధన విత్ ఇమ్మీడియేట్ ఎఫెక్ట్’ … అంటూ నా పాటకు పే...ద్ద బోదురు కప్ప లాంటి తాళాన్ని వేసేసింది.
హాల్లోంచి కుసుమ పాటలు, మాటలు గోలగోలగా వినిపిస్తున్నాయి.
చెప్పొద్దూ … కుసుమ అలా రెచ్చిపోయి, ఆటలాడేసుకుంటుంటే, చాలా జెలసీగా ఉంది. నన్నింత మానసిక క్షోభకు గురి చేసిన కుసుమ హేపీగా ఉండకూడదు గాక ఉండకూడదు…చేతి గోళ్లు, కాలి గోళ్లు కొరికేసుకుని, జుట్టు పీకేసుకుంటుంటే, ఎదురుగా ‘ఊర్వశి’ కనిపించింది. ఎస్. దీనితోనే నా పగ తీర్చుకుంటాను … అనుకున్నాను.
ఆ పథకం ప్రకారం, సాయంత్రం , కుసుమ తో కలిసి టీ తాగుతున్నప్పుడు “ఒక టెక్నికల్ పేపర్ ఆ మానేజ్మెంట్ కాలేజీ లో ప్రజంట్ చేయాలి. అర్జెంట్. ప్లీజ్ ఒక్క వారం నీ ఊర్వశి ని ఇస్తావా?” అడిగాను.
“మీదేమైంది? ముట్టుకుంటే, ముద్దెట్టుకుంటోందా? కాగలించుకుంటే కరుస్తోందా?” ఆ మాటల్లోని వెటకారానికి ఒళ్ళు మండినా, పైకి చూపించలేదు. అవసరం నాదీ…
“నీ దాంట్లో లేటెస్ట్ వెర్షన్ ఉంది. ప్లీజ్ హెల్ప్ మీ…” జాలిగా ముఖం పెట్టి మరీ అడిగాను.
మా అమ్మాయి బహుమతిగా ఇచ్చిన లాప్ టాప్ని, తన యఫ్ బి ఫ్రెండ్ సలహ ప్రకారం, కుసుమ ముద్దుగా ‘ఊర్వశి’ అని పిలుచుకుంటుంది.
కుసుమని ప్రతీ క్షణం గమనిస్తూనే ఉన్నాను. ఫోన్ తో కూడా ఎప్పటిలాగే ఫ్రెండ్స్ తో
ఇకఇకలు..పకపకలు… రాగాలు...దీర్ఘాలు…
ఆదివారం ‘జూమ్’ మీటింగ్ లో మా గ్రూప్ వాళ్ళు, నేను వ్రాసిన వ్యాసాన్ని మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టారు. మీటింగ్ అయిపోయి కుర్చీ నుండి లేస్తూ “ఉర్వశి తో నా పని అయిపోయింది. థాంక్ యూ శ్రీమతీ!” అన్నాను చాలా ఉదారంగా....
“ అవును, మీ పని అయిపోయింది.” కిసుక్కున నవ్వింది కుసుమ .
“అన్నట్టు, ఎవరో వైఫులని వై-ఫై తో పడేయచ్చు. ఆఫ్టర్ ఆల్ … ‘ ఆడవాళ్ళూ - అల్ప సంతోషులు’ అన్నాడుట” అంది వంకరగా నవ్వుతూ .
గతుక్కుమన్నాను. నా వ్యాసం శీర్షిక అదే ‘వైఫ్ – వై... ఫై’ .
“ ఇవాళ భలే వీడియో వచ్చింది. మీకూ వచ్చి ఉంటుంది. చూడండి” మళ్ళీ వెటకారం.
గబగబా వాట్స్ అప్ వంగి చూస్తుంటే… నా నడుం కలుక్కుమంది
ఆ వీడియోలో ‘ఊర్వశి’ ముందు కూర్చుని, చెవుల్లో హెడ్ ఫోన్ పెట్టుకుని, సుడుకో ఆడుకుంటూ, మొబైల్ లో మెసేజీ లు ఇస్తూ, కునికిపాట్లు పడుతూ … గోళ్ళు కొరుక్కుంటూ… రకరకాల భంగిమల్లో ఉన్న ఫోటోలు…వీటన్నిటిలోనూ ఉన్నది... నేనే…
“దుర్మార్గురాలా… బ్లాక్ మెయిల్ చేస్తున్నావా…” అరిచాను.
“ఆహా.. వచ్చేసారి ‘జూమ్ మీటింగ్ లో ఉంటూ, జాలీగా చేసే మరో డజను పనులు’ అంటూ ఇంకో పేపర్ ప్రజంట్ చెయ్యచ్చు” మళ్ళీ వెటకారం…
“అదిగో ఆ వెటకారమే వద్దన్నది “ అంటుంటే, ఇంకోసారి కలుక్కు మంది నడుం.
—--
ఉదయాన్నే మెలకువ వచ్చి కళ్ళు తెరిచాను. నా బెడ్ రూమ్ సీలింగ్, దానికున్న సీలింగ్ ఫ్యాన్ , గోడలు అన్ని గిరగిరా తిరిగేస్తున్నాయి.
“ కుసుమా… కుసుమా … భూకంపం వస్తోంది. పద పద... కిందికి వెళదాం ” గట్టిగా అరిచాను. కానీ, చేతులు ఆనించి, మంచం పై నుండి లేవలేకపోయాను.
“నా బొంద .. భూకంపము లేదు, గాడిద గుడ్డు లేదు. మీకే కళ్ళు తిరుగుతున్నట్లున్నాయ్.. వర్టిగో వచ్చినట్లుంది.” చివాట్లు పెట్టింది.
“నేనెక్కడ నా ఊర్వశిని తీసేసుకుంటానో అని, చిన్న పిల్లాడిలా, రకరకాల భంగిమల్లో, పగలూ రాత్రీ దాన్ని కరచుకుని కూచున్నారు. … ఇంకా పదహారేళ్ళ బాలా కుమారుడు అనుకుంటున్నారా… షష్టిపూర్తి అయి మూడేళ్లు కావొస్తోంది. డాక్టర్ కి ఫోన్ చేస్తా … కదలకుండా పడుకోండి ” అంటూ అక్షింతలు వేసింది.
ఫలితం ‘నడుంకో బెల్ట్ … మెడకో బెల్ట్ ‘ అటు ఇటు తిరగడానికి, తిప్పడానికి కూడా లేకుండా...ఈజిప్టు మమ్మీలా, శవాసనం లో ఉండడమే… లాప్ టాప్ వాసన కూడా చూడకూడదు.
అలా మంచం మీద పడుకుని ఉండగా, స్టాటర్ పోయిన ట్యూబ్ లైట్ లా, కొట్టుకుని, కొట్టుకుని, కళ్ళ ముందు మెరుపులు మెరిసి, జ్ఞానోదయం అయింది. నిజాన్ని గ్రహించాను.
దాంతో ‘తెల్ల జెండా ‘ఊపి, మా గ్రూప్ లో అర్జెంట్ గా ఓ వాయిస్ పోస్ట్ చేసాను.
“వైఫ్ అంటే వై ఫై లా - మన చుట్టూ ఉండే బెటర్ హాఫ్
వైఫ్ అంటే మన లైఫ్ - వారుంటేనే మనం సేఫ్ - అందుకే
వైఫ్ తో వైరం వద్దు - వారితో మైత్రే ముద్దు “
అసలు రహస్యం ఏవిటంటే…
నెల రోజులు నన్ను కదలకుండా, లాప్ టాప్ దరికి చేరకుండా జేసిన ఆ డాక్టర్, ‘ పసిడి పడతుల గ్రూప్’ లో మెంబర్...
“టిట్ ఫర్ టాట్” కుసుమ కొంటెగా నవ్వుతూ నన్ను చూసి కన్నుగీటింది.
సమాప్తం

