Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
annamayya pada seva

ఈ సంచికలో >> శీర్షికలు >>

భగవాన్ శ్రీ రమణ మహర్షి (పన్నెండవ భాగం) - సుధారాణి మన్నె

bhagavaan shree ramana maharshi biography
భగవాన్ తల్లి అళగమ్మ గారికి ముక్తి నొసగుట
 

శ్రీ భగవాన్ తల్లిగారు పరమ శ్రోత్రియురాలు. కుల సంబంధమైన పట్టింపులూ, నమ్మకాలు చాలా ఉండేవి ఆమెకి. ఆమె భావాలని శ్రీ భగవాన్ సహించేవారుకాదు. ఆమెలో ఆ అజ్ఞానాన్ని పోగొట్టటానికి ఒక్కోసారి నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించేవారు. బ్రాహ్మణ వితంతువులకు నిషిద్ధమైన ఉల్లిపాయలు వండటానికి ఆమె అభ్యంతరం చెప్పినప్పుడు శ్రీ భగవాన్ ఒక ఉల్లిపాయను చూపుతూ 'మా అమ్మ స్వర్గానికి వెళ్ళనీయకుండా చేసే శక్తి ఈ ఉల్లిపాయకుంది" అని చెప్పి నవ్వేవారు.

ఒకసారి భగవాన్ తల్లి అళగమ్మ గారు, తీర్థయాత్రలకని బయలుదేరి తిరుపతి మొదలైన పుణ్యక్షేత్రాలు తిరిగి, చివరగా అరుణాచలం భగవాన్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఎంతోమంది సాధువులు, ముముక్షువులు అన్నిటినీ వదులుకుని తమకు పరమగతిగ భగవాన్ ని ఆశ్రయించారు. అటువంటిది అళగమ్మ గారు ఆయనను విడిచి తీర్థయాత్రలకు వెళ్లారు. తిరిగి రాగానే ఆవిడకు విషజ్వరం వచ్చింది. ప్రాణాలు పోయే స్థితికి వచ్చింది. ఆవిడ తన భారాన్ని భగవాన్ మీదవేసి, "నాయనా! నా ప్రాణాలు నీచేతిలోనే పోవాలి. వాటిమీద నాకు ఆశలేదు. ఆ తరువాత నా శరీరాన్ని ముళ్ళ తుప్పల్లో పడవేసినా ఫరవాలేదు" అని భగవాన్ దగ్గర మాట తీసుకున్నారు. భగవాన్ మనస్సు చలించి, ఒకే ఒక్కసారి అరుణాచలేశ్వరుని, తన తల్లి గారి ఆరోగ్యం గురించి ప్రార్ధన చేసారు. ఇది 1914 సంవత్సరంలో జరిగింది.

భగవాన్ అరుణాచలేశ్వరుని ఈవిధంగా ప్రార్ధించారు. "అరుణాచలం! నీవే మృత్యువు అందుచేతనే నిన్ను ప్రార్ధించేది. నిన్ను శరణు జొచ్చినవారు మృత్యుంజయులవుతారు. నీ చితాగ్నిలో ఆవిడను లీనం చెయ్యి. ఆపై చితాగ్నితో పని వుండదు. వారి ప్రార్ధన ఫలించింది. ఎప్పుడూ, దేనికీ, ప్రార్ధించని భగవాన్ ప్రార్ధిస్తే ఈశ్వరుడు ఆప్రార్ధనను ఫలింప చేసాడు. ఆవిడకు విషజ్వరం తగ్గడమే కాక ఆరోగ్యం కూడా చక్కబడింది. ఆపై అళగమ్మ గారు 8 సంవత్సరాలు జీవించారు. చితాగ్నితో పనిపెట్టవద్దు అని కూడా భగవాన్ ఆప్రార్దనలోనే చెప్పారు. ఈశ్వరుడు దానిని కూడా నెరవేర్చారు. 1929 సంవత్సరంలో స్కందాశ్రమ నివాసకాలంలో, తల్లిగారైన అళగమ్మగారి అంత్యకాలంలో భగవాన్ అనుగ్రహ స్పర్శచేత ఎన్నో అడ్డంకులను దాటిపోయినిర్వాన స్థితిని పొందారు. ఆవిడ ప్రాణాలు బహిర్గతం కాక ఆత్మయందు విలీనమైనాయి. ప్రాణాలు బహిర్గతమవడమంటే, దేహాంతములో, హృదయంలో అణగక, వాసనా బలముచేత మరో ఉపాధిని పొందేవరకూ వేచి ఉండటము. ఇవి ప్రాణాలని పిలువబడినా ప్రాణం, మనసు, అహంకారం - వీటితో కూడిన లింగ శరీరం, జీవుడు అని గ్రహించాలి. దీనియందే, దాచబడిన కర్మఫలానికి తగినట్లుగా ఈ లింగశరీరానికి మరల, మరల, ఉపాధులు లభిస్తూ ఉంటాయి. ప్రాణోత్క్రమణ సమయంలో ఈ ప్రాణాలు శరీరం నుండి జీవుని నిష్క్రమణ నవద్వారం (9దారుల ఊరు)గా వర్ణింపబడే శరీరం యొక్క ఏ ద్వారం నుంచైనా బహిర్గతం కావచ్చును. శిరస్సులోని బ్రహ్మరంధ్రంలో నుంచి బ్రహ్మలోక ప్రాప్తి అనీ, కనులద్వారా ఉత్తమలోకాల ప్రాప్తిఅనీ, అంతకంటే క్రింది ద్వారాల నుంచి నీచజన్మలని పెద్దలు చెప్తారు. అలా మరణకాలంలో ఒక మహత్తర సంభవంచేత ప్రాణాలు ఆత్మలోలీనమైన వ్యక్తి స్థితిపైన చెప్పుకున్న జీవన్ముక్తుని, మరియు బ్రహ్మలోక నివాసుల శుభసంస్థితి వలె ముక్తిరూపమై విలసిల్లుతుంది.

రమణులు, తల్లిగారికి హస్తదీక్ష నిచ్చి, శక్తిపాత మొనర్చి, ముక్తిని ప్రసాదించిన విషయం ప్రకటించారు కూడా. అయితే అప్పుడొక చర్చ జరిగింది. ఆవిడ శరీరాన్ని, పూడ్చిపెట్టి సమాధి చెయ్యాలా? దహనం చెయ్యాలా అని.

అధికజనం భగవాన్ తమ్ములైన నిరంజనానందస్వామి పక్షం వహించి, ఆవిడ గృహిణి కాబట్టి దహనం చెయ్యాలన్నారు. భగవాన్ మౌనంగా, ఈశ్వరుని నిర్ణయమే నెరవేరుతుందని ధృడంగా వున్నారు. అక్కడ వున్నవారు గణపతియుని గారి సలహా అడిగారు.

ఆయన "తీర్మానం ఎప్పుడోజరిగిపోయింది. రమణ గీతాసమయంలోనే భగవాన్ పరిష్కరించారు, అని చెప్పి అందులోని శ్లోకాలను, భగవద్ వాణిని అప్పటికప్పుడు వివరించి చెప్పారు. అధికారము ఉట్టిపడే వారి గంభీర వాక్కులకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. సమాధికి "మాతృభూతేశ్వర మహాసన్నిధానము" అనే పేరును గణపతులే పెట్టారు. ఈ సమాధిపై అత్యంత విశేషంగా కాశి నుంచి తెచ్చిన శివలింగమే కాకుండా భూప్రస్థార, మేరు ప్రస్థార, శ్రీ చక్రయంత్ర రాజములను రెండింటినీ ప్రతిష్టించారు. 

శ్రీ రమణార్పణ మస్తు

మరిన్ని శీర్షికలు
gummadi venkateshwara rao