ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చింది. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Enki pelli subbi chavukochhindi

ముహుర్తం పెట్టనులేదు మామిడి తోరణం కట్టనూలేదు మంగళవాద్యాలు మోగనూలేదు గోపయ్య వంటగదిలో కుడికాలు పెట్టక లోనికి వచ్చి పదేళ్ళు నిండాయి. గోపయ్య గతం తెలుసుకోవాలంటే మనంగతంలోకి వెళ్ళాలి. సరిగ్గా పదేళ్ళక్రితం విశ్రాంత ఉద్యోగిగా మారిన రెండో రోజున ...

" అలా ఊరికే కూర్చోండటం ఎందుకూ ఇలా వచ్చిఉల్లిపాయలు, బెండకాయలు తరిగి ఇవ్వొచ్చు కదా "అన్నది కాంతమ్మ.

ఎడమకాలు ముందు పెట్టి తొలిసారి వంటగదిలోకి వెళ్ళాడు గోపయ్య. నాటి నుండి,నేటి వరకు ఇంటిపని ,వంటపని అతనిచేతే చేయిస్తుంది అతని భార్య కాంతమ్మ.

" ఇవాళ నాపుట్టిన రోజు డెభైలో అడుగు పెట్టాను " అన్నాడు గోపయ్య.

" మన పెరట్లో మామిడి చెట్టుకు నూటఇరవై వయసట మీఅమ్మగారు పోయేముందు నాకుచెప్పారు " అన్నది కాంతం.

" వాషింగ్ మిషను రిపేరు వచ్చి రెండు నెలలు అయింది రిపేర్ చేసేవాళ్ళను పిలిపించకూడదు " అన్నాడు గోపయ్య.

" మీరు బట్టలు ఉతికి ఆరవేయడం ,పిండిరుబ్బడం వంటిపనులు ఆరోగ్యానికి మంచిది పైగా వ్యాయంమం చేసినట్లు ఉంటుంది, చక్కెర వ్యాధి ఉన్నవాళ్ళు కేవలం నడవటమెకాదు శరీరానికి తగినంత వ్యాయామం అవసరం,తమరు తెచ్చే ఫించెను డబ్బులకు అన్ని సౌకర్యాలు కోరుకుంటే ఎలా? బోలెడు కరెంటు బిల్లు కట్టవలసివస్తుంది ,అందుకే మిక్సీ,గ్రయిండరు మూటకట్టి మంచంకింద పెట్టించాను మినిమం కరెంటు బిల్లు తొ సరిపెట్టుకోవాలి ,తమరు గొంతెమ్మ కోరికలు మాని కుంపటిపై మరుగుతున్న రసం ఇలా వచ్చి అరచేతిలో వేయండి ఉప్పు సరిపోయిందో లేదో చెపుతాను " అన్నది కాంతమ్మ.

తల ఊపుతూ వంటగదిలోకి వెళ్ళాడు గోపయ్య.

రాత్రికి మూడు పుల్కాలు,పాలకూరతోతిని కూటిబల్లపై ఉన్నవి సరిచేసి, వంటగదిలో పాత్రలు కడిగి పడకగదిలోకి వచ్చేసరికి పదకొండు గంటలు దాటింది. ఏ.సి. రిమోట్ చేతిలోకి తీసుకున్న గోపయ్యను చూసిన కాంతమ్మ

" ఇప్పుడు ఏ.సి ఎందుకు చల్లగానే ఉందికదా అంతగా గాలిచాలకుంటే డాబాపైకి వెళ్ళండి "అన్నది .

ఛాతి నొప్పితో బాధపడుతూ చాపా, దిండు దుప్పటితో డాబా పైకి మెల్లగావెళ్ళి నడుంవాల్చిన గోపయ్యకు కొద్దిక్షణాల అనంతరం దున్నపోతుపైన యముడు తనవద్దకు నేరుగావచ్చి

" గోపయ్య నేటితో నీఆయువు తీరింది ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఏనాడు లంచం తీసుకోని నీనిజాయితీకి మెచ్చి నిన్ను తీసుకువెళడానికి నేనే స్వయంగా వచ్చాను "అన్నాడు.

" సామి నమస్కారం నాకు ఎందుకు ఇలాంటి గయ్యాళి భార్యను ఇచ్చావు " అన్నాడు గోపయ్య.

" నేను ఇవ్వడ మేమిటయ్య కుటుంబసమేతంగా వెళ్ళి చూసి నచ్చి మెచ్చి మురీ పెళ్ళాడావు ,అయీనా నాబిడ్డ కాంతమ్మకు ఏంతక్కువ " అన్నాడు యముడు.

" అన్నీ ఎక్కువే అసలు నేను పడేబాధలు నువ్వు అనుభవిస్తేకాని నీకు అది నీబిడ్డో, మట్టి గడ్డోకాని తెలియదు ఉన్నఫళంగా రమ్మంటే ఎలా కుదరదు నాలుగురోజులు సమయం కావాలి " అన్నాడు గోపయ్య .

" సరే ఈప్పటినుండి కొద్దిరోజులు నీశరీరంలో నేను ప్రవేసించి ఉంటాను. ఇకనుండి నీదినచర్యలో ప్రతిపని నేనే చేస్తాను నువ్వు హయిగా చూస్తుఉండు ,అయినా మీకు సంతానం లేదు కదా ఈ ఆస్తి ఎవరికి చెందుతుంది? " అన్నాడు యముడు.

" నేను ముందు పోతే ఆమె తమ్ముడికి,ఆమె ముందు పోతే నాతమ్ముడికి దక్కుతుంది "అన్నాడు గోపయ్య.

తెల్లవారుతూనే పెరట్లో వేపపుల్ల విరిచి కసమిస నమలసాగాడు గోపయ్య "అబ్బా ఏమిటయ్య ఇది ఇంతచేదుగా ఉంది" అన్నాడు యముడు.

" పొదుపు , ఆరోగ్యము పద " అని కాంతానికి కాఫీ అందించాడు గోపయ్యలో దాగిఉన్నయముడు .

' ఖర్మ ఇన్నేళ్ళయినా కాఫీ కలపడం రాదాయే పంచదార కొంచం తగలెట్టండి ఇందులో చక్కెర వ్యాధి ఉన్నది మీకు నాకు కాదు' అని గయ్యమంది కాంతమ్మ. షింక్ వద్ధకు వెళ్ళి నీళ్ళతో గడ్డం రుద్ది ,రేజతో గీయసాగాడు గోపయ్య.

" ఓయ్ గడ్డం మంటపుడుతుంది కొంచెం షేవింగ్ క్రీము రాయవయ్యా నీపిసినారితనం పాడుగాను రేజర్ మార్చు "అన్నాడు యముడు .

" కుదరదు నెలకు మూడు రేజర్లు, అంటే ఒకరేజర్ పదిరోజులు అంటే ఒకరేజతో అయిదుసార్లు వాడుకోవాలి,స్నానం సోపే షేవింగ్ క్రీముగా వాడుకోవాలి ఇది నీకూతురు ఆర్డర్ " అన్నాడు గోపయ్య.

" మాటమాటకి నీకూతురు నీకూతురు అని ఎత్తిపొడవక్కర్లేదు ఈలోకంలో వారంతా నాబిడ్డలే " అన్నాడు దేవుడు.

చకచక వంటపని పూర్తి చేసి స్నానాలగదిలో దూరాడు గోపయ్య.

' స్నానం త్వరగా కానివ్వండి ఈరోజు డాక్టర్ వద్దకు వెళ్ళాలి ' అంటూ పొలికేక పెట్టింది కాంతం.

చుర్రున కాలుతున్న ఎండలో రెండు కిలొమీటర్ల దూరం నడచి రక్తపరిక్ష అనంతరం అక్కడే ఉన్న కుర్చిలోకూర్చోని చేతిసంచిలోని ఫలహరం స్టీలు డబ్బా మూతతీసి, ఉదయం ఆహరం తీసుకునే ముందు రెండు టాబ్లెట్లు మింగి,వణుకుతున్న చేతులతో ఇన్స్ లిన్ ఉన్న సిరంజిని తన తొడ భాగంలో గుచ్చుకున్నాడు గోపయ్య.

కెవ్వుమన్న యముడు " చంపావుకదయ్యా ఆమెండి సూదితో అలా గుచ్చకుండా మూడు రోజులకకు ఓసిరంజి మార్చవచ్చు కదా " అన్నాడు గోపయ్యలోని దేవుడు.

" కూడేకొద్ది కుండలు అమ్ముతుంది నీకూతురు కాంతం,!మూడు రోజులకు ఒక సిరంజికాదు మాసానికి మూడు సిరంజీలు ఇస్తుంది నీకూతురు "అన్నాడు గోపయ్య.

ఉదయం ఆహరంగా రాగిజావ చూడగానే ఆముదం గిన్నె చూసిన పిల్లాడిలా ముఖంపెట్టాడు యముడు.నిమ్మకాయ ఊరగాయ నాలికకు రాసుకుంటూ జావగిన్నె ఖాళీ చేసి రెండుగంటల అనంతరం మరలా రక్తం పరిక్షకు ఇచ్చి ఎండలో నడుచుకుంటూ ఇల్లు చేరి కూటిబల్ల వద్ద కూలబడి సీసాడు నీళ్ళు ఖాళీ చేసాడు గోపయ్య. ఇంతలో గుమ్మం వద్ద ఆటో ఆగిన శబ్ధం రావడంతో అటుగా చూసాడు గోపయ్య. నాలుగు చిన్న గోతాలతో ఆటోదిగాడు కాంతం తమ్ముడు ' అలా బెల్లంకొట్టిన గుండ్రాయిలా చూస్తారే అవి అందుకొని లోపలపెట్టి ఆటో వాడికి డబ్బులు ఇచ్చి పంపండి ' ఆర్డర్ వేసిందది కాంతం.

' ఒరేవ్ కేశవా ఎప్పుడు తిన్నావో ఏమో కాళ్ళు కడుక్కొనిరా బావ వడ్డిస్తారు అన్నది కాంతం.

నాలుగు మూటలు చూస్తూనే తినేవి ఏవో తెచ్చి ఉంటారని ఊహించుకుని చంటాడికి గిలక్కాయ దొరికినంత ఆనందపడ్డాడు గోపయ్యలోని యముడు.

వచ్చిన వాడుకూడా చక్కెరవ్యాధి సంఘూనికి అద్యక్షుడే కనుక తనకని చేసుకున్న రెండు చపాతీలు మునగకాయలు,టమాటా కూరతో పాటు గ్లాసునిండా మజ్జిగ కూటిబల్లపై ఉంచిన గోపయ్య మరలా చపాతీలపిండి కలపసాగాడు.

తినడం పూర్తయిన కేశవులను చూస్తు తన పుట్టింటి ఏడుతరాలవారి యోగక్షేమాలు విచారించింది కాంతం.

' బావా ఈమూటలోనివి నాలుగు కిలోల పచ్చిమిరపకాయలు ఊప్పు ,మజ్జిగలో ఊరవేయాలి,మరో గోతాములో మూడు కిలోల పండుమిరపకాయలు పచ్చడిగా రుబ్బాలి, అలాగే ఈగోతాములోని బూడిద గుమ్మడికాయలు వడియాలు పెట్టాలి ఏమిటో ఏటా అక్కయ్య చేయి తగలనిదే వాటికి రుచి రాదు 'అన్నాడు.

మధ్యాహన్నం డాబపైన వాటర్ ట్యాంక్ కింద చాప పరుచుకుని కడిగి తుడిచిన పచ్చిమిరపకాయలు పెద్ద పిన్నిసుతో నిలువునాగీరి ఉప్పు, మజ్జిగ కలిపి ఉన్న ప్లాస్టిక్ బక్కెట్లో వేసిన గోపయ్య ,పండుమిరపకాయలు పొడిగుడ్డతో తుడిచి తొడిమలు తీసి ఉప్పు, నానబెట్టిన చింతపండు వేసి రుబ్బి భద్రపరిచాడు,మరుదినం గుమ్మడివడియాలు పెట్టాలి అనుకున్నాడు గోపయ్య.

' అక్కాయ్య ఉప్పు మిరపకాయలు ఊరిన అనంతరం బాగా ఎండాలి,అలాగే వడియాలుకూడాను అంటే వారం పడుతుంది కనుక నేను వారం ఆగివస్తాను అన్నట్టు చెప్పటం మరచాను రేపు బావ మార్కెట్ కువెళ్ళి నాలుగు కిలోలు టమాటాలు తెచ్చి రుబ్బిపెట్టమను , అదేచేత్తో ఒ ఇరవై మామిడి కాయలు ముక్కలు కొట్టించి డ్రమ్ములో ఊరగాయ వేయమను, ఏమిటి అలాచూస్తున్నావు పెద్దమ్మయి శార్వాణికి,చిన్నమ్మాయి శారదకు ,వాళ్ళ అత్తగార్లకు,మాకు ఎలాగో సర్ధుకుంటాంలే 'అని వేగంగా వెళ్ళిపోయాడు కేశవులు.

రాత్రికి డాబాపైన పడుకున్న గోపయ్యతో 'మానవా నిన్నుచూస్తుంటే జాలివేస్తుంది ఎంతకష్టమైనా మరబొమ్మలా చేస్తూనే ఉన్నావు - అన్నాడు యముడు.

" అప్పుడే ఏమైయింది వచ్చేవారం మాతమ్ముడు కూడా దిగుతాడు మళ్ళి కథ మొదలవుతుంది " అన్నాడు గోపయ్య.

" మానవానిన్ను నరకానికి తీసుకువెళ్ళి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న నరక జీవితంకంటే మానరకంలో నీకు ఖటినమైన శిక్షలు విధించడం నావల్ల జరిగే పనికాదు, చంపడానికి వచ్చిననాకే నరకం చూపించావు కనుక నిన్ను నాతో నరకానికి తీసుకువెళ్ళకూడదని నిర్ణయించుకున్నా' అని వెళ్ళిపోయాడు . ఉలిక్కి పడికళ్ళు తెరచిన గోపయ్యకు అప్పుడే తెల్లవారడంతో రాత్రి తనకలలో యముడు రావడం తలచుకుని నవ్వుకుంటూ,కాంతానికి కాఫీ కలిపి ఇవ్వడానికి బయలు దేరాడు.

మరిన్ని కథలు

మృత్యు నీడ
మృత్యు నీడ
- డా:సి.హెచ్.ప్రతాప్
Damot katha niluvuku tirigindi
డామిడ్ కథ నిలువుకు తిరిగింది .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Moodu saakulu
మూడుసాకులు
- ప్రభావతి పూసపాటి
Pasi(di) manasu
పసి(డి ) మనసు
- వేముల శ్రీమాన్
Prayaschittam
ప్రాయశ్చిత్తం
- యఱ్ఱాప్రగడ శాయి ప్రభాకర్
Kaalaateeta satyam
కాలాతీత సత్యం
- డా:సి.హెచ్.ప్రతాప్
Naanna
నాన్న
- వేముల శ్రీమాన్