ఆమె కధ - రవి కిరణ్ మువ్వల

Aame Kadha

హా య్, నా పేరు మానస్. నన్ను ఎవరన్నా ఆమె గురించి నిలదీసినప్పుడు ఏమని చెప్పాలి? నేను చెప్పే కారణం ఎంత మంది అర్ధం చేసుకుంటారో కానీ, నా ఆప్తులు అనుకునేవారు మాత్రం నా అంతరార్ధాన్ని అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అందుకే వారితో ఆమె గురించి చెప్పాలనుకుంటున్నాను.

************

ఆదివారమంటే అందరికీ ఇష్టమైనది. ఆ రోజు ఎప్పుడొస్తుందా? అని సోమవారం నుండే ఎదురుచూస్తారు. కానీ జాబ్ కారణంగా హైదరాబాద్ లో ఒంటరిగా ఉంటున్న నాకు మాత్రం ఆ రోజంటే చాలా భయంగా వుండేది. ఎందుకంటే ఆ రోజు ఒంటరితనం నన్ను ఎంతగా హేళన చేస్తుందో తెలుసు కాబట్టి.

ఆ ఒంటరితనాన్ని ఓడించడానికి నేను వేసిన పధకం ఆ రోజు లైబ్రరీకి వెళ్లి బుక్స్ చదువుకోవటం. అలా బుక్స్ చదువుకోవటం అలవాటు అయ్యాక, ఆదివారమంటే భయం పోయింది.

అలా ఓ ఆదివారం లైబ్రరీ లో ఉన్నప్పుడే పరిచయం అయ్యిందామె. ఎంత అందంగా అనిపించింది ! కలిసిన మొదటిసారే....సముద్రపు నీటి ఆకుపచ్చని రంగు చుడీదార్. టైట్ గా వేసుకున్న పోనీటైల్. ఏ మాత్రం ప్రత్యేకంగా అలంకరణ చెయ్యకపోయినా ఏదో తెలీని హుందాతనం తనలో వుంది.

ఎందుకో, పరిచయం అయిన ఆ క్షణం నుండే ఆమె అంటే ప్రత్యేకమయిన ఆకర్షణ. ఆమె గురించి తెలుసుకోవాలనే తపన ఆదివారం మీద ఆసక్తి వచ్చింది.

ఆమె పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లోనే అట. నేను హైదరాబాద్ వచ్చి సంవత్సరం అవుతుంది. కానీ ఈ సంవత్సర కాలంలో ఎందుకు కలుసుకోలేక పోయాను?

ఆమె, నేను దాదాపు ఒకే వయసు వాళ్ళం. కాలేజ్ లోనే పరిచయం అయ్యి వుంటే ఎంత బావుండేది ? కానీ దేవుడెందుకు మేము కలవడం ఇంత ఆలస్యం చేసాడు?

విచిత్రం ఏమిటంటే తనుకూడా లైబ్రరీకి రెగ్యులర్ గా వస్తుందట. అయినా ఆమెను కలవటానికి ఇంత టైం పట్టింది.

'నేనైతే ప్రతీ ఆదివారం లైబ్రరీకి వస్తానని మీరు కూడా తప్పక రావాలని' ఆమెను అడిగాను. "ష్యూర్ ... మిస్ కాకుండా చూసుకోవాల్సింది మీరే" అందామె. అలా మా మొదటి పరిచయం పూర్తయింది.

అప్పటినుండి ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడడంలో అసలు రోజులెలా గడుస్తున్నాయో తెలియకుండా అయిపోయింది. ఇంతకుముందు వరకు దేని గురించైనా అన్వేషణ వుంటే మిగతా విషయాలపై ఆసక్తి పోతుంది అనుకునేవాణ్ణి. కానీ విచిత్రంగా నా జాబ్ పెర్ఫార్మన్స్ ఇంకా పెరిగింది. ఇప్పుడు నేను జాబ్ లో బాగా వుంటే ఆమెను కలిసినప్పుడు ఇదొక విశేషంగా చెప్పచ్చు. మనసంతా ఆమె మీద పెట్టొచ్చు.

ఎదురుచూస్తుండగానే ఆదివారం రానే వచ్చింది. నేను లైబ్రరీకి వెళ్ళేటప్పటికే ఆమె ఎదురుచూస్తూ కూర్చుంది. ఆమెను చూడగానే, నాకెందుకో ఆమె అంతవరకూ ఎవరితోనో మాట్లాడింది అనిపించింది.

"నేనింతవరకూ ఎవరితోనో మాట్లాడానని అనుకుంటున్నావ్ కదూ?" ఆమె అలా అన్నందుకు నాకెందుకో అబద్దం చెప్పాలనిపించలేదు. 'అవును' అనే చెప్పాను.

'థాంక్స్ !! నిజాయితీగా ఒప్పుకున్నందుకు. నీతో అతని గురించి పూర్తిగా చెప్పాలనుకుంటున్నాను.' అని నేనొచ్చేవరకు మాట్లాడుతుందనుకున్న అతని గురించి చెప్పటం మొదలుపెట్టింది.

అతని పేరు రాజీవ్. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు ఇక్కడే లైబ్రరీలో కలిసాడు. మా ఇద్దర్నీ కలిపింది - లియో టాల్ స్టాయ్ రాసిన 'వార్ అండ్ పీస్' అనే పుస్తకం.

"పుస్తకమా ?"

"అవును .. ఆ పుస్తకం కోసం అడిగితే ఒకతను తీసుకుని వెళ్ళాడని చెప్తుండగానే రిటర్న్ చెయ్యడానికి తిరిగొచ్చాడు. ఆ పుస్తకం చూడగానే అతని చేతుల్లోంచి నేరుగా తీసుకున్నాను. అతను ఓ క్షణం ఆశ్చర్యంగా చూసి గట్టిగా నవ్వాడు. అదే మా మొదటి పరిచయం. అప్పుడతను ఎం బి ఎ మొదటి సంవత్సరం."

ఇప్పుడతను నాకు సీనియర్. అంటే మా పరిచయం అయ్యి సంవత్సరం అయ్యింది.

సంవత్సరం అయ్యిందా? ఇదే లైబ్రరీ లోనా? ఇప్పుడతను సీనియరా? అంటే అతనికోసమే ఆతను చదివిన కాలేజ్ లో జాయిన్ అయ్యవా? అని అడిగాను.

అరె. భలే కనిపెట్టేసావే ! నిజానికి బెంగళూరులో ఎం . బి. ఎ చేయ్యలనుకునేదాన్ని. కానీ రాజీవ్ వల్ల ఇక్కడే హైదరాబాద్ లో చేస్తున్నా!

ఏమిటీ ..? రాజీవ్ వల్ల ఇక్కడ చేస్తున్నావా? అంటే మీ ఇద్దరూ ??.....?? మీరు అంటూ సందేహంగా అడిగాను.

అవును .. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము. అతను ఆల్రెడీ కేంపస్ లో సెలెక్ట్ అయ్యాడు. బెంగళూరు లో జాబ్!

అంటే హైదరాబాద్లో కాకుండా బెంగళూరు లోనే ఎమ్. బి. ఎ చేసుంటే బాగుండు అని ఇప్పుడు అనుకుంటున్నావ్ కదూ?

అవును. కానీ ఏం చేస్తాం ? కొన్ని సార్లు సరైన ఆలోచన వుండదు. నాక్కూడా ఎం . బి. ఎ అయ్యాక, మా మ్యారేజ్. ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. రాజీవ్ జాబ్ కి వెళ్లేముందు మా ఎంగేజ్మెంట్.

ఆమె ఆ విషయం చెప్పినప్పటి నుండి ఆమె గురించి ఊహల్లో స్వేచ్చా విహంగం కోల్పోయింది.

అయినా ఆమె గురించి ఏదో తెలియని ఆసక్తి. ఆమె కూడా నన్నెప్పుడూ నిర్ల్యక్షం చెయ్యలేదు.

కొన్ని రోజుల తరవాత రాజీవ్ బెంగళూరు వెళ్ళిపోయాడు. మిగిలిన సంవత్సరం పాటు ప్రతీ ఆదివారం కలుస్తూనే వున్నాం. ఎప్పుడూ రాజీవ్ గురించే చెప్తుండేది. నా మ్యారేజ్ గురించి అడుగుతుండేది. త్వరలోనే అని చెప్పేవాడిని.

అంతలోనే సంవత్సరం గడిచిపోయింది. ఆమెకు వివాహం కూడా అయ్యింది.

నెల రోజుల తరవాత నాకు కూడా మ్యారేజ్ అయ్యింది.

మా మధ్య కమ్యునికేషన్ కూడా తగ్గిపోయింది. అయినా ఎందుకో అంత బాధగా అనిపించేది కాదు. ఎందుకంటే ఆమె తనకిష్టమైన రాజీవ్ తో వుంది. రాజీవ్ ఆమెను ఏంతో ప్రేమగా చూసుకుంటాడన్న నమ్మకం ఓ కారణమయితే, మరోవైపు నేను కోరుకున్న లక్షణాలు, ఆశించినంత ప్రేమించే భార్య దొరకటం మరో కారణం.

మేరేజ్ అయిన తరవాత కూడా ఇంతకుముందు లా మాట్లాడటం కానీ, మాట్లాడాలని ప్రయత్నిచటం గానీ చెయ్యటం మంచిది కాదని అభిప్రాయపడ్డాను.

నా జీవితంలోకి వచ్చిన భార్య, కొత్త జీవితం, ఆమెను నేను, నేను ఆమెను అర్ధం చేసుకోవటానికి, ఇద్దరి మధ్య ఒక అవగాహన రావటానికి, ఒకరినొకరు ప్రేమించుకోవటానికి ఎంతో సమయం పట్టలేదు.

జీవితం, గత కాలపు గాయాలని, వర్తమానంలో వుండే అనుమానాల్ని, భయాల్ని అధిగమించి జీవితం ప్రశాంతం గా, ఆనందంగా నడుస్తుండగా, ఓ రోజు ఆమె నుండి ఫోన్ కాల్ వచ్చింది.

ఆ ఫోన్ కాల్ తో నేను ఊహించిన ప్రపంచమంతా మారిపోయినట్టయింది. ఆమె రాజీవ్ కి దూరంగా వున్న ఆ సంవత్సర కాలంలో రాజీవ్ కి మరో అమ్మాయితో పరిచయం అయ్యిందంట ! ఆ పరిచయం ఎంతవరకు వెళ్లిందంటే ఆ అమ్మాయినే పెళ్ళిచేసుకునేంత. కానీ చివరి క్షణంలో తనకా ఉద్దేశ్యం లేదని చెప్పడంతో రాజీవ్ ముందు నిర్ణయించినట్టు గానే ఆమెనే పెళ్లి చేసుకున్నాడు గానీ ఆమె ఊహించినట్టు ఆమె జీవితం లేదట !

ప్రేమ వివాహం అంటే ఎప్పుడూ ప్రేమ వుంటుంది అనుకోవటం పొరపాటు. ఒక వివాహం విజయవంతం కావాలంటే పెళ్ళికి ముందు ప్రేమ, స్నేహం వుందా అన్నది ఎంతవరకు సహకరిస్తుందో తెలీదు కానీ, పెళ్లి తరవాత ప్రేమ లేకపోతే జీవితం సంతోషంగా, ప్రశాంతం గా ఉండదని గతంలోని ప్రేమ ఎందుకూ పనికిరాదనీ ఆమెకు స్పష్టం గా తెలుస్తుంది.

గతంలో నైనా ఆమె రాజీవ్ కి ప్రేమికురాలు అనే నమ్మకం తో, ప్రస్తుతం ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజీవ్ లో ఎలాంటి మార్పు లేదని ఫోన్లో వాపోయింది.

రాజీవ్ కేవలం పరువు కోసం, సమాజంలో గౌరవం కోసం మాత్రమే తనని భార్యగా చేసుకున్నాడు కానీ పెళ్లి నాటికే అతనిలో తనపై ప్రేమ చచ్చిపోయిందని ఆమె తెలుసుకోవటానికి ఎంతో టైం పట్టలేదు.

ఆమె ఫోన్ కాల్ తరవాత చాలా బాధ అనిపించింది. నేనింతకాలం ఆమె సంతోషంగా వుందని ఊహించిందంతా కేవలం భ్రమ మాత్రమే అని తెలిసి జీర్ణిచుకోవడం ఏంతో కష్టంగా వున్ది.

ఆమె గురించి ఆలోచిస్తూనే నిద్ర పోవటానికి ప్రయత్నించాను. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. పక్కనే వున్న నా భార్య వైపు చూసాను. నేను ఏదో భాధతో నిద్ర పోవట్లేదని అనుకుందో ఏమో .... ఆమె కూడా నిద్ర పోలేదు.

అసలు భార్యని పక్కన ఉంచుకుని మరో స్త్రీ గురించి ఆలోచించటం కరక్టేనా? కానీ నేను తప్పుగా ఆలోచించట్లేదు కదా? కేవలం మానవత్వంతోనే కదా నేనాలోచించేది. ఒకప్పటి నా స్నేహితురాలిగానే కదా ... నేను ఆలోచించేది ... ? ఒకవేళ మగాడయితే, స్నేహితుడైతే, అప్పుడు అతని గురించి ఆలోచించటం తప్పు కాదేమో? కానీ స్నేహితుడైతే, స్నేహితురాలి గురించి ఆలోచించినట్టు ఇంతలా ఆలోచించే వాడినేనా?

ఇలా ఎన్నో ప్రశ్నలు ... ? కానీ ఆమె సమస్యలు తీరిపోవాలి. రాజీవ్ తనని ప్రేమగా చూసుకోవాలి. అని దేవుణ్ణి వేడుకుంటూ ఎప్పటికో నిద్ర పోయాను.

తరవాతి రోజు రాత్రి మళ్ళీ ఆమె నుండి ఫోన్ వచ్చింది. తనక్కడ పనిమనిషి లాగా ఉండలేనని, నాతో , నా దగ్గర వుండలనిపిస్తోందని ఫోనేలోనే ఏడ్చేసింది.

నేను సమాధానం ఇవ్వకుండానే తానే మాట్లాడింది.

నాకు తెలుసు... నేనంటే నీకు ఇష్టమని. కేవలం నేనే నిన్ను మిస్ చేసుకున్నాను. నువ్వు పెళ్లి చేసుకున్నా నా గురించే ఆలోచిస్తున్నవని నాకు తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం మనం విడిగా బ్రతకాల్సిన అవసరం లేదు. అలాగే నువ్వు నీ తల్లి తండ్రులని కానీ, భార్య ని కానీ, ఈ సమాజాన్ని కానీ పట్టించుకోవనీ నాకు తెలుసు. అందుకే నీమీద నమ్మకం తో రేపే నేను వచ్చేస్తున్నాను అని ఫోన్ పెట్టేసింది.

తనలా మాట్లాడుతుందని అస్సలు ఊహించలేదు. ఛ ! ఎందుకిలా మాట్లాడింది ? నేను ఎవ్వర్నీ పట్టించుకోనా? ఎందుకు పట్టించుకోనూ ? పట్టించుకోకపోవటానికి వారిలో కానీ, వారి ఆలోచనల్లో కానీ నిజం లేకపోతే పట్టించుకోకపోవచ్చు. నా మీద నిజం కాని అభాండాలు, అనుమానాలు వున్నప్పుడు పట్టించుకోవాల్సిన పనిలేదు. కానీ ఎవ్వర్నీ పట్టించుకోకపోవటానికి ఎలాంటి కారణాలు లేవు. నిజానికి బలమైన కారణాలు వున్నా ఆలోచిస్తాను.

అసలామె నాతో 'ఇలా మాట్లాడింది అనేదే ' అబద్దం అయితే బాగుండు.

ఏమిటీ నా భార్యని వదిలేసి తనతో వెళ్లిపోవాలా? అసలు నేను ఎలా వున్నానని ఓ ప్రశ్న అయినా అడిగిందా? అంటే నన్నెంత తక్కువగా అంచనా వేసింది.

అందుకే వెంటనే ఫోన్ చేసి ఆమెతో ఈ విషయాలన్నీ చెప్పాను. ఒకరకంగా తిట్టాను. నా పరిస్థితి బాగా వున్నా, నా కోసం బ్రతికేవాళ్లున్నా, నీ కోసం వచ్చేయాలా? అని నిలదీశాను. తన మీదున్న అభిమానం కాదు కదా, ఇప్పుడు జాలి పడి కూడా తప్పు చేసానని గట్టిగా అరిచాను. 'నా భార్య నన్నెంత ప్రేమిస్తోందో తెలుసా? ఆమెకు ద్రోహం చేసే ప్రసక్తే లేదు.' అని అరుస్తుండగా నా భార్య నిద్రలేపింది.

అంటే ఇదంతా కలా ? అంటే అర్ధరాత్రి ఆమె ఫోన్ చెయ్యలేదా? అవును, ఇదంతా కేవలం నా భ్రమ. ఆమె అలాంటి స్వార్ధపరురాలు కాదు. అంటే ఆమె మీదున్న అభిమానం, గౌరవం పోగొట్టుకోవాల్సిన సంఘటనలేవీ జరగలేదన్నమాట.

' థాంక్ గాడ్ ' అని బయటకే అనేసాను.

పక్కనే వున్న నా భార్య నాకు టీ అందిస్తూ "మరి థాంక్ డార్లింగ్ ఉండదా ....?" అంది. "గాడ్ కి థాంక్స్ చెప్పిందే నీలాంటి భార్యని ఇచ్చినందుకు" అన్నాను.

"అది సరే కానీ ఈరోజు ఆదివారం. మీరు లైబ్రరీకి వెళ్ళాలి కదా ? లేచి తయారవ్వండి. పెళ్లి తరవాత ఆమె కధ ఏమయ్యిందో, ఎలా ఉందో? ఈ రోజు నాకు చెప్తా అన్నారుకదా ! " అని నా ఆదివారం కార్యక్రమం గుర్తుచేసింది.

ఒకవేళ నేను కలకన్నది, నిజంగా జరిగితేనో ??!! నో ! అల జరిగితే ఆమె మీదున్న అభిప్రాయం మారిపోతుంది.

అలా జరక్కూడదంటే - అది నా చేతిలోనే వుంది. అందుకే నా భార్య తో చెప్పాను. - "ఆమె కధ" చదవటం మానేస్తున్నానని.

మరిన్ని కథలు

Markatapuram-Story picture
మర్కటపురం
- యు.విజయశేఖర రెడ్డి
Daridrudu
దరిద్రుడు
- mahesh amaraneni
Giligadi vachche puligadu chachche
గిలిగాడు వచ్చె-పులిగాడు చచ్చె.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Kotta jeevitam
కొత్త జీవితం
- చచెన్నూరి సుదర్శన్
Yachakulu kaanidi evaru
యాచకులు కానిది ఎవరు?
- యాచకులు కానిది ఎవరు?.
Vimukti eppudo
విముక్తి ఎప్పుడో!
- రాము కోలా.దెందుకూరు.
Manninchumaa
మన్నించుమా!
- రాము కోలా.దెందుకూరు.