పాపోడు - అఖిలాశ

papodu

“ఒమయ్యా… కొంచం సద్ది కూడుంటే పెట్టు తల్లి… పాపోడు గోంగేలు పెట్టి ఏడుచాండాడు.”

“నిన్నటి చద్దన్నం లేదు… పక్కింటికి పోమ్మ.. అని చిన్నక్క కేక వేసింది.”

ఇంటి ముందు… అరుగు మీద ఆడుకుంటున్నా చిన్నక్క… ఐదేళ్ల కూతురు వాణి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి పోయి… నిన్న రాత్రి నాయన తెచ్చిన బిస్కోట్లు, చాక్లెట్లు అడుక్కుతినే ఆమె బొచ్చెలో వేసింది.

ఆయమ్మ… బిస్కోట్ పొట్లం విప్పి.. గబా గబా పాపోడికి… బిస్కోట్లు తినిపించింది.

పాపోడు రెండు, మూడు బిస్కోట్లు నోట్లోకి కుక్కుకోవడంతో… గొంతులో పొర బోయింది. దగ్గడం మొదలు పెట్టాడు. పాపోడి తల్లి సంచిలో నుంచి చిన్న బాటిల్ తీసి అమ్మయ్య కొన్ని నీళ్ళు తీసుకురా తల్లి అనగానే….

వాణి ఇంట్లోకి పోయి ఫ్రిజ్జులో ఉన్న… నీళ్ల బాటిల్ తెచ్చి ఇచ్చింది. పాపోడు నీళ్ళు తాగి దగ్గడం ఆపాడు.

***

దండం తల్లి… పొద్దున నుండి తిరుగుతాండ ఎవరు చద్దన్నం కూడా పెట్టడంలే… పాపోడు ఆకలికి చచ్చడేమో… అనుకున్న… దేవతలా వచ్చినావు. పది కాలాల పాటు సల్లంగా ఉండు తల్లి అని… దీవించి పక్కింటికి కదలబోయింది.

రోజు.. పాపోడిని మా ఇంటి కాడికి తీసుకురా… నేను పాపోడు ఆడుకుంటాము. లేదంటే మీ ఇల్లు యాడనో చెప్పు… నేనే వస్తాను. రోజు… మా నాయన తెచ్చే బిస్కోట్లు, చాక్లెట్లు, కేకులు ఇంకా చానా ఇచ్చాను అన్నది వాణి.

వద్దుమ్మ… మేము అడుక్కు తినేటోలమ్ము, ఊరి చివర గుడిసెలు ఏసుకొని బతికే వాలమ్ము. మీకు, మాకు సరిపోదని చెప్పి వెళ్ళిపోయింది.

***

“మొఖం దిగేసుకొని ఇంట్లోకి వెళ్ళిన వాణిని చూసి… తల్లి చిన్నక్క “ఏంది చిట్టి తల్లి… ఏమైంది? ఎవరైనా కొట్టినారా? అని గారాలు పోయింది.”

“ఒమ్మ… ఇందాక… ఒకామె కొంచం చద్దన్నం పెట్టమని వచ్చింది కదా…?”

“అవును….అయితే ఏమైంది?”

“మన దగ్గర చద్దన్నం లేకపోతే ఏంది? ఇందాకే నువ్వు అన్నము, చారు, ఒడియాలు చేసినావు కదా అది పెట్టచ్చు కదా! ఎందుకు… ఏమి లేదని చెప్పినావు?”

“వాణి… ప్రశ్నలకు సమాధానాలు ఎలా చెప్పాలో తెలియక… చిన్నక్క నీళ్ళు నమిలింది.”

“అంతలోనే… వాణి నాయన ఇంట్లోకి వచ్చి… నా కూతురు అనిపించుకున్నావు తల్లి. మీ అమ్మకు ఎన్నిసార్లు చెప్పిన వినదు. పాచిపోయిన అన్నం, రెండు మూడు రోజుల కూరలు ఎవరికి పెట్టవద్దని చెపితే… ఎందుకు వింటుంది. చెప్పవే…చెప్పు… నా కూతురు అడుగుతోంది కదా…. అన్నాడు.”

***

చిన్నక్క… చిర్రుబుర్రులాడుతూ వంటింట్లోకి వెళ్ళిపోయింది.

దాని వాలకం అంతేనని మనసులో అనుకున్న వాణి నాయన… వాణిని ఎత్తుకొని చూడు తల్లి ఎవరైనా… అడుక్కుతినే వాళ్ళు వస్తే… చద్దన్నం పెట్టవద్దు. వాళ్ళు మనుషులే కదా… అటాంటి అన్నం తింటే జబ్బులు వచ్చాయి. మనం వేసేది… వాళ్ల కడుపులు నింపాలి కానీ…, రోగాలు, రొష్టులు వచ్చేలా ఉండకూడదు. మనం ఏదైతే… తింటామో అదే అడుకున్నే వాళ్లకి కూడా పెట్టాలి గుర్తుపెట్టుకో అన్నాడు.

“సరే… అన్నట్లు తల ఊపింది… వాణి.”

***

మరుసటి రోజు కూడా… అడుక్కునే ఆమె వచ్చింది. ఈసారి చిన్నక్క మాత్రం వేడి వేడి అన్నం, పచ్చి పులుసు, మజ్జిగ, ఒక చిన్న నీళ్ల బాటిల్ కూడా ఇచ్చింది.

అది చూసిన వాణి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి పోయి… బొమ్మలు తెచ్చి పాపోడికి ఇచ్చింది.

తల్లిని చూసి, మరీ… మరీ… పాపోడికి బొమ్మలు లేవు కదా…! ఎట్టా ఆడుకుంటాడు? అందుకే ఇచ్చిన అమ్మా అన్నది.

వాణిని ఎత్తుకొని… నా బంగారు తల్లి… అన్నీ మీ నాయన పోలికలే అంటూ ముద్దుల వర్షం కురిపించింది.

***

నేను ఎన్నేళ్ళ నుండి చెప్తున్నా వినలేదు కానీ…, కూతురు ఒక్కసారి చెప్పగానే భార్య మారడాన్ని చూసి సంతోషించాడు చిన్నక్క భర్త.

గమనిక : పెద్దల నుండి పిల్లలు నేర్చుకోవడం కాదు అప్పుడప్పుడు పిల్లలు కూడా పెద్దలను మార్చగలరు.

మరిన్ని కథలు

murthy uncle
మూర్తి బాబయ్య
- ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్
kaamini
కామిని
- ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్
Smoke stick
అగ్గి పుల్ల
- అఖిలాశ
Punishment in discipline
క్రమశిక్షణ లో శిక్ష
- కందర్ప మూర్తి
dont leave you too..!
నేను మిమ్మల్నీవదలా...!
- బొందల నాగేశ్వరరావు
Sister Value (Children's Story)
చెల్లెలి విలువ (బాలల కథ)
- సరికొండ శ్రీనివాసరాజు‌