Mr. వింత మనస్తత్వం - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

Mr. vintha manastatvam

ఇలాంటివాళ్ళు మనకి సర్వసాధారణంగా తారసపడుతూనే వుంటారు. చాలా గమ్మత్తైన మనస్తత్వం. అలాంటివాళ్ళలో ఒక్కడిని మీకు పరిచయం చేస్తాను. అతడే Mr. వింత మనస్తత్వం. పేరేంటి అలా వుంది అనుకుంటున్నారా? సమ్ ఎక్స్ బదులన్నమాట.

మనమిప్పుడు వెజిటెబిల్ మార్కెట్లో వున్నాం. నన్ను ఫాలో అవండి. అతన్ని నేను చూపిస్తాను. అదిగో కుంటుతూ నడుస్తున్నాడే అతడే Mr. వింత మనస్తత్వం.

"ఏమిటండి... అలా కుంటుతున్నారు?" అతడి భార్య సోమిదేవి అడిగింది.

"ఆఁ... చెప్పు తెగిందే... కాస్త పిన్నీసివ్వు పెట్టుకుంటాను"

"అబ్బా... పిన్నీసేంటండి అసహ్యంగా... పదండి చెప్పులు కుట్టించుకుందాం"

"ఊరుకోవే నాలుగు కుట్లేసి ఐదు రూపాయలు తీసుకుంటాడు. ఇలా పిన్నీసుతో కొంతకాలం గడిపేస్తే తర్వాత ఎలాగూ కొత్త చెప్పులు కొనుక్కోవచ్చు"

"సరె... మీతో చస్తున్నాను. ఇదిగోండి"

మార్కెట్లో తిరుగుతున్నంత సేపూ ఆ పిన్నీసు ఊడిపోతూనేవుంది... మనవాడు వంగి దాన్ని మళ్లీ పెట్టుకుంటూనే వున్నాడు. అందరూ తమవంక చూస్తున్నారని కళ్లతో సోమిదేవి అతడ్ని హెచ్చరిస్తూనేవుంది. మనవాడు పట్టించుకుంటేగా! పైగా "చూడు... సోమూ... మన బాధలు మనవి. ఎవరో చూస్తున్నారని... మనం అస్సలు ఫీలవకూడదు." అన్నాడు వేదాంతిలా.

కూరలు కొనడం పూర్తయ్యాక "అబ్బా... ఇప్పటికే బాగా పొద్దుపోయింది. ఆటోలో ఇంటికెళదామండి" అంది.

"ఊర్కో సోము... దాన్నే అంటారు ‘పావల ఆక్కూరకి ముప్పావలా మసలా’ అని. నాలుగు రూపాయలు ఆదా అవుతాయని మార్కెట్కొచ్చి... డబ్బులు ఆటోకి తగలెట్టడమేమిటి చెప్పు?. చక్కగా మనకోసం ప్రభుత్వం బస్సులు నడుపుతుంటే... " అని అన్నాడు. బస్టాపులో గంట వెయిట్ చేశాక... అశేష ప్రయాణికులతో విశేషంగా వచ్చింది బస్సు. అతడు గబ గబ మగాళ్ళవైపు నుండి ఎక్కుతూ ‘నువ్వూ ఎక్కు’ అని భార్యకి పురమాయించాడు. ఆమె పరుగులు పెడుతూ ఎక్కేసరికీ తలప్రాణం తోకకు వచ్చింది.

ఇంటిదగ్గర బస్టాప్ లో దిగేసరికి బాగా అలసిపోయింది.

"ఏవండీ... ఇంటికెళ్ళేముందు... కర్రీ పాయింట్ లో రెండు కూరలు తీసుకుంటే... ఇంటికెళ్ళి పొయ్యి మీద అన్నం పడేస్తాను. ఈ పూట గడిచిపోతుంది." అంది.

"కూరలు చవగ్గా మార్కెట్లో కొని ఇక్కడ కర్రీ పాయింట్లో కూరలు కొంటావా? వింటే ఎవరన్నా నవ్విపోతారు" అన్నాడు.

"ఖర్మ" మనసులో అనుకుని ఇంటికెళ్ళి వంట కార్యక్రమం... తినడం పూర్తయే సరికి అర్ధరాత్రి దాటిపోయింది.

***

"ఏవండీ... సంవత్సరం క్రితం మనపెళ్ళయిన కొత్తలో సినిమాకెళ్ళాం... ఇవాళ ఆదివారం మీకు సెలవుకదా... వెళదామా?" అంది.

"జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలోయ్... తప్పకుండా... పద మ్యాట్నీకి"

సిటీలో వున్న మల్టిప్లెక్స్ ల కెళితే డబ్బు ఎక్కువవుతుందని ఊరికి దూరంగా వున్న థియేటర్ కి బస్ లో తీసుకెళ్లాడు. అక్కడ కూడా పెద్దటికెట్ తీసుకోకుండా జనం తక్కువగా వున్నారని తక్కువ క్లాస్ టికెట్ తీసుకున్నాడు. "అదేంటండి... మీరు మంచి ఉద్యోగం చేస్తున్నారు. ఇలా ఈ టికెట్లో మనం కూర్చోడం మీ స్టాఫ్ ఎవరన్నా చూస్తే బాగుండదండీ!" అంది.

"అందుకేగా ఇంతదూరం తీసుకొచ్చాను. ఇక్కడెవరు చూస్తారు? అయినా అనవసరమైన వాటికి డబ్బులు తగలెయ్యకూడదు. ఇక్కడింత ఖాళీగా వుంటే డాబుకి పోయి డబ్బు వేస్ట్ చేసుకోకూడదు" అన్నాడు.

"పక్కనే కూర్చున్న వాళ్ళు కాండ్రించి వేసే ఉమ్ములు... అరుపులు... కేకలు... సొమిదేవికి సినిమా చూడాలన్న మూడ్ ని చంపేశాయి.

ఇంటర్వెల్లో అతడి క్రింద పనిచేసే రాఘవ పై క్లాసులోంచి మనవాడిని పలకరించాడు.

సోమిదేవి ముఖం అవమానంతో భూమికి జారిపోయింది.

కాని మనవాడిలో చలనమేం లేదు. పైగా "వాడు ఆఫీసంతా అప్పులు చేస్తాడు. అప్పులుచేయడం ఎందుకు ఇలా వేస్ట్ చేయడం ఎందుకు వేస్ట్ ఫెలో" కోపంగా భార్యతో అన్నాడు.

***

సోమిదేవికి రోగం వస్తే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళడు... మందులిప్పించడు. ‘మందులు వాడకూడదు రోగాలు వాటంతట అవే తగ్గా’లంటాడు.

ఇంట్లో వున్న వస్తువులు పాడయితే సాధ్యమైనంత వరకూ తనే రిపైర్ చేయడానికి ప్రయత్నిస్తాడు. రేడియో పాడైతే దాని నెత్తిమీద రెండు దెబ్బలేస్తాడు. ‘ఎక్కడైనా లూజు కనెక్షను వుంటే సరైపోతుంది’ అని ఓ వెర్రి నవ్వు నవ్వుతాడు. ఒకసారి గీజర్ రిపైర్ చేస్తూ గట్టిగా షాక్ కొట్టించుకున్నాడు.

"ఎందుకండి మీకీ ఖర్మ... చక్కగా మెకానిక్ కిస్తే బాగుచేస్తాడు కదా" అని సోమిదేవి అంటే "చిన్న ప్రాబ్లెం వున్నా... గోరంతలు కొండంతలు చేసి డబ్బు గుంజుతారు. మనమే చేసుకుంటే మనకి కాస్త పరిజ్ఞానం కూడా వస్తుంది." అంటాడు.

స్కూటర్ వున్నా ఆఫీసుకి అప్పుడప్పుడు సైకిల్ మీద వెళతాడు. అదేమిటంటే ‘పెట్రోల్ ధర గూబ అదర గొడుతోంది తెలుసుకదా, పైగా సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి మంచిది’ అని సూక్తి ముక్తావళి చెబుతాడు.

మామూలు బియ్యంతో పాటు... నెల నెల రేషన్ బియ్యం తెస్తాడు. ‘అవి ఇవి కలిపి వండు. కేవలం మంచి బియ్యమైతే నేను ఆరిపోతాను. చుట్టాలు వస్తే మాత్రం రేషన్ బియ్యం మాత్రమే వండు.’ అని ఇన్ స్ట్రక్షన్ పాస్ చేస్తాడు.

పొద్దున్నే లేచి రెండు కిలోమీటర్లు నడిచెల్లి పాలప్యాకెట్ తీసుకొస్తాడు. ‘మీకెందుకండి శ్రమ పాలప్యాకెట్లు వేసే అతనికి ఇరవై ఇస్తే ఇంటికొచ్చి వేస్తాడు. పైగా ఒకతనికి మనం సహాయం చేసినట్టూ వుంటుంది’ అంటే పొద్దుటపూట నడవడం ఆరోగ్యానికి ఎంతమేలు చేస్తుందో నీకేం తెలుసు? ఇది తెలియక చాలామంది బీ పీ, సుగర్లతో డబ్బులు హాస్పిటల్లకి దొబ్బపెడుతున్నారు’ అంటాడు.

ఏ కుక్కన్నా Mr. వింత మనస్తత్వం ని కరచి గాయపరుస్తుందేమోనని సోమిదేవి భయం.

తనకి తోచినంత పండగ మామూళ్ళివ్వడం... వినాయక చవితి లాంటి వాటికి చందాలిచ్చి సమాజంలో వేడుకలు చేసే వారికి సహాయంగా నిలవడం లాంటివి చేయడు గాక చెయ్యడు.

పెళ్ళిల్లకి... శుభకార్యాలకి వెళ్ళినప్పుడు చైనా బజార్ లో కొన్న తక్కువ ఖరీదు ఐటమ్స్ కానుకగా ఇస్తాడు. ఒకసారి పెళ్ళి వేదిక మీదే బహుమతులు విప్పి అందరికీ చూపించారు కొత్తదంపతులు. ఆరోజు తాము చైనా బజారులో కొన్న అరవై రూపాయల కుక్కపిల్ల బహుమతిని చూసి పెళ్ళికొడుకు... పెళ్ళికూతురితో సహా అందరూ మూర్చపోయినంత పనిచేశారు. ఆరోజూ Mr. వింత మనస్తత్వం... "బహుమతి అనేది గుర్తుగా ఇచ్చి పుచ్చుకునేది కాని ఆడంబరాలను ప్రదర్శించేది కాదు. అలా బహుమతులతో మనుషులకి విలువ కట్టే వాళ్ళంటే నాకు అసహ్యం" అన్నాడు.

సోమిదేవికి ఒళ్లుమండిపోయింది. మొదట్లో Mr. వింత మనస్తత్వం పొదుపు మనిషనుకుంది. తర్వాత పీనాసనుకుంది కాని ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది, అవేం కాదు... అతడి మనస్తత్వం విచిత్రమైనదని. తన చుట్టూ సమాజముందని అది తనని గమనిస్తూ వుంటుందనీ అస్సలుపట్టించుకోడని. తనేం చెయ్యాలనుకుంటే అది చేసేయ్యడమే! తను ఇబ్బంది పడతాడు, తనవాళ్ళని ఇబ్బంది పెడతాడు.

‘మన తాహతుకి మించి ఆడంబరంగా బ్రతకకూడదు... కాని సమాజంలో మన విలువ మనమే తగ్గించుకునేలా ప్రవర్తించకూడదు’ ఇది సోమిదేవి అభిప్రాయం.

అదిగో మన Mr. వింత మనస్తత్వం వాళ్ళ కొలీగ్ మ్యారేజ్ కి అందరూ వందల్లో కంట్రిబ్యూట్ చేస్తే మనవాడు పాతిక రూపాయలు రాసి, చిద్విలాసంగా నవ్వి ఏదో లెక్చరిస్తున్నాడు.

మరి అతగాడు మారతాడో మారడో! తొంభై తొమ్మిది శాతం మారరు గాక మారరు! ఆ ఇల్లాలి పరిస్థితి ఇక అంతే... ఆమెదే కాదు అతని చుట్టూ వున్న మన పరిస్థితి కూడా అంతే!

***

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి