బొమ్మ తిరగబడింది - శింగరాజు శ్రీనివాసరావు

The toy is flipped

రామారావును ప్రమోషను మీద చెన్నైకి బదిలీ చేశారు. అదికూడ బ్యాంకు ప్రధానకార్యాలయానికి. అదేదో అద్భుతమైన పోస్టింగన్నట్లు సహ మిత్రులంతా అతడిని ఆకాశానికెత్తారు. నిజమేగామోసు అనుకుని ఆదరాబాదరాగా వచ్చి జాయినయాడు రామారావు, పోస్టింగు చేజారిపోకుండా. చేరినరోజే ఝలక్ ఇచ్చాడు పై అధికారి. " ఏమోయ్ రామారావ్ నువ్వు పనిలో పట్టుదల గల మనిషివటగా. కింద వాళ్ళ చేత పనిచేయించడంలో దిట్టవని విన్నాను. అంటే నీకు పనిలో మంచి పట్టు ఉండివుంటుంది.

అందుకే నిన్ను హెడ్డాఫీసుకు వేశారు. చాలా సంతోషం. ఇక్కడ నువ్వు పనిచేయించడానికి సబార్డినేట్స్ ఉండరు. నీలాగే ముగ్గురు అధికారులు ఉంటారు. మీకు వచ్చిన ఫైళ్ళను మీరే చదివి, వాటికి సమాధానాలు మీరే వ్రాసి, వాటికి తగిన స్టేటుమెంట్లు గట్రా తయారుచేసి నా టేబుల్ మీదికి పంపాలి" అంటూ ఏవేవో సలహాలను ఆంగ్లంలో విసిరిపారేస్తున్నారు అధికారి రాజేంద్రన్. ఆయన పక్కా తమిళియన్. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతాడని, పనిరాక్షసుడని ప్రతీతి. పోయి పోయి ఆయన చేతికింద పడ్డాడు. ఆయనెలా ఉంటే ఏమిటి. నాచేతికింద వుండేవాళ్ళను పిండి పని చేయించుకోవచ్చనుకున్నాడు రామారావు. ఇక్కడ సీను రివర్సయింది.

గత పదేళ్ళుగా కాగితం మీద కలం పెట్టి ఎరుగడు. అన్నిచోట్ల బ్రాంచిమేనేజర్ గా పనిచేయడంతో బెత్తం పనే తప్ప, చేతిపని పూర్తిగా మర్చిపోయాడు. హతవిధీ అనుకుంటూ తల ఊపి సీటులోకెళ్ళి కూర్చున్నాడు. పదిహేను ఫైళ్ళు పెండింగు ఉన్నాయని చెప్పి వెళ్ళాడు పక్కన ఆఫీసరు బీరువా తాళాలు చేతికిచ్చి. జావగారిపోయాడు రామారావు. ***** నెల రోజులు గడిచాయి. ఏ ముహూర్తాన వచ్చాడోగాని, వచ్చిన రెండో రోజే చెన్నైలో రంగప్రవేశం చేసింది కరోన. పెళ్ళాం, బిడ్డలు రాలేకపోయారు.

ఒక పక్క స్వయంపాకం, మరోపక్క రాజేంద్రన్ యమపాశం. భయానికే వచ్చిందో, బయట తిండికే వచ్చిందో గాని కాస్త ఒళ్ళు వెచ్చబడింది రామారావుకు. ఇదే అదననుకుని ఆ యముడి బాధ తప్పించుకోవాలని, నెలరోజులకు సెలవు పెడుతూ "కోవిడ్ అనే అనుమానంగా వుంది. ఆఫీసుకు వస్తే మిగిలిన వారికి అంటుకుంటుందేమోనని భయంగా వుంది. దయచేసి నాకు ఇంటినుంచి పనిచేసే అవకాశం కల్పించండి" అని వ్రాసి సెలవుచీటి పంపాడు రామారావు, భలే సాకు దొరికింది అని సంబరపడిపోతూ. కనీసం నెలరోజులైనా పీడా విరగడ అవుతుందని, భయపడి ఎలాగైనా సెలవు మంజూరు చేస్తాడని నిర్ధారించుకున్నాడు. అందుకే రిప్లై మెయిల్ కోసం ఎదురు చూడసాగాడు. మరుసటి రోజు వచ్చిన మెయిలు చూసి నోటమాట పడిపోయింది రామారావుకు. " మీది అనుమానమే కాని, నిజం కాదు. ఒకవేళ కోవిడే కనుక అయితే, అక్కడ మీకు చేసేవారు లేరు కనుక, ఆఫీసులో మిగిలిన వారికి వర్క్ ఫ్రం హోమ్ శాంక్షను చేశాను. మీరు వచ్చి మీ క్యాబిన్ లో కూర్చుని పనిచేసుకోవచ్చు.

మీరు పంపిన ఫైళ్ళను శానిటైజ్ చేసి వెరిఫై చేస్తాను. మీకు అటాచ్డ్ బాత్ రూమ్ కూడ ఉందిక్కడ. బ్యాగుతో సహా వచ్చి పద్నాలుగు రోజులు ఇక్కడే ఉండి పని పూర్తి చేయండి. మీ అనుమానం తీరిన తరువాత శానిటైజ్ చేయించి, మిగిలిన వారిని రమ్మంటాను. అంతవరకు భోజనం మా ఇంటినుంచి వస్తుంది. మన మెసెంజర్ ద్వారా పంపుతాను. నా పర్యవేక్షణ ఎలాగూ ఉంటుంది మీమీద. ఇదే మీకు మా సాయం. ఆల్ ది బెస్ట్." "వా..." అంటూ జుట్టు పీక్కున్నాడు రామారావు. తాడిని తన్నేవాడుంటే వాణ్ణి తలదన్నే వాడున్నాడని తెలియని రామారావు.

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు