ప్లానింగ్ - కల్పన

planning

"ఎన్ని సార్లు అడిగినా నా జవాబు ఒక్కటే. ఇవ్వడం కుదరదు". ఖచ్చితంగా చెప్పాడు దీపక్.

"అలా అంటే ఎలాగరా కన్నా! ఎప్పటినించో మనసులో ఉండిపోయిందిరా. మళ్ళీ మళ్ళీ వెళ్లలేను. మహాలక్ష్మి గారు తమతో పాటు తీసుకు వెళ్తానన్నారు. ఎంతో కాదు పధ్నాలుగు వేలు, నీకది పెద్ద మొత్తమే కాదు. ఆమె నన్ను జాగ్రత్తగా చూసుకుంటానన్నారు. కాదనకురా, నా బంగారం కదూ"! బతిమాలసాగింది శాంతమ్మ.

"అదే ఎందుకు అంటున్నా? ఇప్పుడు నువ్వు ఆ తీర్థ యాత్రలు చేయకపోతే ఏం మునిగిపోదు గాని, కామ్ గా ఉండు. అయినా నీ దారిన నువ్వు ఊళ్ళు ఊరేగితే ఇక్కడ ధరణి కి ఎంత ఇబ్బంది పిల్లలతో? ఒక పక్క మా ఉద్యోగాలు, ఇంకో పక్క వాళ్ళ స్కూళ్ళు? మా గురించి ఆలోచించవా?" విసుక్కున్నాడు తల్లిని.

వెంటనే “ముందే ధరణి ని అడిగాను కన్నా! పిల్లలకి, తన కి దసరా శెలవులట. పర్లేదు వెళ్ళండి అని చెప్పింది.” ఓహో! బానే ప్లాన్ చేస్కున్నావే..నీకసలు డబ్బు విలువ బొత్తిగా తెలియడం లేదు. ఇక్కడేమీ చెట్లకి కాయడం లేదు. అయినా ఈ వయసులో కృష్ణా రామా అంటూ కూచోక తగుదునమ్మా అని తీర్థ యాత్రలేమిటి? అక్కడ జరక్కూడని దేదైనా జరిగితే మళ్ళీ నేనేగా పాట్లు పడాలి. ఏం వద్దు గాని ఇంట్లో ఉండు.."అన్నాడు చిరాగ్గా.

"అలా అంటే ఎలాగరా. నువ్వు పంపిస్తావని ఎంతో నమ్మకంగా అనుకున్నాను. ఇంకెప్పుడూ అడగనురా. కాశీ, ప్రయాగ చూడాలని ఎన్నోఏళ్ళ నించి కలలు కంటున్నాను. మా తండ్రివి కదూ...” ప్రాధేయపడింది శాంతమ్మ.

“ ఒకసారి చెప్తే అర్ధం కాదా? నేనంత డబ్బు ఇవ్వలేను.ఇంకేం మాట్లాడకు” కచ్చితంగా చెప్పేశాడు దీపక్. ఆవిడకీ .. చాలా కోపం వచ్చింది. “ ఏరా! చిన్నప్పుడే మీ నాన్నగారు చనిపోతే ఎన్నో కష్టాలు పడి అడిగినది కాదనకుండా నిన్ను పెద్ద చదువులు చదివించింది ఇందుకా? నా సుఖాలు చూస్కోకుండా నిన్నివాళ పెద్ద ఉద్యోగస్తుణ్ణి చేస్తే ఏమాత్రం విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్నావు. ఇదేమైనా బాగుందా?" సూటిగా ప్రశ్నించింది .

దీపక్ కూడా ఏమాత్రం తగ్గకుండా “ ఏంటమ్మా?చదివించాను చదివించాను అంటున్నావు. నేనేమైనా నిన్ను కష్టాలు పడమన్నానా? పస్తులుండి నన్ను చదివించమన్నానా? అది నీ ఛాయిస్. నేను బాగా చదువుకుని, చక్కగా సంపాదిస్తే చూడాలన్నది నీ స్వార్ధం. నన్ను సుఖంగా, సంతోషంగా చూడాలన్నది నీ కోరిక... ఎవరో పరాయి వాడిని పెంచినట్టు మాట్లాడుతున్నావే. అందరిలో గొప్పగా చెప్పుకోవడానికి, నీ ఆత్మ తృప్తి కోసం కొడుకుని చదివించుకున్నావ్. ఏదో ఊరికి ఉపకారం చేసినట్టు బడాయి పోకు..అందరు తల్లిదండ్రులూ తమ పిల్లల్ని చదివించుకుంటారు. నువ్వేమీ ఘనకార్యం చేయలేదు. నీ బాధ్యత నిర్వర్తించావంతే. నేను చేయగలిగింది చేస్తున్నాను. నిన్నేమీ ఇబ్బందులపాలు చేయడం లేదుగా. ఈ రోజుల్లో కొంతమంది కొడుకుల్లాగా నిన్ను వృద్ధాశ్రమం లో పడేసి చేతులు దులుపుకో లేదు. సంతోషించు. ధరణి మంచిది కాబట్టి నిన్ను ఉండనిచ్చింది. ఎక్కువ ఆశించకు.” అని కరాఖండి గా చెప్పేసి కంప్యూటర్ చూసుకోసాగాడు.

తల తిరిగినట్టయ్యింది శాంతమ్మకి. భర్త అనారోగ్యం తో చనిపోతే, చదువు లేకపోయినా, చేరదీసి ఆదరించే వాళ్ళెవరూ లేకపోయినా మొండి ధైర్యంతో వంట మనిషిగా, ఆయాగా, స్కూళ్ళల్లో అటెండర్ గా నానా అవతారాలు ఎత్తి ఒక్కపూటే తింటూ కొడుక్కి ఈ కష్టాలు తెలిస్తే ఎక్కడ నొచ్చుకుంటాడో అని వాణ్ని మంచి హాస్టల్లో ఉంచి, అడిగినప్పుడల్లా డబ్బు పంపుతూ వాడు కోరుకున్న చదువులు చదివించిందే గాని తనకంటూ కాస్త సొమ్ము కూడా దాచుకోలేదు. కానీ దానికి ప్రతిఫలం ఏం దక్కింది? ఏదో దయాధర్మంగా ఇంట్లో ఉండనిచ్చామంటున్నాడు. జీతం, భత్యం లేని వంట మనిషి వాళ్ళకెక్కడ దొరుకుతుంది? వాళ్ళ పిల్లలని కంటికి రెప్పలా ఏ పనిమనిషి చూసుకుంటుంది?

కోడలికయినా కాస్త ప్రేమ, అభిమానాలున్నాయి తన మీద. ఎప్పుడూ నోరు జారదు. ఆ అమ్మాయికీ తెలుసు వీడి గుణం. అందుకే పొద్దున్న చెప్పనే చెప్పింది “ యాత్రలకి కావలిసిన డబ్బు నేను ఇస్తానత్తయ్యా..హాయిగా పదిరోజులు తిరిగి రండి ఆయన్నడక్కండి. అని.బుద్ధి తక్కువై అడిగాను. విశ్వాసం లేకుండా ఇంత కటువుగా ఎలా మాట్లాడగల్గుతున్నాడు? కృతఘ్నుడు .. ఛీ !!!! మనసు మండిపోతోంది. ఏమీ మాట్లాడాలనిపించ లేదు,

కానీ మాట్లాడకుండా ఉండలేక “ చూడు కన్నా. నువ్వు నా ఇంటి దీపానివని నేను అనుకున్నట్టే , నువ్వు కూడా నీ పిల్లల్ని ఎంతో ప్రేమగా కష్టపడి పెంచుకుంటున్నావు, మంచి స్కూల్లో చదివించమని వాళ్లేమీ అడక్కపోయినా నీ ఇష్ట ప్రకారం చాలా మంచి స్కూల్లో చదిస్తున్నావు. కానీ కాలం చాలా శక్తివంతమైనది. ఇవాళ నువ్వు అడిగినట్టే రేపు నీ పిల్లలూ నిన్నుప్రశ్నిస్తారు. గుర్తు పెట్టుకో " అంది బాధగా.

" చూడమ్మా! నేనేదో ఆశించి వాళ్ళని చదివించడం లేదు. పెద్దయ్యాక మీ నాన్న మిమ్మల్ని ఎంతో కష్టపడి చదివించాడు తెలుసా అని వాళ్ల ని దేబిరించను.. వాళ్ళు నాకు నిలబడాలని కూడా నేను కోరుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళనించి ఏమీ తీసుకోకూడదనే నా భవిష్యత్ కోసం ఇప్పటి నించే ప్లాన్ చేసుకుంటున్నాను. వృద్ధాప్యం లో ఇబ్బంది పడకుండా బ్యాంక్ లో డబ్బు డిపాజిట్ చేసుకుంటున్నాను. నువ్వు కూడా అలా చేసుకుని ఉండాల్సింది కదా..ప్లానింగ్ అనేది చాలా అవసరం.!” అన్నాడు తెలివిగా.

దిగ్భ్రాంతి గా చూసింది కొడుకు వైపు. ఆ చూపులో ఎన్నో భావాలు. నిన్ను తీర్చిదిద్దాలనుకోవడమే నా ప్లానింగ్. దాచుకునేటంత డబ్బే గనక నా దగ్గర ఉంటే కడుపు మాడ్చుకొని ఎందుకన్ని పాట్లు పడ తాను? నా పెట్టుబడి, సేవింగ్స్, భవిష్యత్ అన్నీ నువ్వే అనుకున్నాను రా కన్నా.. . కానీ నువ్వేమో నీ భవిష్యత్ ప్లానింగ్ లో.. తల్లి వర్తమానాన్ని భారంగా ., అనవసరంగా భావిస్తున్నావు.. పిల్లల పట్ల చూపించే ప్రేమ,మమకారాలు బ్యాంక్ లో దాచుకున్న డబ్బు లాగే అవసానదశ లో ఆదుకుంటాయనే పిచ్చి భ్రమతో వేరే ఏ సేవింగ్స్ చేసుకోకుండా , ఫీలింగ్స్ లేని కొడుకులనే నమ్మిన నాలాటి వాళ్ళకి ప్లానింగ్ గురించి ఏం తెలుస్తుంది?! శాంతమ్మఅశాంతిగా నిట్టూర్చి, మౌనం గా వంటింట్లోకి నడిచింది.

మరిన్ని కథలు

Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ