కథల్లేవూ - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

No stories

నిర్మాతకి కథ వినిపించే మంచి అవకాశం దొరికింది రచయిత రాజుకి. అందుకే తెగ ఇదై పోతున్నాడు. ఆయనని కలుసుకోవాలన్నది అతని చిరకాల వాంఛ. ఆయనకి తన కథ నచ్చితే తన పంట పండినట్టే. ఆయన మెగా ప్రొడ్యూసర్ మరి. తన దగ్గర సెంటిమెంటుతో కూడినవి..ఆర్ధ్రతతో నిండి మనసుని పిండేసే మంచి కథలూ ఉన్నాయి.

ఆయన్ని కలిసే అవకాశం కోసం ఎన్నాళ్ళగానో ఎదురుచూశాడు. ఏ దేవుడి వరమో ఇన్నాళ్ళకి ఫలించింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే తెగ ఇదై పోతున్నాడు. ఆయన రమ్మన్న హోటల్‍కి వెళ్ళి, రూములో ఇంద్రుడిలా ధగ ధగ లాడుతున్న నిర్మాతని చూసి ఎనాళ్ళుగానో తపస్సు చేస్తే ఎదుట నిలబడిన వేలుపులా తోచి వంగి వంగి నమస్కరించాడు.

"రావయ్యా..రా..మొత్తానికి నీ టైము బావుందయ్యా..అందుకే నా టైము సంపాదించగలిగావు..అది సరే గాని ముందు కథ చెప్పడం మొదలెట్టవయ్యా మన కాడ ఆట్టే టైము లేదు." అన్నాడు.

"అలాగేనండి..మరేమో ఓ ఊళ్ళో హీరో వుంటాడండి. అతను మామూలుగా జనంలో కలసిపోయి..

"ఏందయ్యా..మరీ ఇంత సప్పగా వుంది? కథంటే జనంచేత కతాకలి ఆడించాల..ఆఁ"

"ఇది వినండి..ఓ హీరో ఊళ్ళో అందర్లో డిఫరెంట్‍గా వుంటాడు. అతనికో చెల్లెలు వుంటుంది.."

"ఆగవయ్యా ఆగు..ఇదే ఇసయం మీద ఎన్ని సినిమాలు రాలేదు సెప్పు..కాస్త కొత్తగా ఏవన్నా వుంటే సెప్పవయ్యా మగడా.."

"మరండీ..ఒకావిడ హాస్పిటల్లో కొడుకుకోసం కుమిలిపోతూ వుంటుంది..కొడుకు తల్లికోసం తాపత్రయపడుతూ.."

"ఛత్ ఏం కథలయ్యా అయి..నాకే సిరాకు తెప్పిస్తున్నాయి..జనం సీట్లలో కూర్చోవాలా వద్దా?"

"పోనీ ఇది వినండి..హీరోకి సంగీతం అంటే ప్రాణం. కళలంటే కళ్ళు. అలాంటి అతను.."

"ఏవయ్యా! నేనేమన్నా అవార్డు సినిమా తీస్తానని ఏ ప్రెస్ మీట్లో నన్నా చెప్పానా? ఎందుకయ్యా బుర్ర తినేస్తున్నావు?.."

రాజుకి మనసంతా బాధగా వుంది. కథ పూర్తిగా చెప్పనిస్తే దాని పస తెలుస్తుంది. అసహనంగా మధ్యలో ఆపేస్తున్నాడు. ఎలా? రాక రాక వచ్చిన అవకాశం. చేజారిపోతోంది.

"సార్..మరి.."

"వద్దయ్యా..వద్దు..ఇంకోపాలి మంచి కతుంటే పట్రా అప్పుడు చూద్దాం..నా మూడ్ మొత్తం చెడిందయ్యా..వెళ్ళు.."అని బలవంతానా రాజుని పంపించేశాడు.

ఆ సంఘటన తర్వాత మూస కథలతో ఆయనవి మూడు సినిమాలు రిలీజయ్యాయి.

ప్రెస్ మీట్లో.."సార్ మీ సినిమాల్లో కొత్తదనమేం లేదని అంటున్నారు..ప్రేక్షకులు. దీనికి మీరేమంటారు?"ఆయన్ని అడిగాడు జర్నలిస్టు.
"కథలకి కరువొచ్చిందండి..మాకు మాత్రం కొత్తగా తియ్యాలని వుండదా? మంచి కథలు రాసేవాళ్ళు పత్రికలు దాటి రావడంలేదు..అన్నీ మేము సదవలేం కదా! ఇండస్ట్రీలో ఉన్నవాటితోటే మేము సినిమాలు తియ్యాల్సి వస్తోంది..రాడానికి రెడీగా వుంటే..వచ్చే కొత్త నీటిని ఆపడానికి మేమెవరమండి..ఆఁ"

టీ వీ లో ఆ ఇంటర్వ్యూ చూస్తూ బాధగా నిట్టూర్చాడు రాజు.

మరిన్ని కథలు

Kotta kathalu kaavaali
కొత్త కథలు కావాలి
- తాత మోహనకృష్ణ
Sarigamalu
సరిగమలు
- కొడవంటి ఉషా కుమారి
Sandhyarani coffee kappu
సంధ్యారాణి కాఫీకప్పు
- అనంతపట్నాయకుని కిశోర్
Anaadigaa..
అనాదిగా....
- షామీరు జానకీ దేవి
దుష్టబుద్ధి!
దుష్టబుద్ధి!
- - బోగా పురుషోత్తం
Vendi kadiyalu
వెండి కడియాలు
- కొడవంటి ఉషా కుమారి
Chillara kshanalu
చిల్లర క్షణాలు
- భాగ్యలక్ష్మి అప్పికొండ