గాన గంధర్వ ఈ గార్ధభం - కందర్ప మూర్తి

singing donkey

ఊరి బట్టలుతికే చాకలి లచ్చన్న గాడిద యజమాని సరిగ్గా తనకి పోషణ కలిగించడం లేదని కొద్ది రోజులు తను లేక పోతే తన విలువేంటో తెలిసొస్తుందని అలిగి చాకలిపేట వదిలి బయట తిరుగుతు దారి తప్పి దగ్గరలో నున్న అడవిలో ప్రవేసించింది. అడవిలో కెళ్లిన తర్వాత అక్కడి పరిస్థితులు చూసి భయపడి తన సహచర గాడిదలేవైనా కానొస్తాయేమోనని గార్దభ రాగంలో ఓండ్రింపు మొదలెట్టింది.

భయానకమైన గాడిద అరుపులు విన్న అడవి జంతువులన్నీ భయ పడసాగాయి. అడవికి రాజైన మృగరాజు సింహం తన మంత్రి ,సలహాదారు జిత్తుల మారి నక్కను విషయం తెలుసుకు రమ్మని పంపాడు. నక్క గాడిద దగ్గరకొచ్చి ఎవరీ కొత్త జంతువని ఎగాదిగా చూస్తూ ముందుగా దాని ముఖాన్ని పరిశీలించి విచిత్రంగా ఉందని భయపడుతు వెనక కెళ్ళి కాళ్ల డెక్కల్ని వంగి చూడసాగింది.

అలవాటు ప్రకారం గాడిద తన రెండు కాళ్లను సాచి బలంగా తాపు తన్నింది. నక్క రెండు పల్టీలు కొట్టి ఎగిరి పడింది. మూతి దవడ పళ్లు ఊడిపడ్డాయి. నక్క కుంటుతూ మృగరాజు వద్దకెళ్లి " సింహ రాజా! ఆ విచిత్ర జంతువు చాలా బలమైంది. మీరు ముందు కాళ్ల పంజాతో జంతువుల్ని వేటాడితే అది పంజాలేకుండా ముందు వెనక కాళ్లతో కూడా వేటాడ గలదు.వెనక కాళ్లతో తన్ని నా మూతి పళ్లు రాలగొట్టింది. ముందు కాళ్లతో తొక్కితే పచ్చడైపోతును.

మీరు ప్రాణాలు దక్కించుకోవాలంటే వెంటనే అడవి వదిలి పారిపొండని " భయపెట్టింది. వింత జంతువుకు భయపడి మృగరాజు అడవి వదిలి పారిపోయా డని తెలిసి మిగతా జంతువులన్నీ గాడిద విశ్రాంతి తీసుకున్న మర్రిచెట్టు వద్దకు రావడం చూసిన గాడిద ముందు భయపడినా దైర్యం తెచ్చుకని గాంభీర్యం ప్రదర్సిస్తు " ఎవరు మీరు ? ఇక్కడి కెందు కొచ్చారని " ధాటిగా అడిగింది. అడవిలోని చిన పెద్ద జంతువులన్నీ వినయంగా " వనరాజా ! మీ శక్తి సామర్ధ్యాలు తెలిసాయి. ఇప్పటి నుంచి మీరే మా ప్రభువు.మీరు ఎలా చెబితే అలా నడుచు కుంటామని " ప్రాధేయ పడ్డాయి. ఆకలితో నకనక లాడుతున్న గాడిద పాచికపారినందుకు ఆనందించి " వినండి నా ఆజ్ఞ. నేను శాకాహారిని. మీ కెలాంటి ప్రాణహాని తలపెట్టను.

భయ పడకండి. నా పాలనలో హాయిగా ఉండొచ్చు. నాకు ఆకలిగా ఉంది. పళ్లు ఫలాలు పచ్చ గడ్డి తీసుకురండని " హుంకరించింది. వెంటనే కుందేలు లేత పచ్చ గడ్డి పరకలు కేరట్ దుంపలు , కోతి పండిన మామిడి పళ్లు, ఏనుగు లేత అరటి ఆకులు చెరకు గడలూ తెచ్చి పడేసాయి. గాడిద అవన్నీ తింటు చాకలి లచ్చన్న రోజంతా చాకిరేవు బండ చాకిరి చేయించుకుని మోపుడు పచ్ఛగడ్డైనా పెట్టకుండా అర్దాకలితో డొక్క మాడ్చేవాడు.

ఇక్కడే నయం, ఈ అమాయక జంతువులకి చెప్పి ఏది కావాలంటే అది కడుపు నిండా మెక్క వచ్చు. వీటన్నిటినీ నా చెప్పు చేతల్లో ఉంచుకుని అధికారం చెలాయిస్తు స్థిరనివాసం చేసు కోవాలనుకుంది. అక్కడ లచ్చన్న గాడిద ఎటుపోయిందోనని అంతటా వెతకడం మొద లెట్టాడు. లచ్చన్న తన గాడిదకు గుర్తింపుగా మెడలో ఒక ఇత్తడి మువ్వ కట్టేడు. అది తన అలవాటు ప్రకారం మెడ ఎత్తి ఓండ్ర పెట్టి నప్పుడు ఆ గంభీర స్వరంతో పాటు మువ్వ శబ్ధం వినిపించేది. అడవి జంతువులకు ఆ శబ్దాలు విచిత్రమనిపించి చుట్టూ చేరేవి. గార్దభానికి తన గాత్రం మీద నమ్మకం ఏర్పడింది. అందు వల్ల తను గాత్ర కచేరీ చేసేటప్పుడు అడవిలోని పక్షులు జంతువులు జత కలిపి గాత్రం చెయ్యాలని శాసించింది. ఇష్టం ఉన్నా లేకపోయినా గాడిద చెప్పిన సమయానికి మర్రిచెట్టు దగ్గరకు చేరేవి.రోజురోజుకీ గాడిద గాత్రకచేరీ సతాయింపులతో అడవి లోని జంతువులు పక్షులు విసిగిపోయి ఈ పీడ ఎలా వదులుతుందా అని అనుకునేవి. రోజూ గార్దభరాజుకు కావల్సినంత పచ్చ గడ్డి పళ్లు సుష్టుగా తిని పుస్టిగా బలంగా తయారైంది.తన బండారం బయట పడుతుందేమోనని నేను రాత్రిళ్లు నాలుగు కాళ్ల మీద నిలబడి ధ్యానం చేస్తూంటాను. కాబట్టి రాత్రి సమయంలో నా దగ్గరకొచ్చి ధ్యాన భంగం చెయ్యెద్దని హుకుం జారీ చేసింది. గాడిద ఒక రోజు చారల గుర్రాన్ని పిలిచి నువ్వు నా జాతి దానివి. నాతో గాత్ర కచేరీకి రావల్సిందిగా ఆజ్ఞాపించింది.

ఎప్పుడు గొంతెత్తి అరవని జీరల గుర్రం భయ పడింది. ఈ గండం నుంచి ఎలా బయట పడాలా అని మౌనంగా అక్కడి నుంచి జారుకుంది. ఆ చెట్టు మీద గూడు కట్టుకుని కాపుర ముంటున్న కాకి కూడా గార్దభ సంగీత బాధితురాలే. గార్దభం జీబ్రాగుర్రంతో అన్న మాటలు విన్న కాకి ఏదో ఒక ఉపాయం చేసి గాడిదను ఈ అడవి నుంచి పారిపోయేలా చేయాలనుకుంది. కాకి జీబ్రా గుర్రం దగ్గరకెళ్లి తనొక ఆలోచన చేసాననీ కనక నువ్వు గార్దభ రాజు దగ్గగ గాత్రకచేరీ పందేనికి సిద్ధమనీ , అడవి లోని అన్ని పక్షి జంతు సముదాయం ముందు పందెం జరగాలని షరతు పెట్టమంది. జీబ్రా గర్రం మాట విన్న గార్దభం వికటాట్టహాసం చేస్తూ ఇన్నాళ్లకి నాతో ఢీ కొనే మొనగాడు ఎదురు పడ్డాడని షరతుకు ఒప్పుకుంది. కాకి తన ఉపాయం ప్రకారం అడవికి సమీప గ్రామంలో కెళ్ళి బయట పొలంలో ఎండ పోసిన పండు ఎర్రమిరప్పళ్లు తెచ్చి చారల గుర్రానికిచ్చి , ఇవి గాత్ర శుద్ధికి ఉపయోగ పడే అడవి మూలికా ఫలాలు, వీటిని బాగా నలిపి ఉంచు.'అని చెప్పింది. అక్కడి నుంచి కాకి తిన్నగా గాడిద దగ్గరకొచ్చి " గార్దభ రాజా ! అందరూ పన్నాగం చేసి చారల గుర్రాన్ని మీతో గాత్ర కచేరీ పోటీకి పంపుతున్నారు. ఏవో అడవి మూలికా ఫలాలు తినిపించి నిన్ను ఓడించి అందరి ముందు నవ్వులపాలు చెయ్యాలను కుంటున్నారు,

కనుక ఆ మూలికా ఫలాలు నువ్వే తింటే విజయం నీదే అవుతుందని" చెప్పి వెళిపోయింది. అడవి జంతు పక్షి సమూహ సమక్షంలో గాత్ర కచేరీకి సిద్ధ పడిన గాడిద జీరల గుర్రం ముందున్న ఎర్రని పొడవైన మిరప పళ్లను చూడగానే కాకి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి గబుక్కున వాటిని నోటిలోకి లాక్కుని కరకర నమలసాగింది. కొద్ది సేపటికి గాడిద నాలిక మీద, నోట్లో బొబ్బలు వచ్చి మంటతో అరుస్తూ అడవి విడిచి పరుగులు పెట్టింది. చుట్టూ చేరిన అడవి జంతువులన్నీ గాడిద పాట్లు చూసి పకపక నవ్వడం మొదలెట్టాయి. చారల గుర్రంతో పాటు కాకి గాడిదకి తగిన ప్రాయశ్ఛిత్తం జరిగి పీడ విరగడైందని సంతోషించాయి.

మరిన్ని కథలు

Peddarikam munduku vaste
పెద్దరికం ముందుకువస్తే
- శింగరాజు శ్రీనివాసరావు
Sayodhya
సయోధ్య
- కందర్ప మూర్తి
Karona kaatu
కరోనా కాటు
- సోమవరపు రఘుబాబు
Chillara Sevalu
చిల్లర శవాలు
- అఖిలాశ
Tel malisha majaka
తేల్ మాలీషా ! మజాకా!?
- జి.యస్. కె. సాయిబాబా
Sivayya tarimina deyyam-Story picture
శివయ్య తరిమిన దెయ్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.