జానకమ్మతో జర భద్రం - శింగరాజు శ్రీనివాసరావు

Janakamma tho jara bhadram

తనకున్న ఒక్కగానొక్క కొడుకు సత్తిపండు ఉరఫ్ సత్యనారాయణకు పెండ్లి కుదిరినట్టే కుదిరి, అంతలోనే 'తూఛ్' అయిపోవడంతో తట్టుకోలేక పోతున్నది జానకమ్మ. అయినా మన చేతులలో లేనిదానికి, మమ్మల్ని దోషులను చేసి, మాకీ సంబంధం అక్కరలేదు పొమ్మని ముఖానే చెబుతారా ఈ ఆడపెళ్ళి వాళ్ళు. ఎంత అహంకారం వాళ్ళకి, మొలతాడు కట్టుకున్న నాకొడుకునే పుల్లి విస్తరాకులా తీసిపారేస్తారా. కుతకుత ఉడికిపోతున్నది జానకమ్మ. ఈసరికి ఏ పదిమార్లో సంబంధం కుదిర్చిన పంతులు గారిని, ఆయన మాటను బలపరిచిన మొగుణ్ణి దులిపి పారేసింది. ఇక అర్ధాంతరంగా కాలంచేసి, ఈ ఎపిసోడు మొత్తానికి కారణమైన మామగారిని ఎన్ని శాపనార్ధాలు పెట్టిందో అక్షరాలకు అందట్లేదు. ఇంకా ఆ అవమానభారం తగ్గక మయసభలో అవమానపడిన దుర్యోధనునిలా అప్పుడప్పుడు రెచ్చిపోతూనే ఉన్నది. ఇంతకూ అసలు కథ కమామీషు ఏమిటంటే..... జానకమ్మ, జనార్ధనరావు దంపతులకు ఉన్న ఏకైక సంతానం సత్యనారాయణ. అమ్మచాటు బిడ్డలా, నాన్ననీడ మొక్కలా పెరిగాడు. నాయనమ్మ చిన్నప్పుడే బాల్చీ తన్నేసినా, దుక్కలాంటి తాతయ్య చేతికి మూడోకర్రలా ఆయన్ను అంటుకొని తిరిగేవాడు. అంటే అటుయిటుగా తాత కూచి అన్నమాట. కోడళ్ళ పాలిటి సహజ విలన్ అయిన అత్తగారు లేకపోవడంతో మామ పానకాలును ప్రేమగానే చూసేది జానకమ్మ. అందుకే కొడుకు ఆయన పంచె పట్టుకు తిరుగుతున్నా పెద్దగా ఈర్ష్య పడేది కాదు. ఇక భర్తను తన మాటకారితనంతో మాటరానివాడిగా మార్చేసింది. ఇంతకూ ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే, ఆ ఇంట్లో జానకమ్మ మాటే శిలాశాసనం. ఇటు ఇంట్లోనే కాదు, అటు బంధువులలోను భానుమతి అంత పవర్ ఫుల్ పడతిగా ముద్ర వేసుకుంది జానకమ్మ. అటువంటి జానకమ్మ కొడుకు మంచి కాలేజిలో ఇంజనీరింగు సీటు సంపాదించుకుని, క్యాంపసు ఎంపికలో ఉద్యోగం కూడ తెచ్చేసుకున్నాడు. ఇక చెప్పాల్సిన పనేముంది మన జానకమ్మ విషయంలో. అవధులు లేని ఆనందం ఆమె సొంతమయింది. 'ఇప్పుడే వాడికి పెళ్ళేమిటే' అని జనార్ధనరావు మొత్తుకుంటున్నా వినకుండా సత్తిపండును మార్కెట్లో పెట్టేసింది. పెళ్ళిళ్ళ బ్రోకరు తెచ్చిన సంబంధాలలో, నచ్చిన పది సంబంధాలలోను జల్లెడ పట్టి రెండింటిని పెళ్ళి చూపులు కూడ చూసేసింది. కానీ అవేవీ ఆమెకు పెద్దగా నచ్చలేదు. మిగిలిన వాటిలో తనకు నచ్చిన మరొక సంబంధం పెళ్ళిచూపులకు వెళ్ళింది. అది అందరికీ నచ్చడంతో ముహూర్తాలు పెట్టుకుందామని అనుకున్నారు. పిల్ల బక్కపల్చగా ఉన్నా, ముఖం లేత తాటిముంజలా ఉండడంతో అంతా ఖుషీ అయిపోయి, తమ అంగీకారం తెలిపి వచ్చారు. ********* "హలో ఎవరూ" అంటూ వచ్చిన ఫోనును తీసి అడిగాడు జనార్ధనరావు. " బావగారు నేనండీ వందనరావును, పెళ్ళికూతురు తండ్రిని" " అరె మీరా. బాగున్నారా అండీ. ఎంతవరకు వచ్చాయి నిశ్చితార్థం పనులు. మే నెలలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా. కాస్త ఎ.సి లు గట్రా మంచిగా పనిచేసే ఫంక్షను హాలు తీసుకోండి. అవును అక్కడ కోవిడ్ ఎలా ఉంది?" " ఆ విషయం చెబుదామనే ఫోను చేశాను బావగారు. లాక్ డౌన్ పుణ్యమా అని ఎవరూ ఫంక్షను హాలు ఇవ్వటం లేదు. పైగా బస్సులు, రైళ్ళు కూడ ఆగిపోవడం, రాష్ట్రాల మధ్య కూడ రాకపోకలు ఆపివేస్తుండడంతో, అసలు నిశ్చితార్థం మే నెలలో చేయలేమేమో అని అనుమానంగా ఉంది. అందుకని బావగారు అసలు నిశ్చితార్థం లేకుండా నేరుగా పెళ్ళి ముహూర్తం కుదుర్చుకుంటే ఎలా ఉంటుంది. కాస్త ఈ కరోనా ఉదృతి తగ్గి, సాధారణ జీవనం మొదలయిన తరువాత వీలు చూసుకుని ముహూర్తం పెట్టుకుందాం. మీరేమంటారు?" వందనరావు మాటలకు సమాధానం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అయినా ఎప్పుడు మాత్రం స్వతంత్రంగా నిర్ణయం తీసుకోగలిగాడు కనుక. భార్య చెప్పినదానికి బూర ఊదడం, బుర్ర ఊపడం తప్ప. అందుకే మెల్లగా జానకమ్మ దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి చిన్నగా విషయం చెప్పాడు. ఈలోపుగా అవతల నుంచి ఆయన 'హలో..హలో' అని కొట్టుకుంటూనే ఉన్నాడు. భర్తను ఉరిమిచూస్తూ ఫోను లాక్కుని "ఆ..అన్నయ్య గారు. బాగున్నారా. ఏమిటో ఆయనకు చెప్పారట" అడిగింది జానకమ్మ. "అదేనమ్మా. కరోన వచ్చి దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది కదా. ఈ సమయంలో ప్రభుత్వాలు అన్ని రకాల కార్యక్రమాలపై షరతులు విధిస్తున్నారు. పైగా జూన్ నెల వరకు అంతా బందులేనని చెబుతున్నారు. ఈ సమయంలో మనం నిశ్చితార్థాన్ని జరుపుకోలేమేమో, అక్టోబరులో ఏకంగా పెళ్ళి చేద్దామని నా ఆలోచన. అదే విషయం బావగారికి చెప్పాను" " భలేవారే అన్నయ్యగారు. నిశ్చితార్థం లేకుండా పెళ్ళేమిటి. తాళిబొట్టు కట్టకుండా తలంబ్రాలు పోసినట్టు. మే కాకపోతే ఆగస్టులో పెట్టుకుందాం. మన చేతులలో పనే కదా. కాకుంటే పెళ్ళి ముహూర్తం దానికి కొంచెం దగ్గరలో పెట్టుకుందాం. అంతేగాని ఏదో చిన్నపురుగు కుడుతుందని ఇంత ముఖ్యమైన పనిని మానేస్తామా చెప్పండి" "అదికాదమ్మా నేను చెప్పేది" "మీరు ఎన్నైనా చెప్పండి అన్నయ్య గారు. మాకు నిశ్చితార్థం చాలా ముఖ్యం. అసలు మావాడికి అయిదు లక్షలు లాంఛనంగా ఇస్తామని మా ఇంటి చుట్టూ తిరిగిన వాళ్ళను కాదని మీరిచ్చే రెండు లక్షలకు ఎందుకు ఒప్పుకున్నాము. మీరు అన్నీ పద్ధతిగా, సంప్రదాయబద్ధంగా జరుపుతారనే కదా. మరి ఇప్పుడు మాట మారుస్తారేమిటి, రాజకీయ నాయకుడిలా" " అమ్మా ఇప్పుడు పరిస్థితులు బాగులేవు కదా అందుకని అడుగుతున్నాను. మరీ మీరు కాదు, కూడదు అంటే కొంచెం ఆలోచించి చెబుతాను" "మీరు ఏమైనా ఆలోచించుకోండి, నిశ్చితార్థం మాత్రం జరగాల్సిందే" అని ఠక్కుమని ఫోను పెట్టేసింది. భార్య నిక్కచ్చితనానికి ఆశ్చర్యమేసినా అలవాటు పడిన ప్రాణం గనుక సర్దుకున్నాడు జనార్ధనరావు. పాపం ఆయన ఆలోచనల్లా అటువైపు వందనరావు ఏ పరిస్థితిలో ఉన్నాడా అన్నదే.. ****** కరోనా ఉదృతి రోజు రోజుకు పెరగుతుండడంతో మే నెల వరకు పూర్తి లాక్ డౌన్ విధించడంతో సత్తిపండు నిశ్చితార్థం నిరవధికంగా వాయిదాపడింది. 'దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన' అన్నట్టు దుక్కలాగ ఉండే పానకాలరావు హఠాత్తుగా పైలోకానికి ప్రయాణం కట్టాడు. సత్తిపండు సంగతేమో గాని, జానకమ్మ మాత్రం హతాశురాలయి పోయింది. ఇంక సంవత్సరం వరకు శుభకార్యాలేవీ ఇంట్లో జరగకూడదు. అసలే కరోనతో అందతుకులుగా ఉన్న పెళ్ళి వ్యవహారం ఇప్పుడు ఏ వైపుకు తిరుగుతుందో అర్థంగాక తలపట్టుకు కూర్చుంది. ఇంతలో జనార్ధనరావు ఫోను మ్రోగింది. వందనరావు నుంచి వచ్చిందా ఫోను. తడిక రాయభారమెందుకని నేరుగా ఫోను భార్యకిచ్చాడు. " అన్నయ్యగారు. చెప్పండి" " అదేమిటమ్మా ఉక్కులా ఉండే మీ మామగారు కాలం చేశారట. కొంపదీసి కరోనా సోకిందా ఏమిటి?" " అబ్బే అదేమి లేదండీ. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిందండీ. అంబులెన్సు వచ్చి ఆసుపత్రికి తీసుకు వెళుతుంటే అంబులెన్సులోనే ప్రాణం పోయింది. అంతేగాని కరోన కాదు పాడుకాదు" "ఒకవేళ అయినా చెప్పకూడదులెండి. ఎందుకొచ్చిన గొడవ. అవునమ్మా ఇక సంవత్సరం పాటు పెళ్ళి చేయకూడదు కదా మీ అబ్బాయికి" " మేమే ఆ విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నాము అన్నయ్యగారు. ఇంతలోకి మీరే ఫోను చేశారు. వచ్చే సంవత్సరం జూన్ వరకు ఏ శుభకార్యమూ జరిపే వీలులేదు. అందుకని జూలైలో నిశ్చితార్థము, తరువాత పెళ్ళి జరిపిద్దాము" సర్దుబాటు చెప్పింది జానకమ్మ. "నిజమేనమ్మా. కానీ మా ఇంట్లో అంతదూరం ఆగడానికి ఒప్పుకోవడం లేదు. అదీగాక మీ మామగారు కరోనా సోకే పరమపదించారని, చుట్టుపక్కల అనుకుంటున్నారని, మీ ఊరిలో ఉండే మా పెదనాన్న కొడుకు చెప్పాడు. మీ అబ్బాయే ఆయనకు అన్నీ చేశాడట కదా. జాగర్తమ్మా ఆ కరోనా సోకితే మగవారిలో శుక్రకణాల సంఖ్య తగ్గుతుందట. మీ అబ్బాయిని జాగ్రత్తగా ఉండమనండి. ఇంతకూ నేను ఏమి చెప్పాలనుకుంటున్నానంటే..." కొద్దిసేపు మౌనం వహించాడు వందనరావు. ఆయన మాటలను, మౌనాన్ని భరించలేకపోయింది జానకమ్మ. ఇన్ని అభాండాలు వేస్తుంటే తట్టుకోలేకపోతున్నది. అసలే మామగారు చనిపోయిన టెన్షనులో వుంటే, ఈయన ఈ బాంబు పేల్చాడేమిటిరా భగవంతుడా అనుకుంటూ... " నాన్చకుండా చెప్పండి" విసురుగా అన్నది. " అదేనమ్మా.. పెళ్ళి అనుకోగానే మాయదారి కరోనా రావడం, అది సర్దుకునే లోపే మీ మామగారికి కరోన వచ్చి పోవడం, ఇదంతా అచ్చిరానట్టు అనిపించి, కలిసిరాని మీ సంబంధం వద్దనుకుంటున్నాము. ఏమీ అనుకోకండి" అని మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఫోను పెట్టేశాడు వందనరావు. వళ్ళుమండింది జానకమ్మకు. "ఎంత పొగరు వీళ్ళకు. ఆడపిల్ల తండ్రిని అనుకుంటున్నాడా, అమెరికా ప్రెసిడెంటు ననుకుంటున్నాడా. వీడు కాకపోతే వీడి తాతలాంటి సంబంధం రేపొద్దుటికల్లా తెస్తాను. వీడి నోటిలో మన్నుబడ మామయ్య కరోన సోకి చచ్చాడని, లేని పోని అబాంఢాలు వేస్తాడా మామీద" స్వగతం అనుకుంటూ పెద్దగానే అరిచింది. విషయం అర్ధమయింది జనార్ధనరావుకు. మనసులో నొచ్చుకున్నాడు. తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా, కల్లు తాగాడన్న సామెతలా, కరోనా వ్యాపిస్తున్న వేళ మామూలుగా పోయినా దాంతోనే పోయాడని అంటారు. అంతా మా తలరాత అని మౌనంగా ఉండిపోయాడు. ******** " అయినా ఇదేమిటండి ఆరునెలల నుంచి ఇదే మాట చెబుతున్నారు. ఒక్క సంబంధమూ దొరకలేదా ఇంకా" గిరీశం పంతులును నిలదీసింది జానకమ్మ. " అమ్మా నా ప్రయత్నం నేను చేస్తున్నా. కానీ ఏం చెయ్యను. ఎక్కడికి పోయినా ఒకటే అడుగుతున్నారు. 'కుదిరిన సంబంధం ఎందుకు చెడిపోయింది' అని. అప్పటీకీ ఉన్నమాటే చెప్పినా, ఎవరూ నమ్మటం లేదు. నేనేదో నా కమీషను కోసం కక్కుర్తిపడి మసిపూసి మారేడు కాయ చేస్తున్నానని దెప్పుతున్నారు. పీటల మీద పెళ్ళి ఆగిపోయిన ఆడపిల్లకయినా పెళ్ళిసంబంధాలు కుదర్చగలుగుతున్నాను గానీ, సంబంధాలు చెడిన మగపిల్లలకు మాత్రం ఆడపిల్లలను తేలేకపోతున్నాను. రోజులు మారిపోయాయి తల్లీ. ఆడపిల్లల సంఖ్య తగ్గి గిరాకీ బాగా పెరిగింది. దానికి తోడు కాణీ కట్నం ఇవ్వమంటున్నారు. పెళ్ళి ఖర్చులు కూడ మగపెళ్ళి వారే భరించాలట. అందుకు మీరు ఒప్పుకోరాయె" నిందను తప్పించుకోను తెలివిగా మాట్లాడాడు గిరీశం. " తెలివిమీరి పోతున్నారు పంతులు గారు జనం. ఇంకా బాగా వెతకండి. మా మామగారి ఏడూడి కావడం, వెంటనే మా వాడు పెళ్ళిపీటల మీదకు ఎక్కడం జరిగిపోవాలి" జానకమ్మ మాటలలో కసి. " మీరిలా శపథాలు చేస్తే పనులు కావమ్మా. కాస్తంత సర్దుకోవాలి. నా మాట విని ఆ కట్నాలు, నిశ్చితార్థాలు, పెళ్ళి ఆర్భాటాలు మానేస్తే ఎలాగోలా ఓ మంచి సంబంధం పట్టుకురాగలను" ఉన్న విషయం బయటపెట్టాడు గిరీశం. " అలా అయితే ఎక్కడో దారినపోయే శనే ఎందుకు. శుబ్బరంగా నా మేనకోడలే ఉందిగా. నా తమ్ముడి దగ్గర కాణీకి టికాణా లేదనేగా ఈ వెంపర్లాట" ఆవేశంలో నోరు జారింది జానకమ్మ. " చూడండి పంతులు గారు. మీకు చేతనవుతుందా కాదా చెప్పండి. చేతకాదన్నారంటే మా తంటాలేవో మేమే పడతాం" నోరు తెరిచాడు జనార్ధనరావు. " అయ్యా మీ మాట తోసివేయలేక పోతున్నాను. ఇంకొక్క నెల చూసి ఏ విషయమూ చెబుతాను" అంటూ ఎక్కడ జానకమ్మ రెచ్చిపోతుందోనని భయపడుతూ చల్లగా జారుకున్నాడు గిరీశం. ******* జరిగిపోయిన దాన్ని గూర్చి ఆలోచిస్తున్న జానకమ్మ తల పట్టుకుని కుర్చీలో వెనక్కు వాలింది. మరల సరికొత్త ఆలోచనలు ఆమెను కమ్ముకుంటున్నాయి. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు, మరల కరోనా సెకండ్ వేవ్ వచ్చి పడింది సరిగ్గా మరల మార్చి వచ్చేసరికి. అసలే అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితికి ఇది తోడవడంతో చేతులు ఎత్తేశాడు గిరీశం. లేత కొబ్బరి లాంటి పిల్ల కాకపోయినా, కనీసం ఆడపిల్లయితే చాలు అనే దశకు వచ్చింది జానకమ్మ. ఆవేశం చల్లారింది. భర్తను పిలిచి తన వేదనను వెళ్ళగక్కింది. 'పిల్లలను కనగలం గాని, వాళ్ళ జాతకాలను కనగలమా' అన్న వేదాంతానికి దిగజారి పోయారిద్దరూ. ఇదే అదనుగా చిక్కింది సత్యనారాయణకు. వాళ్ళ దగ్గరకు చేరాడు. " ఎందుకమ్మా అంత దిగులు పడతావు. అయినా నాకు వయసేమి మించిపోయిందని చెప్పు. చిన్నగా చూద్దాంలే" తల్లి పక్కన కూర్చుని ధైర్యం చెప్పాడు. " అదికాదురా శుభమా అని కుదుర్చుకున్న సంబంధం తప్పిపోయె. మీ తాతకు కరోనా సోకిందని విషప్రచారం కూడ జరిగిపోయె. తాతయ్య సంవత్సరీకాలు అయిపోగానే నీ పెళ్ళి చేయాలనే ఆశ, ఆశగానే మిగిలిపోయేలాగుంది" కళ్ళు వత్తుకుంది జానకమ్మ. " ఛ...ఛ... ఏడవకమ్మా. నలుగురిని ఏడిపించే నువ్వు ఏడవడమేమిటి. బాగలేదు. అమ్మా నేను ఒక్క మాట చెబుతాను. కోప్పడవుగా" తల్లి కళ్ళు తుడుస్తూ అడిగాడు సత్తిపండు. కొడుకు ప్రేమకు కరిగిపోయింది జానకమ్మ. " చెప్పు నాన్నా" " అమ్మా మనకు బోలెడంత ఆస్తి ఉంది కదా. మరల మనకు కట్నాలు, లాంఛనాలు, ఆర్బాటాలు ఎందుకు. వాటికోసం ఎవరినో అడుక్కోవడమెందుకు. పిల్ల ఎలా వున్నా సర్దుకోవడమెందుకు చెప్పు. అందుకని..." నాన్చుతున్నాడు సత్తిపండు. " అందుకని.. ఆగిపోయావేం చెప్పు" " సీతయ్య మామయ్య కూతురు రమను చేసుకుంటానే" అదిరిపడింది జానకమ్మ. ఎవరిని టికాణా లేని వాడని పక్కన పెట్టిందో, వాడి కూతురినే వీడు చేసుకుంటానంటున్నాడు. ఇప్పుడేం చెయ్యాలి? "అవునే జానూ. నాకూ అదే మంచిదనిపిస్తున్నది. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ వెంట తిరిగి, వాళ్ళు అనే అడ్డమైన మాటలు పడే బదులు, ఇంట్లో పిల్ల, పైగా నీ తమ్ముడి కూతురు, చిన్నతనం నుంచి మనమెరిగిన అమ్మాయి, ఇంచుమించు నీ అంత అందంగా ఉంటుంది కదా, ఏమంటావ్. వెధవ డబ్బుదేముందే, ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. కాస్త ఆలోచించవే" దొరికిన అవకాశాన్ని వదులుకోలేక, సహజంగా ఆడవారికుండే బలహీనత మీద దెబ్బకొట్టాడు జనార్ధనరావు. " నాన్న చెప్పింది నిజమమ్మా. ఎవరో 'కోకోగోగో' గాడు తాతయ్యను పట్టుకుని కరోనాతో పోయాడంటాడా. ఎంత ధైర్యం అతనికి. మామయ్య చూడు, తాతయ్య పోయాడనగానే వచ్చి, అన్నీ నెత్తిన వేసుకుని కార్యం వెళ్ళబుచ్చాడా? లేదా? అదేనమ్మా మనింటికి, పక్కింటికీ తేడా. ఏమో నా మనసులో మాట చెప్పాను. ఆపైన నీ ఇష్టం" బంతి ఆమె ఒడిలో వేసి చల్లగా జారుకున్నారు తండ్రీకొడుకులు. దీర్ఘాలోచనలో పడింది జానకమ్మ. ******* " పంతులు గారు, మీ మేలు ఈ జన్మలో మరిచిపోలేము. మీ సంభావనకు అదనంగా ఇదుగోండి అయిదువేలు" అంటూ గిరీశం చేతిలో డబ్బుల కట్ట పెట్టాడు సత్తిపండు, తల్లి చూడకుండా. " ఎంత మాట సత్యం బాబు. మీరు మనసుపడ్డ మరదలి కోసం అమ్మకే మస్కా కొట్టారు. అటు మీ తండ్రిగారి సహకారం, మీ ప్రేమను అర్థం చేసుకుని తనకు తానే మీ సంబంధాన్ని వదులుకున్న ఆ అమ్మాయి మరోవైపు, కష్టాన్ని అతి సులువుగా గట్టెక్కించడానికి కారకంగా పనిచేసిన కరోనా ఇంకోవైపు, ఇన్ని అనుకూలనాలు ఉండబట్టి నావంతు నేను ఓ చెయ్యివేసి మమ అనిపించాను. అంతే" డబ్బులు పుచ్చుకుంటూ అన్నాడు గిరీశం. " ఏదయితేనేం నన్ను భ్రమలో పడేసి మీరేదో సాధించారనుకుంటున్నారు. నాకంతా తెలిసే నా కోడలిని నా ఇంటికి తెచ్చుకున్నాను. మర్యాదగా ఆ అయిదు వేలు వెనక్కు ఇచ్చెయ్" అంటూ ఎక్కడినుంచి వచ్చిందో వచ్చింది జానకమ్మ. నిశ్చేష్టలయ్యారు అందరూ. " అమ్మా. ఒకరికి ఇద్దరు ఆడపిల్లలు కలవాడిని. ఇచ్చిన కాసును తిరిగి తీసుకోకండమ్మా" బిక్క చచ్చిపోయి బ్రతిమలాడాడు గిరీశం. " అమ్మా...అది..." నీళ్ళు నమిలాడు సత్తిపండు. ముఖాన నెత్తురుచుక్క లేదతనికి. " ఒరేయ్. నువ్వు, మీ నాన్న, మీ మామ చేరి గుసగుసలాడటం నేను విన్నాను. మీ అందరికీ ఇష్టమైతే నాకేమిటి అనిపించి, నేను కూడా ఎరగరం బొరగం అన్నట్టుగా ఉన్నాను. నాకు తెలియకుండా ఈ ఇంట్లో ఏమీ జరుగదు. జానకమ్మతో జర భద్రం. గూగుల్ తెరవకుండానే గుట్టుపట్టేస్తా....జాగ్రత్త. ఏడవకండి పంతులు గారు, ఆ డబ్బును అలాగే పట్టుకెళ్ళండి. మీ ఉసురు నాకెందుకు" అన్న జానకమ్మ మాటలకు అందరూ ఊపిరి పీల్చుకుని, హాయిగా నవ్వుకున్నారు. ******* అయిపోయింది ********

మరిన్ని కథలు

Markatapuram-Story picture
మర్కటపురం
- యు.విజయశేఖర రెడ్డి
Daridrudu
దరిద్రుడు
- mahesh amaraneni
Giligadi vachche puligadu chachche
గిలిగాడు వచ్చె-పులిగాడు చచ్చె.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Kotta jeevitam
కొత్త జీవితం
- చచెన్నూరి సుదర్శన్
Yachakulu kaanidi evaru
యాచకులు కానిది ఎవరు?
- యాచకులు కానిది ఎవరు?.
Vimukti eppudo
విముక్తి ఎప్పుడో!
- రాము కోలా.దెందుకూరు.
Manninchumaa
మన్నించుమా!
- రాము కోలా.దెందుకూరు.