సుఖం దుఃఖం - కె. విజయప్రసాద్

sukham - dukham telugu story

"సుఖస్వరూపుడు, ఆనందస్వభావుడు అయిన జీవికి దుఃఖం ఎక్కడ నుంచి వస్తున్నది?" పురాణం చెబుతున్న శాస్త్రులు గారు ప్రశ్న.

"స్వామీ! మానవుడు సుఖస్వరూపుడు అని ఎలా చెప్పగలరు? ఆనంద స్వభావుడు అని ఎలా చెప్పగలరు? చిదానందంకు సందేహం కలిగింది. అతను సందేహ నివృత్తికోసం లేచి స్వామిని అడిగాడు.

శాస్త్రులు గారు చిన్నగా నవ్వారు. అందరి వంక కలయ చూశారు.

"నిద్రలో నీ స్వభావం ఏమిటి? గాడనిద్ర అయిపోయింతర్వాత నీ అనుభవం ఏమిటి? ఎవరైనా సరే హాయిగా నిద్ర పోయామంటారు. రాజుగాని, పేదగాని, ఎవరికైనా సరే గాడనిద్రలో కలిగే అనుభవం ఒకటే! ఆనందం! నిద్రలో నువ్వెవరు అంటే చెప్పగలవా? నువ్వురాజువా, సేవకుడివా, భర్తవా - భార్యవా అన్న బేధభావం కనిపిస్తుందా గాడనిద్రలో? కనపడదు. అక్కడ అనుభవించేదంతా ఆనందమే! ఆలోచించండి!" ఆగారు శాస్త్రులుగారు.

చాలామంది అర్ధం చేసుకుని తలలు వూపారు.

"ఆనందం స్వభావం మనది అని ఎలా చెబుతారు?" చిదానందం!

"ఎవరైనా సరే దుఃఖాలు కావాలని కోరుకుంటున్నారా? పుట్టిన శిశువు దగ్గరనుండి మరణించే వృద్ధుడి దాకా సుఖం పొందాలనే తాపత్రయం చెందుతూ ఉంటారు. అందరూ అర్రులు చాచేది సుఖం కోసమే! ఆ సుఖం ఎక్కడున్నది అన్నది ప్రశ్న - ప్రతి మనిషికి సుఖంలో తేడా వస్తూ వుంటుంది. కాని అతని కోరిక సుఖం కావాలనడంలో మటుకు సందేహం ఉండదు - అందుకని అతని స్వభావం సుఖం!" వివరించారు శాస్త్రులుగారు.

"మరి ఎందుకు మనం ఏడుస్తున్నాం! ప్రతి చిన్నదానికి దుఃఖం పొందుతున్నాం?" చిదానందం బుర్ర గోక్కుంటూ అడిగాడు.

"మీ అనుమానమే నా సందేహం కూడా! దార్నపోయే మారమ్మను పిలిచి మరీ తలమీద కెత్తుకుంటున్నాం! దుఃఖం బజారులో పోతూ ఉంటే వెంటబడి మరీ మన భుజాల మీదటి ఎక్కించుకుంటున్నాం! ఒక్కటి గుర్తించుకోండి - జీవితంలో అంతగా దుఃఖించవలసిన విషయాలు ఏవీ లేవు - మనం ఏం తీసుకువచ్చాం - మనవెంట ఏం తీసుకుపోతాం అని కనుక ఆలోచిస్తే ఎవరికీ దుఃఖం రాదు."

పురాణ ప్రవచనం అయ్యే సరికి రాత్రి పది దాటింది. చిదానందం ఆనందంగా ఇల్లు చేరుకున్నాడు. శాస్త్రులు గారు ఇచ్చిన ఉపన్యాసం అతని లోని నిరుత్సాహాన్ని పోగొట్టింది. ఇంక ఎప్పుడూ ఆనందంగా జీవించాలనుకున్నాడు. మాయకు లోబడకూడదనుకున్నాడు.

"ఏమండీ చిదానందం గారు! మీ పాటికి మీరు ఊళ్ళు పట్టుకు ఊరేగండి - నేను ఏ గంగలో నన్నా దూకి చావాల్సి వస్తుంది." కస్సుమని లేచింది అతని భార్య శారద.

"ఇప్పుడు నీకెంత కష్టమేమొచ్చిందే!" ఆశ్చర్యంగా అడిగాడు చిదానందం.

"అస్సలు ఇల్లు గురించి మీకేమన్నా పట్టిందా? మీరు ఒక భర్తలాగా - ఒక బాధ్యత గల తండ్రిలా ప్రవర్తిస్తున్నారా?" నిలదీసింది శారద.

చిదానందం బుర్ర గోక్కున్నాడు. 'బాధ్యత' అంటే అర్ధం కాలేదు.

"సరే! ఉపోద్ఘాతం వద్దులే - విషయంలోకి రా!" విసుగ్గా అన్నాడు చిదానందం.

"లోపలికి రండి - చెబుతా!" శారద అతన్ని వంటింట్లోకి తీసుకుపోయింది తలుపులు మూసేసింది.

"శారదా! ఇప్పుడేంటి తలుపులు మూస్తున్నావు! అక్కడ కూతురు, కొడుకు చదువుకుంటున్నారు?" చిదానందం ఆశ్చర్యంగా అడిగాడు.

"అందుకే - వాళ్ళకు మన మాటలు వినిపించ కూడదని!" చెప్పింది.

"అంత రహస్యాలు ఏమున్నాయి మన మధ్య?"

"మీ అమ్మాయి ప్రవల్లిక ప్రేమలో పడింది? తెలుసా?"

"ఆ! ప్రేమా! దాని మొహానికి ప్రేమకావాల్సి వచ్చిందా? ఇంకా చదువుకూడా పూర్తి కాలేదు - బిటెక్కు యింకో సంవత్సరం ఉంది కదా!?" చిదానందం విస్తుపోయాడు.

ప్రవల్లిక అతని కూతురు - చాలా అందంగా ఉంటుంది. సన్నగా, పొడుగ్గా - ఆకర్షణీయంగా - చక్కటి కంటస్వరంతో అందరిని ఇట్టే ఆకట్టుకుంటుంది.

"అంటే చదువు పూర్తయిన తర్వాత ప్రేమలో పడచ్చనా మీ ఉద్దేశ్యం? మనది సంప్రదాయ కుటుంబం - ఇట్లా ప్రేమలు - గీమలు అంటూ ఉంటే దాన్ని ఎవరు పెళ్ళిచేసుకుంటారండి? ఆడపిల్ల మీద ఒక్కసారి చెడ్డపేరు వచ్చిందంటే... మనలో ఎవరూ పెళ్ళి చేసుకోవడానికి ముందుకు రారు." గుర్తు చేసింది శారద.

"కరెక్టేనే! మన వాళ్ళు అంతా చాంధస్తపు వెధవలు! అన్నీ బావుంటేనే సంబంధాలు కుదరడం కష్టంగా ఉంది... మళ్ళీ క్యారెక్టర్ మీద మచ్చపడిందంటే ఇంకా ఎవరూ చూడ్డానికి కూడా రారు." చిదానందం దిగులు పడ్డాడు.

"ఇంతకీ అది ఎవరిని ప్రేమిస్తున్నాదో తెల్సా? మనకులం వాడ్ని కాదు - ఎవరో రెడ్డినిట! అవ్వ! మనం బ్రాహ్మలం - పోయిపోయి నాన్ వెజ్ రెడ్డిని ప్రేమించడమేంటి? మన కులంలో మన శాఖవాడ్ని కాకుండా - ఇతర శాఖలవాడ్ని చేసుకోవాలంటేనే బ్రహ్మ ప్రళయం అవుతున్నది... అటువంటిది ఏకంగా కులం - గోత్రం లేని వాడ్ని ప్రేమించేస్తున్నది..." శారద చెబుతున్నది...

చిదానందం మెదడు మొద్దు బారుతున్నది... కోపం నసాళానికి అంటుతున్నది. ఆనంద స్వరూపుడు కాస్తా విషాద స్వరూపుడు - క్రోధ స్వరూపుడుగా మారిపోయాడు.

"ఏదీ! దాన్ని చంపేస్తాను" చిదానందం ఆవేశంగా చిందులేశాడు...

"అయ్యో! మీకేది చెప్పినా ఒకటే ఆవేశం! కాస్త ఆలోచించండి - అని ఆవేశంలో ఏంచేసినా మనకే చెడ్డపేరు - కాస్త మంచిగా చెప్పాలి! మామాట వినకుండా ఇంట్లోంచి పారిపోయి వాడ్ని చేసుకున్నా మనకి మాయని మచ్చతెస్తుంది. ఆత్మహత్య చేసుకున్నా మనకే తలవంపులు - కొంచెం టాక్టుఫుల్ గా మాట్లాడాలి..." శారద మళ్ళీ హితబోధ చేయసాగింది.

చిదానందంకు ఆ ఆలోచనతో భోజనం సయించలేదు - నిద్ర కూడా సరిగా పట్టలేదు.

మరునాడు ఆదివారం... ప్రవల్లిక కాలేజీకి వెళ్లనక్కర్లేదు...

"అమ్మా! నేను క్లాసుకు వెళ్ళొస్తాను..." అని బయలుదేరింది స్కూటరు మీద ప్రవల్లిక.

"ప్రవల్లికా - కాస్త ఆగు - నీతో మాట్లాడాలి!" చిదానందం చెప్పాడు.

"ఏంటి నాన్నా!" ఆశ్చర్యంగా అడిగింది.

"ఓ పది నిమిషాలు టైమిస్తే మాట్లాడతాను - మేడ మీదికి పోదాం రా!" చిదానందం మేడమీదికి వచ్చాడు. మేడమీద రెండు గదులున్నాయి. అవి ఎక్కువగా వాడరు. గెస్టులు వచ్చినప్పుడు వాడతారు.

ప్రవల్లిక ఆశ్చర్యపడుతూ పైకి వచ్చింది.

చిదానందం ఓ కుర్చీలో కూర్చున్నాడు - ప్రవల్లిక అతని ఎదురుగా కూర్చుంది. "చూడు తల్లీ - ఈ మధ్య నీ ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తున్నది!"

"నా ప్రవర్తనలోనా!?" ఆశ్చర్యంగా అడిగింది.

"ఆ! ఏదో పరధ్యానంలో ఉంటున్నావు - సరిగా నిద్రపోవడం లేదు - పుస్తకం ముందేసుకున్నా ఎక్కడో ఆలోచిస్తున్నావు!" చిదానందం చెప్పాడు.

"ఏం లేదు నాన్నా! బాగానే ఉన్నాను -" ప్రవల్లిక చెప్పింది.

"కొంపదీసి ప్రేమలోకాని పడ్డావా!"

"ఛీ! ఛీ! నన్నెందుకు అలా అనుకుంటున్నారు?" సిగ్గుగా అడిగింది.

"అది నీ తప్పు కాదమ్మా! నీ వయసు తప్పు! వయసు వేడి అలా ఉంటుంది ఈ వయసులో ఏమొగాడు కన్పించినా మన్మధుడిలా కనిపిస్తాడు. కాస్త ఒడ్డు - పొడుగు ఉండి - నాలుగు మాటలు స్టైల్ గా మాట్లాడంగానే ఆడోళ్ళు మనసు పారేసుకుంటారు - కాని ఈ ప్రేమలు, దోమలు, నమ్మద్దు. మగాడు తుమ్మెద లాంటివాడు. మధువు కోసం పువ్వు మీద వాలతాడు - మధువు ఆఘ్రాణించి తుమ్మెద వేరే పువ్వును వెతుక్కుంటూ వెళ్ళినట్లు - ప్రేమ ముసుగులో పబ్బం గడుపుకుంటాడు. తీరా పెళ్ళి అనే సరికి కులం - గోత్రాలు - కట్నాలు గుర్తుకొస్తాయి. మొగాడు చపలచిత్తుడు! ఆడది ప్రేమించినంత గాడంగా ప్రేమించలేదు! అవకాశవాది! అందులో ఈ కాలేజీలో ప్రేమలు అస్సలు నమ్మదానికి లేదు. బరువు బాధ్యతలు లేని వయసు. అందమైన అనుభవం కోసం అర్రులుచాస్తూ ఉంటాడు. కాని ప్రకృతి స్త్రీ పట్ల శత్రువు అవుతుంది. ఆనాటి శకుంతల నుండి ఈ కాలం ఆధునిక స్త్రీ దాకా మొగాడి మాయమాటల్లో పడి మోసపోతూనే ఉంది. జాగ్రత్త!" చిదానందం చిన్న ఉపన్యాసం యిచ్చాడు చిన్నగా.

" కాని నాన్నా, నాకివన్నీ ఎందుకు చెబుతున్నారు! నేను మీకూతుర్ని!" ప్రవల్లిక ఆశ్చర్యంగా అడిగింది.

"అందుకే గదమ్మా నా బాధ! ఆకు వచ్చి ముల్లు మీద పడ్డా - ముల్లు వచ్చి ఆకుమీద పడ్డా ఆకుకే నష్టం! పెళ్ళి కాని పిల్లవు నువ్వు ఒక్క పొరపాటు అడుగు వేసినా మా పరువు పోతుంది - మాకు ఆత్మహత్య తప్పించి వేరే గతిలేదు - ఆలోచించుకో - నాప్రాణం - మీ అమ్మప్రాణం నీ చేతిలో ఉంది - మా ఆశలన్నీ నీపైనే - నీ తమ్ముడి భవిష్యత్తు కూడ దెబ్బతింటుంది!" చిదానందం ముగించాడు.

ప్రవల్లిక మొహం బాగా నల్లబడిపోయింది. చివాల్న లేచి కిందకు వెళ్ళిపోయింది. బండి స్టార్టయి వెళ్ళిపోయిన శబ్దం అయింది.

చిదానందం తృప్తిగా నవ్వుకున్నాడు - తండ్రిగా తన బాధ్యత నెరవేర్చాడు. వార్నింగు యివ్వలేదనకుండా తను చెప్పాల్సింది చెప్పాడు బ్రెయిన్ వాష్ చేశాడు - ఇంక జీవితంలో తప్పటడుగు వెయ్యదు కాక వెయ్యదు.

ఇంకో రోజు శారద చిదానందంకు యింకో కంప్లెయింటు యిచ్చింది - "మీ సుపుత్రిరత్నం సరిగ్గా చదువుకోవడం లేదు - చెడు స్నేహాలు పట్టి చెడిపోతున్నాడు - వాడికి చదువు మీద కంటే క్రికెట్ మీద ధ్యాస ఎక్కువయింది." అంటూ చాలా సేపు అతనికి తలంటి పోసింది.

చిదానందంకు ప్రసన్నకుమార్ పైన చాలా కోపం వచ్చింది.

"ఒరేయ్ ప్రసన్నా! అడ్డగాడిదా! ఇలారారా!" కోపంతో కేకలేశాడు.

"ఏంటి డాడీ!" వినయంగా వచ్చాడు క్రికెట్ బ్యాట్ పట్టుకుని.

"ఎక్కడికిరా పోతున్నావు ప్రొద్దున్నే!"

"ఇవ్వాళ గ్రౌండ్ లో మ్యాచ్ ఉంది డాడీ!" ప్రసన్నకుమార్ చెప్పాడు.

"జీవితమంతా క్రికెట్టేనేరా? ఒరేయ్ ఈ ఆటలు కూడు బెడతాయా గుడ్డనిస్తాయా?" వెక్కిరింతగా అడిగాడు.

"అదేంటి డాడీ! మన క్రికెటర్లు కోట్లు సంపాదించడం లేదా? నేను కూడ ఒక సచినో - ఒక లక్ష్మనో - ఒక ధోనినో అవుతే ఇంక డబ్బుకు లోటేముంటుంది?" విస్మయంగా అడిగాడు ప్రసన్నకుమార్.

"నిజమే నువ్వు ఆ స్థాయికి పోతే ఫర్వాలేదు - కాని ఫెయిలయ్యావో అనుకో -"

"ఎందుకనుకోవాలి! నా కృషి నే చేస్తున్నాగా -" అర్ధం కాలేదు ప్రసన్నకు.

"కాసేపు అనుకోరా? దేశంలో ఎంతమంది క్రికెట్ పిచ్చివాళ్ళు లేరు."

నూట పదికోట్ల జనాభాలో ఎన్ని లక్షల మంది క్రికెట్ ప్లేయర్లు లేరు. మరి వాళ్ళందరికీ నేషనల్ టీమ్ లో చాన్సు దొరుకుతున్నదా? ఆలోచించు!" చిదానందం లాజికల్ గా అడిగాడు.

ప్రసన్నకుమార్ బిత్తరపోయాడు - బ్యాట్ నేలకేసి కొట్టాడు...

"ఆ! ఆ చాన్సు కోసమే గదా నేను రోజూ ప్రాక్టీస్ చేస్తున్నది" చెప్పాడు.

"నిజమేరా? మరి చదువు ఎవరు చదువుతారురా? ఇంటర్ అయిపొయింది... మెరిట్ లో బిటెక్కులో సీటు రాలేదు - లాంగ్ టర్మ్ కోచింగ్ లో చేరావు - ఈ సారన్నా ఎమ్ సెట్ లో ర్యాంకు వచ్చి - మంచి కాలేజీలో సీటు వస్తుందా?" అడిగాడు చిదానందం.

"వస్తుందనే అనుకుంటున్నాను - కాని డాడీ! ఎప్పుడూ చదివినంత మాత్రాన సీటు వస్తుందనుకోవద్దు - రోజుకు ఇన్ని గంటలని చదువుతున్నా - మిగతా గంటలనే ఆటలమీద పెడుతున్నాను. అయినా మీరు అన్నట్లు సీటు వచ్చినా - బిటెక్కు చేసినా మంచి జాబు వస్తుందని మీరు రాసివ్వగలరా? రోజూ ఎంతమందిని చూడ్డం లేదు. సంవత్సరానికి అరవై డబ్బై వేలమంది బిటెక్కు పూర్తి చేస్తున్నారు. అందులో! వీరిలో క్యాంపస్ సెలక్షన్లు కేవలం కొన్ని వందల మందికే వస్తున్నాయి. కొందరు అమెరికా పోతున్నారు - ఇంకా కొందరు చిన్నా - చితక ఉద్యోగాలు చేస్తున్నారు. అత్యధికులు ఉద్యోగాల వేటలో వున్నారు - బాగా చదువుకున్నంత మాత్రాన గ్యారంటీగా ఉద్యోగం వస్తుందని నమ్మకం లేదు -"

ప్రసన్నకుమార్ రివర్సు స్వింగ్ వేశాడు.

చిదానందం ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. కాసేపటి తర్వాత అన్నాడు "అందుకని చదవకుండా అడ్డగాడిదలా తిరుగుతానంటావు!"

"అని అనడం లేదు - నా భవిష్యత్తు నాకు తెల్సు - మీరేం నాగురించి వర్రీ అవ్వద్దని చెబుతున్నాను - నా గురించి ఆలోచించి మీరు బీపీ పెంచుకుంటే అమ్మకు - మాకు కష్టం కులుగుతుంది. అప్పుడు మా కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది" ప్రసన్నకుమార్ తండ్రికి క్లాసు తీసుకున్నాడు.

"అబ్బా! చాలా ఎదిగి పోతావురా!" చిదానందంకు నోట మాటరావడం లేదు.

"డాడీ! నా టీమ్ మేట్లు నాకోసం ఎదురు చూస్తూ ఉంటారు - నేను వెళ్ళాలి - అందులో యివ్వాళ నేను సెంచురీ చేసి తీరాలి!" ప్రసన్నకుమార్ బై చెప్పేసి బండి మీద వెళ్ళిపోయాడు.

ఈ సంభాషణ లోపలినుంచి విని ప్రవల్లిక నవ్వుకుంది.

"ఏమోవ్! నీ కొడుకు చూడు ఎంత పెద్దవాడయ్యాడో - వాడికి తండ్రి అన్నాకూడ లెక్కలేకుండా ఉంది. వెధవకి నాలుగు రోజులు తిండి పెట్టడం మానేస్తే తెలుస్తుంది. జీవితమంటే
ఏమిటో! కష్టపడి సంపాదించి తెస్తుంటే బాగా తిని అందరికీ నీతులు చెబుతున్నాడు - ఇడియట్!" కోపం వచ్చింది చిదానందంకు.

"అబ్బ! మీకు ఏది చెప్పినా కష్టమే - మీరు మీ పని చూసుకోండి!" శారద చెప్పింది చిదానందంకు.

ఒకరోజు చిదానందం ఆఫీసులో బిజీగా ఉన్నాడు. ఆఫీసరు అవతారం పిల్చి కొన్ని ఫైల్సు గురించి అడిగాడు. చిదానందం ఓపిగ్గా చెప్పాడు అవతారంకు అర్ధం కాలేదు - మళ్ళీ రాసి తీసుకురమ్మన్నాడు.

"ఏం సార్! ఈ పైళ్ల గురించి యింత యిదిగా ఆలోచిస్తారు. జగత్ మిథ్య బ్రహ్మ సత్యం! అంతా జగన్నాటకం! దాని గురించి ఇంత తలబద్దలు కొట్టుకోవడం ఎందుకు సార్! పైవాడి కేం తెలుస్తుంది సార్!" అంటూ కొంత మెట్ట వేదాంతం చెప్పుకొచ్చాడు.

ఆఫీసరు అవతారం తలూపి పంపించేశాడు.

కాని మరునాడు చిదానందం టేబులు మీద మెమో ఉంది.

లబలబలాడుతూ అవతారం గదిలోకి వెళ్ళి వాపోయాడు చిదానందం.

"ఏముందిలే చిదానందం - ఆఫీసు మిథ్య - మెమో మిథ్య - ఈ మాయా ప్రపంచంలో ఏది శాశ్వతం? ఈ మెమో గురించి అంత వర్రీ ఎందుకవుతావు? బ్రహ్మ సత్యం -" అని చెప్పి పంపించేశాడు, ఆఫీసరు అవతారం.

దాంతో చిదానందంకు ఆఫీసులో కూడా కష్టాలు మొదలయ్యాయి.

ఇంతలో - ఓ రోజు ప్రవల్లిక జెండా ఎత్తేసింది. తన ప్రియుడు హరినాధరెడ్డితో తిరుపతికి పారిపోయి పెళ్ళి చేసుకుంది.

ఉత్తరం ద్వారా ఈ సంగతి తెలుసుకుని చిదానందం హతాశుడయ్యాడు శారద పరిస్థితి చెప్పనక్కరలేదు.

అతి కష్టం మీద ప్రవల్లిక ఇంటి అడ్రసు కనుక్కుని వెళ్ళాడు -

"నాన్నా! మమ్మల్ని ఆశీర్వదించు నాన్నా!" అంటూ ప్రవల్లిక అతని కాళ్ళమీద పడింది.

"ఒసేయ్! అయిందేదో అయిపొయింది... ఇంక మనింటికి వచ్చెయ్యి." ఆమె చేతులు పట్టుకుని చెప్పాడు.

"అంటే నాన్నా! మా పెళ్ళిని మీరు పెద్ద మనసుతో ఆమోదిస్తున్నారు కదూ!" అనుమాన నివృత్తి కోసం అడిగింది.

"ఛీ! ఛీ! అది పెళ్ళి కాదు - బొమ్మలాట! వాడు కట్టిన తాళిని వాడి మొహాన విసిరేసి రా! ఇది పీడకలగా మర్చిపో!" చిదానందం చెప్పాడు.

"నాన్నా! ఓ తండ్రి అయి ఉండి ఇలా మాట్లాడతారా! కూతురు కాపురం చేతులారా చెడగొడతారా?" ప్రవల్లిక ఆశ్చర్యపోతూ అడిగింది.

"మామగారు! పెద్ద వాళ్ళు మీరు మాట్లాడవలసిన మాటలా యివి?" హరినాధరెడ్డి బాధగా అడిగాడు.

"షటప్ యూ రాస్కెల్! నువ్వు మాట్లాడకు. నీ మీద పోలీసు కంప్లెయింట్ యిస్తాను. మా అమ్మాయికి మందుపెట్టి అమాయకురాలిని బుట్టలో వేసుకుంటావా? ఇంతకు యింత అనుభవిస్తావు! జాగ్రత్త!" చిదానందం ఆవేశంగా శివతాండవం చేశాడు కాసేపు.

హరినాధరెడ్డికి కోపం వచ్చింది. ఆవేశంగా మీదకు పోయాడు. ప్రవల్లిక అడ్డుపడి దండం పెట్టింది - ఏమీ చెయ్యొద్దని.

"చూడు - మీ అమ్మాయి మొహం చూసి వదిలి పెడుతున్నాను - ఇంకోసారి నా గుమ్మం తొక్కొద్దు - మర్యాదగా ఉండదు." హెచ్చరించాడు రెడ్డి.

"ఏమ్మా! ప్రవల్లిక! నువ్వు అలా నిలబడ్డావేమ్మా! మీ అమ్మ తిండి తిప్పలు లేకుండా మంచాన పడి ఉంది. నువ్వు రాకపోతే చచ్చిపోతుంది. ఒక్కసారి రామ్మా మనింటికి!" ప్రాధేయపూర్వకంగా అడిగాడు.

"నాన్నా! అది మనిల్లు ఎలా అవుతుంది! అది మీ ఇల్లు! ఆడపిల్లకు పెండ్లి కాగానే అది పరాయి యిల్లు అవుతుంది. మెట్టినిల్లే తనిల్లవుతుంది అని నువ్వు చెప్పావుగా నాన్నా!" ప్రవల్లిక చెప్పింది.

"అది సాంప్రదాయంగా పెండ్లి చేసి పంపితే! నీలాగా లేచిపోయి - గోప్యంగా గుళ్ళో పెళ్లి చేసుకుంటే కాదమ్మా! నువ్వు వయసు వేడిలో తొందరపడ్డావు. వీడు నిన్ను వాడుకుని వదిలేస్తాడు - అపుడు నీకు దిక్కెవరమ్మా? ఏమ్మా! ఈ తండ్రి నీకు పెండ్లి చెయ్యలేడనుకున్నావా?" ఏడ్చాడు చిదానందం.

ప్రవల్లిక కొంత కరిగి పోయింది.

"నాన్నా! వస్తాను - కాని ఆయన్ని ఏమి అనకూడదు - ఇద్దర్నీ ఆశీర్వదించి పంపించండి - చాలు" అని బ్రతిమాలింది.

"ఛీ! ఛీ! వీడి మొహం చూస్తేనే పంచమహా పాతకాలు పుడతాయి. కులం తక్కువ వీడ్ని ఎలా చేసుకున్నావమ్మా! మీ ఇద్దర్ని చూస్తే మీ అమ్మ గుండె పగిలి చచ్చిపోతుంది. నువ్వొక్కదానివిరా!" చిదానందం చెప్పాడు.

"ఏం హరనాధ - వెళ్ళమంటావా?" అడిగింది ప్రవల్లిక.

"ప్రవల్లిక! ఈ ముసిలాళ్ళ సంగతి నీకు తెలీదు - పచ్చటి కాపురంలో చిచ్చు పెడతారు - నిన్నేమైనా చేస్తారు - వద్దు -" హరినాధరెడ్డి చెప్పాడు.

"సారీ! నాన్నా! మీ మనసు మారింతర్వాత వస్తాం - వెళ్ళండి -" చెప్పింది.

"ఒసే ఇరవై సంవత్సరాలు పెంచిన ప్రేమ కంటే ఓ రెండు నెల్ల కామం నీకు ఎక్కువయిందటే! పురుగులు పడి చస్తావే! తల్లితండ్రుల్ని ఏడ్పించిన వాళ్ళు ఎవరూ బాగుపడరు - సర్వ నాశనమై పోతావు!" అంటూ శాపనార్ధాలు పెట్టి వచ్చేశాడు.

ఆ షాక్ తో శారదకు మునుపటి ఆరోగ్యం చేకూరలేదు - చిదానందంకు మునుపటి ఆనందం - భక్తి కలగడం లేదు -

గోరుచుట్టుపైన రోకటి పోటులాగా - ప్రసన్నకుమార్ కు ఎమ్ సెట్ లో ఈసారి ర్యాంకు రాలేదు. ప్రముఖ కాలేజీల్లో కాదు గదా - పరిసర ప్రాంతాల్లో అనుకున్న సబ్జెక్టులో సీటు దొరకడం గగనకుసుమంగా మారింది.

"ఒరేయ్ బడుద్ధాయి! ఏం చేద్దామనుకుంటున్నావు?" అడిగాడు ఓ రోజు.

"మళ్ళీ లాంగ్ టర్మ్ కోచింగ్ లో చేరతాను"

"ఇప్పటికే ఒక సంవత్సరం పోయింది - నాకు ఓపిక లేదు?" చెప్పేశాడు చిదానందం చిరాగ్గా.

"సరే! నన్ను క్రికెట్ మీద కాన్సట్రేట్ చెయ్యనివ్వండి - మీరు చదువు చదువు అని పట్టు పట్టకుండా ఉంటే ఈ లైన్ లో నేను బాగా రానిస్తాను."

"ఉట్టికెగరలేని అమ్మ స్వర్గానికెగిరిందని - కాలేజీలో సీటు తెచ్చుకోలేకపోయావు - క్రికెట్ లో ఎలా పైకొస్తావు!" చిదానందం అడ్డు ప్రశ్న.

"దానికి దీనికి సంబంధం ఏమిటి? అది బలవంతాన చదివేది - ఇది ఇష్టపడి ఆడేది. కష్టపడి చదివే ఇష్టం లేని చదువు తలకెక్కదు. నా ఆటలో నా అదృష్టాన్ని పరీక్షించుకోనివ్వండి". ప్రసన్నకుమార్ చెప్పాడు.

"నీకేంరా - అడ్డగాడిదలా తిని బలిసిపోతున్నావు! ఒక బాధ్యత లేదు - ఒక బరువు లేదు రేపొద్దున నేను రిటైరైపోతే ఎవరు నిన్ను పోషిస్తారు? ఈలోగా నీకు మంచి ఉద్యోగం రావాలి కదా! నీ క్వాలిఫికేషన్ చూస్తే పిల్చి నీకు అటెండర్ పోస్టు కూడా యివ్వరు. పది రూపాయలు బయట సంపాదించు తెలుస్తుది రూపాయి విలువ!" అవకాశం
దొరకపుచ్చుకొని క్లాసు పీకాడు చిదానందం.

అంతా విని ప్రసన్నకుమార్ ఓ మాట అన్నాడు - "నీకు బరువైతే - అక్క బావ పోషిస్తారులే - నువ్వేం బాధపడకు!"

ఆ మాటకు షాక్ తిన్నాడు చిదానందం. చిత్తర్వులా నిలబడిపోయాడు.

"నామీద మీరు ఎంత ఖర్చు పెట్టింది - పద్దు రాసి పెట్టండి - నేను ప్రయోజకుడినైన తరువాత - అణాపైసలతో సహా మీ బాకీ తీర్చేస్తాను" చెప్పి బ్యాట్ పట్టుకుని వెళ్ళిపోయాడు చక్కగా ప్రసన్నకుమార్ అప్రసన్నంగా.

"అయ్యో! నాకు చావు కూడా రావడం లేదు. ఇవన్నీ బ్రతికుండగానే చూడాల్సి వస్తున్నది." శారద బాధపడింది. వల వల విలపించింది.

అప్పటి నుంచి చిదానందంకు జీవితం నరక ప్రాయమైంది. ఎప్పుడూ ఒకటే ఆలోచన! ఆఫీసులో కూడ సరిగా పనులు చేయలేకపోతున్నాడు. ఇంటికొస్తే భార్య అనారోగ్యం - కొడుకు ఆటల పిచ్చి! బయటికి పోతే కుటుంబం పరువు గురించి గుసగుసలు! తోటి కులస్తులతో తలవంపులు!

ఆర్ధిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నది...

కొంతకాలం తర్వాత, ఆరోజు శాస్త్రులుగారు కర్నూలు వేంచేస్తున్నట్లు పేపర్లో చూశాడు. చిదానందంకు అంతకు ముందు ఆయన సంభాషణ - ఉపన్యాసం గుర్తుకొచ్చి బాధపడ్డాడు.

కాని ఇంట్లో కూర్చుని ఏడ్వడం కంటే - అలా పురాణకాలక్షేపం కోసం వెళ్ళితే రిలీఫ్ ఉంటుందని బయలుదేరి వెళ్ళాడు.

వేదాంతం గురించి ఉపన్యసించారు శాస్త్రులుగారు.

"సుఖ స్వరూపుడు - ఆనంద స్వభావుడు అయిన నీకు దుఃఖం ఎక్కడ నుంచి వస్తున్నది? నీ స్వభావం ఆనందం - నీ స్వరూపం ఆనందం. ఎందుకు దుఃఖిస్తున్నావు? జీవితంలో ఏం పోగొట్టుకున్నావని బాధపడుతున్నావు?" అంటూ అందరిని ఉద్దేశించి చాలా చాలా మంచి విషయాలు చెప్పుకొచ్చారు.

అవి వింటున్నంత సేపు చిదానందంకు బాగుంది. కాని ఆయన ఉపన్యాసం అయిపోగానే తన కష్టాలు గుర్తుకొచ్చాయి.

అందరూ వెళ్ళిపోయే దాకా ఉండిపోయి - శాస్త్రులు గార్ని ఏకాంతంగా కలుసుకున్నాడు.

"స్వామీ! మీరు చెప్పినట్లు దుఃఖం జయించడం అంత సులభం కాదు. మన కళ్ళ ఎదుట ఎన్నో చేదు సంఘటనలు జరుగుతూ ఉంటే మనం ఎలా ఆనందంగా ఉండగలం?" చిదానందం ప్రశ్న.

"నువ్వు స్థిత ప్రజ్ఞుడువు కావాలి! నీ దుఃఖం అర్జునుడికంటే గొప్పదా! తాతలు - తండ్రులు - గురువులు ఎదురుగా నిల్చుని పోరాడుతున్నారు అయినా అతను దుఃఖించలేదే! తన కర్తవ్యం నెరవేర్చాడు!" శాస్త్రులు చెప్పారు.

"నిజమే, అతను గొప్పవాడు - అందరూ ఆస్థాయికి ఎదగలేరు గదా! వారికి దుఃఖం తప్పదు కదా! అయినా మీకు నాలాంటి అనుభవాలు జరిగి ఉంటే ఇలా మాట్లాడి ఉండేవారు కాదు - సన్యాసులకు సంసారుల కష్టాలు ఏం తెలుస్తాయిలేండి!" అని నిష్టూరంగా పలికాడు.

"చిదానందం! నీకోసం అయిదు నిమిషాలు కేటాయిస్తాను - నీ సమస్యలు చెప్పు." అన్నారు శాస్త్రులుగారు. చిదానందం జరిగిన సంగతులన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు.

"చూడు చిదానందం! నువ్వు మాయలో వున్నావు. అందరూ నీ మాట వినాలి అని ఆలోచిస్తునావు! ఎందుకు వినాలి? వాళ్ళు నీకేమవుతారు?"

"అయ్యో! వాళ్ళు నా కన్నబిడ్డలు -"

"వారి కాయాలు కనడానికి నువ్వు కారణమాత్రుడివే! వారి అదృష్టాన్ని నువ్వు కన్నావా? నువ్వు పెంచావని వారు పెరిగారా? అలా పెరిగేటట్లయితే కోటీశ్వరుల ఇంట్లో పెరిగే పిల్లలు కూడా చనిఓతున్నారే! పెళ్లి చేసేవాడివి నువ్వా? అలా అయితే శాస్త్ర బద్ధంగా - సంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్ళిళ్ళు కొన్ని విఫలమయి పోతున్నాయే!"

"నిజమే! కాని వారి భవిష్యత్తు పాడయిపోతుందని నా ఆవేదన!"

"జరగాల్సింది జరక్కమానదు - దాని గురించి నువ్వు ఆరోగ్యం పాడు చేసుకోవడం చింతించడం మూర్ఖత్వం!

అంతకంటే దేవుని మీద ధ్యాస పెట్టి ఉంటే పుణ్యం పురుషార్ధం వస్తుంది." చెప్పాడు శాస్త్రజ్ఞులు.

"ఇన్ని కష్టాలుంటే మనసు ఎలా నిలుస్తుంది స్వామీ - మీ కంటే ఏ సమస్యలూ లేవు! మీరు ఎన్ని పురాణాలైనా చెబుతారు!" తీసి పారేశాడు నిష్టూరంగా.

"చిదానందం! నువ్వు నాతో పోలిస్తే చాలా అదృష్టవంతుడివి! మీ అమ్మాయి కేవలం కులం కాని వాడ్ని చేసుకుంది. మా అమ్మాయి మతం కాని వాడ్ని కూడా చేసుకుంది. నేను పరమ నిష్టాగరిష్టుడ్ని - అది నా మతాన్ని కులాన్ని నాశనం చేసింది. మా అబ్బాయి దొంగతనం చేసి జైలు పాలయ్యాడు. ఈబాధలు పడలేక నా భార్య గుండెనొప్పితో చనిపోయింది! మరి నీ కష్టం ఎక్కువా? నాదా?" శాస్త్రులు గారు అడిగారు.

చిదానందం నివ్వెరపోయాడు.

"నీది కాని దాన్ని నీది అనుకుంటేనే నీకు దుఃఖం వస్తుంది. ప్రపంచం అంటే పంచేంద్రియాలకు ప్రముఖంగా కనిపించేది. సత్యమన్నది మూడు అవస్థల్లో, మూడు కాలాల్లో ఉండాలి. నీ దుఃఖం జాగ్రదావస్తలో ఉంటుంది. కాని గాడనిద్రలో ఉండదు. కాబట్టి అది నిజం కాదు. గాడనిద్రలో వున్నప్పుడు పులి కల్లో కొచ్చి మింగబోతే భయపడతామా లేదా? నిద్ర లేచింతర్వాత మన భయానికి మనమే నవ్వుకుంటాం! ఇది కూడ అంతే! ఈ మాయా ప్రపంచంలో మనది కాని కష్టాన్ని మనదనుకుని భ్రమ పడి బాధలు పడుతున్నాం!" వివరించారు శాస్త్రులు.

"అంతే నంటారా స్వామీ?"

"ఆ! మనసు బహిర్గతం చేసుకుంటే బాధలు - మనసు అంతర్గతం చేసుకుంటే ఆనందం కలుగుతుంది. మనం వచ్చేప్పుడు ఏం తెచ్చాం? వెళ్ళేప్పుడు ఏం తీసుకుపోతున్నాం? వాళ్ళు నీకు తోడుగా ఎంత దాకా వస్తారు? మహాఅయితే కాటి దాకా - ఆపైన ప్రయాణం నువ్వు ఒంటరిగా చెయ్యాలి! ఆ ప్రయాణంలో నీకు భగవంతుడే తోడు!" శాస్త్రులుగారు బోధించారు.

"అయితే నేను విచారపడనక్కర లేదంటావా?" చిదానందం అడిగాడు.

"ఒక నటుడు విషాద పాత్ర నటిస్తూ ఉంటే - ఆ విషాదం ఆ నాటకం ముగిసింతర్వాత అతని వెంట వస్తుందా? ప్రపంచమనే నాటకరంగంలో మనమందరం పాత్ర ధారులం మాత్రమే! ఈ మాత్రం దానికి ఆనందమయజీవితాన్ని దుఃఖమయం చేసుకోవడం అనవసరం!" శాస్త్రులుగారు చెప్పారు.

"అస్సలు నాకు ఆనందం ఎక్కడా కనిపించడం లేదు స్వామి యవ్వనంలో వున్నప్పుడు కొన్నాళ్ళు ఆనందపడ్డాను - కాని ఇప్పుడు -"

"ఎండమావులలో నీ దాహం ఎంత తీరుతుందో, విషయవాంచలలో నీ దాహం అంత తీరుతుంది. కోరికలు అనంతం! ఒక కోరిక పూర్తి కాగానే ఇంకో కోరిక పుట్టుకొస్తుంది. విషయానందం దుఃఖాన్ని మాత్రమే మిగిలిస్తుంది. కాని పరమాత్మ పైన మనసు నిలిపితే వచ్చే పరమానందం శాశ్వతం! అది అలవరచుకో!" శాస్త్రులుగారు చెప్పారు.

కాని అంత సులభమా స్వామి?" చిదానందం ప్రశ్న.

"కాదు కాబట్టే అభ్యాసం - వైరాగ్యం చేత ధ్యానాన్నినిలుపుకోవచ్చు. ఎక్కువ ఆహారం తీసుకోవద్దు - ఎక్కువ ఆలోచనలు చేయవద్దు - ఎక్కువ మాట్లాడద్దు! అన్నీ సర్దుకుంటాయి. మనసుకోతి లాంటిది - అసలే కోతి - ఆపై కల్లు తాగింది ఆపై ముల్లుగుచ్చుకుంది లాగా - చంచలమైన మనసు విషయ వాంఛలతో గంతులేసి ఆనందం ఆనందం అని అర్రులు చాచి విషయ భోగాలతో చిక్కుకుని - రోగాల పాలవుతున్నది. అందుకని బుద్ధితో మనసును అదుపులో పెట్టుకుంటే కొన్ని దినాలకు అంతా అదుపులోకి వస్తాయి! చిత్త వృత్తులను నిరోధించడమే యోగం! యోగం సిద్ధిస్తే యోగి అవుతావు - నిరోధించలేకపోతే రోగివవుతావు! జన్మ జన్మల దుఃఖం అనిభవిస్తావు! కాబట్టి సుఖపడాలంటే మనసును మాయం చేసుకో!" చిదానందం శాస్త్రులుగారి ప్రవచనానికి ఆనందంతో పొంగిపోయాడు మార్గం సుగమం అయింది.

మరిన్ని కథలు

Marmam
మర్మం
- రాము కోలా దెందుకూరు
Korthi
కొర్తి
- బివిడి ప్రసాద రావు
Atrhata
అర్హత
- డి.కె.చదువుల బాబు
Antataa neeve
అంతటా నీవే
- షామీరు జానకీ దేవి
Ahakaram techhina sapam
అహంకారం తెచ్చిన శాపం
- గొట్టాపు శ్రీనివాస రావు
Donga chetiki taalaalu
దొంగ చేతికి తాళాలు
- కొల్లాబత్తుల సూర్య కుమార్
Aa raatri
ఆ రాత్రి
- జాహ్నవి ప్రియా
Aparichitudu
అపరిచితుడు
- డి.కె.చదువుల బాబు