నిరాధారం - తిరుమలశ్రీ

niradharam

రవై ఐదేళ్ళ విభీషణరావు న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్ లో నలబై ఏళ్ళుగా ఓ డిపార్ట్మెంటల్ స్టోర్ ని నడుపుతున్నాడు. ఆర్నెల్ల క్రితం అతని కొడుకు, కోడలు ఓ రోడ్ ప్రమాదంలో మరణించడంతో... భార్య శాంతమ్మ, ఏడేళ్ళ మనవడు సన్నీలతో స్వదేశానికి తిరిగివెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు అతను. పోయినవారి ఙ్ఞాపకాలు కలచివేస్తూండడమేకాక, మనవణ్ణి తమ సొంత సంస్కృతి, సంస్కారాల నడుమ పెంచాలన్నదికూడా అందుకు ఓ కారణం.

పిన్నవయసులోనే విదేశాలకు వెళ్ళిపోయిన విభీషణరావుకు స్వదేశంలో బంధువు లెవరితోనూ టచ్ లేకుండా పోయింది. హైదరాబాద్ లో ఉండే ఓ స్నేహితుడు, గుర్నాథరావు సలహా, సహకారాలను కోరాడు. మర్నాడు ఇండియాకి ప్రయాణమనగా ముందురోజు రాత్రి మిత్రుడితో ఫోన్లో చాలాసేపు మాట్లాడాడు…

హైదరాబాద్ లోని శంషాబాద్ ఏర్ పోర్ట్ లో విభీషణరావు కుటుంబాన్ని రిసీవ్ చేసుకుని వెస్ట్ మారేడ్ పల్లిలోని తన ఇంటికి తీసుకువెళ్ళాడు గుర్నాథరావు… జూబిలీ హిల్ల్స్ లో ఇండిపెండెంట్ హౌస్ ఒకటి అమ్మకానికి ఉందని తెలిసి దాన్ని కొనుగోలువేయడానికి పూనుకున్నాడు విభీషణరావు. బేరం కుదిరి రిజిస్ట్రేషన్ కోసం రెజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్తే, విభీషణరావు యొక్క ’ఆధార్ కార్డ్’ నకలును దస్తావేజులకు జతపరచాలన్నారు. తాను న్యూజిలాండ్ నుండి ఇటీవలే స్వదేశానికి తిరిగివచ్చాననీ, ఆధార్ కార్డ్ ఇంకా తీసుకోలేదనీ వివరించబోతే వినిపించుకోలేదు రెజిస్ట్రార్. ఆధార్ పత్రం లేనిదే రెజిస్ట్రేషన్ సాధ్యంకాదంటూ త్రిప్పి పంపేసాడు.

ప్రస్తుతం దేశంలో ’ఆధార్’ హవా వీస్తోందనీ, ప్రతి వ్యవహారానికీ అది కేంద్రబిందువు అయిందనీ మిత్రుడు వివరిస్తూంటే నోరు తెరచుకుని ఆలకించాడు విభీషణరావు. ప్రస్తుతానికి తనకు అద్దె కొంపే గతి అన్న విషయం బోధపడింది… బంజారాహిల్స్ లో నెలకు ముప్పైవేల రూపాయల అద్దెకు ఇండిపెండెంట్ హౌస్ ఒకటి చూసాడు. లక్షరూపాయలు ఎడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాసుకోబోతే, అతని ఐడెంటిటీని ధ్రువపరచే ’ఆధార్ కార్డ్’ కావాలన్నాడు ఇంటి యజమాని!

"ప్రభుత్వ రంగానికి చెందిన పనులైతే ఆధార్ కాని, ప్రైవేట్ వ్యవహారాలకు ఎందుకు?" విస్తుపోయాడు విభీషణరావు.

"సారీ! పనిమనిషిని సైతం ’ఆధార్’ లేనిదే పనిలో పెట్టుకోకూడదన్నది పోలీస్ రూల్. ఆధార్ కార్డ్ లేనివారికి నా ఇల్లు అద్దెకివ్వలేను," ఖచ్చితంగా చెప్పేసాడు ఇంటి యజమాని.

"దిసీజ్ టూ మచ్!" అంటూ అతని మీద ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు విభీషణరావు.

ఫిర్యాదును నమోదు చేసుకోవడానికి ’ఆధార్’ కావాలన్నారు పోలీసులు.

హతాశుడైన విభీషణరావు స్నేహితుడితో మొరపెట్టుకుంటే, అతను నవ్వి, "దేశంలోని ప్రతి పౌరుడికీ ఓ జాతీయ గుర్తింపును కలుగజేయాలన్నది ప్రభుత్వాశయం. ఎర్రమంజిల్ లో ఉన్న నా గెస్ట్ హౌస్ ప్రస్తుతం ఖాళీగానే ఉంది. స్వంత ఇల్లు అమరేంతవరకు మీరు అందులో ఉండొచ్చును" అన్నాడు. ఓ నౌకరుతో పాటు వంటకోసం గ్యాస్ స్టవ్, సిలిండర్ కూడా ఏర్పాటుచేసాడు గుర్నాథరావు.

బ్యాంక్ ఎకౌంట్ తెరచి ఫారిన్ ఎకౌంటులో ఉన్న తన సొమ్మును అందులోకి బదిలీ చేసుకోవాలనుకున్నాడు విభీషణరావు. తీరా బ్యాంక్ కి వెళ్ళితే, ఖాతా తెరవడానికి ఆధార్ కార్డ్ తప్పనిసరి అన్నారు. నుదురు కొట్టుకున్నాడు అతను.

మనవణ్ణి స్కూల్లో చేర్పించాలని ఓ పబ్లిక్ స్కూల్ కి వెళ్ళాడు విభీషణరావు. అతన్ని (పిల్లాణ్ణి కాదు!) గంటసేపు ఇంటర్వ్యూ చేసి ఎడ్మిషన్ ఇవ్వడానికి ఒప్పుకుంది స్కూల్ మేనేజ్మెంట్. అప్ప్లికేషన్ పూర్తిచేస్తున్నప్పుడు కాని తెలిసిరాలేదు అతనికి, 'ఆధార్ కార్డ్' నకలును తప్పనిసరిగా జతపరచాలని. తాను ఆఫర్ చేసిన ఫ్యాట్ డొనేషన్ కూడా ఉపకరించకపోవడంతో నిశ్చేష్ఠుడయ్యాడు.

అనంతరం కుకింగ్ గ్యాస్ కనెక్షన్ కీ... టెలిఫోన్ ల్యాండ్ లైన్ కనెక్షన్ కీ... మొబైల్ ఫోన్ కొనుగోలుకీ - అలా అన్నిటికీ ’ఆధారే’ ఆధారం కావడం ఉక్కిరిబిక్కిరిచేసింది అతన్ని.

"ఇది మునుపటి ఇండియా కాదు. సూపర్ పవర్ కావాలన్న ఐడియాతో ఉరుకులు పరుగులు పెడుతూన్న దేశం. అన్నిటా నూతనత్వమే..." అంటూ గుర్నాథరావు వివరిస్తూంటే, నోరు వెళ్ళబెట్టాడు విభీషణరావు.

ఓ రోజున భార్యను, మనవణ్ణీ తీసుకుని ప్రసాద్ ఐ-మాక్స్ లో సినిమాకి వెళ్ళాడు విభీషణరావు. ఆధార్ కార్డ్ చూపిస్తే కాని ప్రవేశం లేదన్నారు. ఆమధ్య నగరంలో సంభవిస్తూన్న ఉగ్రవాద చర్యల కారణంగా ఆధార్ ఐడెంటిటీ లేనిదే లోపలికి అనుమతించరాదని ప్రభుత్వం నిర్దేశించిందట! చేసేదిలేక తిరుగు ముఖం పట్టిన ఆ కుటుంబం, డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళవచ్చునని ఓ స్టార్ హోటల్ కి వెళ్ళింది. అక్కడా అదే నిబంధన!

’అడ్మిషన్ విత్ ఆధార్ ఓన్లీ’ - అన్న బోర్డ్ చూసి హతాశులై ఇంటి ముఖం పట్టారు.

ఆ తరువాత షాపింగ్ మాల్స్ లోనూ అదే అనుభవం. రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్ లో ప్రవేశానికి సైతం ’ఆధార్’ తో ’లాగ్ ఇన్’ చేస్తే తప్ప నో ఎంట్రీ!

పౌరుల నిత్యజీవితాలు ఆధార్ కార్డ్ తో ఎంతగా ముడిపెట్టుకుపోయాయో గ్రహింపుకు వచ్చిన విభీషణరావు, ఇక ఆలస్యం చేయకుండా కుటుంబంతో అధార్ నమోదు కేంద్రానికి వెళ్ళాడు. క్షణ క్షణానికీ హనుమంతుడి తోకలా పెరిగిపోతూన్న క్యూని చూసి జడుసుకున్నాడు. ఇంకా కొన్ని లక్షలమంది నమోదు చేసుకోవలసియుందట నగరంలో. ‘ఆన్ లైన్’ ఎన్ రోల్మెంట్ ఫెసిలిటీ ఉన్నా అది పనిచేయదట. అందుకే నమోదు కేంద్రాల వద్ద అంత పెద్ద క్యూలు, తొడతొక్కిడూలూ, ఆ త్రొక్కిసలాటలో మరణాలూ సంభవిస్తున్నాయట. ఆ విషయాలన్నీ ఆలకించి తెల్లబోయాడు అతను.

సుమారు వారం రోజులపాటు ఉదయం నుండి సాయంత్రం వరకు కుటుంబమంతా మండుటెండలో పడిగాపులు పడితే కాని విభీషణరావు వంతు రాలేదు. తీరా వచ్చాక, నమోదు కోసం అతని వంతు రెండేళ్ళ తరువాత కాని రాదంటూ... ఓ సీరియల్ నంబరూ, రెండేళ్ళ తరువాయి తేదీ, సమయమూ ఇవ్వబడ్డాయి...కొయ్యబారిపోయిన విభీషణరావు, అధికారులతో తన గోడు వెళ్ళబోసుకోబోతే వినిపించుకునే నాథుడే లేకపోయాడు.

దేశంలోని పరిస్థితి పూర్తిగా అవగాహన అయిపోయింది విభీషణరావుకు. స్వదేశంలో తనకు, తన కుటుంబానికీ తావులేదు. ’ఆధార్’ కార్డ్ లేనిదే తాము నిరాధారు లయిపోతారు. నమోదు కోసం ఎదురుచూసే ఆ రెండేళ్ళూ తాము ఎలా జీవించాలో బోధపడలేదు. అందుకే బాగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాడు - న్యూజిలాండ్ కి తిరిగి వెళ్ళిపోవాలని! ఉనికికి గుర్తింపు లేని చోట నిత్యమూ తిప్పలుపడే కంటె, అదే మంచిది అనిపించింది.

ఆలస్యం చేయకుండా ఫ్లైట్ టికెట్స్ కొనడానికి ఏర్ లైన్స్ ఆఫీసుకు వెళ్ళాడు. అక్కడ వాళ్ళు చెప్పిన సంగతి అతన్ని ఖంగు తినిపించింది. స్వదేశ యానానికే కాదు, విదేశీ ప్రయాణానికి సైతం ఆధార్ ఐడెంటిటీ లేనిదే టికెట్స్ ఇష్యూ చేయబడవు!

అంటే... తాను, తన కుటుంబమూ ఆ 'త్రిశంకు నరకం’లో చిక్కుకుపోయారన్నమాట!!

’ఓఁ...నో...!’ అంటూ అరిచాడు విభీషణరావు.

#

"ఏమండీ! ఎందుకలా అరిచారు? పీడకల ఏదైనా వచ్చిందా?" అంటూ భార్య శాంతమ్మ తట్టి లేపుతూంటే - కన్నులు తెరచిన విభీషణరావు అయోమయంగా పరిసరాలను పరికించాడు.

అది - వెల్లింగ్టన్ లోని తన బెడ్ రూమ్!

’ఓహ్ఁ, అదంతా కలా...!?’ అనుకుంటూ, మళ్ళీ కన్నులు మూసుకున్నాడు.

గత రాత్రి ఫోన్ లో స్నేహితుడితో మాట్లాడుతూండగా, సందర్భవశాత్తూ, ప్రస్తుతం ఇండియాలో ప్రజలు పడుతూన్న ’ఆధార్’ కష్టాలను గూర్చి విపులంగా చెప్పుకు వచ్చాడు అతను. బహుశా దాని గురించే ఆలోచిస్తూ పడుకున్నందునేమో ఆ కల వచ్చియుంటుందనుకున్నాడు విభీషణరావు. దీర్ఘాలోచనలో పడిపోయాడు.

"మన ఇండియా ప్రయాణం ఇవాళే కదండీ! సర్దుకోవలసినవి బోలెడు ఉన్నాయి. మీరింకా పడుకునే ఉంటే ఎలా? లేవండి పైకి" అంది శాంతమ్మ వచ్చి తొందర చేస్తూ.

అప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన విభీషణరావు, "మన స్వదేశీ యానం క్యాన్సెల్, శాంతా! నలభై ఏళ్ళుగా మనల్ని ఆదరించి ఆదుకున్న ఈ దేశాన్ని వదలి వెళ్ళబుద్ధి కావడంలేదు నాకు. పైగా కొత్త ప్రాంతానికి వెళ్ళి మన ఉనికిని కోల్పోయి నిరాధారం కావడం మూర్ఖత్వం అవుతుంది. అది పుట్టిన గడ్డ అయినా సరే!" అన్నాడు తాపీగా. ’ఆధార్’ ఇక్కట్లను గూర్చి ఆమెతో చెప్పాలనిపించలేదు.

తెల్లబోయి చూసింది ఆమె.

అప్పుడే అక్కడికి వచ్చిన సన్నీ చప్పెట్లు కొడుతూ, "భలే, భలే! ఇక్కడ నా ఫ్రెండ్స్ ని మిస్సవ్వను నేను. థాంక్ యూ, తాతయ్యా!" అంటూ విభీషణరావును ముద్దులు పెట్టేసుకున్నాడు ఆనందంగా.

***

మరిన్ని కథలు

Improper donation
అపాత్ర దానం
- పద్మావతి దివాకర్ల
Ruby in clay
మట్టిలో మాణిక్యం
- డాక్టర్. షహనాజ్ బతుల్
మహత్కార్యం
మహత్కార్యం
- పద్మావతి దివాకర్ల
Teaching (children's story)
ఉపదేశం (బాలల కథ)
- డి వి డి ప్రసాద్
Miracle
ఎండమావి
- సన్నిహిత్
papodu
పాపోడు
- అఖిలాశ
sulti
సుల్తి
- అఖిలాశ
house wife
గృహిణి
- చంద్ర శేఖర్ కోవూరు