తీరిన సందేహం - జయదేవ్

teerina sandeham telugu story

ఒక ఋషి అనేక సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేసి చాలించుకుని, తన స్వస్థలానికి బయల్దేరాడు, అలా నడుస్తూ నడుస్తూ ఒక గ్రామం చేరుకున్నాడు. బాగా అలిసిపోయిన ఆ ఋషి ఒక ఇంటి ఖాళీ అరుగు చూసి సంతోషించాడు. అరుగుమీద తోలు పరిచి చతికిలబడ్డాడు.

కాసేపటికి అటువేపుగా ఒక శవం ఊరేగింపు జరుగుతోంది. ఇంట్లోని యజమానురాలు, దొడ్లో పనిచేసుకుంటున్న పనిపిల్లని కేకవేసింది. "ఒసేవ్... మన ఇంటి మీదుగా ఏదో శవం ఊరేగుతోంది. ఆ చనిపోయిన వాడు, స్వర్గానికి వెళతాడో... నరకానికి వెళతాడో చూసి చెప్పవే..." అనడిగింది.

పనిపిల్ల బైటికి వచ్చి చూసి, "అమ్మా... ఆ చనిపోయిన మనిషి నేరుగా నరకానికి వెళ్తున్నాడు!" అని చెప్పి లోనికి వెళిపోయింది.

ఋషి ఆశ్చర్యపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తి నేరుగా నరకానికే వెళతాడని ఈ పనిపిల్ల ఎలా చెప్పగలిగిందబ్బా అని ఆలోచిస్తూ, నిద్రకుపక్రమించాడు.

కాసేపు, అటువేపుగా మరో శవం ఊరేగింపు జరిగింది. మళ్ళీ ఇంట్లోని యజమానురాలు, లోపట్నుంచే పనిపిల్లని పిలిచి, శవాన్ని చూసి, ఆ మనిషి స్వర్గానికి వెళతాడో,, నరకానికి వెళతాడో తెలుసుకుని చెప్పమంది. పనిపిల్ల బైటికి వచ్చి చూసి, "అమ్మా... ఈ మనిషి కూడా నరకానికే వెళతాడని చెప్పి లోనికి వెళిపోయింది.

ఋషి ఈ సారి మరింత ఆశ్చర్యపడి పోయాడు. మనిషి మరణాంతరం పోయేది స్మశానానికే. ఆ తర్వాత ఎక్కడికి పోతాడో సమాధానం తెలియకనే కదా ఋషులూ, మునులూ తపస్సులు చేస్తారు. తనూ తపస్సులు చేశాడు. ఐతే తనకింతవరకూ సమాధానం దొరకలేదు. ఈ పనిపిల్ల అంత జటిలమైన ప్రశ్నకి అతి సునాయాసంగా బదులు చెప్పిందే... అంతు పట్టలేదే... అనుకుంటూ వుండగానే అటువేపుగా మరో శవం ఊరేగుతోంది. ఈ సారి పనిపిల్ల ఏం సమాధానం చెబుతుందో చూద్దాం అని ఋషి ఆదుర్దాగా లేచి కూచున్నాడు.

ఎప్పట్లా, ఇంటి యజమానురాలు పనిపిల్లనడిగింది. పనిపిల్ల బైటికి వచ్చి చూసి, "అమ్మా... ఈ మనిషి స్వర్గానికి వెళుతున్నాడమ్మా..." అని సంతోషంగా పలికి వెనక్కి వెళ్ళబోయింది.

ఋషి జుట్టు పీక్కోడం ప్రారంభించాడు. తమాయించుకుని పనిపిల్లకేసి, "తల్లీ... నేను ఎన్నాళ్ళో కొండల్లో, కోనల్లో, తపస్సు చేశాను. ఏదో సాధించాననుకున్నాను. ఐతే... ఇందాక ఇటువేపు మూడు శవాలు స్మశానం వైపుకి ఊరేగడం చూశాను. ఆ మరణించిన వ్యక్తులు స్వర్గానికి వెళతారా, నరకానికి వెళతారా అనే ప్రశ్న నా మదిలో తట్టనేలేదు, సరికదా, వాళ్ళల్లో మొదటి ఇద్దరూ నరకానికీ, మూడో వ్యక్తి స్వర్గానికీ వెళతారనీ నా ఊహక్కూడా అందని విషయాన్ని నువ్వు అతి సుళువుగా చెప్పావు! ఏమిటి నీ శక్తి? నువ్వు సామాన్యురాలివిగా కనిపించినా, నీలో ఏదో అపూర్వజ్ఞానం దాగి వుంది. దయతో నాకు చెప్పు. నా సందేహాన్ని తీర్చు...!"అని ప్రాధేయపడి అడిగాడు.

పనిపిల్ల ఋషిని చూసి, చిరునవ్వు నవ్వి, "సామీ... నా దగ్గర అట్లాంటి శక్తులేమీ లేవు! ఆ చచ్చిపోయిన వాళ్ళని నువ్వూ చూశావ్ గా? మొదటి శవాన్ని నలుగురే నలుగురు మోస్తే, ఒక్కడే ఒక్కడు డప్పు వాయిస్తూ, పరుగు పరుగున స్మశానానికి తీసుకు వెళ్లారు. రెండో శవం కూడా అదే వరస. ఆ ఇద్దరూ ఎంత చెడ్డోళ్ళు కాకపోతే, శవాల వెనక ఒక్కడైనా నడవలేదు! అదే ఆ మూడో శవం ఊరేగింపు చూశానా. పూల పాడె కట్టి, దండలేసి, అంతమంది జనం ఆ మనిషిని స్మశానానికి తీసుకువెళ్ళారు. అతడు మంచి మనిషి కాబట్టేగా... చెడ్డోళ్ళు నరకానికి వెళతారు. మంచోళ్ళు స్వర్గానికే వెళతారు! నీకు తెలీదా?" అని కిలకిలా నవ్వి లోనికి వెళ్ళిపోయింది!మరిన్ని కథలు

Manninchumaa
మన్నించుమా!
- రాము కోలా.దెందుకూరు.
Bandham
బంధం
- B.Rajyalakshmi
Desam kosam
దేశం కోసం
- కందర్ప మూర్తి
Sutakapu manishi
సూతకపు మనిషి
- రాము కోలా.దెందుకూరు
Guru dakshina
గురుదక్షిణ
- పిళ్లా కుమారస్వామి
Telivi okkate chaladu
తెలివి ఒక్కటే చాలదు
- శింగరాజు శ్రీనివాసరావు
Angla nadaka pingla nadaka
అంగ్ల నడక-పింగ్లనడక.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.