పలుకే బంగారమాయెనా! - సి. ఉమాదేవి

paluke bangaramayena

కారు గ్యారేజిలో పార్క్ చేసి కీ చెయిన్ సుతారంగా తిప్పుతూ కాలింగ్ బెల్ కొట్టాడు అభినవ్. సునీల వస్తున్నట్లు అలికిడేమిలేదు. అనుమానంగా తలుపుతోసాడు. తెరుచుకుంది. అప్పటికే కారు వచ్చిన శబ్దంవిని గబగబా తలుపు తీసి సునీల మళ్లీ లోపలకు పరుగెత్తింది.

"ఓ! డ్రెసింగ్ టేబుల్ దగ్గర నగిషీలు ఇంకా పూర్తి కాలేదా? ఇలా అయితే రిసెప్షనుకు మనమే చివరి అతిథులవుతాం."

"నేనున్నది డైనింగ్ టేబుల్ దగ్గర. నా నగిషీలకేమొచ్చెగాని జ్యూస్ తాగి మీరు త్వరగా తయారవండి."

"నాదెంతసేపు? పదినిమిషాలే!"

"సరే... సరే, మీరు రెడీ అయేసరికి నేను కారులో ఉంటాను. సరేనా!" నవ్వుతూ తనను తాను మరోసారి అద్దంలో చూసుకుంది. మంగళసూత్రంలో అల్లుకుపోయినట్లున్న
నల్లపూసల గొలుసు, ఎడమచేతీకి వాచీ, కుడిచేతికి ఒకగాజు. చిన్న కమ్మలు నల్ల పూసలవి. తృప్తిగా తలపంకించింది.

తయారై కారు దగ్గరకు వచ్చిన అభినవ్ భార్యవైపు ఆశ్చర్యంగా చూసాడు.

"ఎప్పుడో పుట్టబోయే పాపాయికి నీ నగలు దాచిపెట్టావా? రిసెప్షనుకు చక్కగా వేసుకోవచ్చుగా! నువ్విలా వస్తే నన్ననుకోగలరు పిసినారి భర్త నగలేమి కొనివ్వడంలేదేమోనని!"

"నిజమే కదా!" కిసుక్కున నవ్వింది సునీల.

"ఆ...!" నోరు తెరిచాడు అభినవ్.

"లేకపోతే ఏమిటండీ నేనెప్పుడైనా నగలు అడిగానా? అయినా నాకిలా ఉండటమే ఇష్టం."

"కాని పదిమందిలో..."

"ఏమవుతుంది? ఖాళీ కుండలనుకుంటారు. మనకేం నష్టం."

"నేను నిన్ను ఒప్పించనులేను, నొప్పించనులేను. పద."

కారు రిసెప్షన్ హాల్ చేరుకుంది. అభినవ్ కారు పార్క్ చేసి వచ్చేదాకా సునీల ఓ వారగా నిలుచునే ఉంది.

"ఏంటలా దూరంగా నిలుచున్నావు? మనం వచ్చింది అమ్మాయిని, అబ్బాయిని ఆశీర్వదించడానికే కాదు ఇక్కడకు వచ్చిన మన పరిచయస్థులను పలకరించుకోవడానికి, కొత్త పరిచయాలు ఏర్పరచుకోడానికి, కబుర్లు చెప్పుకోవడానికి కదా!"

"నేను కాదన్నానా పదండి... మీతో కలిసి వెళ్దామని ఆగాను."

"ఓ.కే! మరి చూడు తెలిసినవారు కనబడతారేమో... ఉరుకులు పరుగుల జీవితంలో పలకరింపులు లేవు. మాటల కలబోతలు లేవు. కనీసం ఇలాంటి చోటునన్నా నలుగురితో కలిసే అవకాశం వస్తుంది."

బెరుకు బెరుగ్గా నిలుచున్న భార్యను చెయ్యి పట్టుకుని లోపలకు నడిచాడు.

తెలిసినవారు ఉండకపోతారా అని చుట్టూ పరికించి చూసాడు అభినవ్.

హాలుకన్నా బయట ఆవరణలోనే చేసిన అలంకరణ మరింత ఆకర్షణీయంగా ఉంది. వృక్షాలపై పరచుకుంటున్న విద్యుద్దీపాల సప్తవర్ణాలు, కృత్రిమ జలపాతాలు, కుటుంబమంతటికీ సరిపోయేలా కుర్చీలు వేసిన రౌండ్ టేబిళ్ళు. వాటిపై అమర్చిన పూల సువాసనలు గృహస్థు హోదాను వెదజల్లుతున్నాయి. కొందరు సూప్ తాగుతున్నారు. కొందరు సలాడ్స్ ఆస్వాదిస్తున్నారు. పిల్లలు బెలూన్లను కట్టినచోట ఉంచకుండా లాగుతూ, టప్ మనిపిస్తూ నవ్వులు పంచుతున్నారు. వారు అందంగా అలంకరించిన బెలూన్లతో అల్లరి చెయ్యడం ఇబ్బందిగా ఉన్నా సరదాగాను ఉంది. పిల్లలకదో ఆటవిడుపు అనుకున్నాడు అభినవ్.

సూప్ బౌల్ పట్టుకుని తనను గమనించకుండా వెళ్తున్న రాంబాబుని చెయ్యి పట్టుకుని ఆపాడు అభినవ్.

"చాలా సేపయిందా వచ్చి... కనబడలేదే..." అడిగాడు రాంబాబు.

"లేదురా... పది నిమిషాలయింది వచ్చి. స్టేజి మీదకు పెళ్లి జంట ఇంకా రాలేదే?" నవ్వుతూ అడిగాడు అభినవ్.

"ఆ పనిమీదే ఉంది మా ఆవిడ. చీర కట్టించడం, నగల అలంకరణ అయిందో లేదో!"

"అంతదాకా అబ్బాయికి నిరీక్షణ తప్పదు కదా!" అభినవ్ మాట పూర్తయేలోగానే, "అదిగో వస్తున్నట్టుంది." భార్య వస్తున్న వైపు చూసాడు రాంబాబు.

సునీల, అభినవ్ కుతూహలంగా అటు తిరిగి చూసారు.

అలంకరించుకున్న నగలు దూరానికే కనబడుతున్నాయి. అంటే తూకం, ధర రెండు బరువైనవే! బంగారు శిల్పమే నడచివస్తున్నట్లుంది. అప్రయత్నంగా అభినవ్ చూపులు భార్యవైపుకు మరిలాయి. 'ఇదొక ముసలమ్మ!' మనసులోనే విసుక్కున్నాడు.

అమ్మాయి, అబ్బాయి కూర్చున్నాక రాంబాబు భార్య సరిత స్టేజి దిగి నవ్వుతూ రాంబాబు దగ్గరకు వచ్చింది. 'రండి అక్షింతలు వేసొద్దాం' అంటూ.

"సరే అలాగే వెళ్దాం, కాని ముందు నా స్నేహితుడని పరిచయంచెయ్యనీ,

వీడు నా క్లాస్ మేట్, రూం మేట్ కూడా. అభి అంటాం అంతా. వారు అభినవ్ శ్రీమతి, పేరు..." ఆగాడు రాంబాబు.

పరిచయానంతరం నమస్కరిస్తూనే 'నా పేరు సునీల అండి' అంది సునీల నవ్వుతూ.

ప్రతినమస్కారం చేస్తూనే సరిత, సునీల చెవులు, చేతులు, కంఠం చూపులతోనే తడిమింది. ఆ చూపులకర్థం సునీలకు తెలుసు.

పరిచయాలు పెంచుకోవాలి కదా అనుకుంటూనే, దానికి నాందిగా,

"మీరెక్కడుంటారు?" అడిగింది సునీల.

దానికి సమాధానం వచ్చేలోగానే,

"హాయ్ సరితా! ఏమ్మా పెళ్లికూతరి అలంకరణ ఇంతసేపు చేసావా లేక నీ సింగారము జతకలిపావా? వజ్రాల లాకెట్ తిరగబడింది చూడు. (వజ్రాలేనా లేక... మనసులో సందేహం!)" సరిత లాకెట్ సారు చేసింది సరిత స్నేహితురాలు. చేతికి తూకం తగిలి అమ్మో అనుకుంది. నిజంగా వజ్రాలయితే నేటి ధరల్లో నాలుగు లకారాలే అనుకుంది.

"వాళ్లు వరంగల్ లో ఉంటారు. పెళ్లికి వచ్చారు." అభినవ్ భార్య ప్రశ్నకు బదులిచ్చాడు.

"పదండి ఆశీర్వదించి వద్దాం. మళ్లీ బఫేలో ఆలస్యమవుతుంది."

రాంబాబును, సరితను అనుసరించారు అందరూ. క్యూ పెరుగుతోంది. అయితే ఎవరు క్యూ తప్పి వెళ్ళడం లేదు.

పరిశీలనకు కావలసిన సమయం దొరికింది. సునీల ముందు ఓ నలభై ఏళ్ల స్త్రీ నిలుచునుంది. రంగురాళ్ల గని వాళ్ల పుట్టిల్లనిపించేలా ఉంది. అందరికి తెలిసిన కెంపులు, పచ్చలుగా అనిపించడం లేదు. అయితే విద్యుద్దీపాల కాంతుల నడుమ మరింత మెరుపులు కురిపిస్తున్నాయి.

"ఎక్కడకొన్నారు ఈ నెక్లెస్ ను?" సరిత ఠక్కున అడిగింది. పలకరించాలంటేనే మొహమాట పడే సునీల సరిత మాటలకు ఉలిక్కిపడింది.

"ఇక్కడిది కాదు." ఆవిడ కళ్లలో కించిత్తు గర్వం.

"అవును అనుకున్నాను అప్పుడే, మరి..."

"బ్యాంకాక్ నుండి తెచ్చాను."

"మీరు వెళ్ళారా?"

"మరే. హాలిడే ట్రిప్ మాది. చక్కగా అవీ ఇవి చూసి షాపింగ్ గుర్తుగా మా అమ్మాయికి బ్రేస్ లెట్, నాకు ఈ నెక్లేస్ తెచ్చుకున్నాము."

"బ్రేస్ లెట్టా!" ఆసక్తిగా అడిగింది సరిత.

"అదిగో మా అమ్మాయి కూడా వేసుకునే వచ్చింది."

"రజనీ ఇలారా!" కూతురిని పిలిచింది ఆవిడ.

అందరు ఆసక్తిగా 'ఎవరా రజని' అన్నట్టు చూసారు.

తల్లి పిలుపుకు 'ఏమ్మా' అంటూ వచ్చింది సన్నగా మెరుపుతీగలా ఉన్న అమ్మాయి.

"ఈ ఆంటీకి నీ బ్రేస్ లెట్ చూపించు."

"నేనందుకే వేసుకోనన్నాను. ఇలా ప్రదర్శనకు పెట్తావనే." అ అమ్మాయి అందంగా గొణిగింది.

"అరె నలుగురికి చూపకపోతే ఎలా తెలుస్తాయి డిజైన్లు."

క్యూలో ఉన్న ఆడవాళ్లు అందరు రజని చేతికున్న బ్రేస్ లెట్టే కాదు తల్లి మెడలోని నెక్లెస్ చూసారు. బ్యాంకాక్ ట్రిప్ ఖర్చుకు ఫలితం దొరికినంత సంబరంగా ఉంది ఆ నగలుకొన్న ఆవిడకు.

"మేము కూడా వెళ్ళాలనుకుంటున్నాము. మీ నంబరివ్వండి మీ నుండి షాపుల వివరాలు ముందుగానే తెలుసుకుంటాము." సరిత చనువుగా అడిగింది.

నంబర్ల మార్పిడి జరిగి పరిచయాలు జరుగుతున్నాయి.

'ఇందుకా పరిచయాలు పెంచుకోమన్నాడు అభి' అని మనసులోనే నవ్వుకుంది.

అందరికి పిల్లల బెలూన్ల ఆట కన్నా ఈ నగల సంబరం బాగుందనిపించింది.

పెళ్లికూతురుకు ఫోటోల ఫోజులను సూచిస్తోంది సరిత. మరి ఆల్బంలో కలకాలం అందంగా చూసుకోవాలంటే ఓర్పుగా నిలఫడి ఫోటోగ్రాఫరు చెప్పినట్టు వినాలి.

అటు ఇటు చూస్తున్న అభినవ్ కు క్యూ చివర వచ్చి నిలుచుంటున్న స్నేహితుడు వాసు కనిపించాడు.

"ఇటు... ఇటురా వాసు!" అభినవ్ గొంతు గుర్తుపట్టి శ్రీమతితో సహా అభినవ్ దగ్గరకు వచ్చాడు. తన భార్యను పరిచయం చేసాడు వాసు. భార్య పేరు రమణి అని, డిగ్రీ చదివిందని చెప్పాడు.

"మీరు కూడా నాలానే ఖాళీగా ఉంటారా..." కనీసం ఫోను పరిచయమైనా పెంపొందించుకోవచ్చనుకుంది సునీల.

"ఖాళీనా! అస్సలు లేదు... టైమే చాలదు."

ఎందుకన్నట్లు ఆశ్చర్యంగా చూసింది సునీల.

"ఇంట్లో చీరలు అమ్ముతుంది. నగలు కూడా!" వాసు గర్వంగా చెప్పాడు.

కష్టమరు దొరుకుతుందన్న ఆశ రమణిలో!

"ఏరా బంగారం కొనడం లేదా?"

వాసు గబుక్కున అలా అడిగేసరికి అభినవ్ కు ఇబ్బందిగా అనిపించింది.

"తగ్గితే కొందామని..." ఇదంతా నీవల్లే అన్నట్టు సునీల వంక చూస్తూ అన్నాడు.

అయ్యో రామ! బంగారం ఎంత తగ్గుతుంది? ఎప్పుడు తగ్గుతుంది? తగ్గినా మళ్ళీ పెరుగుతుంది. అయినా మనమేమి కిలోలు కొంటామా?

'ఎంత స్నేహితుడైనా ఇంతమందిలో ఇలా' సునీలకు ఇబ్బందిగా ఉంది.

కొత్త జంటను అక్షింతలు చల్లి ఆశీర్వదించారు అభినవ్, సునీల.

ఇక బఫేలో క్యూ మొదలయింది.

"హలో సునీలగారు అనుకోకుండా మీరేమిటి ఇలా! అమ్మాయి వైపా, అబ్బాయి వైపా?"

"ఇద్దరివైపును." నవ్వింది సునీల.

"ఎలా?"

"ఏముంది ఇద్దరు మా ఆఫీసులోని వారే!" అభినవ్ చెప్పాడు.

"వీరు నా ఫ్రెండ్స్ భార్గవి, అపర్ణ. వీరు మావారు." పరిచయం చేసింది సునీల.

సరిత, రాంబాబు కూడా వచ్చి చేరారు.

"అదేమిటి అభి అప్పుడే ఐస్ క్రీంలో కొచ్చారు. తిన్నారా అన్నీ! అంటే అన్నీ రుచి చూసారా?" రాంబాబు నవ్వుతూ అడిగాడు.

"అదే బఫేలలోని బలహీనత. అన్నీ రుచి చూసి పడేసే వైనం ఎక్కువవుతోంది." సునీల మనసులోనున్నది చప్పున చెప్పడం... అభినవ్ ఆశ్చర్యంగా చూసాడు. మాటకు ముందు బంగారు తరువాత బంగారు అంటుంటే ఇబ్బంది పడిన సునీలకు మాట్లాడటానికి దొరికిన ఒకేఒక సామాజికాంశమది.

"ఎలా వచ్చారు మీరు?" భార్గవిని అడిగింది సునీల.

"ఆటోలో, ఏం నువ్వేమైనా డ్రాప్ చేస్తావా?"

"తప్పకుండా."

"సరే మాకిక భయపడాల్సిన పనిలేదు." సునీల చెయ్యి పట్టుకుంది భార్గవి.

ప్రక్కనే ఏదో చర్చ జరుగుతోంది. చెవి ఒగ్గకపోయినా వినపడాల్సినవి చెవులకు చేరుతూనే ఉన్నాయి.

'చెవిపోగుల కోసం చిన్నారులను ఎత్తుకు పోతున్నారు. దొరికి పోతామేమోనన్న భయంతో ఒక్కొక్కసారి చంపేస్తున్నారు. బంగారం ధర పెరిగాక సంపాదనకు సులభమార్గం ఇదే అనుకుంటున్నారు, నగలు కొన్నంతసేపు ఉండటంలేదు ఆనందం. వేసుకోవాలంటే భయం. ఇంట్లో దాయాలంటే భయం.' ఒక్కొక్కరు ఒకమాట చెప్తున్నారు.

"మరెందుకు కొనడం?" భార్గవి గుసగుసగా అంది.

"ష్! వింటారు, పదండిక వెళ్దాం." అంది సునీల.

స్నేహితురాళ్ళను వారి ఇండ్ల దగ్గర వదిలారు. సునీలను ఆలోచనలు వదిలిపెట్టడంలేదు.

పరిచయాలు పెరగడం కన్నా బంగారమే నేపథ్యంగా మాటలు కలబోసుకోవడం సునీలకు ఆశ్చర్యమనిపించింది.

"ఏంటలా నిలుచున్నావు? పద ఇంట్లోకి! ఇంతకీ ఎలా ఉంది ఫంక్షన్?"

"పలుకే బంగారమాయెనా!" నవ్వింది సునీల.

"ఎందుకు?"... అంటూ తను నవ్వేశాడు అభినవ్.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి