జీవన తరంగాలు - కందర్ప మూర్తి

Waves of life

" ఒరేయ్ , సూరీ ! ఈ విత్తనాలు తీసుకెళ్లి పొలంలో పాలేరు కిచ్చి రా! " దివాణం గారి హుకుం. " సూరీ ! పనోడు రాలేదు.ఆవు పాలు పితికి అమ్మ గారి కివ్వు" పంతులు గారి అదిలింపు. " ఏరా , సూరీ ! ఇటు రావడం మానేసావ్ , ఈ బియ్యం మూట దుకాణం కాడ పడేసిరా " షావుకారు గద్దింపు. ఊళ్లో ఎవరేది పెడితే అది తింటూ వారు చెప్పిన పనులు చేస్తూ అనాథగా తిరుగుతున్న సూర్రావు ఉరఫ్ సూరి ఉరఫ్ సూర్యం దీనావస్థను గమనించిన స్కూల్ మాస్టారు పురుషోత్తం పిలిచి పట్నం పోయి ఏదైనా బ్రతుకు తెరువు చూసుకోమని సలహా ఇచ్చారు. ఒకరోజు ఉదయాన్నే ఎవరికీ చెప్పకుండా పక్క ఊరి రైల్వే స్టేషన్ కెళ్లి కట్టు బట్టలతో కదులుతున్న రైలు ఎక్కేసాడు సూర్యం.

ప్రయాణం మద్యలో టికెట్ లేదని ట్రైను టికెట్ ఎగ్జామినరు రైలు దించేసాడు సూర్యాన్ని. స్టేషన్ బయటి కొచ్చి ఎటువెళ్లాలో తెలియక ఆకలితో కడుపు నకనక లాడుతుంటే దగ్గరున్న టీస్టాల్లో మంచినీళ్లడిగితే లేవన్నారు. రోడ్డంట కొంత దూరం ముందు కెళితే షిర్దీ సాయిబాబా గుడి వద్ద అన్నదానం జరుగుతోంది. షామియానా కింద అందరితో పాటు వరుసలో కూర్చుంటే విస్తరేసి అన్నం పెట్టి ప్లాస్టిక్ గ్లాసుతో మంచి నీళ్లిచ్చారు. సాయిబాబా దయవల్ల కడుపు నిండి దాహం తీరింది.ఎండ ఎక్కువగా ఉన్నందున గుడి ప్రాంగణంలో ఉన్న అరుగు మీద విశ్రాంతి కోసం కూర్చున్న సూర్యానికి అలసట వల్ల తల కింద చేతులు పెట్టుకుని నిద్రపోయాడు.

సాయంకాలమైంది. బాబా గుడి తలుపులు తెరుచుకున్నాయి. గుడి మెట్ల మీద బిక్షాటన చేసే యాచకులు ఒక్కొక్కరు చేరుకుని గుడి ముఖద్వారం అరుగు మీద గాఢ నిద్రలో ఉన్న సూర్యాన్ని లేపి " ఎవర్రా నువ్వు? ఇక్కడి కెందు కొచ్చావ్ ? ఇది మా ఏరియా. ఫో ! " కేకలేసారు . తను ఊరికి కొత్తనీ, ఎటుపోవాలో తెలియక బాబా గుడి వద్దకు వచ్చానని తన దీనావస్థను చెప్పగా బిచ్చగాళ్లలో ముసలాయన కనికరించి ఈ ఒక్కరోజుకి చివరి మెట్టు మీద కూర్చోమని చెప్పి ఎవరి స్థలాల్లో వారు తువ్వాళ్లు పరుచుకుని సర్దుకున్నారు. సూర్యం చివర మెట్టు మీద కూర్చొని పక్కన పడున్న పాత న్యూసు పేపరు తెచ్చుకుని ముందుంచుకున్నాడు.

గుడికి భక్తుల రాక మొదలై సందడిగా మారింది. రాత్రి తొమ్మిది దాటగా భక్తులు పలుచ బడ్డారు. మెట్లమీదున్న బిచ్చగాళ్లు వచ్చిన డబ్బులు లెక్కపెట్టుకునీ బయలు దేరుతూ రేపు ఇక్కడ కనబడకూడదని హెచ్చరించారు. సూర్యం తన ముందు పేపరు మీదున్న కొద్ది పైసలు తీసుకుని పేపరు మడిచి మళ్లా ముఖ ద్వారం అరుగు మీదకు చేరుకున్నాడు. పూజారి గారు కాగడా హారతిపూజ పూర్తి చేసి మిగిలిన పులిహోర ప్రసాదం ఆకులో ఉంచి సూర్యాన్ని పిలిచి ఇచ్చి లోపల దీపాలార్పి గుడి తలుపులకు తాళాలేసి పక్కనున్న వసతి గృహానికి వెళిపోయారు.

సూర్యం పులిహోర తిని కొళాయి నీళ్లు తాగి అరుగు మీద పాత స్యూస్ పేపరు పరుచుకుని తలకింద చెయ్యి పెట్టుకుని పడుకున్నాడు. కొత్త ప్రదేశం, దోమల కారణంగా నిద్ర పట్టక దొర్లుతున్నాడు. రాత్రి పన్నెండు గంటలు దాటింది.మగతగా నిద్ర పడుతున్న సమయంలో గుడి లోపల నుంచి మెల్లగా చప్పుడు వస్తోంది . క్రమేపి శబ్దాలు ఎక్కువ అవడం, గుడి పూజారి గారు గుడి తలుపులుకి తాళాలు వేసి వెళ్లిన తర్వాత శబ్దాలు వస్తున్నందున అనుమానంతో లేచి తలుపుల సందులోంచి లోపలికి చూడగా మసక చీకటిలో మనుషుల సంచారం కనబడింది.

దొంగలు గుడిలో ప్రవేసించారని గ్రహించిన సూర్యం ' దొంగలు -దొంగలని' గట్టిగా అరవడం మొదలెట్టాడు. సూర్యం కేకలు విన్న పక్కింట్లోని పూజారి గారు మేల్కొని వసారాలో లైటు వెలిగించి విషయం తెలుసుకుని గుడి తలుపుల తాళాలు తెరిచి లైటు వేసి చూడగా బాబా గారి హుండీ సగం విరగ్గొట్టిన ఆనవాళ్లు కనబడ్డాయి. సూర్యం కేకలకు దొంగలు భయపడి వెనక గోడ దూకి పారిపోయారు. మర్నాడు ఉదయం కాలనీలోని బాబా భక్తులందరికీ గుడి హుండీ చోరీ ప్రయత్నం జరిగి నట్టు , సూర్యం మెలకువ వల్ల ఎన్నో విలువైన కానుకలు దొంగల పాలు కాకుండా రక్షింప బడ్డాయని తెలిసి అందరూ అభినందించారు. గుడి పూజారి గారు తక్షణం గుడి ట్రస్టీ కార్పొరేటర్ రామచంద్రం గారికి మిగతా మేనేజ్ మెంటు సబ్యులకు సమాచారం అందించగా అందరూ వచ్చి సమావేశమై గుడి సెక్యూరిటీతో పాటు మైంటినెన్సుపై చర్చించారు.

ఇంతకు ముందున్న కాపలాదారు అవకతవకలకు పాల్పడ్డంతో ఉధ్యోగంనుంచి తీసివేయవలసి వచ్చింది. బాబా గారి హుండి నిండుగా కానుకలు , డబ్బు ఉన్నట్టు తెలిసిన వాళ్లే దొంగతనానికి పాల్పడి ఉంటారని నిర్దారించారు. ప్రస్తుత పరిస్థితుల్లో గుడి రక్షణ , పరిసరాల శుభ్రతకు కాపలాదారు ఆవశ్యకతను చర్చించారు. పూజారి గారి ద్వారా సూర్యం పరిస్థితిని తెలుసుకుని అతని నిజాయితీ, అణకువ చూసి కార్పొరేటర్ రామచంద్రం గారు కమిటీ సబ్యుల ఆమోదంతో బాబా గుడికి కాపలాదారుగా నియమించారు.

పూజారి గారింట్లో రెండు పూటలా భోజనం, బాబా గారి సరుకులు భద్రపరిచే గది పక్కన ఉండటానికి నివాసం, రెండు జతల కాకీ యూనిఫాం ఒక లాఠీ టార్చిలైటు ఏర్పాటు చేసారు. రోజూ గుడి మెట్ల మీద కూర్చుని బిచ్చమెత్తుకునే యాచకులు, ఒక్కరోజుకి దిగువ మెట్టు మీద అవకాశం ఇస్తే ఈరోజు మనకన్న పై మెట్టెక్కాడని సూర్యం అదృష్టాన్ని తలుచుకున్నారు. సూర్యం రోజూ ఉదయం నాలుగ్గంటలకు లేచి లైట్లు వెలిగించి గుడి పరిసరాలు శుభ్రం చేసి గొట్టం పెట్టి నీళ్లతో మెట్ల దగ్గర నుంచి గుడి కడిగి నీటుగా ఉంచుతున్నాడు.

పూజారి గారు స్నానం చేసి వచ్చేలోపున బాబా గారి పూజకి పువ్వులు, పూజా ద్రవ్యాలు సిద్ధంగా ఉంచుతున్నాడు.గర్భ గుడి మీదున్న మైకులో బాబా గారి భక్తిగీతాలు వినిపిస్తున్నాడు. సూర్యం వచ్చి నప్పటినుంచి గుడి ప్రాంగణం తీరే మారిపోయింది. గుడి పరిసరాల్లో రంగురంగుల పువ్వుల మొక్కలు అందాన్ని తెచ్చాయి. ఫ్లోరింగ్ రాత్రి లైట్ల వెలుగులో మెరిసిపోతోంది. ఉదయం సాయంకాలం గుడి మీద లౌడు స్పీకర్ల నుంచి బాబా గారి భక్తిపాటలతో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది. రాత్రి గుడి ప్రాంగణంలో భజనమండలి ఏర్పడి బాబా పాటలు భజనలు వినిపిస్తున్నాయి.

భక్తుల కోసం పాదరక్షల స్టాండు, రద్దీ సమయంలో భక్తుల్ని క్రమ పద్దతిలో లోపలికి పంపడం జరుగుతోంది. టికెట్ పద్ధతిలో గోత్ర నామాలతో పూజ జరుగుతోంది. వయో వృద్ధుల కాలక్షేపానికి వేదిక ఏర్పడింది. మౌలిక సదుపాయాల వల్ల భక్తుల రాక పెరిగి గుడి ఆదాయంలో వృద్ధి కనబడింది. సూర్యం ప్రవర్తన , మాటతీరు , వినయ విధేయతలకు బాబా దర్సనానికొచ్చే భక్తులు, పూజారి గారు మేనేజ్ మెంటు సబ్యులు ప్రశన్నులవు తున్నారు. పూజారి దంపతులకు సంతానం లేనందున సూర్యాన్ని ఆత్మీయంగా చూసుకుంటున్నారు.

పండగలు, పర్వ దినాలప్పుడు చిన్నచిన్న కానుకలు, కొత్త బట్టలు అందచేస్తున్నారు. కమిటీ సబ్యుల నెలవారీ సమావేశాలకు ముందే ఆన్ని ఏర్పాట్లు చేసి ఆలయట్రస్టీ కార్పొరేటర్ రామచంద్రం కారు దిగగానే చిరునవ్వుతో ఎదురెళ్లి కార్లోని బ్రీఫ్ కేసు తీసుకుని వెంట వినయంగా వస్తాడు సూర్యం. సమావేశం పూర్తయేవరకు ఎవరికేం కావాలో అవి సమకూరుస్తుంటాడు. కార్పొరేటర్ రామచంద్రం గారి ఆఫీసుకి రాకపోకలతో సూర్యానికి వారి కుటుంబ సబ్యులతో అనుబంధం ఏర్పడింది. సూర్యం వినయ విధేయతలు, మాటతీరుతో కార్పొరేటర్ ఆంతరంగికుడిగా మారేడు. బాబా గుడి నుంచి సూర్యాన్ని తన కార్యాలయానికి మార్చ దలచినప్పుడు పూజారిగారు , రోజూ గుడికి వచ్చే భక్తుల వత్తిడి వల్ల ఆ ప్రయత్నం విరమించుకున్నారు.గుడికి వచ్చే ఆ కాలనీ , చుట్టు ప్రాంతాల్లోని పిల్లల్నీ ఆప్యాయంగా పలకరిస్తూ, పెద్దలికి వినయంగా గౌరవ వందనం చేస్తు అందరికీ అత్యంత ప్రీతి పాత్రుడయాడు.

అనుకోకుండా ఆ ప్రాంత వార్డు మెంబరు అవినీతి ఆరోపణల కారణంగా సస్పెండయాడు. రూలింగ్ పార్టీ హైకమాండు సరైన అబ్యర్ది కోసం ప్రయత్నం మొదలెట్టింది. సూర్యం పేరును కార్పొరేటర్ రామచంద్రం హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. సూర్యం స్థానికత విషయమై శంసయం వచ్చింది. ఆ ప్రాంత జనాల్లో ఉన్న మంచి పేరును ఆలోచించి స్థానికత సమస్య కాదని నిర్దారించారు. ఆ ప్రాంత ప్రజల , కార్పొరేటర్ వత్తిడి మేరకు శాసన సబ్యుడి అబ్యర్ధనకు తలవంచి సూర్యాన్ని వార్డు మెంబరుగా ఎన్నిక చేయవల్సి వచ్చింది. వినయంగా అందరి ప్రశంసలు బాబా ఆశీసుల మధ్య వార్డు మెంబరుగా ప్రమాణ శ్వీకారం చేసాడు సూర్యం. తన వార్డు పరిదిలో కొచ్చే కాలనీల్లో పాదయాత్రలు చేసి అక్కడి మౌలిక వసతులు సమకూరుస్తు అందరి మన్నన సంపాదించేడు. ఉండటానికి అన్ని వసతులతోకూడిన నివాసం సమకూరింది.

కార్పొరేటరు రామచంద్రం గారి సహకారంతో ప్రత్యేక శిక్షణలో సూర్యానికి చదువు , రాజకీయ పాఠాలు,లోకజ్ఞాన విషయాల పరిజ్ఞానం ప్రారంభమయాయి. స్థానికత కోసం ఓటరు లిస్టులో పేరు, రేషనుకార్డు , ఆధార్ కార్డు, పాన్ కార్డుతో బ్యాంకు ఎకౌంటు రాజకీయ అండతో అన్నీ సమకూరేయి. సూర్యానికి కార్పొరేషన్ ఏరియాలో పలుకుబడి పెరుగుతోంది.ఇతర రాజకీయ పార్టీల వారు తమ పార్టీ లోకి రావల్సిందిగా వలలు విసురు తున్నారు. కార్పరేటర్ రామచంద్రం కారణంగా సూర్యం పార్టీ హైకమాండ్ దృష్టిలో మెదులు తున్నాడు. నిజాయితీ, వినయం , క్రమశిక్షణ వల్ల ప్రజల్లో పేరు ప్రతిష్టలు పెరుగుతున్నాయి. పల్లెటూరు నుంచి అనామకుడిగా దారి తెన్ను లేకుండా వచ్చిన సూర్యం వేషభాషలు మారిపోయాయి.

సాంప్రదాయ వేషధారణ వినయం విధేయత చిరునవ్వు ముఖంతో చిన్న పెద్ద అందర్నీ పలకరిస్తూంటాడు. సూర్యం అదృష్టరేఖలు మారుతున్నాయి. రాజకీయ గురు తుల్యులైన కార్పొరేటర్ రామచంద్రం గార్కి అకస్మాత్తుగా గుండెనొప్పి వచ్చి ఆపరేషన్ జరిగి మంచానికే పరిమిత మయారు.వృద్ధాప్యం , మధుమేహం, అధిక రక్తపోటు కారణాల వల్ల కోలుకోలేక పోయారు. కార్పొరేటర్ మార్పు అనివార్యమైంది. కార్పొరేటర్ పదవికి ఎన్నికలు తప్పలేదు. రామచంద్రం గారి నియోజకవర్గ శాసన సబ్యుడి సిఫారసు మేరకు పార్టీ సూర్యాన్ని తమ అబ్యర్దిగా నిలబెట్టడం, ప్రజాభిమానంతో అధిక మెజార్టీ ఓట్లతో గెలిచి అందరిలో అతిచిన్న వయసున్న కార్పొరేటర్ అయాడు. కాలనీల్లో, బస్తీల్లో ఇంటింటికీ పాదయాత్రలు జరిపి తన కృతజ్ఞతలు తెలియచేసాడు.

అనాథగా ఈ పట్నంలో కొచ్చిన తనకి అన్నం పెట్టి ఆకలి తీర్చి ఇంత ఉన్నత స్థితి కల్పించిన షిర్దీ సాయిబాబాని రోజూ దర్సనం చేసుకుంటు తన భక్తిని చాటుకుంటున్నాడు. నిజాయితీ , క్రమశిక్షణ , ప్రజాభిమానం గల కార్పొరేటర్ గా అధిష్టానం ముఖ్యమంత్రి గారి దృష్టిలో గుర్తింపు సంపాదించాడు. ఎంత ఎత్తు ఎదిగినా అంత ఒదిగి ఉండగల సంస్కారం వంతుడయాడు. రామచంద్రం గారు సూర్యాన్ని తన చిన్న అల్లుడిగా చేసుకున్నారు. చెప్పులు లేకుండా కాలినడకన వచ్చిన సూర్యం ఖరీదైన కార్లలో ప్రయాణం సాగిస్తున్నాడు. సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న యం.యల్.సి. మంత్రి జోగినాథం గారు కారు యాక్సిడెంటు జరిగి చనిపోయారు.

పార్టీ అధిష్టానం యం.యల్.సి. పదవికి పార్టీలో గుర్తింపు పొందిన వ్యక్తి కోసం వెతుకుతూండగా కార్పొరేటర్ సూర్యం మెడలో వరమాల పడింది. కార్పొరేటర్ సూర్యం యం.యల్.సి. సూర్యచంద్రగా రూపాంతరం చెంది సాంఘిక సంక్షేమ మంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగింది. మంత్రి హోదాలో పర్యటన మొదలు పెట్టిన సూర్యచంద్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలు అరికట్టి వెనుక బడిన విధ్యార్దుల సంక్షేమంతో యువజనుల మహిళల ఆదరణ సంపాదించాడు.

ప్రజల్లో పార్టీ అధిస్టానానికి పేరు ప్రతిష్టలు పెరిగాయి. ప్రతి ఎన్నికల్లో ఓటింగు శాతం అధికమవుతోంది.కొన్ని ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతికి దర్యాప్తు కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ముఖ్యమంత్రి మార్పు అనివార్యమైంది. అందరి శాసన సబ్యుల ఏకగ్రీవ సమ్మతితో అధిస్థానం ఆశీసులతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు సూర్యచంద్ర. అభినందనలు కరతాళ ధ్వనులతో సభావేదిక మారు మోగిపోయింది. చక్రాలకుర్చీలో కూర్చున్న మాజీ కార్పొరేటర్ రామచంద్రం గారి కళ్లు చెమర్చేయి. ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన సూర్యచంద్ర వినమ్రంగా వంగి ఆయన పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు. తనకి మద్దతు పలికిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియచేసాడు.

తనని అన్ని వేళలా ఆశీర్వదిస్తు ఇంత ఉన్నత స్థితికి తెచ్చిన సాయిబాబా గారి గుడికి ప్రత్యేక నిధులు కేటాయించి బాగా అభివృద్ధి చేసాడు. తనని కన్నబిడ్డలా చూసుకున్న పూజారి దంపతుల్నీ ఆదరించాడు. గుడి మెట్ల వద్ద ఒకరాత్రి ఆశ్రయ మిచ్చిన బిచ్చగాళ్లందరికీ మౌలిక సదుపాయాలతో పునరావాసం కలగచేసాడు. తన జీవిత గమనానాన్ని మలుపు తిప్పిన పురుషోత్తం మాస్టార్ని పిలిపించి ఘనంగా సత్కరించాడు. అనాథగా పుట్టి పెరిగిన తన ఊరిని అన్ని విధాల అభివృద్ధి చేయించి జన్మభూమి ఋణం తీర్చుకున్నాడు.

మరిన్ని కథలు

Peddarikam munduku vaste
పెద్దరికం ముందుకువస్తే
- శింగరాజు శ్రీనివాసరావు
Sayodhya
సయోధ్య
- కందర్ప మూర్తి
Karona kaatu
కరోనా కాటు
- సోమవరపు రఘుబాబు
Chillara Sevalu
చిల్లర శవాలు
- అఖిలాశ
Tel malisha majaka
తేల్ మాలీషా ! మజాకా!?
- జి.యస్. కె. సాయిబాబా
Sivayya tarimina deyyam-Story picture
శివయ్య తరిమిన దెయ్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.