డామిడ్ కథ నిలువుకు తిరిగింది . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Damot katha niluvuku tirigindi

డామిడ్ కథ నిలువుకు తిరిగింది.

గుంటూరు నుండి మందుబాబులైన అన్నదమ్ములు రాము,సోము హైకోర్టుపని పైన హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ ప్రపంచ చదరంగ పోటీలు జరగడంతో జంటనగరాలలోని అన్నిహోటళ్ళు నిండిపోయాయి. గది కొరకు తిరిగి తిరిగి అలసిపోయి సమీపంలోని లాడ్డికివెళ్ళి దానిని నిర్వహించే వ్యెక్తివద్ద తమ గోడు వెళ్ళబోసుకున్నారు అన్నదమ్ములు.

వారి బాధ అర్ధంచేసుకున్న ఆవ్యక్తి ' ఒక గది ఉంది కాని సాయంత్రం నాలుగు గంటలకు వేరే వారికి రిజర్వు చేయబడింది మీరు రెండు గంటలకు గది ఖాళి చేయాలి ఇష్టమైతే వేయిరూపాయలు అద్దె ఆపైన నాకు మీఇష్టం వచ్చినంత 'అన్నాడు .

మారు మాట్లాడకుండా పదమూడువందలు అతని చేతిలోపెట్టి గది తాళాలు అందుకున్నాడు రాము.

' ఎనిమిదో అంతస్తు 816 గది నెంబరు 'అన్నాడు అతను .

తలఊపుతూ లిప్టువద్దకు వెళ్ళగానే ,కరెంటు పోయింది.

'ఇక్కడ కరెంటుకోత ఉంది మూడు గంటలకు కరెంటు వస్తుంది జనరేటర్ రిపేరు చేస్తున్నారు 'అన్నాడు అతను .

' గోచి పాతలో దరిద్రం పెట్టుకుని గంగలో మునిగినా ఏం ప్రయోజనం '

అన్న పెద్దోడు, చిన్నోడి బ్యాగ్ కూడా తనే తీసుకుని బయలుదేరాడు మెట్లమార్గంవైపు. అన్నను అనుసరించాడు తమ్ముడు.

ఎనిమిది అంతస్తులు ఎక్కి కాలకృత్యాలు తీర్చుకుని కొంతసేపు విశ్రాంతి తీసుకుని వస్తూ తెచ్చుకున్న అల్పహరం తిని మెట్లమార్గంలో దిగి గది తాళం చెవి నిర్వాహకునికి ఇచ్చి ,ఆటోలో తమ లాయర్ దగ్గరకు వెళ్ళి మాట్లాడి తిరిగి వస్తూ దారిలో మందు బిగించి, భోజనం చేసి లాడ్జికివెళ్ళి కరంటు లేనందున మెట్లమార్గంలోవెళ్ళి గదిలోని తమ వస్తువులు సర్దుకుని గది ఖాళీ చేసి రోడ్డు పైకి వచ్చారు,ఇంతలో రాము సెల్ ఫోన్ మోగడంతో ఆన్ చేసాడు. అవతల వ్యక్తి చెప్పిన విషయం వింటూనే రామం ముఖం పుచ్చపువ్వులా వెలిగిపోయింది. ' చిన్నోడా ఆడబోయిన తీర్ధం ఎదురైనట్లు , మనం తంతే బూరెల బుట్టలో పడ్డాం మనలాయర్ గారు ఫోన్ చేసారు, సికింద్రాబాద్ స్టేషన్ రోడ్డులోని లక్ష్మి లాడ్జిలో మనకు రూంమ్ బుక్ చేసాడట పదవెళదాం ' అని అటుగా వెళుతున్న ఆటోకి వెళ్ళవలసిన ప్రదేశం గురించి చెప్పి అందులో కూర్చున్నారు అన్నదమ్ములు.

అరగంట ప్రయాణ అనంతరం లాడ్జిముందు ఆగిన ఆటోను పంపించి రిసెప్షన్ లోనికి వ్యక్తి తనపేరు చెప్పడంతో రిజస్టర్ ముందుపెడుతూ వివరాలు ,అయిదువేలు అడ్వన్స్ ఇవ్వండి 'అన్నాడు .గదితాళాలు చేతిలొనికి తీసుకున్నాక 'అయ్యా ఎనిమిదో అంతస్తులో 889 మీరూం నెంబరు .ఇక్కడ ఇప్పుడు కరెంటు కోత సాయంత్రం ఆరు గంటలకు కరెంటు వస్తుంది మరలా రాత్రి పదకొండు గంటలనుండి ఉదయం ఎనిమిది గంటలవరకు కరెంటు ఉండదు అన్నాడు.

ఆమాటలు వింటూనే కళ్ళు గిర్రున తిరిగిన అన్నదమ్ములు అక్కడే ఉన్న సోఫాలో కూలబడిపోయారు,చేతిలోని గది తాళం చెవి తాచుపాములా కనిపించింది రామానికి.

'' రామేశ్వరం పోయినా శనిశ్వరం తప్ప లేదన్నట్లు ఉంది మనపని పద '' అన్నాడు పెద్దోడు.

" పెద్దోడా నావల్లకాదు ఇప్పటికే నాలుగుసార్లు ఎనిమిది అంతస్తులు ఎక్కి దిగాను "అని బావురమన్నాడు చిన్నోడు.

" చిన్నోడా డోలు వచ్చి మద్దెలతో మెరపెట్టుకుందట నాకుమాత్రం సంతోషమా చెప్పు కాలం కలసి రానపుడు తాడే పామౌతుంది పద " అన్నాడు పెద్దోడు .

మరేంమాట్లాడినా మరో సామెత వేస్తాడేమో అనిభయపడిన చిన్నోడు పెద్దోడిని అనుసరించాడు.

రాత్రికి రూంమ్ బొయ్ తో మందు,బిర్యాని,టైగర్ బామ్ ,పెయిన్ కిల్లర్ టాబెలెట్లు తెప్పించుకుని టైగర్ బాంమ్ పాతాల నుండి మోకాళ్ళ దాకా బాగా పట్టించి వేడినీళ్ళ కాపడం పెట్టుకుని తాగి, తిని వళ్ళుతెలియని నిద్రపోయారు అన్నదమ్ములు .

తెల్లవారి కాలకృత్యాలు తీర్చుకుని రూంమ్ కు తాళంవేసి లిప్టువద్దకు వచ్చేసరికి ,అటుగా వెళుతున్న రూంమ్ బోయ్ ' పదినిమిషాల ముందు లిప్టు రిపేర్ అయింది 'అని వెళ్ళిపోయాడు.

జల జలా కారుతున్న కన్నీళ్ళను చేతిగుడ్డతో ఆపలేకపోయాడు చిన్నోడు.

' ఛ ఛా ఏమిటిది ముంతడు నీళ్ళకే ఉలిక్కిపడితే పొంతడు నీళ్ళు ఎలా పోసుకుంటావు, పద కోర్టుకు వెళదాం 'అని ముందుకు కదిలాడు పెద్దోడు, జాతరలో బలికి వెళుతున్న మేకలా పెద్దోడి వెనుకే కదిలాడు చిన్నోడు.

సాయంత్రం కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడంతో ,లాయర్ గారితో కలసి ఆరాత్రి పార్టి చేసుకున్నారు. పదిగంటలకు లాయర్ వెళ్ళిపోవడంతో ,అన్నదమ్ములు తూలుతూ ఆటో ఎక్కి లక్ష్మి లాడ్జికి పోనీ అన్నారు. నలభై నిమిషాల అనంతరం ఆటోవ్యక్తి తట్టిలేపడంతో అతనికి డబ్బుచెల్లించి ఆసమయంలో లిప్టు పనిచేయదు కనుక మెట్లదారినే కష్టంగా ఎనిమిదో అంతస్తుకు చేరుకున్నారు .తాళం చెవికొరకు ప్యాంటుజేబులో చేయిపెట్టిన పెద్దోడు ' దరిద్రుడి చేయి పొయిలో పెట్టినా కాలదంటారు ఇదే కాబోలు చిన్నోడా తాళంచెవి ఉదయం కోర్టుకువెళ్ళే సమయంలో రిసెప్షన్ ఇచ్చాను ఆవిషయం గుర్తులేక పైకి వచ్చేసా నువ్వువెళ్ళి రూంనెంబర్ చెప్పి తాళం తీసుకురా " అన్నాడు పెద్దోడు.

" బాబోయ్ ఒంటరిగానా నావల్లకాదు నువ్వు తోడురా "అన్నాడు చిన్నోడు.

' ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చందటే ఇదే ' అని మెట్ల మార్గంలో దిగసాగారు ఇద్దరు.కిందికి వచ్చిన పెద్దోడు చమట పట్టిన ముఖం తుడు చుకోవడానికి చేతిగుడ్డకోసం ప్యాంటు జేబులో చేయిపెట్టగానే గది తాళాలు తగిలాయి.

" చిన్నోడా వెదక బోయిన తీగ కాలికి తగిలినట్లు , గది తాళాలు నాదగ్గరే ఉన్నాయి చూసుకోలేదు పద "అనిమెట్లు ఎక్కసాగాడు.

పెద్దోడా ఇంత కష్ట సమయంలోనూ నువ్వు సామెతలు ఎలా వేయగలుగుతున్నావురా "అన్నాడు చిన్నోడు.

" అలవాటు అయిపొయింది ,అయినా కొత్త చెప్పేగా కరిచేది ,పాత పెళ్ళామేగా అరిచేది " అన్నాడు పెద్దోడు.

పూర్తిగా తడిసిన చేతిగుడ్డను మరోసారి గట్టిగా పిండి మళ్ళి ముఖం తుడుచుకుంటూ పెద్దోడిని అనుసరించిన చిన్నోడు 'చేదుకో కోటయ్యా చేదుకో ' . అని ఆయాసపడుతూ మెట్లు ఎక్కసాగాడు.

అష్టకష్టాలుపడి గదివద్దకుచేరి తాళం తెరిచే ప్రయత్నం ఫలించలేదు '' లాభం లేదురా కిందికి వెళ్ళి రూంమ్ బోయ్ ని పిలుకురావాలి ''అన్నాడు పెద్దోడు .

" మళ్ళి ఎక్కి దిగాలా? నావల్లకాదు " అన్నాడు .చిన్నోడు.

" విడమంటే పాముకు కోపం మింగమంటే కప్పకు కోపం, తప్పదు ఒంటరిగా కిందకు వెళ్ళాలంటే నాకుభయం,ఒక్కడివే ఇక్కడ ఉండాలంటె నీకుభయం పద 'అని మెట్లు దిగసాగాడు పెద్దోడు.

వెక్కి,వెక్కి ఏడుస్తూ అనుసరించాడు చిన్నోడు.

కిందికి దిగినవారు రూంమ్ బోయ్ ని నిద్రలేపుతూ అతను మాట్లాడక మునుపే రెండువందలు అతని చేతిలోపెట్టి విషయం వివరించాడు పెద్దోడు. 'పదండి 'అని మెట్లమార్గంన ఎనిమిదో అంతస్తుకు దారి తీసాడు రూమ్ బోయ్ బుద్ధిగా అతన్ని అనురించారు అన్నదమ్ములు.

ఎంతప్రయత్నించినా గది తాళం తెరుచుకోక పోవడంతో సెల్ ఫోను లైటట్ వెలుగులో తాళం చెవిని,దానికిఉన్న నేమ్ ప్లేటును చూసి " మనం ఎంత ప్రయత్నించినా ఈగది తాళం తెరువలేము " అన్నాడు రూమ్ బోయ్ . "ఎందుకూ "అన్నారు జంటకవుల్లా అన్నదమ్ములు ఒకేసారి. " మీరు హైదరాబాద్ లక్ష్మి లాడ్జికకి వచ్చారు, ఈతళం చెవి సిక్రింద్రాబాద్ లక్ష్శి లాడ్జిది మాప్రాణాలు తీయడానికి వస్తారు మీలాంటివాళ్ళు హైదరాబాద్ కు సికింద్రాబాద్ కు వెత్యాసం తెలియనంత మందు తాగారా? "అని తాళంచెవి పెద్దోడి చేతిలోపెట్టి కిందికి వెళ్ళిపోయాడు.

" మూసమ్మ మూసిపెడితే మారెమ్మ మాయజేసిందంట అలాఉందిరా మన పని రెండువందలు తీసుకుని మరీ వాడు తిట్టివెళ్ళాడు చూడు అదిమరీ బాధగా ఉంది "అన్నాడు పెద్ధోడు.

మూర్చబోయిన చిన్నోడి ముఖాం చారెడు నీళ్ళుకొట్టి కొద్దిగా నీళ్ళు తాపించి ' ఎప్పుడో వచ్చే సుఖాల కోసం రోజు మనతో ఉండే కష్టాలను కాదనకూడదు పద ' అని నెమ్మదిగా లాడ్జినుండి రోడ్డు పైకి వచ్చి అక్కడ ఉన్న బస్ స్టాపులో కూలబడ్డారు.

" పిల్లోడు పోయినా పీతివాసన పోలేదంట మనం తాగిన మందు దిగిన దాని వాసన పోలేదు "అన్నాడు పెద్దోడు.

ఇంతలో నైట్ పెట్రోలింగ్ పోలీస్ వ్యాను రావడం దానిలోనుండి దిగిన పోలీసులు 'కోన్ రేతూ యాక్యాకర్రాయ్ 'అంటూ అన్నదమ్ములు ఇద్దరికి

పిర్రలపైన బలంగా రెండు తగిలించిన పోలీసులు ఉల్లిపాయల మూటను విసిరినట్లు ఇద్దరిని వ్యానులోకి విసరివేసారు.

తమలాయర్ కు ఫోన్ చేయడంతో ఆయనవచ్చి యిదు వేల కర్చుతో

లాకప్ నుండి వెలుపలకకు తీసుకువచ్చాడు ఇద్దరిని.

లాడ్జి అడ్రస్ చెప్పి ఆటో ఎక్కిన అన్నదమ్ములు ,అరగంటకు పైగా ప్రయాణించి లాడ్జివద్ద ఆటో దిగి నడక నేర్చుకుంటున్న బిడ్డలా తడబడే అడుగులతో అతినెమ్మదిగా లాడ్డి లిఫ్ట్ వద్దకు చేరుతూనే కెవ్వున అరచిన చిన్నోడు అక్కడ ఉన్న సోఫాలో సృహతప్పి పడిపోయాడు. చిన్నోడిని అంతలా భయపెట్టిన విషయం ఏమాటా అని పెద్దోడు లిఫ్ట్ వైపు చూసాడు. అక్కడ అందంగా పొందికగా తేనెలూరు తెలుగులో ' లిఫ్ట్ రిపేరులో ఉన్నది మెట్లు మార్గాన్నే అనుసరించ వలెను 'అని ఉంది. పెద్దగా ఏడుస్తున్న చిన్నోడిని ఓదార్చి' గోటితో పోయే దానికి గొడ్డలి ఎందుకు ,భయపడక మైహునా ' అని ,రూంమ్ బోయ్ కి రెండడువందలు ఇచ్చి గది తాళాలు ఇస్తూ తమగదిలోని సామానులు తీసుకురమ్మన్నాడు.

లగేజి వచ్చిన అనంతరం చిన్నోడితో అక్కడే ఉన్న బార్ లొనికి వెళ్ళి రెండు రౌండ్లు లాగించి ' మండే కడుపుకు కాలే గంజి ' అన్నడు పెద్దోడు ' చెరినాలుగు ఆమ్లేట్లు తిని,ఎప్పటిలా తమకు ఇష్టమైన రెండులీటర్ల కూల్ డ్రింక్ లో మందు కలుపుని రైల్వేష్టేషన్ కు బయలు దేరారు.

' పెద్దోడా ఇప్పుడు నేనొక సామెత వేస్తాను ' కుక్క తోక వంకర తీయలేము ,మనము అంతే మారముగాక మారము "

అన్నడు చిన్నోడు.

విజయవాడ టిక్కెట్ తీసుకుని పాట్నా వెళ్ళే రైలు బండి పైబెర్తులు ఎక్కిరు, మెలకువ వచ్చినప్పుడల్లా అన్నదమ్ములు కూల్ డ్రింక్ బాటిల్లోని మందు తాగసాగారు.

ఈకథ చదివే గోతెలుగు పాఠకులారా మీలో ఎవరైనా ఆరైలుబండిలో వారికి చేరువుగా ఉంటే వారిని విజయవాడ రాగానే నిద్రలేపండి లేదంటే వాళ్ళు ఒరిస్సాలో బండి దిగుతారు.

మరిన్ని కథలు

Moodu saakulu
మూడుసాకులు
- ప్రభావతి పూసపాటి
Pasi(di) manasu
పసి(డి ) మనసు
- వేముల శ్రీమాన్
Prayaschittam
ప్రాయశ్చిత్తం
- యఱ్ఱాప్రగడ శాయి ప్రభాకర్
Kaalaateeta satyam
కాలాతీత సత్యం
- డా:సి.హెచ్.ప్రతాప్
Naanna
నాన్న
- వేముల శ్రీమాన్
Lingodbhavamu
లింగోద్భవము
- మరింగంటి సత్యభామ
Modati adugu
"మొదటి అడుగు"
- ప్రభావతి పూసపాటి