మధుర ఫలము - డా .నీరజ అమరవాది .

madhura phalamu

సంజయ్ , హారిక అన్నా చెల్లెళ్లు . చదువులో , తెలివితేటలలో వారికి వారే సాటి . ఇంట్లో వారు ఆడింది ఆట , పాడింది పాట . బాగా చదవటం వల్ల బడి లో టీచర్లు కూడా వీరి అల్లరిని చూసీ చూడనట్లుగా వదిలేసేవారు . కాని స్నేహితుల దగ్గరికి ఆడుకోవడానికి వెళ్లినా తమ మాట నెగ్గాలనే పంతంతో ఏదో రకంగా గొడవపడి ఇంటికి వచ్చేవాళ్లు .

వీరి సంగతి వాళ్ల అమ్మానాన్నలకు తెలిసినా ఏ విధంగా వివరించి చెప్పాలో అర్థం కాలేదు . సంజయ్ , హారిక ల అమ్మమ్మతాతయ్య వీళ్లని చూడాలని ఊరి నుండి వచ్చారు . ఒక రోజు హారిక ఆడుకోవడానికి స్నేహితుల దగ్గరికి వెళ్లి , కొంతసేపు కాగానే ఏడుస్తూ ఇంటికి వచ్చింది . కారణం ఏమిటని అడిగితే , ‘ తాను స్నేహితులతో క్యారంబోర్డ్ ఆడుకోవడానికి వెళ్లానని , తాను ఎర్ర రంగు కాయిన్ కొడదామనుకుంటే వేరే వాళ్లు ముందు కొట్టేస్తున్నారని , అందుకే ఏడుపు వచ్చి వచ్చేసా ‘ నన్నది . అంతలో సంజయ్ కూడా కోపంగా ఇంటికి వచ్చి ఎవరితోనూ మాట్లాడకుండా ఒక మూల కూర్చున్నాడు . ఏమైందని అడిగితే ‘ తాను క్రికెట్ ఆడడానికి వెళ్లానని , తనకు బ్యాటింగ్ అంటేనే ఇష్టమని , కాని స్నేహితులు ఫీల్డింగ్ చేయమన్నారని , అది ఇష్టంలేక ఇంటికి వచ్చేసా ‘ నన్నాడు .

అమ్మమ్మతాతయ్యలకి పిల్లలు బడిలో పాఠాలు కంఠతాపట్టి తరగతిలో ఫస్టు వస్తున్నారు , కాని సాటివారితో కలసిమెలసి కాసేపు కూడా ఉండలేరని , జీవిత పాఠాలు అసలు చదువు కోలేదని అర్థం చేసుకున్నారు . వాళ్లు చేస్తున్నతప్పును వాళ్లకి తెలిసేటట్లు చేయాలనుకున్నారు .

మర్నాడు శివరాత్రి కావడం వల్ల బడికి సెలవు ఇచ్చారు . అమ్మమ్మతాతయ్యలు గుడికి వెళ్తూ తమతో పిల్లలని కూడా తీసికెళ్లారు . గుడి నుండి వచ్చేటప్పుడు వీధి నిండా రకరకాల పళ్లు అమ్ముతుంటే చూసి హారిక ఫ్రూట్ సలాడ్ చేసుకుందాం పళ్లు కొనమని తాతయ్యకి చెప్పింది . సంజయ్ నాకు ఇష్టమే అన్నాడు . అమ్మమ్మ శివరాత్రి కదా ఈరోజు నా ఆహారం పళ్లే అంది . వారి ఇష్ట ప్రకారం తాతయ్య ‘ ద్రాక్ష , అరటి , ఆపిల్ , దానిమ్మ , సపోట , పుచ్చకాయ , బత్తాయి ‘ మొదలైన పళ్ల ని కొన్నారు .

సాయంత్రం పూజ అయిన తర్వాత పళ్లు కోయడానికి సంజయ్ , హారికలను వాళ్ల అమ్మమ్మ పిలిచింది . ఉత్సాహంగా ఇద్దరు తరగడానికి పీటలు , చాకులు తీసుకునివచ్చారు . మొదట ద్రాక్ష పళ్లని తరిగారు . తరువాత కొంచెం కష్టపడి ఆపిల్ పళ్లని చిన్న ముక్కలుగా తరిగారు . దానిమ్మ పైన తొక్క తీయటం రాక అమ్మమ్మని తీయమన్నారు . పుచ్చకాయను తాతయ్య సాయంతో తరిగారు . సపోట పైన తొక్క ఉన్నా హారిక తేలికగా తీయగలిగింది . అరటి పళ్లని , బత్తాయిలని సంజయ్ తేలికగా పొట్టుతీసి చిన్న ముక్కలుగా తరిగాడు .

మొత్తానికి సంజయ్ ,హారిక , వాళ్ల అమ్మమ్మతాతయ్యలు కలిసి పళ్లని ముక్కలుగా తరిగారు . సంజయ్ వాళ్ల అమ్మ పళ్ల ముక్కలకి పాలు , పంచదార ఇంకా కావలసినవన్నీ కలిపి ఫ్రూట్ సలాడ్ ని తయారుచేసింది . పిల్లలు , పెద్దలు అంతా కలిసి ఫ్రూట్ సలాడ్ తింటున్నారు . అప్పుడు హారిక అంది ‘మనం పళ్ల తొక్కలు కొన్నిటిని తేలికగా తీసాం . కొన్నిటిని కష్టపడి తీసాం . కొన్నిటికి తొక్కలే లేవు . కాని అన్ని పళ్లని కలిపి తింటుంటే ఎంతో రుచిగా ఉన్నా ‘ యంది .

సంజయ్ కూడా ‘ విడివిడిగా ఒక్కొక్క పండు తిన్నప్పటి కంటే ఇలా కలిపి తింటే చాలా బాగుంది ‘ అన్నాడు . పక్కనే ఉన్న అమ్మమ్మ ‘ పిల్లలైనా , పళ్లు అయినా కలిసి ఉంటే చూడడానికి బాగుంటుంది ‘ అంది . అక్కడే ఉన్న తాతయ్య ‘ పిల్లలూ మీరు మీ స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్లి , ఏదో ఒక కారణంతో తగవుపడుతున్నారు . మీరు తొక్క తీసిన పళ్లని చూడండి . పుచ్చకాయ తొక్కని మీరు తీయలేకపోయారు . కాని తొక్క తీస్తే లోపల ఎంత బాగుందో తిన్న మీకు తెలుసుకదా . అలాగే దానిమ్మ , అరటి తొక్కలని తీసి తయారుచేసిన ఫ్రూట్ సలాడ్ రుచి మాటల్లో చెప్పలేము కదా . అలాగే మీరిద్దరు మీలోని తప్పులని తెలుసుకొని , మీ స్నేహితులలోని చిన్న చిన్న లోపాలను మరిచి కలిసిమెలిసి ఉంటే స్నేహం కూడా ఫ్రూట్ సలాడ్ లాగా మధురంగా ఉంటుందని ‘ చెప్పారు .

సంజయ్ , హారికలు తాము స్నేహితులతో అనవసరమైన కారణాలతో గొడవపడుతున్నామని అర్థం చేసుకున్నారు . అమ్మమ్మతాతయ్యలతో మేము ఇప్పుడు తొక్కతీసేసిన పళ్లలాంటి వారము . మా స్నేహితులతో ఫ్రూట్ సలాడ్ లాగ కలిసిపోతాము . ‘ తొక్క’ లాంటి గొడవలు పడమని చెప్పారు .

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి