మన మంచితనమే.. మనకు రక్ష! - చెన్నూరి సుదర్శన్

Mana manchitaname manaku raksha

అప్పుడు నేను జగిత్యాలలో టెలీఫోన్ ఆపరేటర్ గా పని చేస్తున్నాను. నాకు మెరిట్ ప్రాతిపదికన 1976 లో అలా పీజీ పూర్తికాగానే.. ఇలా వరించిన ఉద్యోగమది. మా ఇంట్లో అంతా సంబరపడ్డారు. ‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమంటే మాటలా..!’ అన్నట్టు నా అదృష్టానికి స్నేహితులంతా పొగడ్తలతో ముంచెత్తారు.

అయినా నాలో ఏదో వెలితి..

ఉద్యోగంలో చేరిన రెండవ సంవత్సరమేహైదరాబాదు జోన్ నుండి నాకు ‘ద బెస్ట్ టెలీఫోన్ ఆపరేటర్’ అవార్డు వచ్చింది. అయినా నా మనసు తృప్తిపడలేదు. ఎప్పటికైనా ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి నాకు అత్యంత ప్రీతి పాత్రమైన బోధనా వృత్తిలో చేరాలనేదే నాఆకాంక్ష. జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల ప్రకటన కోసం ఎదురిచూపులు.

నాకు విద్యార్థి దశ నుండే విద్యాబోధన అంటే మక్కువ. నాతో బాటుగా చదివే వారికి.. నా కంటే చిన్న తరగతుల వారికీ పాఠాలు చెప్పే వాణ్ణి. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు హన్మకొండలోని రాధాస్వామి సత్సంఘ్ ఆలయప్రాంగణంలో విద్యార్థులకు మాత్రమే అద్దెకిచ్చే గదుల్లో నలుగురం స్నేహితులం కలిసి ఒక గది తీసుకున్నాం. అదే అలవాటుతో అక్కడా విద్యార్థులకు చేయూత నిచ్చాను.

టెలీఫోన్ ఆపరేటర్ ఉద్యోగం షిఫ్ట్ పద్ధతిలో నడిచేది. దానికి అనుగుణంగా పదవ తరగతి, ఇంటర్ మీడియట్ విద్యార్థులకు గణిత శాస్త్రం బోధించే వాణ్ణి. నేను డబ్బు ఆశించక పోవడంతో.. మా ఇల్లు నిత్యం విద్యార్థులతో కళ, కళలాడేది.

ఒక రోజు నా స్నేహితుని వివాహ ఆహ్వాన పత్రిక అందుకుని వరంగల్ వచ్చాను. వివాహ అనంతరం భోజనం చేసుకుని నా పూర్వపు ఆశ్రమం రాధాస్వామి సత్సంఘ్ దర్శించుకోవాలని బయలుదేరాను. అందులో కాసేపు విశ్రమిస్తే మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. అది నా అనుభవం. పైగా అక్కడ నాకు తెలిసిన కొదరు మిత్రులను కూడా కలుసుకోవచ్చనే అభిలాష.

సత్సంఘ్ ప్రధాన ద్వారంలో అడుగు పెట్టగానే రమేష్ అనే చిన్న పిల్లవాడు ఎదురయ్యాడు. అప్పుట్లో ఆరో తరగతి చదివే వాడు. ఇప్పుడు ఎనిమిదవ తరగతి అనుకుంటాను.

“అన్నయ్యా.. నమస్తే ” అంటూ ఎంతో ఆప్యాయంగా రెండు చేతులూ జోడించాడు.

అతణ్ణి చూడగానే నాకూ చాలా సంతోషమేసింది. ఉద్వేగంతో హత్తుకున్నాను.

“అన్నయ్యా.. జూనియర్ లెక్చరర్ ఉద్యోగ కోసం మా అక్కయ్య అప్లై చేసింది. మీరూ చేశారనుకుంటాను” అనే సరికి నివ్వెర పోయాను. భగవంతుడే రమేష్ రూపంలో వచ్చి కటాక్షించాడన్నంత సంబరమేసింది.

“నాకు తెలియదు రమేష్.. ఒక్క నిముషం” అంటూ నా చేతి లోని బ్యాగును రమేష్ కు అందజేసి గబా, గబా కుళాయి దగ్గరికి వెళ్ళి కాళ్ళూ, చేతులు కడుక్కున్నాను. అంతే వేగంతో పరుగెత్తి స్వామి వారిని దర్శించుకుని.. మనసారా ప్రార్థించాను.

తిరిగి వచ్చి రమేష్ చేతిలోని బ్యాగు తీసుకుంటూ.. “పత్రికా ప్రకటన ఉందా..” అంటూ ఆతృతగా అడిగాను.

“అక్కయ్య దగ్గర ఉంది. అన్నయ్యా పదండి.. మా ఇంటికి వెళ్దాం” అంటూ తన చేతిని నాచేతికి అందించి వారి ఇంటి వైపు అడుగులు కదిపాడు.

వీధి గుమ్మంలో నిలబడి చూస్తున్న రమేష అక్కయ్య అనిత నన్ను పోల్చుకుని.. “నమస్తే అన్నయ్యా..” అంటూ సాదరంగా ఆహ్వానించింది. కూర్చోండి అన్నట్టు కుర్చీ చూపిస్తూ. ఇంట్లోకి వెళ్ళింది. రమేష్ గూడా అనిత వెనుకాలే వెళ్ళాడు. నేను కుర్చీలో కూర్చున్నాను. ఆమెకు డిగ్రీలో తనకు కష్టతరమైన గణితశాస్త్ర సమస్యలను రమేష్ తో పంపిస్తే సాధించి ఇచ్చే వాణ్ణి. అనిత నాతో మాట్లాడ్డం ఇదే మొదటి సారి. రమేష్ విషయం చెప్పినట్టుంది.. ఒక చేత్తో మంచి నీళ్ళ గ్లాసుతో బాటు మరో చేత్తో పత్రికా ప్రకటన తీసుకు వచ్చి ఇచ్చింది. మంచినీళ్ళ గ్లాసు టీ పాయ్ మీద పెట్టి ముందుగా పత్రికా ప్రకటనలో అప్లై చెయ్యడానికి చివరి తేదీ వెదుకసాగాను.

“అన్నయ్యా.. ముందు మంచి నీళ్ళు త్రాగండి” అంటూ తిరిగి గ్లాసు చేతికిచ్చింది అనిత. గ్లాసు ఖాళీ చేస్తుంటే.. “రేపే చివరి తేదీ” అంది. ఠక్కున గ్లాసు టీ పాయ్ మీద పెట్టాను.

“పోస్ట్ చేసే సమయం లేదు అన్నయ్యా.. నేరుగా హైదరాబాదు వెళ్లి ఆఫీసులో అందజేయాలి. అక్కడే కౌంటర్లో డబ్బు కట్టి అప్లికేషన్ తీసుకునే వెసలుబాటూ ఉంది. ఆఫీసు తెలుసనుకుంటాను గాంధీభవన్ కెదురుగా కాలేజీ సర్వీస్ కమీషన్ ఆఫీసు. సర్టిపికెట్ల కోసం ఇంటికి వెళ్ళాలా?” అంటూ ఆందోళన వ్యక్తం చేసింది.

“లేదమ్మా.. సర్టిఫికెట్లు నా బ్యాగులోనే ఉన్నాయి” అంటూ తీసి చూపిస్తూ.. మరొక సారి చెక్ చేసుకున్నాను.

ఆషాఢభూతి చంకలో సదా తన సంపద దాచిన బొంత ఉన్నట్టు.. నా విద్యార్హత సర్టిఫికెట్ల ఫైల్ నా వెన్నంటే ఉండేది. దానికీ కారణం లేకపోలేదు..

ఒక సారి నేను ఎంప్లాయ్ మెంటు కార్డు తీద్దామని కరీంనగర్ వెళ్లాను. జన్మ తేదీని నిర్థారించే అతి ముఖ్యమైన ధృవపత్రం తీసుకు వెళ్ళ లేదు. అప్పుడు ఆఫీసులోని క్లర్క్ నన్ను ఎగాదిగా చూస్తూ..

“చూడు బాబూ..! అన్ని కాలాలూ.. అన్ని సర్టిఫికెట్లన్నీ జీవితంలో స్థిరపడే వరకు నిన్ను అంటి పెట్టుకుని ఉండాలి. నువ్విక్కడ నీసర్టిఫికెట్లు మరెక్కడో ఉంటే లాభమేంటి చెప్పు? సమయం చెప్పి రాదు. అవి నీతోనే.. ఉండడం మంచిది” అంటూ గీతోపదేశం చేశాడు. “వెళ్ళు.. వెళ్ళి ఆ సర్టిఫికెట్ తీసుకుని రా..” అన్నాడు.

ఆపూట కార్డు తీయడం వీలు కాలేదు కాని నాకు జ్ఞానోదయమయ్యింది. అది ఇప్పుడు పనికి వచ్చింది.

అనిత దగ్గర పత్రికా ప్రకటన తీసుకున్నాను. రమేష్ ను కృతజ్ఞతా పూర్వకంగా మరొక సారి దగ్గరికి తీసుకుంటుంటే.. అప్రయత్నంగా నా కళ్లు చెమర్చాయి.

“అన్నయ్యా.. టీ తాగి వెళ్ళండి” అని అనిత వేడుకుంటుంటే..

“ఇప్పుడు సమయం లేదురా.. మళ్ళీ వస్తా” అని వీడ్కోలు పలికి, సత్ సంఘ్ లో ఉంటున్న నా స్నేహుతుని గదికి దారి తీశాను.

నన్ను చూడగానే పురుషోత్తం ఎగిరి గంతులు వేసినంత పని చేశాడు. ఇద్దరమూ ఒకే ఊరి వాళ్ళం. నేను ఉద్యోగంలో చేరాక తొలిసారిగా కలుసుకోవడమే ఆ సంతోషానికి మూలం. పురుషోత్తం రీజియనల్ ఇంజనీరింగ్ కాలేజీలో బి.టెక్. ఫైనలియర్.

నేను తిరిగి ప్రయాణానికి సన్నద్ధమవడం చూసి.. “రేపు ఉదయమే నాలుగింటికి వెళ్తే సరిపోతుంది సుధాకర్.. రాత్రికి సినిమాకు వెళ్దాం” అంటూ బతిమాలాడు

పురుషోత్తం. కాని నేను ఒప్పుకోలేదు.

“ప్రయాణంలో ఏమైనా అవాంతరాలు జరిగితే కష్టం పురుషోత్తం” అని నచ్చజెప్పాను. “ఈ రోజు రాత్రికి హైదరాబాదు చేరి మన అంజన్న ఇంట్లో ఉంటాను” అంటూ నా ప్రణాళిక వివరించాను.

అంజన్న అంటే హన్మంతారావు.. మా మిత్రబృందంలో ఒకడు. అంజన్న హైదరాబాదులో తన అన్నయ్య ఇంట్లో ఉంటూ.. హోమియోపతి చదువుతున్నాడు.

పురుషోత్తం నన్ను బస్సెక్కించడానికి బస్ స్టాండుకు రాక తప్ప లేదు. క్యాంటీన్ లో టీ తాగుతూ మా ఊరి విశేషాలు కాసేపు మాట్లాడుకున్నాం. క్యాంటీన్ ఫోన్ ద్వారా జగిత్యాల ఆఫీసుకు నాకు అదనంగా మరో రోజు సెలవు కావాలని మా సూపర్ వైజర్ తో అభ్యర్థించాను.

ఇంతలో హైదరాబాదు బస్సు రావడంతో పురుషోత్తం వద్ద సెలవు తీసుకుని బస్సెక్కాను.

హైదరాబాదు చేరుకునే సరికి రాత్రి ఎనిమిదయ్యింది. అంజన్న అన్నయ్య వాళ్ళు ఉండేది అమీర్ పేటలో.. ఇదివరకు టెలీఫోన్ డిపార్ట్ మెంటు నిర్వహించిన పరీక్షలు హాజరవడం కోసం వచ్చాను. హోటల్లో భోజనం చేసి అంజన్న ఇల్లు చేరుకునే సరికి దాదాపు పదయ్యింది.

నన్ను చూడగానే నిర్ఘాంత పోయాడు అంజన్న. మేమూ కలుసుకోక చాలా రోజులయ్యింది. ఆబిడ్స్ చిరాగలీ లేన్ లో ఉన్న మాప్రధాన కార్యాలయంలో నాకు అవార్డు ప్రదానం చేసినప్పుడు కలుసుకున్నాం. ఆ తరువాత తిరిగి ఇప్పుడే.. దాదాపు రెండు సంవత్సరాలు కావస్తోంది. కాని స్నేహితుల ఎడబాటు అది రెండు యుగాలుగా తలుస్తూంది.

రాత్రి కబుర్ల మధ్యలో ఊహించని విషయంచెప్పాడు అంజన్న. నిర్ఘాంత పోయాను.

“పుకార్లేమో..! “ అన్నాను.. నమ్మశక్యంగాక.

“కాదు సుధాకర్.. పురుషోత్తం ప్రేమవలలో చిక్కుకుని తన కెరియర్ అంతా నాశనం చేసుకున్నాడు. బి.టెక్. లో సబ్జక్ట్ లన్నీ మిగిలి పోయాయి. ప్రమోట్ చేస్తూ వచ్చారు కాని చివరికి నిబంధనల ప్రకారం అతణ్ణి కాలేజీ నుండి బర్తరఫ్ చేశారు. ఈ విషయం దాచిపెట్టి ఇంకా హన్మకొండలోనే ఉంటున్నాడు. కాని ఎన్నాళ్ళని దాచాగలడు” అంటూ అతని వృత్తాంతమమతా ఏకరువు పెట్టసాగాడు అంజన్న. “చూడు సుధాకర్.. మన మంచితనమే మనకు రక్ష. మనలోని చెడు ఎప్పటికైనా మనల్ని దహించి వేస్తుంది. పురుషోత్తంకు ఆడవాళ్ళంటే మహా పిచ్చి. వాళ్ళ ఊర్లో తను పదో తరగతిలో ఉండగా పని పిల్లను పాడు చెయ్యబోతుంటే.. పక్కింటి వాళ్ళు పసిగట్టి తప్పించారట. ఆ విషయము ఈ మధ్యనే బయటపడింది”

“పురుషోత్తం అలా పైకి కనబడదు కదా.. అంజన్నా” అంటూ ఆలోచనల్లో మునిగి పోయాను. ఎప్పుడు కన్నంటుకుందో..! తెలియదు.

ఆ మరునాడు ఉదయమే టిఫిన్ చేసి.. అంజన్న నేను మా నూతన కాలేజీ సర్వీసు కమీషన్ కార్యాలయానికి బయలుదేరాం.

దరఖాస్తు తీసుకుని.. ప్రవేశ పరీక్ష కోసం బ్యాంకులో తీసుకున్న డి.డి. జతపరిచి కార్యాలయంలో అందజేసే సరికి దాదాపు మధ్యాహ్నం రెండయ్యింది. రశీదు తీసుకుని.. నేరుగా వెళ్ళి హోటల్లో ఇద్దరం కలిసి భోజనం చేసుకున్నాం. నన్ను ఇమ్లీ బస్ స్టాండులో బస్సెక్కించి వెళ్లి పోయాడు అంజన్న.

***

దాదాపు ఆరు నెలలు గడిచింది..

కాలేజీ సర్వీసు కమీషన్ కార్యాలయం నుండి ఎలాంటి సమాచారమూ లేదు. కాని గొడవ అవుతుందని మాత్రం తెలుసు. ప్రవేశ పరీక్ష లేకుండా.. కేవలం ఇంటర్వ్యూ ప్రాతిపదికన ఉద్యోగాలివ్వాలనే డిమాండు ఉధృతమవుతోంది. నూతనంగా జూనియర్ కాలేజీ వ్యవస్థ ఏర్పడినప్పుడు మూడవ తరగతి శ్రేణిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను గూడా జూనియర్ లెక్చరర్ గా భర్తీ చేసింది ప్రభుత్వం. ఆ తరువాత నియామకాలు లేవు.. కాలేజీ సర్వీసు కమీషన్ ఏర్పాటు.. దాని ద్వారా నియామకాలు జరుగాలనే ప్రభుత్వ నిర్ణయానికి దాదాపు ఆరు సంవత్సరాలు పట్టింది. నాలాంటి అమాయకులు దరఖాస్తు చేసుకున్నారు. కాని కొందరు దరఖాస్తు చేసుకుని, చేసుకోకుండా కార్యాలయం మీద దాడికి దిగడం.. గొడవ ఆరంభమయ్యింది.. గొడవ సద్దుమణగాలని ప్రభుత్వం.. ప్రభుత్వం దిగి రావాలని అభ్యర్థులు.

ఒక రోజు అంజన్న దగ్గర నుండి ఆహ్వాన పత్రిక అందుకున్నాను. వాళ్ళ అన్నయ్య కొడుకు మొదటి పుట్టిన రోజు వేడుక. తప్పనిసరిగా రావాలని వేడుకోలు. ఒక రోజు ముందుగానే వెళ్లాను. నేను వేదికను బాగా అలంకరిస్తానని అంజన్నకు బాగా తెలుసు. ఇద్దరం కలిసి కావాల్సిన రంగు కాగితాలు తదితర సామాను కొందామని బయలు దేరాం. శేషమహల్ సినిమా థియేటర్ గేటు వద్ద ప్రకాశం కనబడ్డాడు. అతను మా ఊరి జూనియర్ కాలేజీలో లైబ్రేరియన్.. వస పిట్ట. పట్టుకున్నాడండే వదలడు.. జిడ్డు.

“మమ్మల్ని చూశాడంటే.. మా మెదడు తినడం ఖాయమని ఇద్దరం తప్పుకుని ఒక షాపులో దూరం.

***

పుట్టిన రోజు వేడుక మరునాడు తెల్లవారి ఝామున్నే బయలుదేరాను.

అమీర్ పేట బస్ స్టాండుకు చేరుకునే సరికి.. “హలో సుధాకర్ సిటీకి ఎప్పుడు వచ్చావ్” అంటూ ప్రకాశం పలుకరించే సరికి బెదరి పోయాను. ఈ రోజు దొరికి పోయానని మనసులో గొణుక్కుంటూ.. పైకి మాత్రం పలుకరింపు ధోరణిలో పెదవులపై చిరునవ్వు పూయించాను. వచ్చిన విషయం.. తిరిగి జగిత్యాల వెళ్తున్నట్టు చెప్పాను.

“అవునూ.. నువ్వు జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి దరఖాస్తు చేశావా” అంటూ అడిగాడు.

“చేశాను గాని ఇప్పుడవి మరుగున పడ్డాయి కదా..! “ అన్నాను నిర్లిప్తంగా.

“లేదు సుధాకర్.. ప్రభుత్వం పట్టు విడవడం లేదు. ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని తేదీ గూడా ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన సిలబస్ ఇస్తున్నారు. నీ దగ్గర రశీదు ఉంటే వెళ్లి తీసుకో.. వాళ్ళు పోస్ట్ చేసే సరికి కాలాతీతమవుతుంది. ఈ లోగా నువ్వు ప్రిపేర్ కావచ్చు” అని సలహా ఇస్తూండగా సికింద్రాబాదు రైల్వే స్టేషన్ వెళ్ళే బస్సు వచ్చింది. “నేను వస్తాను” అంటూ పరుగు, పరుగున వెళ్ళి బస్సెక్కాడు ప్రకాశం. నేను అవాక్కయ్యాను. తదేకంగా అతని వంకే చూడసాగాను. అతనిలో దేవుడు కనిపించాడు.

వెంటనే అంజన్న ఇంటికి తిరుగు ముఖం పట్టాను. నన్ను చూసి నివ్వెర పోయాడు అంజన్న. విషయం చెబుతూ.. “మొన్ననే ప్రకాశంను కలుసుకుని ఉంటే.. నిన్న పని పూర్తి చేసుకుని ఈ రోజు వెళ్ళే వాణ్ణి” అంటూ వాపోయాను.

“ నీ మంచితనమే.. నీకు దారి చూపుతోంది. నీకు ఉద్యోగం తప్పకుండా వస్తుంది సుధాకర్..” అంటూ అంజన్న ధైర్యవచనాలు పలికాడు.

నేను ఫ్రెషపై మా ఆఫీసుకు వెళ్లాను. రశీదు చూపించి సిలబస్ తీసుకుని తృప్తిగా శ్వాస పీల్చుకున్నాను.

***

ప్రవేశ పరీక్షకు ఇంకా పదిహేను రోజుల సమయమే ఉంది. నా జీవిత లక్ష్యం నెరవేరాలంటే అహర్నిశలు శ్రమ పడాల్సిందే.. ఆఫీసుకు సెలవు పెట్టాను. తిరిగి రాధాస్వామి సత్ సంఘ్ లో అడుగు పెట్టాను. పురుషోత్తం గదిలో భాస్కర్ ఉన్నాడు. నన్ను చూడగానే ఆప్యాయంగా ఆహ్వానించాడు. వచ్చిన విషయం చెప్పాను. చాలా సంతోషించాడు. తనవంతు సహకారం అందిస్తానని కాదన వద్దని బతిమాలాడు. అతని ఆదరణకు ఆత్మీయంగా హత్తుకున్నాను.

ప్రతీరోజు నాకు భాస్కర్ టిఫిన్ బాక్స్ అందించే వాడు. నేను నేరుగా రెడ్డీ కాలనీ గుండా నడుచుకుంటూ.. కాకతీయ యూనివర్సిటీ గ్రంధాలాయానికి వెళ్ళే వాణ్ణి. నా ప్రవేశ పరీక్షకు సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేసుకుని తిరిగి గదికి వచ్చి రాత్రంతా చదువుకునే వాణ్ణి. హోటల్ భోజనం ఆరోగ్యానికి సరిపడదని నన్ను చెయ్యి బయట కడుగనివ్వలేదు భాస్కర్. నీ ఋణం ఎలా తీర్చుకోగలనని అడిగితే..

“సుధాకర్.. నువ్వు నా గదిలో ఉండడమే మహా భాగ్యంగా తలుస్తాను. నీ మంచితనం గురించి మన సత్ సంఘ్ లో అంతా ముచ్చటించుకుంటారు. అలాంటి నీకు ఈ మాత్రం సాయం చెయ్యడం నా అదృష్టం” అనే సరికి నా కళ్ళుల్లో నీళ్ళు తిరిగాయి. అంజన్న మాటలే గుర్తుకు వచ్చాయి.

మా సూపర్ వైజర్ నా ప్రవేశ పరీక్ష హాల్ టిక్కట్టు నాకు రీడైరెక్ట్ చేశాడు. పింగళి మహిళా కళాశాల వడ్డేపల్లి సెంటర్. అది అందుకున్నప్పటి నుండీ మనసులో అదో రకమైన అగులు బుగులు.. ఏ పరీక్షలకూ అలా నా మనసు వ్యాకులత చెందలేదు. అనుకున్న రోజు రానే వచ్చింది.

పరీక్ష హాల్లోకి అడుగు పెట్టాను. ప్రశ్నా పత్రం చూడాగానే నా ఆందోళన అంతా పటాపంచలయ్యింది. అన్ని ప్రశ్నలూ బాగా వ్రాయగాలననే నమ్మకం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. మనసు ప్రశాంత పర్చుకుని జవాబులు రాస్తూ పోయాను. చివరి అర గంట సమయంలో పెద్ద గుంపు హాల్లోకి ఉవ్వెత్తున ఎగిసిన సముద్రపు కెరటాల్లా వచ్చింది. పెద్ద పెద్ద కేకలు వేస్తూ వీరావేశంతో, వచ్చీ రావడంతోనే మా హాల్లోని వారి సమాధాన పత్రాలు లాక్కొని తునా, తునకలు చేస్తూ పైకి విసిరేయసాగారు. అవి ఫ్యాను గాలికి చెల్లాచెదురవుతూ.. భయకంపితుల్ని చేయసాగాయి. నా సమాధాన పత్రమూ ఇంతే సంగతులు. సెంటర్ అంతా భీభత్స వాతావరణం. పరీక్షల బహిష్కరణ అనే నినాదాలు.

ఏడ్పు మొహంతో బయట పడ్డాను. సత్ సంఘ్ కు ఎలా చేరుకున్నానో.. ! ఏమో..! భాస్కర్ గదిలో చాప మీద వాలి పోయాను. దుఃఖం తన్నుకు వస్తోంది. కళ్ళు జలపాతాలయ్యాయి. చిన్న పిల్లాడిలా ఏడువసాగాను. నా ఆశలన్నీ అడియాశలయ్యాయి. భాస్కర్ నన్ను ఊరడిస్తూ.. తనూ కంట నీరు పెట్టుకున్నాడు.

అలా అల్లర్లు కేవలం కొన్ని పరీక్షా కేంద్రాలలో మాత్రమే జరిగాయట..మరునాటి దినపత్రికల్లో వార్తలు చదువుతూ.. గుండె నిబ్బరం చేసుకుంటూ.. జగిత్యాల చేరుకున్నాను.

ప్రభుత్వం దయతలిచింది. మళ్ళీ పరీక్ష తేదీ ప్రకటించింది. అది నా పుట్టిన రోజు కావడం చాలా సంతోషంగా ఉంది. అదే పరీక్ష కేంద్రం.. కేంద్రం నిండా రక్షక భటులు. అత్యంత భద్రతల మధ్య పరీక్ష మళ్ళీ వ్రాశాను. కాని మొదటిసారి వ్రాసినంతగా తృప్తి పడలేదు నామనసు. వేల సంఖ్యలో అభ్యర్థులు.. ఏమవుతుందో ఏమోననేభయం నన్ను

ఆవహించింది. నిద్రాహారాలు అంతంత మాత్రమే. పదే , పదే మొదటి సారిగా వ్రాసిన సమాధాన పత్రమే నా కళ్ళల్లో తిరుగ సాగింది. బాధను మరిచిపోవాలని తిరిగి విద్యార్థులకు పాఠాలు చెప్పసాగాను.

ప్రవేశ పరీక్ష ఫలితాలు ప్రకటించారు. రాష్ట్రమొత్తంలో కేవలం నలుబది మంది మాత్రమే ఇంటర్వ్యూకు అర్హత సంపాదించారు. అందులో నేనూ ఉండడం.. నాకంటే నా విద్యార్థుల హర్షాతి రేఖలు వెల్లివిరిశాయి.

నాకు మరో భయం పట్టుకుంది.. ఇంటర్వ్యూ ఏమవుతుందో ! ఏమోనని. కేవలం సబ్జక్ట్ మీదనే మోఖిక పరీక్ష ఉంటుందని.. మళ్ళీ చదువులో తలదూర్చాను. కాని విద్యార్థులకు పాఠాలు చెప్పడం ఆప లేదు. అదే నాకు శ్రీరామ రక్ష అని నా ప్రగాఢ విశ్వాసం.

కాలేజీ సర్వీసు కమీషన్ ఆఫీసులో మౌఖిక పరీక్షకు హాజరయ్యాను. ఇంటర్ మీడియట్ సబ్జెక్ట్ కు సంబధించిన ప్రశ్నలు అడిగారు. అందులో ఒక ప్రశ్నకు కాస్త తడబడ్డాను. దాంతో మళ్ళీ నా మదిలో భయం ఆవహించింది. ఈ కాలంలో మంత్రుల ఉత్తరాయణం.. లేదా దక్షిణాయనం లేనిదే ఉద్యోగం రావడం అసంభవమని నా మిత్రులంతా మరింత భయపెట్టసాగారు.

నలుబది రోజుల తరువాత ఫలితాలు వచ్చాయి. నలుబది మందిలో నుండి కేవలం ఇరువది ఆరు అభ్యర్థులను మౌఖిక పరీక్ష ద్వారా ఎన్నుకుని ఉత్తర్వులు పంపించారు. అందులో నా ఉత్తర్వూ ఉండడం.. చాలా సంతోషమేసింది. అంజన్న మాటలే గుర్తుకు రాసాగాయి. ‘మన మంచితనమే మనకు రక్ష..!’ *

మరిన్ని కథలు

Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం