నిజమైన జ్ఞాని. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

Nijamaina Gnani

వంగ రాజ్యాన్నిపరిపాలించే చంద్రసేనుడు తనమంత్రి సుబుద్దుని తొ'మంత్రి వర్యా సర్వసంగ పరిత్యాగి అయిన జ్ఞాని మేము దర్శించదలచాము రేపు అటువంటి వ్యక్తిని చూసే ఏర్పాట్లు చేయండి'అన్నాడు. 'అలాగే ప్రభూ తప్పకుండా రేపు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను' అన్నాడు. ఒక్క రాత్రిలో అటువంటి జ్ఞానిని ఎలా చూపించాలో తెలియని మంత్రి ఓ చిన్న తంత్రంతో ఆ ఆపదనుండి బైటపడే మార్గంగా,తనకు తెలిసిన ఓ పగటివేషగాడిని కలసి 'రేపుఉదయం అడవి మొదట్లొ మర్రి చెట్టుకింద ముని వేషంలో కూర్చో రాజుగారు వచ్చి నిన్ను దర్శించుకుని బహుమతులు ఇవ్వబోతాడు సర్వసంగ పరిత్యాగులం మాకు ధనమెందుకు అని తిరస్కరించు,అలాచేస్తే నీకు వందవరహాలు ఇస్తాను'అన్నాడు పగటి వేషగాడు అంగీకరించి మరుదినం ఉదయాన్నే ముని వేషం ధరించి మంత్రి సూచించిన ప్రదేశంలో పద్మాసనం వేసుకు దండం,కమండలంతో కూర్చొని జపం చేయసాగాడు.రాజుగారు రాణిగారుతో కలసి మంత్రి చూపించిన జ్ఞాని పాదాలపై తమ తలలు ఆనించి నమస్కరించి, బంగారు పళ్ళెంలో వజ్రాలు, రత్నాలు బంగారునాణాలు అతని ముందు పెట్టి స్వీకరించమని వేడుకున్నారు. 'సర్వసంగపరిత్యాగిని నాకు ధనం ఎందుకు?వద్దు'అన్నాడు జ్ఞాని వేషంలోని పగటివేషగాడు.అతని మాటలకు సంతోషించిన రాజు తనపరివారంతో వెళ్ళిపోయాడు. 'వేషం బాగా కుదిందోయి ఇంద నీకు ఇస్తాను అన్నవంద వరహాలు' అన్నాడు మంత్రి వంద వరహాలమూట ఇస్తూ. 'సర్వసంగపరిత్యాగులం మాకుధనం ఎందుకు'అన్నాడు ఆజ్ఞాని వేషధారి. 'అబ్బా రాజుగారు వెళ్ళిపొయారు.ఇంక నీవు నటించనవసరంలేదు' అన్నాడు మంత్రి. 'అయ్య కొద్దిసేపు జ్ఞానిలా నటిస్తే దేశపాలకుడుతన తలను నాపాదాలకు తాకేలా నమస్కరించి కోట్లధనం నాకు సమర్పించబోయాడు నిజమైన జ్ఞాన సంపద ఇంత గొప్పదని తెలుసుకున్నాను జ్ఞానసంపద తెలుకునేందుకు గురువును ఆశ్రయించబోతున్నాను సెలవు'అని మంత్రికి నమస్కరించి అడవిలోనికి వెళ్ళి పోయాడు జ్ఞాని వేషంలోని పగటివేషగాడు.

మరిన్ని కథలు

Veyyi roopayala jaree cheera
వెయ్యి రూపాయిల జరీ చీర
- పూర్ణిమ పెమ్మరాజు
Peddarikam
పెద్దరికం
- Prabhavathi pusapati
KARMA VADALADU
కర్మ వదలదు
- తాత మోహనకృష్ణ
mabbuteralu
మబ్బుతెరలు
- ప్రభావతి పూసపాటి