ఆకుపచ్చని స్వప్నం - పి.వి.డి.ఎస్.ప్రకాష్

akupacha swapnam

క్కడో కొండకోనల్లో పుట్టినవాళ్లే గిరిపుత్రులు కారు. సిటీలో పుట్టి పెరిగినవాళ్లు కూడా గిరిపుత్రులే. ఆ కొత్త నిర్వచనం తెలిసొచ్చేసరికి సారంగపాణి వయసు యాభై అయిదు. ఇంకో మూడేళ్ళలో అతడు రిటైరవుతున్నాడు. కాగా, అతడి సొంతింటి కల వయసు నలభై సంవత్సరాలు.

సరిగ్గా పదిహేనేళ్ల వయసులో ఉన్నప్పుడు లోకంలో సౌకర్యవంతంగా తల దాచుకోవాలంటే సొంతిల్లు ఉండాల్సిందేనన్న విషయం అపుడే... అతడికి తొలిసారిగా అవగాహనకి వచ్చింది. అడిగినంత అద్దె చెల్లిస్తున్నా... పరాయితనం తప్ప స్వతంత్రత ఇసుమంతైనా లేని అద్దె ఇంట్లోనే పుట్టి పెరిగాడతడు. అసలే అది అద్దె కొంప. దాంతో సంక్రమించిన ద్వితీయశ్రేణి పౌరసత్వం. అడుగేయాలంటే ఇంటివాళ్లని అడిగే వేయాలి. అడుగడుగునా కనిపించని సంకెళ్ళతో కాలు ముందుకు పడదు. స్వేచ్ఛగా సెకండ్ షో సిన్మా చూసేందుకు వీల్లేదు. గట్టిగా మేకులు కొట్టి నచ్చిన కేలండర్ తగిలించుకోడానికి అసలు వీల్లేదు. నల్లాలో నీళ్ళొచ్చినా ఇంటివాళ్లకే మొదటి బిందె హక్కు. వాకిట్లో ఏ సైకిలో, స్కూటరో పెట్టుకోడం కుదరదు. ఎందుకంటే, ఆ జాగా ఇంటివాళ్ళదే. అలా సైకిల్ పెట్టుకున్నందుకు ఓసారి పెద్ద తగువై ఏకంగా ఇల్లే మారాల్సి వచ్చింది. అరిటాకు మీద ముల్లు పడ్డా... ముల్లు మీద అరిటాకు పడ్డా నష్టం అరిటాకుకే. అద్దెకున్నవాళ్లకి ఆ సామెత కరెక్ట్ గా సూటవుతుంది.
ఇంటివాళ్ళకి నచ్చకపోయినా, అద్దెకున్నవాళ్లకి నచ్చకపోయినా కంపల్సరీ ఆ ఇల్లు ఖాళీ చేయాల్సిందే. పిల్లి తన పిల్లల్ని ఇల్లిల్లూ తిప్పినట్టు... గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్న తన తండ్రి అస్తమానం అద్దె ఇల్లు తిప్పేవాడు. ఇల్లు మారడం అంటే ఓరకంగా నరకం. సెలవు పెట్టి ఓరోజంతా సామాన్లు సర్ది, కొత్తింటికి చేర్చాలి. దాంతో, ఒళ్లు హూనమై జ్వరం వచ్చినంత పనయ్యేది. మారిన ఇంట్లో నెల్లాళ్లయితే గానీ, ఏ వస్తువెక్కడుంటుందో తెలిసేది కాదు. అంతా అయోమయమైపోయేది. అన్నిటికీ మించి... ఓ వంద గజాల స్థలంలోనైనా సొంతిల్లు అమర్చుకోవడం ఎంత అవసరమో తండ్రి చనిపోయిన తర్వాతే సారంగపాణికి బాగా తెలిసొచ్చింది.

ఉంటోంది అద్దె ఇంట్లో కదా! హటాత్తుగా గుండెపోటొచ్చి ఆస్పత్రిలో కన్నుమూసిన తండ్రి శవాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు అద్దెఇల్లు పెద్ద అడ్డంకిగా మారింది. ఇంటిఓనర్లు 'ససేమిరా... కాదు, కూడద' న్నారు. బతికున్నంత కాలం దర్జాగా గేటు తీసుకుని ఇంట్లోకి వచ్చే నాన్న... నెలనెలా జీతం రాగానే ఫస్ట్ తారీఖున క్రమం తప్పకుండా అద్దె డబ్బులు చెల్లించే నాన్న... ఆఖరి ఊపిరి వదిలేసాడని తెలిసేసరికి... అద్దె ఇంటి గేటు శాశ్వతంగా మూసుకుపోయింది. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో తోచలేదు పదిహేనేళ్ళ సారంగపాణికి. నాన్న శవం మీద కుప్పకూలి అదేపనిగా ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు కూడా ఆస్పత్రిలో నిషేధం. ధవళవస్త్రాల నర్సు వచ్చి గట్టిగా గద్దించింది. దాంతో, వచ్చే వెక్కిల్లనీ, ఏడుపునీ గొంతులోనే నొక్కి పెడుతూ అమ్మ చీరకొంగుని అదిమిపట్టుకున్నాడు. ఆ సమయంలో అమ్మని చూస్తే తెగ జాలేసింది సారంగపాణికి. నాన్నే అన్నీ అనుకుని ఆయన వేలు పట్టుకుని ఎపుడు ఆ ఇంటికొచ్చిందో... అప్పట్నుంచీ బయట లోకాన్నే చూళ్ళేదు. ఆమె లోకం నాన్నే అయ్యాడు. దాంతో, ఇంటి గడప దాటే అవకాశమే ఆమెకు రాలేదు. నిండు నూరేళ్ళు నీ తోడుంటాననీ... నమ్మించి తాళి కట్టిన నాన్న అమాయకురాలైన అమ్మని ఈ లోకంలో ఒంటరిగా వదిలి మోసం చేసాడు.

నాన్న పోవడంతో ఇంటిపైకప్పు కూలిపోయిందనే విషాదం ఓపక్క ఉప్పెనయి కమ్మేస్తుంటే... నుదుట రూపాయి నాణెమంత ఎర్రెర్రని కుంకుమతో కనిపించే తల్లికి నాన్న తోడు లేకపోయిందనే ముప్పిరిగొన్న బాధ ఇంకోవంక. అంత చిన్నవయసులోనే తల్లడిల్లిపోయాడు సారంగపాణి. నాన్నపోవడం... నిజంగానే ఇంటికప్పు కూలిపోవడం. దాంతో, రోడ్డునపడ్డట్టయింది. స్నేహితులు, సన్నిహితులు, బంధువుల సలహాల్తో... విధిలేని పరిస్థితుల్లో ఆస్పత్రినుంచి శవాన్ని ఏకాఎకి శ్మశానానికే తీసుకెళ్ళాల్సి వచ్చింది. అలా, అంబులెన్స్ లో నాన్న శవాన్ని తరలిస్తున్నప్పుడు... ఈ లోకంలో ఇంతమంది మనుషులున్నా తనకూ, తన తల్లికి ఎవ్వరూలేరనే విషయం బోధపడింది. కనీసం బతికుండగా కాకున్నా... ఈ ప్రపంచం నుంచీ సెలవు పుచ్చుకొనేలోగా... ఓ పూరిపాకైనా సొంతంగా సమకూర్చుకోవాలనుకున్నాడు సారంగపాణి. నాన్న అద్దె ఇంట్లో ఉండబట్టే కదా... అనాధ శవమైపోయాడు.

నాన్న గుర్తొచ్చినప్పుడల్లా ఆ బాధ సారంగపాణి గుండెల్ని మెలితిప్పేస్తుంటుంది. సొంతింటి అవసరాన్ని గట్టిగా గుర్తుచేస్తుంటుంది.

"మొత్తానికి మన సారంగపాణి ఓ ఇంటివాడయ్యాడు..." జీవితంలో మొదటిసారి చెవుల్లో అమృతం పోసినంత తీయగా ఆ మాటల్ని విన్నాడు సారంగపాణి. 'ఓ ఇంటివాడయ్యాడు...' చుట్టూ చేరినవాళ్ళంతా పొగుడ్తుంటే... ఒళ్లు పులకరించిపోయింది. పట్టరాని ఆనందంతో పొంగిపోయాడు సారంగపాణి. ఉదయాన్నే కొత్తింట్లో గృహప్రవేశం జరిగిపోయింది. ఇక, ఇపుడు సత్యనారాయణ వ్రతం చేసుకోవడమే మిగిలింది. బంధువుల్తో ఇళ్లంతా కిటకిటలాడ్తూ పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఇంటిగడపలకు పసుపు రాసి కుంకుమబొట్లతో తీర్చిదిద్దారు.

అంతేనా... పచ్చపచ్చగా మామిడితోరణాలు కట్టారు. వెల్లవేసిన గోడలేమో... కొత్త సువాసనల్తో అలరారుతున్నాయి. ఎర్రపంచె కట్టుకున్న పంతులుగారు వచ్చారు. వ్రతానికి కావాల్సిన వస్తువుల్ని అడిగి మరీ అందుబాటులో పెట్టుకుంటున్నారు.

"ఏమండీ... ఇక్కడున్నారా? మిమ్మల్ని ఈ పంచె కట్టుకోమన్నారు పంతులుగారు. సత్యనారాయణ వ్రతం కదా!" గతరాత్రే అర్ధాంగిగా తన జీవితంలోకి అరుదెంచిన సౌజన్య అందించిన పంచె అందుకున్నాడు సారంగపాణి.

అపుడతని వయసు పాతికేళ్ళు. బ్రహ్మచారి పెళ్ళిచేసుకుంటే ఇల్లాలొచ్చి ఓ ఇల్లు ఏర్పడుతుందని అపుడు తెలుసుకున్నాడు. ఇంకా అంతగా జన సంచారం లేని కొత్తగా డెవలప్ అవుతున్న శివారు ప్రాంతంలో రోడ్ సైడు కార్నర్ లో ఓ చిన్ని ఇల్లు. ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే ముందుగా ఓ హాల్. రెండు గదులు. ఓ కిచెన్. ఇంటి ముందు వాకిలి. వెనుక పెరడు. పెరట్లో ఇంటి అవసరాలకు పనికొచ్చేలా కూరల మొక్కలు. వాకిట్లో పరిమళాలు వెదజల్లే మల్లె, మరువం, గులాబీలాటి కొన్ని పూలమొక్కలు... ఆ ఇంటి చుట్టూ ప్రహారిగోడ. మధ్యలో చిన్న గేటు. ఆ గేటుకి ఈ పక్క నల్లటి పలకపై మిలమిల మెరిసే అక్షరాలు... 'సారంగపాణి'. అల్లంత దూరం నుంచి ఆ అక్షరాల్ని అదేపనిగా, తదేకంగా చూస్తూ ఇక, ఆనందం పట్టలేక దగ్గరకొచ్చి చేరుమాలుతో ఆ నల్లపలకకు అంటిన దుమ్ముని తుడిచేస్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు ఖచ్చితంగా సారంగపాణే.

ఎంతో శ్రద్ధగా పంతులుగారు సత్యనారాయణస్వామి కథ చెప్తుంటే... వింటూ ఇదే కథని తను కట్టుకునే సొంతింట్లో వినాలనే తాపత్రయంతో సారంగపాణి అలా కలలోకి వెళ్ళిపోయాడు.

రోజులు గడిచిపోతున్నాయి. రోజురోజుకీ సారంగపాణికి వయసు పెరుగుతోంది. ఆయన సొంతింటి కలకి కూడా.

ఈమధ్యే నాన్నని వెతుక్కుంటూ అమ్మ వెళ్లి పోయింది. ఇంట్లోకి కొత్త తరం వచ్చింది. పాప, బాబు. వాళ్ల చదువులు, ఫీజులు... అన్నీ ఆ జీతం డబ్బుల్తోనే. ఓ పక్క అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న ఖర్చులు. పాప డిగ్రీ చదువైపోగానే పెళ్లి పీటలలెక్కింది. ఆ ఖర్చుసారంగపాణి తట్టుకోడానికి సారంగపాణి అప్పు చేయాల్సివచ్చింది. పరిస్థితులు చూస్తుంటే... సొంతింటి కల ఈ జన్మకి నెరవేరేటట్లు కనిపించడం లేదు. అయినా, ఎక్కడో ఏదో చిన్న ఆశ.

ఉద్యోగం నుంచీ రిటైరైపోయేలోగా ఎక్కడో ఏమూలో కనీసం వంద గజాల స్థలంలో ఓ పూరిపాకైనా వేసుకోవాలనే ఆశ. సారంగపాణి ఆఫీసుకెళ్లి వస్తూ భూముల ఆరాలు తీసేవాడు. ఏయే ప్రాంతాల్లో భూములు ఎంతెంత ధరలు పలుకుతున్నాయో తరచి తరచి తెలుసుకునేవాడు. అయితే, అపార్ట్ మెంట్ కల్చర్ కి సారంగపాణి విరుద్ధం. పిచ్చుకగూళ్ళలా ఉండే ఆ ఫ్లాట్ లలో జీవితం ఊపిరాడక ఉక్కిరిబిక్కిరిగా ఉంటుందనేవాడు. సిటీలో ఎక్కడ చూసినా భూముల ధర ఆకాశాన్నంటుతోంది. కొనడం మాట దేవుడెరుగు. విన్లేని పరిస్థితి కూడా. చుక్కల్నంటే ఆ ధరల్తో భూమి కొని సొంతిల్లు కట్టుకోవాలంటే... ఈ జీవితం, జీతం చాలదని తేలిపోయింది. ఎంత పొదుపుగా ఉండి, ఎన్ని చీటీలు కట్టినా సొంతింటి కల సాకారం కావాలంటే మరో జన్మ ఎత్తాల్సిందేననే నైరాశ్యం నానాటికీ సారంగపాణిలో కలుగుతోంది. లోకంలో తనసొంతానికి ఓ ఇల్లు ఉందనిపించుకోవడం ఎలా... ఎలా? అవే ఆలోచనల్తో రాత్రుళ్ళు నిద్రకు దూరమవుతున్నాడు. ఒకవేళ ఏ అర్ధరాత్రో, అపరాత్రో నిద్రలోకి జారుకున్నా పలవరింతల్తో లేచి కూచునేవాడు. ఆయనగారి కలవరింతలకి హడలిపోవడం అలవాటైపోయిందామెకి. ఆ వెంటనే, గ్లాసుడు మంచినీళ్లిచ్చి కలవరింతల కారణం అడిగేది. విషయం చెప్పలేక సారంగపాణి సిగ్గుపడిపోయేవాడు.

సారంగపాణి ఈమధ్య ఆఫీసునుంచి ఆలస్యంగా ఇంటికి చేరుకుంటున్నాడు. ఎంత లేటైనా ఏడున్నరకల్లా ఇంట్లో ఉండేవాడు. అయితే, రాన్రాను ఎనిమిది, తొమ్మిది గంటలవుతోంది. ఉండబట్టలేక కారణం ఆరాతీసింది సౌజన్య."ఆ చివర్నుంచీ ఈ చివరిదాకా నగరం ఈదాలిగా..." ఆన్సరిచ్చేవాడు సారంగపాణి. అంతలోనే నవ్వుతూ -"సిటీ బాగా ఇరుకైపోయింది. రోడ్లు పట్టనన్ని వెహికల్స్ వచ్చాయి... ఇక్కడికి వలసలు పెరిగాయి. ఎక్కడెక్కడ్నుంచో లక్షల్లో జనాలు వచ్చిచేరారు. దాంతో అడుగడుగునా ట్రాఫిక్ జాంలే. రెడ్ సిగ్నల్సే. ఓ ఫర్లాంగు దూరం అధిగమించాలంటే అరగంట దాట్తోంది..." వింటోంది సౌజన్య.

"మనమూ ఏ కొండకోనలకో వలసవెల్లిపోవాల్సిందే. ఇక, ఈ సిటీలో ఏమాత్రం బతకలేం. నెల్లాళ్లు కష్టించి సంపాదించిన జీతం రాళ్లలో పావు వంతు ఇంటద్దెకే పోతోంది..." చెప్పేసాడు సారంగపాణి. ఆమె మధ్య తరగతి గృహిణి. సారంగపాణి మాటల్ని అర్ధం చేసుకోవడం... దానికి తిరిగి సమాధానం చెప్పడం ఆమెకి తెలియదు. ఓరోజు సారంగపాణి ఆనందంగా ఇంటికి వచ్చాడు. చేతుల్లో స్వీట్ బాక్స్.

"ఏంటీ సంగతి ?" భర్త మొహంలో సంతోషాన్ని చూస్తూ అడిగింది సౌజన్య .

"శుభవార్తే ... మనం ఇంటి వాళ్ళమవుతున్నాం ... " చెప్పాడు

"ఏంటీ ... మళ్ళీ చెప్పండి " అర్ధం కానట్టు మొహం పెట్టి అడిగింది సౌజన్య .

"పిచ్చి మొద్దూ .... నేను చెప్తోంది నిజమే . ఇన్నాళ్ళ సొంతింటి కల సాకారం అవబోతోంది. అంటే, మనం జమీందార్లం అవుతున్నామన్నమాట ... "

"జమీందార్లమా .... ?" ఆశ్చర్యంగా చూసింది సౌజన్య .

జమీన్ అంటే అర్ధం తెలీక అలా అడుగుతున్నావ్ . జమీన్ అంటే భూమి. కించిత్ స్వంత భూమి వుంటే జమీందారన్నమాటేగా.... మనకూ ఓ చిన్న స్థలం, ఆ స్థలంలో మనిద్దరం సౌకర్యవంతంగా ఉండేలా ఓ చిన్నిల్లు ... చెప్తూ ఆనందపడిపోతున్నాడు సారంగపాణి.

"అన్నట్టు .... ఆ ఇల్లు నీకూ నచ్చుతుంది ... " నమ్మకంగా చెప్పాడు సారంగపాణి.

"అవునా ...?" అంది సౌజన్య.

ఆ మర్నాడు, ఆఫీసుకి సెలవు పెట్టి మరీ తీసుకోబోతున్న స్థలం చూపించేందుకు సౌజన్య తో బయలుదేరాడు సారంగపాణి . అదో మారుమూల పల్లెటూరు. ఆ ఊరు చేరేందుకు అందుబాటులో వున్న అన్ని రకాల వాహనాలు వినియోగించాల్సి వచ్చింది . ముందు బస్సు, తరవాత రైలు, ఆ తరవాత అడ్డంగా వున్నా ఏరుని దాటేందుకు పడవ... అంతేనా , ఆ తరవాత రెండు కిలోమీటర్ల దూరం కాలినడక .

వంటినిండా భూదేవి సింధూరం పూసుకుందా ... అనిపించేలా ఎర్రమట్టి రాదారిలో నడిచి వెళ్ళారిద్దరూ .

"ఇంకెంత దూరం ..??" నడవలేక అలసిపోయినట్లు కనిపించింది సౌజన్య .

"ఇంకెంత ... దగ్గరే .... " అంటూ చక చకా నడిచేస్తున్నాడు సారంగపాణి. ఆ ఊళ్ళో వంద గడపలు లేవు. చూడ్డానికి చిన్నపాటి ఇళ్ళు కూడా లేవు. అన్ని పాకలే . రెళ్ళు గడ్డి పరచిన ఫై కప్పులే .

ఎత్తైన ఏటవాలు కొండపైకి తీసుకెళ్తున్నాడతడు. "ఇంకా ఎక్కడికి..?" మనింటి దగ్గరకే .... అని కొండ ఫై భాగానికి తీసుకెళ్ళాడు. అంత పైన వరుసగా కొన్ని పాకలున్నాయి . చుట్టూ దడి వేసి మొక్కలతో కట్టిన కంచె . ముందు వాకిలి . వెనుక కాస్తంత ఖాళీ జాగా .

ఆచ్చం పర్ణశాల లాగా వుంది కదూ.. ఉద్యోగ జీవితం అయిపోయాక ఎలాగో అంత అద్దెలు పెట్టి ఆ సిటీ లో ఉండలేము. అలాగనీ ఏ శివార్లలో స్థలం కొందామన్నా అది ఈ జన్మకి తీరే కల కాదు. ఆలోచించి ఆలోచించి ... ఇదిగో ఈ నిర్ణయానికి వచ్చా. ఇక్కడెంతో ప్రశాంతంగా వుంటుంది. ధ్వని, వాయు, జల కాలుష్యాలు అసలుండవు. అన్నింటికి మించి ... ప్రతీక్షణం ప్రత్యక్ష ప్రసారాల గోల వుండదు. అంతేకాదు ఇక్కడంతా ఎవరి కూరగాయలు వాళ్ళే పండించుకుంటారు. వాకిట్లో పూలమొక్కలు వేసుకుంటారు. పెరట్లో బీర, చిక్కుడు, దొండ, గుమ్మడి పాదులు వేసుకుంటారు. అంతేనా .... స్వచ్చమైన గాలి , వెలుతురూ, అంతకుమించి చిక్కని గేద పాలు దొరుకుతాయక్కడ. అంటే ... స్వచ్చమైన జీవితం అందుకోవచ్చన్నమాట ...

నగర జీవితానికి దూరంగా కొండకోనల్లో వుందాప్రాంతం. అత్యాధునిక సౌకర్యాలు లెవ్వు కాబట్టి అక్కడ వుండే జనాలు తక్కువే. పల్లెపల్లెల్నుంచీ పట్టణాలకు వలస ఎక్కువైపోయింది. ఫలితం ... గువ్వలెగిరిపోయిన తరవాత ఖాళీ అయ్యి బావురమంటున్న గూడులా పల్లె తల్లడిల్లుతోంది. సారంగపాణి ఆ విషయమే చెప్తూ ... "నిజానికి ఇవీ జనవాసాలే. ప్రజలు కరువై వెలితిగా కనిపిస్తున్నాయి అంతే " సౌజన్య వింటోంది ...

భర్త చెప్తున్న దాంట్లో వాస్తవముంది అనిపించింది. "ఇంకా ఉద్యోగం వుంది కాబట్టి సిటీలో ఉండాల్సివస్తోంది. ఆ తరవాత అక్కడుండే అవసరమే లేదు . ఎక్కడో అక్కడ బతికున్నన్నాళ్ళూ ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. ఉండాలి... " సారంగపాణి అన్నాడు. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే ఈ కొండ కొనల్లోనే బ్రతకాలి. నగర పుత్రులుగా కాకుండా గిరిపుత్రులు గానే బ్రతకాలి. ఇంత జీవితం చూసిన తరవాత నాకు అనిపించింది ఇదే.

ఆయన మాటలకు ఒక్క నవ్వుతోనే వత్తాసు పలికింది సౌజన్య .... అది ఇష్టమో .. అయిష్టమో తెలుసుకోలేక పోయాడు సారంగపాణి.

ఆర్నెల్ల తరవాత -

సారంగపాణి , సౌజన్య ల కృషి అక్కడ కనిపించింది. వాళ్ళిద్దరూ వాకిట్లోకి రాగానే ఆత్మీయంగా పూలమొక్కలు ఆహ్వానం పలికాయి. ఇక పెరట్లో ఆకుపచ్చదనం వెల్లివిరుస్తూ కూరల మొక్కలు 'రా... రమ్మం'టూ పిలుస్తున్నాయి.

మరిన్ని కథలు

Kokku pandi
కొక్కుపంది .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Varsham kosam
వర్షం కోసం
- తాత మోహనకృష్ణ
Konaseema kurradu
కోనసీమ కుర్రాడు
- సిహెచ్. వి. యస్. యస్. పుల్లంరాజు
Marchery lo muchhatlu
మార్చురీలో ముచ్చట్లు
- మద్దూరి నరసింహమూర్తి
Chaitanya sravanthi
చైతవ్య స్రవంతి
- బి.రాజ్యలక్ష్మి
Kurukshetra sangramam.3
కురుక్షేత్ర సంగ్రామం.3.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kurukshetra sangramam.2
కురుక్షేత్ర సంగ్రామం.2.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kurukshetra sangramam.1
కురుక్షేత్ర ససంగ్రామం.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు