ఆమె నేను చెప్పినట్టే చేసింది - గంగాధర్ వడ్లమన్నాటి

Aame nenu cheppinatte chesindi

“లలితా ఈరోజు ఆదివారం కదా, అలా మన పిల్లలతో బీచ్ కి వెళ్ళి ,తరువాత రెస్టారెంట్లో తినేసి వచ్చేద్దాం. ఏవంటావ్.!” అడిగాడు మధు

“నాకు కుదరదండీ.నేను మహిళలూ వారి జీవితాలు, నేలపాలు అనే అంశంపై డిబేట్ ఉంది.కనుక అగ్గిపుల్లలు అనే న్యూస్ చానల్ కి వెళ్తున్నాను”.చెప్పిందామె హడావుడిగా తయారవుతూ.

“ఏవిటి లలితా ఇది?.ఎప్పుడూ ఇలా నువ్వు ఆన్లైన్ డిబేట్లూ ,చర్చా కార్యక్రమాలూ అంటూ వారానికి ఏడు రోజులూ బిజీగా ఉంటే ఎలా చెప్పు .పిల్లల్ని ఎంతకని నేను, అమ్మ చూసుకుంటాం.ఎప్పుడైనా ఓ సారి వెళ్ళి రావాలి కానీ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు డిబేట్లు అంటూ పరుగులు తీస్తే ఎలా చెప్పు” అడిగాడు మధు

“మీరు, పిల్లలు, ఇల్లు, ఇదేనా జీవితం!. నాకు కూడా గుర్తింపూ ,నేమ్ ,ఫేమ్ ఉండాలని కోరిక ఉండదా .ఈ మాత్రానికే ఇలా నలిగి పోవాలా? .వారం అంతా ఒకే చానల్ కి వెళ్తున్నానా ఏవిటి?. ఒక్కోరోజు ఒక్కో చానల్ వారు ఒక్కో అంశం మీద మాట్లాడమని అడుగుతున్నారు. అందుకే ఇలా తప్పక వెళ్తున్నాను .మీరు కూడా మిగతా భర్తల లాగా ఆలోచించకండీ .మీరు అలా ఉండరనే కదా మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను” చెప్పింది లలిత కాస్త అసహనంగా.

“నే అనేది పూర్తిగా మానేయమని కాదు .వెళ్లొద్దనీ కాదు .కానీ ఇలా ఎప్పుడూ బిజీ గా ఉంటే నాకు ఇంట్లో బోరు కొట్టేస్తోంది .పిల్లలు వీడియో గేమ్స్ లో మునిగిపోతున్నారు .కనుక వారానికి కొన్ని రోజులు అని పెట్టుకోకూడడూ .నీ ఇష్టం .ఇది సలహా మాత్రమే”

“సర్లేండి ఆలోచిస్తాను” అంటూ ఆమె తన గదిలోకి వెళ్ళి హెడ్ ఫోన్స్ పెట్టుకుని జూమ్ మీటింగ్ లో జాయిన్ అయ్యింది. సరే చేసేది లేక మధు పిల్లలని తీసుకుని బీచ్ కి వెళ్ళాడు .

కొద్ది రోజుల తర్వాత ఓ సాయంత్రం, పని మనిషి పిటి ఉషకి వేలు విడిచిన చెల్లెల్లా పరిగెట్టుకుంటూ వచ్చి, “అమ్మగారూ ,మీకో విషయం చెప్పాలి” అంటూ చేతులు నలుపుకుంటూ కంగారు పడింది.

“ఏవిటే అలా తత్తరపడుతూ బిత్తరచూపులు చూస్తూ తెగ టెన్షన్ పడిపోతున్నావ్ .ముందు నిదానంగా ఉండు .ఆ తరువాత చెబుదువుగాని” చెప్పింది లలిత.

“సరేనండీ” అని ఓ సారి గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది

“సరే ఇప్పుడు చెప్పు .ఏమిటి విషయం .డబ్బులు ఏమైనా కావాలా”

“లేదమ్మగారూ, ఇందాక నేను బజారుకెళ్లి వస్తుంటే, అయ్యగారు ఓ అమ్మాయితో కార్లో వెళ్తున్నారు .చాలా చనువుగా మాట్లాడుతున్నారు .నాకు ఏదో అనుమానం వచ్చింది .సరే ఇది మీ చెవిన వేద్దాం అని ఇలా కంగారుగా వచ్చాను.వస్తా అమ్మగారూ .ఈ విషయం నేను మీకు చెప్పినట్టుగా అయ్యగారికి చెప్పకండి .ఏదో మీ మీద అబిమానం తో చెప్పాను .మీ కాపురం చక్కదిద్దుకుంటారని .ఉంటా అమ్మగారూ” అంటూ ఆమె వెళ్లిపోయింది .

లలిత కోపం నషాలానికి అంటింది. “మధు రాగానే కడిగి పారేయాలి .అయినా కట్టుకున్న భార్యని ఇంట్లో పెట్టుకుని ఇలా బయట వేరే అమ్మాయిలతో ఛీ ఛీ” అని ఆవేశంతో రగిలిపోయింది. ఓ క్షణం తరువాత కాస్త ఆలోచనలో పడి“అవునూ ,మధుని నేను నిలదీసిన తరువాత ,నువ్వు ఈ మధ్య నాతో కానీ పిల్లలతో కానీ కాస్త సమయం కేటాయించగలిగావా ,ఎప్పుడూ నీ యూట్యూబ్ చానల్ లో వీడియోలు అప్లోడ్ చేయడం ,జూమ్ లో మీటింగ్స్ అటెండ్ అవ్వడం ,ఛానెల్స్ కి వెళ్ళి డిబేట్లలో కూర్చోవడం తప్ప నాతో వారానికి కనీసం రెండు రోజులు అయినా మనస్ఫూర్తిగా గడిపావా అని అడిగితే ఏం చెప్పగలను .సరే ఇలా చేస్తాను” అని ఛానెల్స్ కి ఫోన్ చేసి ఇకపై తనని జూమ్ మీటింగ్స్ కానీ ఛానెల్స్ డిబేట్ కి పిలవ వద్దు అని తెగేసి చెప్పేసింది .తరువాత తయారయి హాల్లో కూర్చుంది.

మధు రాగానే “ఏవండీ వచ్చారా! రండి ,పిల్లలతో కలిసి మనం అలా బయటికి వెళ్ళి వద్దామా” అడిగింది .

“నువ్వేనా ఈ మాట అంటోంది” అడిగాడు మధు

“నేనే ఇంట్లో లేకపోతే, మగ బుద్దులు మహా చెడ్డవి .నమ్మలేం” అంది మధు వంక తినేసేలా చూస్తూ.

“అది సరే కానీ ఇదిగో నీకో సర్ప్రైస్ .గోల్డ్ చైన్, ఇవాళ మా పిన్ని వాళ్ళ అమ్మాయి స్రవంతి, ఏదో పనుండి వైజాగ్ వచ్చిందట .షాపింగ్ కి రా అన్నయ అంటే వెళ్ళాను .తను ఏవో కొనుక్కుoది .వద్దన్నా వినకుండా వదినకి ఇవ్వు అని ఈ చైన్ కొనిచ్చింది నీకు”.అంటూ అందించాడు .

లలిత బిత్తర పోయింది. “కొంపముంచింది ,అంటే మా పనిమనిషి చూసింది ఈయన చెల్లెలితోనన్నమాట. సరే ఇలా అయినా నా తప్పు తెలుసుకున్నాను” అని హాయిగా నవ్వుతూ ఆ చైన్ మెడలో వేసుకుంది.

“మా పనిమనిషి, నే చెప్పమన్నట్టే చెప్పిందన్నమాట .నా ప్లాన్ సక్సెస్” అనుకున్నాడు మధు మనసులో

మరిన్ని కథలు

Pandaga maamoolu
పండగ మామూలు
- Madhunapantula chitti venkata subba Rao
Maanavatwam
మానవత్వం!
- - బోగా పురుషోత్తం
Prema pareeksha
ప్రేమ పరీక్ష
- శరత్ చంద్ర
Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ