అరటిపండు - ఎంజీకె. ఆచార్యులు

aratipandu telugu story

ఆరోజు కోర్టు హాలు కిక్కిరిసి వుంది. కరడుగట్టిన ఏ కసాయి కేసో వాదనకు వచ్చిందనుకుంటున్నారేమో! ఓ విచిత్రమైన కేసు వచ్చింది. ప్రముఖ దర్శకుడు రాహుల్ గోపాల్ రాజు తాజాగా రూపొందించిన 'అరటిపండు ' చిత్రంపై ఒక ప్రేక్షకుడు కేసు వేశాడు. ఎంతో ఆశగా టిక్కెట్ కొనుక్కుని థియేటర్ కి వెళితే ఒక్కసారి కూడా అరటిపండు కనిపించలేదనీ, తనకు న్యాయం చేయాలనీ కోర్టును ఆశ్రయించాడు సదరు ప్రేక్షకుడు.

నిందితుడినీ, ఫిర్యాదుదారునీ కోర్టులో ప్రవేశపెట్టి ఎదురెదురుగా వున్న బోనులలో నిలబెట్టారు. న్యాయమూర్తి రావడంతో అప్పటివరకూ కోలాహలంగా వున్న కోర్టు హాలు నిశ్శబ్దంగా మారింది. ఆనవాయితీ ప్రకారం న్యాయమూర్తి టేబుల్ మీదున్న సుత్తిని తీసుకుని మూడుసార్లు కొట్టి 'ఆర్డర్... ఆర్డర్... ఆర్డర్...' అన్నారు.

"వాద ప్రతివాదనలు మొదలెట్టండి!" అంటూ న్యాయవాదులిద్దరినీ ఆదేశించారు న్యాయమూర్తి.

"మిలార్డ్... కాఫీ తాగి, టిఫిన్ చేసి వచ్చారా?" అన్నాడు లాయర్ నల్లకోటును సర్దుకుంటూ...

"నా క్షేమసమాచారాలడగడానికి నువ్వు నా బామ్మర్దివి కాదు. విషయమేంటో మొదలెట్టు..." కర్కశంగా అన్నారు న్యాయమూర్తి.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిసుక్కున నవ్వడంతో కోర్టు హాలంతా ప్రతిధ్వనించింది. లాయర్ అతడిని ఖోపంగా చూసి జడ్జ్జివైపు తిరిగి తన వాదన మొదలెట్టాడు.

"మిలార్డ్... బోనులో వున్న నా క్లయింటు..."

"ఐ అబ్జక్ట్ యువరానర్..." అంటూ మధ్యలోనే లేచాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్.

"అబ్జక్షన్ ఓవర్ రూల్డ్..." అని న్యాయమూర్తి అన్నారు.

"మిలార్డ్... కోర్టు హాలులో రెండు బోనులున్నాయి. కానీ, లాయర్ గారు కోర్టువారిని తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో 'బోనులో వున్న నా క్లయింటు ' అంటున్నారు. ఏ బోనులో వున్న క్లయింటో స్పష్టంగా చెప్పాలని సవినయంగా కోరుతున్నాను" అన్నాడు ప్రాసిక్యూటర్.
వెంటనే రాహుల్ గోపాల్ రాజు వైపు చూపిస్తూ "యువరానర్... ఈ బోనులో వున్న నా క్లయింటు తన మానాన తను సినిమాలకు దర్శకత్వం వహిస్తూ బతికేస్తూంటే... ఓ సాధారణ ప్రేక్షకుడైన అతడు..."

"ఐ అబ్జక్ట్ యువరానర్..." అంటూ మళ్లీ లేచాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. లాయర్ తో సహా జడ్జి కూడా విసుగ్గా చూశారు.
"సినిమాకి ఫైనల్ జడ్జి అయిన నా క్లయింటుని పట్టుకుని సాధారణ ప్రేక్షకుడు అని సంబోధించడం కులం పేరుతో దూషించినంత నేరం యువరానర్..." ఆవేశంగా అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్.

"అబ్జక్షన్ ఒవర్ రూల్డ్..."

"యువరానర్... ఇలా మాటిమాటికీ మనోభావాలు దెబ్బ తింటూంటే కోర్టు సాగినట్టే... సరే, ప్రేక్షకుడు థియేటర్ కి వెళ్లి సినిమా చూసి ఇంటికి వెళ్లాలే తప్ప ఇలా కోర్టుకి వస్తే ఇదిగో... ఇలాగే వుంటుంది. సినిమా ఎలా తీయాలన్నది దర్శకుడి ఇష్టం. దానికి ప్రేక్షకుడు అభ్యంతరం చెప్తే ఎలా యువరానర్?"

"యువరానర్... వినియోగదారుడికి చెప్పినదాన్నే ఉత్పత్తిదారుడు అందించాలి. అది అతడి ధర్మం. బయట బుక్ స్టాల్ అని బోర్డు పెట్టి లోపల కోళ్లను అమ్ముతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. 'అరటిపండు ' అని టైటిల్ పెట్టిన దర్శకుడు సినిమాలో ఒక్కసారి కూడా అరటిపండుని చూపించక మోసం చేశాడనేది నా క్లయింటు అభియోగం. దీనికి ప్రాసిక్యూటర్ గారు దయచేసి కోర్టువారికి సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాను"

జడ్జి ఒకసారి బుర్ర గోక్కున్నాడు. పైకప్పుకేసి చూస్తూ ఆలోచించాడు.

"యువరానర్... దీనికింతగా ఆలోచించాల్సిన పనిలేదు. ఒక్కసారి మీరు 'అరటిపండు ' ఒరిజినల్ డి.వి.డి. తెప్పించుకుని చూస్తే సినిమాలో అరటిపండుని ఒక్కసారి కూడా చూపించని ఈ దర్శకుడికి ఎంత కఠినమైన శిక్ష విధించాలో మీకే తడుతుంది" ఆవేశంగా అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్.

"నేను ఛస్తే ఒప్పుకోను యువరానర్... నిన్నగాక మొన్న రిలీజై ఇంకా థియేటర్లలో ఆడుతున్న నా సినిమాను మీరు ఒరిజినల్ డి.వి.డి.లో చూడ్డం సెక్షన్ అలీ 369/ఎబిసిడి/అమితాబ్ బచ్చన్ కార్పోరేషన్ లిమిటెడ్ ప్రకారం చట్టరీత్యా నేరం యువరానర్..." అన్నాడు దర్శకుడు రాహుల్ గోపాల్ రాజు.

"నువ్వుండవయ్యా బాబూ... నీ లాయర్ని నేను కదా... నేను వాదిస్తానుండు... అనవసరంగా ఆవేశపడిపోతావ్... అంచేత యువరానర్... నా క్లయింటు బాధను అర్థం చేసుకోగలరని కోర్టువారిని సవినయంగా కోరుతున్నాను. నవమాసాలూ మోసి బిడ్డను కన్న తల్లికి, తన కళ్ల ముందే నర్సు బిడ్డడిని మరొకరికి ఇచ్చేస్తుంటే ఎలా వుంటుంది యువరానర్?" అంటూ ఆవేశంగా ప్రశ్నించాడు లాయర్.

"ఏమో, నాకు తెలీదు. ఎందుకంటే, నేనెప్పుడూ కనలేదు, నర్సు అలా ఎవరికీ ఇవ్వలేదు. అయినా, ఇది నాకెందుకు చెప్తున్నట్టు?" జడ్జి భృకుటి ముడివడింది.

"కొంచెం సెంటిమెంటుని టచ్ చేసి చెప్తే మీరు నా క్లయింటు బాధను అర్థం చేసుకుంటారేమోనన్న ఆశతో చెప్పాను మిలార్డ్... మీరు సినిమా చూస్తానంటే నేను టికెట్ కొని మీరు చూసే ఏర్పాటు నేను చేస్తాను యువరానర్..." అంటూ తన పాకెట్లోని డబ్బుని తీసి లెక్కేసుకున్నాడు లాయర్.

"నీ దయా దాక్షిణ్యాలు నాకేమీ అక్కర్లేదు. సినిమా చూసి నేను తీర్పు చెప్తాను. ఈరోజు కోర్టు వాయిదా వేయడమైనది. నేను సినిమా చూసిన తర్వాత తెలియపరుస్తాను. అప్పుడు అందరూ లేట్ చేయకండా కరెక్టు టైముకి రావాలి" అంటూ జడ్జి తన కుర్చీలో నుండి లేచి బయటకు నడిచాడు.

అందరూ బయటకు వచ్చేసరికి మైకులు, కెమెరాలు పట్టుకుని మీడియా మొత్తం రెడీగా వుంది.

"సార్... అరటిపండు కేసు ఏమైంది? దర్శకుడు రాహుల్ గోపాల్ రాజుకి తీర్పు అనుకూలంగా వచ్చిందా, వ్యతిరేకంగా వచ్చిందా? అసలు ఈ కేసుపట్ల జడ్జిగారు ఎలా స్పందించారు? ఇకమీదట కూడా కోర్టులో ఇలాంటి కేసులను ఎక్స్ పెక్టు చేయవచ్చా?" అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు.

ఈ ప్రశ్నలకు లాయర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతిస్పందిస్తూ "జడ్జిగారు ఇరువైపులా వాదనలను పూర్తిగా, ఓపిగ్గా విన్నారు. సినిమా చూసిన తర్వాత తన తీర్పును వెలువరించనున్నారు" అని చెప్పి స్పీడుగా అక్కడినుండి వెళ్లిపోయారు.

మర్నాడు న్యూస్ పేపర్లు, న్యూస్ ఛానెల్స్ ఇష్టమొచ్చినట్టుగా ప్రతిస్పందించాయి.

న్యాయమూర్తి 'అరటిపండు ' చిత్రాన్ని చూశారు. దాని తర్వాత ఒకరోజు కోర్టు సమావేశమైంది.

నరాలు తెగే ఉత్కంఠతో అందరూ జడ్జి వంకే చూస్తున్నారు. ఆయన తన సీట్లో కూర్చుని భారీ నుంచి అతిభారీ పుస్తకాలన్నింటినీ తిరగేశారు. కోర్టు హాలంతా నిశ్శబ్దంగా వుంది. సుమారు ఇరవై రెండు నిమిషాల నిశ్శబ్దాన్ని తన సుత్తితో బద్దలుగొట్టారు న్యాయమూర్తి. "సైలెన్స్... సైలెన్స్... సైలెన్స్..."

"హాలంతా ఆల్రెడీ సైలెన్సుగానే వుంది మిలార్డ్" అన్నాడు లాయర్.

"నాకు తెలుసు. నేను మాట్టాడబోతున్నానని ఇండికేషన్ ఇస్తున్నానన్నమాట. ఏతావాతా నేను చెప్పొచ్చేదేంటంటే... దర్శకుడు ఈ చిత్రానికి అరటిపండు అనే టైటిల్ పెట్టాలని ఎందుకు నిర్ణయించుకున్నాడనేది అతడి స్వవిషయం. నిజానికి కథాపరంగా చూస్తే అరటిపండుకీ, కథకీ ఎక్కడా పొంతన కనిపించలేదు"

జడ్జి మాటలను మధ్యలోనే ఖండిస్తూ "యువరానర్... దీనికి నేనొప్పుకోను. అరటిపండును అనేకచోట్ల సింబాలిగ్గా చూపించాడు నా క్లయింటు..." అంటూ అడ్డుకున్నాడు లాయర్.

"నువ్విక్కడ అరటిపండు సినిమాకి రివ్యూ రాయడం లేదు... నేను మాట్టాడేది కాస్త విను. అసలు అరటి పండు రంగు ఎలా వుంటుంది, దాని రుచి, ఉపయోగాలు, పండులో వుండే విటమిన్లూ... ఇలా అన్నింటినీ వివరించాల్సిన బాధ్యత దర్శకుడి మీద వుంది. కానీ, వాటన్నింటినీ మరచి అసలు అరటిపండు ఊసే లేకుండా సినిమా తీసినందుకు గానూ, సదరు ప్రేక్షకుడికి దర్శకుడు డజను అరటిపండ్లు కొనివ్వాలని తీర్పు ఇవ్వడమైనది..." అంటూ తీర్పు చెప్పారు న్యాయమూర్తి.

కోర్టు హాలంతా చప్పట్లతో మార్మోగిపోయింది.

అందరూ బయటకు వచ్చారు. యదావిధిగా మీడియా అంతా ఎదురు చూస్తోంది.

"డైరెక్టరుగారూ, లోపల ఏంజరిగింది? జడ్జిగారు ఏం తీర్పు చెప్పారు? ఇకమీదట మీరు తీయబోయే సినిమాలకు ఆ తీర్పుని పాటించబోతున్నారా?" అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు మీడియా సోదరులు.

దర్శకుడు రాహుల్ గోపాల్ రాజు ఈ ప్రశ్నలేవీ పట్టించుకోకుండా "అరటిపండు తర్వాత నేను తీయబోయే చిత్రం పేరు... 'గుమ్మడికాయ ' " అన్నాడు.

"పండు మీద నుండి వెళ్లి కాయ మీద పడుతున్నారా? ఇంతకీ ఈ చిత్రం ప్రత్యేకత ఏంటి సార్?" అన్నాడు ఒక మీడియా సోదరుడు.
"ఈ సినిమాలో అసలు గుమ్మడికాయే కనిపించదు, దాని గురించిన ప్రస్తావన వుండదు..." అని సమాధానం చెప్పేసి హుందాగా, తన స్టైల్లో నడచుకుంటూ వెళ్లిపోయాడు దర్శకుడు రాహుల్ గోపాల్ రాజు.

మీడియా సోదరులతో పాటు అక్కడున్నవారంతా అవాక్కయ్యారు.

మరిన్ని కథలు

Sammohanastram
సమ్మోహనాస్త్రం
- బొబ్బు హేమావతి
Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి