టీ.వీ. సీరియల్ తో తంటా - కందర్ప మూర్తి

TV Serial tho tantaa

అది నగరంలో కరోనా కాలనీ. పోయిన కరోనా వైరస్ సమయంలో ప్రారంభమైనందున ఆ కాలనీ కి " కరోనా" పేరు జ్ఞాపకంగా పెట్టుకున్నారు. అందులో 'ఏ' బ్లాక్ లో అభిరుచి అపార్టుమెంట్లో ఐదు ఫ్లోర్లు ఉన్నాయి. ప్రస్తుతం సగం ఫ్లోర్లలో కోవిడ్ పాజిటివ్ కేసులు ఉన్నందున హోమ్ క్వారంటైన్లో కుటుంబాలు ఉంటూ ప్రతి ఫ్లాట్ దగ్గర ఎలర్టు స్టిక్కర్లు కనబడుతున్నాయి. అభిరుచి అపార్టుమెంట్లో రెండవ ఫ్లోర్లో రిటైర్డు హెడ్మాస్టర్ సుబ్బారావు దంపతులు నివాసం ఉంటున్నారు. ఇద్దరు కొడుకులు స్టేట్సులో జాబ్ చేస్తూంటే ఉన్న ఒక్క కూతురికి పెళ్లి జరిపితే అల్లుడితో బెంగళూరులో ఉంటోంది. సర్వీస్ లో ఉన్నప్పుడు సుబ్బారావు గారికి స్టేజి నాటకాలంటే ఎంత పిచ్చో , ఆయన శ్రీమతి సుభద్రమ్మకు టీ.వీ. సీరియల్సు , పాత సినేమాలు చూస్తూ కాలం మరిచి పోతుంది. తెలుగు టివి ప్రతి ఛానెల్లో వచ్చే సీరియల్స్ క్రమం తప్పకుండా ఎన్ని పనులున్నా ఆపి మరీ దీక్షగా చూస్తుంటుంది. టివి సీరియల్లో ఏడుపు సీను వచ్చిందంటే ఆవిడ కళ్లంట నీళ్లు కారిపోతాయి. అత్త కోడలిని కష్ట పెడుతుంటే ఇక్కడ ఈవిడ పళ్లు కొరుకుతూ నోటికొచ్చిన తిట్లు మొదలెడుతుంది. ఏ కారణం వల్లైనా సీరియల్ ఎపిసోడ్ చూడలేక పోతే ఆడ పడుచులకు ఫోన్ చేసి ఏమైందీ తెలుసుకునే వరకు నిద్ర పట్టదు. సీరియల్ చూస్తూ లీనమైందంటే ఎవరు డోర్ కాలింగ్ బెల్ నొక్కినా , కూతురు నుంచి మొబైల్ కాల్స్ వచ్చినా వినబడవు. అందువల్ల ఆవిడ ఎప్పుడు ఫ్రీ గా ఉంటారో ఆ సమయంలో కాల్ చేసి మాట్టాడుతుంది. ఆవిడ సీరియల్సు పిచ్చికి సుబ్బారావు గారు విసుక్కుంటున్నా లెక్క చెయ్యదు. ఆయన ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతు మొబైల్లో పిల్లలతో కాలక్షేపం చేస్తుంటారు. ఇదివరకైతే ఫ్రెండ్సుతో పార్కులు ,గుళ్లూ , ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటూ టైమ్ పాసయేది. ఇప్పుడు కోవిడ్ వైరస్ కారణంగా వయసు మళ్లిన పెద్ద వాళ్లు బయట తిరగడానికి అవకాశం లేకపోతోంది. ఏవైనా మొబైల్ ఫోన్ తోనే పనులు జరపవల్సి వస్తోంది. ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ చాలా ప్రభావం చూపుతున్నందున పిల్లల సూచన మేరకు ఇంట్లో కూడా మాస్కు పెట్టుకోవల్సి వస్తోంది. సుభద్రమ్మకు టీ.వీ లో ఏ సీరియల్ ఎప్పుడు వచ్చేదీ తెలుసు కనక పనులు చక్కబెట్టుకుని కూర్చుంటుంది. ఆ సమయంలో ఏ కొరియర్ బోయ్ వచ్చినా మొబైల్ కాల్స్ వచ్చినా సుబ్బారావు గారే చూసుకుంటారు.మధ్యలో ఆయనకి చాయ్ అవుసర మవుతుందని ముందే తయారు చేసి ఫ్లాస్కులో ఉంచుతుంది. అప్పుడప్పుడు గేస్ స్టౌ మీద కుక్కర్ పెడితే ఆవిడ చెప్పిన ప్రకారం విజిల్సు వచ్చిన తర్వాత ఆపేయాలి. సీరియల్ మధ్యలో యాడ్స్ వస్తే ఒక్కొక్కసారి కిచెన్లో కెల్తుంది. ఇప్పుడు సిటీలో లాక్ డౌన్ వల్ల ఉదయం కొన్ని గంటలు మార్కెటింగ్ ఇతర పనుల కోసం రిలేక్సేషన్ ఇస్తున్నారు. అందువల్ల సుబ్బారావు గారు మందులు తేవడం కోసం డబుల్ మాస్క్ వేసుకుని స్కూటీ మీద మార్కెట్ కెల్తూ డోర్ కాలింగ్ బెల్ వైపు, మొబైల్ ఫోన్ రింగు మీద ధ్యానం పెట్టమని భార్యకు చెప్పి వెళ్లారు. ఆయన బయటికెళ్లిన తర్వాత సుభద్రమ్మ డోర్ లాక్ చేసుకుని కిచెన్లో కెళ్లి స్టౌ మీద కుక్కర్ పెట్టి మూతికి మాస్కు సరిచేసుకుని టీ.వీ. ముందు కూర్చుని సీరియల్లో లీనమైంది. కొద్ది సేపటికి కిచెన్లోంచి కుక్కర్ విజిల్స్ వస్తున్నాయి. సుభద్రమ్మ సీరియల్లో ఏదో విషాద ఘట్టంలో ములిగి కిచెన్లోంచి మాడు వాసన వస్తున్నా ధ్యానం పెట్టలేదు. వంటగది నుంచి మాడు వాసన హాల్లో కొస్తున్నా ఆవిడ ఈ లోకంలోకి రాలేదు. కుక్కర్ మాడు వాసన కిటికీ లోంచి పక్క ఫ్లోర్లోకి పైన ఫ్లోర్లకి వ్యాపించి అందరూ ఎక్కడ నుంచి మాడు వాసన వస్తోందోనని ఆందోళన చెందుతున్నారు. ఇంతలో సుబ్బారావు తన ఫ్లోర్ డోర్ దగ్గరకు రాగా కిచెన్ విండో లోంచి పొగ రావడం గమనించారు.ఆయనకు ఏదో అనుమానం కలిగింది. వెంటనే డోర్ బెల్ గట్టిగా మోగించడం మొదలెట్టాడు. ఎంత సేపటికి డోర్ తెరవకపోవడంతో చేత్తోను కాలితో డోర్ బాదడం చేసారు. కొద్ది సేపటికి సుభద్రమ్మ కంగారుగా తలుపు తెరిచింది. హాల్లో కొచ్చిన సుబ్బారావు గాబరా పడుతూ కిచెన్ వైపు పరుగు తీసారు.నల్లటి పొగతో పాటు మాడువాసన నిండు కుంది. వెంటనే గేస్ స్టౌ బర్నర్ ఆఫ్ చేసారు. అప్పటికి కాని సుభద్రమ్మకు తన తప్పిదం తెలిసి రాలేదు. సీరియల్ కి లేటైందన్న తొందర్లో కుక్కర్లో బియ్యం కడిగి పోసి నీళ్లు పొయ్యడం మరిచి గేస్ స్టౌ వెలిగించి వచ్చి టీ.వీ. దగ్గర కూర్చుంది. బియ్యం లో చెమ్మకు స్టీమ్ వచ్చి తర్వాత బియ్యం మాడి అడుగంటాయి. మాడు వాసన హాలుతో పాటు మిగతా ఫ్లోర్లకి వ్యాపించింది. ఇంకా నయం, సమయానికి సుబ్బారావు వచ్చారు కాబట్టి పెద్ద గండం తప్పింది. .కిటికీలు డోర్ తలుపులు తెరిచి ఫేన్లు , ఎగ్జాస్టు ఫేన్ , కూలర్ ఆన్ చేస్తే ఇంట్లో పొగ బయటకు పోయింది. సుబ్బారావు గారికి ఏమనలో అర్థం కాలేదు. ఈ విషయం అపార్టుమెంట్లో తెలిసి సుభద్రమ్మ టి.వి. పిచ్చికి నవ్వుకున్నారు. * * *

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి