*పల్లె సిగలో చదువు పూలు* - Bhagavathula Bharathi

Read flowers in the countryside

ఆరోజు గురుపూర్ణిమ. రాంబాబు మాష్టారింటి ముందు హడావిడి మెుదలయింది. కలెక్టర్ గారు వస్తున్నారు అని.మాష్టారు ఇంటి చుట్టుపక్కల వాళ్ళూ ఆశ్చర్యం గా చూస్తున్నారు. మాష్టారైతే తబ్బిబ్బు పడుతున్నారు. తను నాటిన మెుక్క మహా వృక్షమై శాఖోపశాఖలై ఎందరికో నీడనిస్తోంది. ఆనందం లో తలమునకలౌతూ గతంలోకి వెళ్ళారు మాష్టారు. ///////// రాంబాబు మాష్టారు మంచి మాష్టారుగా పేరు పొంది ,బదిలీ పై ఆ ఊరుకి వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగి. రాగానే డ్యూటీలో దిగి, *బడిబాట* పట్టారు. అది పల్లెటూరూ, పట్నమూ కానీ, ఓ మోస్తరు గ్రామం. అక్కడ, వ్యవసాయ దారులే గాక, మధ్యతరగతి కుటుంబాల వారూ ఉన్నారు. "బడిబాట" కార్యక్రమం లో భాగంగా, వారి పిల్లలను తమ సర్కారీబడికి పంపమని అడిగారు, వాళ్ళంతా " ఫీజు లెక్కువైనా ,ప్రైవేట్ స్కూల్స్ నయం సర్కారీ బడిలో, టీచర్స్ సరిగా చెప్పరు."~ ఇలాంటి ఎన్నో నిందలూ, ఆరోపణలూ నిష్టూరాలూ మాష్టారి మనసును కలచివేసినాయ్. బీదల జీవనోపాధి కోసం, వారి పిల్లల చదువు కోసం, ప్రభుత్వం ఎంత చక్కటి పధకాలు ప్రవేశపెడుతోందే! అది వీళ్ళదాకా చేరట్లేదా? లేదా వీరికర్ధం కావట్లేదా? లేదా! పధకాల నిధులు దుర్వినియోగమేనా? ఆలోచించిన మాష్టారు ఇంటింటికీ తిరిగి, ప్రభుత్వ పధకాల గురించి అందరికీ బోధిస్తూ వస్తున్నారు. కొంతమంది విన్నారు. సలహాలు తీసుకున్నారు. కొంతమంది "ఈయనకెందుకూ ?చాదస్తం కాకపోతేనూ! ఆ జీతపు రాళ్ళేవో తీసుకుని కడుపులో చల్ల కదలకుండా ఉద్యోగం చూసుకోవచ్చుగా" అన్నారు. ముందడుగు ఎప్పుడూ వెక్కిరింతకు గురౌతుందని మాష్టారుకు తెలుసు. ఆ ఊరిలో కాశయ్య అనే వ్యక్తి చెప్పులు కుట్టుకుంటూ బీదరికంలో ఉన్నాడు. అతని కొడుకు పన్నెండేళ్ళ 'సోము' నల్లగా కఱ్ఱి మెుద్దులా ఉంటాడు. అందుకే అందరూ వాణ్ణి ' కఱ్ఱిసోము' అని పిలుస్తారు. కానీ సోము చాలా తెలివైనవాడు. చదువుసంధ్య మానేసి, రోజుకూలీగా, చెప్పులుకుట్టేపనికీ, వెడుతుండటం, గమనించారు మాష్టారు. ఓ రోజు కాశయ్యను కలిసి "కాశయ్యా! నీ కొడుకు చిన్నపిల్లవాడేగా!? బడికి పంపకూడదా? " అనడిగారు. కాశయ్య "సదువంటే ఆడికీ, నాకూ ఇట్టమేనయ్యా! నా లాగా నా కొడుకు రోజు కూలీ కాకూడదని, మీ సర్కారీ బడిలోనే ఏసినానయ్యా! కానీ కొంతమంది పెద్దోళ్ళు, ఆరిపిల్లలు కొంతమంది, మేంసేసే పని పేరుతో, ఇంకొంతమంది రంగుపేరుతో "కఱ్ఱోడా " అని గేలిసేసినారయ్యా! ఈడు మనసు కట్ట పెట్టుకుని సదూ మానేసినాడయ్యా! నాను కూడా సరేలే! చేదోడువాదోడుగా ఉంటాడులే అని ఊరుకున్నానయ్యా! "అని కళ్ళు తుడుచుకున్నాడు. మాష్టారు "వీళ్ళంతా మట్టిలో మాణిక్యాలు కాశయ్యా! ఇలా ఇంకెవరినైనా ఉన్నారా? " ఆరా తీసాడు. "ఈడే కాదయ్యా! ఆ ఈరన్న కొడుకు, ఆ యెంకన్న కొడుకూ, ఇంకా చాలామంది ఉన్నారయ్యా! ఆరంతా తెలివైనోరే! సదూకుంటే 'కలకటేరు' అయ్యే తెలివయ్యా అని చెప్పాడు. మాష్టారు నవ్వి ఓహో! కలెక్టర్ తెలివా? సూపర్ " అని వారందరి వివరాలూ తెలుసుకుని, వాళ్ళని కలిసి వాళ్ళ పిల్లలందరినీ కూడా కలిపి ఓపదిమంది బ్యాచ్ ని తయారుచేసి, సర్కారీ బడిలో, మధ్యాహ్న భోజనపధకం, ఉచిత, బట్టలూ, పుస్తకాలపంపిణీ పధకం క్రింద, పిల్లలకు అన్నీ ఇప్పించి, తన సొంత పూచీకత్తు క్రింద, పిల్లలను తన దగ్గరే ఉంచుకుని, చదివించడం మెుదలు పెట్టారు మాష్టారు. " శ్రేయాని బహు విఘ్నాని " అన్నట్లుగా మంచిపని చేయాలంటే ఎన్నో ఆటంకాలు. ఆటంకం ఆ ఊరి M, L, A రెడ్డెప్ప రూపంలో ఎదురైంది, మాష్టారుకి. మాష్టారుని ఊళ్ళో అందరూ బాగా గౌరవించడం ,పిల్లలు ఆయన్ని దేవుడల్లే కొలవటం, సహించలేక పోయాడు. M, L, A కొడుకు 'శివ' మరీనూ. సోము ఈడువాడే. ఐనా అదే స్కూల్లో,కొడుకు. బయట తండ్రి, మాష్టారుకి తలనొప్పి లా తయారయారు. రెడ్డెప్ప గవర్నమెంట్ నిధులు, పిల్లలకు, మాష్టారుకీ, చెందకుండా చేయాలని ప్రయత్నిస్తే, 'శివ' స్కూల్ లో, స్థానిక m, L, A కొడుకుననే అహంకారంతో తోటి స్నేహితులను హింసిస్తున్నాడు. ఈ వయసులోనే గ్రూప్ లీడర్ గా చెలాయిస్తుంటే, రేపు భవిష్యత్తు లో, ఏ గూండాగానో, రౌడీగానో~?మాష్టారు నీతివాక్యాలు,కధలు చెప్పిమార్చాలని ప్రయత్నిస్తున్నారు. వినడే! ఓ రోజు స్కూల్లోని తన సహవిద్యార్ధి, 'శేషు' తనను ఎదిరించి మాట్లాడాడాని, కొట్టి, బావిలో పారేసాడు. పిల్లలగోలకి, శేషు తల్లిదండ్రు లు, వచ్చి, పోలీసలకు కంప్లైంట్ ఇచ్చారు, అప్పటికే కొంతమంది, బావిలోకి దిగి, శేషుకోసం వెదికారు. దొరకలా? 'శివ'ని రకరకాలుగా ప్రశ్నించారు .వాడు భయపడి ఏడుపు లంకించుకున్నాడు. రెడ్డెప్ప ను పిలిచారు. పోలీసులతో లాలూచీ పడి, కేసు మాఫీచేయటానికి, అక్కడి పిల్లల ప్రత్యక్ష సాక్యం~ ?"మరి శవం ఏమయిందీ? స్టేషన్ కి వెళ్ళి మాట్లాడుకుందాం, పదండి " పోలీసుల బెదిరింపులు .ఈ వయసులోనే పిల్లవాడు పోలీస్ రికార్డ్స్ లోకి ఎక్కితే? అప్పుడు వచ్చారు రాంబాబు మాష్టారు, రెడ్డెప్ప,తన అహంకారం, పెద్దమనిషి తరహా అంతా మర్చిపోయి "మాష్టారూ! నాగురించి నాకు భయం లేదు. నిమిషాలలో అన్నీ కేసులూ, మాఫీచేసుకోగలను. కానీ 'శివ ' ఒక్కసారి పోలీస్ స్టేషన్ కి వెడితే ~?ఏం మాట్లాడలేక అర్దోక్తి తో ఆగిపోయాడు. మాష్టరు 'శేషూ' అని పిలిచారు. ఎక్కడి నుండో 'శేషు' వచ్చి అక్కడ నిలబడ్డాడు. మాష్టారు నీతివాక్యాల సుదీర్ఘ ఉపన్యాసం ఇవ్వనక్కరలేకుండానే, విషయం మెుత్తం, రెడ్డెప్పకూ, పోలీసులకూ, అర్ధంఐపోయింది. తమకు కనువిప్పు కలిగించటానికే అలా చేసారనీ ~~ రెడ్డెప్ప, కొడుకును దగ్గరకు పిలిచి మాష్టారు పాదాలకు నమస్కారం చేయమని ఆదేశించి తను చేతులెత్తి నమస్కారం చేసాడు. అప్పటినుండీ, 'శివ'కూడా బాగా చదవటం మెుదలెట్టాడు. పిల్లలంతా మాష్టారి పర్యవేక్షణలో పగలనకా, రాత్రనకా చదివారు, విశ్రాంతి యెరుగక, లక్ష్యం కోసం కృషి తో పోరాడారు. అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాలే సాధించారు 10 వతరగతిలో, అందరూ స్టేట్ ర్యాంకర్సై, "పల్లె సిగలో చదువు పూలు" "మట్టిలో మెులకెత్తిన విద్యా వనాలు " మెుదలైన ప్రధాన వార్తలతో, మాష్టారూ, విద్యార్దులతో సహా ఊరిపేరు, బడిపేరూ కూడా పేపర్లో, చరిత్రలో చోటు సంపాదించుకున్నాయి.గవర్నమెంట్ స్కూల్ చరిత్రలోనే నూతన అధ్యాయం వీరు మెుదలు పెట్టారని కలెక్టర్ గారు ఆ గ్రామాన్ని స్వయంగా సందర్శించి, వారిని బంగారు పతకాలతో సత్కరించటమేగాక, ప్రభుత్వ పధకాలూ, నిధులూ ప్రతి ఒక్కరూ, సద్వినియోగపరచాలనీ, ఆ బీద విద్యా ర్ధులు అందరికీ, ఉన్నత విద్య నభ్యసించటానికి, ప్రభుత్వం తరఫున ఉచిత విద్యకై హామీ ఇచ్చారు. ఆరోజు బాలల దినోత్సవం కావటం యాదృ చ్ఛికమైనా, ఆ రోజును పిల్లలంతా కలెక్టర్ గారితో గడపటం, ఊరంతా పండుగ చేసుకుంది. ///// పోలీస్ సైరన్ కూతతో ఈ లోకం వచ్చితలెత్తి చూసారు మాష్టారు. కలెక్టర్ హోదాలో అలనాటి 'కఱ్ఱి సోము ' నేటి సోమ్లానాయక్ ఐ, ఎ,యస్ హోదాలో,డిప్యూటీ కలెక్టర్ హోదాలో 'శివ కుమార్' సెక్యూరిటీ గార్డుల సాయంతో జీపుదిగుతుంటే "పల్లెసిగలో పూసిన పూల" సుగంధం కోటి గురు పున్నములుగా వెదజల్లింది.

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి