త్రికరణ శుద్ధి - జంపని జయలక్ష్మి

Trikarana Sudhi

పశ్శక్తి సంపన్నుడైన ఒక స్వామీజీ ఒకసారి ఒక పట్టణానికి భక్తులకు ప్రవచనాలను తెలియపరచడానికి విచ్చేశారు. ఆయన వివరించిన సనాతన ధర్మాలు, ఆచార సాంప్రదాయాలు చాలా భక్తి శ్రద్ధలతో విన్నారు పుర ప్రజలు. ఆయన వాగ్ధాటికి ముగ్ధుడై ఒక భక్తుడు స్వామిని భిక్ష స్వీకరించవలసిందని ప్రార్ధించాడు.

సాధారణంగా జప తపాదులు చేసుకునే స్వామీజీ ఎవరి గృహాలకు భిక్షకు వెళ్లరు. వారి గృహస్థు ధర్మం స్వామి ధ్యానానికి ఏమైన భంగం వాటిల్లుతుందేమో అని ఒప్పుకోరు. కానీ ఆ భక్తుడు మరీ ఆర్తిగా ఎంతో భక్తితో ఆహ్వానించేసరికి ఇక కాదనలేక శిష్యులకు సరే వెళదాము అని తన అంగీకారం తెలిపారు. ఆ భక్తుడు ఎంతో సంతోషించి స్వామికి ఇచ్చే విందు ఎంతో ఘనంగా శుచిగా శుభ్రంగా ఉండాలన్న ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు.ఈ విషయం తన భార్య చెవిన వేశాడు.ఆమె కూడా ఎంతో సంతోషించింది. సాక్షాత్తూ భగవంతుడే మన ఇంటికి విచ్చేసి విందారగిస్తానంటే మనమెంతో అదృష్టం చేసుకున్నాం అని మురిసిపోయింది. ఇక స్వామికి ఏమి చేసిపెట్టాలి ఎలా చెయ్యాలి అని ఆ దంపతులు తర్జన భర్జన పడుతున్నారు. అతడి తల్లి ఒక సలహా ఇచ్చింది. ఇంట్లో ఎప్పుడూ మనం చేసుకుంటున్నట్లు వద్దు. అన్నీ సరైన రుచిలో కుదరకపోవచ్చు. ఒక వంటావిడను పెడదాము అని ..ఈ ఆలోచన అందరికీ నచ్చింది, సరే అనుకుని మాంచి పేరున్న వంటావిడను పిలిపించారు. ఆరోజు చెయ్యాల్సిన శాకపాకాలన్నీ వివరంగా చెప్పారు. స్వామీజీకి మరింత శుచిగా, శుభ్రంగా వండాలన్నారు, ఆవిడ సరే అని ఒప్పుకుంది.

మరునాడు స్వామీజీ తన శిష్యులతో భక్తుడి ఇంటికి వేంచేశారు. ఆ భక్త దంపతులు స్వామికి ఎంతో భక్తితో పాద పూజ చేశారు. వారు ఆశీనులయ్యాక భక్తులకు భగవంతుడి గురించిన మంచి మాటలు తెలియచెప్పారు. అపరాహ్న వేళ అవటంతో స్వామీజీకి వారి శిష్యులకు షడ్రశోపేతమైన భోజనం ఎంతో భక్తితో శ్రద్ధగా ఆ దంపతులిద్దరు వడ్డించారు. స్వామి కూడా ఎంతో ముచ్చట పడ్డారు వారి భక్తికి..

స్వామి కాసేపు విశ్రమించడానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. సాయంసంధ్య వేళనుండి స్వామి ఆలోచనా విధానంలో ఏదో మార్పు రాసాగింది. అక్కడ ఉన్న వస్తువులు ఎంతో ఖరీదైనవి కావడంతో కొంచెం కొంచెం ఆకర్షణకు లోనవటం ప్రారంభమైంది. ఈ వస్తువులు మనతో తీసుకువెళ్తే ఎలా ఉంటుంది అనీ ఇలా రకరకాలుగ ఆలోచనలు రాసాగాయి. స్వామీజిలో అంతర్మధనం ప్రారంభమయింది. నాకు ఇలా ఎందుకు జరుగుతోంది, జపతపాది ధ్యానాల వలన ఎంతో స్థిత ప్రగ్నతతో ఉండే నాకు ఏమయింది అని ఆలోచించి ఒకసారి ధ్యానం లోకి వెళ్లారు. అపుడు తెలిసింది ఆయనకు ..మధ్యాహ్నం తాను తీసుకున్న ఆహార ప్రభావం అని..

మానవ మాత్రులమైన మనకు ఇంత విశ్లేషణా ధోరణి ఉండక పోవచ్చు కానీ స్వామి విషయం గ్రహించేశారు. అపుడు ఆ దంపతులని పిలిపించారు. వారు ఎంతో వినయంగా స్వామి వద్దకు వచ్చి నిలుచున్నారు. స్వామి మధ్యానం వంట వండిన వారు ఎవరని ప్రశ్నించేసరికి ఏమైన అపరాధం జరిగిందేమో అని బిత్తరపోయారు. ఒక వంటావిడతో ఎంతో శుచిగా శుభ్రంగా వండించాము అని శెలవిచ్చారా దంపతులు . ఐతే ఆవిడను పిలవండి అని అన్నారు స్వామి. ఆవిడ తత్తరపాటుతో వచ్చి స్వామి ముందు నిలబడింది. మీరు వంటలో వాడిన కూరలు ఎక్కడివి, వండేటపుడు ఏమి ఆలోచిస్తున్నారు అని స్వామి అడిగారు. ఆవిడకు ముందు ఏమీ అర్ధం కాలేదు.చాల మటుకు ఇంట్లో పెరట్లో కూరలు కొన్ని బయట నుండి పనివాడు తెచ్చాడు అని చెప్పింది. మరి వండేటపుడు ఏమి ఆలోచిస్తున్నావ్ అని స్వామి అడిగారు. ఇక వంటావిడకు చెప్పక తప్పలేదు అసలు విషయం .. ఎంతో ధనవంతుల కుటుంబం కదా వండగా మిగిలిన వంటనూనె, పప్పులు, కూరలు అన్నీ వాళ్లకు తెలిసి కొన్ని తెలియక కొన్ని ఎలా పట్టుకువెళ్లాలా అని ఆలోచిస్తూ వంట వండాను అని చెప్పింది..

అప్పుడు స్వామి ఇలా వివరించారు.. చూశారా కేవలం వంట చేసేటపుడు ఉన్న ఆలోచనా విధానాలకే మన మనస్సుకు ఇంత మార్పు వస్తే ఇంక వాటిని పండించడానికి దానిని మనం స్వీకరించేటపుడు అనగా భుజించేటపుడు మనం చేసే ఆలోచనలు మన శరీరం మీద ఇంక ఎంత ప్రభావం చూపుతాయో కదా. కాబట్టి మనం ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా అంటే మనసా వాచా కర్మణా అనే ధ్యాసలొ చేయాలి..అపుడు వ్యక్తులు కుటుంబం తద్వారా దేశం బాగుంటాయని స్వామీజీ శలవిచ్చారు.

మరిన్ని కథలు

Kotta konam
Kotta konam
- Prabhavathi pusapati
Sagatu manishi andolana & aswasana
సగటు మనిషి ఆందోళన & ఆశ్వాసన
- మద్దూరి నరసింహమూర్తి
Evarini Chesukovali
ఎవరిని చేసుకోవాలి?
- తాత మోహనకృష్ణ
Mana oudaryam
మన ఔదార్యం
- సిహెచ్. వెంకట సత్య సాయి పుల్లంరాజు
Swardha poorita pani
స్వార్ధపూరిత పని
- మద్దూరి నరసింహమూర్తి
Ratee manmadhulu
రతీ మన్మథులు
- కందుల నాగేశ్వరరావు