నరుడా ఏమి నీ కోరిక? - కారంపూడి వెంకట రామదాస్

man what is your wish?

ఎదురుగా తెల్లని రూపం..! దేవతో, దెయ్యమోగానీ అలా వరం కోరుకోమని అడిగే సరికి, తనువింటున్నది నిజమేనా? తనకంత అదృష్టమా? అని ఉబ్బితబ్బిబైయ్యాడు చిట్టిబాబు.

‘ఆకాశంలో ఎగరాలనుంది’ అప్రయత్నంగా వెలుబడింద ఆ ముక్క చిట్టిబాబునోట

‘ఏమిటీ వింత కోరిక? మరొక్క అవకాశం.. ఆలోచించుకో’ అందా రూపం.

‘లేదు, నిజంగానే నాకు ఆకాశంలో ఎగిరి ఆ ఆనందాన్ని ఆశ్వాదించాలని వుంది’ స్థిరంగా పలికాడు చిట్టిబాబు.

‘తథాస్తు..!’ అంటూ ఒక్కసారిగా మాయమైందా రూపం

అటు ఆ రూపం అంతర్ధానమవడం, యిటు చిట్టిబాబు ఉలిక్కిపడి నిద్రలేచి కూర్చోవడం ఒకేసారి జరిగాయి.

చిట్టిబాబు కళ్ళు నులుముకుని చూసాడు. ఎవ్వరూ కనబడలేదు. ఇదంతా కలని తెలుసుకునేందుకు అట్టే సమయం పట్టలేదు. అయితే, చిట్టిబాబుకి ఒకటి మాత్రం అర్ధమైంది. తన మనసులో ఎప్పటినుండో అంతర్లీనంగా వున్న ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరాలనే చిలిపి ఊహ రాను రానూ కోరికగా బలపడుతోందని! చివరికదే కల రూపంలో తన నోట పలికిందని!

అది మొదలు చిట్టిబాబు తన కోరిక తీరే దిశవైపు దృష్ఠి సారించాడు. మొదట్లో తన కోరక నలుగురికీ తెలిస్తే ఎక్కడ నవ్విపోతారోనని కొన్నాళ్ళు ఆగాడు. అయితే కోరక దావాగ్నిలా దహించి వేస్తుంటే యిక ఆగలేకపోయాడు.

ముందుగా చిట్టిబాబు తన చిలిపి కోరకని వినిపించింది తన భార్యకే! భర్తకోరికవిని అదిరిపడింది. తరువాత భర్తవైపు జాలిగా చూసింది. చిన్ని మెదడు చిదగలేదుకదా.. అని మనసులో అనుకుంది. యిక పిల్లలు యిదివిని విరగబడి నవ్వారు.

కుటుంబ సభ్యలనుండీ కోపరేషన్ కరువైయ్యేసరికి స్నేహితులని ఆశ్రయించాలనుకున్నాడు. వాళ్ళైతే తనని అర్ధం చేసుకుని తగిని సలహా యిస్తారని ఆశించాడు. ఆ వెంటనే వారితో మనసులో మాట చెప్పాడు.

‘ఏం ఈ మధ్య కవిత్వం రాయడంగానీ మొదలుపెట్టావా? వింత వింత ఆలోచనలు పుడుతున్నాయి..’ చిట్టిబాబు వింతకోరిక విన్న స్నేహితులు వేళాకోళాం చేసారు.

అయితే ఒక్క కామేశం మాత్రం చిట్టిబాబు బలమైన కోరికని అంతో,యింతో అర్ధం చేసుకున్నాడు. దాంతో చిట్టిబాబు యిదే సందనుకుని తన ఆలోచనల్ని అతడితో ఏకరువు పెట్టాడు.

“కామేశం! న్యూటన్ సిద్థాంతం గుర్తుందా? భూమేగానీ కొన్ని గంటలు ఆకర్షణ శక్తిని కోల్పోతే ఎంత బాగుండేది? ఎంచక్కా గాల్లో తేలుతూ వింత అనుభూతి పొందొచ్చు”

- 2 -

“ఆకాశంలో ఎగరడమే ఓ వింత కోరికైతే, భూమి ఆకర్షణ శక్తిని కోల్పోవడం వింతలకే వింత” అన్నాడు కామేశం.

“హేంగ్లైడింగ్ చేస్తేనో..?” అదో గొప్ప ఆలోచననైనట్టు ఉత్సాహంగా అన్నాడు చిట్టిబాబు.

“ప్చ్..! నిన్ను చూస్తే జాలేస్తోంది. ఈ వయసులో నీవీ సాహసం చేస్తేగనుకా ఆ తరువాత ఎక్కువ తక్కువైతే సున్నంలోకి ఎముకలు మిగలవు, జాగ్రత్త!” అన్నాడు కామేశం.

ఈ జవాబువిని నీళ్ళు నమిలాడు చిట్టిబాబు.

“పోనీ, గ్యాస్ బెలూన్లో ప్రయాణిస్తేనో..?” టక్కన తట్టిన ఐడియాకి గుడ్లు విచిత్రంగా తిప్పుతూ ఆశగా అన్నాడు చిట్టిబాబు.

“ఏం..? గ్యాస్ బెలూన్స్ పేలీ శాల్తీలకి శాల్తీలే లేచిపోయిన విషయం పేపర్లలో చదవలేదా..?” వెంటనే వెలుబడిందీ ముక్క కామేశం నోట.

ఈ సమాధానంకి గతుక్కుమన్నాడు చిట్టిబాబు. నిజమే, టి.వీల్లో, పేపర్లలో ఈ వార్తలు చూసినట్టూ, చదివినట్టు కూడా గుర్తే.

“మరి నా కోరిక ఈ జన్మకి తీరదా..?” నీరసంగా అన్నాడు చిట్టిబాబు.

“నీదేమైనా పుల్లారెడ్డి మిఠాయి తినాలన్నంత చిన్న కోరికా..? ఏకంగా ఆకాశంలో ఎగరాలన్న గొంతెమ్మ కోరికాయే..! ఎంతైనా నేలవిడిచి సాము చేయడం నీకు తగదేమో? చూడు, బాగా ఆలోచించుకో”

“లేదు కామేశం, ఎలాగైనా నా కోరిక తీరే అవకాశం నాకొస్తుందని ఎందుకో నా సిక్స్త్ సెన్స్ చెబుతోంది” ధీమాగా అన్నాడు చిట్టిబాబు.

“సరే..! ఆ రోజు కోసం ఎదురు చూడు మరి”ఎద్దేవచేస్తూ అన్నాడు కామేశం.

‘నవ్విన నాప చేనే పండినట్టు.. నా కల నిజం చేసి మీ నోళ్ళు మూయించడం కాదు, ఆఁ.. అని తెరిచేటట్టు చేయకపోతే చూడండి’ అని మనసులోనే అనుకున్నాడు చిట్టిబాబు.

అనుకోవడమైతే అలా అనుకుకన్నాడుగానీ, నిజంగా తన కోరిక తీరేది కాదనీ, అది కేవలం అద్భుతమైన ఊహ మాత్రమేనని తెలుసుకునేందుకు ఎక్కువ రోజులు పట్టలేదు చిట్టిబాబుకి.

0 0 0

ఉదయాన్నే కాఫీ సిప్ చేస్తూ పేపరు తిరగవేస్తున్నాడు చిట్టిబాబు.

రకరకాల వార్తలకి అతడి మొహంలో చిత్రమైన భావాలు పలుకుతున్నాయి. కళ్ళు గిరగిర తిప్పుతూ పేజీలు తిరగవేస్తున్నాడు. ఓ అడ్వటేజ్మెంట్ చూసి చిట్టిబాబు కళ్ళు టక్కన ఆగిపోయాయి. కళ్ళ మీద కనుబొమ్మలు విచిత్రమైన వొంపులు తిరిగి గమ్మత్తుగా కనబడుతున్నాయి. ఆ కళ్ళలో ఏదో ఆశాకిరణం మెరిసింది.

అది విమాన ప్రయాణానికి సంబంధించిన ఓ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ఏడ్! దాంతో చిట్టిబాబు దృష్ఠిని అలవోకగా ఆకర్షించింది.

విమానంలో ప్రయాణం తనకోరికకి దగ్గరిదే..! విమానంలో ప్రయాణంమంటే ఆకాశంలో ఎగరడమేగా..! కిటికీ పక్క సీటు సంపాదిస్తే యిటు ఆకాశం నుండి భూమండలం ఎలా వుంటుందో తనవితీరా చూసుకుని ఆనందించవచ్చు. యింతకంటే తనకిప్పుడు కోరిక తీరే అవకాశం లేదు. గుడ్డికన్నా మెల్లనయమన్నట్టు...దీంతోనే తృప్తి పడాలనుకున్నాడు చిట్టిబాబు. విమానంలో ప్రయాణించి ఆకాశంలో ఎగిరే అనుభూతిని కాసింతైనా పొంది తన కేరిక తీర్చుకోవాలనుకున్నాడు. దాంతో అతడికి ఒక్కసారి ఉత్సాహం ముంచుకొచ్చింది.

‘ఊఁ.ఊఁ..’అంటూ నక్క ఊళలు వేసినట్టుగా వింతగా అరిచాడు చిట్టిబాబు.

“ఏమైదండీ..? ఏమిటా వింత కేకలు..?” అంటూ వంటింట్లోంచి వచ్చింది చిట్టిబాబు భార్య.

“బంగారంలాంటి నిద్ర పాడుచేసారు.. పొద్దున్నే ఏంటా అరుపులు..?”అంటూ బెడ్ రూమ్ లోంచి బయటకొచ్చాడు చిట్టిబాబు చిట్టికొడుకు.

“వినండ ర్రా.. ఈ శుభవార్త వినండి..! నా కోరిక తీరే అవకాశం వచ్చింది”

“యింతకీ కోరికేమిటి? అవకాశం రావడమేంటీ?” అంది చిట్టిబాబు భార్య.

అవునన్నట్టు చూసాడు చిట్టిబాబు పుత్రరత్నం.

నిజమే, తన కోరిక తానే మరిచిపోయే స్టేజికొస్తే, యిక వీళ్ళకేం గుర్తుంటుందీ.. మనసులో అనుకున్నాడు చిట్టిబాబు.

“అదేరా.. ఆకాశంలో ఎగరడం..” అంటూ కొంచెం సిగ్గుపడుతూ నెమ్మదైన గొంతుతో అన్నాడు చిట్టిబాబు.

యిదివిని-

“ఊఁ.. మళ్ళీ మొదలుపెట్టరూ? మీరూ మీ వెర్రి ఆలోచన్లు..! యింకా ఏమిటో అనుకున్నాను.. లోపల చచ్చేంత పనుంది...” అంటూ వంటింట్లోకి వడివడిగా వెళ్ళిపోయింది చిట్టిబాబు భార్య.

“చచ్చాంరా బాబూ..” బయటకే అని లోపలికి పరుగుతీసాడు చిట్టిబాబు పుత్రరత్నం

“భార్యాబిడ్డలలా తన ఆనందానికి కారణం తెలుసుకోకుండా తన మాటల్ని లైటుగా తీసుకుని మాయమవ్వడాన్ని పట్టించుకోలేదు చిట్టిబాబు. తన కోరిక తీరే దిశ వైపు చురుగ్గా ఆలోచిస్తున్నాడు.

“ఏంవోయ్! మన తిరుపతి ప్రయాణానికి కొన్న ట్రైన్ టికెట్స్ని కేంసిల్ చేస్తున్నాను” కూల్ గా అన్నాడు భార్యతో చిట్టిబాబు.

యిదివిని చిట్టిబాబు చిన్నమెదడు చిదిగింది కాబోలు అనుకుంది అతడి భార్య.

“ఉదయన్నే ఏమిటండీ ఈ అశుభం మాటలు? ఏడుకొండలవాడితో ఆటలా!” లెంపలు వేసుకుంటూ అంది.

“నేనన్నది టికెట్స్ కేంసిల్ చేస్తానని గానీ మన ప్రయాణం కేంసిల్ చేస్తాననలేదు”

‘హమ్మయ్య..!’ అని మనసులో అనుకుని, అంతలోనే-

“కొంపదీసి కాలినడకన తీసుకెళ్తారా ఏంటీ?” అంటూ అనుమానం వ్యక్తపరిచింది.

“ఛా..! ఊరుకో.. మనం ఎంచక్కా ఫ్లైట్ లో వెళ్ళబోతునాం” అసలు సంగతి చెప్పాడు చిట్టిబాబు.

“ఓఁ.. యిదా సంబడం..! మీ కోరిక ఈ విధంగా తీర్చుకుందామనుకుంటున్నారా? మీ కోరికకి, మీ విమాన ప్రయాణానికి పొంతనేమైనా వుందా? అయినా యింత దగ్గరి ప్రయాణానికి వేలకి వేలు ఎందుకండీ, వేస్టు.. అయినా నాకు భయం బాబూ..నేను చస్తే విమానం ఎక్కను. మీక్కావలిస్తే మీరు ఫ్లైట్ లో రండీ, నేనూ నా కొడుకూ ట్రైన్ లో వస్తాం”

“అదే నీ పొరపాటు. ఈ ఏడ్ చూడూ..! వీళ్ళు విమానంలో తిరుపతికి ఏడొందలే టిక్కెట్టు, ఎంచక్కా నా కోరిక తక్కువ ఖర్చుతో తీరబోతోంది” అంటూ పేపరు చూపించాడు భార్యకి.

“అయినా సేరే, నే రానుగాక రాను” విమానమంటే వెన్నుపూసలోంచి వణుకుతో అంది చిట్టిబాబు భార్య

“సరే, దేనికైనా ప్రాప్తముండొద్దూ.. మీరు ట్రైన్లో రండి, నేను ఎంచక్కా ఆకాశంలో ఎగురుతూ వస్తా” ఊహా లోకంలో తేలుతూ అన్నాడు చిట్టిబాబు.

ఆరోజే ఆఫీసు నుండీ ట్రావల్స్ వాళ్ళకి ఫోన్ కొట్టి ఒక టిక్కెట్టు కావాలన్నాడు. వారు చావు కబురు చల్లగా చెప్పారు. అదేంటంటే, ఆ రేటుకి ఇవాళ బుక్ చేసుకుంటే రెండునెల్ల తరువాత ప్రయాణమని. అయినా నిరుత్సాహ పడలేదు. రెండ్నెల్ల తరువాతైనా తన కోరిక తీరబోతోంది. భార్యకి ఫోన్ తేసి విషయం చెప్పి కష్టం మీద ఆమెని ఒప్పించి తిరుపతి ప్రయాణాన్ని వాయిదా వేసాడు. ఆ మర్నాడే తిరుపతికి ఫ్లైట్ లో ఒక టిక్కెట్టు తన పేర బుక్ చేసాడు.

0 0 0

ఫ్లైట్ లో టిక్కెట్టు బుక్ చేసింది మొదలు చిట్టిబాబుకు రోజూ మధురమైన కలలే. ఆకాశంలో పక్షిలా తన విమానం దూదిపింజల్లాంటి తెల్లని మేఘాలని చీల్చుకుంటూ ముందుకు దూసుకుపోతుంటే, దిగువున నేల పైన పిచుకగూళ్ళలా దర్శనమిస్తూ యిళ్ళూ.. చిన్న చిన్న మొక్కల్లా కనబడే అడవి వృక్షాలు.. కెరటాలులేని నిశ్చలనీలి కడలీ.. యిలా ఊహా చిత్రాలతో వింత అనుభూతికి లోనవుతూ ఏవో లోకాల్లో గిరికీలు కొడుతున్నాడు. ఊహలు అందంగా వున్నా రోజులు భారంగా గడుస్తున్నాయి చిట్టిబాబుకి.

చిట్టిబాబు ప్రయాణం రోజునే భార్యకీ, కొడుక్కి నారాయణాద్రిలో టిక్కెట్లు బుక్ చేసాడు. తిరుపతి స్టేషన్ కొచ్చి వారిని రిసీవ్ చేసుకునేందుకు ప్లాన్ చేసాడు.

0 0 0

ఆ రోజే చిట్టిబాబు ఫ్లైట్ ప్రయాణం!

చిట్టిబాబు అదృష్టానికి అతడికి విండో వైపే సీటు దొరికింది. సీట్లో కూర్చుని బెల్టు కట్టుకుంటుంటే శరీరానికి రెక్కలు తొడుకున్న ఫీలింగ్ కలిగింది. మొదటిసారి ఫ్లైట్ ఎక్కుతున్న వారు చాలామందే వున్నట్టున్నారు ఆ విమానంలో. వారి మొహాల్లో ఒకవిధమైన టెన్షన్ కనబడుతోంది.

చిట్టిబాబుకైతే ఎంత తొందరగా గాలిలోకి విమానంలేస్తే అంత తొందరగా యిన్నాళ్ళూ కలలుగన్న అనుభూతిని అనుభవిద్దామా అని ఆతృతగా వుంది.

ఫైట్ల్ టేకాఫ్ చేస్తున్నప్పుడు మాత్రం చిట్టిబాబుకి కడుపులో దేవినట్టై, కొంచెం కళ్ళు కూడా తిరిగాయి. అయితే కొద్ది నిమిషాలకే సర్దుకుంది.

ఏదేదో వింత అనుభూతి కోసం అతడి మనసు ఆరాటపడుతున్నాది. కిటికీగుండా ఆతృతగా బయటకి చూడసాగాడు. కాని అంతా చాలా సామాన్యంగా వుంది. దూది పింజ మేఘాలుగానీ, ఆకాశంలో ఎగురుతున్న అనుభూతిగానీ కలగడం లేదు. ఏదో రూమ్ లో కూర్చున్నట్టు నిశ్ఛలంగా వుంది. కిటికీగుండా బయటకి చూసాడు. అర్ధం కానట్టుగా ఆవలి పరిశరాలు కనబడుతున్నాయి. మరెంతో మధురమైన అనుభూతికోసం కళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నాయి.

యింతలో మైక్ లో అనౌంస్మెంట్!

కొన్ని అనివార్య పరిస్థితులలో ఫ్లైట్ వేరే ఎయిర్పోర్ట్లో ఎమర్జన్సీ లాండింగ్ చేయబోతున్నాదని సారాంశం.

ఇదివిని ప్రయాణికుల్లో కలకలంరేగింది. ఎవరికి వారే ప్రాణాలు బిగపెట్టుకుని అసలేం జరిగిందో తెలుసుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టరు.

చిట్టిబాబు సంగతి సరేసరి.. మొహంలో భయాందోళనలు స్పష్టంగా కలబడుతున్నాయి. అంతవరకు ప్రయాణాన్ని ఎంజాయ్ చేద్దామనుకున్న అతడి మనసు యిప్పుడు సేఫ్గా లాండ్ అయితే అదే పదివేలని కోరుకొంటోంది.

‘ఇదేదో చూస్తుంటే విమానం ఫేలైనట్టుంది.. వీళ్ళు మనల్ని మభ్యపెడుతున్నట్టున్నారు’ ఎవరో ప్రయాణికుడు అనుమానిస్తూ అన్నాడు.

ఈ మాటలు తోటి ప్రయాణికుల్లో ప్రాణభయాన్ని మరింత పెంచాయి.

‘నేనెక్కడో చదివాను, ఈ ఎయర్ లైన్స్ వాళ్ళు విదేశాలలో బాగా వాడేసిన విమానాలని చౌకగా సెకండ్ హాండ్కి కొని యిక్కడ నడిపిస్తున్నారని. చౌకరేట్లకి టికెట్లు పెట్టి మనబోటి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.. యిదేం ఖర్మరా బాబూ?’ అంటూ బయటకే విలపించాడు మరో ప్రయ తోటి ప్రయాణికుల మాటలు విన్న చిట్టిబాబుకి పై ప్రాణాలు పైనే పోయాయి. యిప్పుడు మొదలైంది అతడికి ప్రాణభీతి.

ఎప్పుడూ లేంది తనకి ఆకాశంలో ఎగరాలనే పిచ్చికోరిక కలగడమేంటీ? కలిగితే మాత్రం ఈ ఫ్లైట్లోనే బుక్ చేసుకోవడం ఏమిటీ? బుక్ చేస్తే మాత్రం సరిగ్గా ఈ రోజే దీనికి మాయరోగం రావాలా..? అంటూ మనసులోనే బావురుమన్నాడు.

చిట్టిబాబుకి నరకం కనబడుతోంది. ఫ్లైట్ లో ప్రయాణికుల ప్రాణాల కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. ఏదేదో చెప్పి సముదాయించాలని సిబ్బంది విఫలయత్నం చేస్తోంది.

యింతలో ఎవరో ‘గోవిందా.. గోవిందా..!’ అని కేకవేసారు.

ఇది దేవుడి ప్రార్ధనా? లేకా ‘మనపని సరి’ అనా ఆ మాటలకర్ధం? చక్కా ‘ఏడుకొండలవాడా.. వెంకటరమణా..’ అని ప్రార్ధించొచ్చుగా.. ఈ సమయంలో ‘గోవిందా.. గోవిందా’ అంటూ ద్వందార్ధపు అరుపులు వింటుంటే యిప్పడే ప్రాణాలు పోయేటట్టున్నాయి అనుకున్నాడు చిట్టిబాబు.

మొహం నిండా చెమటలు.. కాళ్ళూ చేతులు వణుకు, నాడి కోల్పోతున్న అనుభూతుల మధ్య చిట్టిబాబుకి స్పృహ తప్పింది.

0 0 0

చిట్టిబాబుకి స్పృహ వచ్చేసరికి హాస్పటల్ బెడ్ మీదున్నాడు.

“డోంట్ వర్రీ..సర్.. యుఆర్ పెర్ఫెక్ట్లీ ఆల్ రైట్! మీ అందరి అదృష్టం బాగుండీ.. పైలట్ చాకచక్యం మూలంగా పెద్ద గండం నుండి బయట పడ్డారు. మీరంతా క్షేమంగా తిరుపతి చేరుకున్నారు. జస్ట్ ఫస్ట్ అయిడ్ కోసం యిక్కడికి తీసుకొచ్చారు. మరో గంటలో మిమ్మల్ని డిస్చార్జ్ చేస్తారు”అన్నాడు డ్యూటీలోవున్న డాక్టర్, చిట్టిబాబు స్పృహలోకి రావడం చూసి.

విషయం అర్దమై మనసులోనే ఆ ఏడుకొండలవాడికి మనస్పూర్తిగా దండపెట్టుకున్నాడు.

జరిగింది పీడకలగా భావించి మరచిపోవాలనుకున్నాడు.

0 0 0

ఉదయాన్నే నారాయణాద్రిలో వస్తున్న భార్యాని రిసీవ్ చేసుకుందికి చిట్టిబాబు తిరుపతి స్టేషన్ కి వెళ్ళాడు.

ఫ్రెష్గా ట్రైన్ దిగిన పెళ్ళాం, కొడుకిని చూసి మనసులోనే అసూయపడ్డాడు.

“అబ్బా.. ప్రయాణం చేసినట్టేలేదండీ..! హాయిగా జర్నీ జరిగిపోయింది” వళ్ళువిరుచుకుంటూ అంది చిట్టిబాబు భార్య.

“ఆఁ.. యింతకీ మీ జర్నీ ఎలా జరిగిందండీ..? మీ కోరిక తీరిందా..? ఎంజాయ్ చేసారా..?” ఆసక్తిగా ప్రశ్నించింది భర్తని.

చిట్టిబాబుకి వళ్ళుమండింది. పీడకలలాంటి ఆ చేదు అనుభవాన్ని మళ్ళీ గుర్తుచేసిన భార్య మీద కోపం ముంచుకురాగా బలవంతాన్న కంట్రోల్ చేసుకున్నాడు.

ఏం జవాబివ్వలో తెలీకా ‘ఆఁ..ఆఁ.. నడవండి.. నడవండీ.’.టైం అవుతోంది అంటూ మాటమార్చి స్టేషన్ బయటకి వడివడిగా అడుగులేసాడు చిట్టిబాబు.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి