గురుదక్షిణ - మీగడ వీరభద్రస్వామి

Guru dakshina

మోహన్ ఆస్ట్రేలియాలో విశ్వ విఖ్యాతి చెందిన ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ సి ఈ ఓ గా పని చేస్తున్నాడు.కొన్ని వేల బిలియన్ డాలర్స్ వార్షిక టర్నోవర్ గల మల్టీ నేషనల్ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఒక ఇండియన్ ఉండటం అరుదు,అందులోనూ మనవాడు సాఫ్ట్వేర్ రంగంలో తన కంపెనీని పరుగులు పెట్టిస్తున్నాడు అని ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయుడూ గర్వంగా మోహన్ గురుంచి చెప్పుకుంటున్నారు.ముఖ్యంగా అమలాపురానికి చెందిన అచ్చతెలుగు కుటుంబాలకు చెందిన ఆముదాల మోహనరావు విశ్వవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు పొందడంతో తెలుగుజాతి సగర్వంగా చెప్పుకుంటుంది మోహన్ గురుంచి. మోహన్ తండ్రి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న రాజకీయ నాయకుడు,అమలాపురం ప్రాంతంలో చాలా పెద్ద రైతు,మోహన్ కుటుంబం పూర్వికులు నుండి మంచి స్ధితిమంతుల కుటుంబం.ధనిక వర్గాల్లో దానగుణం, సమాజసేవా లక్షణాలు ఉన్న కుటుంబంగా ఆ కుటుంబానికి పేరు ఉంది. మోహన్ విశ్వ సమాజశ్రేయోభిలాషి అందుకే కులాలకు ప్రాంతాలకు భాషాభావాలకు అతీతంగా సమాజ సేవ చెయ్యాలని అనుకునేవాడు.అతడి ఆశయాలుకు తగ్గట్టుగానే అతనికి ప్రపంచ దేశాలన్నీ తిరిగి తనదైన శైలిలో సేవలుచెయ్యగల ఉద్యోగం వచ్చింది.సాఫ్ట్వేర్ రంగంలో సామాజిక సేవాదృక్పదం ఉండటం అరుదు, అయితే మోహన్ ప్రపంచ దేశాల్లో వేలాదిమంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడానికి నిధులు ఇస్తున్నాడు,ముఖ్యంగా ఉపాధ్యాయ శ్రేయోనిధి అనే ఒక నిధిని ఏర్పాటు చేసి ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులకు ఆర్ధిక సహాయం చేస్తున్నాడు మోహన్. ముందస్తు సమాచారం లేకుండా మోహన్ తెలంగాణాలోని సిద్దిపేట వస్తున్నాడని కొన్ని గంటల సమయం ముందు మాత్రమే తెలిసింది అతని బంధుమిత్రులకు.వరల్డ్ ఫేమస్ సాఫ్ట్వేర్ కంపెనీ సి ఈ ఓ సిద్దిపేట వస్తున్నాడు అని తెలియగానే హైదరాబాద్ లో ఉన్న ఆ కంపెనీ ప్రతినిధులు అతనికి సెక్యూరిటీ మరియూ ఇతర అత్యవసర సౌకర్యాలు కల్పించమని తెలంగాణా ప్రభుత్వ అధికారులను కోరగా తగిన ఏర్పాట్లు చెయ్యమని స్థానిక అధికారులకు సూచన చేశారు ప్రభుత్వ ఉన్నతాధికారులు. మోహన్ విమానాశ్రయం నుండి నేరుగా సిద్దిపేట చేరుకొని సెక్యూరిటీ,ఇతర సౌకర్యాల ఏర్పాట్లు తనకు వద్దని తెలంగాణాలో తన మిత్రుడు డేవిడ్ ని తీసుకొని డేవిడ్ మోటార్ బైక్ పై సిద్దిపేటలోని ఒక మురికివాడకు వెళ్ళాడు.అక్కడ ఒక చిన్న వీధిలో ఒక రేకుల షెడ్ లోకి వెళ్ళాడు.అతనెవరో ఆ ప్రాంతానికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు.ముఖ్యంగా మీడియాకి అతని కదలికలు తెలియకుండా చూసుకున్నాడు. రేకుల షెడ్లో ఒక ముసలాయన నులక మంచం మీద కూర్చొని శ్రీశ్రీ మహా ప్రస్తానం పుస్తకం చదువుకుంటున్నాడు.అక్కడ కాళోజి,శేషేంద్ర శర్మ,చలం, రావి శాస్త్రి,ఆరుద్ర,ఆత్రేయ,సాహిత్యం పుస్తకాలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి,గురజాడ,గిడుగు,కారా మాస్టారు, జాషువ వంటి రచయితల సాహిత్యం పుస్తకాలు చదివి పక్కన పెట్టినట్లు కనిపిస్తుంది. మోహన్ మహమ్మద్ యూషప్ ఖాన్ మాష్టార్ ని చూసి భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నాడు,"బేటా కౌన్ హే తుం" అని అడిగాడు యూషప్ మాస్టర్ తన పక్కన నిలబడి కన్నీరు పెట్టుకుంటూ చేతులు జోడించి ఉన్న మోహన్ ని చూసి."సార్ నేను మీ ప్రియ శిష్యుడని ఆముదాల మోహనరావుని అని అన్నాడు మోహన్,ఓ ఓ మోహన్ నువ్వా... నువ్వు ఎక్కడో వేరే దేశంలో ఉన్నావని,పెద్ద ఉద్యోగంలో ఉన్నావని తెలిసింది,బేటా బాగున్నావా! నాన్న అమ్మ బాగున్నారా!అమ్మ చేతి ఆవకాయ,నాన్న గారి అభిమానం మర్చిపోలేను,బేటా మోహన్,రా ఇక్కడ కూర్చో"అని తన పక్కనే నులక మంచం మీద కూర్చో బెట్టి భుజం మీద చెయ్యవేసి"భేటా చాయ్ తాగుతావా" అని ఆప్యాయంగా అడిగాడు,"నేనే టీలు తెప్పిస్తాను"అని మోహన్ అనగా "వద్దు వద్దు నేను మీ ఊరులో టీచర్ గా పనిచేసినప్పుడు రోజూ మీ ఇంటి చాయ్ త్రాగేవాడిని మీ ఋణం ఈ విధంగా తీర్చుకుంటాను"అని అతి కష్టం మీద నిలబడి కిరోసిన్ స్టవ్ వెలిగించి టీ తయారు చేశారు మాస్టారు. ఈ గురుశిష్యులు బంధం చూసి మోహన్ మిత్రుడు డేవిడ్ ఆశ్చర్య పోయాడు."మీరు మీ కుటుంబం ఒక ట్రైన్ ప్రమాదంలో చనిపోయారని తప్పుడు సమాచారం విని నేను ఇన్ని రోజులూ కలుసుకోలేక పోయాను నన్ను క్షమించండి"అని మాస్టారు పాదాలు తాకాడు మోహన్,"నై బేటా ట్రైన్ ప్రమాదంలో ఈ ముసలి పీనుగు తప్ప మేరా పరివార్ మొత్తం పోయింది కానీ ఆత్మహత్య మంచి సందేశం ఇవ్వదని చచ్చేవరకూ బ్రతకాలని నిర్ణయించుకున్నాను.నాకు మిగిలింది ఈ పుస్తక కుటుంబమే నేను చదవ వలసిన పుస్తకాలు,గ్రంథాలు ఇంకా ఉన్నాయి"అని చిన్నగా నవ్వి ఒక పుస్తకం తీసి బిడ్డ తలను ప్రేమతో నిమిరినట్లు పుస్తకాన్ని తడిమాడు మాస్టారు. మోహన్ కన్నీరు ఆగలేదు"సార్ ఈ రోజు సెప్టెంబర్ 5, ఉపాధ్యాయ దినోత్సవం,అందుకే మిమ్మల్ని చూడటానికి వచ్చాను,మీ ఆశీస్సులు నాకు కావాలి,అసలు మీ అడ్రస్ నాకు ఈ డేవిడ్ చెప్పాడు,నేను తరుచూ మీ గురుంచి వీడి దగ్గర ప్రస్తావిస్తుంటాను ఇతను ఈ మద్య ఒక సాహితీ సభలో మిమ్మల్ని చూశాడట అందుకే నాకు మీ గురుంచి తెలిసింది,మీరు నాతో ఆస్ట్రేలియా వచ్చేయండి లేదా మీకు అన్ని సౌకర్యాలూ ఏర్పాటు చేస్తాను హైదరాబాద్ లో ఉండండి,"అని అన్నాడు మోహన్ గురువుగారి చేతులు పట్టుకుంటూ. "బేటా మోహన్ నీకు తెలుసు కదా నేను అమలాపురంలో ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గా పని చేసినా మా పూర్వీకులు ఊరు సిద్దిపేటే ఈ రేకులు షెడ్ మా తరతరాలు ఆస్తి ఇదే నా ఫైవ్ స్టార్ హోటల్,ఇక నా పెన్షన్ తక్కువైనా నాకు సరిపోతుంది,కొంత పుస్తకాలకు మరికొంత తిండికి,ఈ మద్య వీధి పిల్లలకు పుస్తకాలకు డబ్బులు ఇస్తున్నానులే... ఇదే నా ప్రపంచం అల్లా దయవల్ల నాకు ఇబ్బందులు లేవు,కుటుంబం లేదు నీలాంటి శిష్యులు విదేశాల్లో ఉండి కూడా నాకోసం భారతదేశం వచ్చి నన్ను వెదుకుకుంటూ వస్తున్నారంటే నాకు ఏమి కావాలి,నీకు గుర్తుందా ఒక ఉపాధ్యాయ దినోత్సవం రోజు నువ్వు వివేకానందుని వేషం వేసి విదేశాల్లో భారతీయ సంస్కృతి గొప్పతనం వివరించిన తీరుగా మాటలాడావు ఇప్పటికీ గుర్తుపెట్టుకో నువ్వు ఎక్కడున్నా మూలాలు మరవుకు,ఒరే మోహన్ నీతో వచ్చి అమలాపురంలోని మన బడి చూడాలని ఉందిరా ఆ నల్ల బల్లని ముద్దాడి,మైదానంలోని మర్రి చెట్టుని ఆలింగనం చేసుకోవాలని ఉంది నేను టీచర్ గా వృత్తి మొదలెట్టి మీ తాతయ్య పలుకుబడితో ఇరవై ఏళ్ళు అక్కడే పనిచేశాను,అప్పుడు బలవంతం బదిలీలు లేవు కదా అందుకే ఆ బడి నల్ల బల్ల పై నాకు మమకారం" అని యూషప్ మాస్టర్ అనడంతో మోహన్ కన్నీరు ఆగలేదు. మోహన్ కంటతడి చూసి మాస్టారూ కన్నీరు పెట్టుకున్నారు'గురుశిష్యుల ఆత్మీయత చూసి డేవిడ్ కన్నీరు పెట్టుకున్నాడు,మోహన్ ఒక్క ఫోన్ కాల్ తో సిద్దిపేటలో హెలీకాఫ్టర్ సిద్ధమయ్యింది,సిద్దిపేట నుండి రాజమండ్రి హెలికాఫ్టర్ ప్రయాణానికి కావసిన అనుమతులు నిముసాల్లో తెచ్చుకున్నాడు మోహన్, "హెలికాప్టర్ హంగామా ఎందుకురా..." అని గురువుగారు అన్నా టీచర్స్ డే రోజే మీరు మన బడికి రావాలి అది నాకోరిక కాదనకండి సమయం లేదు" అని ఉన్నపలంగా మాస్టార్ని తీసుకొని హెలికాప్టర్ ఎక్కించాడు.వాళ్ళతో డేవిడ్ కూడా ఉన్నాడు ఆఘమేఘాల మీద ముగ్గురూ అమలాపురం చేరుకున్నారు. యూషప్ మాస్టర్ వస్తున్నారని తెలిసి అతని శిష్యులు, గ్రామస్తులు ఘన స్వాగతానికి ఏర్పాట్లు చేశారు,అతని శిష్యుల్లో ఉపాధ్యాయులు,ఉన్నతాధికారులు,డాక్టర్లు, లాయర్లు,ఇంజనీర్లు వున్నారు ముఖ్యంగా ఆ ప్రాంతం మినిస్టర్,ఎం పి ,ఎం ఎల్ ఏ అతని శిష్యులే,మోహన్ నెట్ వర్క్ వల్ల గంటల్లోనే అందరూ అమలాపురం చేరుకున్నారు,యూషప్ మాస్టర్ నోటమాట రాలేదు, నేరుగా బడికి చేరుకొని బడిలో బడి పిల్లలకు మోహన్ మిత్రులుతో కలిసి చేసిన ఆధునిక హంగులు,సౌకర్యాలు చూసి మాస్టర్ మురిసిపోయాడు.బడిలో చాలా సమయ గడిపారు. మోహన్ మిత్రులు,యూషప్ మాస్టర్ శిష్యులు, గ్రామస్తులు అతన్ని ఘనంగా సన్మానించారు.ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న అతని శిష్యులు చిన్న పిల్లలైపోయి అతనికి పాదాభివందనాలు చేస్తుంటే మాస్టారు ఆనందానికి అవధులు లేవు,అందరినీ పేరు పేరునా పలకరించి,వారి ఉన్నతిని విని మురిసిపోయి, గర్వపడ్డాడు.అందుకే గురువు స్థానాన్ని మించిన స్థానం లేదని పెద్దలు అంటుంటారు అని మనసులో అనుకుంటూ,అతనికి ఆర్ధిక సాయం చెయ్యడానికి ముందుకు వచ్చిన వారిని సున్నితంగా వారించి "సమాజానికి సేవ చెయ్యండి,పాత పుస్తకాలు షాప్ లో ఏవైనా అరుదైన పుస్తకాలు దొరికితే కొని నా ఇంటికి పంపండి చాలు మీ జ్ఞాపకాలతో చదువుకుంటాను"అని శిష్యులతో చిన్న పిల్లాడులా పాత జ్ఞాపకాలను నెమరు వేసుకొని,సాయంత్రం మోహన్ ఇంటికి చేరుకొని అతని కుటుంబం ఇచ్చిన ఆతిధ్యం స్వీకరించి,"నన్ను ట్రైన్లో జనరల్ బోగీ లో కూర్చోబెట్టి మా ఊరు పంపుబేటా కిటికీ పక్క కూర్చొని,జనరల్ బోగీ జనాలు ముచ్చట్లు విని పయనిస్తే ఆ తృప్తే వేరు,ట్రైన్ బయట ప్రకృతి,ట్రైన్ లోపల మాయామర్మము లేని పేద సాదల మాటల అలజడి"అని కవితాత్మకంగా అన్నారు మాస్టర్. గురువు కోరిక కాదనలేక రెండోరోజు మాస్టార్ని ట్రైన్ ఎక్కించి నిండైన మనసుతో దండం పెట్టాడు మోహన్. ఉపాధ్యాయ దినోత్సవం ఇంత సంతృప్తిని ఇస్తుందంటే ప్రతి ఏడాదీ చేసుకోవాలి అని మనసులో అనుకోని, ఇంటికి చేరి,వెంటనే గురువుగారి పేరిట గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటుకు చర్చించాడు మోహన్,చిన్ననాటి మిత్రులతో సమావేశమై.ఈసారి ఇండియా నుండి ఆస్ట్రేలియా మోహన్ తిరుగు పయనం ఎన్నో మధురానుభూతి ఆలోచనలు,జ్ఞాపకాలతో సాగింది.

మరిన్ని కథలు

Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ