ప్రమాణం - చెన్నూరి సుదర్షన్

Scum

తాళి కట్టేటప్పుడు మొదటి రెండుముళ్ళు గట్టిగాను, మూడవముడి కాస్తా వదులుగానూ పంతులు గారు వేయిస్తారు. మొదటిది భార్యాభర్తల బంధాన్ని, రెండవది కన్న బిడ్డల అనుబంధాన్ని సూచిస్తాయి. ఇక మూడవ ముడి వృద్ధాప్యంలో.. భార్యాభర్తల మధ్య కాస్తా ఎడం పాటించాలనే హెచ్చరిక.

ప్రస్తుతం మురళి మూడవ ముడి ముంగిట కొట్టుమిట్టాడుతున్నాడు.

దానికి తోడు అతని శ్రీమతి అమెరికాయానం అతణ్ణి మరింత పిచ్చివాణ్ణి చేస్తోంది. అలుక అయినా.. కలహమైనా, భార్యామణి కళ్ళ ముందుంటే.. ఆ కళ్ళ చలువే వేరు.

’ఆపదలలో, ఆవేదనలలో గుర్తుకొస్తారు ఆపద్భాంధవులు’ అన్నట్లు మురళి యుక్తవయసులో ఉండగా పరిచయమైన లలిత గుర్తుకొచ్చింది. ‘రుచి ఎరిగిన ఎద ఏబది ఏడాదులైనా ఎదురి చూస్తుందట’ అనే నానుడి పుట్టించిన మహాను భావునికి మదిలో శతకోటి వందనాలు సమర్పించుకున్నాడు. ‘ఆమె దగ్గర నాపద్దు రద్దు చేసుకుంటుందని నేననుకోను. దానికి తార్కాణం.. హద్దు లేకుండా నాకానాడిచ్చిన వీడ్కోలు ముద్దు’ అని మనసులో ముద్రించుకో సాగాడు.

అలా అతని మనసులో లలితను చూడాలనే ఆరాటం ఆరంభమయ్యింది. ‘మనసుంటే మార్గ ముంటుంద’న్నట్టు ఆరాతీశాడు.. ‘వాట్సాప్’ పుణ్యమా అని, అతని పని చాలా సులభమయ్యింది. లలిత సంగారెడ్డిలో ఉంటున్నట్లు, ఆమె ఫోన్ నంబరుతో సహ తెలిసింది.

వెంటనే ఫోన్ చేశాడు. అతని లాలాజలామృతం లలిత అధరాలకు అంటినట్లున్నది. మురళిని చాలా తేలికగా గుర్తు బట్టింది. ఆనాడు మురళి ప్రదర్శించిన నైపుణ్య మటువంటిది.

ఇంటి చిరునామా.. మురళి రావాల్సిన రోజును కరారు జేసింది. లైన్ క్లియర్ అని ఎగిరి గంతేశాడు.. ఆ వయసులో అలా ఎగరడం ప్రమాదకరమని అతనికి గుర్తుకే రాలేదు.

ఆరోజు లలిత యింటికి కార్లో బయలు దేరాడు. ఆమెతో గడిపిన ప్రతీక్షణం మురళికింకా కళ్ళకు కట్టినట్లుగా ఉంది. ఆ రాత్రికి లలిత యింట్లోనే గడిపేయాలని మురళి తనువు ఉవ్విళ్ళూరుతోంది. బహుశః లలితదీ అదే పరిస్థితి కావచ్చనుకున్నాడు. లేకుంటే ప్రత్యేకంగా యీరోజే రావాలంటూ ఎందుకు కరారు జేస్తుందని మురళి మనసు గుర్రంపై దౌడు తీస్తున్నట్లుగా వుంది. ఆలనాటి మధుర స్మృతులు కళ్ళ ముందు కదలాడసాగాయి.

***

మురళి స్కూల్ ఫైనల్ చదువుతున్న రోజులవి. అతని బెంచీ మేట్స్, జిగ్రీ దోస్తులు.. హీరాలాల్, కొమురయ్య ఇంకా రాములు. వీళ్ళను సరదాగా మురళి త్రీమస్కటీర్స్ అని పిలిచే వాడు.

కొమురయ్య సైకిలు మీద ప్రతీ రోజు కొత్తపల్లి నుండి వచ్చి వెళ్ళే వాడు.

త్రీమస్కటీర్స్ చదువులో ఎంత చురుకో.. అమ్మాయిల సఖ్యం సంపాదించడంలోనూ అంతే తీస్‌మార్‌ఖాన్లు. మురళి ఈవిషయంలో చాలా పూర్.

తరగతి గదిలో ఏమాత్రం ఖాళీ దొరికినా.. త్రీమాస్కటీర్స్ గత వారపు వారి, వారి అనుభవాలను చెరుకుగడ రసంలా రుచి చూపిస్తూ.. మురళిని ఉడికించే వాళ్ళు.

అలా మురళి మనసులో అమ్మాయి అధరం కోసం అంకురార్పణ జరిగింది.

ఒక రోజు కొమురయ్య తన ఊళ్ళో చంద్రకళ అనే అమ్మాయి గురించి మురళికి ఈస్ట్ మన్ కలర్లో చూపిస్తూ.. చాక్లెట్ యిస్తే చాలని చప్పరించుకుంటూ చెప్పాడు.

“మీ ఊరొస్తా..” అని ఛంగున ఎగిరి గంతులేశాడు మురళి.

“అయితే వచ్చే రెండవ శనివారం, ఆదివారం సెలవుల్లో హీరాలాల్‍ను గూడా తీసుకొనిరా..” అంటూ కొమురయ్య పచ్చ ఝండా ఊపాడు. కొత్త టేస్ట్ చూడొచ్చని ఉవ్విళ్ళూరించాడు.

రాబోయే శనివారం కోసం ఆత్రంగా ఎదురి చూడసాగాడు మురళి.

‘కనులు మూసినా నీవాయే.. కనులు తెరిచినా నీవేనాయే..!’ అనుకుంటూ సదరు చంద్రకళ రూపు రేఖల్ని ఊహల్లో ఊహించుకోసాగాడు. క్లాసులో పాఠాలు చంద్రకళ ప్రణయ గాధలుగా వినిపించసాగా

అనుకున్న రోజు రానే వచ్చింది. మధ్యాహ్నం భోజనం చేసి.. హీరాలాల్, మురళి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తపల్లికి బయలుదేరారు.

‘ప్రేమ కోసమై వలలో పడెనే.. పాపం పసివాడు’ అనే పాట యుగళ గీతంలా పాడుకుంటూ కాళ్ళను ప్రోత్సహించారు.

కొత్తపల్లికి చేరే సరికి సాయంత్రం ఆరయ్యింది. సరియైన సమయానికే చేరుకున్నామని.. ఈరేయి గూడా వేస్ట్ గానివ్వద్దని కొమురయ్యను పురమాయించారు. అతని తల్లి దండ్రులు చూపించే ఆప్యాయతలో.. చేతులు కట్టుకుని బుద్ధి మంతుల్లా వెలిగిపోసాగారు.

కాసేపటికి కొమురయ్య ముఖం వేలాడేసుకుంటూ బ్యాడ్ కబురు మోసుకొచ్చాడు. చంద్రకళ కోసం చాక్లెట్లు గూడా కొన్నట్లు చూపించాడు. అయితే ఆమె అరగంట క్రితమే సినిమా చూడ్డానికి ములుగు వెళ్ళిందట.

రాత్రంతా మురళి మనసు విరహ జ్వాలల్లో రగులుతూ.. రగులుతూ.. నిద్ర లేమికి గురిచేసింది.

ఆమరునాడు ఉదయమే మళ్ళీ ప్రయత్నించాడు కొమురయ్య. నిరాశే ఎదురైంది. ఆమె సోమవారం గాని రాదట.. చాక్లెట్లు నీరు గారిపోయాయి. తూర్పు తిరిగి దండం బెట్టి, తలపై తెల్లని చేతిరుమాలు వేసుకొని హీరాలాల్, మురళి ములుగుకు బయలుదేరారు.. ‘ఆశా.. నిరాశేనా.. జీవితాన వెలుగింతేనా..!’ అని మనసులో వగచుకుంటూ.

మురళి కొత్తపల్లి నుండి తిరిగి వచ్చినట్లు తెలుసుకొన్నాడు రాములు. ఆరాత్రి చదువుకోడానికి మురళి ఇంటికి వచ్చీ రావడంతోనే..

“గొప్ప చాన్స్ మిస్సయ్యావు గురూ..” అంటూ.. మురళి లోని అసంతృప్తి జ్వాలలపై గుగ్గిలం గుప్పించాడు. చదువుతున్నట్లు నటిస్తున్న మురళి చేతిలో నలుగుతున్న పుస్తకాన్ని ఠక్కున ప్రక్కకు బోర్లించి విషయం ఆరా తీశాడు ఆసక్తిగా.. మురళిలో నరాలు తెగుతున్నంత ఉత్కంఠ.

గత రాత్రి తను సినిమా కెళ్ళాడట.

చుట్టూ తడకలు.. పైన ఇనుప రేకులు.. క్రింద నేల టిక్కట్ల ప్రేక్షకులు. అదీ ములుగు టూరింగ్ టాకీస్ ఠీవీ.. సొగసు చూడతరమా..! నేల మీద ఆడా, మగా ఐకమత్యంగ అంతా కలిసే కూర్చుంటారు. పేరుకు మాత్రమే మధ్యలో తెర. సింగిల్ ప్రొజెక్టర్.. రీలు మార్పు.. ఈలలు.. యివీ విశేషాలు.

సినిమా చూస్తుండగా కొత్తపల్లి చాక్లెట్ చంద్రకళ తనకు తాను పరిచయం చేసుకొని సినిమా అయ్యాక తన యింట్లో ఆశ్రయ మడిగిందట. తాను ఫ్లాటై పోయాడట. ఆతెల్లవార్లూ చాక్లెట్ చంద్రకళతో.. అని చెబుతుంటే శ్వాసించడం మర్చి పోయాడు మురళి.

దేనికైనా పెట్టి పుట్టాలని మురళి మనసు క్షోభించింది. అతని దురదృష్టానికి లోలోన నలిగి పోయాడు. విధి అతనిపై కక్షబూనిందని లోలోన కుమిలిపోసాగాడు. మురళి ఎదలోని బడబాగ్ని గమనించి హీరాలాల్ జాలి చూపడం.. అతణ్ణి మరింత రెచ్చగొట్టింది.

ఎలాగైనా స్త్రీసాంగత్యాన్ని చవిచూడాలనే కోర్కెలు మురళిలో శృతిమించి తారా స్థాయికి చేరాయి.

తారల్లో దాక్కున్న చంద్రుడు కరుణించి ఒక తారను మురళి ముంగిట పంపాడేమో..! అలా తళుక్కున మెరిసింది మురళి కళ్ళెదుట ఒక నయనతార. కాలనీకి కొత్తగా కాపురానికి వచ్చింది.

ఆమె పేరు లలిత.. వివాహిత. అయితేనేం.. కన్నెపిల్లే గావాలని కాచుకు కూర్చుంటే కార్యం సిద్ధించేదెప్పుడు?.. కార్యానికి అనుభవజ్ఞురాలైన కాంత దొరికినా.. కాసులు తప్పినట్లే.. అని పొంగి పోయాడు. పైగా ’వనిత గానీ.. కవిత గానీ.. వలచి రావాలి’ అనుకునే మురళి దృక్ఫధానికి అనుకూలవతి. ఆమె భర్త ఆఫీసు పని మీద తరచూ ఊర్లు తిరగడమందుకు కారణం కావచ్చు.

లలిత తరచుగా రేడియోలో పాటలు వినడానికి మురళి యింటికొచ్చేది. ఓరోజు వార్తల్లో ’టెస్ట్ ట్యూబ్ బేబీ’ పరిశోధనల గూర్చి చెప్తుంటే.. ‘అంటే ఏమిటో..!’ తెలుసు కోవాలనే ఆమె జిజ్ఞాస వారి సాన్నిహిత్యానికి బాటలు వేశాయి.

ఆరోజు ’హోళీ’ పండుగ. రంగులు పులుముకోవడానికి అనుకూలంగా కాటన్ ఖాకీ నిక్కరు, ఎడం భుజంపై కొద్దిగా చిరిగిన చేనేత చేతుల బనీను తొడుక్కొని యింటి వెనకాల వాకిట్లో ముఖం కడుక్కుంటున్నాడు మురళి.

లలిత వెనక నుండి వాన పాములా వచ్చి ఆమె రెండు అరచేతులకున్న ఆకుపచ్చ రంగును మురళి ముఖాన్ని అదిమి బట్టి మరీ పూసింది. మురళి నరాలు జివ్వుమన్నాయి. యవ్వనంలో ఉన్న స్త్రీ, అలా తమలపాకుల బోలిన అరచేతులతో మురళి బుగ్గలపై అచ్చాదన.. అదే ప్రథమం. అతని ముఖంపై పులిమిన పచ్చరంగు ఆమె కళ్ళళ్ళో మెరిసేసరికి అది ప్రణయానికి ‘గ్రీన్ సిగ్నల్‍’ అనుకుకున్నాడు. ఆమె వెళ్తూ.. వెళ్తూ.. మురళి బనీను చిరుగులో నుండి బూరెలా పొంగిన అతని ఎడం భుజంపై తన గులాబి రేకుల పెదవులతో లవ్ సింబల్ ముద్రించింది. అలా ఆమె అద్దిన అధరామృతం యింకి మురళి హృదయాన్ని చేరుకుంది.. పులకించి పోయాడు.

కాసేపటికి మురళి అరచేతులకు లలితకిష్టమైన నీలిరంగు రాసుకొని ఆమె ఇంటికి వెళ్ళాడు.. ఒక్కర్తే ఉంది. వెనుక నుండి అడుగులో అడగు వేసు కుంటూ పిల్లిలా వెళ్ళి, ఆమె రెండు చెక్కిళ్ళపై దాడికి.. తన రెండు చేతులను పురమాయించాడు.

లలితా ఏమాత్రమూ ప్రతిఘటించలేదు సరికదా.. మురళికెదురుగా మళ్లింది.. మైకపు చూపులతో.. తాను వివశురాలైనట్లు పరవశిస్తూ.. సగానికి పగిలి తెరచుకున్న దానిమ్మ పండులా గోచరిస్తున్న తన నోట్లోని నాలుకతో పెదాలపై సున్నాలు చుట్టుకో సాగింది. కాని మురళికి ధైర్యం చాలలేదు. గుండె దడతో వెనుదిరిగాడు. కాళ్ళు వణక సాగాయి.

ఆనాటి సాయంత్రం మల్లెపూలు కోసిమ్మని మళ్ళీ ప్రత్యక్షమయ్యింది లలిత. మురళి వాకిట్లో పందిరికి పారిన మల్లెతీగకు పూలు విరగబూయడం అతని అదృష్టానికి తెరలేపింది. మురళి కోసిచ్చిన పూలపళ్ళెంతోబాటు నెత్తావి మధురిమలను అతని హృదయానికద్ది తీసుకెళ్ళింది లలిత.. కేవలం మురళి శరీరాకృతి మాత్రమే మిగిల్చింది.

హీరాలాల్‍కు ఆరాత్రి విషయమంతా విశదీకరించాడు మురళి. తర్వాత ఎపిసోడ్‍లో ఏంచేయాలని సలహా ఆడిగాడు.

“ఇంకా ఆలస్యమెందుకు?’’ అంటూ ధైర్యం నూరి పోశాడు హీరాలాల్.

‘’ఆమె కాలు జారేలా నువు కాలు ముందుకు జరపకుంటే చూపులకే మగాడు గాని శృంగానికి గాదని.. ‘సూడు పిన్నమ్మో.. పాడు పిల్లోడు.. పైన, పైన పడుతూ ఉన్నాడు..’ అని పాడుకోడానికే పనికోస్తాడని మరో విధంగా అర్థం చేసుకుంటుంది” . అని గీతోపదేశం జేశాడు. ఇలాంటి సందర్భాలలో తాను ప్రదర్శించిన నైపుణ్యాన్ని సింగిల్ ఎపిసోడ్‍లో చూపించాడు, ఇదే శృంగారపు ఆటలు గనుక ఓలంపిక్స్‌లో పెడితే తనకు గోల్డ్ మెడల్ ఖాయమన్నంత ధీమాతో. ఇక్కడొక జోక్ గూడా పేల్చుతూ.. విరగబడి నవ్వాడు. నాకూ నవ్వాగలేదు.. దొంతర, దొంతరులుగా నవ్వాను. ఊహల్లో తేలి పోయాను.

ఏకాంతం.. ఆకాంత గూర్చి గతరాత్రి తీసుకున్న నానిర్ణయాన్ని అమలు పర్చాను. ఆమెను నాబాహువుల్లో బంధీ చేశాను. అదే తొలి సారి. అనుభూతి అనిర్వచనీయం. జగత్తులో ఏమధుర ఫలాలందివ్వని ఫలసాయమది. లలిత మత్తుగా మురళికి మర్చిపోలేని కితాబిచ్చింది.. పొంగిపోయాడు. సడెన్‍గా సశేష మన్నట్లు సడలించుకొని జారిపోయింది లలిత.

మురళికి అన్నం సహించడం లేదు. ఆమె దయ అతని ప్రాప్తం. ’శుకసప్తతి’ కథల్లో మాదిరిగా కాంతలు తల్చుకుంటే తప్ప కార్య సిద్ధి జరగదు.

ఆమరునాడు పగటి పూట లలిత కటాక్షించింది. మురళి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిధిరోహించి ఝండా నాటినంత గర్వంగా ఫీలయ్యాడు. హీరాలాల్ మదిలో అతని విజయ కేతనాన్ని ఎగరవేశాడు.

మురళి మనసులో కోరిక తీరింది గాని లోలోన భయం, భయంగానే ఉంది. మిగిలిన మిత్రద్వయం వద్ద గూడా ఈవిషయం పొక్క నీయలేదు. ఆమె నూతన వధువు, కాళ్ళ పారాణి గూడా ఆరలేదు. సూది మొనంత అనుమానం పొడ సూపినా ఆమె బ్రతుకు ఛిద్రమై పోతుందనే ఆందోళన అతనిలో మొదలయ్యింది.

‘అదియును ఒకందుకు మంచిదే’ అన్నట్లు.. ఆమరునాడే ఆమె భర్తకు హైద్రాబాదుకు బదిలీ కావడంతో.. మురళికి వీడ్కోలు గుర్తునిచ్చి వెళ్ళి పోయింది లలిత.

‘చెలియ లేదు.. చెలిమి లేదు.. వెలుతురే లేదు.. చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయే..’ అని పాడుకోసాగాడు మురళి.

ఆమరునాడు కొమురయ్య భయంకరమైన వార్త మోసుకు వచ్చాడు. చాక్లెట్ చంద్రకళను ఎవరో అత్యంత కిరాతకంగా రేప్ చేసి హత్య చేశారట.

అధికంగా నవలలు చదివే అలవాటున్న మురళికి చంద్రకళ చావు పరి, పరి విధాల ఆలోచనలను రేకెత్తించింది. సంఘం కట్టుబాట్లు తప్పి.. ఆమె చావును ఆమెనే కోరి తెచ్చుకుందనిపించింది. కాని ఆమె ఒక్కర్తెదే తప్పు కాదు. ఆమెననుభవించిన వారందరిది కూడానూ. ఆ జాబితాలో తనూ చేరే వాడే. తృటిలో తప్పిపోయింది. మరి ఇప్పుడు లలితతో వ్యవహారం.. నేరం కాదా..! అవును ముమ్మాటికీ క్షమించరాని నేరమే.. ఇక ముందు ఇలాంటి అసాంఘిక నేరాలు చేయరాదంటూ మురళి మనసు మౌన రోదనతో.. కళ్ళు జలపాతాలయ్యాయి.

మిత్రులతో.. ‘పూర్తిగా చదువు మీద ధ్యాస పెడదాం. మన బడికి మంచి పేరు తెద్దాం. ఎలాంటి అసాంఘిక నేరాలు చెయ్యొద్దు.. ప్రోత్సహించొద్దని..’ తన నిర్ణయాన్ని తెలియజేశాడు మురళి. త్రీమస్కటీర్స్ స్వాగతించారు. ఆనిర్ణయానికి కట్టుబడి ఉంటామని రామాలయానికి వెళ్ళి శ్రీరామచంద్రప్రభువు ఎదుట ప్రమాణం చేశారు.

***

కారులోని మురళి సెల్‌ఫోన్ మ్రోగడంతో.. అతని ఆలోచనల ఆగిపోయాయి. కారు పక్కకు తీసుకుని ఆపి.. ఫోన్ తీసి చూశాడు. అది హీరాలాల్ దగ్గరి నుండి. వేదన భరితమైన గొంతుతో చెప్పసాగాడు..

“మురళీ.. మన రాములు చూశావా.. భగవంతుని పేరు పెట్టుకొని పాపం చేశాడు. ఆనాడు రామాలయంలో మనమంతా ప్రమాణం చేశాం కదా..! రాములు మాట తప్పాడు. అందుకే భగవంతుడు శిక్షించాడు”

“ఏమయ్యింది హీరాలాల్” అంటూ ఆందోళనగా అడిగాడు మురళి.

“’అక్రమసంబంధం’ నేరంలో రాములు జైలుకెళ్లాడు” అంటూ ఐదు నిముషాల పాటు విషయం సంక్షిప్తంగా వివరించి ఫోన్ పెట్టేశాడు.

ఏదో అవాంతరం ఏర్పడినట్టు మురళి మనసు క్షోభించింది.

కాసేపటికీ తేరుకుని తిరిగి బయలు దేరాడు. కనుమసకవుతోంది.

లలిత ఇంటి గేటు ముందు కారు ఆపాడు.

గేటు తెరచుకొని అడుగులు ముందుకు వేస్తుంటే.. మరో వంక అతని మనసులోని అలజడి గుండె వేగాన్ని పెంచుతోంది.. కాళ్ళూ, చేతులు వణకసాగాయి. గుండె చిక్క బట్టుకుని కాలింగ్ బెల్ నొక్కాడు.

గుమ్మం ముందు లైటు వెలిగింది.. లిప్త కాలంలో తలుపు తెరుచుకుంది.

ఎదురుగా లలిత..!

కళ్ళజోడు సరిజేసుకుంటూ.. పోల్చుకునే సరికి ఆమెలో దివ్య తేజస్సు కలిగిన మాతృమూర్తి దర్శన మిచ్చింది. అలనాడు రామకృష్ణ పరమహంసకు తన సతీమణి శారదాదేవీలో మాతృమూర్తిని గాంచినట్లు. అలాంటి అనుభవం చవిచూడడమే గాని రుచి చూపించడం ఎవరి తరమూ గాదు.

దేవాలయంలో ప్రవేశించిన భక్తుడిలా రెండు చేతులు జోడించి నమస్కరించాడు. మురళిని సాదరంగా ఆహ్వానించింది. చాలాకాలం తర్వాత చూస్తున్నందుకు సంతోషం వ్యక్తపర్చింది.

“ఎలా ఉన్నావు మురళీ..!” అంటూ కుశల ప్రశ్నలు వేసింది.

బాగున్నాను అన్నట్లుగా తల ఊపాడు మురళి. గొంతు పెకలడం లేదు. మురళిని హాల్లో కూర్చోమని..

“కాఫీ తెస్తాను” అంటూ వంట గదిలోకి వెళ్ళింది.

మురళికి ఆనాటి అనుభవపు ప్రథమ రోజు గుర్తుకొచ్చింది. ఈరోజు గూడా లలిత ఇంట్లో ఒక్కర్తే ఉందని గమనించినా.. వెనకాలే వెళ్ళడం.. మనస్కరిం లేదు.

హాల్లో టీ.వీ. పక్కనున్న షోకేసు లోని ఫోటోలు చూస్తూ ఉండి పోయాడు. ఆమె కుటుంబ సభ్యుల ఫోటోలు అతణ్ణి ఆత్మీయుడిగా పలుకరించసాగాయి.

ఇంతలో లలిత ట్రేలో కాఫీ కప్పులు పట్టుకుని వచ్చింది. ఫోటోలలో ఉన్న వారిని పరిచయం చేసింది. ఇద్దరు సోఫాలో కూర్చొని కాఫీ సేవిస్తూ.. కాసేపు వారి, వారి సంసార స్థితిగతులు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.

మురళి కూకట్­పల్లిలో ఉంటున్నట్లు, పదవీ విరమణకు దగ్గరలో ఉన్నానని చెప్పాడు. వీలు చూసుకొని అన్నయ్య, పిల్లలతోబాటు తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు.

లలిత కళ్ళల్లో కళ్ళు బెట్టి చూడలేకపోతున్నాడు. లలిత భర్త లేని సమయంలో ఎక్కువసేపు ఉండడం సబబు గాదని లేచాడు. భోజనం చేసి వెళ్ళమంది లలిత. మరో సారి వస్తానన్నాడు. అతని సతీమణిని కూడా తీసుకొని రమ్మంది. ముందు మీరు రండి. ఆతరువాత మేము వస్తామని చెప్పి బయలు దేరాడు.

అన్యమనస్కంతో కారు నడపడం మంచిది కాదని ఎంత జాగ్రత్త పడ్తున్నా.. అతని మనసు లోని అలజడి ఎగిసి, ఎగిసి పడ్తోంది. వెంటనే.. హీరాలాల్ ఫోన్ కాల్ గుర్తుకు వచ్చింది. తోవ లోనే అతని ఇల్లు. వెళ్లి కాసేపు మాట్లాడితే ఉపశమనం కలుగుతుందని.. అలాగే రాములు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని కారు మియాపూర్­కు పోనిచ్చాడు.

హీరాలాల్ ఇంట్లో అడుగుబెట్టి నిర్ఘాంత పోయాదు మురళి.. అతని కెదురుగా త్రీమస్కటీర్స్.

ఆనందభాష్పాలతో అందరినీ హత్తుకున్నాడు. హీరాలాల్­ను మృదువుగా పిడికిలి బిగించి ఒక్కటిచ్చుకున్నాడు. రాములు గురించి అలా చెప్పావేమని చిరుకోపం ప్రదర్శించాడు.

మురళిని ఒక పిచ్చివాడిలా చూస్తూ అంతా నవ్వసాగారు. మురళి ముఖం జేవురించింది. అది గమనించి హీరాలాల్ నవ్వు ఆపి అసలు విషయం చెప్పసాగాడు.

“చూడు మురళీ..! నీ కోసమే ఇదంతా నాటకమాడాం. ఆరోజు మనం రామాలయంలో ప్రమాణం చేసింది నీకు గుర్తుకు రావాలని. మనం దేవుని మీద ప్రమాణం చేసినట్లుగానే నడుచుకుంటూ.. జీవితంలో మచ్చ పడకుండా ఉన్నత స్థానాలకు ఎదిగాం.

ఈ మధ్య నువ్వు లలిత గురించి వాకబు చెయ్యడం వాట్సాప్ పుణ్యమా అని నాకు చేరింది. ఈవిషయం రాములుకు, కొమురయ్యకు చెప్పి మాఇంటికి రమ్మన్నాను. ముగ్గురం కలిసి ముందు జాగ్రత్త కోసం పథకం వేశాం. నీ మీద నమ్మకం లేక కాదు గానీ.. మన ప్రమాణం నీకు గుర్తుకు రావాలని.. రాములు గురించి ఒక అబద్ధం చెప్పాను. ఒకవేళ లలిత గురించి నీలో తపన ఉంటే తప్పటడుగు వేయకుండా ఉంటావని.

మీ దంపతులు తొలి దశలో సన్నిహితంగా ఉన్నట్లు మలిదశలో ఉండడం లేదని మేము గమనించాం. నీతో చెప్పా చెయ్యకుండా వదినమ్మ అమెరికా వెళ్ళినట్లు తెలుసుసుకున్నాం. నువ్వు పడ్తున్న బాధ స్నేహితులకు సైతం చెప్పుకోలేనిదని తెలుసు. అయినా నీ మూలాన లలిత కుటుంబంలో ప్రళయం రాగూడదనే ఈ నాటకమాడాం. సారీ..” అంటూ నా చేతులు పట్టుకున్నాడు హీరాలాల్.

నాకు దుఃఖమాగింది కాదు, నా కళ్ళ నుండి జల, జలా కన్నీటి బొట్లు రాలసాగాయి. నన్ను త్రీమస్కటీర్స్ అమాంతం హత్తుకున్నారు. నేనూ మువ్వురిని ఆప్యాయంగా నిమురుతూ..

”నిజమే.. మీ ఊహ సరియైనదే హీరాలాల్..” అంటూ నాలో రేగిన అలజడి చెప్పసాగాను.

“శృంగారం కూడా తనువుకు కావాల్సిన ఒకరకమైన ఔషధమని చెప్పినా వినక మొండిగా తిరస్కరించే నాజీవనసహచరితో.. ఒక రోజు జరిగిన వాగ్యుద్ధం తారాస్థాయికి చేరింది. నాకు చెయ్యి చేసుకుందా మన్నంత కోపం వచ్చి చెయ్యి ఎత్తాను. కాని నాలోని మానవత్వం నన్నాపింది. ఆమరునాడే నాతో చెప్పకుండా ఆమె తమ్మునితో కలిసి అమెరికా వెళ్ళిపోయింది. ఆవిషయం మా బంధువు ద్వారా తెలిసింది. నెల రోజులు గడిచాయి. నాకు లలిత గుర్తుకు వచ్చింది. ఆమె కోసమే నేను చిరునామా కనుక్కొని బయలుదేరాను. ఆమెతో ఒక రాత్రి గడపాలని అనుకున్నాను.

ఇంతలో నీ ఫోన్ రావడం.. మన ప్రమాణం గుర్తుకు వచ్చింది. ఇంత దూరం వచ్చాను కనీసం లలితను చూడాలనే కోరిక వారి ఇంటి తలుపును తట్టించింది.

ఇంట్లో మరెవ్వరూ లేరు. అయినా నా మనసు చలించ లేదు. మర్యాదపూర్వకంగా మాట్లాడుకొన్నాం. హృదయ పూర్వకంగా నమస్కరించి శెలవు తీసుకున్నాను” అని చెప్పగానే.. మురళి మనసు తేలిక పడింది. *

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి