అనుగ్రహం - ఎం బిందుమాధవి

వాతావరణం హాయిగా అనుకూలంగా ఉంటుందని శాంత-రఘు దంపతులు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఏదో ఒకప్రదేశానికి టూర్ ప్లాన్ చేస్తారు.

"వయసు వచ్చేస్తున్నది, ఓపిక తగ్గుతున్నది. అంత ప్రయాణం చేసే శక్తి ఉంటుందో ఉండదో, ఎలా అయినా ఈసంవత్సరం కేదార్- బదరీ వెళ్ళొద్దామురా" అన్నారు రుక్మిణమ్మగారు కొడుకుతో. "నాక్కూడా మామూలు కంటే ఈ సారి ఓవారం ఎక్కువ సెలవు దొరుకుతుందమ్మా. మనం చార్ ధాం యాత్రకి వెళ్ళేట్లైతే నా ఫ్రెండ్ కుమార్ కూడా వస్తానన్నాడు. మా బావమరిది వాళ్ళు కూడా వస్తారేమో అడుగుతాను. అంత దూరం వెళ్ళేటప్పుడు ఒకరికొకరం తోడుగా ఉంటేమంచిది" అన్నాడు. రఘు బావమరిది విష్ణు భార్య ఇందిర ఎగిరిగంతేసింది ఈ ప్రయాణానికి.

సదర్న్ ట్రావెల్స్ ద్వారా ఏర్పాట్లన్నీ చక చకా చేసేశారు. ముందుగా ఢిల్లీ చేరి, కరోల్బాగ్ లోని ట్రావెల్స్ ఆఫీస్ దగ్గరకిశుక్రవారం సాయంత్రానికి చేరారు. మిగిలిన యాత్రికులంతా చేరాక రాత్రి పది గంటలకి బస్ బయలుదేరింది.

బస్సులో గైడ్...ఉత్తరాఖండ్ విశేషాలు, ప్రత్యేకంగా ఈ యాత్ర లో ఏ ఏ ప్రదేశాలు కవర్ చేస్తారో, భోజన ఏర్పాట్ల గురించి, రాత్రి నిద్రకి ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాల గురించి అప్పటికి టూకీగా చెప్పాడు.

బస్సులో కూర్చున్న ఇందిరకి ఏదో అలౌకిక భావన. మంచు పర్వతాల్లో పూసే పువ్వుల సుగంధం మోసుకొస్తున్న చల్లని గాలిరివ్వున శరీరాన్ని చుట్టేస్తున్నది. అది నిశి రాత్రైనా, నిద్ర రావట్లేదు. పక్కన ఇతర యాత్రికులు నెమ్మదిగా నిద్రలోకిజారుకుంటున్నారు. శరీరం బస్సులో ఉన్నా, మనసు ఏ భావమూ లేని ఒక నిశ్శబ్ద జగత్తులో విహరిస్తున్నది. పక్కనకూర్చున్న విష్ణు మనసు ఇంటి దగ్గర మంచాన పడిన తండ్రి దగ్గర ఉన్నది. అసలు అతనికి ఈ ప్రయాణం అంతసుముఖంగా లేదు.

తెల్లవారేసరికి హరిద్వార్ చేరారు. అక్కడ పవిత్ర గంగా స్నానం చేసి, భోజనాదికాలు ముగించి తరువాతి ప్రయాణానికిసన్నద్ధమయ్యారు. ముందుగా హృషీకేశ్, దేవప్రయాగ, అక్కడినించి సాయంత్రానికి శ్రీనగర్ (కాశ్మీర్ లో శ్రీనగర్ కాదు) చేరారు. ఇక అక్కడి నించి వరుసగా అన్ని ప్రదేశాలని దాటుకుంటూ గౌరీ కుండ్ చేరారు.

బస్సులో గైడ్ ఒక్కొక్క ప్రదేశం గురించి వివరిస్తూ.... ద్వాదశ జ్యోతిర్లింగమైన కేదారనాధ్ క్షేత్రం గురించిచెబుతూ...పాండవులు తమ వనవాస సమయంలో హిమాలయ పర్వతాల్లో సంచరిస్తూ శివ దర్శనం చేసుకోవాలని తహతహ లాడుతున్నప్పుడు, వీరిని పరీక్షించటానికి శివుడు వృషభ రూపం ధరించి అక్కడున్న గోవుల్లో కలిసి వారికిదొరకకుండా వెళ్ళిపోతున్నాడుట. అప్పుడు భీమసేనుడు తన రెండు కాళ్ళని అక్కడున్న రెండు పర్వతాల మీద అటు ఇటుపెట్టి నిలబడ్డాడుట. తన కాళ్ళ కింది నించి గోవుల్లో కలిసి వెళ్ళిపోవాలనుకున్న వృషభాన్ని భీముడు గుర్తించి.. తన కాళ్ళక్రింద పరమశివుడు ఉండటం అపచారంగా భావించి హఠాత్తుగా కొండ మీద నించి కాళ్ళు తీసి వెళ్ళిపోతున్న వృషభపృష్ఠ భాగాన్ని గట్టిగా పట్టుకుని వృషభ రూపంలో ఉన్న శివుడిని ఆపాడని, అందు చేత అక్కడి శివలింగం వృషభ పృష్ఠభాగ రూపంలో ఉంటుంది అని చెప్పాడు.

@ @ @ @ @

గౌరీ కుండ్ నించి కేదార్ నాధ్ వరకు నడక, డోలీ, పోనీ ల ద్వారా యాత్ర సాగుతుంది. అణువణువునా ఈ యాత్రనిఆనందిస్తూ అనుభవిస్తున్న ఇందిరకి, గౌరీకుండ్ లో కనిపించిన వేడి నీటి బుగ్గలు ప్రకృతి అద్భుతంగా అనిపించింది. అందులో స్నానం చేసేసరికి దైవికమైన భావన కలిగింది.

యాత్రికులు, కేదార్ వరకు ఉన్న పదహారు కిలో మీటర్ల దూరం తలో రకంగా వెళ్ళే ప్రయత్నాల్లో పడ్డారు. శాంతి-రఘు, రుక్మిణమ్మ గారు, కుమార్ కాలినడకన వెళ్ళిపోవటానికి సిద్ధపడిపోయి నడక మొదలుపెట్టేశారు. ఇందిర-విష్ణు డోలీలపైబయలుదేరారు.

ఒక్కొక్క యాత్రికుడిని, ఒక్కొక్క డోలీలో నలుగురు నేపాలీ వాళ్ళు మోస్తూ ఏ మాత్రం అలసట లేనట్టు కొండలెక్కుతున్న వైనంచూస్తుంటే, మనం కష్టపడి కొండెక్కి భగవంతుడిని చేరుకోవాలనే తాపత్రయం కంటే ...కేదారేశ్వరుడే ఆ నేపాలీ వాళ్ళరూపంలో మనకోసం దిగి వచ్చినట్టనిపించింది. "నరవాహనం మీద ఎక్కటం బాధాకరంగా ఉన్నది" అన్నది డోలీలోకూర్చున్న ఇందిర. "మేము ఈ కొండల్లోనే పుట్టి పెరుగుతున్నాం. మా కుటుంబాలని పోషించుకునేది ఈఆదాయంతోనేనమ్మా! సంవత్సరంలో ఈ ఆరు నెలలే మాకు సంపాదన ఉంటుంది. హెలికాప్టర్స్ వేస్తామంటున్నారు. (అప్పటికి ఆ తోవలో హెలికాప్టర్ సర్వీస్ మొదలుపెట్టలేదు). మీకు బాగానే ఉండచ్చు కానీ అవి వచ్చి మా పొట్టకొడతాయమ్మా! మంచు కప్పేసిన మిగిలిన ఆరు నెలలు మేము ఇళ్ళకే పరిమితమౌతాం! అప్పుడు మంచు వల్ల పంటలుకూడా ఉండవు" అన్నాడు ఆ డోలీ మోసే అతను.

"మనుషులని మోస్తూ కొండెక్కటం అమానుషమని తను భావిస్తుంటే, ఆధునీకరణ తమ పొట్ట కొడుతుందని వారువాపోతున్నారు...ఎంత చిత్రం" అనుకుంది ఇందిర.

చిన్నప్పుడు సోషల్ సబ్జక్ట్ లో బహు గొప్పవిగా, ప్రపంచ ప్రసిద్ధమైనవిగా చదువుకున్న హిమాలయ పర్వతాలు తనుచూస్తానని కానీ, ఎక్కుతానని కానీ ఇందిర ఎన్నడూ అనుకోలేదు. ఇప్పుడు తను సాక్షాత్తూ ఆ పర్వతాల మీద ఉన్నాననేభావన, తనని ఏవో లోకాల్లోకి తీసుకెళుతున్నది. సాక్షాత్తూ కైలాసంలో ఉన్న అనుభూతినిస్తున్నది. హిమాలయల్లో పెరిగేఓషధ మొక్కల మీదుగా వీచే గాలి వింత వాసనలతో మత్తెక్కిస్తున్నది. మధ్య దారిలో ముంచెత్తిన వాన, చలి ఏ బాధనీ కలిగించలేదు. ఆ ప్రయాణంలో ఉన్నట్టుండి వస్తున్న వాన, అంతలోనే బంగారు రంగులో చుట్టు ప్రసరిస్తున్న సూర్యకాంతివింత అనుభూతిని కలిగిస్తున్నాయి. ఆ సూర్య కాంతికి తెల్లగా వెలిగిపోయే వెండి కొండలన్నీ బంగారు రంగుసంతరించుకుని, మెరిసిపోతూ నేత్రానందం కలిగిస్తున్నాయి.

దారంతా ఎర్రటి పగడాలవంటి కాయలు గుత్తులు గుత్తులుగా వ్రేలాడుతున్న కొండ చెట్లు ప్రకృతికి కొత్త అందాన్నిఇస్తున్నాయి. కొండ చరియల్లో పండిస్తున్న క్యాబేజిలు, పెద్ద గుమ్మడి తీగలు నేల కనపడకుండా పరుచుకుని ఉన్నాయి. మధ్య మధ్యలో రంగు రంగుల పువ్వుల చెట్లు పచ్చని చీరకి రంగుల ప్రింట్ అద్దినట్టు, గట్ల మీది ఎర్ర పువ్వులచెట్లు చీరకిఅంచులాగా శోభాయమానంగా ఉండి మార్గాయాసం తెలియనివ్వట్లేదు.

@ @ @ @ @

సముద్ర మట్టానికి 11755 అడుగుల ఎత్తులో ఉన్న కేదారనాధ్ కి పోను పోను ఆక్సిజెన్ స్థాయి తగ్గిపోయి చార్ధాంయాత్రికులకి ఊపిరి అందని పరిస్థితి వస్తుందని, ఆ యాత్ర నిర్వాహకులు ఆక్సిజెన్ సిలిండర్స్, ట్యాబ్లెట్స్ సరఫరా చేసితమ కర్తవ్య నిర్వహణలో లోపం లేకుండా చూసుకున్నారు.

డోలీని మోసిన మనుషులకంటే ఎక్కువ అలిసిపోయిన ఇందిర గుడి దగ్గరకి చేరేసరికి, ఊపిరందక ఉక్కిరిబిక్కిరయి ఒళ్ళుతెలియకుండా పడుకుండి పోయింది.

శాంత-రఘు బృందం ఉదయం 4.30 కి అభిషేకానికి వెళ్ళాలని నిర్ణయించారు. అనుకున్న ప్రకారం అందరూ తయారయి4.30 కల్లా గుడి దగ్గర ఉన్నారు. అభిషేకం మొదలయింది. "ఇంత గొప్ప క్షేత్రానికి రాగలిగాను. గడ్డ కట్టుకుపోతున్న చలిలో, ఆరోగ్య కారణాలవల్ల స్నానం చెయ్యకుండా అభిషేకానికి కూర్చున్నాను" అనే దుగ్ధ మనసుని పీడిస్తుండంగా కళ్ళుమూసుకు కూర్చున్న ఇందిర హఠాత్తుగా ఒక గళం విని కళ్ళు తెరిచింది.

ధవళ వస్త్ర ధారి.... వెలిగిపోతున్న ముఖవర్చస్సుతో ఒక పెద్దాయన..."అమ్మా ఇంత కష్టపడి ఈ క్షేత్రానికి వచ్చారు. మళ్ళీమళ్ళీ రాగలరో లేదో! నేను కాశీ నించి వస్తున్నాను. ఇవిగో ఈ బిల్వ దళాలతో స్వామికి పూజ చేసుకోండి" అని ఒక కవర్ లోనించి బిల్వ దళాలు తీసి అందరి చేతుల్లో పెట్టాడు.

ఉదయం 4.30 గం ల సమయంలో గుడిలోపల కానీ, బయట కానీ ఎవ్వరూ లేరు. నిశ్శబ్దంగా, నిర్మానుష్యంగా ఉన్న వేళఎవరీ వ్యక్తి అని అందరూ ఆశ్చర్యంతో చుట్టూ చూస్తే ఎవ్వరూ కనిపించలేదు. కృతజ్ఞతలు చెప్పి నమస్కరిద్దామనిబయటికెళ్ళి చూస్తే నర సంచారం లేదు.

హఠాత్తుగా జరిగిన ఆ సంఘటన కలిగించిన అనుభూతిలో ఓలలాడుతూ, అందరూ పరిసరాలని మరచిపోయారు. కొంతసేపటికి తెప్పరిల్లి, "ఆహా శివ సాక్షాత్కారమయింది. కాశీ విశ్వేశ్వరుడేమిటి... స్వయంగా కదిలివచ్చి కేదారనాధ్ లో మనకిదర్శనమివ్వటమేమిటి..."అని నోట మాట రాక అసంకల్పితంగా కంటి నిండా నీటితో కేదారేశ్వరుడికి నమస్కరించారు.

తెల్లవారింది. బయటికొచ్చి చూసేసరికి, తమతో బస్సులో ఏ మాత్రం ఆధ్యాత్మికత లేకుండా...ఈ ప్రయాణాన్ని వినోదయాత్రగా భావించి సినిమా పాటలతో గోల గోలగా తిరిగిన ఒక కుటుంబం గడ్డకట్టే చలిలో గంగా స్నానం చేస్తూకనిపించారు. హిమాలయ పర్వతాలు ఎలాంటివారికైనా ఆధ్యాత్మికతని నేర్పేస్తాయేమో అనిపించింది.

గుడి వెనుక....భగీరధుడి తపస్సుకి మెచ్చి భూలోకానికి విచ్చేయాలనుకున్న గంగా మాత "మందాకిని" పేరుతో గాంధిసరోవర్ గా చెప్పబడే ఎత్తైన పర్వత ప్రదేశం నించి, కిందికి దూకుతూ దివ్యమైన అనుభూతిని కలిగిస్తున్నది. కేదారేశ్వరునిగుడి ఉన్న ప్రదేశం, సరిగ్గా పరమశివుడు రెండు చేతులు నడుము మీద పెట్టి అలా దూకుతున్న గంగని తనజటాజూటంలో బంధించటానికి నిలబడిన చోటుగా భాసించింది.

అక్కడికి కొంచెం పక్కగా, ఆది శంకరులు తపస్సు చేసుకున్న ప్రదేశం చూసి తిరుగు ప్రయాణానికి సన్నద్ధమైనారు వారంతా!

@ @ @ @ @

తిరిగి గౌరీకుండ్ చేరిన శాంత-రఘు బృందం

"స్వామి స్వయంగా వచ్చి బిల్వదళాలు మన చేత ఉంచి అర్చన చేయించుకోవటం ఏమిటి? నిజంగా స్వామి అనుగ్రహంఇలా ఉంటుందా" అని ఎవరికి వారు మనసులో తర్కించుకుంటున్నారు.

"ఈ దేశంలో పుట్టిన వారందరూ ఎప్పుడో ఒకప్పుడు పవిత్రమైన హిమాలయ పర్వత యాత్రకి వెళ్ళాలనుకుంటారు. అమ్మఎలాగైనా వెళ్ళాలనుకుంటోంది. ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి నాన్నా! ప్రపంచంలోనే గొప్పవైన హిమాలయపర్వతాల దగ్గరకి భార్యా భర్తలిద్దరూ కలిసి వెళితే బాగుంటుంది. మీతో పాటు మన వాళ్ళే నలుగురైదుగురు ఉన్నారనినాకూ ధైర్యంగా ఉంటుంది. తాతగారికి వెంటనే వచ్చే ప్రమాదమేమీ లేదు. ఏ అవసరం వచ్చినా, చిన్న తాతగారిసహాయంతో నేను జాగ్రత్తగా చూసుకుంటాను" అని రెండేళ్ళుగా మంచం మీద ఉన్న తండ్రిని వదిలి వెళ్ళటానికి ఇష్టపడనితనని కూతురు హామీ ఇచ్చి పంపితే బయలుదేరిన విష్ణు..ఈ అనుగ్రహానికి పుణ్యమంతా నాకూతురిదే అనుకున్నాడు.

"కేదార్-బదరీ యాత్ర గురించి ఎప్పుడూ మనసులో కూడా తలవని తమని రమ్మని ఆహ్వానించి హిమాలయ పర్వతదర్శనం చేయించి అలౌకిక అనుభూతినందించిన శాంత కుటుంబం చేసిన పుణ్యమే నాకు మహాదేవుడి అనుగ్రహంకలిగించింది" అనుకుంది ఇందిర.

"పురిటి రోజులొచ్చేసినా ఏ మాత్రం వెనకాడకుండా ధైర్యంగా తనని ఈ యాత్రకి పంపించిన తన భార్య దేవిదేపుణ్యమంతా" అని కుమార్.

"ఈ సంవత్సరం కేదారనాధ్ కే వెళదామని ప్రోద్బలం చేసిన అమ్మ చేసిన పుణ్యమే మహా దేవుడి అనుగ్రహానికి కారణం" అని శాంత-రఘు దంపతులు

"ఏమైతేనేం యాత్ర సవ్యంగా, హాయిగా... మహాదేవుడి ప్రత్యక్ష "అనుగ్రహం" తో దిగ్విజయంగా పూర్తయింది" అనుకుంటూఅందరూ ఆ అనుభూతి మోసుకుని తిరుగు ప్రయాణమయ్యారు.

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు