నా మనసు బాగు చేసే వాడు - గంగాధర్ వడ్లమన్నాటి

Naa manasu bagu chesevaadu

సాయంత్రం వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు మధు.దారిలో, ఆఫీసులో తన పాత టీమ్ లో పనిచేసిన శేఖర్ కనిపించాడు.

“శేఖర్” అంటూ పిలిచాడు.పలకలేదు .ఈ సారి కాస్త గొంతు చించుకుని “శేఖర్” అంటూ అరిచాడు.

ఓ క్షణం తుళ్ళి పడి,తర్వాత తూ,తూ అనుకుని, ఎవరా అన్నట్టు తల తిప్పి చూశాడు శేఖర్. మధుని చూస్తూనే , “హాయ్” అన్నాడు నవ్వుని చెవుల వరకూ సాగదీస్తూ.

“ఎక్కడికి ! ఏదో బాల్ లా అలా వేగంగా నడుచుకుంటూ వెళ్లిపోతున్నావ్.” అడిగాడు మధు.

“మనసు బాగోవడం లేదు మధు.అంతా రివర్స్ లో జరుగుతోంది.టీ తాగితే తలనెప్పి వస్తోంది .ప్రశాంతంగా కూర్చుంటే చిరాకు వస్తోంది .ఇలానే ఏదో అయోమయంగా అనిపిస్తోంది . ఈ మధ్య స్ట్రెస్ లెవెల్స్ కూడా మరీ పెచ్చు పెరిగాయి” చెప్పాడు తలగోక్కుంటూ

“ఎందుకు అలా అవుతోంది నీకు” అడిగాడు మధు, ముక్కు గోక్కుంటూ

“ఏవుంది, ఆ మేనేజర్ గోపాల్ గాడిద వల్ల.వాడి తోక రాజశేఖర్ కూడా ఒత్తి వెధవ .ఇద్దరూ ఆ కంపెనీకి సీ.యీ.ఓ.ల్లా ఫీల్ అయిపోతున్నారు.ఒకటే నసగాళ్ళు”. చెప్పాడు శేఖర్ ,పళ్ళు పర పరా కోరుకుతూ.

“అవును,వాడి సంగతి నాకు తెలుసు.పైకి పామేరియన్ పప్పీలా కనిపిస్తాడు కానీ, వాడో కరోనా గబ్బిలం. చాలా వినయంగా కనిపిస్తాడు. అదును చూసి కాటేస్తాడు. వాడెంత దొంగ వెధవో అందరికీ తెలుసు. ఏదైనా కంప్లయింట్ పెడితే , అది సాల్వ్ చేయకుండానే సాల్వ్ అయిపోయిందని కంప్లయింట్ టికెట్ క్లోజ్ చేయిస్తాడు. జూమ్ లో మీటింగ్ పెట్టి పడుకుండిపోతాడు .టీమ్ మెంబర్స్ పే రోల్ కూడా చూడ్డం రాదు వెధవకి .అనవసరంగా జీతం కట్ అయిందని అరిచి గీ పెట్టినా, దున్నపోతు మీద వాన పడ్డట్టు పెద్ద పట్టించుకోడు. పోయి హెచ్.ఆర్. డిపార్ట్మెంట్ ని అడగమని చేతులు దులుపుకుంటాడు. వాడికి మళ్ళీ తోకలు వేరే. ఆ తోకలలో ఓ తోక, ఆ బిల్డప్ బఫూన్ రాజశేఖర్ గాడు. ఆ రాజశేఖర్ మీద ఎవరైనా కంప్లయింట్ ఇస్తే చాలు,వీడి కొంపేదో మునిగినట్టు , రివర్స్ లో కంప్లయింట్ ఇచ్చిన ఎంప్లాయ్ మీదే కక్ష సాధిస్తాడు.వారి లాగిన్స్ బ్లాక్ చేసి బ్లాక్ మెయిల్ చేసి, వేరే టీమ్ కి వెళ్ళిపొమ్మంటాడు తెలుసా” .

“అలాగా? వాడికెంత ధైర్యం అలా చేయడానికి? . అయినా ఎవడిమీదైనా కంప్లయింట్ వస్తే, దాన్ని కంపెనీ పోలసీస్ ప్రకారం ఎంక్వైరీ చేయాలి కానీ, అంత బాధపడిపోవడం ఎందుకు? కొంపదీసి ఆ గోపాల్ గాడికీ ,ఈ రాజశేఖర్ గాడికీ మధ్య ఏమైనా ఉందా ఏవిటి ఖర్మ?. అయినా, ఇక్కడ ఇలాంటి వాళ్ళని అడిగే వాడు,కడిగే వాడూ లేక ఇలాంటి వాళ్ళ రుబాబు సాగుతోంది. ఇదే ఏ నికార్సైన సాఫ్టు వేర్ కంపెనీలోనో అయితే, జుట్టు పట్టుకుని బయటకు విసిరేస్తారు . నేడు చాలా సాఫ్టు వేర్ కంపెనీల్లో ఇలాంటివి కోకొల్లలు.ఇన్నేళ్లు పనిచేస్తాం అని బలవంత పెట్టి బాండ్ రాయమనడం, ముందే మానేస్తే ఎక్స్పీరియన్స్ లెటర్ ఇవ్వం అని వేదించడం ,ట్రైనింగ్ లో జీతం ఇవ్వకపోవడం, రిజైన్ పెట్టాక బెనిఫిట్స్ ఎగ్గొట్టడం. ఆన్లైన్ అటెండెన్స్ అప్లికేషన్ని అడ్డుపెట్టుకుని , టెక్నికల్ ఎర్రర్ అని చెప్పి ఎక్కువ లీవ్స్ చూపించి ఎక్కువ జీతం కట్ చేయడం, ఎక్కువ పని గంటలు పనిచేయించుకుని ,తక్కువ మొత్తం డబ్బు ఇవ్వడం , ఇలా ఉద్యోగం ఇచ్చినట్టే ఇచ్చి, అనేక చచ్చు పోకడలు పోతున్నాయి కొన్ని సాఫ్టు వేర్ కంపెనీలు. వాటి ఓవర్ యాక్షన్ మనకి తెలీదా” చెప్పాడు మధు .

“నువ్వు చెప్పింది నిజం.అందుకే,ఉద్యోగం మానలేక డిపార్ట్మెంట్ మారిపోయాను. అలాంటి వెధవల దగ్గర పనిచేయడం కన్నా, వీధిలో ఆవదం అమ్ముకోవడం సుఖం. అంత దరిద్రులు వాళ్ళు . వీటన్నిటి వలనా, దిగులూ గుబులూ కలిగి, మనసుకి జలుబు చేసినట్టు ఒకటే ఇబ్బందిగా ఉంది మధూ” .

“అవునా, అలా అయితే నాతో రాకూడడూ?” .

“ఎక్కడికి?”

“నాకు తెలిసిన బ్రహ్మాండమైన ఓ సైకాలజిస్ట్ ఉన్నాడు. నేను ఇప్పుడు ఆయన దగ్గరకే వెళ్తున్నాను .నువ్వు కూడా వస్తే, నేనే నిన్ను ఆయనికి పరిచయం చేస్తాను.ఏవంటావ్” అడిగాడు మధు

“అక్కరలేదు. ఇవన్నీ పోవడానికి, నాకూ ఓ సైకాలజిస్ట్ ఉన్నాడు తెలుసా!” చెప్పాడు శేఖర్ చిన్న చిరు నవ్వుతో

“అవునా, ఎవరతను? మంచి సైకాలజిస్టా” అడిగాడు మధు ఆసక్తిగా

వెంటనే తన జేబులోంచి ఓ క్వార్టర్ బ్రాందీ బాటిల్ తీసి “ఇదిగో నా సైకాలజిస్ట్ .నా మనసు బాగోకపోతే, నేను నమ్మే సైకాలజిస్ట్ ఇతనే మరి”.చెప్పాడు శేఖర్ చిన్నగా నవ్వేసి

“ఓహ్ ఇదా ! అతిగా ఈ సైకాలజిస్ట్ జోలికి వెళ్లకు.మనసు మాట ఎలా ఉన్నా, శరీరం పాడైపోతుంది” అని తను కూడా ఓ చిన్న నవ్వు నవ్వి అక్కడినుండి కదిలాడు మధు

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు