స్వాతంత్ర్య దినోత్సవం - ఎం బిందుమాధవి

Independence Day

"నీకు ఇవ్వాళ్ళ ఆఫీస్ లేదు కదా! సరదాగా మా ఫ్యాక్టరీలో జరిగే జెండా వందనానికి నువ్వూ రా" అన్నాడు ప్రభాకర్.. 

భార్యఛాయతో. వారి పెళ్ళయి నాలుగు నెల్లయింది. 

 

ఛాయ సిటీ లో చదువుకుని ఉద్యోగం చేస్తున్నా..ఎప్పుడూ ఫ్యాక్టరీలకి వెళ్ళి ఎరగదు. అక్కడి వాతావరణం తనకి కొత్త కనుక

తను పని చేసే కంపెనీలో తన పరపతి చూపించాలని ప్రభాకర్ ఇలా ప్లాన్ చేశాడు. 

 

ప్రభాకర్ కి వర్కర్స్ అందరితోను సానుకూలమైన సంబంధాలు ఉన్నాయి. అంచేత ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవాన్ని వారికి

గుర్తుండిపోయే వేడుక లాగా జరిపించాలని ముందే నిర్ణయించుకున్నాడు. 

 

ఒక నెల రోజుల ముందు నించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేశాడు. వర్కర్స్ కి బాడ్మింటన్, టగ్ ఆఫ్ వార్, కబడి, థ్రోబాల్....

మొదలైన ఆటలపోటీలు నిర్వహించాడు. 

 

అందులో బహుమతులు నిర్ణయించబడ్డాయి. కానీ వివరాలు జెండా వందనం రోజే..కంపెనీ జీఎం సమక్షంలోతెలియజేయబడతాయని ప్రకటించారు. అలా చెయ్యటం వల్ల ఆ రోజు ఎవ్వరూ ఎగ్గొట్టకుండా ఉత్సాహంగా ఆఫీస్ కివస్తారు అనేది ప్రభాకర్ ఆలోచన. 

 

*******

 

ప్రభాకర్ పని చేసే ఫ్యాక్టరీ లో షుమారు 300 మంది వర్కర్స్ ఉంటారు. అది మొక్కజొన్న నించి స్టార్చ్ తయారు చేసే కంపెనీ. 

 

వర్కర్లకి చిన్న పెద్దా, మెజారిటీ- మైనారిటీ..అన్నీ కలిపి నాలుగు యూనియన్స్ ఉన్నాయి. 

సూపర్వైజరీ స్టాఫ్ కి మరొక యూనియన్. 

 

వెల్ఫేర్ ఆఫీసర్ కనుక ప్రభాకర్ తన భావోద్వేగాలని ఎప్పుడు అదుపులో..ఉంచుకోవాలి..అలా ఉంచుకుంటాడు కనుకనే  ఇంచు మించు అన్ని యూనియన్స్ తోను సానుకూలమైన సంబంధాలే ఉన్నాయి. 

 

క్లిష్ట సమయాల్లో  వర్కర్స్ తరఫున వకాల్తా పుచ్చుకుని మేనేజ్మెంట్ వారితో  గట్టిగా మాట్లాడి వారి హక్కులువారికిప్పించేవాడు. 

 

నాలుగేళ్ళకో సారి వారి వేతన సవరణలు, ఉత్పత్తి స్థాయితో (production linked bonus) లింకైన బోనస్ లు...ఇతర సంక్షేమపధకాలు..సమస్తం యాజమాన్యంతో చర్చించి వర్కర్లకి న్యాయం చేస్తాడని 

ప్రభాకర్అంటే అందరు యూనియన్ లీడర్లకిగౌరవమే! 

 

వృత్తి ధర్మంగా ఏదైనా గొడవ చేసినా, ప్రభాకర్ మీద ఈగ వాలనిచ్చేవారు కాదు. 

 

*******

 

అనుకున్నట్టే ఉదయం తొమ్మిది గంటలకల్లా ప్రభాకర్- ఛాయ ఫ్యాక్టరీకి వెళ్ళారు. అప్పటికే వర్కర్స్ అందరూ వచ్చి ఉన్నారు. జీఎం వచ్చాక జెండా ఎగరేసి, జాతీయ గీతాలాపన జరిగాక..వర్కర్స్ అందరినీ రెండు మూడు బృందాలుగా విభజించారు. 

 

మ్యూజికల్ చైర్స్ ఆట ప్రారంభమయింది. మైక్ లో మ్యూజిక్ వినబడుతున్నది. అందరూ ఉత్సాహంగా ఛైర్స్ చుట్టూ పరుగెడుతున్నారు. మ్యూజిక్ ఆగినప్పుడల్లా కుర్చీలు ఆక్రమించుకోబడుతూ ఆట హుషారుగా సాగుతున్నది. 

 

అలా ఒక్కో గ్రూప్ లోను ఫస్ట్ వచ్చిన వారిని అభినందిస్తూ పక్కకి కూర్చోబెడుతూ అన్ని గ్రూప్ ల ఆట పూర్తి చేసి, చివరికి ఆ ఫస్ట్ వచ్చిన వారి మధ్య మళ్ళీ ఆట నడిపి చివరగా ఫస్ట్..సెకండ్ వచ్చిన వారి పేర్లు ప్రకటించారు. 

 

ఇక..ఆటల పోటీల్లోను, వినోద కార్యక్రమాల్లోను విజేతలని అభినందిస్తూ బహుమతి ప్రదానం మొదలయింది. 

 

ప్రభాకర్ అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. విజేతలని ఒక్కొక్కరినే క్రమ పద్ధతిలో వచ్చి స్టేజ్ దగ్గరకి తీసుకొచ్చే పని అసిస్టెంట్  శంకర్చే  స్తున్నాడు.

 

"వెంకటేష్ ..బాడ్మింటన్ లో ఫస్ట్ ప్రైజ్" ప్రకటన వినబడగానే ఒక యూనియన్ లో కింది స్థాయి లీడర్ వచ్చి ఆనందంగా బహుమతి అందుకున్నాడు. 

 

"రామా రావు..బ్యాడ్మింటన్ లో సెకండ్ ప్రైజ్" ప్రకటన వస్తూనే చిన్న కలకలం! "అంతా మోసం, అన్యాయం.. ఆ రోజు అతను తన  వైపు వచ్చిన "కాక్" ని వదిలేశాడు. అది కాక రెండు-మూడు సార్లు రాంగ్ సర్వీస్ చేశాడు. తనకి వచ్చిన కాక్ ని బౌండరీ బయటికెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు. అయినా సార్ ఆయన వైపు మాట్లాడి పాయింట్స్  అతనికే వేశారు"  అంటూ ఇంకో యూనియన్ లో వర్కర్స్ గట్టిగా అరవటం మొదలు పెట్టారు. 

 

"ఆటలు, రూల్స్ గురించి మీకు పూర్తిగా తెలియదనే కదా మనం ఆ రోజు మన యూనియన్స్ గురించి గానీ, మీ గురించిగానీ తెలియని  వ్యక్తులని జడ్జిలుగా బయటి నించి తెప్పించాం.. మీకు తెలుసు కదా" అన్నాడు, ప్రభాకర్. 

 

సందడి సర్దు మణిగింది. కార్యక్రమం కొనసాగుతున్నది. 

 

"మల్లేష్..బృందం కబడీ లో ఫస్ట్ ప్రైజ్" ప్రకటించాడు ప్రభాకర్. లావుగా ఉన్న మల్లేష్ తన బృందం తరఫున బహుమతి అందుకోవటానికి వేదిక మీదికి వచ్చాడు. "ఇతనికి  స్టేజ్ దాకా నడవటానికే ఇంత సేపు పట్టింది. వీళ్ళకి కబడీ లో ఫస్ట్ ప్రైజా" అని అక్కడి వర్కర్స్  మధ్యలో సన్నగా గుస గుసలు! 

 

"సామయ్య..బృందం సెకండ్ ప్రైజ్"...ప్రకటన వినగానే ఫస్ట్ ప్రైజ్ రానందుకు అసంతృప్తిగా ముఖం పెట్టుకుని గొణుక్కుంటూ వేదికనెక్కాడు..సామయ్య. సామయ్య ముఖ కవళికలు చూసిన అతని యూనియన్ వర్కర్స్..." అన్నిబహుమతులు ఒక యూనియన్ సభ్యులకే వస్తున్నాయ్.. తమ యూనియన్ ని యాజమాన్యం కావాలనే చిన్న చూపుచూస్తున్నదని, అందుకే సెకండ్ ప్రైజ్ ఇచ్చారని... "పీ ఎం డౌన్ డౌన్..జీఎం డౌన్  డౌన్, అన్యాయం నశించాలి. ఆటల పేరు చెప్పి మాపట్ల పక్షపాతం చూపిస్తున్నారు. పిఎం సార్ బయటికి రండి మీ సంగతి చూస్తాం" అని గట్టిగా నినాదాలివ్వటం మొదలు పెట్టారు. 

 

ఇలాంటివి ఎప్పుడూ చూడని ఛాయ కి ప్రభాకర్ ని వాళ్ళేం చేస్తారో అని చెమటలు పట్టేశాయి. 

 

సామయ్యకి చెందిన యూనియన్ నాయకుడు ముందుకొచ్చి .."ఇంత వరకు ఇలా మనకి ఆటల పోటీలు పెట్టిన పిఎం సారే లేరు. ఇప్పుడు మీరు ఇలా చేస్తే మనకి ఇక ముందు ఇలాంటి సరదాలు ఉండవు. నిజంగా యాజమాన్యం పక్షపాతంగా ఉంటే నేనూ ఊరుకోనని"  వారిని ఊరుకోబెట్టి కార్యక్రమం కొనసాగటానికి సహాయం చేశాడు. 

 

ఛాయ ముఖంలో భయం గమనించిన ప్రభాకర్ ఆమెని తన ఛేంబర్ లోకి పంపేశాడు. 

 

ఇలా నినాదాల మధ్యే మిగిలిన ఆటలకి సంబంధించిన ప్రకటనలు, బహుమతి ప్రదానాలు జరిగాయి. 

 

వచ్చిన వారందరికీ తినుబండారాలు..టీ ఇచ్చి ఆ రోజు కార్యక్రమం ముగించి ప్రభాకర్, ఛాయ ఇంటికొచ్చారు. 

 

ఫ్యాక్టరీలో వినోదంతో  ప్రారంభమయి, టెన్షన్ తో ముగిసిన కార్యక్రమం ఛాయని భయ పెట్టింది. రాత్రి పడుకునేటప్పుడు భర్తతో  "ఛీ ఈ పాడు ఉద్యోగం మానెయ్యండి. మీరు ఫ్యాక్టరీ నించి వచ్చేటప్పుడు దారి కాచి ఏమైనా చేస్తే...అమ్మో"  అని గుండెల మీద చెయ్యేసుకున్నది. "అయినా మీ ఉద్యోగం ఇలా ఉంటుందని నాకు తెలియదు! " అన్నది. 

 

"అలా భయ పడితే ఉద్యోగాలేం చేస్తాం! వాళ్ళ దూకుడు అలా ఉంటుంది. మన లాగా చదువుకున్న వారు కాదు కదా! ఏమీ చెయ్యరు. ఆ యూనియన్ నాయకుడిని చూశావు కదా.. వెంటనే వచ్చి ఎలా వాళ్ళని అదుపు చేస్తున్నాడో! ఒక్కోసారి ఆ నాయకులే మమ్మల్ని బెదిరించినట్లు నలుగురిలో నటించి, తన క్రింద వర్కర్స్ ని మా మీదకి రాకుండా కాపాడుతూ ఉంటారు" అని భార్యని బుజ్జగించి ఊరుకోబెట్టాడు. 

 

********

 

కాలంలో పదేళ్ళు గడిచాయి. ఛాయ కూడా ప్రభాకర్ ఉద్యోగంలో ఉండే ఆటు-పోటులకి అలవాటు పడింది. 

 

వర్కర్ల అభిమానం పొందటమంటే మాటలు కాదు. వారితో వ్యవహారం కత్తి మీద సాము. వారికి ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టలేం! అలాగే యాజమాన్యం వారు...బోనస్ పెంచటమన్నా, వేతన సవరణలన్నా, ఇతర సంక్షేమ పధకాలన్నా..తమకి ఎంత ఆర్ధిక భారమో అనే దృష్టిలో గీచి గీచి బేరాలాడి పర్సొనేల్ అధికారులకి పగ్గాలేస్తూ ఉంటారు. 

 

ఇన్ని పరిమితుల మధ్య పని చేస్తూ..విజయవంతంగా పదిహేనేళ్ళ సర్వీస్, మూడు ఫ్యాక్టరీల్లో వేతన సవరణ అగ్రిమెంట్స్ చేసిన ప్రభాకర్ ఆ సంవత్సరం "బెస్ట్ పర్సొనేల్- మరియు సంక్షేమ అధికారి" గా జాతీయ అవార్డ్ కి ఎన్నికయ్యాడు. 

 

రేడియో లో దూరదర్శన్ లో  కూడా ప్రభాకర్ తో ఇంటర్వ్యూలు వచ్చాయి. 

 

అతను అప్పటి వరకు పని చేసిన అన్ని కంపెనీల్లోను అభినందన సభలు ఏర్పాటు చేసి యూనియన్ నాయకులు, యాజమాన్యం వారు పొగడ్తల్లో ముంచెత్తారు. 

 

ఆ అభినందన సభకి ప్రభాకర్ ఛాయని కూడా తీసుకెళ్ళాడు. యూనియన్ లీడర్ ఒకతను వేదిక మీదకి వచ్చి.."ఈ సార్ కి అవార్డ్ రావటం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. మా తోటి వర్కర్, కంపెనీ సరుకు తేవటానికి లారీ మీద వెళ్ళి ఎక్కడో రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోతే, ఈ సార్ ఆ ఊరు వెళ్ళి అక్కడే రెండు రోజులుండి ఆ పోలీసులతో మాట్లాడి..కేస్ అవకుండా చూసి ఆ వర్కర్ ఇంటికి శవాన్ని చేర్చి అతని కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి, దహన సంస్కారాలకి తన జేబులో డబ్బిచ్చి వచ్చారు." అని ఇంకా ఏదో చెబుతున్నాడు. 

 

ఛాయ, "ఇతనే కదండీ, మన పెళ్ళైన కొత్తలో మీ ఫ్యాక్టరీలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో... పిఎం సార్ డౌన్ డౌన్అని అరిచి, బయటికి రా...నీ సంగతి చూస్తా అని బెదిరించింది" అనడిగింది ప్రభాకర్ ని. 

 

"నేను నీకు అప్పుడే చెప్పాను కదా! వాళ్ళకి ఆగ్రహం వచ్చినా..అనుగ్రహం వచ్చినా పట్టలేము అని... కొత్తలో భయపడి నన్ను ఈ ఉద్యోగం మానెయ్యమన్నావు! ఏదో ఒక రకమైన రిస్క్ ప్రతి ఉద్యోగంలోను ఉంటుంది. జాగ్రత్తగా, లౌక్యంగా నిర్వహించుకోవటం నేర్చుకుంటే మంచి గుర్తింపు, గౌరవం అందులోనే వస్తుంది" అన్నాడు. 

 

*******

 

షుమారు నలభయ్యేళ్ళ తరువాత, లండన్ లో ఉన్న మనవడు అఖిల్ ..స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు టీవీ లో చూస్తూ... అందులో త్రివిధ దళాల్ మార్చ్ పాస్ట్ లు, గౌరవ వందనాలు, ప్రధాన మంత్రి సెక్యూరిటీ అన్నీ గమనించి "అమ్ముమ్మా నువ్వెప్పుడైనా రెడ్ ఫోర్ట్ మీద జెండా వందనానికి వెళ్ళావా" అనడిగాడు ఛాయని. 

 

"నా పెళ్ళైన కొత్తలో తాతయ్యా వాళ్ళ ఫ్యాక్టరీ లో జెండా వందనానికి వెళ్ళాను. అది రెడ్ ఫోర్ట్ లో లాగా త్రివిధ దళాల గౌరవ వందనం లేదన్న మాటే కానీ ఏమీ తక్కువ కాదు. అబ్బో ఉన్నట్టుండి ఎంత హడావుడి, ఎంత టెన్షన్...నాకు భలే భయమేసింది" అని నవ్వుతూ ప్రభాకర్ వంక చూసింది.

 

ప్రశ్నార్ధకంగా ముఖం పెట్టిన మనవడిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని..అమ్ముమ్మ మా ఫ్యాక్టరీకి వచ్చిన రోజు ఏం జరిగిందో చెబుతూ.. తన ఉద్యోగం లో ఉండే దైనందిన ప్రమాదాలు గురించి చెప్పటం మొదలు పెట్టాడు. 

 

"ఒకసారి ఒక డ్రైవర్ తన షిఫ్ట్ టైం లో డ్యూటీ చెయ్యకుండా క్యాంటీన్ లో తాగేసి గొడవ చేస్తుంటే డ్యూటీ టైం లో క్యాంటీన్లో ఎందుకున్నావని షో కాజ్ నోటీస్ ఇచ్చాను. అతను ఆ తాగిన మైకంలో ఆ సస్పెన్షన్ లెటర్ ని నోటీస్ బోర్డ్ లోంచి తీసిచించి పారేశాడు." 

 

"అలా చెయ్యచ్చా తాతయ్యా? అప్పుడు నువ్వేం చేశావ్" అన్నాడు ఆశ్చర్యంగా అఖిల్. 

 

"అలాంటప్పుడు అతన్ని సస్పెండ్ చెయ్యటమే!" అన్నాడు ప్రభాకర్. 

 

"తరువాత ఏమయింది" అన్నాడు 

 

"అలాంటప్పుడు  నాయకులు తమ వర్కర్లని కాపాడుకోవటానికి విషయాన్ని దారి మళ్ళించి తమ వాదన కరెక్టే అని నిరూపించుకోవటానికి స్ట్రైక్ చేస్తారు. అలాంటి సందర్భాల్లో ఒక్కోసారి అక్కసుతో తనని, జీఎం ని సీట్లో నించి కదలనివ్వకుండా ఘెరావ్ చేస్తూ తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు. అధికారులం ఆఫీస్ లోకి వస్తుంటే నినాదాలు ఇస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తారు. మనం భయపడ్డట్టు కనిపిస్తే ఇంకా రెచ్చిపోతారు." 

 

"అప్పుడు యాజమాన్యం తరఫున మేము, వారి తరఫున యూనియన్ నాయకులు కూర్చుని చర్చలు జరిపి వర్కర్ చేసినతప్పు నిరూపించి.. ఎక్స్ ప్లనేషన్ తీసుకుని వార్నింగ్ ఇచ్చి వదిలెయ్యటమో, తప్పు పెద్దదైతే ఇంక్రిమెంట్ కట్ చెయ్యటమో లాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం" అన్నాడు. 

 

ఇలా తాతయ్య తన ఉద్యోగం గురించి  కధలు కధలుగా చెబుతుంటే కళ్ళు విప్పార్చుకుని విన్న అఖిల్ "అందుకే అమ్ముమ్మ రెడ్ ఫోర్ట్ లో  సెక్యూరిటీ గురించి మాట్లాడింది!  పాపం ఎంత భయపడిందో! నీకు కూడా అలా రక్షక భటులుండాలనుకుందేమో!" అన్నాడు. 

 

ఆరిందా లాగా మాత్లాడుతున్న మనవడి బుగ్గలు పుణికి, "నువ్వు కూడా అలా జాతీయ అవార్డులు తెచ్చుకుని తాతయ్య పేరు నిలబెట్టాలి" అని చెప్పింది అమ్ముమ్మ. 

మరిన్ని కథలు

thief
దొంగ
- బొందల నాగేశ్వరరావు
changed veeranna
మారిన వీరన్న (బాలల కథ)
- డి వి డి ప్రసాద్
Culture
సంస్కారం
- మల్లవరపు సీతాలక్ష్మి
Enough to pass tonight
ఈ రాత్రి గడిస్తే చాలు
- బుద్ధవరపు కామేశ్వరరావు
day star
వేగుచుక్క
- గొర్తి.వాణిశ్రీనివాస్
mallamamba
మల్లమాంబ
- నాగమణి తాళ్ళూరి
Millions ... letters
లక్షలు... అక్షరాలు
- మీగడ.వీరభద్రస్వామి
new life
నవజీవనం
- బుద్ధవరవు కామేశ్వరరావు