రమణారావూ-రాశిఫలాలూ - ఆదూరి.శ్రీనివాసరావు

ramanaravu-raasiphalalu telugu story

" రా వదినా! రా! చాలాకాలమైంది నిన్నుచూసి " అని ఆహ్వానించింది ధనలక్ష్మి తన వదిన ధనలక్ష్మిని కూర్చీ చూపుతూ ఆప్యాయంగా.

" ఏమే ధనలక్ష్మీ! మీ ఆయన ఆఫీసుకు దారిమార్చి వెళుతున్నాడేమిటి ? మావీధివైపు రావటమే లేదు?" అంది కూర్చుంటూ వరలక్ష్మి.

" ఏంలేదు వదినా! ఆయన ఈమధ్య రోజూ రాశిఫలాలు టీ.వీ.లో విని మరీ ఆఫీసుకువెళుతున్నాడు. వృషభరాశి వారు ఉత్తరం వైపునుంచీ పోవాలనీ , అది మంచిదనీ అటువైపునుండీ ఆఫీసుకు వెళుతున్నాడు." అంది ధనలక్ష్మి.

"అదేమిటే! మరీ చోద్యంగా ఉందీ! అలావెళితే ఆఫీసుకు దూర మవట్లేదుటే ! " అంది ఆశ్చర్యం ఒలకబోస్తూ వరలక్ష్మి.

"ఏమచెప్పను వదినా! ఆయనకీ మధ్య చాదస్తం ఎక్కువై పోయింది . ఈరాశిఫలాల వారు ‘మీకు ఈరోజు ప్రయాణం లాభదా యకం ‘అన్న రోజుమాత్రమే క్యాంపు కెళుతున్నారు.!’ ఆకుపచ్చరంగు ధరిస్తే మంచిది’ అనగానే లేక పోయినా ఆకుపచ్చ షర్టు కొని మరీ వేసుకెళు తున్నారు. ‘ఆంజనేయస్వామికి అప్పాలునైవేద్యం చేస్తే మంచి దంటే ‘ ఆరోజు నాచేత అప్పాలు చేయించి , అప్పాలు ఎక్కువ అన్నం తక్కువ గా తింటున్నారు. ఒకరోజు గణపతిపూజ, మరోక రోజు ఉమాపతి, ఇంకోరోజు రమా పతి, ఆరాశివారికి ఆరోజు ఏది మంచిదని చెప్తారో ఆ పూలు పండ్లతో పూజ చేస్తున్నారు.’ ధన లాభం ‘ అని చెప్పిన నాడు ధనలక్ష్మిని, నన్నుకాదులే వదినా[ అంటూ సిగ్గుల మొగ్గై] వర్షం కురవ టానికి వరలక్ష్మినీ, నిన్నుకాదులే వదినా! ఆదేవతను పూజ చేస్తున్నాడు. పూజా మందిరంలో రోజు కొక ఫోటో మారుస్తున్నాడు . వినాయకునికి ఉండ్రాళ్ళు చేయాలి. సుభ్రహ్మణ్య స్వామికి సున్నుండలు, పరమశివునికి పాయసం, అనంతపద్మనాభునికి అరిసెలు, అన్నపూర్ణా దేవికి ఆవడ లు,! వేపుకు తినున్నాడనుకో!నిజానికి పూజకు ఒకదేవుడు చాలడా వదినా?చెప్పు. కొండంత దేవునికి కొండంత పత్రి పెట్ట గల మా!. దేవుళ్ళంతా ఒక్కటే కదా! " అంటూ తన బాధనంతా వెళ్ళబోసుకుంది , తన వదినతో ధనలక్ష్మి.

" అదేంటే మరీ విడ్డూరంగా ఉంది. ఇట్లా చేస్తూ పోతే ఎంత డబ్బు ఖర్చవుతుందోకదా! " అంటూ సానుభూతి వ్యక్త పరిచింది వరలక్ష్మి.

" మొన్నమొన్న టీ.వీ.లో ఎవరో ఒకామె " ఏమండీ బావున్నారా ! " అంటూ తన ప్రోగ్రాం లో మాటలు మొదలెట్టగానే తననే అనుకుని పొంగిపోయాడు.'ఆహా ! ఏమి ప్రేమ! ఎంత అభిమానం అంటూ’ ఆమె చెప్పిన అడ్రెస్సుకు, ఒకరుద్రాక్ష ఆర్డరిచ్చాడు , అది మెడలో వేసు కుంటే ఉన్నత శిఖరాలను అందుకోవచ్చుట! చేతికి శనిదేవుని కంకణం , మెడ లో మేలిరత్నం తగిలించుకుని తిరుగుతున్నాడు. ఏమి టీ.వీ లో కానీ ఇప్పుడు కాస్సేపు ప్రకటనలు అంటూ , సబ్బుల నుండీ , సాంబారుపొడి వరకూ, చర్మ సౌందర్యానికి చల్లాయి సబ్బులూ, కోమల దేహానికి కొల్లాయి క్రీములూ, పులిపిరి కాయ లకు పుల్లాయి పౌడర్లూ ... చస్తున్నా వినలేక, కనలేక. పూటకో సెంటూ గంటకో డ్రెస్సూ రోజు కో సబ్బూ మాఆయన మారుస్తున్నాడు. ఉన్నడబ్బంతా హూష్ కాకీ అవు తున్నది. ‘అదేమిటండీ!’ అంటే, నీకెందుకూ? ’ లక్ష్మీ లాకెట్ పుచ్చుకో ధనలక్ష్మీని తెచ్చుకో!’నిన్నుకాదులే వదినా! , అంటూ నాకూ ఓలాకెట్ తెప్పించి ఇచ్చారు. ఇదమ్మా మా ఆయన భాగోతం! మీ తమ్ముడితో వేగలేక చస్తున్నానుకో! " అంటూ వాపోయింది పాపం ధనలక్ష్మి. " అదా సంగతి! అందుకనా? ’ రమణా రావు ‘అనే పేరును మార్చి’ రావురమణ ‘ అంటే కలిసి వస్తుందనేనా నేం ప్లేట్ మార్చింది? " అంటూ తన ఆశ్చర్యాన్ని వెలిబుచ్చింది వరలక్ష్మి నేం ప్లేట్ వైపు చూస్తూ..

ఇంతలో వరలక్ష్మి చేతిలో చరవాణి ' ఏమే రాకాసీ ఏమే నీవెక్కడున్నా చాటుకు పోవే చాటుకుపోవే!!' అనే కొత్తరింగ్టోన్ తో మోగసాగింది.ధనలక్ష్మీఆశ్చర్యంగా" అదేంటి వదినా ! ఈ కొత్తపాట ఎక్కడావినలేదే!"అంది బుగ్గలునొక్కుకుంటూనూ.

"అయ్యో! వదినా! ఎందుకు అడుగుతావ్లే! ఇప్పటిదాకా నీ బాధ చెప్పావ్ , నా అగచాట్లు చెప్తే తీరేవికాదు , అనుభవించి తీరా ల్సిందేనమ్మా! అందుకే నీకుచెప్పనే లేదు! మాఆయనకూ ఓ పిచ్చి పట్టుకుంది.నాతో నేరుగా మాట్లాడకూడదని , నాముఖం చూసి అస్సలు మాట్లాడకూడదనీ , నాకు ఆయుష్షీణమనీ, నన్నుపేరుతో పిలవరాదనీ ఏజ్యోతిష్కుడో చెప్పాట్ట, అందుకని ఇంట్లో ఉన్నా పక్క గదిలోకి వెళ్ళి ఇలా చరవాణిలో మాట్లాడుతారు. అన్నం వడ్డించేప్పుడూ, ముఖానికి ముసు గేసుకో మంటాడు , టిఫిన్ టేబుల్ మీద పెట్టి నెనౌ పక్కకెలీతే కానీ వచ్చితినడు. తలవంచుకుని ఫోన్ లోనే వద్దనీ , కావాలనీ చెప్తారు. అందుకే ఏనాడూ లేంది నేను ఈ చరవాణిలో మాట్లాడను చెవులకు లోలాక్కులు తీసేసి చెవిలో వైర్లుపెట్టుకుని , మెడలో తాళిబొట్టుతోపాటుగా ఒక త్రాటికి ఈ ఫోన్ వ్రేలడదీసుకుని ఊరేగుతున్నాను , మా ఆయనకంటే మీఆయనే నయం , రోలొచ్చి మద్దేలకు మొరపెట్టుకున్నట్లుంది వదినా! మాఆయన ఒక్కమారు రింగిస్తే ఆఫీస్ నుంచీ బయల్దేరుతున్నట్లు, రెండోమారు రింగిస్తే పదినిముషాల్లో ఇంటికి వస్తున్నట్లు , చూచనన్నమాట! నేరుగా నాముఖం చూడడు. రాత్రులు లైట్స్ ఆపేశాకే పడగ్గదిలో కెళ్ళాలి నేను. ముందుతాను వెళ్ళి అప్పుడు రింగిస్తాడు.నేను రింగ్ విని సమాధానమిస్తే లైట్లార్పుతాడు. ఆతర్వాతే నేను గదిలో కెల్ళాలన్నమాట! ఎవరైనా వింటే నవ్విపోరూ వదినా!నా యాతన ఎవరికి చెప్పుకోను! ఏ టెల్ వాడో టెక్ వాడో తన కంపెనీ రీచార్జ్ పెంచుకోను ఈమాటఏజ్యోతిష్కుడిచేతో చెప్పించి ఉంటే మాఆయనలాంటి చాదస్తులు నమ్మిఆచరిస్తుంటారల్లేఉంది వదినా! ఇహవస్తాను రెండో రింగ్ వేల్టికి వెళ్ళి తలుపుతీసి చాటుకెళితేనే ఇంట్లో అడుగుపెడతారు ! నాముఖం చూసి నెల్నాళ్ళైంది వదినా!"అంటూ ముక్కుచీదుకుంటూ గుమ్మందాటింది వరలక్ష్మి .

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి