నాన్నా!నువ్వు మారవా ప్లీజ్ - రాము కోలా

Please change dad

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా! మరి, ఆ అన్నం నుండి వచ్చే గంజినీళ్ళను ఏమనాలి? ఆకలితో ఉన్న వాడికి గంజినీళ్ళే దివ్యౌషధం! అంతే కదా? గంజినీళ్ళు అనే పదానికి నా జీవితంలో ఉన్నంత ప్రాముఖ్యత! మరెవ్వరి జీవితల్లో బహుశా ఉండదేమో. నాకు ఊహ తెలిసిన క్షణం నుండి, ప్రతిరోజు స్వీకరిస్తున్న దివ్యౌషధం అదే కనుక.

"నా పేరు నజీమా!". నాకు జీవితంలో రెండే రెండు కోరికలు, "మరో జన్మ అంటూ ఉంటే! మా అమ్మకు కూతురుగానే పుట్టాలి!" ఇది అందరూ కోరుకుంటారు ! రెండవది .. "నాన్న లాంటి వాడికి మరో జన్మ ప్రసాధించకు అని దైవాన్ని వేడుకుంటాను. " ఇలా కూడా వేడుకునేవారు ఉంటారా ! అని మీకు అనిపిస్తే, కారణం తెలుసు కోవాలంటే , కాస్త నా జీవిత కథలోకి ఒక్క క్షణం తొంగి చూడండి. కన్నీటి సంద్రంలో ధైర్యంగా చిరునవ్వుతో కనిపించే మా అమ్మ పాత్ర మీకు పరిచయం చేస్తాను.

ముందుగా కనిపించేది మా అమ్మ. తరువాత కనిపించేది అమ్మ చిరునవ్వు ముఖారవిందం. ఆ వెనుక తనను కబళించాలని చూసే అనేక సమస్యలు. నీడలా పొంచి ఉంటూ, అందరికి కోడి కూసిన తరువాతే తెల్లవారుతుంది, అదేమిటో! అమ్మకు పాల ఆటో వాడి కేకతో తెల్లవారుతుంది. అదేదో మా ఇంటికి పాలు తీసుకు వచ్చే వాడి కేక అనుకునేరు! కాదండి. అందరి ఇల్లకు పాల ప్యాకెట్లు వేసి రావడం కోసం అమ్మకు పిలుపు. మా ఇంటికి చుట్టూ ఉన్న యాబై ఇళ్లలో అమ్మ పాల ఫ్యాకెట్లు వేసి రావడం, నాకు నాన్నకు ఎంతో కాలంగా తెలియని అనేక విషయాల్లో అది ఒకటి. అమ్మకు మరో దిన చర్య కూడా ఉందండోయ్,! దగ్గర్లోని నాలుగు ఇల్లముందు ఊడ్చి ముగ్గులు పెట్టి రావడం. అమ్మ తన చీరలకు ఏరోజూ, గంజి పెట్టడం నేను చూడలేదు. కానీ. ప్రతి రోజూ దగ్గర్లో ఉన్న ఇళ్లలో నుండి బట్టలకు పెట్టాలని గంజి మాత్రం తెప్పించేది.

ఇన్ని పనుల మధ్యలో ఎప్పుడు నాకోసం నీళ్ళు కాగబెట్టేదో, లేచి లేవగానే త్వరగా స్నానం చేసి ఫలానా వారి ఇంటి దగ్గర "అమ్మ చీరకు గంజి పెట్టాలంది" అని చెప్పి ఓ గిన్నె పెట్టి రమ్మంటూ ఓ చిన్న పని పురమాయించేది. స్నానం చేసి వచ్చే సరికి అమ్మ కనిపించక పోయేది! కానీ నాకు తెలియకుండా దాచిన మరో దినచర్య ఒకటుందని, అది నాలుగు ఇళ్లలో గిన్నెలు తొమేసి వచ్చే పని ఒప్పుకుందని. నాకు తెలిసింది అనే విషయం అమ్మకు తెలిసిన రోజు, అమ్మ నా చేతులు పట్టుకుని, "నాన్నకు తెలియనీయకు" అని, జారే కన్నీటిని ఆపుకుంటూ అడిగిన క్షణం ఇంకా నాకు గుర్తు. తెలిస్తే ఎక్కడ గొడవ చేసి, ఈ కాస్త ఆధారం పోగొడతాడేమో అని అమ్మ భయం కావచ్చు.

నేను స్కూలుకు బయలుదేరే సమయానికి ఏ రోజు నాన్న నిద్ర లేచేవాడు కాదు. ఉదయం నాన్నను చూడడం అంటూ జరిగితే, అది మంచంపైన నిద్రలో తను ఉండగా చూడడమే నేను తిరిగి వచ్చే సమయంకు మాత్రం, ఎప్పుడూ ఇంట్లో ఉండేవాడు కాదు. ఏ అర్థరాత్రో మాటలు పెద్ద పెద్దగా, గిన్నెలు విసిరేసిన శబ్దం వినిపిస్తుందో అప్పుడు నాన్న వచ్చినట్లు గుర్తు చేసుకునే దాన్ని. అమ్మ రోజూ టిఫన్ పెట్టేది, కానీ ఇంట్లో చేసినట్లు ఎప్పుడూ కనిపించేది కాదు. "మరి నువ్వు తినవా ! అంటే", "నాన్న లేచిన తరువాత తింటాలేరా! నీకు స్కూల్ టైం అవుతుందిగా త్వరగా తినేసేయ్" అంటూ మాట దాటింసేది.

చాలా రోజుల వరకు అమ్మ దినచర్య నాన్నకు తెలియనివ్వలేదు. ఇది అమ్మకు అవమానమని కాదు, ఎక్కడ వచ్చి అల్లరి చేసి తను చేసుకునే పనులు చెడగొడతాడో అనే భయం. స్కూల్ కు వెళుతుంటే అమ్మ చెప్పే రెండు మాటలు పదేపదే గుర్తు వచ్చేవి. " నువ్వు బాగా చదువుకోవాలిరా!, అది మీ నాన్న కోరిక, మధ్యహ్నం బడిలో పెట్టే భోజనం బాగలేదనో, కూర నచ్చలేదనో తినకుండా ఉండకు నీరసం వస్తుంది, నీరసం వస్తే చదువు కోలేవు సరేనా! " అని పదే పదే చెప్పేది. ఇది నా చదువుకోసం చెప్పే మాటైనా, ఒక వేళ అక్కడ తినకుండా ఇంటికి వస్తే ఇక్కడ తినడానికి ఏమీ ఉండదు అని చెప్పలేక అని నాకు స్కూల్ కు సెలవు ఇచ్చిన రోజు తెలిసేది.

అమ్మ ఎందుకో చాలా నలతగా కనిపించింది, అడిగినా ఏదీ చెప్పదు, అనుకుంటుండగానే అమ్మ దగ్గరకు రమ్మంటూ పిలిచింది. వెళ్లి అమ్మకు దగ్గరగా కూర్చున్నా, అమ్మ శరీరం కాలిపోతుంది, బహుశా జ్వరమేమో అనుకుంటుండగానే అమ్మ చెప్పింది. "టీచ్చరు రమా గారింటికి వెళ్లి, ఈ రోజు అమ్మ రాలేక పోతుందని చెప్పి వచ్చేయ్," వెళ్ళగలవా అంటూ నావైపు చూసింది. " వెళతానమ్మా " అంటూ లేచి గుమ్మం దాట బోతుంటే, అమ్మ పిలిచింది "ఎంటమ్మా" అని ఆగిపోయాను. "ఆంటీ ఏదైనా ఇస్తే తీసుకోకు, సరేనా" అంటూ మరో మాట చెప్పింది. అలాగే నంటూ టీచరు రమాగారింటికి వెళ్ళాను. "ఆంటీ అమ్మ పంపించింది, ఈ రోజు తను రాలేనని చెప్పి రమ్మంది" అంటూ, చెప్పి వెనుదిరిగాను. "నజీమా! అలా కూర్చో ఇప్పుడే వస్తాను" అంటూ లోపలికెళ్ళి ఒక హాట్ బాక్స్ తో తిరిగి వచ్చింది. "ఇది అమ్మకివ్వు", "ఈ రోజైనా కాస్త సరిగా తినమను, ఎలా నెట్టుకు వస్తుందో సంసారం, ఒక్క పైసా సంపాదించని భర్త, ఎక్కడైనా అప్పుచేసి రూపాయి దాచేస్తే ఇల్లంతా వెతికి మరీ తీసుకుపోయి తాగి ఏ అర్థరాత్రో ఇంటికి చేరాడతాడు. ఎంత ఇబ్బంది వచ్చినా ఒక్కరోజుకూడా పనికి రాకుండా ఆగదు, ఈ రోజు రాలేదంటే తన పరిస్థితి కదలలేకుండా ఉందేమో. ముందు ఇవి తినేసి, కాస్త బయలుదేరి ఉండమను, ఈ రోజు బలవంతంగానైనా తనని హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాలి. మూడు నెలలుగా చెపుతునే ఉన్నా, ఒక్కరోజు నాతో హాస్పిటల్ కు రమ్మని, వింటేనా?, ఇలా పూర్తిగా ఆరోగ్యం చెడిపోతే ఎలా?, కనీసం టిఫన్ పెట్టినా ఇక్కడ తినదు, ఇంటికి తీసుకెళ్లతా అంటుంది, అక్కడైనా ఏమైనా తింటుందా" అని అంటుంటే, ఇంటి పరిస్థితి కొద్ది కొద్దిగా అర్దమౌతుంది నాకు. అమ్మ తనలో దాచుకున్న ఒక్కోనిజం.

"వద్దు వద్దు "అంటున్న, బలవంతంగా చేతిలో పెట్టిన హాట్ బాక్స్ తీసుకుని, అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటికి చెరిన నాకు, నాన్న గొంతు వినిపిస్తుంది పెద్దగా,. "రోజూ చాలీ చాలని టిఫన్ తోనే బయటకు పోతున్నా, ఈ రోజు అది కూడా లేకుండా చేసావా?" "అంతగా నీకు పనులేమున్నాయ్, కనీసం టిఫన్ చేయడానికి కూడా బద్దకమేనా?" అంటూ లాగి అమ్మ చెంపమీద కొట్టేసాడు. బిక్కు బిక్కుమంటూ అక్కడే ఆగిపోయిన నావైపు చూస్తూ, " ఇలా బయట నుండి టిఫెన్లు తెప్పించుకు తింటున్నావా? డబ్బులు అడిగితే మాత్రం లేవంటావ్, మీ అమ్మనో, మీ అన్నయ్యలనో అడిగితే ఇవ్వరా? అది మాత్రం చేయలేవు, దరిద్రం ఇంట్లో తిని కూర్చోవడం మాత్రం తెలుసు," అనుకుంటూ, నా చేతిలోని బాక్స్ లాక్కుని మొత్తం తినేసి, ఖాళీ బాక్స్ మూలకు విసిరేసి, బయటకు వెళ్లి పోయాడు. తల వంచుకు నిల్చున్న నా దగ్గరగా వచ్చింది అమ్మ. "చెప్పా కదరా! వాళ్ళ ఇంటికి ఈ రోజు పనికి పోలేదు, అలా ఏదైనా పెడితే పని చేయకుండా తెచ్చుకో కూడదమ్మా, సరేనా" అంటూనే ఏమీ జరగనట్లు ఇంటిపనిలో లీనమైంది అమ్మ.

నాన్న అంటే ప్రేమ స్వరూపం అంటారు, కనీసం నేను ఏ తరగతి చదువుతోంది కూడా తెలియదు తనకు. దసరా సెలవులు రావడం, నాకు నాన్న గురించి, అమ్మ గురించి తెలుసుకునే అవకాశం తెచ్చి పెట్టింది. అమ్మ ఎక్కడెక్కడ, ఎవరి ఇంటి దగ్గర పని చేస్తుంది, ఎంతగా తను నాకోసం కష్టపడుతుందో, పని చేసిన రోజు మాత్రమే ఆ ఇంటినుండి టిఫన్ తెచ్చేది, లేని రోజు పక్క ఇంటి నుండి తెచ్చిన గంజి నాకు తెలియనీయకుండా, ఉదయమే అన్నం వండుతున్నట్లు కొద్దిగా బియ్యం వండుతూ, వేడివేడి గంజి కాస్త అన్నం కలిపి ఇచ్చేది, ఆరోగ్యంకు ఇది చాలా మంచిదంటూ. ఒక్కటొక్కటిగా నాన్న మంచి అలవాట్లు తెలియడం మొదలైంది. నాకు. ఉదయమే ఒక సిగరేటు పెట్టే, సాయంత్రంకు తాగడానికి డబ్బులు, కొత్త సినిమా వస్తుందంటే, ఇళ్లు మొత్తం వెతికి వెతికి ఎక్కడెక్కడో దాచిన రూపాయి బిళ్ళతో సహా, పోగుచేసుకు పోవడం నాన్న ప్రత్యేకత. దానికి తోడు ఈ మధ్య పేకాట కూడా మొదలైంది. నాన్న దురలవాట్లు, దురహంకారం తెలియడం మొదలైంది నాకు దసరా సెలవుల్లో.

ఉదయమే ఎవ్వరిదో కొత్త గొంతు వినిపిస్తుంటే, దుప్పటి లోనుండి తొంగి చూసా. ఎవరో కొత్త వ్యక్తి. "ఇలా అయితే ఎలా అమ్మా,! ఇప్పటికే మూడు నెలల అద్దె ఆగిపోయింది, ప్రతి సారి రావడం ,మీ ఆయనను అడగడం, నన్ను చూసి ఇచ్చావా ! ఏంటి ఇళ్లు, ఎవరిని చూసి ఇచ్చావో వాళ్ళనే అడుగు. మరో సారి ఇలా వచ్చి పొద్దున్నే అడిగావో మర్యాదగా ఉండదు" అని మీ ఆయనతో అనిపించుకోవటం కాస్త ఇబ్బందిగా ఉంటుంది, కాస్త త్వరగా సర్దు బాటు చేయండి, అయినా.. అలా డబ్బులన్నీ పేకాటకు తగలేయకపోతే నా అద్దె నా మొఖం మీద కొట్టోచ్చుకదా, నువ్వు అయినా చెప్పొచ్చుకదా, చూడమ్మా! మరో పది రోజుల్లో వస్తా, ఇచ్చారా సరేసరి, లేదంటే ఇళ్లు ఖాళీ చేయవలసి వస్తుంది" అంటూ వెళ్లి పోతున్న అతన్నే చూస్తూ, నాన్న గురించి కొన్ని కొత్త నిజాలు తెలుసుకున్నా అనిపించింది.

నా చదువు అమ్మకు భారంగా మారుతుందని అర్ద మౌతుంది మరో నాలుగు ఇళ్లలో పని ఎక్కువగా ఒప్పుకుందేమో, ఉదయం తనకు ఉరుకులు పరుగులే, ఒక్కసారి కూడా విసుగు చూసి ఉండను తన ముఖంపైన. కానీ రోజు రోజుకు నాన్న ప్రవర్తన దారుణంగా తయారౌతుంది. ఏ అర్థరాత్రినో రావడం ఎదో ఒక విధంగా గొడవ పెట్టుకోవడం, అమ్మ అన్నం తనతో తినపోతే గొడవ, "ముందే తినేసావా "అంటూ, అందుకే అమ్మ దాదాపుగా నాన్న వచ్చే వరకు అలా ఎదురు చూస్తూనే ఉండేది. అన్నం కలిపేవాడు, ఏదో విధంగా గోడవ లేపి, అందులో నీళ్లు పోసి అలిగి పడుకునేవాడు కొత్త సినిమా టికెట్లకు డబ్బులు ఇవ్వలేదని అమ్మను స్నానానికి వెళ్ళనిచ్చి కిరోసిన్ పోసి ఇంట్లోని బట్టలన్ని అంటించేసాడు ఒక సారి. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో ఎన్నో నాన్న అనే మనిషి చేసిన దుర్మార్గం పనులు. ఇలా ఉండగా ఒక రోజు బాగా తాగి ఆటో డ్రైవ్ చేస్తూ పోలీస్ కారునే గుద్ది, కొట్లాటకు ప్రయత్నం చేయడం,అదే సమయంలో దగ్గర గంజాయి దొరకడంతో మూడు సంవత్సరాల జైలు శిక్ష పడింది. విడి పించడానికి లాయర్ చుట్టూ తిరుగడానికి అమ్మ తన పుట్టింటి వారు పెట్టిన కాస్త బంగారం అమ్మవలసి వచ్చింది.. కానీ గంజాయితో పట్టు బడినందువలన బెయిల్ దారకలేదు.. నా పదవతరగతి చదువు పూర్తి అయింది, జిల్లా స్థాయి లో ఫస్ట్ నేనే, బాగా చదివించమని అందరి మాటలతో , ఇద్దరి మేనమామల ప్రోత్సాహంతో అమ్మ నన్ను హైద్రాబాద్ లో ఓ ప్రైవేట్ కాలేజిలో చేర్పించింది. దగ్గర్లో ఉంటే ఇంటి పరిస్థితి చూస్తుంటే నా చదువు ఎక్కడ ఆగిపోతుందో అనే ఆలోచన కావచ్చు. ప్రతి మూడు నెలలకు ఒక్కసారి, అమ్మ వచ్చిపోతూ ఉండేది, నాన్న మాత్రం ఎప్పుడూ రాలేదు. రావాలని కూడా నేను ఎప్పుడూ కోరుకోలేదు కూడా నా బీ.యస్సీ పూర్తి అయింది. హైద్రాబాద్ లోనే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ పూర్తి చేసాను. అలాగే యం.యస్ సి కూడా చదవాలను కున్నాను .

మూడు సంవత్సరాల తరువాత నాన్న జైల్ నుండి బయటకు వచ్చాడు. ఇలా సాగిపోతుందనుకున్న తరుణంలో, ఒక. విషాద సంఘటన చోట్టు చేసుకుంది. "నాన్న కోపంతో ఎప్పుడో అమ్మ తలపైన మండుతున్న కట్టె తీసుకు కొట్టిన దెబ్బ వలన మెదడులో రక్తం గడ్డ కట్టిందట", దాని ప్రభావంతో అమ్మకు ఒక కాలు చేతికి పక్షవాతంలా వచ్చిందట. టీచర్ రమా ఆంటీ ఫోన్ చేయడంతో నేను హైద్రాబాద్ నుండి రాక తప్పలేదు. అమ్మను వదలి వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయాను పది మంది పిల్లలకు ట్యూషన్ చెప్పుకుంటూ . కాలం మరో సారి తన ఉనికి చాటుకుంది, తాగి తాగి నాన్న లివర్, కిడ్నీ లు దెబ్బతినడంతో, నాన్నను కూడా ఆసుపత్రిలో చేర్చక తప్పలేదు. కుటుంబ బాధ్యతలు నావిగా చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు, ఒక పక్క అమ్మ, ఒక పక్క నాన్న. అమ్మ కన్నులలో కన్నీరు "నీ చదువు ఆగిపోయింది కదా "! అనే భాధ కనిపిస్తుంది " సమయం దొరికితే ఎవరినైనా ఓ యాభై అడిగేసి నాలుగు చక్కలు తాగేయాలనే నాన్న ఆలోచనలు. మరో పక్కన కనిపిస్తుంటే.. బాధలను భరిస్తున్న నా అధరాలపై ఓ చిన్న చిరునవ్వు.. నేనున్నా నీకు తోడుగా అంటూ". ప్రస్తుతం..అమ్మ రైతు బజార్ లో కూరగాయల దుకాణం నడుపుకుంటూ నాకు తోడుగా ఉంటుంది. ఒక పెద్ద హోటల్ ల్లో క్యాషియర్ గా పార్ట్ టైం జాబ్ చేస్తూనే ,ట్యూషన్ చెపుతున్నాను నేను పిల్లలకు. నాన్న యథావిధి. గవర్నమెంట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్. ప్రవర్తన మారలేదు. తాగుడు మానలేదు, ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది.. ప్రతి క్షణం ఎదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమే నాన్నకు తెలిసింది. ఇప్పటికి అమ్మ మార్కెట్ దగ్గర,నేను పని చేసే హోటల్ దగ్గర నాన్న గొడవ చేసిన సంఘటనలు ఎన్నో...!! ఇలా సమస్యలు మధ్య సతమతమౌతూ. ఒక్క క్‌ణం అలా దైవాన్ని కోరుకున్నా.. అది కూడా నాకోసం కాదు... అమ్మకోసం కూడా కాదు.. నాన్న కోసం.. తను తిరిగి ఇలాగే జీవితం గడపకూడదని. ఇదండి నా కథ... ఇక నిర్ణయం మీదే! నా కోరికలో తప్పుందా.....!! ఉంటే మన్నించండి.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి