నిర్ణయం - వాత్సల్య

nirnayam

జూన్ నెల. వర్షాలు ఇంకా మొదలవ్వపోవడంతో ఎండ చుర్రుమనిపిస్తోంది ..ఒంటి గంటయ్యింది ఇంకా వీడు రాలేదేమిటి అని వర్ధనమ్మ ఇప్పటికి ఎన్నిసార్లనుకుందో మనసులో.రోజూ పన్నెండున్నరకల్లా కొడుకులిద్దరూ భోజనానికి వస్తారు. కింద మోటార్ సైకిల్ హారన్ వినపడటంతో బాల్కనీ లోంచి కిందకి చూసి హమ్మయ్య వచ్చేసారనుకుంది.పెద్ద కొడుకు భోజనానికి కూర్చుని "అమ్మా".. అని పిలవగానే అర్ధమయ్యింది ఎందుకు పిలుస్తున్నాడో.

వర్ధనమ్మ కి దాదాపు అరవైదేళ్లుంటాయి.ఆవిడ భర్త తమ సొంతూర్లో పంచాయితీ ఆఫీసు లో ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ రెండేళ్ళ కిందట మరణించాడు.

ఆ ఊరి సర్పంచ్ చొరవ తీసుకుని ఆ ఉద్యోగాన్ని వర్ధనమ్మ కి వచ్చేటట్లు చేసాడు.వర్ధనమ్మ పెద్దగా చదువుకోకపోవడంతో ఆవిడ తరపున ఒక కుర్రాడిని పెట్టి అతనికి ఓ ఐదొందలు ఇచ్చి మిగతాది వర్ధనమ్మ కి ఇచ్చేటట్లు ఏర్పాటు చేసాడు.

ఇక్కడ ఒక్క దానివి ఏమి ఉంటావు అని కూతుర్లూ కొడుకులూ బలవంతం చేయటంతో రెండేళ్ళ క్రితం టౌను కి వచ్చింది. వర్ధనమ్మ కి ఇద్దరు కూతుళ్ళూ ఇద్దరు కోడుకులు. పెద్ద కూతురి భర్త వ్యాపారం లో బాగా స్థిరపడి తన బావ మరదులని కూడ టౌను కి పిలిపించి చిన్న చిన్న వ్యపారాలు పెట్టించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు చేసాడు. చిన్న కూతురి భర్త కలెక్టరాఫీసులో ఏదో చిన్న ఉద్యోగం.

వర్ధనమ్మ ని తీసుకొచ్చారే కానీ ఎక్కడ ఉంచుకోవాలి అనేది పెద్ద సమస్య అయ్యింది వాళ్ళకి.చివరికి ఇద్దరు కొడుకులూ చెరో రెణ్ణెల్లు తమ దగ్గర ఉండేటట్లు తీర్మానించారు.

తన భర్త ఉన్నంత వరకూ ఎప్పుడూ ఒకటి రెండు రోజులు మించి ఎవ్వరి ఇంట్లోనూ ఉందని వర్ధనమ్మ కి ఈ ఏర్పాటు బాధ కలిగించినా తప్పలేదు.షరా మామూలుగా కోడలి ఈసడింపులు,కొడుకుల తిరస్కారాలు మెల్లిగా అలవాటు చేసుకుంది.ఎప్పుడూ తను ఖాళీగా కూర్చోదు.కోడలికి పచ్చడి రోట్లో రుబ్బి పెట్టడమో, అరిసెలు వంటి పిండి వంటలు వండటమో చేస్తూ ఉందేది. క్రమం గా వారికి ఈ వంటలు బోరు కొట్టడంతో తనని చెయ్యొద్దనేవారు.తనకి ఈ మధ్య చూపు కూడా మందగిస్తోంది. ఇదే విషయం కొడుకుతో చెప్తే వయసుతో పాటు ఇవన్నీ మామూలే,టీవీ అదీ తగ్గించు అని ఓ ఉచిత సలహా పారేసాడు.రెణ్ణెలయ్యాకా చిన్న కొడుకు దగ్గరకి వెళ్ళి అడిగితే "అసలే పిల్లలు స్కూలు ఫీజు లతో టెన్షన్ పడుతోంటే ఏమిటమ్మా నీ గోల అనడంతో మౌనం గా ఉండిపోయింది. కూతుర్లని అడుగుదామంటే మొహమాటం అల్లుళ్ళు ఏమనుకుంటారో అని.ఒకరోజు అప్పటికీ ధైర్యం చేసి కాస్త ఆర్ధికం గా స్థితిమంతురాలైన పెద్ద కూతురిని అడిగితే తను మాట దాటెయ్యడం గమనించి ఊరుకుంది.

నెల నెలా భర్త ఉద్యోగం ద్వారా వచ్చే డబ్బులు అందినా అవన్నీ కొడుకులే తీసుకుంటారు.వాళ్ళని ఓ ఐదొందలు అడిగి తాను ఒక్కర్తీ డాక్టరు దగ్గరకి వెళ్ళి పరీక్ష చేయించుకోవడనికి మనసొప్పక అలా గడుపుతోంది మసక ద్రుష్టితో. ఆరోజు ఆదివారం..పెద్ద కూతురి కొడుకు కోడలూ విదేశం నుండి వచ్చారని పెద్ద కొడుకు తన ఇంట్లో అందరికీ భోజనాలు పెట్టాడు.

తనకేమో రాత్రి నుండీ విరేచనాలు.కోడళ్ళకి చెప్తే ఏదో మాత్ర ఇచ్చి భోజనాల తయారీలో మునిగిపోయారు.భోజనాల వేళయ్యింది.
అమ్మమ్మేదీ అంటూ తన దగ్గరకి వచ్చిన మనవడిని చూడగానే వర్ధనమ్మ కి కళ్ళ నీళ్ళు ఆగలేదు.మనవడి భార్య కూడా అంతే అభిమానంతో పలకరిస్తుంది తనని వాళ్ళ పెళ్ళయినప్పటినుందీ..

తను భోజనం చెయ్యకపోవడం చూసి ఆ పిల్ల విషయం అడిగి తెలుసుకుని ఆయో అమ్మమ్మ కి మోషన్స్ ట, ఇవన్నీ కాదు, మజ్జిగన్నం పెడదాము అంటూ ప్లేటులో అన్నం కలిపి తెచ్చి

పిన్నీ మజ్జిగ ఇయ్యి అనగానే తన కోడలు "పెరుగు మొత్తం బిర్యానీ లోకి పెరుగు పచ్చడి చేసేసాను, ఏమీ కాదులే అంటూ ఆ పెరుగు పచ్చడి లోంచే కాస్త పెరుగు తీసి ప్లేట్ లో వేసి కాసిని నీళ్ళు పోసింది. కొడుకులు టాబ్లెట్స్ తెచ్చి వేద్దాము తగ్గిపోతుందిలే అంటున్నా వినకుండా మనవడూ వాడి భార్య తనని డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళి మందులు ఇప్పించి కానీ వదల్లేదు.కోడళ్ళు మేము చూసుకుంటాము అన్నా వినకుండా తనని పెద్ద కూతురింటికి తీసుకెళ్ళాడు మనవడు.

ఎప్పుడూ పొద్దున్న మధ్యాహ్నం అలా ఒకసారి వచ్చి కూతురిచ్చిన టీ తాగి వెళ్ళడం తప్ప ఇలా ఎప్పుడూ అల్లుడి ముందర పడుకోవడం ఎరగని వర్ధనమ్మ కి సిగ్గుగా ఉన్నా తప్పలేదు ఆ రాత్రి అక్కడ ఉండటం. రాత్రంతా మనవడు, వాడి భార్య తన పక్కన కూర్చుని గంట గంట కీ డాక్టరిచ్చిన గ్లూకోజు నీళ్ళు కలిపి ఇవ్వడంతో మరునాటికి కాస్త లేచి తిరగ గలిగే శక్తి వచ్చింది.

గది లోంచి బయటకి వెళ్ళబోతొంటే వాళ్ళ మాటలు వినిపించి సభ్యత కాకపోయినా వింటూ ఉండిపోయింది.

"మామయ్యగారూ, అమ్మమ్మ ని మన ఇంట్లో కొన్ని రోజులు ఉంచుకోవచ్చు కదా ఎప్ప్పుడూ వాళ్ళ కొడుకుల దగ్గర చెరో రెణ్ణెల్లు ఉండే బదులు, పైగా వాళ్ళ ఇళ్ళు చిన్నవి, మన ఇంట్లో ఎప్పుడూ ఒక బెడ్ రూం ఖాళీ యే కదా, మేము ఎప్పుడొ తప్ప రాము, వదిన కూడా పిల్లల చదువులని ఎక్కువగా రావట్లేదని అత్తయ్యగారన్నారు..కాస్త అమ్మమ్మ కీ మార్పు ఉంటుంది,ఏమంటారు" అంది.

నాదేముందమ్మా మీ అత్తయ్యగారిని అడుగు అనగానే కూతురు కలగజేసుకుని,"నీకు తెలీదు, మనము అలా మా అమ్మ ని తెచ్చి పెట్టుకుంటే

లోకం ఏమనుకుంటుంది, కొడుకులు చూడకపోవడం వల్ల కూతురింటికి వచ్చింది అని మా తమ్ముళ్ళని,కోడళ్ళు వెళ్ళగొట్టారు అని మా మరదళ్ళకి మాట రాదూ, అయినా వీడు తీసుకొచ్చాడని ఏమీ అనలేదు కానీ, ఎప్పుడైనా జ్వరం వచ్చినా ఏమొచ్చినా వాళ్ళే చూసుకుంటారు, నేను వెళ్ళి పలకరించి పొద్దున్న సాయంత్రం మనింటికి వస్తే టీ ఇస్తాను ..మనం ఇంత కన్నా వాళ్ళ మధ్యలోకి వెళ్ళకూడదు"కూతిరి మాటలు విని వర్ధనమ్మ కి నీరసం ఆవహించి అలా మంచం మీద వాలిపోయింది.

ఈ మధ్యనే తన లాంటి ఉద్యోగాలని పర్మనెంట్ చేసి జీతం పెంచుతున్నారన్న వార్త విన్న దగ్గర నుండీ కొడుకుల నస మొదలు.ఆ ఉద్యోగం తాను చెయ్యలేకపోవడం వల్ల తన కొడుకుని నియమిస్తున్నట్లుగా అధికారులకి ఉత్తరం రాస్తే తామిద్దరిలో ఎవరో ఒకరికి ఇస్తారుట ఆ ఉద్యోగం. అమ్మా నాకు నా వ్యాపారం సరిగ్గా నడవట్లేదు,నువ్వు కానీ ఒక్క ఉత్తరం రాసావంటే నాకు ఆ ఉద్యోగం వస్తుంది, ఏదో వేణ్ణీల్లకి చన్నీళ్ళలా కాసిని డబ్బులు వస్తాయి అని పెద్ద కొడుకంటే..ఇద్దరు పిల్లలతో కష్టం గా కాస్త డబ్బులు సర్దు అని చిన్న కొడుకు నస.

తన ఒంటి మీద ఉన్న ఒంటి పేట చంద్రహారం, రెండు జతల గాజుల పంపకాలు చెయ్యమని కూతుళ్ళు వీలయినప్పుడల్లా అంటూ ఉన్నారు. ఇవన్నీ అలా మౌనం గా వింటూ వస్తోంది వర్ధనమ్మ.

ఈ సంగతులన్నీ ఎలాగైనా తేల్చుకోవాలని ఓ ఆదివారం అందరూ పెద్ద కొడుకింటికి చేరారు.

"అత్తయ్యగారూ..వీళ్ళు అడుగుతున్నవి మీరు అవునో కాదో చెప్తే బాగుంటుంది కదా,ఈరోజు ఏదో ఒకటి నిర్ణయిద్దాము ఏమంటారు"అంటూ పెద్దల్లుడు ఉపోద్ఘాతం గా అనడంతో చిన్న కొడుకు కలగచేసుకుని "నిన్ను మా దగ్గరే ఉంచుకుంటాము, నీకు బెంగ అక్కర్లేదు,ఏదో ఒకటి తేల్చు" అన్నాడు. అన్నీ విన్న వర్ధనమ్మ "నేనెప్పుడూ నా ఉద్యోగం డబ్బుల లెక్క మిమ్మల్ని అడగలేదు, అయినా ఎందుకు మీకు అంత ఆరాటం అనగానే పెద్ద కొడుకేమో "మాకు ఒక ఆదాయ వనరు ఉంది అన్న భరోస ఉంటుందమ్మా ప్రభుత్వోద్యోగముంటే అందుకే నిన్ను సంతకం పెట్టమనేది అన్నాడు.

మొన్న మన ఊరిలో మాస్టారు కనపడి చెప్పార్రా..నీ కొడుకులకి ఆ ఉద్యోగం రావడం కష్టం అని, ఆ ఉద్యోగం అల్పాదాయం కల వారికేట" అనగానే ,కొడుకు విసురుగా, అవన్నీ నేను చూసుకుంటాను కానీ నువ్వు ఉత్తరం మీద సంతకం పెట్టు చాలు అనగానే వర్ధనమ్మ మొహం చిన్నబోయింది.ఇదేమీ పట్టించుకోని కూతుర్లేమో అన్నీ బాగుండగానే పంచుకుంటే బాగుంటుంది కదమ్మా అని పాత పాటే అందుకున్నారు.

ఎప్పటినుండో అనుకుంటున్న మాట ఈసారి ఎలాగైనా పిల్లలకి చెప్పాలని అక్కడే కూర్చుని "సరే అలాగే ఇస్తాను కానీ ఒకసారి అందరమూ కాశీ వెళ్దాము" అనగానే షాక్ తిన్నట్లు గా చూసారు అందరూ. ఈ వర్షా కాలం లో కాశీ ఏమిటీ అని కొడుకంటే మీరు అంతంత దూర ప్రయాణాలు తట్టుకోలేరత్తయ్యా అని కోడలు ప్రేమ కురిపించింది.

ఇది విన్న పెద్ద కూతురేమో అమ్మో నాకు కాళ్ళ నెప్పులు అంటే నాకు ఆయాసం బాబూ అని చిన్న కూతురు సాకులు చెప్పారు.
స్వాతంత్ర్య సమర యోధుల కోటా లో వాళ్లతో పాటు ప్రయాణించి నెల క్రితం దక్షిణ భారత దేశ యాత్ర చేసొచ్చినప్పుడు లేవా కాళ్ళ నెప్పులు అని పెద్ద కూతురిని అడగాలని నోటి దాకా వచ్చిన మాటని గొంతులోనే నొక్కి పట్టేసింది.

ఎన్ని చెప్పినా ఆవిడ వినకపోవడంతో చివరికి తప్పక ఆవిడ ఇద్దరు కోడుకులూ,కోడళ్లు,కూతుర్లు అల్లుళ్ళు ప్రయాణమయ్యారు.కాశీ చేరి విశ్వేశరుణ్ణి పూజించి దగ్గర లో ని ఇతర గుళ్ళూ గోపురాలూ చూసుకుని తిరుగు ప్రయాణమయ్యారు.రైలు టైమయిపోతోంది వర్ధనమ్మ జాడ మాత్రం లేదు.

అమ్మ కి భాష రాదు మనతో ఉందక ఎక్కడకి వెళ్ళింది అని కూతుళ్ళు సణిగితే,అత్తయ్య ఎప్పుడూ ఇంతే ఇలా మమ్మల్ని టెన్షన్ పెడతారు అని కోడళ్ళందుకున్నారు. ఎంత వెతికినా ఎక్కడా జాడ లేదు.

ఇంతలో వీరి దగ్గరకి ఒక నడివయస్కుడు వచ్చి వర్ధనమ్మ గారు తీసుకురమ్మన్నారు మిమ్మల్ని అంటూ వారిని ఒక వ్యాన్ లో కూర్చోబెట్టుకుని బయలుదేరాడు.

అసలేమీ అర్ధం కావట్లేదు ఎవ్వరికీ కూడా.ఎన్ని ప్రశ్నలేసినా ఆ వ్యక్తి సమాధానం మాత్రం చెప్పకుందా కాసేపాగితే అంతా మీకు తెలుస్తుంది అని మాత్రం చెప్తున్నాడు.

శీ నుండి ఓ అరగంట ప్రయాణం తరువాత ఓ చిన్న ఆశ్రమం లాంటి దాని ముందు వ్యాన్ ఆగింది.

అయోమయం గా చూస్తూ అంతా కిందకి దిగారు.లోపలకి వెళ్ళగానే వర్ధనమ్మ వయసు వారు ఇంకాస్త ఎక్కువ ఉన్నవాళ్ళూ కనిపించారు.
మేమేమి తక్కువ చేసామని అమ్మ ఇలా వ్రుద్ధాశ్రమం లో చేరింది అని కూతుళ్ళూ కోడళ్ళూ చెంగు తో కళ్ళొత్తుకుని ఏడుస్తుంటే అల్లుళ్ళూ కొడుకులూ షాక్ తో అలా నిలబడిపోయారు లోపల నుండి బయటకి వస్తున్న వర్ధనమ్మ గారిని చూసి.

అమ్మా ఏమిటి ఇదంతా,మమ్మల్ని సాధిద్దామనా అని పెద్ద కొడుకంటే, అసలు ఆలోచించే చేసావా అని చిన్న కొడుకు కయ్యిన లేచాడు.
అందరి మాటలూ శాంతం గా విన్న వర్ధనమ్మ ధ్రుడ కంఠస్వరం తో "నేను ఎవరినో సాధిద్దామనో మిమ్మల్ని ఏడిపించాలనో ఈ పని చెయ్యలేదు,ఆలోచించావా అన్నారు కదా..ఇన్నాళ్ళకి నా గురించి ఆలోచించాను కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాను.మీరు నన్ను ఎలా చూసారో మీ మనసులకి తెలుసు.నేను ఇక్కడ వ్రుద్ధాశ్రమం లో ఉండటానికి మీకు కాణీ ఖర్చు అవ్వదు.ఇక్కడ వంట మనిషి గా చేరాను.ఒంట్లో సత్తువ ఉన్నన్నాళ్ళూ వీళ్ళు ఏదో ఒక పని చెయ్యనిచ్చి సత్తువ ఉడిగిపోగానే వాళ్ళే ఇంత అన్నం అదీ పెట్టి రాలిపోయేవరకూ పోషిస్తారు.చివరి దశ లో ఉన్న అనేక మందికి నేను సేవ చేస్తున్నాను అంటే నాకే గర్వం గా ఉంది.నేను ఆ స్థితి లోకి వచ్చినప్పుడు ఎవరో నాకూ చెయ్యకపోరు.ఈ ఆశ్రమం ఇలా గత పదిహేనేళ్ళుగా నడుస్తోందిట.మన ఊరి మాస్టారి ద్వారా విషయం తెలుసుకున్నాను.కొడుకులకి నేను బరువు,కూతుళ్ళ కి పరువు సమస్య..ఎలాగా అని ఆలోచిస్తోంటే ఇది మంచి అని తోచి ఇలా చేసాను.మీరు తిరిగి వెళ్ళగానే నా గురించి ఊళ్ళో అందరూ అడుగుతారనే కదూ మీ సమస్య..గంగా నదిలో పడవ ప్రమాదం లో పోయానని చెప్పండి లేదా ఆకస్మిక వరదల్లో కొట్టుకు పోయానని చెప్పండి.ఎప్పుడూ నేను మన ఊరు రాను..ఇంక మీరు బయలు దేరవచ్చు అని లోపలకి వెళ్తున్న ఆవిడ కేసి సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండి పోయారు.

ఇంతలో ఆవిడ వెనక్కి వచ్చి "నేను ఉద్యోగం చెయ్యలేకపోతున్నాను అని రాసిన ఉత్తరం మాస్టారి దగగ్ర ఉంది రా,నా కొడుకుల వ్యాపార ఆదాయం ఇంత అని కూడా రాసానందులో..గవర్నమెంటు రూల్స్ అనుమతిస్తే ఉద్యోగం చేసుకోండి..ఇంక నా చంద్రహారం గాజులు కూదా మాస్టారి దగ్గరే ఉన్నాయి..గిల్టు నగలకి ఎంత వస్తుందో నాకు తెలీదు అని వర్ధనమ్మ అనగానే కూతుళ్ళ మొహం లో రంగులు మారాయి.

మీ నాన్న పోవడానికి రెండేళ్ళముందు ఆయనకి జబ్బు చేసింది. పిల్లల దగ్గరకి వెళ్దామంటే ఆయన ఒప్పుకోలేదు.పిల్లల ని అపార్ధం చేసుకుంటున్నాడని ఎంత తిట్టానో.నా బంగారం అమ్మి వైద్యం చేయించాము.మేము అప్పుడు ఊళ్ళో ఉండటంతో ఇవన్నీ మీకు తెలీదు.
నీకు పిల్లల అసలు స్వరూపాలు తెలుస్తాయి చూడు అంటూ ఆ గిల్టు నగలు నా ఒంటి మీద వేసాడు మీ నాన్న. ఆయన అన్నదే నిజమయ్యింది.ఇంక మీరు వెళ్ళచ్చు నాకోసం ఎవరూ రావక్కర్లేదు అని చెప్పి లోపలకి వెళ్ళిన కాసేపటికి తెరుకున్న వర్ధనమ్మ కొడుకులు అసలు ఆవిడ ని మీరే బలవంతం గా తీసుకొచ్చారు అంటూ ఆశ్రమాధికారితో వాగ్యుద్ధానికి దిగారు.

ఆవిడే స్వయం గా ఇక్కడ చేరుతున్నట్లు ఇచ్చిన డిక్లరేషన్ చూడగానే చేసేదేమీ లేక వెనుతిరిగారు.

వెళ్తున్న పిల్లక వంక అలా చూస్తూ ఉండిపోయింది కిటికీలోంచి వర్ధనమ్మ తెగిన పేగు బంధాన్ని.

మరిన్ని కథలు

Thotakoora naade..
తోటకూరనాడే...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Nishani
నిశాని
- DR Bokka Srinivasa Rao
Vachhindi ashadha masam
వచ్చింది ఆషాఢమాసం
- తాత మోహనకృష్ణ
Kathalo daagina katha
కథలో దాగిన కథ.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Neeve naa mantri
నీవే నామంత్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poola danda
పూలదండ
- ప్రమీల రవి
STREE
స్త్రీ
- chitti venkata subba Rao