రామబంటు - కొత్తపల్లి రవి కుమార్

Rama bantu

గుమ్మాలకు కట్టిన మామిడి తోరణాలతో, గడపలకు రాసిన పసుపుతో, వాకిట్లో వేసిన రంగవల్లులతో, సుందరంగా తీర్చిదిద్దిన అరటి బోదల ద్వారాలతో వృద్ధాశ్రమం అంతా ఆ రోజు పండుగ వాతావరణంతో కళకళలాడుతోంది. అక్కడ ఉన్న వృద్ధులందరూ ఆ వృద్ధాశ్రమాన్ని ఇలా అందంగా తయారు చేసే పనులలో నిమగ్నమై ఉన్నారు. అప్పుడే నిద్ర లేచిన తులసీ రామచంద్రయ్యలకు మాత్రం అందరూ ఇంతలా ఎందుకు ముస్తాబు చేస్తున్నారో అర్ధం కాలేదు. తులసీ రామచంద్రయ్యలు ఈ వృద్ధాశ్రమానికి వచ్చి పదిహేను రోజులే అవుతోంది. అక్కడున్న వారందరితోనూ ఇంకా పూర్తిగా పరిచయాలు కూడా చేసుకోలేదు. వాళ్ళకి కేటాయించిన గదిలోనే పూర్తిగా గడుపుతూ అప్పడప్పుడూ చుట్టం చూపుగా అందరికీ కనబడుతున్నారు. ఆ గదిలోనే మగ్గిపోతూ, తమ జీవితంలో జరిగిన చేదు సంఘటనలను నెమరువేసుకుంటూ, పాత జ్ఞాపకాల పలకరింపులతో కాలక్షేపం చేస్తున్నారిద్దరూ. అందుకే వృద్ధాశ్రమంలో జరిగే కార్యక్రమాలు కూడా వీరిద్దరికీ పూర్తిగా తెలియదు. తన దగ్గర ఉన్న పంచాంగాన్ని తీసి చూసాడు రామచంద్రయ్య. ఆ రోజు పండుగలేమీ లేవు. అదే విషయాన్ని అటుగా వెళ్తున్న సాంబయ్య ని అడిగాడు రామచంద్రయ్య. "సాంబయ్య గారూ! ఏమిటీ ఇంత హడావుడిగా ఉంది. ఈ ఆశ్రమమంతా ఇంత బాగా ముస్తాబు చేస్తున్నారు. ఏమైనా విశేషమా?" అని అడిగాడు రామచంద్రయ్య. "అవును రామచంద్రయ్య గారూ! ఈ రోజు చాలా విశేషమైన రోజు. ఈ ఆశ్రమాన్ని స్ధాపించిన మన అంజిబాబు గారికి చాలా ఇష్టమైన రోజు. ఆయనకి పునర్జన్మ వచ్చిన రోజు. ఆయన ఈ రోజుని చాలా పెద్ద పండుగగా జరుపుకుంటారండి. ప్రతీ యేడు మేము సంబరాలు జరుపుకునేది కూడా ఈ రోజే " అని ఆనందంగా చెప్పాడు సాంబయ్య. అంజిబాబు పేరు వినగానే ఒక్కసారిగా రామచంద్రయ్య గుండె వేగంగా కొట్టుకోవడం ఆరంభించింది. ఈ అంజిబాబు గారు మన అంజి గాడేనా అని మనసులో చిన్న అనుమానం కలిగింది. మళ్ళీ "అయినా మన అంజిగాడు, ఈ అంజిగారు ఒకటి ఎలా అవుతారు " అని తనలో తానే సమాధానపడి గతాన్ని గుర్తు చేసుకున్నాడు రామచంద్రయ్య. * * * ఆ రోజు, రామచంద్రయ్య పొలాలు బాగా పండి వచ్చిన లాభంలో కొంత వాటా తన చెల్లికి ఇవ్వడానికి పట్నం వెళ్ళాడు. పని ముగించుకుని బయల్దేరేటప్పటికి సాయంత్రం అయిపోయింది. ఈ రాత్రికి ఉండిపోమని చెల్లి, బావ ఎంతో బతిమిలాడారు. కానీ చిన్నపిల్లలతో మీ వదిన కంగారు పడుతుందని చెప్పి సాయంత్రం బండికి బయల్దేరిపోయాడు. రైలు దిగేటప్పటికి రాత్రి పదకొండు గంటలయ్యింది. రైల్వే స్టేషన్ నుండి తన ఊరికి చేరుకోవాలంటే నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. ఆ రోజుల్లో ఊళ్ళోకి వెళ్ళడానికి ప్రయాణ సదుపాయాలు లేవు. పైగా రాత్రి పూట. పోనీ కబుర్లు చెప్పుకుంటూ వెళ్దామన్నా రామచంద్రయ్య ఒక్కడే రైలు దిగాడు. ఎటు చూసినా చిమ్మ చీకటి. చిన్న లాంతరు వెలుగు కూడా కనబడట్లేదు. గుండెను చేత్తో బట్టుకుని ఇంటి దారి పట్టాడు రామచంద్రయ్య. తెలిసిన దారే కావడంతో గోతులు, తుప్పలు దాటుకుంటూ వెళ్తున్నాడు. అయినా చీకట్లో ఏ అవాంతరమైనా ముంచుకొస్తుందని మనసులో భయపడుతూ కొంచెం పరుగు లాంటి నడకతో వేగంగా నడుస్తున్నాడు. భయపడినట్టే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇద్దరు దొంగలు రామచంద్రయ్య మీద దాడి చేసారు. కత్తులతో బెదిరించి చేతిలో సంచి, మెడలో గొలుసు లాక్కోబోయారు. అవి వారికి అందకుండా రామచంద్రయ్య వాళ్ళతో పెనుగులాడడంతో కత్తులతో బాగా గాయపరిచారు. ఆ గాయాలకు ఓర్వలేక సొమ్మసిల్లిపోయాడు రామచంద్రయ్య. కళ్ళు తెరచి చూసేసరికి ఒక చెట్టు కింద ఉన్నాడు. పక్కనే సుమారు ఎనిమిదేళ్ల కుర్రాడు ఉన్నాడు. పైన చొక్కా లేదు. చిరిగిపోయిన నిక్కరు, పాలిపోయిన ముఖంతో ఉన్నాడు. తన ఊళ్ళో గానీ, ఈ పరిసరాలలో గానీ అతన్ని ఎప్పుడూ చూడలేదు. ఈ అబ్బాయి ఎవరా అని ఆలోచిస్తుండగా "అయ్యగోరు! ఇప్పుడు ఎట్టా ఉన్నాది? కంగారు తగ్గినాదా? ఇంద కూసింత ఈ గంగమ్మని గుటకేయండి. అంతా సద్దుమణుగుతాది" అని రామచంద్రయ్యకి నీళ్ళు అందించాడు ఆ అబ్బాయి. కొంచెం తేరుకుని "ఎవరు బాబూ నువ్వు? వాళ్ళు నన్నేం చేసారు? నేను ఇక్కడికి ఎలా వచ్చాను?" అని అడిగాడు రామచంద్రయ్య. "ఏదో పెద్దగా అరుపు విని ఇటువైపు వచ్చినాను అయ్యగోరు. అప్పటికే ఆ దొంగ నా కొడుకులు మిమ్మల్ని కత్తులతో రత్తాలొచ్చేటట్టు కోసేత్తన్నారు. ఇదిగో నా చేతిలో ఉన్న ఈ ఈటెలతో ఆళ్ళని బెదిరించి పంపేసినాను. ఆ తర్వాత మిమ్మల్ని ఈడకి లాక్కొచ్చినాను" అని చెప్పాడు ఆ అబ్బాయి. "చాలా సంతోషం బాబూ! మీ అమ్మా నాన్నా ఎక్కడ ఉంటారు? నీ పేరేంటి?" అని అడిగాడు రామచంద్రయ్య. "మాది ఈ ఊరికి దూరంగా ఉన్న తండా బాబు! నన్ను అందరూ అంజిగాడు అంటారండి. మా అమ్మకి, అయ్యకి అదేదో జబ్బొచ్చి దేవుడి దగ్గరకు పోయినారు. ఈ మద్దే మా మామ్మ కూడా నన్నిడిచిపెట్టి మా అమ్మానాయన కాడికి పోయినాది. నాకు ఎవరూ లేరు అయ్యగోరు" అని చెప్పాడు ఆ అబ్బాయి. "అయ్యో! నీకు ఎవ్వరూ లేరా? సమయానికి వచ్చి కాపాడావు. ఇదిగో " అని వంద రూపాయలు నోట్ల కట్ట ఆ అబ్బాయికి ఇవ్వబోయాడు రామచంద్రయ్య. "ఏటిది అయ్యగోరు? నేను ఇట్టాంటి రంగు కాగితాలకి సాయాలు సేయనయ్యగోరు. అయినా మీరిలా ఇత్తారని తెలుసుంటే మిమ్మల్ని ఆ దొంగోళ్ళకే వదిలేసేటోడిని. ఇక ఆళ్ళకి, నాకు తేడా ఏటుండాది అయ్యగోరు?" అని ఆ కట్టను తోసిపుచ్చాడు అంజి. చదువుకోకపోయినా కొండంత సంస్కారాన్ని నింపుకున్న అంజిని చూసి ముచ్చటేసింది రామచంద్రయ్యకి. స్వతహాగా శ్రీ రామ భక్తుడైన తను, ఆపదలో ఉన్నప్పుడు ఎందుకో ఆ ఆంజనేయ స్వామే ఈ అంజి రూపంలో వచ్చాడనుకుని "నీకు ఎవ్వరూ లేరంటున్నావుగా! నాతో వచ్చేస్తావా?" అని అడిగాడు రామచంద్రయ్య. " నేనూరికే రానయ్యగోరు. నాకు పనిచ్చి ఇంత కూడెడతానంటే వత్తాను " అని మొహమాటం లేకుండా చెప్పేసరికి మనసులో నవ్వుకుని తనతో పాటు అంజిని ఇంటికి తీసుకెళ్ళాడు రామచంద్రయ్య. * * * కొడుకులిద్దరినీ ఒళ్ళో పడుకో బెట్టుకుని ఎప్పటినుంచో భర్త రాక కోసం ఎదురు చూస్తున్న తులసమ్మకి దూరంగా చిన్నటి వెలుగులో రామచంద్రయ్య రూపం కనబడేసరికి ప్రాణం లేచి వచ్చినట్టయ్యింది. ఇంటికి రాగానే ఎందుకు ఆలస్యం అయ్యిందని అడిగింది తులసమ్మ. జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పి అంజిని పరిచయం చేసాడు రామచంద్రయ్య. అంజి వాలకం చూసి అసహ్యించుకుంటూనే తన భర్త చెప్పాడని లోపలికి రానిచ్చింది తులసమ్మ. శుభ్రంగా స్నానం చేయమని అంజికి చేదబావి చూపించాడు రామచంద్రయ్య. స్నానం చేసిన తర్వాత తన పెద్ద కొడుకు బట్టలిచ్చి వేసుకోమన్నాడు. రామచంద్రయ్య పెద్ద కొడుకు, అంజి ఇంచుమించు ఒకే ఈడు వాళ్ళు కావడంతో అంజికి ఆ బట్టలు సరిపోయాయి. హాల్లో ఒక మూలన చోటిచ్చారు, అంజి పడుకోవడానికి. పొద్దున్న లేవగానే మన ఇంట్లో ఇంకో మనిషి ఎవరో కొత్తగా వచ్చారని అంజి కేసి వింతగా చూసారు, కొడుకులిద్దరూ. ఆ విషయమే అక్కడున్న తండ్రిని అడిగారు. "ఆ అబ్బాయి పేరు అంజి. ఇప్పటినుండి ఇక్కడే ఉంటాడు. ఈ రోజు నుండి తనని మీరు ఒక సోదరుడిలా చూడాలి. తనతో మాట్లాడాలి, తనతో కలిసి ఆడుకోవాలి. సరేనా!" అని అన్నాడు రామచంద్రయ్య. అన్యమనస్కంగానే బుర్రలూపారు ఇద్దరూ. ఇదంతా దూరం నుండి గమనిస్తున్న తులసమ్మకి నచ్చలేదు. తన కొడుకులతో సమానంగా అంజిని చూడడానికి తన మనసు అంగీకరించలేదు. ఎలాగైనా అంజిని ఒక పనివాడిలాగే ఉంచుదామనుకుంది. ఇలాగే తన కొడుకులిద్దరికీ కూడా నూరి పోసేది. కానీ రామచంద్రయ్య మాత్రం ఆ ఆంజనేయుడే తనకు ఇలా మూడో కొడుకుగా వచ్చాడని మురిసిపోయేవాడు. తన కొడుకులతో పాటుగా అంజికి కూడా అన్నీ కొనిపెట్టేవాడు. తన కొడుకులు చదివే స్కూల్లోనే అంజిని చేర్పించాడు. ఇదంతా చూసి ఓర్వలేకపోతున్న తులసమ్మ ఒకరోజు రాత్రి పనులన్నీ ముగించుకుని పడుకునే సమయంలో భర్తతో "ఏమండీ! అంజి మిమ్మల్ని ఆపద నుండి కాపాడాడు. కాదనను. కానీ మన రక్తం పంచుకుని పుట్టిన కొడుకులతో పాటుగా అంజిని చూడడం నాకు నచ్చట్లేదండి. మనవాళ్ళు కూడా అంజి మీద ద్వేషం పెంచుకుంటున్నారు. ఎంతోకొంత డబ్బు ముట్టజెప్పి అంజిని ఎక్కడికైనా పంపేయండి " అని అంది. ఆ మాట విన్న వెంటనే రామచంద్రయ్య ఠక్కున మంచం మీదనుండి లేచి, ఎర్ర బారిన కళ్ళతో, గద్గర స్వరంతో "తులసీ! అంజి నన్ను ఆపద నుండి కాపాడాడని నువ్వు అంటున్నావు. నేను ప్రాణభిక్ష పెట్టాడంటున్నాను. ఆ రోజు అంజి అక్కడ లేకుండా ఉండుంటే నీ పసుపు కుంకాలు చెరిగిపోయేవి. ఆ రోజు అంజి నన్ను రక్షించకపోయుంటే ఈ రోజు నీ బిడ్డలు అనాధలయ్యేవారు. ఒక్కసారి అంజిని నా కళ్ళతో చూడు. నీకు అర్థమవుతుంది. అన్నీ డబ్బుతో ముడిపెడతామనుకోవడం నీ మూర్ఖత్వం తులసీ. ప్రపంచంలో అన్నీ డబ్బుతో కొనలేము. నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు ఇంకోసారి ఈ ప్రస్తావన నా దగ్గర తీసుకుని రాకు" అని గట్టిగా చెప్పి పడుకున్నాడు. అంజి విషయంలో తన భర్త ఎంత నిశ్చలభిప్రాయంతో ఉన్నాడో తెలుసుకుంది. కానీ తన భర్త అంజిని ఒక కొడుకుగా స్వీకరించినట్టుగా తను తీసుకోలేకపోతోంది. ఎంత చెప్పినా తన మనసు ఒప్పుకోవట్లేదు. తన కొడుకులతో సమాన స్ధాయిని ఊహించలేకపోతోంది. ఇటు భర్తకి చెప్పలేక, అంజిని ఇంటి నుండి పంపించలేక తనలో తాను మధన పడింది. నిగురు గప్పిన నిప్పులా అంజి మీద తన ద్వేషాన్ని పెంచుకుంది. ఇలా రోజులు గడుస్తున్నాయి. అంజి చదువు కుంటూనే రామచంద్రయ్యకి పొలం పనులలో కూడా సాయం చేస్తున్నాడు. ఇంట్లో అన్ని పనుల్లోనూ చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఇంత పని చేస్తూ చదువుకుంటున్నా అంజికి వీళ్ళద్దరి కంటే ఎక్కువ మార్కులు వచ్చేవి. ఇవన్నీ చూపించి మీరు ఎందుకూ పనికిరారని కొడుకులను దెప్పి పొడిచేవాడు. అంజి వల్లే తమ తండ్రి మమ్మల్ని తిడుతున్నాడని రోజు రోజుకి అంజి మీద పగను పెంచుకున్నారు కొడుకులిద్దరూ. కానీ అంజి మాత్రం వారిని సొంత తమ్ముళ్ళా చూసేవాడు. వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకునేవాడు. అంజి మీద రామచంద్రయ్యకున్న వాత్సల్యం, తులసమ్మకి ఉన్న ద్వేషం, కొడుకులిద్దరికీ ఉన్న పగలతో కాలచక్రం తిరుగుతోంది. అంజి తో పాటు కొడుకులిద్దరూ డిగ్రీలు పాసయ్యారు. మంచి మార్కులతో డిగ్రీ పట్టా చేతిలో ఉన్నా ఏ ఉద్యోగానికి వెళ్ళకుండా పొలం చూసుకోవాలని నిర్ణయానికి వచ్చాడు అంజి. రామచంద్రయ్య వద్దని ఎంత వారించినా వినకుండా వ్యవసాయం చేయడానికి నిశ్చయించుకున్నాడు అంజి. కొడుకులిద్దరికీ మంచి గవర్నమెంట్ జాబులు వచ్చి వేరే ఊళ్ళకి వెళ్ళి పోయారు. ఇక ఆ ఇంట్లో తులసీ రామచంద్రయ్యలతో పాటు అంజి ఒక్కడే ఉంటున్నాడు. ఆ రోజు ఉదయాన్నే లేచి ఎప్పటిలాగే పొలం పనులు చూసుకోవడానికి అంజిని పిలిచాడు రామచంద్రయ్య. ఎంత పిలిచినా అంజి రాలేదు. ఇల్లంతా చూసాడు, ఎక్కడా లేడు. పొలానికి వెళ్ళాడేమోనని పొలం వెళ్ళి చూసాడు. అక్కడా లేడు. ఊరంతా తిరిగాడు. ఎక్కడా అంజి జాడ కనబడలేదు. తిరిగి తిరిగి నీరసంతో ఇంటికి చేరాడు రామచంద్రయ్య. ఇంటికి చేరగానే భర్తతో "అంజి జాడేమైనా తెలిసిందా అండీ? ఎక్కడికి పోయాడో? ఏమీ తినకుండా వెళ్ళాడు. పోలీసు కంప్లైంట్ ఇవ్వకపోయారా? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీరు నిన్న నాకిచ్చి బీరువాలో దాయమన్న పొలం తాలూకు లక్ష రూపాయలు కనబడట్లేదండి " అని అంది తులసమ్మ. ఇది జరిగి సరిగ్గా ఇరవై ఏళ్ళవుతోంది. ఈ ఇరవై ఏళ్ళల్లో అందరూ అంజి ని మర్చిపోయారు, ఒక్క రామచంద్రయ్య తప్ప. కొడుకులిద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసాడు. అందరిలాగే వీళ్ళు కూడా తల్లి దండ్రులను పంచుకున్నారు. ఇంట్లో పని చేస్తుందని అత్తగారికోసం ఇద్దరు కోడళ్ళు పోటీ పడ్డారు. ఆ పోటీలో విజయం ఎవరివైపు రాక తలా ఒక నెల అత్తగారిని తమ వద్ద ఉంచుకునేటట్టు కోడళ్ళు రాజీ పడ్డారు. ఇదంతా చూస్తూ ప్రేక్షక పాత్రని పోషించారు కొడుకులు. జరిగినంత కాలం ఏదో బాగానే జరిగింది. ఇక తులసీ రామచంద్రయ్యలు రోగాలకు బంధువులయ్యి మూల పడేసరికి కోడళ్ళిద్దరికీ అత్తామామల భారం తెలిసి వీళ్ళిద్దరినీ మీ దగ్గర ఉంచుకోమంటే మీ దగ్గర ఉంచుకోమని మరల పోటీ పడ్డారు. ఈ సారి కూడా కొడుకు లిద్దరూ ప్రేక్షక పాత్రే పోషించారు. తమకు ఇంత ముద్ద పెట్టడానికి కొడుకులు, కోడళ్ళు ఇంతగా గొడవలు పడడం మింగుడు పడ లేదు రామచంద్రయ్యకి. ఆస్తి ని మూడు భాగాలు చేసి, రెండు భాగాలను ఇద్దరు కొడుకులకిచ్చేసాడు. మిగిలిన ఒక భాగం ఆస్తి తో తులసమ్మ చేయి పట్టుకుని, గుండెను చేత్తో పట్టుకుని, బయటకి తన్నుకొచ్చే బాధని దిగమింగుకుని ఇదిగో ఈ వృద్ధాశ్రమానికి చేరుకున్నాడు రామచంద్రయ్య. * * * వృద్ధాశ్రమాన్ని బాగా ముస్తాబు చేసారు, అక్కడున్న వృద్ధులందరూ. ఒక స్టేజ్ కూడా వేసారు. స్టేజ్ ని కూడా రంగు రంగుల కాగితాలతో, లైట్లతో అలంకరించారు. అందరూ ఆ స్టేజ్ ముందున్న కుర్చీల్లో కూర్చున్నారు. ఇంతలో ఒక పెద్దాయన స్టేజ్ మీదకి వెళ్ళి, మైక్ అందుకుని " అంజిబాబు గారు ఇప్పుడే వచ్చారు. మన కన్న వాళ్ళే కాదనుకున్న మనకు ఇంత చేస్తున్న ఆయన్ని మనమందరం సత్కరించుకోవడం మన ధర్మం. అందుకే అంజిబాబు గారిని మనందరి తరపున స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను " అని చెప్పాడు. కూర్చున్న కుర్చీల మధ్యలో నుండి స్టేజ్ మీద కి వెళ్తున్న అంజిబాబు గారి కేసి చూసాడు రామచంద్రయ్య. నోరు వెళ్ళబెట్టాడు. "ఏంటి ఈయన మన అంజిగాడేనా" అని మనసులో అనుకుంటూ, ఇన్నాళ్ళకి అంజిని చూసిన ఆనందంతో తబ్బి ఉబ్బిబ్బు అవుతున్నాడు. స్టేజ్ మీదకొచ్చిన అంజి ని సన్మానించడానికి ముందుకొచ్చారు వృద్ధులు. వారిని వారించి మైక్ అందుకున్నాడు అంజి. "నేను ఇప్పుడు, ఇక్కడ ఈ స్ధాయిలో ఉన్నానంటే అది నా గొప్పతనం కాదు. ఆ గొప్పతనం అంతా నన్ను పెంచి ఇంత వాడిని చేసిన వాళ్ళది. నన్ను కన్నది నా తల్లి దండ్రులైనా నాకు పునర్జన్మ నిచ్చింది మాత్రం తులసీ రామచంద్రయ్యలు. వాళ్ళు నాకు దైవంతో సమానం. కొన్నాళ్ళ క్రితం ఇదే రోజు నాకు మంచి లైఫ్ ని అందించారు. వాళ్ళే నన్ను చేరదీసి ఉండి ఉండకపోతే నేను ఏ చెట్టు మీదో, ఏ పుట్టలోనో ఉండేవాడిని. ఏమిచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేను. ఈ సన్మానం వారికే దక్కాలి. ఇప్పుడు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వారిని సవినయంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను" అని స్టేజ్ దిగి తులసీ రామచంద్రయ్యలను దగ్గరుండి స్టేజ్ మీదకి తీసుకొచ్చి సన్మానించాడు అంజి. తులసీ రామచంద్రయ్యలకు నోట మాట రాలేదు. ధారగా కారుతున్న ఆనంద భాష్పాలను తుడుచుకుంటూ "ఒరేయ్ అంజీ! ఎన్నాళ్ళయ్యిందిరా నిన్ను చూసి. ఎంత ఎదిగిపోయావురా? నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మా మీద ఇంత ప్రేమ ఉన్న వాడివి మమ్మల్ని వదిలి పెట్టి ఎలా వెళ్ళి పోయావురా?" అని అంజి ని గాఢంగా కౌగిలించుకున్నాడు రామచంద్రయ్య. అంజి నోరు తెరచి సమాధానం చెప్పే లోపు తులసమ్మ మాట్లాడడం మొదలు పెట్టింది. "అంజి ఇంటి నుండి వెళ్ళి పోవడానికి ప్రధాన కారణం నేనేనండి. మీరు లేని సమయం చూసి అంజి తో నేను మాట్లాడాను" అని గతంలో అంజి తో మాట్లాడిన మాటలను ఒకసారి మరల చెప్పింది తులసమ్మ. "నువ్వంటే మొదటి నుండీ మాకు ఇష్టం లేదు. రేపు వాళ్ళకి పెళ్ళిళ్ళయితే వాళ్ళ పెళ్ళాలు కూడా అసహ్యించుకుంటారు. అందుకే నువ్వు ఇప్పుడే ఇంటి నుండి వెళ్ళి పోవడం మంచిది. ఆయన ఉంటే నిన్ను వెళ్ళనివ్వరు. ఇదిగో ఈ లక్ష రూపాయలు తీసుకుని ఇంటి నుండి వెళ్ళిపో. ఇక ఎప్పుడూ మా కంట కనపడకు " అని ఆ లక్ష రూపాయలు ఇచ్చి పంపించేసానండి అని చెప్పింది తులసమ్మ. తను చేసిన తప్పుకి అంజి కాళ్ళ మీద పడబోయింది. అంజి, తులసమ్మని వద్దని వారంచి ఇంటి నుండి వచ్చేసిన తర్వాత జరిగింది చెప్పుకొచ్చాడు. " ఆ లక్ష రూపాయలు మన ఊరి బ్యాంకు లోనే డిపాజిట్ చేసి ఊరు వదిలి వచ్చేసాను. ముందు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. కానీ మీరు నాలో నింపిన ఆత్మ విశ్వాసంతో ముందుకు అడుగు వేసాను. మీరు చెప్పించిన చదువు నాకు జీవనోపాధినిచ్చింది. నాకొచ్చే జీతంలో దాదాపు తొంభై శాతం ఈ వృద్ధాశ్రమానికే ఖర్చు చేస్తున్నాను. కన్న పిల్లలు వదిలేసిన ఎంతో మంది అభాగ్యులకు ఇంత నీడ ఇస్తున్నానన్న తృప్తి మిగిలింది. నా అదృష్టమేమిటంటే నన్ను అర్ధం చేసుకున్న భార్య దొరకడం " అని తన భార్యను పరిచయం చేసాడు అంజి. "కంటేనే కొడుకులు కాదని మరోసారి రుజువు చేసావు రా. ప్రేగు తెంచుకుని పుట్టిన కొడుకులే కళ్ళు లేని కబోదుల్లా మీరు మాకు అక్కర్లేదని రోడ్ మీద పడేసిన మాలాంటి తల్లి దండ్రులకు నువ్వే పెద్ద దిక్కయ్యావు. నువ్వు నిజంగా మాకు ఆ దేవుడిచ్చిన వరం రా!" అని మరల అంజి ని కౌగిలించుకున్నాడు రామచంద్రయ్య. "నేనెప్పటికీ మీ రామబంటు నే అయ్యగారు " అని రెండు చేతులతో జోడించి ముందుకు సాగాడు అంజి, తులసీ రామచంద్రయ్యల తో. **** సమాప్తం ****

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు