ఫస్ట్ లవ్ - ఆదూరి సబిత

first love

ఆ గొంతు ఎక్కడ ఉన్నా ఎంతమందిలో ఉన్నా నేను గుర్తుపట్టగలను. ఆ గొంతు శ్రావణిదే. ఒక్కోసారిగా పక్కకు తిరిగి చూశాను. సందేహం లేదు. తనే! అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమీలేదు తన ముఖంలో. కాకపోతే కొంచెం లావు అయ్యింది. అప్పుడు చాలా బక్కగా ఉండేది తను. ఒక్కసారిగా నా జ్ఞాపకాలు అన్నీ నా కళ్ళముందుకు వచ్చేశాయి. 

 

       ఆరోజు మొదటిసారి తనను కలసిన జ్ఞాపకం. అక్క "అర్జెంటుగా నల్గొండ వెళ్ళాలి రారా!" అని అంది. "ఎందుకు అక్కా?" అని అడిగాను తనను. "ఏంలేదురా! ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజిలో మన పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకుందామని." అన్నది. "సరే! నేను వస్తాలే." అని అన్నాను. "సరే! నువ్వు డైరెక్టుగా బస్టాండుకు వచ్చేయ్. మేము కూడా అక్కడికే వస్తాము." అంది. "వస్తాము అంటున్నావు. ఇంకెవరు వస్తున్నారు?" అని అడిగాను. " అబ్బా! నా ఫ్రెండ్ లేరా! టైం అవుతుంది. తొందరగా రా. 10 గంటలకు ముందే అక్కడ ఉండాలి ఆఫీసులో." అని అంది. సరే అని బయలుదేరి, బస్టాండులో వెయిట్ చేయసాగాను. ఇంతలోనే అక్క, తన ఫ్రెండ్ వచ్చేసారు. నేను హాయ్ అక్కా అన్నాను. అక్క హాయ్ అని, శ్రావణి తన ఫ్రెండ్ అని నాకు, శ్రావణికి నన్ను తన కజిన్ అని పరిచయం చేసింది. అప్పుడు చూసాను తనను. హలో అండీ అని నేను అనగానే బెదురు చూపులతో హలో అని అంది. అంతే హార్ట్ బీట్ 100కి వచ్చేసింది. పొడుగు జడతో, పెద్ద కళ్ళతో చాలా అందంగా ఉంద తను. రేయ్ అని అక్క ఏదో చెబుతుంది కానీ నాకు ఏమీ వినబడట్లేదు. "ఒరేయ్!" అని అక్క గట్టిగా అరిచేసరికి ఈ లోకంలోకి వచ్చాను. ఏంటని అక్కవైపు చూశాను. "వెళ్ళి లైన్లో ఉండు." అని చెప్పింది. సరే అని వెళ్ళాను. రిజిస్ట్రేషన్ అయ్యేసరికి పన్నెండు అయ్యింది. 

 

     ఇంతలో అక్క, శ్రావణి ఇద్దరూ వచ్చేశారు. వాళ్ళు ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నారు. సడెన్ గా అక్కడికి రమ్య కూడా వచ్చుంటే బాగుండేది కదా అంది. అవును అంది అక్క. తనకు రమ్య ఎలా తెలుసని అడిగాను. రమ్య నా చెల్లెలు. తాను డిగ్రీ ఫైనల్ ఇయర్. అప్పుడు అక్క అంది. "శ్రావణి రమ్య ఇంటర్ వరకు సేమ్ క్లాస్." అని. "మరి నీ ఫ్రెండ్ అన్నావు?" అన్నాను. రమ్య అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండి చదివేదట. అందుకే శ్రావణి అక్కకు పరిచయం అయిందట. అలా శ్రావణి అక్కకు బెస్ట్ ఫ్రెండ్ అయిందట. "ఓహో! నువ్వు తనకు సీనియర్ అన్నమాట." అని సంతోషంగా అడిగాను. అక్క నావైపు అనుమానంగా చూసింది, ఎందుకో ఆ సంతోషం అన్నట్లుగా. ఇందాకటి నుంచీ నా మనసులో లాగుతుంది తను నాకంటే పెద్దదేమో అని. ఇప్పుడు కాదని తెలిసేసరికి ఆ సంతోషం. 

 

   ‌ లంచ్ హోటల్లో చేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాము. బస్సులో కూడా తను నాతో ఏమి మాట్లాడలేదు. నేను మాత్రం తనను చూస్తూనే ఉన్నాను. ఎందుకో తను ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. అంతే నా హార్ట్ బీట్ మళ్ళీ 100. చంపేస్తున్నావు కద తల్లీ అనుకున్నాను. రోజు మొత్తంలో నాతో ఒక్కమాట కూడా మాట్లాడలేదు అని అనుకున్నా. పదండి వెళ్దాం అనేసరికి తను వెళ్ళొస్తా అంది. బై అని చెప్పి బయలుదేరాము ఇద్దరం. నాకైతే ఎంతో సంతోషంగా ఉంది. తనతో ఆ వాతావరణంలో ఎంత రొమాంటికుగా ఉందో! కానీ ఏం లాభం? తను నాతో ఒక్కమాట్లాడితేగా! సగం దూరం వచ్చాక తను మాట్లాడిన మొదటి మాట ",ఇక మీరు వెనక్కి వెళ్లిపోండి. నేను వెళతాను" అంది. "అయ్యో! ఇఃటిదాకా వస్తానండి. చాలా చీకటిగా ఉంది. కరెంట్ కూడా లేదు." అన్నాను. "అంటే మా వాళ్ళు చూస్తే నాకు ఇంట్లో ప్రాబ్లం అవుతుంది." అన్నది.‌ "అయ్యో! చీకటిగానే ఉంది. ఎవరూ చూడరు లేండి." అన్నాను. "అయితే ఒకపని చేద్దాం ‌ మీరు, నేను కొంచెం దూరం దూరంగా నడుద్దాం." అని అన్నాను. అంతే! తను ఒక్కసారిగా నవ్వింది. అంతే! మళ్ళీ నా హార్ట్ 120 దాకా కొట్టుకుంటుంది. నేను తనని అలాగే చూస్తుండిపోయాను. తను సారీ అంది. నువ్వు అనుకొని ఏమనుకోకండి అని అంది. ఎందుకు నవ్విందో నాకైతే అర్థం కాలేదు. తనూ చెప్పలేదు. నేను అడగలేదు. నేను తనతో మాట్లాడటం ప్రారంభించాను. "డిగ్రీలో మీ గ్రూప్ ఏమిటండీ?" అని అడిగాను. పిచ్చిప్రశ్న. మా చెల్లి క్లాస్ మేట్. అంటే తనది కూడా సేమ్ గ్రూప్ కదా! తను మళ్ళీ ఒకసారి నవ్వి, బి. జెడ్. సి. అంది. ఇంకా అన్నాను. "టైప్ అలాంటివి నేర్చుకుంటున్నారా" అని అడిగాను. "లేదండీ! కంప్యూటర్ నేర్చుకుంటున్నాను. నాకు ఇంట్రెస్ట్ లేదండీ. కానీ రమ్య బెదిరించి మరీ తీసుకెళ్తుంది." అని చెప్పింది. ఓహో అన్నాను. నా గురించి తను ఏమీ అడగలేదు. కానీ నేనే చెప్పాను. "డిగ్రీ పూర్తి అయింది. ఎం. ఎస్. సి. చేద్దామని అనుకుంటున్నాను. ఎంట్రన్స్ రాసి, రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నా." అని. అవునా అన్నది. ఇంతలో వాళ్ళ ఇల్లు రాగానే "నే వెళ్తానండి. థాంక్స్" అంది. నేను కూడా "ఇట్స్ ఓకే!" అంది. నేను కూడా వెళ్ళొస్తాను." అన్నాను. కళ్ళతోనే నవ్వింది. అంతే! ఒరేయ్ వాసుగా! ఇంక ఈరోజు నీకు నిద్రలేదు. కన్ఫమ్! అనుకుంటూ నేను ఇంటికి వచ్చేశాను. 

 

       ఆ రాత్రంతా నిద్రలేదు. నాకు తన కళ్ళు, నువ్వు ఇవే కళ్ళముందు తిరుగుతున్నాయి. తెల్లారి లేటుగా లేచాను. ఆ రోజంతా తన ఆలోచనలే! సాయంత్రం కాగానే "అక్కా! నేను అలా బయటికి వెళ్తున్నాను." అని చెప్పి బయలుదేరాను. ఇంతలో అత్త "ఎక్కడిదాకా రా?" అని అడిగింది. "మన ఊరి వేంకటయ్య షాపుకు." అన్నాను. "ఎరువుల షాపులో నీకేం పనిరా?" అన్నది. "అది...అత్తా! నాన్న పొలానికి సంబంధించినవి తెమ్మనవి తెమ్మన్నాడు." అని చెప్పి, బయటపడ్డాను. వెంటనే అక్క "ఏంటిరోయ్! ఏంటి సంగతి?" అని అడిగింది. "ఏ సంగతి?" అని అన్నాను. ఇంతలో రమ్య "అత్తా! నాకు కంప్యూటర్ క్లాస్ టైం అవుతుంది. నేను వెళతాను." అని బయలుదేరింది. ఇంతలో అత్త "అన్నతో కలసి వెళ్ళు. ఆ ఎరువుల షాపు దగ్గరే కదా మీ కంప్యూటర్ క్లాస్." అని అంది. నేను సరే అని తనను దించి, అక్కడే ఎదురు చూడసాగాను. "ఏంటి నువ్వు ఎవరికోసం వెయిటింగ్?" అని అడిగింది. "ఎవరికోసం వెయిటింగ్ లేదు." అన్నాను. "మరి బయలుదేరు." అంది. "ఆ సరే! సరే! బయలుదేరుతానులే!" అని బైక్ స్టార్ట్ చేసి, కాస్తా ముందుకు వెళ్ళి, వెనక్కి తిరిగాను. రమ్య క్లాసులోకి వెళ్ళిపోయింది. నేను మళ్ళీ కంప్యూటర్ క్లాస్ దగ్గర నిలబడి, ఎదురుచూడమన్నాను. కాస్త టెన్షనుగా ఉంది. శ్రావణి ఆల్రెడీ లోపల క్లాసులో ఉందా? ఇంకా రాలేదా? ఏమీ అర్ధం కావడంలేదు. అలా 10 నిమిషాలు గడిచాక నా టెన్షనుకు, నిరీక్షణకు తెరపడింది. ఎదురుగా శ్రావణి నడుచుకుంటూ వస్తుంది. లంగా వోణీతో ఆమె నడుస్తుంటే నాకు ఊపిరి ఆడటం లేదు. తను నాకు దగ్గరగా వస్తున్నా కొద్దీ హార్ట్ బీట్ అంతకంతకూ పెరుగుతోంది. ఒక్కోసారే బ్లాస్ట్ అవుతుందేమో అన్నంత ఫాస్టుగా కొట్టుకుంటుంది. తను సడెన్గా నన్ను చూసింది. అంతే! ఒక్కసారే ఆ కళ్ళలో ఆశ్చర్యం, తరువాత సందేహం కనబడింది. నేను నవ్వుతూ కళ్ళతోనే పలకరించాను. తను చప్పున కళ్ళు దించేసింది. అంతే అప్పటివరకూ ఉన్న సంతోషం, ఉత్సాహం అంతా నీరుగారిపోయాయి‌. అయినా సరే అనుకొని అక్కడే ఒక గంట ఉన్నాను. వాళ్ళకు క్లాస్ అయిపొయేదాకా అక్కడే ఉండి, వాళ్ళు బయటికి రాగానే రమ్య దగ్గరకు వెళ్ళాను. 

 

     శ్రావణి, రమ్య ఇద్దరూ వాళ్ళ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ మీద జోకులు వేసుకుంటూ వస్తున్నారు. తనలో ఈ ఏంగిల్ కూడా ఉందా? అనుకున్నాను. నన్ను చూడగానే నవ్వడం ఆపేసింది. మా చెల్లి మాత్రం "అదేంట్రా! నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా?" అని అడిగింది. "నేను నీకోసం ఎదురుచూస్తున్నా." అంటూ శ్రావణి వైపు చూస్తూ చెప్పాను. తను మళ్ళీ కళ్ళు చించేసింది. "ఇక ఇంటికి వెళ్తానే నేను." అని రమ్యకు చెప్పి తను వెళ్ళిపోయింది. నాకు కోపం వచ్చింది. నేను కూడా ఉన్నాను కదా! నాకు కూడా చెప్పొచ్చు కదా అని. పొగరు. నేను తనకోసం వెయిట్ చేస్తున్నా అని అనుకుందేమో అని అనుమానం వచ్చింది. నిజంగా తనకోసం వెయిట్ చేస్తున్నా అని తనకు తెలుసా? ఆలోచనలతో పిచ్చెక్కుతుంది. ఒక్కసారి తల విదిలించుకొని ఇంటికి చేరుకున్నాను. ఆరోజు నైట్ కూడా నాకు నిద్ర దూరం. తన తలుపులే నన్ను మొత్తం ఆక్రమించేశాయి. అలా ఒక వారం, పదిరోజులు నాకు రోజూ కంప్యూటర్ క్లాస్ దగ్గర వెయిటింగుతో గడిచిపోయింది. కానీ ఒక్కరోజు కూడా తను నాతో మాట్లాడలేదు. నాకు ఏడుపు వస్తుంది. నేను వెళ్ళాల్సిన రోజు దగ్గరకు వచ్చింది. 

 

       ఆరోజు ఏమైతే అదే అవ్వుతుందని తనతో మాట్లాడుదాం అని డిసైడ్ అయ్యాను. సేమ్ టైమింగ్స్. మళ్ళీ వెయిటింగ్. తను రావడం చూసి, వెళ్ళి ఎదురుగా నిలబడ్డాను. ఒక రకమైన షాక్ తో నన్ను చూసింది. ఏంటి? అని కళ్ళతోనే అడిగింది. ఇంక నాకు మండిపోయింది. "ఏంటా? ఏంటో నీకు తెలియదా?" అని అడిగాను. "నాకా! నాకేం తెలుసు?" అని అంది. ఇంక నా కోపం పీక్స్ లోకి వెళ్ళిపోయింది. వెంటనే కళ్ళనిండా నీళ్ళు వెంటవెంటనే వచ్చాయి. తను నా కంట్లో నీళ్ళు చూసి, కంగారు పడిపోయింది. "అయ్యో! ఏమైందండీ?" అంది. "ఎందుకే, ఇలా చంపుతున్నావు నన్ను. నా మనసుకు తెలుస్తుంది నా గురించి. నీకేం తెలుస్తుంది? అయినా ఏమీ తెలియనట్లు ఎందుకు అడుగుతున్నావు?" అని అరిచాను. తను నవ్వింది. "ఇదిగో, ఇలాంటి టైంలో ఆ పిచ్చినవ్వు నవ్వి నిన్ను హింసించకు." అన్నాను. తను నువ్వు ఆపేసి, "చెప్పండి. ఏంటి మీ ప్రాబ్లం?" అంది. "నువ్వే" అన్నాను. "నేనా?" అడిగింది. "అవును. నా మానాన నేను ఉంటే నా లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చి, నా మనసంతా, బ్రెయిన్ అంతా నిండిపోయావు. మాట్లాడుదామటే మాట్లాడవు. అసలు ఏమవుతుందో? ఏమో? అర్థం కాక పిచ్చి పట్టినట్లు అవుతుంది." అన్నాను. "ఎందుకు?" అని అడిగింది. "ఇంత చెప్పినా నీకు అర్ధం కాలేదా?" అని అడిగా. "ఊహూ" అంది. దేవుడా ఇంత దద్దీనా నేను లవ్ చేసింది. అని అనుకొని. "నువ్వు అంటే నాకు ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను." అన్నాను. "నాకు తెలుసు." అంది. "అంటే తెలిసి కూడా మళ్ళీ ఏంటి అని అడిగావా?" అన్నాను షాక్ తో. "అవును కానీ, ఇది జరగదు." అని చెప్పింది. "ఎందుకు? నువ్వు ఇంకెవరినైనా ప్రేమిస్తున్నావా?" అని అడిగాను. "లేదు." అని అంది‌. "మరి ఇంకేమిటి ప్రాబ్లం?" అన్నాను. "నా ఫ్యామిలీ." అని చెప్పింది. "అంటే" అన్నాను. "మా ఇంట్లో ఇలాంటివి అస్సలు ఒప్పుకోరు. వాళ్ళకు వ్యతిరేకంగా నేను ఏమీ చేయలేను. మన పరిచయం కేవలం పదిరోజులు మాత్రమే! నీకోసం మా వాళ్ళను ఇబ్బంది పెట్టలేను.ఇంకొక విషయం. నాకు తెలిసి మీ ఇంట్లో కూడా ఇలాంటివి ఒప్పుకోరు. మన కోసం ఇంతమందిని కష్టపెట్టి, బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇంకెప్పుడూ నన్ను కలుసుకోవద్దు." అని చెప్పి, వెళ్ళిపోయింది. నాకు కన్నీళ్ళు ఆగట్లేవు.అలాగే ఇంటికొచ్చి ఏడుస్తూ పడుకున్నాను. తెల్లవారుజామున ఎప్పుడో నిద్రపట్టింది. 

 

       అంతే! మళ్ళీ తను నాకెప్పుడూ కనబడలేదు. మళ్ళీ మాటల మధ్యలో ఒకసారి రమ్య అన్నది "శ్రావణి సడెన్ గా కంప్యూటర్ క్లాస్ మానేసింది." అని. నా వల్ల మానేసింది అని బాధ వేసింది. తర్వాత నేను ఎం. ఎస్. సి. కోసం యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం, ఉద్యోగం కోసం వెతకడం, పెళ్ళి, పిల్లలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి. 

 

      ఇదిగో! మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాతే తనను చూడటం. ఇంతలో మా ఆవిడ పిలుపుతో జ్ఞాపకాల నుంచి బయటపడ్డాను. "రండి, అమ్మాయికి అక్షింతలు వేయాలి" అని పిలిచేసరికి లేచివెళ్ళాను. అక్షింతలు వేసి, కిందకు వస్తుంటే ఫోటోగ్రాఫర్ "ఆగండి సర్! ఫోటో కోసం నిలబడండి." అన్నాడు. నేను, నా శ్రీమతి, పిల్లలు అందరం దిగుదామనేసరికి నా కూతురు కనబడలేదు. దూరంగా ఆడుకుంటుంది. మా అబ్బాయిని "శ్రావణీ" అని పిలిచాను. నా పిలుపుకి మా అమ్మాయితో పాటుగా శ్రావణి కూడా ఒక్కసారిగా నావైపు చూసింది. తన కళ్ళలో అదే ఆశ్చర్యం, సందేహం. నేనేనా అని తను. నేను నవ్వాను తనను చూసి. తనకు అర్థం అయింది నేను వాసునని. తను కూడా నవ్వింది కళ్ళతోనే బాగున్నావా అన్నట్లుగా. నేను కూడా బదులిచ్చాను బాగున్నా అన్నట్లు. మా అమ్మాయి "నాన్నా" అంటూ నా దగ్గరకు వచ్చింది. "రా శ్రావణీ! ఫోటో దిగాలి." అంటూ నా శ్రీమతి మా అమ్మాయిని మా శ్రీమతి పిలుస్తుంది. నేను శ్రావణి వైపు చూశాను. తన కళ్ళలో సన్నటి కన్నీటి పొర కనబడింది నాకు. తను వెళ్ళిపోయింది. నా మనసు చాలా రోజుల తర్వాత ఆనందంతో నిండిపోయింది తనను చూసిన సంతోషంలో. మళ్ళీ చూస్తానో లేదో అనుకున్న నాకు మళ్ళీ తను కనబడేసరికి ఆనందంతో తన మనసు నిండిపోయింది. ఎంతైనా తను నా ఫస్ట్ లవ్.

 

మరిన్ని కథలు

There is something in that story!
ఆ కథలో ఏదో ఉంది!
- గంగాధర్ వడ్లమన్నాటి
this is not a story
ఇది కథ కాదు
- సుస్మితా రమణమూర్తి
bee in the ear
చెవిలో జోరీగ
- మల్లవరపు సీతారాం కుమార్
thief
దొంగ
- బొందల నాగేశ్వరరావు
changed veeranna
మారిన వీరన్న (బాలల కథ)
- డి వి డి ప్రసాద్
Culture
సంస్కారం
- మల్లవరపు సీతాలక్ష్మి
Enough to pass tonight
ఈ రాత్రి గడిస్తే చాలు
- బుద్ధవరపు కామేశ్వరరావు
day star
వేగుచుక్క
- గొర్తి.వాణిశ్రీనివాస్